28, జూన్ 2021, సోమవారం

రామరామ... రఘురామ

రామరామ జయజయ రామ జయజయ రామ రఘురామ
రామరామ త్రిజగద్రక్షక త్రిలోకపావన రఘురామ

రామరామ సురగణసేవిత శ్యామలాంగ హరి రఘురామ
రామరామ శ్రీమద్దశరథరాజనందన రఘురామ

రామరామ జయజయ సీతారామ ధనుర్ధర రఘురామ
రామరామ దానవవంశవిరామ జయజయ రఘురామ

రామరామ రమ్యగుణార్ణవ రాజలలామ రఘురామ
రామరామ శ్రీమదయోధ్యారాజేంద్రా హరి.రఘురామ

రామరామ యోగీంద్రగణారాధితనామ రఘురామ
రామరామ నారదాదిమునిరాజ సన్నుత రఘురామ

రామరామ భండనభీమ రాజీవానన రఘురామ
రామరామ భక్తజనాశ్రయ కామితవరద రఘురామ

రామరామ భవభయవారణనామా జయజయ రఘురామ
రామరామ జయజయ శంకరబ్రహ్మాదినుత.రఘురామ




24, జూన్ 2021, గురువారం

నారాయణ హరి నమోస్తుతే

శ్రీరామచంద్ర నమోస్తుతే నారాయణ హరి నమోస్తుతే
భూరికృపాళో నమోస్తుతే పుణ్యచరిత్ర నమోస్తుతే

కారణకారణ కమలవిలోచన నారాయణ హరి నమోస్తుతే
నారదాదిమునినాయకసన్నుత నారాయణ హరి నమోస్తుతే
ధారాధరఘనశ్యామలవపుష నారాయణ హరి నమోస్తుతే
శ్రీరఘునందన సీతారమణ నారాయణ హరి నమోస్తుతే

నానాదైత్యవిదారణదీక్షిత నారాయణ హరి నమోస్తుతే
నానాలోకశుభస్థితికారణ నారాయణ హరి నమోస్తుతే
నానాదేవగణార్చితవైభవ నారాయణ హరి నమోస్తుతే
జ్ఞానస్వరూప రాఘవరూప నారాయణ హరి నమోస్తుతే

త్రిజగద్వంద్య నారాయణ హరి దేవాధిదేవ నమోస్తుతే
సుజనసేవిత నారాయణ హరి శోకవిదారణ నమోస్తుతే
భజితభక్తగణ నారాయణ హరి పావననామ నమోస్తుతే
విజయరాఘవ నారాయణ హరి వీరవరేణ్య నమోస్తుతే




19, జూన్ 2021, శనివారం

ఇంతకంటె చెప్పగ నేమున్నది

ఇంతకంటె చెప్పగ నేమున్నది
పంతగించి కాదని పలుకకండి

చేయండీ సులువైన శ్రీరామ నామము
చేయరా తప్పునా ఆ యమదరిసెనము
మూయండి కామాది మ్రుచ్చులకు తలుపులు
మూయరా తప్పునా ముందెన్నో జనమలు

పాడుడీ శ్రీరామ భజనసంకీర్తనములు
పాడరా పోవునా పాపాలు శాపాలు
వేడండి శ్రీరామ విభునింక శరణము
వేడరా మిమ్మేల వీడు భవబంధము

నమ్మండి శ్రీరామనాథుని మహిమమును
నమ్మరా మాయలో నలిగిపోయేరు
ఇమ్మహి రామనామ మేభవతారకము
సుమ్మని తెలియదా సుఖమేమి లేదు

ఇతడే శ్రీరాముడై

ఇతడే శ్రీరాముడై యినకులాబ్ధి సోముడై
మానిత శోభలను వెలుగు మన విష్ణుదేవుడు

వైకుంఠపురధాముడు పరంధాము డితడే
లోకస్థితికారకుడగు శ్రీకాంతు డితడే
తేకువ దైత్యాళి బట్టి తెగవేయు నీతడే
శ్రీకరుడై భక్తాళికి చింతలణచు నీతడే

సోమకుని హిరణ్యాక్షుని హేమకశిపుని
కాముకు రావణుని పాడు కంస శిశుపాలుర
ధీమంతుడై దక్షిణ దిక్కుపట్టించెను
తామస రహితులకు దిక్కు తానాయె నితడే

చేతోమోదమును గలిగి శ్రీరామ రాఘవేంద్ర
సీతారామ అనగానే చింతలన్ని బాపుచు
ప్రీతితోడ మంచివారి విడువకుండు నితడే
రాతిరి యగు పవలగు రక్షించు నీతడే








15, జూన్ 2021, మంగళవారం

ఇంత తామసమైతే

ఇంత తామసమైన నెట్లు తాళుదునయ్య
చింతాయె నీతీరున సీతారామ

రామచంద్రాయని ప్రేమగా పిలిచితే
ఏమీ మాట్లాడ విప్పు డేమిచేయుదు
స్వామీ నీవాడనని చక్కగా తెలిపితే
నామోమే చూడవాయె నేమిచేయుదు

నామనోరమణ నిను నమ్మి సేవించితే
నామనసే కనుగన విపుడేమి చేయుదు
నీమముతో నీనామము నిచ్చలును పలికినా
ఏమీ కరుణించ విప్పు డేమిచేయుదు

చక్కగ నీకు నే సద్భక్తుడ నైయుండ
ఇక్కట్లు కల్పించితి వేమిచేయుదు
మ్రొక్కినా ఏడ్చినా మొఱలు వినకున్నా విం
కెక్కడికి పోవువాడ నేమిచేయుదు










ఏమయ్యా ఏమి బ్రతు కెందులకీ బ్రతుకు

ఏమయ్యా ఏమి బ్రతు కెందులకీ బ్రతుకు 
పామరత్వపు బ్రతుకు పాటిగంప

చిరకాల ముండినా చింతలతో క్రుంగుచు
మరి యట్టి దేమిబ్రతుకు మట్టిగడ్డ
పొరపాట్లు చేయుచు బుడబుడ యేడ్చుచు
మరియాద లేని బ్రతుకు మట్టిగడ్డ

క్షణక్షణము చచ్చుచు చాలయేండ్లు బ్రతికినా
మనిషి పొందునదేమి మట్టిగడ్డ
ధనములకై తిరుగుచు తాపమును పొందుచు
మనిషి మూటగట్టేది మట్టిగడ్డ

వీరివారి నడుగుచు వేయేండ్లు బ్రతికినా
మారునా బ్రతుకుతీరు మట్టిగడ్డ
శ్రీరాముని నమ్ముకొని జీవన్ముక్తుండుగా
మారలేని దేమి బ్రతుకు మట్టిగడ్ద


అందగాడు బాలరాముడు

అందగాడు బాలరాము డందమైన చిరునగవులు
చిందించుచు కైకమ్మను చేరిపలికె నిటుల

అరిగితివట రణముల కమ్మరో నీవు
శరముల విసరితివట చాల గొప్పగా
మరి నాకు నేర్పవా శరవిద్యను
తిరుగులేని విలుకానిగ తీర్చిదిద్దవా

పెరిగి పెద్దవాడనై వీరరాఘవుడనై
పరిపంథివీరులను భండనంబుల
పరిహరించ వలయును శరములేసి
ధరనేలవలయును ధర్మపరుడనై

హరియంత వాడనై యసురారి నగుదు
మరి నాకు నేర్పవా మంచివిద్యను
ధరనెల్ల రక్షించ చిరయశమబ్బు
గురువై నీవిచ్చిన గొప్పవిద్యచే

14, జూన్ 2021, సోమవారం

సంతోషము రామచంద్ర జరిగిన దానికెల్ల

సంతోషము రామచంద్ర జరిగిన దానికెల్ల
సంతోష మిక ముందు జరుగు దానికిని

ఈ  నరునిగ జన్మ మిదే యెంతో సంతోషము
యీనాటికి భక్తికలిగె నెంతో సంతోషము
ఈనాలుక నీనామము నూనె సంతోషము
దానికి నీమెప్పు కలిగె తద్దయు సంతోషము

పాపములు తొలగె నదే పరమసంతోషము
కోపతాపములడగె గొప్ప సంతోషము
దీపించెను శాంతిలోన దీనికి సంతోషము
నీపరమకృప యదే నిజమగు సంతోషము

భువిని మరలపుట్టుమన్న పుట్టుట సంతోషము
చివరిజన్మ మిదియన్నను చిత్తము సంతోషము
చివరికీ జీవుడు నిను చేరుట సంతోషము
వివరముగ చెప్పితిని వింటివి సంతోషము


11, జూన్ 2021, శుక్రవారం

ఇంతంటే చెప్పుకొనగ నేమున్నదిరా

ఇంతంటే చెప్పుకొనగ నేమున్నదిరా యీ
చింతలతో జీవితమే చితికిపోయెరా
 
దుష్టులతో‌ కలసి తిరిగి దుష్టబుధ్ధి నైతిరా
శిష్టుడనని చెప్పుకొనగ సిగ్గు వచ్చురా
యిష్టమైన నీకృపామృత మించుకంత యిచ్చి యీ
కష్టాత్ముని బ్రోవదగును కమలేక్షణా

నిన్ను తెలుపు విద్య లేమి నేను నేర్వనైతిరా
యిన్ని నేర్చినాననగ నేమున్నవిరా
నిన్నే నమ్ము కొంటి గాన నించుకంత దయచూపి
నన్ను బ్రోవదగునయ్యా నారాయణా

మంచినడత నేర్వనైతి మంచిపనులు చేయనైతి
మంచివారి గొల్వనైతి మరి బ్రతుకెల్ల
కొంచెపుబుధ్ధి కలిమి కొంచెపువారి వెలిమి
వంచితమై చెడెను రామ పావన నామా

శ్రీరామ యనవలె శ్రీరామ యనవలె

శ్రీరామ యనవలె శ్రీరామ యనవలె వేరుమాటల నింక విడిచియుండగ వలె
శ్రీరామ జపమున సిధ్ధిపొందుట చాలు నారాయణుడు మెచ్చునట్టిదా తీరు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని కాక నోరార వేరేమి పలికేది పలికి
నోరేల చేదుగా చేసేది అపైన తీరి కూర్చుని చాల వగచేది

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుటలో చిత్తమందున హాయి పుట్టేను రామ
తారకంబున కున్న మహిమాతి శయముచే శ్రీరామ దర్శనం బయ్యేను

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనువాని చిత్తమందున రాము డుండేను వాడు
దారి చక్కగజూపి భవమహావార్నిధి తరియింపగా జేసి బ్రోచేను

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పల్క మోక్షద్వారము స్వాగతించేను మరల
ధారుణీతలమందు తనకు పుట్టువు లేక శ్రీరామ సాన్నిధ్య ముండేను

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని కాక నోరార వేరేమి పలికేది పలికి
నోరేల చేదుగా చేసేది అపైన తీరి కూర్చుని చాల వగచేది

10, జూన్ 2021, గురువారం

ముక్కుమీద కోపాలయ్య

ముక్కుమీద కోపాలయ్య ముద్దుముద్దు లచ్చుమయ్య
చక్కనయ్య రామానుజ సౌమిత్రీ  మెచ్చితినయ్య

అన్నతోడు లేక బువ్వ లారగించ నంటావయ్య
అన్నవెంట తిరిగే ఓ రామానుజయ్య
ఎన్నగాను తమ్ముడంటే ఇలమీద నీవేనయ్య
నిన్నుమెచ్చె కైకమ్మ నిశ్చయంబుగ

అన్నతోనె గాక నీవే ఆటలాడ నంటావట
అన్నచెప్పి నట్టులాడే అనుజడవయ్య
అన్నగారు శాంతపూర్ణు డనుజడేమొ కోపనుడట
అన్నమాట నాగస్వర మౌనట నీకు

అన్నిటికి నన్న యాయె అన్నతోడి లోకమాయె 
అన్నా నీదు రామభక్తి అబ్బుర మయ్యా
చిన్నారి లచ్చుమయ్య శేషాంశపూర్ణయ్య
నిన్ను విడచి రామచంద్రు డెన్న డుండడు


కౌసల్య కొడుకువేరా

కౌసల్య కొడుకువేరా కన్నా నీలో
కౌసల్య చక్కగా కనుపించేరా

కౌసల్య నడకలనే కనవచ్చు నీలో
కౌసల్య సుకుమారము కనవచ్చు నీలో
కౌసల్య లావణ్యము కనవచ్చు నీలో
కౌసల్య పోలికలే కనవచ్చు నీలో

కౌసల్య దయాగుణము కనవచ్చు నీలో
కