26, జూన్ 2019, బుధవారం

ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో


ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో
యక్కడ నున్న దేమి యిక్కడ లేదో

అక్కడున్న దిక్కడున్న దొక్కటి కాదో
చక్కగ విచారించ జాలడే గాక
వెక్కసపు బేధబుధ్ధి వెడలించి నంత
నక్కడ నిక్కడున్న దంతయు నొకటే

కాలమని స్థలమని కలవా యేమి
లీలగా బ్రహ్మమివి రూపించు గాక
వీలగునా దీని గూర్చి వేడుక జీవి
యేలాగునైన బుధ్ధి నెఱుగ నేర్వ

శ్రీరామనామ మందు చెలగెడు దానిని
శ్రీరామరూప మందు చెలగెడు దానిని
చేరువనే యున్నదాని చిత్తమందున
ఆరసి చూచినచో నన్నిట నదియే

24, జూన్ 2019, సోమవారం

విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా


విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా ఓ
నల్లనయ్య యిది యేమి యల్లరయ్యా

ఎన్నో తరాల నుండి యెనలేని యీ విల్లు
మన్నికగ నున్నదయ్య మాయింటి లోన
ఎన్నెన్ని పూజలందు కొన్నదో యీవిల్లు
చిన్న వాడ వెరుగవుగ శ్రీరామ చంద్రుడా

రేపు దేవతలు వచ్చి కోపగించెద రేమో
మీ పెద్దల కిచ్చినది మేలైన విల్లే
ఆపురారి పెనువిల్లే అపురూపమైనదే
యే పగిదిని పిల్లవాని కిచ్చినా వందురే

పూని యీ విల్లెత్తిన పురుషోత్తముడ వీవే
తానిది మున్నెత్తెను మా తనయ సీత
మానితమౌ ధనువు మిమ్ము మన్నించె నీరీతి
కాన నీకు సీత నిత్తు కాదన రాదయ్యా

వివిధవేదాంతసార విమలశుభాకార


వివిధవేదాంతసార విమలశుభాకార
రవికులాలంకార రామ నిర్వికార

అంగీకృతనరాకార హరి దయాపూర
సంగీతరసవిచార సమరైకశూర
సంగరహితమునిచర్చిత సత్యధర్మసార
శృంగారవతిసీతాసేవ్యశుభాకార

సురారాతిగణవిదార శోభనాకార
నిరుపమధర్మావతార దురితసంహార
పరమయోగిరాజహృదయపద్మసంచార
ధరాసుతాప్రియాకార వరశుభాకార

శ్రీకాంతాహృద్విహార చిన్మయాకార
సాకేతపురవిహార సజ్జనాధార
పాకారిప్రముఖవినుత భక్తమందార
శ్రీకర త్రిజగదాధార శ్రీరఘువీర

21, జూన్ 2019, శుక్రవారం

తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను


తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను దేవుడు
పలుకష్టము లనుభవించ వలెసెనా రాముడు

పట్టాభిషేకము చెడి వనవాసము కలిగెను
నట్టడవుల రాకాసులు ముట్టడించ పోరెను
తుట్టతుదకు రాకాసియె తొయ్యలి గొనిపోవగ
పట్టుబట్టి వాని జంప పరమకష్టమాయెను

సతికి యగ్నిపరీక్షకు సమ్మతించ వలసెను
నుతశీలకు నిందరాగ సతిని విడువ వలసెను
ప్రతిన కొఱకు సోదరునే వదలిపెట్ట వలసెను
ధృతిమంతుని ధర్మదీక్ష ధర నబ్బురమాయెను

రాముడొకడె సర్వుల కారాధ్యుడై నిలచెను
రాముని కథ శాశ్వతమై భూమిపైన నిలచెను
రామభక్త జనులతోడ భూమి నిండిపోయెను
రాముడు  భక్తులకు మోక్ష రాజ్యమునే యిచ్చును

తెలియరాని మహిమగల దేవదేవుడు


తెలియరాని మహిమగల దేవదేవుడు చేరి
కొలిచినచో మోక్షమిచ్చు గుణవంతుడు

మంచివారు చెడ్డవారు మనలో కలరు వీడు
మంచివాడగుచు కలడు మనకందరకు
అంచితముగ నితని చేరు నట్టివారికి వీడు
సంచితకర్మంబు లెల్ల చక్కజేయును

తనవారని పెరవారని తలచనివాడు వీడు
మనవాడని తలచితే మనవాడగును
మన రిపుషట్కమును ద్రుంచి మన్నించును వీడు
మన మానసములలోన మసలుచుండును

ప్రేమతోడ రామాయని పిలుచినంతట వీడు
పామరులకు సైతము పలుకుచుండును
భూమిసుతాపతి దయా భూషణుడు  వీడు
కామితార్థ మెల్లరకును కటాక్షించును

