28, జూన్ 2022, మంగళవారం

పావననామ హరే పట్టాభిరామ హరే

పావననామ హరే పట్టాభిరామ హరే
ధీవర రామ హరే గోవిందరామ హరే

పరమానంద ముకుంద సనాతన పట్టాభిరామ హరే
పరమేశ్వర జగదీశ్వర శాశ్వత పట్టాభిరామ హరే
పరంతపా దితికులాంతకా జయ పట్టాభిరామ హరే
పరమమంగళ పురాణపూరుష పట్టాభిరామ హరే

వరశుభదాయక భక్తజనావన పట్టాభిరామ హరే
పరమపురుష రవిచంద్రవిలోచన పట్టాభిరామ హరే
పరమదయాళో పన్నగశయనా పట్టాభిరామ హరే
పరాత్పరా హరవిరించి సన్నుత పట్టాభిరామ హరే

పరమపావనా సాకేతాధిప పట్టాభిరామ హరే
పరమపరాక్రమ నిర్జితరావణ పట్టాభిరామ హరే
పరమైశ్వర్యప్రదాయక వరదా పట్టాభిరామ హరే
పరమయోగిగణవందితచరణా పట్టాభిరామ హరేరారా శ్రీరామచంద్ర

రారా శ్రీరామచంద్ర రఘువంశాబుధిచంద్ర
మారజనక సుగుణసాంద్ర రారా నన్నేలరా

ఘనశేషపర్యంకమున నుండెడు వాడ రార
వనజాసనుడు నింద్రుడును పొగడెడు వాడ రార
ఇనవంశమునవేడ్క జనియించిన వాడ రార
ననుబ్రోవ సమయమిది నాతండ్రి రార

ముని కౌశికుని యాగమును కాచిన వాడ రార
ఘనమైన హరచాపమును విరచిన వాడ రార
జనకాత్మజ కరగ్రహణమును చేసిన వాడ రార
వనజాక్ష ననుబ్రోవ వలయునురా రార

ఘనయుధ్ధమున పౌలస్త్యుని జంపిన వాడ రార
అనిమిషులు హరివనుచు వినుతించిన వాడ రార
మనసారళశరణంబన మన్నించెడి వాడ రార
జననాథ ననుబ్రోవ సమయమిదే రార
 

26, జూన్ 2022, ఆదివారం

సతతము శ్రీహరి స్మరణము చేయుము

సతతము శ్రీహరి స్మరణము చేయుము
మతిమంతుడవై మహి నిలచి

కారణకారణు కమలదళాక్షణు
కూరిమి మీఱగ కొలుచుచును
శ్రీరామా యని శ్రీకృష్ణా యని
నారసింహ యని నాతండ్రీ యని

అండపిండబ్రహ్మాండంబులో
నిండియుండెరా నీతేజమని
నిండుమనసుతో నిశ్చయబుధ్ధిని
దండిగ చాటుచు తరచుగ నీవు

హరిభక్తులతో నన్నివేళలను
మరువక శ్రీహరి మహిమలనే
మరిమరి పలుకుచు మురియుచు వినుచును
పరమానందపరవశు డగుచును

25, జూన్ 2022, శనివారం

రామచిలుకల వోలె రామరామ యని

 రామచిలుకల వోలె రామరామ యని రామనామము పలుకు డెల్లప్పుడు
రామరామ యని రామనామము పలికి రామునిదయ పొందు డెల్లప్పుడు

రామరామ యను రామభక్తుల కెపుడు రాముడిచ్చును సర్వసంపదలు
రామరామ యను రామభక్తుడు తలచు రామునిదయ గొప్పసంపదగ
రామరామ యనుటె రామునిదయ యని రామభక్తుడు తలచు నెల్లప్పుడు
రామునిదయ కన్న గొప్పసంపద లేదు బ్రహ్మాండభాండంబు లందెందున

రామునిదయ చేత సుగ్రీవునకు కలిగె రాజ్యసంఫద మున్ను శీఘ్రంబుగ
రామునిదయచేత భక్తవిభీషణు రాజ్యంబు వరియించె శీఘ్రంబుగ
రామునిదయ చేత పావని కబ్బెను బ్రహ్మపదము లోకవిదితంబుగ
రామునిదయ చేత సాకేతజనులెల్ల ప్రత్యేకలోకమ్మునే పొందిరి

రామునిదయ తక్క భవరోగమడగించు రంజైన మందొక్క టెందున్నది
రామునిదయ తక్క అపవర్గమందించు ప్రత్యేకసాధన మెందున్నది
రాముని దయయే బ్రహ్మాండములనెల్ల రక్షించుచున్నది జనులారా
రామునిదయ చాలు రామునిదయ చాలు రామునిదయ చాలు మనకెప్పుడు

నరు లందరి కెఱుకగునా నారాయణ తత్త్వము

నరు లందరి కెఱుకగునా నారాయణ తత్త్వము
పరమయోగివరుల కెఱుక పడుచుండెడి తత్త్వము

సురలకే బోధపడని సూక్ష్మమైన తత్త్వము
ధరపైన రామాకృతి దాల్చిన హరితత్త్వము
పరమశుభదమగు సర్వవంద్యదివ్యతత్త్వము
నిరుపమాన తత్త్వము నిర్మలమగు తత్త్వము

ముక్కోటిదేవతలకు మూలమైనతత్త్వము
చక్కగ బ్రహ్మాండలీల జరుపుచుండు తత్త్వము
అక్కడి కిక్కడికి మంచి లంకెయైన తత్త్వము
దిక్కులన్నిటను నిండి తేజరిల్లు తత్త్వము

తారకమంత్రాకృతిని దాల్చినట్టి తత్త్వము
కోరి కొలచువారికి కొంగుబంగరు తత్త్వము
దారుణభవజలధిని దాటించెడి తత్త్వము
నారాముని తత్త్వము నారాయణ తత్త్వము

24, జూన్ 2022, శుక్రవారం

నాటకమే హరి నాటకమే

నాటకమే హరి నాటకమే అది నాటకమే జగన్నాటకమే
 
మునుకొని హరిభటు లగు జయవిజయులు మునుల నడ్డుటొక నాటకమే
సనకసనందులు కినిసి వారలను శపియించుటయును నాటకమే

ఏడుజన్మములు మిత్రులుగా నిల నెసగుడనుట హరి నాటకమే
మూడుజన్మముల వైరము వారు వేడుటయును హరి నాటకమే
 
అంతట వారును హేమకశిపహేమాక్షులగుట హరి నాటకమే
చింతలపాలే యింద్రాదులు ద్యుతిచెడియుండుట హరి నాటకమే
 
వరాహనరసింహాకృతులను హరి వారిని జంపుట నాటకమే
ధరపై రావణఘటకర్ణులుగా మరల వారగుట నాటకమే
 
భూమిని తాను రామచంద్రుడై పొడముట శ్రీహరి నాటకమే
భూమిజ రావణవంచిత యగుటయు పురుషోత్తముని నాటకమే

రావణాదులను నిర్మూలించుట రమ్యమైన హరి నాటకమే
పావనతారకనామము ధరపై ప్రభవించుట హరి నాటకమే

జయవిజయులు హరి బంధువులనగా జనియించుట హరి నాటకమే
జయశీలుడు కృష్ణునిగా వారిని జంపుటయును హరి నాటకమే

హరి భూభారము తగ్గించుటకై యాడిన చక్కని నాటకమే
మరల మరల స్మరియింప దగినదై మహిమాన్వితమగు నాటకమే

ఎంత చిత్రమైన జీవు లీమానవులు

ఎంత చిత్రమైన జీవు లీమానవులు తా
మెంత భ్రాంతిలోన బ్రతుకు లీడ్చుచుందురు

ధర్మ మనుష్ఠేయమని తామెఱుగుదురు కాని
ధర్మపరులైనవారు ధర నెందరు

ధనము వెంటరాదని తామెఱుగుదురు కాని
ధనపిశాచములవోలె తాముందురు

తనువు లివి బుడగలని తామెఱుగుదురు కాని
తనువులపై మోహమును తాము వీడరు

కామాదులు శత్రువులని తామెఱుగుదురు కాని
కామక్రోధముల విడువగా నేరరు
 
దారాదులు బంధములని తామెఱుగుదురు కాని
వారే సర్వస్వమనుచు పలుకుచుందురు

రాముడే దేవుడనుచు తామెఱుగుదురు కాని
రామనామ మెందరికి రసన నుండును

తారక మానామమని తామెఱుగుదురు కాని
శ్రీరామా యన నెంతో‌ సిగ్గుపడుదురు

23, జూన్ 2022, గురువారం

రామనామము పలుకవేరా రామనామము పలుకరా

రామనామము పలుకవేరా రామనామము పలుకరా 
రామనామము పలుకు రసనయె రసన యన్నది తెలియరా 
 
రామనామము పలికితే శ్రమలు తొలగి పోవును  
రామనామము పలికితే భ్రమలు తొలగి పోవును
రామనామము పలికితే కామితార్ధము లమరును
రామనామము పలికితే బ్రతుకు పండి తీరును
 
రామనామము పలికితే కామవాసన లణగును
రామనామము పలికితే రాగద్వేషము లణగును
రామనామము పలికితే తామసత్వము తొలగును
రామనామము పలికితే రాడు కలి నీ చెంతకు
 
రామనామము పలికితే ప్రాణభయము తీరును
రామనామము పలికితే స్వామి దయయు కలుగును
రామనామము పలికితే రక్తిముక్తిలు కలుగును
రామనామము పలికితే బ్రహ్మపదము కలుగును
 

హారతులీరే..

హారతులీరే అంగనలారా హారతులీరే రామునకు
హారతులీరే అంగనలారా హారతులీరే భూసుతకు
 
రమణీయునకు గుణధామునకు రఘురామునకు ఘనశ్యామునకు
రమణీమణికి కమలాననకు సుమకోమలికి విమలచరితకు
 
మనుజేశునకు మహిజాపతికి మహనీయునకు మన రామునకు
వనితామణికి గుణభూషణకు వనజేక్షణకు మన భూసుతకు
 
సురవినుతునకు మునివినుతునకు జనవినుతునకు మన రామునకు
సురసన్నుతకు మునిసన్నుతకు జనసన్నుతకు మన భూసుతకు
 
పరమాత్మునకు మన రామునకు సురవైరికులవిధ్వంసునకు
పరమాత్మికకు మన భూసుతకు సురవైరికులవిధ్వంసినికి
 
కరుణాత్మునకు నిరమిత్రునకు సురసేవ్యునకు మనరామునకు
కరుణాలయకు నిరుపాధికకు సురసేవితకు మన భూసుతకు

22, జూన్ 2022, బుధవారం

మరి మన వెంకయ్యనాయుడు గారి సంగతేమిటీ?


ఊరికే అన్నాను లెండి.

లేకపోతే మన వెంకయ్య నాయుడు గారేమిటీ, మతి లేని మాట కాకపోతే!

అర్థరాత్రి అడ్డగోలు విభజన సందర్బంలో ఆయన గారు ఆంధ్రప్రాంత ప్రజలందరి తరపునా వకాల్తా పుచ్చుకొని ఎంతో దీనంగా వినమ్రంగా మరియు ఎంతో కచ్చితంగా ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి సాధించినట్టి ఆంధ్రప్రదేశానికి ప్రత్యేకహోదా అనే‌ తాయిలం తాలూకు అతీగతీ ఏమన్నా అయన మళ్ళా పట్టించుకున్న దాఖలా ఐతే ఏమన్నా ఉందా? 

తన పార్టీ పట్ల వినయవిధేయతలు అంటే అలా ఉండాలీ అని అందరూ శబాసో శబాసు అనే విధంగా ఆవిషయంలో ఎంతో చక్కగా మౌనం దాల్చారు కదా వెంకయ్య గారు?

అన్నట్లు ఆయన్ను మనం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని కదా అనాలి మర్చిపోయాను. అసలు ఆ విషయం గురించే కదా ఈవ్యాసంలో చెప్పదలచుకున్నది. ఐనా మర్చిపోయాను.

అదే లెండి, వెంకయ్య నాయుడు గారు... తప్పు తప్పు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశానికి తమ పార్టీ వారు ఒక ఊరడింపుగా సాధించి పెట్టిన ప్రత్యేకహోదా అన్నదాని విషయం ఎంత గమ్మున మర్చిపోయారో అలాగే నేనూ మర్చిపోయానన్నమాట.

అయనకు అసలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని అనిపించుకోవటం సుతరామూ ఇష్టం‌ లేదట. నిన్నమొన్ననే ఆవిషయం ఒక పత్రికలోని ఒక వ్యాసరాజంలో చదివి తెలుసుకున్నాను.

అయ్యా వెంకయ్య నాయుడు గారూ, ఎందరో ఉపరాష్ట్రపతులు దరిమిలా రాష్ట్రపతులుగా పదోన్నతిని పొందినట్లు మన ఘనమైన చరిత్ర చెబుతున్నది కదా. ఆవిషయం దృష్టిలో పెట్టుకోండి. అసలు ఆఉద్దేశంతోనే మీకు ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వజూపుతున్నది మన పార్టీ అని ఆయనకు అప్పట్లో చక్కగా నచ్చజెప్పిన పిదపనే ఆయన మెత్తబడి, అలాగా ఐతే ఓకే అనేసారట.

మరిప్పుడు అదేమిటీ ఆ పార్టీ కాస్తా ఒక ద్రౌపదినో దమయంతినో తెచ్చి ఆవిడ గారు కాబోయే రాష్ట్రపతి గారు అని ప్రకటించేసిందీ?

