31, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 123

తే.గీ. తనను పెనగొని నిదురించు తరుణమందు
కలను రావణు గనినంత కలగి లేచి
చాల రోషించు స్వామిని చల్లబరచు
తల్లి సీతమ్మ మము దయదలచు గాక

(వ్రాసిన తేదీ: 2013-5-20)

30, మే 2013, గురువారం

పాహి రామప్రభో - 122

తే.గీ.  ఆ యయోధ్యాపురమున శుధ్ధాంతకాంత
లమితముదమున మధ్యాహ్న సమయమందు
చిలుకలకు రామశబ్దంబు చెప్ప వినుచు
పులకరించెడు సీతమ్మ ప్రోచుగాక

(వ్రాసిన తేదీ: 2013-5-20)

29, మే 2013, బుధవారం

పాహి రామప్రభో - 121

తే.గీ. ఆ అయోధ్యను రత్నసింహాసనమున
నగవులీనుచు కొలువుండి జగములేలు
విమలచరితులు త్రైలోక్యపితరులైన
జానకీరాములను నేను సన్నుతింతు

(వ్రాసిన తేదీ: 2013-5-19)

28, మే 2013, మంగళవారం

పాహి రామప్రభో - 120

తే.గీ. ఆ యయోధ్యను వేడ్కతో నమ్మవారి
గూడి యుద్యానవనముల నాడి పాడి
తూగుటూయల లూగుచు తోచు రామ
చంద్రు కడుభక్తితో మనసా స్మరింతు

(వ్రాసిన తేదీ: 2013-5-18)

27, మే 2013, సోమవారం

పాహి రామప్రభో - 119

ఆ.వె. ఆ యయోధ్యలోన నంతఃపురంబున
భర్మహర్మ్యమందు పడతి సీత 
గూడి విశ్రమించి వేడుకతో‌ భక్త 
కోటి నేలు రామగురుని దలతు

(వ్రాసిన తేదీ: 2013-5-19)

26, మే 2013, ఆదివారం

పాహి రామప్రభో - 118

ఆ.వె. లోకజనని సీత లోకేశ్వరుడు రామ
భూవరుండు వారి పుర మయోధ్య
యనగ భువిని వెలసి నట్టి వైకుంఠంబు
దేవగణము లందు దిరుగు ప్రజలు

(వ్రాసిన తేదీ: 2013-5-19)

25, మే 2013, శనివారం

పాహి రామప్రభో - 117

మ. మరియాదం బురుషోత్తముండయిన రామస్వామి చారిత్ర్యమున్
సురలున్ సిధ్ధులు సాధ్యులున్ నరులు యక్షుల్ కిన్నరుల్ పన్నగుల్
పరమామ్నాయముగా దలంచుటను సంభావించి మచ్చిత్తమున్
స్థిరభక్తిం గొని కొల్తు రామపదరాజీవంబులన్ నిచ్చలున్

(వ్రాసిన తేదీ: 2013-5-18)

24, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 116

ఆ.వె. ఆర్షధర్మమునకు శీర్షమ్ము రాముడు
సద్గుణములచే జగద్గురుండు 
పురుషులందు పరమపురుషుండు రాముడు
దేవతలకు గూడ దేవు డతడు

(వ్రాసిన తేదీ: 2013-5-17)

23, మే 2013, గురువారం

పాహి రామప్రభో - 115

తే.గీ. ఉదయమున లేచి రాముని మది దలంచి
దైనికంబుల రాముని దయను దీర్చి
ఫలము లర్పించి రాముని పాదములకు
బుధుడు నిదురించు రాముని పొగడుకొనుచు 

(వ్రాసిన తేది: 2013-5-13)

22, మే 2013, బుధవారం

పాహి రామప్రభో - 114

తే.గీ. కాకి పొందెను చచ్చిన గ్రద్ద పొందె
నెలుగులును పొందె కోతిమూకలును పొందె
బుల్లి యుడుతయు నీ కృప పొందె నింక
నీ నరమృగంబునుం బొంద నిమ్ము రామ

(వ్రాసిన తేదీ: 2013-5-12)


21, మే 2013, మంగళవారం

పాహి రామప్రభో - 113

తే.గీ. రామకోవెల కల దెల్ల గ్రామములను
గ్రామముల నిండి రామభక్తాళి గలదు
వారి భజనలలో చేరి వాయుసుతుడు
మైమరచి పాడుచుండును రామచంద్ర

(వ్రాసిన తేదీ: 2013-5-12)

20, మే 2013, సోమవారం

పాహి రామప్రభో - 112

చం. అనిశము చంద్రశేఖరుడు నద్రిజయుం గొనియాడు మంత్రమై
మునిజన మెల్లవేళలను పొల్పుగ గొల్చెడు మూలమంత్రమై
వినయ గుణాన్వితుల్ పరము వేడెడు జ్ఞానుల ధ్యానమంత్రమై
నను దయజూచు రామజననాధుని నామము వెల్గు నెప్పుడున్

(వ్రాసిన తేదీ: 2013-5-11)


19, మే 2013, ఆదివారం

పాహి రామప్రభో - 111

ఉ. సారపు ధర్మమిట్టిదని చక్కగ నిధ్ధర చాటువాడనన్
వీఱిడి యైన వాని యెద వెండి వివేకము నింపువాడనన్
మారని దుష్టబుధ్ధులకు మారకుడై చెలరేగువాడనన్
శ్రీరఘురాము నెల్లరును చిత్తములో దలపోయు డెప్పుడున్

(వ్రాసిన తేదీ: 2013-5-10)

18, మే 2013, శనివారం

పాహి రామప్రభో - 110

చం. అరయగ నీ ప్రపంచమున నందఱ కంటెను భాగ్యశాలు లె
వ్వరు రఘువీరు భక్తులగు వారలు కాక సమస్త సంపద
ల్గురియుచు నెల్ల భక్తులకు గొబ్బున రాముడు మోక్షమీయగం
దరచుగ వారు సర్వులకు దద్దయు పూజ్యులుగం జెలంగగన్

(వ్రాసిన తేదీ: 2013-5-9)
17, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 109

చం. కలిమియు లేమియుం గలవు కష్టసుఖంబులు మంచిచెడ్డలుం
గలవు వెలుంగు చీకటులు గౌరవలభ్యత మానహానులుం
గల విటువంటి ద్వంద్వముల కన్నిటి కాకరమైన సృష్టి కా
వల గల డెల్ల ద్వంద్వముల భావన మాన్పెడు రామచంద్రుడున్

(వ్రాసిన తేదీ: 2013-5-9)

16, మే 2013, గురువారం

పాహి రామప్రభో - 108

చం. పలత మాని రాము నెద చక్కగ నేను భజించు టెన్నడో
ఉపరతి నుండి శ్రీవిభు ననూనతపంబున గొల్చు టెన్నడో
తపము ఫలించి రామవిభు దర్శన మన్నది కల్గు టెన్నడో 
అపుడు భవాబ్ధి దాటి పరమాత్ముని చేరెద నిశ్చయంబుగన్

(వ్రాసిన తేదీ: 2013-5-8)15, మే 2013, బుధవారం

సకల మదాది దుర్విషయ

చం. సకల మదాది దుర్విషయ శాంతికి రాముని నామ ముండగన్
సకల భయాపహం బయిన శస్త్రము రాముని నామ ముండగన్
సకలరుజాంతకౌషధము చక్కని రాముని నామ ముండగన్
వికలత గల్గబోదు రఘువీరుని భక్తుల కెన్నడేనియున్

(వ్రాసిన తేదీ: 2013-5-8)

14, మే 2013, మంగళవారం

విద్యల కేమి నేర్వదగు

ఉ. విద్యల కేమి నేర్వదగు విద్య లనేకము లున్న వుర్వి నా
విద్యల కెల్ల పేరుగల విద్య యనం బడు నాత్మవిద్య
ద్విద్యను నేర్వ కష్టమని భీతి నేటికి రామమంత్రమా
విద్యనుగ్రహించు నని విజ్ఞులు చెప్పగ విందు నెప్పుడున్ 


(వ్రాసిన తేదీ: 2013-5-7)

13, మే 2013, సోమవారం

హరివీరుల్ భవదీయ

మ. హరివీరుల్ భవదీయ పక్షమున పోరాడంగ నవ్వార లం
రు ప్రాణంబులతోడ నుండిరి తుదిన్ తద్దైత్యు పక్షంబు వా
రరయన్ కోట్లకు కోట్లు చచ్చిరి మహాత్మా రామచంద్ర ప్రభూ
మరి నీ వారల కెల్లవేళలను సేమంబే గదా నీ కృపన్

(వ్రాసిన తేదీ: 2013-5-7)

12, మే 2013, ఆదివారం

రామచిలుక

ఆ.వె. రామచిలుక యెవని రమ్యహృత్పంజర
మందు నిలచి కులుకు నట్టి వాని
రామజోగి యందు రామహాత్ముని యొద్ద
ప్రకృతి చేయు మాయ పారబోదు

(వ్రాసిన తేదీ: 2013-5-7)

11, మే 2013, శనివారం

రాముని వేడ నేమిటికి

ఉ. రాముని వేడ నేమిటికి రాళ్ళును రప్పల వంటి సంపదల్
రాముని వేడ నేమిటికి రాజ్యపదంబుల వంటి తుఛ్ఛముల్ 
రాముని వేడ నేమిటి కరాతిజయంబుల వంటి స్వల్పముల్
రాముని వేడ రేమిటికి రమ్యతమంబగు నట్టి మోక్షమున్

(వ్రాసిన తేదీ: 2013-5-7)

10, మే 2013, శుక్రవారం

భగవద్భక్తులు మౌనులై

మ. భగవద్భక్తులు మౌనులై యునికి సర్వార్థంబులం గూర్చు ని
జ్జగమం దారయ వేయి కొక్కరయినం సద్భక్తులే దుర్లభం
బగుటన్ పామరులాడు మాటలకు మారాడంగ భక్తాళికిన్
తగదా దాశరథిం దలంచ తడే దండించు దుర్మార్గులన్

(వ్రాసిన తేదీ: 2013-5-7)  

9, మే 2013, గురువారం

హృదయము నిచ్చి రామునకు

చ. హృదయము నిచ్చి రామునకు నెల్ల విధంబుల రామదాసులై
సదయుని తోడిదే జగము సర్వము రామమయం బటంచు నె
మ్మది ధరనుండు వారనగ మాధవు సత్కృపచేత మోక్షసం
పదకు విశేషపాత్రులగు వారలు వారికి నేను మ్రొక్కెదన్

(వ్రాసిన తేదీ: 2013-5-7)

8, మే 2013, బుధవారం

సుందరులందు సుందరుడు

పాఠకభక్తమహాశయులారా,

   ఈ క్రింది పద్యంతో ఒక వంద పద్యాలు సంపన్నం అవుతున్నవి.
   నా యీ చిరుప్రయత్నాన్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ కందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
   నేను చెప్పుకోదగ్గ తెలుగుపండితుడను కాని కవిని కానీ కాను.
   మందః కవి యశః ప్రార్థీ అని యేదో భగవంతునిపై నా చేతనయిన కవిత్వం చెప్పాలని ప్రయత్నిస్తున్న వాడిని మాత్రమే!
   నా అజ్ఞానం వలన పద్యాలలో రకరకాల దోషాలు దొర్లుతూ ఉంటాయి.
   వాటిని గమనించిన వారు దయచేసి తమ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పక తెలియజేప్రార్థన.
   తప్పులు దిద్దుకుందుకు నాకు యేవిధమైన బేషజమూ లేదు. తప్పక దిద్దుకుంటాను.

   నిజానికి శ్రీరామనవమి వరకూ యెన్నయితే అన్ని పద్యాలు వ్రాసి ముగించాలని భావించాను.
   కాని ఆపటం నాకు అశక్యం అయిన విషయంగా తోచినది.
   పాఠకులలో కొందరు యీ ప్రయత్నాన్ని అబినందించి కొనసాగించ వలసినదిగా అడగటం కూడా జరిగింది.
   అందుచేత యథాశక్తి యీ ప్రయత్నాన్ని కొనసాగించ దలచుకున్నాను.
   ఎన్నాళ్ళు వ్రాయగలనో అన్నది అది దైవనిర్ణయం. నాచేతిలో యేమీ లేదు.
   ఇలా చేయటం అందరికీ అమోద యోగ్యమే అని భావిస్తున్నాను.
   ఇక 100వ పద్యాన్ని తప్పక చదవి ఆనందించండి.

ఉ. సుందరులందు సుందరుడు శుభ్రయశస్కుడు భక్తకోటికిన్
బందుగులందు బందుగుడు ప్రాణసఖుండును రామమూర్తి హృ
న్మందిరమధ్యమందు కరుణన్ వెలుగొందుచు నుండు జానకీ
సుందరిగూడి లక్ష్మణయశోధన వాయుకుమార సేవ్యుడై

(వ్రాసిన తేదీ: 2013-5-7)


7, మే 2013, మంగళవారం

ఇదింకా బాగుంది

ఇదింకా బాగుంది
      అందరికీ నువ్వేల సమస్యవో తెలియదు
ఇంత పెద్ద సృష్టికి
      యెందుకు పూనుకున్నావో తెలియదు
అంతులేని సమస్యల
      వింతప్రకృతి మాయగోలేమిటో తెలియదు
అంతు తెలుసుకో
      చెంత చేరమనే పంతమెందుకో తెలియదు

నన్నడిగి నువ్వు
      నన్ను సృష్టించలేదనేది బాగా తెలుసును
నిన్ను నిలదీసినా
      యెన్నడూ జవాబు రాదని కూడా తెలుసును
ఎన్నడూ నీ‌ జాడ
      మన్నూ‌ మిన్నుల మధ్య దొరకదని తెలుసును
అన్నీ తెలిసినా
       నిన్ను వెదకటం‌ నేను మాన లేననీ తెలుసును

ఇదింకా బాగుంది
      వదలకుండా నీ కోసం వెదుకుతూనే ఉన్నా
పదిలంగా యెక్కడో
      మెదలకుండా నువ్వు మౌనం గానే దాగున్నా
అదంతే లెమ్మని
       హృదయంలో నిత్యం సరిపెట్టుకుంటునే ఉన్నా
అదోమిటో మరి
       వదలకుండా నిన్ను అనుక్షణం ప్రేమిస్తూనే ఉన్నా

ఇదింకా బాగుంది!

6, మే 2013, సోమవారం

జానువు లంటు బాహువుల

ఉ. జానువు లంటు బాహువుల చక్కని చామనచాయ మే స్మే
రాననమందు శ్రోత్రముల నంటెడు తామర లట్టి కన్నులన్
జ్ఞానవిలాసరూప మగు చల్లని నవ్వున శుధ్ధమోక్షల
క్ష్మీనిజవాసమైన పదసీల రామయతండ్రి యొప్పెడున్

(వ్రాసిన తేదీ: 2013-5-3)

5, మే 2013, ఆదివారం

బ్రతుకుము రామచంద్రు వలె

చ. బ్రతుకుము రామచంద్రు వలె పాయక ధర్మము నెల్ల వేళలన్
బ్రతుకగ రాదు రావణుని భంగిని గొల్చుచు నర్థకామముల్
సతతము ధర్మనిష్ఠ గల సజ్జను చేరును మోక్షలక్షియున్
మతిచెడి యర్థకామముల మానక గొల్చిన నారకం బగున్

(వ్రాసిన తేదీ: 2013-5-1)

4, మే 2013, శనివారం

దేవతలార మీర లిడు

ఉ. దేవతలార మీర లిడు దివ్యవరంబుల గొప్పయేమి యే
దేవుని పాదపద్మముల తీరుగ నెప్పుడు మీరు గొల్తు రా
దేవుడు రామచంద్రుడు విదేహసుతాపతి నా జనించి భ
క్తావళి కెల్ల మోక్షమిడగా ధృఢదీక్ష వహించె నొప్పుగన్

(వ్రాసిన తేదీ: 2013-4-30)

3, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో -096

శా. భద్రాద్రీశ్వర రామచంద్ర శుభదా వాత్సల్యముం జూపి యీ
క్షుద్రుం పాపవిమోహమూర్ఛితు దయాశూరుండవై బ్రోచుటన్
ఛిద్రంబయ్యెను సర్వపాపములు నా చిత్తంబులో చక్కగా
ముద్రింపబడె మీదు మూర్తి యిక షడూర్ముల్ దీరె శాంతించితిన్ 

(వ్రాసిన తేదీ: 2013-4-29)

2, మే 2013, గురువారం

తనకొక నొవ్వుపుట్ట


చ. తనకొక నొవ్వుపుట్ట మరి తా గొను మందుగ రామనామమున్
వెనుక ప్రశాంతితో‌ నలరి వేడుక గైకొను రామనామమున్
తనరు సుఖాప్తివేళలను తప్పక గొల్చుచు రామనామమున్
మనసిది రామనామమును మానదు మానదు మానదెన్నడున్

(వ్రాసిన తేదీ: 2013-4-28)


 

1, మే 2013, బుధవారం

మీనంబవై యబ్ధిలోన

సీ. మీనంబవై యబ్ధిలోన డాగిన సోమ
      కుని పరిమార్చిన ఘనుడ వీవె
కమఠంబవై పాలకడలిలో మంధ
      మును దాల్చి నిలిపిన ఘనుడ వీవె
యజ్ఞవరాహదివ్యాకృతి నిల బ్రోచి
      కనకాక్షు జంపిన ఘనుడ వీవె
నరమృగాకృతి హిరణ్యశిపు జీల్చి లో
      కంబుల బ్రోచిన ఘనుడ వీవె
తే.గీబలిని యాచించి యణచిన వటువు వీవె
రాచకులమును బలిగొన్న రాముడవును
ఆది నారాయణుండవు నరయ నీవె
రావణాంతక నా తండ్రి రామచంద్ర

(వ్రాసిన తేదీ: 2013-4-27)