18, జూన్ 2019, మంగళవారం

ఒక్క సీతారాములకే మ్రొక్కెద గాక


ఒక్క సీతారాములకే మ్రొక్కెద గాక
తక్కుంగల వారికేల మ్రొక్కెద నయ్యా

సీతారాములు చాల చిక్కుల కోర్చి
ఆ తులువ రావణు నంతము చేసి
ప్రీతిమై లోకశాంతి వెలయించి చాల
ఖ్యాతి గాంచినారు కనుక కడగి మ్రొక్కెద

సీతారాములు నాదు జీవితంబున
నే తీరున నాపద లెల్ల నడచిరో
నా తరమా వర్ణింప నాదైవములకు
చేతులెత్తి మ్రొక్కువాడ చిత్తశుధ్ధిగ

లోకస్థితికారకుడా శ్రీకాంతు డిడిగో
నాకొరకై రాముడై నడచి వచ్చెను
శ్రీకాంత నాతల్లి సీతగా వచ్చె
నాకు తల్లిదండ్రులనుచు నమ్మి మ్రొక్కెద

రఘువంశజలధిసోమ రామ రామ


రఘువంశజలధిసోమ రామ రామ
అఘవిమోచననామ రామ రామ

దయామృతమహార్ణవ దశరథరామ
భయాపహమహాబల భండనభీమ
జయావహశుభనామ జానకిరామ
ప్రియంకర శుభంకర శ్రీకర రామ

సురారిలోకభీకర శోభననామ
పురారిపంకజాసన పూజితనామ
ధరాసుతానిజప్రాణాధారక రామ
నిరంజనా యరిందమా నీరజశ్యామ

ధర్మావతార రామ దైత్యవిరామ
కర్మపాశవిమోచనకారణ రామ
నిర్మోహశుభకారణ నిస్తుల నామ
నిర్మలచారిత్ర్యరామ నిరుపమనామ

13, జూన్ 2019, గురువారం

మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో


మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో
హరినామము నాశ్రయించ వైతి విప్పుడు

ఎత్తి నట్టి జన్మంబు లిన్నిన్ని యనరాదు
తిత్తు లన్నింటను తెలివిడి లేమి
యెత్తి చూపించ దగిన యేకైక లక్షణము
నెత్తి నించుకంత తెలివి నిలచె నీ నాటికి

దొరకిన యీ జన్మమందు దొరుకక దొరకిన
యరుదైన తెలివిడి యన్నట్టి నిధిని
నరుడు వృధా చేసిన నాశన మగుగాక
మరల నరుం డగునట్టి మాటెంత నిజమో

హరేరామ హరేకృష్ణ యనుటేమి కష్టము
నరుడా హరికృప యమిత సులభము
పరమాత్ముని నామ మిపుడు పలుకకున్నచో
మరుజన్మము నందు పలుకు మాటెంత నిజమో

వీనుల విందుగా వినిపించనీ


వీనుల విందుగా వినిపించనీ
జానకీరాముడా సర్వవేళల

శ్రీనాథనామావళి శ్రేష్ఠంబగు నట్టిదౌ
ధ్యానముద్రలో శివుడు తడవుచుండు నట్టిదౌ
మౌనుల రసనలపై మసలుచుండు నట్టిదౌ
నీ నామకీర్తనము నీ భక్తులకు

యోగిరాజప్రస్తుతమై యొప్పుచుండు నట్టిదౌ
భోగీంద్రుడు వేనోళ్ళ పొగడుచుండు నట్టిదౌ
సాగరపుబిందువుల సంఖ్యదాటు నట్టిదౌ
నీగుణకీర్తనము నీభక్తులకు

యావత్ప్రపంచసృష్టి కాదిమూలమైనదౌ
యావత్ప్రపంచంబున కాధారమైనదౌ
భావనాతీతమై పరగుచుండు నట్టిదౌ
నీ విభవకీర్తనము నీభక్తులకు

హరిని వదలకున్నచో నదియే చాలు


హరిని వదలకున్నచో నదియే చాలు
తరియించగ నరుడ నీ కదియే చాలు

హరిచింతన కలిగియున్న నదియే చాలు
హరిభక్తుల చేరుచున్న నదియే చాలు
హరి హరి హరి యనుచుండిన నదియే చాలు
హరినామము రుచిమరగిన నదియే చాలు

హరికథలను చదువుచున్న నదియే చాలు
హరిలీలల తడవుచున్న నదియే చాలు
పరమాత్ముడు రామునిపై భక్తియె చాలు
హరిదయామృతము కొంచ మదియే చాలు

హరి కీర్తన లాలకించ నదియే చాలు
హరికీర్తన లాలపించ నదియే చాలు
హరినామగుణ కీర్తన మదియే చాలు
హరేరామ హరేకృష్ణ యనుటే చాలు


12, జూన్ 2019, బుధవారం

నిన్ను పొగడువారితో నిండెను నేల


నిన్ను పొగడువారితో నిండెను నేల రా
మన్న నీ యశము నిండె నన్నిదిక్కుల

సురలునరులు పొగడ నీవు హరుని వింటిని
విరచి మా సీతమ్మను పెండ్లాడితివి
సురలునరులు పొగడ రాజ్యసుఖములు నీవు
పరగ తండ్రిమాటకై వదలుకొంటివి

సురలునరులు పొగడ నీవు జొచ్చియడవుల
పరిమార్చితి వెందరో సురవిరోధుల
సురలునరులు పొగడ లంకజొచ్చితి వీవు
పరదారాహరణు రావణు జంపితివి

సురలునరులు పొగడు ధర్మమూర్తివి నీవు
హరి యచ్యుత భక్తలోకపరిపాలక
సురలునరులు పొగడు నిన్ను శరణు జొచ్చితి
కరుణించుము నరనాయక వరదాయక

8, జూన్ 2019, శనివారం

భజన చేయరే రామభజన చేయరే


భజన చేయరే రామభజన చేయరే రామ
భజనయే భవరోగము బాపెడి మందు

అణిమాదిసిధ్ధులుండి యణచలేని రోగము
మణిమంత్రౌషధములు మాన్పలేని రోగము
గుణగరిష్ఠులను గూడ గుటాయించు రోగము
వణకు రామభజనకు భవరోగము

హేయమైన యుపాధుల నిరికించు రోగము
వేయిజన్మ లెత్తినా వదలనిదీ రోగము
మాయదారి రోగము మందులేని రోగము
పాయు రామభజనచే భవరోగము

ప్రజలనెల్ల హింసించే భయదమౌ రోగము
సుజనకోటి నేడ్పించు క్షుద్రమైన రోగము
నిజభక్తుల కాచెడు నియమమున్న రాముని
భజన చేయ విరుగునీ భవరోగము

పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ


పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ రా
మన్న భజన కందర కాహ్వాన ముందండీ

పాడగల వాళ్ళందరు పాడవచ్చండీ
వేడుకతో మీపాటలు వినిపించండీ
ఆడామగా తేడా యేమానందముగా
కూడి రామకీర్తనలు పాడుకొందము

విజ్ఞులు విబుధులు వేదాంతజ్ఞులు
అజ్ఞానము తొలగ రామవిజ్ఞానమును
ప్రజ్ఞమీఱ పాడగా వారితో కలయుటే
సుజ్ఞానప్రదము కదా సుజనులారా

ఏమండీ మేము పాడలేమందురా
రామవైభవము చూడ రావచ్చుగా
ఈమంచి తరుణమున రామచంద్రుని
కామితార్ధప్రదుని వేడ రావచ్చును

భజనచేయ రండయ్యా భక్తులారా


భజన చేయ రండయ్యా భక్తులారా రామ
భజన చేసి పొందండి పరమానందం

మనమధ్యనె వెలసినాడు మనవాడు రాముడు
మనధ్యనె తిరిగినాడు మనవాడు రాముడు
మనకష్టము లెఱిగినట్టి మంచివాడు రాముడు
మనము కొలువ దగినట్టి మనదేవుడు రాముడు

మన లోపము లెంచనట్టి మంచివాడు రాముడు
మన పాపము లెంచనట్టి మంచివాడు రాముడు
మనసార శరణంటే మన్నించును రాముడు
మనబాధలు తీర్చునట్టి మనదేవుడు రాముడు

రామభజన చేయువారి రాగరోగ మణగును
రామభజన వలన పొందరాని భాగ్యము లేదు
రామభజన వలన మోక్షరాజ్యమే లభించును
రామభజన చేయుదము రండి సుజనులారా

7, జూన్ 2019, శుక్రవారం

రండి రండి జనులారా రామభజనకు


రండి రండి జనులారా రామభజనకు కో
దండరామస్వామి వారి దయ దొరకేను

అంతులేని మహిమ గల ఆనందరాముని
గొంతెత్తి కీర్తించ గుమిగూడండి
చింతలన్ని తీర్చునట్టి శ్రీరాముని బుధ్ధి
మంతు లందరు గూడి మనసార పొగడండి

అయినవారు కానివార లని లేదు రామునకు
దయజూచు నందరను ధర్మప్రభువు
జయజయ శ్రీరామ జానకీ రామయని
వియత్తలమే మ్రోయ వేడ్కతో పొగడండి

రాముడే వెన్నుడు బ్రహ్మాండనాయకుడు
రాముడే మొక్షసామ్రాజ్య మిచ్చు
రాముడే సర్వలోకరక్షణాదక్షు డండి
రాముని భక్తిమీఱ రమ్యముగ పొగడండి