అంటే ఆ పార్టీ వారు వెంకయ్య నాయుడు గారిని అవసరానికి వాడుకొని వదిలేసారా అని మనకు అనుమానం రావచ్చును కదా?

అదేమిటండీ, వారికేం అవసరం అని మీరు అడుగుతారు కదా. నేనూ చెప్పాలి కదా? మీకు మాత్రం తెలియదా? ఆమాత్రం తట్టదా యేమి కాని, కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన ఆపార్టీ వారికి ఆంధ్రావారికి ప్రత్యేకహోదా ఇచ్చి తమ మాట నిలబెట్టుకొనే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. మరి ఆ ప్రత్యేకహోదాకోసం పట్టుబట్టి మరీ సాధించుకొని వచ్చిన వెంకయ్య నాయుడు గారు గోలచేయరా? నా మాట పోతే ఎలా? మన పార్టీ మాట తప్పితే ఎలా? అంధ్రాకు హోదాకు ఇవ్వకపోతే ఎలా అని? మరేమో తమకు అలాంటి ఉద్దేశం ఏకోశానా లేదు. మళ్ళా వెంకయ్యగారు ఏతలనొప్పినీ తేకుండా చూడటమూ ముఖ్యమే. అందుచేత అయన్ను ములగచెట్టు ఎక్కించి ఉపరాష్ట్రపతి పదవిని కట్ట బెట్టారు. ఆయన ఇంక రాజకీయాలకు దూరం కాక తప్పదు కదా. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వంటి చిన్నాచితకా విషయాలను అస్సలు పట్టించుకోకూడదు కదా. అందుకని వారా పాచిక విసిరారు. అది కాస్తా చక్కగా పారింది.

ప్రత్యేకహోదా అనే‌ పాచికతో ఆంధ్రావారిని బుజ్జగించి దిగ్విజయంగా తెలుగుగడ్డను నిస్సిగ్గుగా చీకటికొట్లో చిదిమేసారు. ఉపరాష్ట్రపతి పదవి అనే పాచికతో వెంకయ్య నాయుడు గారి నోరు మూయించారు. అలా అంటే బాగుండదేమో లెండి. వారిని నోరెత్తకుండా చేసారు. ఇలాకూడా బాగుందదేమో. వెంకయ్య గారు మౌనం వహించేలా చేసారు. ఇలా బాగున్నట్లుంది కదా!

ఇప్పుడు రాష్ట్రపతి పదవికి వెంకయ్య గారి పేరును కూడా పరిశీలించినట్లు తోచదు.

ఇంకా ఉపరాష్ట్రపతిగానే ఉన్నారు కదా వెంకయ్య గారు, ఏమీ ఈవిషయంలో బహిరంగంగా మాట్లాడకూడదేమో‌ కదా !

ఇంక వారు తమ శేషజీవితాన్ని కూడా ఇంతే  హుందాగా అంటే మౌనంగా గడిపివేయాలేమో. మళ్ళా రాజకీయాల్లోనికి వస్తున్నా అంటే ఛండాలంగా ఉంటుంది కదా! బాగోదు మరి.

తన స్వంత పార్టీ తనను వాడుకొని వదిలేసిందని ఆయన మనస్సులో ఎంత గుడుసుళ్ళు పడినా ఏమీ లాభం లేదు.

ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక బ్రహ్మాండమైన అవకాశం లభించింది. కాని వాళ్ళంతా దద్దమ్మల్లా ఆలోచించి ఎవరో‌ సిన్హా గారిని కాబోలు పోటిలోనికి దించారు. దించారు అనటం ఎందుకంటే‌ ప్రతిపక్షాల అభ్యర్ధికి గెలిచే అవకాశం లేదు కాబట్టి.

ఒకరకంగా గెలిచే అవకాశం లభించింది. వాళ్ళు గమనించుకోలేదు. అందుకే దద్దమ్మల్లా అలోచించారు అనటం.

ప్రతిపక్షాలన్నీ కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారినే తమ ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీలోనికి దించవలసింది. 

అప్పుడు అధికారపార్టీ ఇరుకున పడేది. అధికారపార్టీ ఓట్లు చీలిపోయే పరిస్థితి వచ్చేది. వెంకయ్య  గారిని ప్రతిపక్షాలు అన్నీ‌ కలిసి అధికారపార్టీనుండి చీలివచ్చిన ఓట్ల సహాయంతో సులభంగా గెలిపించగలిగేవి.

బంగారం లాంటి అవకాశం.

పోటీలోనికి దిగటానికి వెంకయ్య గారు ఒప్పుకొనే వారా అని మీరు అడగవచ్చును. గెలిచే అవకాశం ముంగిట్లోనికి వచ్చినప్పుడు, స్వంతపార్టీ చేతుల్లో భంగపడ్డ నాయుడు గారు, ఒప్పుకొనే వారే అని నమ్మవచ్చును.

తన ప్రస్థానంలో చివరి మజిలీలో ఉన్న వెంకయ్య గారు ఈఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకొనే వారూ? ఇంత మోసం చేసిన పార్టీ ఇంకా ఏదో తవ్వి తన తలకెత్తుతుందన్న ఆశ యేమన్నా అయనలో ఉంటుందా ఏమన్నానా?

నిజంగా వెంకయ్య నాయుడు గారు చిత్తశుధ్ధితోనే ఆంధ్రాకోసం ప్రత్యేకహోదా అని ఆనాడు అడిగి ఉన్న పక్షంలో ఆవిషయంలో‌ ఇప్పుడు ఆయన ప్రతిపక్షాల వద్ద హామీ అడిగి మరీ పోటీకి దిగే అవకాశం కూడా అయనకు లభించి ఉండేది.

ఇంత ఉభయతారకమైన అవకాశాన్ని ఆయన జారవిడుకోవటానికి చిన్న పిల్లవాడు కాదు కదా!

ఒకవేళ వెంకయ్య గారు రాష్ట్రపతి పదవికి అభ్యర్ది ఐన పక్షంలో ఆంధ్రాకు ప్రత్యేకహోదా అంశంలో ఆయన పట్టుపట్టే అవకాశం‌ ఉంది కాబట్టి, మహా ఐతే, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు చచ్చినా వెంకయ్య గారి అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోను అనవచ్చును.  కాని అయనకు ఉన్న ఓట్లు బహుపరిమితం కాబట్టి అదేమంత ప్రతిబంధకం కానే కాదు. ఆసంగతి ఆయనకూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. అదీ కాక, ప్రత్యేకహోదా సంగతి తరువాత ఆలోచించవచ్చును, ముందు అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించేద్దాం అని చెప్పి అయనా ఒప్పుకోవచ్చును కూడా. ఆలోచించండి.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. 

ప్రతిపక్షాలు అన్నీ కలిసి వెంకయ్య గారిని నిలబెట్టినా -- లేక -- అయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటిలోనికి దిగేలా ప్రోత్సహించి మద్దతు ఇచ్చినా సరిపోతుంది.

అంతరాత్మ సాక్షిగా ఓటు వెయ్యండి అని పిలుపునిస్తే చాలు కదా!

ఈ మాట - అదే అంతరాత్మ సాక్షి - అన్నది ఇలాంటి సందర్భంలోనే‌ పూర్వం నిన్నట్లు మీకు గుర్తుకు వస్తోందా? 

చాలా సంతోషం.

కరిరాజవరదుడు కమలానాథుడు

కరిరాజవరదుడు కమలానాథుడు
మరిమరి మన్నించి మమ్మేలగా
 
కురియవె వరములు విరియవె శుభములు
మరిమరి కావే మంగళవార్తలు
సరిసాటిలేని సుఖసంపద లమరవె
హరికరుణామహిమాతిశయము వలన 

ఇటనుంచి యొకపరి అటనుంచి యొకపరి
ఎటనుంచినను కృప దిటవుగ నించి
నటనంబు లాడించి నవ్వుచు తిలకించు
వటపత్రశాయినే భావింతు మెపుడు
 
మొనగాడు రాముడై భువినవతరించి ధర్మ
మును మాకు బోధించి మురిపించగా
తన దివ్యనామమే తారకమంత్ర మగుచు
మొనసి రక్షించదే ముక్కాలములను

17, జూన్ 2022, శుక్రవారం

జగదీశ్వరుడగు రామునకు

జగదీశ్వరుడగు రామునకు చక్కగ జయమంగళ మనరే
నిగమాగమసంవేద్యునకు నిత్యము శుభమంగళ మనరే

ఇందీవరాక్షున కినకులపతికి నింపుగ శుభమంగళ మనరే
కుందరదనుననకు కువలయపతికి గొబ్బున శుభమంగళ మనరే
కందర్పశతకోటిసుందరవదనున కందరు శుభమంగళ మనరే
వందితాఖిలబృందారకునకు బహుధా శుభమంగళ మనరే

మదనజనకునకు మహిజాపతికి మరిమరి జయమంగళ మనరే
విదితదైత్యసంహర్తకు హరికి వేడ్కగ జయమంగళ మనరే
హృదయంబున కడు దయగల స్వామికి ముదమున జయమంగళ మనరే
ముదమున భక్తుల నేలెడు స్వామికి మరియుచు జయమంగళ మనరే

మంగళమనరే మహనీయునకు మాధవునకు మన శ్రీహరికి
మంగళమనరే రావణాదులను మట్టుపెట్టిన రామునకు
మంగళమనరే  సర్వార్ధములను మనకొసగెడి శ్రీరామునకు
మంగళమనరే మంగళమనరే మంగళమనరే ప్రభువునకు


11, జూన్ 2022, శనివారం

రావణుని సంహరింప రామచంద్రుడై

రావణుని సంహరింప రామచంద్రుడై ఆ
దైవరాయ డుద్భవించె దశరథసుతుడై

దేవతలు వచ్చిరట దండాలు పెట్టిరట
రావణుడు చేయుదుర్మార్గములు చెప్పిరట
నీవు మానవవుడై నిర్జించవలయు నయ్య
దేవుడా మాబాధ తీర్చుమనిరట

హేమకశిపుడై ఎవ్వ డేడ్పించెనొ వాడే
భూమిపై రావణుడై పుట్టె నన్నారట
నీమూలమున వాడు నిక్కముగ చచ్చును
రామచంద్రుడవుగా రక్షించుమనిరట

భక్తకోటి నేలెడు ప్రభుడవు నీవనిరట
యుక్తమైన పనియిది యుర్వికేగు మనిరట
భక్తపరాధీనుడగు భగవంతుడు వినెనట
ముక్తినిచ్చు నామము భూమిపై మొలిచెనట


10, జూన్ 2022, శుక్రవారం

శ్రీరామ నీనామమాహాత్మ్యమునుగూర్చి చెప్పంగ శక్యంబుగాదు కదా

శ్రీరామ నీనామమాహాత్మ్యమును గూర్చి చెప్పంగ శక్యంబుగాదు కదా
ఔరౌర ఆఆదిశేషునకే యైన నదిచెప్ప శక్యంబుగాదు కదా

పరమపురుషుడ వీవు పరమాత్ముడవు నీవు ప్రభవించె విశ్వంబు నీవలన
మరి విశ్వసంరక్షకుడ వీవు నీయందు చొరబారు తుదకెల్ల విశ్వంబును
మరిమరి పుట్టుచు చచ్చుచు జీవాళి తిరుగుచు నుందురు విశ్వంబున
హరి నీదు శ్రీరామ నామంబు గొనువారు తిరుగుట మాని సుఖింతురయ

పరమభక్తాళికే తెలిసిన సుళువైన పధ్ధతి పామరు లెఱుగరయా
తరచుగ దేహంబు నందాత్మ భావంబు దాల్చి పామరు లుర్వి నుండుటచే
విరుగక మోహంబు వేలాది జన్మల తిరుగుచు దీనులై ఏనాటికో
హరి నీదు శ్రీరామ నామంబు పైకొంత ఆసక్తి కలుగుట సంభవమౌ

మరి చూడ నిదియెల్ల నీలీల కాకున్న మాయలోపడి జీవు లుండుటేమి
హరి నీదు శ్రీరామ నామంబు పైనిష్ఠ యబ్బుట బహుకష్ఠ మగుటేమిటి
హరి నీదు శ్రీరామ నామంబు చేసిన నామాయ మటుమాయ మగుటేమిటి
హరి నీదు శ్రీరామ నామంబునకు సాటి యనదగిన దీసృష్టిలో లేదుగా

 

తెలియ నేరము మేము దేవదేవా

తెలియ నేరము మేము దేవదేవా నీదు దివ్యప్రభావంబు దేవదేవా
తెలియ రింద్రాదులు దేవదేవా ముసలి నలువకే తెలియదట దేవదేవా

తీరుగ సృష్టిజేసి దేవదేవా మమ్ము ఘోరభవాంబుధిని దేవదేవా
జార విడచుటేల దేవదేవా దాని తీర మెఱుంగలేము దేవదేవా
తీర మొక్కటి యున్న దేవదేవా దాని జేర నెవ్వరి వశము దేవదేవా
పారము జేరలేక దేవదేవా జీవు లారాట పడనేల దేవదేవా

వేలాది జన్మలెత్తి దేవదేవా మేము వేసట పడనేల దేవదేవా
ఈలాగు నీదియీది దేవదేవా యీదజాలక దుఃఖపడుచు దేవదేవా
నీలీల యిదియనుచు దేవదేవా లోలోన తెలియుదుమె దేవదేవా
మాలావు తెలిసియును దేవదేవా మమ్ము మాయలో నుంచకుము దేవదేవా
 
రాముడవొ కృష్ణుడవొ దేవదేవా నిన్ను మేమెట్లు తెలియుదుము దేవదేవా
కామారి చెప్పెనని దేవదేవా మేము రామ నామము నెపుడు దేవదేవా
ప్రేమతో చేయుదుము దేవదేవా భవము వెడలించవయ్య మము దేవదేవా
సామాన్యులము మేము దేవదేవా మమ్ము చక్కగా బ్రోవవే దేవదేవా


9, జూన్ 2022, గురువారం

వినరండి మేలైన విధమిది జనులార

వినరండి మేలైన విధమిది జనులార
మనసార రామనామమును చేయండి

మునులకు ముక్తియు సుజనులకు సౌఖ్యమును
ఇనకులపతి యిచ్ఛు టెఱుగవలయును
మనసార రామనామ మననము చేయువాని
జననాథుడైన రామచంద్రుడు రక్షించు

పవలును రేలును హరిభజన చేసెడు వారు
భవనాశనుని దయకు పాత్రులగుదురు
రవికులపతిని పొగడు నెవని మానసము వాడు
నివసించు వైకుంఠమున నిశ్ఛయముగను

శ్రీరామ రామ యని శ్రీకృష్ణ కృష్ణ యని
నోరార పలుకుచుండు వారె ధన్యులు
కారణకారణుని కమలాయతాక్షుని సం
సారమోచనుని భజన సలుపవలయునువీడే మమ్మేలెడు వాడు శ్రీరాముడు

వీడే మమ్మేలెడు వాడు శ్రీరాముడు
వీడే‌ మా దేవుడు వెన్నుడు

వీడే త్రైలోక్యవిభుడైన వాడు
వీడే ముప్పొద్దులను తోడు
వీడే మునులకాపాడు మొనగాడు
వీడే మావాడు వెన్నుడు
 
వీడే మాతోడునీడైన వాడు
వీడే మాగోడు వినువాడు
వీడే భక్తులకు వెతలు తీర్చువాడు
వీడే మావాడు వెన్నుడు 

వీడే బ్రహ్మాదివినుతశీలుడు హరి
వీడే ప్రతిలేని వీరుడు
వీడే భవబంధవిఛ్ఛేదకుడు హరి
వీడే మునిమోక్షవితరణుడు


7, జూన్ 2022, మంగళవారం

పురుషోత్తమ నిను పొందితిమయ్యా

పురుషోత్తమ నిను పొందితిమయ్యా
పురుషోత్తమ మాపుణ్యమెట్టిదో

పురుషోత్తమ హరి భువనాధార
పురుషోత్తమ సురపూజితచరణ
పురుషోత్తమ హరి మోహవిదార
పురుషోత్తమ మునిమోక్షవితరణ

పురుషోత్తమ రఘుపుంగవ రామ
పురుషోత్తమ యదుపుంగవ కృష్ణ
పురుషోత్తమ అఘమోచకనామ
పురుషోత్తమ జగన్మోహనరూప

పురుషోత్తమ పరమోదార హరి
పురుషోత్తమ మునిమోహనరూప
పురుషోత్తమ శుభకరుణాపాంగ
పరిపాలితనిజభక్తసమూహ

6, జూన్ 2022, సోమవారం

ఇచ్చితి విచ్చితి వయ్య ఇంత గొప్ప బ్రతుకును

ఇచ్చితి విచ్చితి వయ్య ఇంత గొప్ప బ్రతుకును
మెచ్చమందు విందుకు మేలోహో రామా
 
చెదురుమదురు సుఖములు చిక్కులు చింతలు
వదలని మోహములు బాధలు కన్నీళ్ళు
నిదురబోని యాశలు నిలువని బాసలు
గుదిగ్రుచ్చి యిస్తివి గొప్పబ్రతుకు
 
ఉరుకులును పరుగులును ఒల్లని జీవికయు
నరసంసేవనమును తరచు దైన్యమును
పరమునకే‌మాత్రమును పనికిరాని చదువులు
సరిసరి ఇచ్చితివి చక్కని బ్రతుకు

హీనమైన బ్రతుకున నించుక హరిభక్తి
మానక నాటితిని మనసున చక్కగ
దానికే‌ పదివేలివే దండాలు రామచంద్ర
ఏనందు నీబ్రతుకే యింపగు బ్రతుకుజయజయోస్తు రామ

జయజయోస్తు రామ జయోస్తుభవవిరామ
జయజయోస్తు రామ జానకీరామ
 
హరి పంక్తిరథతనూజ ధరణీసుతామనోజ
సురనాథవినుతతేజ వరభక్తకల్పభూజ 

కమలాప్తకులపవిత్ర కమనీయనిజచరిత్ర
అమరారిగణామిత్ర సుమనోజ్ఞనీలగాత్ర

పరమాత్మ మనుజవేష నరనాథకులవిభూష
సురవైరిగణవిశోష సురలోకపరమతోష

సుగుణాలవాల రామ సూర్యాన్వయాబ్ధిసోమ
జగదేకసార్వభౌమ నగజేశవినుతనామ

1, జూన్ 2022, బుధవారం

కారణమేమయ్య శ్రీరాముడా

కారణమేమయ్య శ్రీరాముడా నీవు
మారాడకున్నావు శ్రీరాముడా

నేరము లేమి చేసి శ్రీరాముడా మేము
ఘోరభవాంబుధిని శ్రీరాముడా 
దారి తెన్నూ లేక శ్రీరాముడా యిట్లు
తారాడుచున్నాము శ్రీరాముడా 

ఔరౌర యెల్లరమును శ్రీరాముడా నిన్ను
నోరార పిలచినను శ్రీరాముడా
కారుణ్యమూర్తివయ్యు శ్రీరాముడా మమ్ము
తీరము చేర్చమంటె శ్రీరాముడా
 
ధారుణిని భక్తాళికి శ్రీరాముడా నీవు
తీరుగను మోక్షమిచ్చి శ్రీరాముడా
మారాత మార్చమంటె శ్రీరాముడా నీవు
నేరముల నెంచెదవో శ్రీరాముడా

31, మే 2022, మంగళవారం

రామహరీ జయ రామహరీ

రామహరీ జయ రామహరీ
రామహరీ శ్రీరామహరీ

జయజయ సురగణసంప్రార్ధిత హరి
జయజయ దశరథజనపతిసుత హరి
జయజయ మునిమఖసంరక్షక హరి
జయజయ ధృతహరచాప శ్రీహరి

జయజయ జయజయ జానకివర హరి
జయజయ వనసంచార శ్రీహరి
జయజయ దానవసంహర శ్రీహరి
జయజయ మునిగణరక్షక శ్రీహరి

జయజయ పౌలస్త్యాంతక శ్రీహరి
జయజయ కరుణాజలనిధి శ్రీహరి
జయజయ భక్తప్రజావన శ్రీహరి
జయజయ జయజయ సర్వేశ హరి


30, మే 2022, సోమవారం

రవికులపతి నామము రమ్యాతిరమ్యము

రవికులపతి నామము రమ్యాతిరమ్యము
భవహర మీ నామము పరమపావనము

కువలయమున దీనికన్న గొప్పమంత్రము లేదు
భువనత్రయ మందే లేదు పురుషులారా
వివరింపగ దీని కన్న విలువైనదే లేదు
తవులుకొనరొ దీనిని తరియింపగ
 
పవమానసూనుని వలెను పరవశించుచు
ఎవరెవరీ‌ మంత్రరాజ మెల్లవేళలందున
సవినయమున భక్తితో జపియింతురో
భువిని వారె ధన్యులనుచు బుధ్ధి నెఱుగుడీ
 
జవసత్వము లున్నప్పుడె శ్రధ్ధాళువులై
పవలురేలు రామనామ భజననుండరే
ఎవరెవరో రామభక్తు లెన్నగ వారే
చివరకు శ్రీరామపదము చేరుకొందురు

పలుకవలెను రామనామము పలుకవలయును

పలుకవలెను రామనామము పలుకవలయును
పులకరించి రామనామము పలుకవలయును
 
పలుకవలెను రామనామము పరమమధురము  
పలుకవలెను రామనామము వరశుభకరము
పలుకవలెను రామనామము భవభయహరము
పలుకవలెను రామనామము పవలురేలును 
 
పదుగురిలో రామనామము పలుకవలయును
పదేపదే రామనామము పలుకవలయును
వదలకుండ రామనామము పలుకవలయును
పదిలముగా రామనామము పలుకవలయును 
 
రామనామము సర్వమనోరంజనకరము
రామనామము కామితార్దప్రదాయకము
రామనామము సర్వలోకక్షేమంకరము
రామనామము మోక్షసామ్రాజ్యప్రదము
 
 

28, మే 2022, శనివారం

మరిమరి నిన్నే పొగడేము

 మరిమరి నిన్నే పొగడేము ఆభిమానముతో నిను పొగడేము
హరేరామ యని పాడేము శ్రీహరేకృష్ణ యని యాడేము

వరగుణనిధివని పొగడేము బహువరము లిత్తువని పొగడేము
కరుణానిధివని పొగడేము మా కన్నీ యిత్తువని పొగడేము
పరమాత్ముడవని పొగడేము మాపాలి దైవమని పొగడేము
చిరకాలము నిను పొగడేము సంబరముగ నిన్నే పొగడేము

అన్నివేళలను కాపాడుదువని ఆనందముతో పొగడేము
నిన్నే పొగడెడు భక్తులతో అనుదినమును కూడి పొగడేము
ఎన్నడు వీడని ప్రేముడితోడ నిన్నే చక్కగ పొగడేము
నిన్నుపొగడుటే మాభాగ్యంబని నిత్యము నిన్నే పొగడేము

పొగడేమయ్యా పొగడేము ఓభూమిసుతావర పొగడేము
పొగడకుండుట మావశమా ఓపురుషోత్తమ నిను పొగడేము
జగదీశ్వర నిను పొగడుటలోనే సంతోషమని పొగడేము
తగినరీతిగా  కృపజూడవయా దాశరథీ నిను పొగడేము

శ్రీరామా నీగొప్పను చెప్పగ తరమా

శ్రీరామా నీగొప్పను చెప్పగ తరమా
చేరి నిన్ను కొలుచువారె శ్రీమంతులు

నిన్ను పొగడువారలతో నిండెను సురలోకము
నిన్ను పొగడువారలతో నిండెను భూలోకము
నిన్ను పొగడువారలతో నిండె ముక్కాలములు
నిన్ను పొగడలేనివారు నిజముగ నిర్భాగ్యులు

నిన్ను సేవించుటకై నిలచియున్నారు సురలు
నిన్ను సేవించుటకై నిలచియున్నారు మునులు
నిన్ను సేవించుటకై నిలచి రిదే భక్త వరులు 
నిన్ను సేవించని వారు నిజముగ నిర్భాగ్యులు

నిన్ను ధ్యానించుటయే నిక్కమైన సంతోషము
నిన్ను సేవించుటయే నిక్కమైన సద్భాగ్యము
నిన్ను నమ్మియుండుటయే నిజము  ముక్తిమార్గము
నిన్ను నమ్మ లేని వారు నిజముగ నిర్భాగ్యులు

26, మే 2022, గురువారం

సద్గుణధామా రాజలలామా

సద్గుణధామా రాజలలామా జయజయ రఘువర శ్రీరామా

రామా సీతారామా దశరథ రాజకుమారకుడవు నీవు
రామా సీతారామా మిథిలారాజున కల్లుండవు నీవు
రామా సీతారామా దనుజవిరాముండవు శ్రీహరి వీవు
రామా సీతారామా మోక్షపురంబున కధినాధుడ వీవు
రామా సీతారామా దీనశరణ్యుండవు శ్రీహరి వీవు
రామా సీతారామా మునిమఖరక్షకుడవు శ్రీహరి వీవు
రామా సీతారామా భర్గశరాసనభంజకుడవు నీవు
రామా సీతారామా మేఘశ్యామలవిగ్రహుడవు నీవు
రామా సీతారామా మునిజనకామితచిన్మూర్తివి నీవు
రామా సీతారామా త్రిభువనరక్షకుడవు శ్రీహరి వీవు
రామా సీతారామా దశముఖప్రాణాపహరుణడవు నీవు
రామా సీతారామా యినకులస్వామివి శ్రీకాంతుడ వీవు
రామా సీతారామా భక్తుల బాముల నణగించెద వీవు
రామా సీతారామా భక్తుల కామితముల నిత్తువు నీవు
రామా సీతారామా భక్తుల నోములు పండితువు నీవు
రామా సీతారామా భక్తుల నీమంబుగ నేలుదు వీవు

18, మే 2022, బుధవారం

పొగడరె మీరు పురుషోత్తముని

పొగడరె మీరు పురుషోత్తముని
జగదీశ్వరుని జానకీపతిని

రాముని జగదభిరాముని యినకుల
సోముని దశరథసూనుని సద్గుణ
ధాముని మిక్కిలి దయగల స్వామిని
కామితముల నిడు కరుణామయుని

పరమసుందరుని పతితపావనునుని
నిరుపమవిక్రమ నిధాను రాముని
పరమాసక్తితో పరమభక్తితో
పరమపురుషుని పరిపరివిధముల

భక్తవరదుని పరమేశ్వరుని
ముక్తిదాయకుని మోహనాంగుని
శక్తికొలది మునిజనులు మెచ్చ నను
రక్తులై పొగడరె రాముని మీరు 


16, మే 2022, సోమవారం

రామ గోవింద హరి రమ్యగుణసాంద్ర హరి

రామ గోవింద హరి రమ్యగుణసాంద్ర హరి
తామరసనయన హరి దశరథతనయ హరి

నిన్నే నేను సేవింతును నీరేజనయన హరి
సన్నుతాంగ కృపాపాంగ సర్వలోకేశ హరి
వెన్నెలైన యెండైన విధివ్రాత యెటులైన
అన్నిటికిని నీవున్నా వదిచాలు నాకు హరి

పొగడువార లెందరున్న భూమిమీద నాకు హరి
తెగడువారి సంఖ్యహెచ్చు తెల్లముగా శ్రీహరి
జగమున నొకమాట పడక జరుగునా దినము హరి
నగుచు నీవు దీవించుట నాకు చాలుగా హరి

పవలు రేలు నీనామము భజన చేయుచుందు హరి
భవము గడచుదారి నీదు పావననామమే యని
శివుడు నాకు గతమందే చెప్పినాడు కదా హరి
అవనిజా రమణ హరి ఆదరింపవయ్య హరి


పాహి శ్రీరామ మాం పాహి రఘురామ

పాహి శ్రీరామ మాం పాహి రఘురామ
పాహి శ్రీరామ మాం పాహి జయరామ

పాహి సురగణవందిత మాం పాహి మునిగణభావిత
పాహి దశరథనందన మాం పాహి దానవమర్దన
పాహి మునిమఖరక్షక మాం పాహి సీతానాయక
పాహి దీనజనావన మాం పాహి రవికులపావన

పాహి పాపవినాశన మాం పాహి శాపవిమోచన
పాహి భవవినాశన మాం పాహి భక్తసుపోషణ
పాహి రవిశశిలోచన మాం పాహి త్రిభువనపోషణ
పాహి సంగరభీషణ మాం పాహి నీరేజేక్షణ

పాహి లక్ష్మణసేవిత మాం పాహి పవనజసేవిత
పాహి త్రిభువనసేవిత మాం పాహి యోగిజనేప్సిత
పాహి పతితపావన  మాం పాహి సుగుణభూషణ
పాహి మోక్షవితరణ మాం పాహి కారణకారణ
14, మే 2022, శనివారం

రామా శ్రీరామా యనరాదా

రామా శ్రీరామా యనరాదా నీమనసారా
స్వామి మధురనామ మేల చవులు గొల్పదో

జగము రామమయ మన్నది సర్వసుజన సమ్మతము
జగము రామమయ మన్నది సర్వదేవ సమ్మతము
జగము రామమయ మన్నది సర్వలోక విదితము
తగును కదా రామభక్తి తప్పక నీకు

రామరామ యనుచు నుండనురక్తి కలిగి పరమశివుడు
రామరామ యనుచు నుండు పరాకులేక పవనసుతుడు
రామరామ యని తరించిరి రమ్యచరితులు భక్తకోటి
రామరామ యని తరించ రాదా నీవు

అనరాదా రామా యని యఖిలపాపసమితి యణగ
అనరాదా రామా యని యన్ని తాపములు నుడుగ
అనరాదా రామా యని యపవర్ఖము చేకురగ
అనరాదా యనరాదా యనిశము నీవు11, మే 2022, బుధవారం

గురువు దొరకును మంత్ర మడుగుదును గొప్పగ సాధన చేయుదును

గురువు దొరకును మంత్ర మడుగుదును గొప్పగ సాధన చేయుదును
వరములిచ్చును మంత్రదేవత బహుధనములు సాధించెదను

    గురువు దొరకినను మంత్ర మిచ్చినను గొప్పగ సాధన చేసినను
    వరములిచ్చినను మంత్రదేవత బహుధనములు సాధించినను
    నరుడా తుదినా పోయెడు నాడొన నాణెమైన కొనిపోలేవు
  
దానధర్మములు తప్పక చేసెద దండిగ యశము గడించెదను
దానివలన స్వర్లోకసుఖంబులు మానుగ నేసాధించెదను
 
    దానధర్మములు దండిగ చేసిన తప్పక యశము గడించినను
    దానివలన స్వర్లోకసుఖంబులు మరి యెన్నో సాధించినను
    మానక నీవీ భూలోకమునకు మరల వచ్చిపోవలసినదే

బహుదైవతముల చక్కగ గొల్చెద బడసెద నే నిహపరములను
విహరించెద నిక మోక్షరాజ్యమున వేరొక జన్మము పొందనుగా

    బహుదైవతముల పూజించినచో బడయవచ్చు నిహసుఖములను
    విహరించగనగు స్వర్గసీమను వేరొక జన్మము విధిగ నగు 
    అహహా శ్రీరఘురాముని కొలువక అపవర్గము నీ కెక్కడిది

 

10, మే 2022, మంగళవారం

రసనకు కడుహితమైనది రామనామము

రసనకు కడుహితమైనది రామనామము సుధా
రసము వోలె మధురమైన రామనామము

మునులు సతతమును మెచ్చి పొగడునామము ఆ
వనజభవ హరులు మెచ్చు భలేనామము
మనుజుల భవతాప మణచు మంచినామము ఆ
దినకులేశుడు శ్రీరాముని దివ్యనామము

వీరాధివీరుడు రఘువీరుని నామము సం
సారభయము నెడబాపెడు చక్కనినామము
ఈరేడు లోకంబుల నేలెడు నామము యో
గారూఢుల హృదయంబుల నమరునామము

శివదేవుడు మనసారా చేయునామము ఆ
పవనసతుడు పరవశించి పలుకు నామము
అవనిజకతి ప్రాణమైన అమృతనాము అది
పవలురేలును నేనిట్లే  పాడెడునామము


నిదురమ్మా రామనామం వదలలేనే

నిదురమ్మా రామనామం వదలలేనే నన్ను
వదలిపోవే ఓ నిదురమ్మా

నిదురన్నది సహజాతము నిన్ను నేనేమని
వదలిపెట్టి పోదునురా నిదురపోరా
వదలలేను రామనామం నిదురపోనే ఓ
నిదురమ్మా దండాలే వదలిపోవే

నిదురలో కలలు వచ్చు నిదురపోరా హరిని
సదయుని దరిసించవచ్చు నిదురపోరా
అది యెంత నిశ్చయమే హరిని కలగనుట ఓ
నిదురమ్మా దండాలే వదలిపోవే

నిదురలేక నీరసించి నీవు హరీ యందువురా
నిదురనైన హరిస్మరణ నిన్ను విడువదు
నిదురనైన హరిస్మరణ నిలచియుండునా భలే
నిదురమ్మా స్వాగతమే నీవిక రావేశ్రీరామనామవటి చిన్నమాత్ర

శ్రీరామనామవటి చిన్నమాత్ర యిది
ఆరూఢిగ భవరోగి కమృతమాత్ర

నాలుకపై దానినంచి నమ్మిచూడరా దాని
మేలు తెలుసుకొని మరీ మెచ్చుకోరా
నేలమీద జనులకెల్ల వేళలందున యిదే
చాల మేలుచేయుచున్న చక్కని మందు

భవరోగ మనేజబ్బు వచ్చుటె కాని అది
ఎవరు మందులిచ్చినను ఎగిరిపోదురా
చివరికి నాలుక పైన శ్రీరామవటి నుంచ
నివారణ మగుచుండును నిక్కముగాను

శ్రీరామవటిమందు చేదులేనిది ఇది
నోరు తీపిచేయుటలో పేరుపడ్డది
కోరి సుజను లాదరించు గొప్పమందిది యిటు
రారా శ్రీరామవటికి నోరుతెరవరా

రామరామ యనరా శ్రీరామరామ యనరా

రామరామ యనరా శ్రీరామరామ యనరా
రామనామమే మంత్రరాజమని తెలియరా

రామరామ యనక పాపరాశి యెట్లు తరుగును
రామరామ యనక పుణ్యరాశి యెట్లు పెరుగును
రామరామ యనక తాపత్రయము లెట్లు తొలగును
రామరామ యనక మోక్షప్రాప్తి యెట్లు కలుగును

రామరామ యనని వాని రసన తాటిపట్టరా
రామరామ యనని వాని బ్రతుకు గాలిపటమురా
రామరామ యన నొల్లని దేమి మంచిమనసురా
రామరామ యనక బ్రతికి లాభమేమి కలదురా

రామరామ యని పలికిన భామ శాపమణగెరా
రామరామ యనిన కోతి బ్రహ్మపదము పొందెరా
రామరామ యని పలుకక యేమి పలుక నేమిరా
రామరామ యని పలుకర రామునిదయ పొందరా


9, మే 2022, సోమవారం

భూమిపై వెలసినది రామనామము

భూమిపై వెలసినది రామనామము మన
మేలు కొఱకు భగవంతుని మేలినామము

నేలపైకి దిగివచ్చెను నీరజాక్షుడు మన
మేలుకోరి రావణవధ మిషమీదను
నీలమేఘశ్యాముని నిత్యము తలచి
చాల మురియుచుందురు సజ్జను లెపుడు

కలదుగా మాట కలౌ స్మరణాన్ముక్తి
తెలిసి తెలిసి శ్రీరాముని దివ్యనామము
వలచి పలకకుందురా భక్తులెపుడును
తలచి మరియువారలే ధన్యులు కారా

రామరామ యనుటలో రక్తియున్నది
రామరామ యనువారికి రక్షయున్నది
రామరామ యన్న మోక్షరాజ్య మున్నది
రామనామ మందరకు ప్రాణమైనది


రామనామము చేయరా శ్రీరామనామము చేయరా

రామనామము చేయరా శ్రీరామనామము చేయరా నీ
వేమి చేసిన మానినా శ్రీరామనామము చేయరా

పాపతూలవాతూల మనగా వరలుచుండును రామనామము
కోపతాపము లణచి శాంతిని కూర్చుచుండును రామనామము
శాపగ్రస్తము లైన బ్రతుకుల చక్కబరచును రామనామము
లోపమెన్నక భక్తులను దయజూచుచుండును రామనామము

రామనామము నోటనుండిన రాదు లోటనుమాట బ్రతుకున
రామనామము సాటిసంపద భూమిపై నింకొకటి లేదు
రామనామము చిత్తశాంతిని ప్రేమతో నీకొసగుచుండును
రామనామము చేయువానిని రాముడే రక్షించుచుండును

పవనతనయుడు పులకరించుచు పాడుచుండును రామనామము
శివుడు నిత్యము ప్రేమమీఱగ చేయుచుండును రామనామము
అవనిజనుల తరింపజేయగ నవతరించెను రామనామము
పవలురేలును నీవు మానక పాడరా శ్రీరామనామము
5, మే 2022, గురువారం

నారాయణ రామ రఘునందన హరి నమోస్తుతే

నారాయణ రామ రఘునందన హరి నమోస్తుతే
నారాయణ కృష్ణ యదునందన హరి నమోస్తుతే
 
ధీవిశాల మేరునగధీర హరి నమోస్తుతే
దేవదేవ దానవకుల దావానల నమోస్తుతే
దేవరాజవినుత మహాదివ్యతేజ నమోస్తుతే
దేవేశ దురతిక్రమ త్రివిక్రమ నమోస్తుతే

సకలయోగిరాజవినుత శ్యామలాంగ నమోస్తుతే
సకలలోకపాలక హరి జననాయక నమోస్తుతే
సకలసుజనహృదయపద్మసంస్థిత హరి నమోస్తుతే 
సకలయజ్ఞఫలప్రద శాశ్వత హరి నమోస్తుతే 
 
భవతారణ కారణ హరి పాపనాశ నమోస్తుతే
వివిధవేదాంతవేద్య విమలతత్త్వ నమోస్తుతే
పవనాత్మజ నారదాది ప్రస్తుత హరి నమోస్తుతే
భవతారక శుభనామ పరమపురుష నమోస్తుతే


2, మే 2022, సోమవారం

శ్రీరామ నీదివ్య నామంబు నానోట నారూఢిగను నిల్వనీ

శ్రీరామ నీదివ్య నామంబు నానోట నారూఢిగను నిల్వనీ
ధారాళముగ నన్ను శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పాడనీ

నీదు సద్భక్తులను చేరి నన్నెప్పుడును నిక్కంబుగా నిల్వనీ
వాదంబులకుపోక పాపచింతనులతో వసుధపై నన్నుండనీ
నీదాసజనులలో నొక్కండనై యుండి నీసేవలే చేయనీ
నీదయామృతముగా కన్యంబు నెప్పుడును నేను కోరక యుండనీ

భోగంబు లం దెపుడు నాబుద్ధి కొంచెమును పోవకుండగ నుండనీ
యోగీంద్రమందార నినుగాక నన్యులకు సాగి మ్రొక్కక యుండనీ
జాగరూకత గల్గి సర్వవేళల నిన్ను చక్కగా నను గొల్వనీ
వేగమే నాపాపపర్వతంబుల నిక విరిగి ధూళిగ రాలనీ

ధ్వంసంబు కానిమ్ము తాపత్రయము నీదు దయనాకు చేకూరనీ
హింసించు కామాది దుష్టరిపువర్గంబు నికనైన నణగారనీ
సంసారనరకంబు గడచి నన్నికనైన చక్కగా నినుజేరనీ
హింసావిదూర ఈభవచక్రమున నన్నెప్పటికి పడకుండనీ29, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఏమిలాభమిక ఏమిలాభమిక ఇందే తిరుగచు నుండేరు

ఏమిలాభ మిక ఏమిలాభ మిక ఇందే తిరుగచు నుండేరు
రామా రామా యన్నారా శ్రీరాముని రక్షణ పొందేరు

తీరిక లేదని కోరిక లేదని దేవుని తలచక తిరిగేరో
ధారాళమగు సుఖములకొఱకై తహతహలాడుచు తిరిగేరో
కోరి కామినీకాంచనములను కువలయమంతయు తిరిగేరో
కోరక మోక్షము మదిలో నెప్పుడు కొరమాలినవే కోరేరో

ఊరివారితో నిచ్చకములతో తీరిక నెఱుగక గడిపేరో
నోరుచేసుకని పదుగురినెపుడు దూరుచు కాలము గడిపేరో
చేరి నిరీశ్వరవాదులతోట దుశ్శీలురతో చెడిపోయేరో
దారుణపాషండమతంబులలో దూరిభ్రష్టులైపౌయేరో
 
గారడివిద్యల గురువుల నమ్మి అగాధములో పడిపోయేరో
నారదాదిమును లెప్పుడు పొగడే నారాయణునే మరచేరో
తారకమంత్రము జోలిక పోవక తక్కిన వేవో తలచేరో
శ్రీరఘురాముని పొగడగ నేరక చే‌రి యితరులను పొగడేరో


25, ఏప్రిల్ 2022, సోమవారం

వేడుకొనరే మీరు విష్ణుమూర్తిని

వేడుకొనరే మీరు విష్ణుమూర్తిని
వేడుకతో భవబంధ విముక్తిని నేడే

రాముడని వేడేరో రాజీవనేత్రుని
శ్తీమంతుని వేడేరో శ్రీకృష్ణుడా యని
కామించక యే లౌకికముల ననురక్తితో
ప్రేమతో మోక్షమే వేడరే నేడే

వేడిన వారికెల్ల విభుడు మోక్షమిచ్చును
వేడక మీరేమిటికి వెఱ్ఱులయ్యేరో
నాడు నేడు శ్రీహరిని నమ్మిన వారెల్ల
వీడరే భవచక్రము వేడరే నేడే

భూమికిక రానేలా పొందనేల దుఃఖములు
పామరులై తిరిగేరో పదివేలయుగములే
స్వామీ యికచాలునని చక్కగా వేడితే
ఆమోక్షము సిధ్ధించు నందుకే నేడే

రామ రామ రామ రామ రామ వైకుంఠ ధామ

రామ రామ రామ రామ   రామ వైకుంఠధామ
రామ రామ రామ రామ   రామ దశరథరామ
రామ రామ రామ రామ   రామ కోదండరామ
రామ రామ రామ రామ   రామ సీతారామ
రామ రామ రామ రామ   రామ దనుజవిరామ
రామ రామ రామ రామ   రామ సాకేతరామ
రామ రామ రామ రామ   రామ పట్టాభిరామ
రామ రామ రామ రామ   రామ జగదభిరామ
రామ రామ రామ రామ   రామ తారకనామ
రామ రామ రామ రామ  రామ వైకుంఠ ధామ12, ఏప్రిల్ 2022, మంగళవారం

శ్రీరమారమణియే సీతమ్మతల్లి శ్రీరమారమణుడే శ్రీరాముడు

శ్రీరమారమణియే సీతమ్మతల్లి
శ్రీరమారమణుడే శ్రీరాముడు

పాదుకలై ఆసనమై పానుపై నిత్యమును
శ్రీదయితుని సేవించే శేషుడే లక్ష్మణుడు
వేదమయుని చేతుల వెలుగు శంఖచక్రాలు
మేదిని శత్రుఘ్న భరత మేరుధీరులు

శ్రీరామ నామమును చాటగా హనుమయై
ధారుణి ప్రభవించెను దయతోడ శంకరుడు
వైరియై మునిశాపవశత శ్రీహరిభటుడా
ద్వారపాలుడు జయుడు పౌలస్త్యుడాయెను

పౌలస్త్యుడు రావణుని పనిబట్టు శ్రీరాముని
మేలు కపిసేనయై మెఱసిరా సురవరులు
ఈలాగు హరిలీల యెసగినట్టి విధమెల్ల
చాల సంతోషముగ స్మరింతురు విబుధులు
11, ఏప్రిల్ 2022, సోమవారం

కోరుకున్న కోరికలను ...

కోరుకున్న కోరికలను కోరినంతనే తీర్చు
    కోదండరామునకు కోటిదండాలు
చేరి మ్రొక్కినంతనే చేపట్టి రక్షించు
    శ్రీరామచంద్రునకు కోటిదండాలు

అక్షీణవిభవునకు ఆనందరూపునకు
    పక్షివాహనున కివే కోటిదండాలు
రక్షించుమనుచు సురలు ప్రార్ధించినంతనే
    రాముడైన శ్రీహరికి కోటిదండాలు
లక్షణముగ సుగుణంబులు లక్షలుగా గల శుభ
    లక్షణుడుగు రామునకు కోటిదండాలు
రక్షోగణముల బట్టి రణముల నిర్జించి లోక
    రక్షకుడైనట్టి హరికి కోటిదండాలు

పరమసాధ్విశాపమును పాదసంస్పర్శ చేసి
    విరిచినట్టి దాశరథికి కోటిదండాలు  
హరునివిల్లు విరిచినట్టి పరమభుజశాలికి
    హరికి హరప్రియునకు కోటిదండాలు
పరశురాము గర్వమెల్ల వైష్ణవమగు వింటినెత్తి
    విరిచినట్టి రామునకు కోటిదండాలు
విరిచి వాని వంశమును విరిచి తుళువ రావణుని
    సురలమెప్పు గొన్న హరికి కోటిదండాలు

జనకసుతారమణునకు సకలతాపహరణునకు
    సకలలోకపోషకునకు కోటిదండాలు    
మునిజనైకమోహనునకు పూర్ణచంద్రవదనునకు
    మోక్షవితరణున కివే కోటిదండాలు
అనిశంబును భక్తజనుల కండయై మనవులు విని
    మునుకొని రక్షించు హరికి కోటిదండాలు
వనజనయనుడైన హరికి వాసవాదిపూజితునకు
    వైకుంఠధామునకు కోటిదండాలు    

10, ఏప్రిల్ 2022, ఆదివారం

ఊరూరా పెళ్ళండి శ్రీరాముని పెళ్ళండి

ఊరూరా పెళ్ళండి శ్రీరాముని పెళ్ళండి
శ్రీరాముని పుట్టినరోజున చేస్తున్నారండి 

తెలుగునాట ఊరూవాడా తిలకించ వేడుక లండి
కళకళ లాడే సీతారామ కళ్యాణవేదిక లండి
తెలుగు వచ్చిన ప్రతివాడు తెలియగ పెళ్ళిపెద్దండి
చిలుకలకొలికి సీతమ్మ మన తెలుగింటి బిడ్డండి

సందుసందున జనకరాజలు చక్కగ కనిపించేరండి
సందుసందున దశరథు లరిగొ చక్కగ కనిపించేరండి
సందుసందున వేదికపైన అందగాడు శ్రీరామచంద్రుని
సుందరి సీత పెండ్లియాడెడు సుందరదృశ్యము కనరండి

ఏటేటా మన తెలుగు నేలపై యిటులే సీతారాములకు
కోటికోటి కళ్యాణ వేదికల గొప్పగ పెళ్ళివేడుకలు
సాటిలేని అభిమానసంపదను చక్కగచాటి చెప్పగను
నీటుగాడు శ్రీరాము డందరిని నిత్యము చల్లగ చూడగనుశ్రీరామ నీజన్మదినమయ్యా

శ్రీరామ నీజన్మదినమయ్యా నేడు 
    చైత్రశుధ్ధనవమి తిథియయ్యా

ఆరావణుని జంప అవతరించినట్టి
    నారాయణమూర్తి వీవయ్యా
ధారుణీ జనులకు ధర్మమార్గము జూప
    దయచేసిన శ్రీహరివయ్యా
కారుణ్యమూర్తివై కావుమన్న వారి
     కాపాడు దేవదేవుడవయ్యా
దారి తెన్ను లేని దారుణసంసార
    వారాశిదాటింతు వీవయ్యా

ధారాధరశ్యామ రవికులాంబుధిసోమ
     ధర్మస్వరూపుడవు నీవయ్యా
ఈరేడు లోకాల నేలు దేవుడ వీవు
      కూరిమి మమ్మేలు దొరవయ్యా
చేరి మ్రొక్కెడు వారు కోరు సంపదలెల్ల
      ధారాళముగ నిచ్చు తండ్రివయా
శూరలోకంబెల్ల చేరి కొల్చుచు నుండ
     శోభిల్లు దశరథసుతుడ వయ్యా

వారిజనాభుడవు భక్తపరిపాలనా
      పరమదీక్షాపరుడ వీవయ్యా
వారిజాక్షుండవు భయనాశకుడవును
       వరదాయకుడవును నీవయ్యా
వారిజాసనుడును వాసవుడు కామారి
       ప్రస్తుతించెడు విభుడ వీవయ్యా
వారిజమృదుపాద వందనంబులు నీకు
      బ్రహ్మాండనాయకుడ వీవయ్యా


       

శ్రీరామనవమి నేడు శ్రీరామభక్తులార శ్రీరామునిదయ మనకు సిధ్ధించు గాక

శ్రీరామనవమి నేడు శ్రీరామభక్తులార 
శ్రీరాముని దయ మనకు సిధ్ధించు గాక

ఆదిదేవుడైన హరి అమితదయాశాలియై
ఆదిత్యుని వంశమున నతిముదంబున
ఆదైత్యు రావణుని అతిశయము నణచగా
మేదినిపై పుట్టిన మిక్కిలి శుభదినము

మానవులకు ధర్మపథము మానుగ బోధింపగ
దానవారి శ్రీహరి దయాశాలియై
మానవుడై త్రిజగన్మంగళాకారుడై
పూనుకొని పుడమిపై పుట్టిన శుభదినము

భక్తసులభుడైన హరి పరమాత్ముడు నిజ
భక్తులకు మిక్కిలిగ ప్రసన్నుడగుచు
ముక్తిప్రదుడైన రామమూర్తియై వరదుడై
భక్తులగు మనకొఱకై వచ్చిన శుభదినము9, ఏప్రిల్ 2022, శనివారం

సంతోషముగా రామనామమును స్మరణ చేయవలయు

సంతోషముగా రామనామమును స్మరణ చేయ వలయు
చింతలులేని సుఖజీవనము సిధ్ధింపగవలయు

ఆనందముగా హరిభక్తులతో నాడిపాడ వలయు
శ్రీనారాయణ తత్త్వచింతనము చేయుచుండ వలయు
మానక నిత్యము హరికార్యంబుల మసలుచుండ వలయు
మానవజీవిత పరమార్ధమిదే మరువకుండ వలయు

పరమేశ్వరుడగు  హరియిచ్చినదే పదివే లనవలయు
పరమకృపాళువు హరికృపనే యెద భావించగ వలయు
పరమాద్భుతములు హరిచరితంబుల చదువుచుండ వలయు
హరి కెవ్వరును సరిరా రన్నది మరువకుండ వలయు

తరుణులకొఱకై ధనములకొఱకై పరుగు మానవలయు
పరులమెప్పుకై వెంపరలాడక హరిని కొలువ వలయు
హరి మెచ్చినచో నదియే చాలని నెఱనమ్మగ వలయు
హరిమయమే యీ జగమంతయు నని మరువకుండ వలయు
4, ఏప్రిల్ 2022, సోమవారం

చందానగర్ కవిసమ్మేళనంలో పాడిన శుభకృత్ ఉగాది పద్యాలు

 
 శుభకృత్ ఉగాది పద్యాలు.

 
సీ. మండుటెండల మధ్య మరిమరి కవులెల్ల
   వచ్చె వసంతంబని పిచ్చిపిచ్చి
పద్యములను కూర్చి పాడుచుండుటె కాని
   ఏమి గలదు సంతసింప నిచట
మామిడి పూతలా మరి యంతగా లేవు
   ఏకొమ్మనైన కోయిలలు లేవు
సాయంతనంబని చల్లగాలియు రాదు
   కాంక్రీటు బిల్డింగు గాడ్పు తప్ప


ఆ.వె. సంప్రదాయమనుచు చట్టుబండలనుచు
లేని యామనికిని మానసమున
పొంగుచుండినట్లు బుధ్ధిగా నటియించి
పద్యములను చదువవలయు గాని.

ఉ. ఏమి యుగాదియో రగులు నెండల మధ్యన వచ్చునే కదా
ఏమి వసంతమో యెచట నెవ్వరి కంటికి కానరాదుగా
ఏమి కవిత్వమో యెదుట నింతయు లేని వసంతశోభపై
ఏమి ప్రపంచమో వినగ నెంచు నుగాది కవిత్వ వైఖరుల్


కం. రామా నీ వెఱిగినదే
మే మాశాజీవులమని మేదిని శుభకృత్
నామక వత్సరమైనను
నీ మహిమను జేసి శాంతి నించగ నిమ్మా!
2, ఏప్రిల్ 2022, శనివారం

అందాల మురళి తీసి హాయిగా ఊదరా

 
అందాలమురళి తీసి హాయిగా ఊదరా
    ఎందుకే ఓ‌ గోపికా ఇంత తొందర


అదిగోరా చందమామ ఇదిగోరా వెన్నెలా
మది నీపాట కోరు మంచి వేళరా
    అది సరే పాట పాడి నందు కేమి లంచమే
ఇదిగోరా పెరుగుముంత ఇది నీదేరా


అరుగో గోపికలంతా అరుదెంచుచున్నారు
సరిసాటి లేని నీ మురళిపాటకై
    మరి వారును పాలు వెన్నలు మానక తెచ్చేరా
హరీ పాలకేమి మా అసువులే నీవి


మెలమెల్లని మురళిపాట మేలుజోడురా ఈ
చలచల్లని యమునగాలి చక్కలిగిలికి
నెలరాజును వచ్చె నిదే నీపాటను వినగోరి
    బలే బలే పొగడే విక పాడకుందునా


1, ఏప్రిల్ 2022, శుక్రవారం

గోపికా గోపికా కొంచుబోకె నామురళి


గోపికా గోపికా కొంచుబోకె నామురళి
    నాపాలదుత్తకు చెల్లిది నల్లనయ్యా

చెట్టుమీది పిందెరాలి చితికెగాని పాలదుత్త
ఒట్టు గోపికా రాయిపెట్టి కొట్టలేదే

    చెట్టక్కడ నేనిక్కడ చెట్టుమీది పిందెరాలి
    ఎట్టా నాపాలదుత్త యిట్టే చితికె


చెట్టుమీద నున్న పిందె చిలు కెత్తుకు పోతుంటే
ఇట్టే జారిపడె నేమో యింతి నీకుండపై

    చెట్టురెమ్మ పిందె త్రెంచి ఇట్టే విసిరినావులే
    పట్టుబడ్డావులే గోపాలకృష్ణా


ఎంత చెప్పినా వినక ఎత్తుకపోతే మురళి
యింతి నేనిప్పుడు పాట నెట్లా పాడగలనే

    ఎంతమాట మోహనగాన మెందు కడ్డుదాననురా
    చింతపడకు మురళి యిదిగో చిన్నికృష్ణా28, మార్చి 2022, సోమవారం

సమస్తలోక శంకరమ్

సమస్తలోకశంకరమ్ విముక్తపూరుషార్చితమ్
నమామి రామ మచ్యుతమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా ధరాత్మజాయుతమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సలక్ష్మణమ్ హరిమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా శివాది ప్రస్తుతమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా మహాకృపార్ణవమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా త్రిలోకవందితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సురారినాశకమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా యశోవిభూషితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సుభక్తపోషకమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా సుఖాసనస్థితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సమీరజానుతమ్  స్మరామి రామ మవ్యయమ్
సదా విమోహనాశకమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా భవాంతకమ్ హరిమ్ స్మరామి రామ మవ్యయమ్


27, మార్చి 2022, ఆదివారం

నిన్నే నమ్మితి గాదా

నిన్నే నమ్మితి గాదా శ్రీరామచంద్ర నీవాడనైతి గాదా
నన్నే నమ్మి కొలిచి నీనామమే తలచి నీవాడ నైతి గాదా

ధారాళమైన కృపకు క్షీరసముద్రము శ్రీరాముడే యనుచును
లేరు వేరొకరు చూడ శ్రీరాముని వంటి కారుణ్యమూర్తి యనుచును
ఊరూర నీదు భక్త వీరులు పొగడుచుండ నుత్సాహించి వినుచును
వారల వలన నిన్ను గూరిచి తెలిసికొనుచు భక్తిపరుడ నగుచును

కూరిమి పంచినట్టి కోతిరాజుకు భీతి తీరిచి నట్టి వీరుడా
తీరుగ నమ్మికొలుచు కోతికి బ్రహ్మపదవి దీవించినట్టి దేవుడా
ఔరౌర ఉడుతకైన కూరిమి పంచువాడ ఓహో శ్రీరామచంద్రుడా
నోరార నీదుకీర్తి నుడువుచుండెడి నాపై కూరిమి చూపరాదా

చేరి నిన్నేకొలుచు సద్భక్తుడను కాదా చింతలు తీర్చరాదా
నీరజనయన భవసాగరమున నుండి నేడే రక్షింపరాదా
ఆరయ నాదు భక్తు లెన్నడు చెడరనుచు నాడిన దీవు కాదా
ఔరా నీవే రామో ద్విర్నాభిభాషతే యన్నది నిజము కాదా
మంచివాడ వయ్యా రామ మంచివాడవు

మంచివాడ వయ్యా రామ మంచివాడవు నిన్ను

మించినట్టి దయానిధిని మేమెఱుగము


చిన్నగా పిలువగనే సీతారామా నీవు

తిన్నగా పలికెదవో దేవదేవా

అన్ని కోరికలు మాకనుకూలముగా మమ్ము

మన్నించి ఇచ్చెదవో మంచివాడా


చెడ్డవాడైన గాని సీతారామా కాళ్ళ

కడ్ఖముగా పడివేడిన నంతే చాలు

వడ్డించి కృపారసము బహుప్రేమతో నీవు

దొడ్డ మేలు చేయుదువో దుష్టదమనా


ఎంత మంచివాడవో యిందిరారమణ నీదు

ఇంతినే పౌలస్త్యున కెర వేసినావు

పంతగించి వాని నడచి ప్రపంచమున కీవు

చింతదీర్చి క్షేమంబును చేకూర్చితివి


24, మార్చి 2022, గురువారం

బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా

బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా
బ్రహ్మానంద పరవశులైరి బ్రహ్మాదులు దిగివచ్చిరి

దిగివచ్ఛిన ఆ సరిసిజాసనుడు దేవదేవుడవు నీవనెను
జగదీశ్వరుడవు నారాయణుడవు జానకిరామా నీవనె
జగన్మాతకే యగ్నిపరీక్షను జరిపించితి వోహో యనెను
నిగమవేద్య నీలీలల నెఱుగగ నేరము గాదా మేమనెను

దిగివచ్చిన ముక్కంటి రాముడా దివ్యము నీచరితం బనెను
జగదీశ్వరుడవు నారాయణుడవు జానకిరామా నీవనెను
దిగివచ్చిన దేవేంద్రుడు రామా తీరెను నాకష్టం బనెను
తగిన ప్రత్యుపకారము నేను తప్పక చేయదు నిపు డనెను

దిగివచ్చిన దశరథభూజానియు జగముల రక్షించితి వనెను
జగదీశ్వరుడవు నీవని తెలిసెను సంతోషించితి నేననెను
తగినవిధంబుగ పట్టము గట్టుక ధర నేలుము నీవిక ననెను
యుగయుములు నీకీర్తి రహించును జగములలో చక్కగ ననెనుతక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు

తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు
తక్కిన మంత్రము లొకయెత్తు భవతారకమంత్రం బొకయెత్తు

మిక్కిలిధనము గడించుచు బొక్కుచు మిడుకుటలో సుఖ మొకయెత్తు
చక్కని ప్రేమను పంచెడు రాముని చరణసేవ సుఖ మొకయెత్తు
మిక్కిలి మారులు పుట్టుచు సుఖముల నిక్కడ వెదకుట యెకయెత్తు
అక్కజముగ హరిపదమును చేరి యచట సుఖించుట యొకయెత్తు
 
పదవులు ధనములు బంధుమిత్రుల వలన కలుగు బల మొకయెత్తు
సదయుండగు శ్రీరామచంద్రుడే యెదనుండిన బల మొకయెత్తు
అదనుగ మణిమంత్రౌషధములచే నగుచుండెడి బల మొకయెత్తు
విదితముగా హరిభక్తిపరతచే వెలయుచుండు బల మొకయెత్తు

పొరి తలిదండ్రులు మానక నీపై కురిపించెడి దయ యొకయెత్తు
కరుణామయుడగు రామచంద్రుడు కురిపించెడి దయ యొకయెత్తు
గురవులు పెద్దలు నీయభివధ్ధిని కోరి కురియు దయ యొకయెత్తు
మరియిక పుట్టవు పొమ్మని రాముడు కరుణించుట యది యొకయెత్తు 

21, మార్చి 2022, సోమవారం

బ్రహ్మానుభవము కలిగెడు దాక బ్రహ్మ మెఱుకపడదు

బ్రహ్మానుభవము కలిగెడు దాక బ్రహ్మ మెఱుకపడదు
బ్రహ్మానుభవము కలిగిన పిమ్మట బ్రహ్మమె తానగును
 
బ్రహ్మము గూర్చి పుస్తకములలో వ్రాతలు చదువుకొని
బ్రహ్మాండముగా పండితులందరు పలుకుచుందు రెపుడు
బ్రహ్మము గూర్చి పండితులాడెడు పలుకులు దబ్బరలు
బ్రహ్మానుభవము లేని వారల పలుకు లగుట వలన
బ్రహ్మవిదులలో  సగుణబ్రహ్మోపాసకు లొకరీతి
బ్రహ్మవిదులలో నిర్గుణబ్రహ్మోపాసకు లొకరీతి
బ్రహ్మానుభవము క్రమముగ నిర్గుణబ్రహ్మమయం బగును
బ్రహ్మతత్త్వవిదు లానందఘన స్వరూపులే కనుక 
బ్రహ్మాత్మైకస్వరూపుని ధనములు బడయుదు రాత్మజులు 
బ్రహ్మాత్మైకస్వరూపుని పుణ్యము బడయగలరు హితులు
బ్రహ్మాత్మైకస్వరూపుని పాపము బయడదు రహితులిక
బ్రహ్మవిదుడు ప్రారబ్ధము గడిచి బడయగలడు ముక్తి
బ్రహ్మానుభవము కలుగుచుండు పరబ్రహ్మము కృపచేత
బ్రహ్మము కృపతో సగుణంబగుచు ప్రభవించెను ధరణి
బ్రహ్మమపుడు శ్రీరామచంద్రపరబ్రహ్మముగా నెసగె
బ్రహ్మానందము కోరిన వారు రాముని గురుతెఱిగి
బ్రహ్మంబనుచు భజించి జగమే రామమయం బనుచు
బ్రహ్మవేత్తలై బ్రహ్మాత్మైకత బడయగలరు నిజము
బ్రహ్మానుభవసంపూర్ణులు వారు బడయగలరు ముక్తి
 


మానవకాంతవు కావనిపించును మానిని నీవెవరు

మానవకాంతవు కావనిపించును మానిని నీవెవరు
హీనదానవుడ మానవకాంతను మానిని సీతనుర
 
ఏమియు నాహారముగా గొనవట యెట్టులుందు వీవు
రామనామమే ఆహారమురా రాక్షసుడా నాకు
 
ఏమియు త్రావక దప్పిగొనక నీ వెట్టు లుండగలవు
రామనామమే సోమరసమురా రాక్షసుడా నాకు

భూమినుండి ప్రాదుర్భవించినది పొలతుక నిజమేనా
భూమిజాతనుర నీకు మిత్తినిర పోరా దానవుడా
 
రాముడు చిచ్చఱకంటివింటినే భామా విరచెనటే
రాముడు విరచును నీగర్వమును రాక్షసుడా రేపు
 
రాముడు వైష్ణవధనువు నెత్తెనట భామా నిజమేనా
రాముడె వెన్నుడు వాని కసాధ్యము రాక్షసుడా లేదు
 
రాముడు హరియా నీవు లచ్చివా లేమా నిజమేనా
ఏమో యిలపై నీల్గెడు నాడే యెఱుగగలవు నీవు

హరహర శివశివ హరహర యనుచు

హరహర శివశివ హరహర యనుచు హరుని చేరితే హరుడేమో
పరమ సుఖంబుగ పద్మాసనమున హరిని తలచుచు నున్నాడు

    తారకనామము నానందముగా ధ్యానము చేయుచు నున్నాడు
    శ్రీరఘురాముని నామస్మరణము చేయుచు సుఖముగ నున్నాడు
    మారజనకుని మదిలో తలచుచు మారవైరి హరి డున్నాడు
    గౌరీనాథుడు శ్రీహరిధ్యానము ఘనముగ చేయుచు నున్నాడు

హరిహరి మాధవ హరిహరి యనుచు హరిని చేరితే హరియేమో
పరమేశ్వరుని హరుని తలంచుచు పరమసుఖముగా నున్నాడు

    ధ్యానము చేయుచు శివపంచాక్షరి తన్మయుడై హరి యున్నాడు
    అ నారాయణు డానందముగా హరుని స్మరించుచు నున్నాడు
    ఆ నటరాజును మదిలో మలచుచు అతి భక్తుడు హరి యున్నాడు
    శ్రీనాధుడు హరి శివధ్యానమును ప్రీతిగ చేయుచు నున్నాడు

హరుని చేరితే హరుడేమో హరిధ్యానములో నగుపడును
హరిని చేరితే హరియేమో హరధ్యానములో నగుపడును
హరిహరు లిరువురు వేరువేరని యనుకొంటే యిది వింత
హరిహరు లిరువురు నొకటే నన్నది యెఱుగ కలుగు పులకింత

రక్షించుము రక్షించుము రామచంద్రా

రక్షించుము రక్షించుము రామచంద్రా జగ
ద్రక్షకుడవు నీవే కద రామచంద్రా
 
రామ నీదు నామమునే నుడివెద నుడివెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు చరితమునే చదివెద చదివెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు యశంబునే పొగడెద పొగడెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు భక్తులతో కలిసెద కలిసెద రామచంద్ర నన్ను రక్షించుమా
 
రామ నీదు విభవమునే తలచెద తలచెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు క్షేత్రములను తిరిగెద తిరిగెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు మహిమలనే చాటెద చాటెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు విక్రమమే చాటెద చాటెద రామచంద్ర నన్ను రక్షించుమా
 
రామ నీకు సేవకుడ నయ్యెద నయ్యెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీకు నిత్యమును మ్రొక్కెద మ్రొక్కెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీకు శరణమని పలికెద పలికెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీ కన్యమునే తలపను తలపను రామచంద్ర నన్ను రక్షించుమా

19, మార్చి 2022, శనివారం

హరి వీవు హరి యతడు

హరి వీవు హరి యతడు మరి మీ యిరువురి
కర మరుదగు జోడీ ఘనమైనది

సురకార్యార్ధము హరి నరుడాయెను
హరికార్యార్ధము హరు డంతట
ధరియించెను వానర రూపంబని
మరి బ్రహ్మాదులు మరిమరి పొగడగ

హరి నిన్నెఱుగును మరి హరి నెఱుగిన
హరిరూపమున నున్న హరుడా శ్రీ
హరిసందేశము హరియుంగరమును
హరిణాక్షి సీత కందించినావు

హరినీ శరమై యమరెను త్రిపురా
సురులను జంపగ హరి రాముడై
దురమున నుండగ తొడరి రథంబుగ
అరి నెదిరించిన హనుమంతుడా


పరమపావనుడైన పవమానసూనుడే

పరమపావనుడైన పవమానసూనుడే
అరయ వచ్చెనా అది పరమశుభకరము

శ్రీరామచంద్రుని తా చేరి పలుకరించెను
ఆరాక రామవిభున కతి మంగళకరమై
ఆ రావణు కసిమసగి యవనిజను కాచి
శ్రీరఘువరు డమిత కీర్తి చెందినాడు

సీతమ్మతల్లిని తా చేరి పలుకరించెను
ఆతల్లి కతని రాక అతి మంగళకరమై
నీతితప్పిన రావణుని నేలబడ జేసి
ప్రీతితో రణవిజయుని విభునిజేర్చె

ఆరావణాసురు తా చేరి పలుకరించెను
ఆరాక లంకాపతి కతి మంగళకరమై
ఘోరశాపము చేత గొన్న యుపాధిని
శౌరి భటుడు జయుడదే జారవిడచె17, మార్చి 2022, గురువారం

చిలుకపలుకుల స్వాము లున్నారు వారు తెలిసితెలియక పలుకుచున్నారు

చిలుకపలుకుల స్వాము లున్నారు వారు
తెలిసితెలియక పలుకుచున్నారు 

చదివిన శాస్త్రవిజ్ఞాన మంతయు దెచ్చి
ముదమార పంచుచు మురియుచున్నారు
విదితంబు గాకాత్మవిజ్ఞాన మించుకయు
విదులమని కడు విఱ్ఱవీగుచు పలికేరు

శివుడు వేరను మాట చెప్పుచున్నారు కే
శవుడు వేరనుచును చాల పలికేరు
వివరింప నిర్వురును వేరుకాదను మాట
నవినీతులై విడచి అతిగ మాట్లాడేరు

మేము స్వాములని మేము భక్తుల మని
రామచంద్రా వీరు రవ్వ చేసేరు
ఏమాత్రమును బ్రహ్మ మెఱుగని వీరెల్ల
సామాన్యులకు బోధ సాగించుచున్నారు16, మార్చి 2022, బుధవారం

శ్రీమన్నారాయణ దేవా హరి శ్రీమద్దశరథనందన

రామా శ్రీమన్నారాయణ హరి శ్రీమద్దశరథనందనా
కామితవరదా కలుషవిదారణ శ్రీమద్దశరథనందనా
 
రామా కౌసల్యాసుఖవర్ధన శ్రీమద్దశరథనందనా
రామా ప్రావృణ్ణీరదశ్యామా శ్రీమద్దశరథనందనా
రామా పుంసాంమోహనరూపా శ్రీమద్దశరథనందనా
రామా రవికులజలనిధిసోమా శ్రీమద్దశరథనందనా
 
రామా కౌశికమునిమఖరక్షక శ్రీమద్దశరథనందనా
రామా పశుపతికార్ముకభంజన శ్రీమద్దశరథనందనా
రామా క్షోణీతనయారమణా శ్రీమద్దశరథనందనా
రామా భార్గవగర్వవినాశక శ్రీమద్దశరథనందనా
 
రామా రాఘవ వనమాలాధర శ్రీమద్దశరథనందనా
రామా ఖరదూషణత్రిశిరాంతక శ్రీమద్దశరథనందనా
రామా మారీచప్రాణహర శ్రీమద్దశరథనందనా
రామా జటాయుసుగతిప్రదాయక శ్రీమద్దశరథనందనా
 
రామా భయదకబంధనిషూదన శ్రీమద్దశరథనందనా
రామా శబరీదత్తఫలాశన శ్రీమద్దశరథనందనా
రామా రవిపుత్రప్రియమిత్ర శ్రీమద్దశరథనందనా
రామా గర్వితవాలివినాశన శ్రీమద్దశరథనందనా
 
రామా ఘనవారాన్నిధిబంధన శ్రీమద్దశరథనందనా
రామా రావణదైత్యవినాశన శ్రీమద్దశరథనందనా
రామా సీతాశోకవినాశన శ్రీమద్దశరథనందనా
రామా బ్రహ్మాద్యమరాభినుత శ్రీమద్దశరథనందనా
 
రామా సాకేతపురాధీశ్వర శ్రీమద్దశరథనందనా
రామా సకలోర్వీజనవందిత శ్రీమద్దశరథనందనా
రామా భక్తజనాశ్రయచరణా శ్రీమద్దశరథనందనా 
రామా భవభయవారక నామా శ్రీమద్దశరథనందనా
 
రామా జయజయ రమ్యగుణాశ్రయ శ్రీమద్దశరథనందనా
రామా త్రిజగన్మంగళరూపా శ్రీమద్దశరథనందనా
రామా మునిజనమోక్షప్రదాయక శ్రీమద్దశరథనందనా
రామా వైకుంఠాధిప శ్రీహరి శ్రీమద్దశరథనందనా
 
 

ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుటనే చిత్తంబులో మానకున్నానురా
ఓరామ నీచిత్త మిక నెట్టులున్నదో ఆరీతిగా నింక నడిపించరా  
 
ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా
ఇంటిదని ఒక సుదతి యున్నాదిరా అది ఎంతతెచ్చిన మెచ్చకున్నాదిరా
 
బిడ్దలని ఒక కొందరున్నారురా వార లడ్డదిడ్డము లాడుచున్నారురా
దొడ్దప్రభువులు కొందరున్నారురా వార లడ్డమైన మాట లాడేరురా

మరి మిత్రులని కొందరున్నారురా వారు మనవద్ద నెంతసే పుంటారురా
ఇరుగుపొరుగని కొందరున్నారురా వారు పరుషంబులే తరచు పలికేరురా
 
బంధుబలగము మిక్కి లున్నాదిరా నాకు వారునా వారెప్పు డైనారురా
బంధాలు పదిలక్ష లున్నాయిరా వాటి బాధనే పడలేక యున్నానురా
 
అందమైన లోక మంటారురా దీని యందాలు గొప్పలే మున్నాయిరా
బందిఖానావంటి యిల్లుందిరా యందు బందీగ నే జిక్కియున్నానురా
 
శాస్త్రంబులని చాల యున్నాయిరా నేను చదివిచచ్చిన దేమి యున్నాదిరా
శాస్త్రంబు లటులుంచి చదువుసంధ్య లంటి చచ్చిన దేమంత యున్నాదిరా
 
మిడిమిడి జ్ఞానంబు మెట్టవేదాంతంబు మించి తెలి వేమంత యున్నాదిరా
వడివడిగ వయ సుడిగిపోవుచున్నది కాని బ్రతుకున సుఖమన్నదే లేదురా

సంసార మిటువంటి దని తెలియక నేను సంసారమున చిక్కు కున్నానురా
హింసించు చున్నదీ సంసార మిక దీని నెంత మాత్రము తాళగాజాలరా
 
హరిహరి నీవొకడ వున్నావురా చాలు నన్నిటను తోడుగా నున్నావురా
మరి నీదు తారకమంత్రంబునే నేను మానక చేయుచు నున్నానురా


ఈమాత్ర మెఱుగరా

ఈమాత్ర మెఱుగరా ఏమి గురువులు మీరు
రామరామా చాలు మీమాటలు

శ్రీరామనామ మను సిధ్ధౌషం బొకటి 
    సేవించదగినదై యుండ
మీరేల భవరోగ మను దాని కొకమందు
     తీరుగా లేదు పొమ్మనుచు
ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
      చారంబు చేయుచున్నారో
ఔరౌర అది యొప్పునా రామనామామృత
      మన్ని రోగములకు మందు

శ్రీరామనామ మను చింతామణి యొకటి
      చేతిలో సిధ్దముగ నుండ
 మీరేల సకలసంపద లిచ్చు మణి యొండు
       మేదినిన్ లేదు పొమ్మనుచు
 ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
      చారంబు చేయుచున్నారో
 ఔరౌర అది యొప్పునా రామనామమణి
      ఆమోక్షమైన నందించు

శ్రీరామనామ మను జీవులందరు జపము
      చేయగా దగు మంత్ర ముండ
మీరేల సకలజనసంసేవ్య మంత్రమే
      మేదినిన్ లేదు పొమ్మనుచు
ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
    చారంబు చేయుచున్నారో
ఔరౌర అది యొప్పునా రామమంత్రంబు
     నందరును చేయనే వలయు

15, మార్చి 2022, మంగళవారం

వినరయ్య వినరయ్య

వినరయ్య వినరయ్య శ్రీరామభక్తుని విధమును విశదంబు గాను

శ్రీరామతత్త్వంబు చింతించునే కాని చింతించ డన్యంబు లెపుడు
శ్రీరామభజనంబు చేయుచుండును కాని చేయ డన్యుల భజన మెపుడు
శ్రీరామచరితమే చెప్పుచుండును కాని చెప్ప డన్యుల గూర్చి యెపుడు
శ్రీరామయశమునే చాటుచుండును లెక్కచేయ డన్యుల  గొప్ప లెపుడు

శ్రీరామచంద్రునే సేవించుకొను గాని సేవింప డన్యుల నెపుడు
శ్రీరామభక్తులను చేరుచుండును కాని చేరబో డన్యుల నెపుడు
శ్రీరామ గానంబు చెవిబెట్టునే కాని చెవు లన్యముల కీయ డెపుడు
శ్రీరామ పారమ్యమే యొప్పుకొను కాని వేరుమాటే యొప్పుకొనడు

శ్రీరాముడే తండ్రి యని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే తల్లి యని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే విభుం డని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే దైవ మని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు

10, మార్చి 2022, గురువారం

రామా రామా రాజీవానన రావయ్యా రామా

రామా రామా రాజీవానన రావయ్యా రామా
ఏమాత్రము నేతాళలేనని యెంచుము శ్రీరామా

ఎన్నడైన నే మరచియుంటినా నిన్ను మహాత్మా రామా
ఎన్ని జన్మలుగ కొలుచుచుంటినో యెఱుగుదు వీవే రామా 
నిన్నేనమ్మితి సన్నుతాంగ హరి నీరజనయనా రామా 
నన్నెప్పటికిక గట్టెక్కింతువు నారాయణ హరి రామా 
 
వేనవేలుగా తనువుల దాల్చితి వేదన లందితి రామా
ఏనాటికి నను దయజూచెదవో యినకులతిలకా రామా
దీనులపాలిటి కల్పవృక్షమవు దిక్కువు నాకు రామా
నేనెంతగ మొఱబెట్టిన వినవిది నీకు న్యాయమా రామా

భయములు పెక్కులు కలుగుచున్నవి భండనభీమా రామా
జయశీలుడవని నమ్మితినే యిటు జరుగవచ్చునా రామా 
దయగలవాడవు నీవని నేను తరచుగ విందును రామా
దయగలవాడవు నీవైతే నను దయజూడవయా రామా
 
మరుజన్మంబున నరుడనగుదునను మాటసత్యమా రామా
నరుడనైనను నీనామంబును మరచెదనేమో రామా
పరమార్తుడ నిను వేడుకొందును వలదిక జన్మము రామా
కరుణను నాభవబంధంబులను ఖండింపవయా రామా

తప్పులు చేయని నరుడున్నాడా ధరణీతలమున రామా
తప్పులు గలవని నాపై నీవు తామసింపకుము రామా
ఒప్పుగ నిదె నీ సన్నిధిచేరి యుంటిని కదరా రామా
తప్పుల నెన్నక నాపై నీవు దయచూపవయా రామా


9, మార్చి 2022, బుధవారం

దాశరథీశతకం - 2


రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ 
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద 
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో 
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
 
 
ఈ పద్యం కూడా అన్నీ‌ సంబోధనలతో‌ నడుస్తోంది.
రామ 
విశాలవిక్రమపరాజితభార్గవరామ 
సద్గుణస్తోమ 
పరాంగనావిముఖసువ్రతకామ 
వినీలనీరదశ్యామ 
కకుత్స్థవంశకలశాంబుధిసోమ 
సురారిదోర్బలోద్దామవిరామ 
భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
 
విశాలవిక్రమపరాజితభార్గవరామ  అనే సంబోధనకు అర్ధం పరాక్రమంతో‌ పరశురాముణ్ణి జయించిన వాడా అని. రాముడు శివుడి వింటిని ఎక్కుపెట్టబోతే అది కాస్తా విరిగింది. ఆ విరగటంతో వచ్చిన చప్పుడు ఎంత దారుణంగా ఉందంటే సభలో ఉన్నవాళ్ళందరూ మూర్చబోయారు దాన్ని తట్టుకోలేక. కొధ్ధిమంది మాత్రం‌ నిబ్బరంగా ఉండగలిగారంతే. వాళ్ళెవరంటే విశ్వామిత్రమహర్షి, లక్ష్మణస్వామి వారు, జనకమహారాజు గారు మాత్రమే.  శివుడు విల్లా మజాకానా! సీతారామకళ్యాణం‌ జరిగింది. మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళూ అయ్యాయి. ఈశివధనుర్భంగ వార్తకు కోపించి పరశురాముడు వచ్చాడు. నువ్వెవడివిరా ఇంకొక రాముడివీ, ఈ జమదగ్ని కొడుకు రాముడుండగానూ! నాగురువుగారు శివుడి విల్లు పొగరుగా విరగ్గొట్టి ప్రతాపం చూపుతావా? అని గర్జించి, చేతనైతే ఈవిష్ణు ధనస్సును ఎక్కుపెట్టరా చూదం అని విష్ణుధనస్సును ఇచ్చాడు. రాముడు సవినయంగానే ఆవిల్లు అందుకొని బాణం ఎక్కుపెట్టాడు. పైగా పరశురాముడితో ఒక ముక్క అన్నాడు. రాముడు ఉత్తినే ఏపనీ చేయడు. ఇప్పుడు చెప్పు ఈబాణాన్ని ఎక్కడ విడిచేదీ? నీకు సులభంగా సిధ్ధగమనంతో‌ ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తిని కొట్టేయనా, నీవు తపస్సుతో సంపాదించుకొన్న పుణ్యలోకాలను కొట్టెయ్యనా? అని. రాముడు విష్ణుధనస్సుని ఎక్కుపెట్టి ఇలా అంటూ‌ ఉండగా అకాశంలో నిలచి దేవతలంతా మహోత్సాహంతో చూసారు. పరశురాముడిలోని విష్ణుతేజం రాముడిని చేరుకున్నది. ఆయన విష్ణువు యెక్క ఆవేశావతారం కదా. పరశురాముడు చిరజీవిని, అపుణ్యలోకాలతో నాకు పనిలేదు వాటిని కొట్టేయవయ్యా నాగమనశక్తిని కొట్టవద్దు. ఎందుకంటే‌ ఈభూమినంతటినీ‌ ఒకప్పుడు నేను జయించి కశ్యపుడికి దానం చేసేశాను. అందుచేత భూమిమీద రాత్రి నేను నిలువరాదు అన్నాడు. అలాగు పరశురాముడిని రాముడు తన బాహు విక్రమంతో జయించాడు. ఈ‌కథను గుర్తుచేయటానికే విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నారు రామదాసు గారు. 
 
ఇక్కడొక చమత్కారం ఉంది విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నదిరెండుసంబోధనలుగా విడదీయవచ్చును. 
విశాలవిక్రమ
పరాజితభార్గవరామ 
అని
విశాలవిక్రమ అంటే త్రిలోకాలలోనూ ప్రఖ్యాతమైన పరాక్రమం కలవాడా అని అర్ధం.  ఈసంబోధనకు సమర్ధనగా కాకాసురవృత్తాంతాన్ని గుర్తుచేసుకుందాం. ఈ కాకాసురుడు అనే వాడు, సీతమ్మ జోలికి పోయి రాముడి బ్రహ్మాస్త్రానికి గురైనాడు. వాడు ప్రాణభయంతో రక్షించేవాడిని వెతుక్కుంటూ‌ మూడులోకాలూ తిరిగి అలసిపోయాడే కాని, రాముడి అస్త్రాన్నుండి మేము కాపాడగలం అన్న మొనగాణ్ణీ ఎవణ్ణీ చూడలేదు. చివరకు రాముడే అనుగ్రహించవలసి వచ్చింది శరణు మహాప్రభో అని ఆ రాముడి కాళ్ళమీద పడ్దాక.
 
పరాజితభార్గవరామ అన్న సంబోధనకు మనం అర్ధం చెప్పుకోవటం జరిగింది కదా.

రాముణ్ణి సద్గుణస్తోమ అని పిలుస్తున్నాడు రామదాసు. స్తోమం అంటే‌ సమూహం. సద్గుణాల పుట్ట అట రాముడు. అసలు రామాయణ కావ్యారంభం అన్నది ఇలా సద్గుణాల పుట్ట ఐన వాడు ఎవడన్నా ఉన్నాడా అని నారదులవారిని వాల్మీకి మహర్షి అడగటంతోనే కదండీ ప్రారంభం ఐనదీ? ఆ నారదులవారేమే నువ్వన్న సద్గుణాలన్నీ కూడా రాముడికే ఉన్నాయీ‌ అని చెప్పి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పారు వాల్మీకికి. ఆ దరిమిలా ఆ రామకథనే బ్రహ్మగారి వరప్రభావంతో సంపూర్ణంగా దర్శిస్తూ మహత్తర కావ్యంగా వాల్మీకి విరచించారు ఆదికావ్యం రామాయణాన్ని. రాముడెంత సద్గుణవంతుడూ అంటే రాక్షసుడైన మారీచుడే‌ రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పాడు. ధర్మమే రాముడి స్వరూపం. ఆయన మాటా బాటా అందరికీ ఆదర్శం కదా యుగయుగాలకూను. అంత సద్గుణశాలి రాముడు.

పరాంగనావిముఖసువ్రతకామ అన్న మంచి సంబోధన ఒకటి ఇందులో ఉంది.  పరాంగనలు అంటే ఇతరుల భార్యలు. ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలవాడు అని చెప్పటమూ‌ అది ఒక సువ్రతం అనగా మంచి వ్రతం అని ఒక కితాబు ఇవ్వటమూ పైగా రాముడికి అట్లా ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలిగి ఉండటం చాలా ఇష్టం‌ అని చెప్పటమూ ఈసంబోధన ద్వారా తెలుస్తోంది. రాముడి జీవితంలో పెళ్ళి చేసుకోమని వెంటబడ్డది ఒక్క శూర్పణఖ మాత్రం‌ కనిపిస్తుంది. అందమైన స్త్రీగా వచ్చినది ఒక రాక్షసి అని రాముడు గ్రహించాడా లేదా అన్నది ప్రక్కనబెడితే ఆయన మాత్రం నేను ఏకపత్నీవ్రతుణ్ణి, అవతలికి పో అనేశాడు. పరాంగనలను రాముడు కన్నెత్తి చూసే వాడు కాదు. ఆమాటకు వస్తే లక్ష్మన్న కూడా అంతే! ఆయన సీతమ్మ పాదాలనే‌ కాని ముఖం చూసి ఎన్నడూ మాట్లాడనే లేదు.

వినీలనీరదశ్యామ అనేముక్కకు అర్ధం చూదాం. నీరదం అంటే మేఘం. నీరములు అనగా నీళ్ళను ఇచ్చునది కాబట్టి నీరదం అని విగ్రహవాక్యం. శరత్కాలంలోని దూదిపింజెల్లాంటి మేఘాలు తెల్లగా ఉంటాయి కాని నీళ్ళను క్రుమ్మరించే‌ శ్రావణమేఘాలు అదొక తమాషా నలుపు రంగులో ఉంటాయి. సంస్కృతభాషలో నీలం అన్న ముక్కకి నలుపు అని అర్ధం. తెలుగులో నీలం అంటే నలుపన్న అర్ధం లేదు, అది వేరే రంగు. విష్ణువు నీలం అన్నారు కదా అని మన నాటకాలవాళ్ళూ బొమ్మలు వేసే వాళ్ళూ ఆయనకు సంస్కృత నీలవర్ణం బదులు తెలుగు నీలంరంగు వేసేసారు. సాక్షాత్తూ రాయల్ బ్లూ ఇంక్‌ పీపాలో ముంచి తీసారు. అన్నట్లు వినీల అన్నారు కదా, వినీల అంటే మరేమీ లేదు మంచి నీలవర్ణం అని అనగా దట్టమైన కారుమబ్బు రంగట! రాముడూ‌ కృష్ణుడూ కూడా ఒకే రంగు. అన్నట్లు అర్జునుడూ అదే‌ రంగు. ఒక సందర్భంలో అర్జునుడే‌ అంటాడు నేనూ కృష్ణుడూ తప్ప ఈశరరవర్ణంలో లోకంలో మరెవ్వరూ ఉండరు అని.

కకుత్స్థవంశకలశాంబుధిసోమ అన్న సంబోధన రాముడి వంశాన్ని స్మరించె చెప్పేది. రాముడిది కకుత్స్థవంశం. ఇక్ష్వాకుడి కొడుకు కుక్షి.  అ కుక్షి కొడుకు వికుక్షి. ఒకసారి దేవతల తరపున రాక్షసులతో యుధ్ధంచేసినప్పుడు, ఈవికుక్షికి ఇంద్రుడే ఒక ఎద్దు రూపంలో వాహనం అయ్యాడట. అప్పటినుండి అతనికి కకుత్స్థుడు అనీ‌ ఇంద్రవాహనుడు అనీ బిరుదులు వచ్చాయి. వంశాన్ని సముద్రంతో పోల్చి, ఆ సముద్రుడికి చంద్రుడిలాగా ఫలాని వంశసముద్రానికి నీవు చంద్రుడివి అని ప్రశంసించటం సంప్రదాయం. రాముడు అలా కకుత్స్థుఁడి వంశ సముద్రానికి చంద్రుడు అని చెప్తున్నారు రామదాసు గారు.

ఇక సురారిదోర్బలోద్దామవిరామ అన్న సంబోధన ఉంది. సురారులు అటే సురలకు అరులు, అరి శబ్దానికి అర్ధం శత్రువు అని. సురలంటే‌ దేవతలు కాబట్టి సురారులు అంటే‌ రాక్షసులు. అ రాక్షసులకు రాముడు విరాముడట అనగా మంగళం పాడినవాడు. చంపిపారేసినవాడు. అల్లాటప్పా రాక్షసులను చంపితే గొప్పేమీ? ఆ రాక్షసులను దేవతలు చంపలేకపోతే రాముడూ చంపాడంటే వాళ్ళెలాంటి వాళ్ళూ? దోర్బలోద్దాములు అట. అంటే పట్టపగ్గాలు లేని భుజబలం కలవారు. దేవతలనె గడగడలాడించిన వారు. వాళ్ళ పనిపట్టినవాడు రాముడు అని రామదాసుగారు పొగడుతున్నారు.
 
ఒక చిన్న సంగతి. రాముడు పరాంగనావిముఖసువ్రతకాముడు అన్నారు.ఇందులో ఏమి విశేషం ఉందీ అనపించవచ్చును. రామచంద్రుడు రామాయణమహాకావ్యంలో నాయకుడు. అయన పరాంగనావిముఖసువ్రతకామ చరిత్రుడు. ఆ కావ్యంలోని ప్రతినాయకుడు రావణుడు. అతగాడు కూడా మహాతేజస్వి. గొప్ప పరాక్రమం కలవాడు. దేవతలకే అసాధ్యుడు. మహాశివభక్తుడు. వేదవేత్త. వేదపఠనంలో ఘన జట వగైరా విధానాలున్నాయే -- ఘనాపాఠి, జటాంతస్వాధ్యాయి వగైరా మాటలు వినే ఉంటారు కదా -- ఆ విధానాలకు రూపకర్త రావణుడే‌ అంటారు. అంత గొప్పవాడు. ఐతేనేమి ఆరావణుడు పరాంగనాసుముఖదుర్వతకామ చరిత్రుడు. అందుకే ఆతప్పు చేసిచేసి చివరకు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళి రాముడి చేతిలో చచ్చాడు.  అలా ఈ పరాంగనావిముఖసువ్రతకామ అన్న సంబోధన ఈసంగతిని మనకు గుర్తు చేయటానికి వాడారనుకోవచ్చును.

ఆ రాముడు మనవాడే భద్రగిరి మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన కరుణాపయోనిధి అనగా ఆయన దయలో సముద్రం వంటి వాడు.

8, మార్చి 2022, మంగళవారం

హరేరామ జైజై హరేకృష్ణ జైజై

హరేరామ జైజై హరేకృష్ణ జైజై
పరాత్పరా మునిజనభావితహరి జైజై
 
ధరాసుతామనోహరా హరేరామ జైజై 
సురాధినాథప్రస్తుతశుభవిక్రమ జైజై
నరాధినాథవందితచరణారవింద జైజై
పురాంతకాభినందిత హరేరామ జైజై

రావణాదిదనుజగణవిరామ రామ జైజై
పావనాతిపావనపదపంకేరుహ జైజై
శ్రీవిదర్భజార్చితపద శ్రీకృష్ణ జైజై
దేవ దుష్టరాక్షసాధీశనాశ జైజై
 
కరుణామయ జైజై కమలనయన జైజై
పరమపురుష జైజై భక్తపాల జైజై
నిరుపమాన జైజై నిరంజన జైజై
పరమేశ్వర జైజై పరంజ్యోతి జైజై

ఎంతచిత్రమో‌ కదా యీసంగతి

ఎంతచిత్రమో‌ కదా యీసంగతి
వింతగా రామకథ విధి లిఖించె
 
గద్దె కెక్కవలెను రేపు వాడనగా తండ్రి
వద్దు వాడడవికి పోవలెననె పినతల్లి
ముధ్దులసతి మాటలకు మూర్చిల్లె జనపతి
సద్దుచేయ డడవులకు జనెను శ్రీరాముడు

వద్దు నాకు గద్దె యనుచు వచ్చి భరతు డడిగె
గద్దె నీది పాలించగ కడగుమనె రాముడు
పెద్దగ వాదించి యతడు విభుని యొప్పించెను
ముద్దుగ నీపాదుకలు భూమినేలు ననుచు
 
ముద్దరాలు సీత నెత్తుకపోయినట్టి రావణుని
పెద్దయనిని చంపి సతితి విడిపించె రాముడు
పెద్దలు బ్రహ్మాదు లంతట వెన్నుడవు నీవనిన
పెద్దగ నచ్చెరువుపొందె విభుడు శ్రీరాముడు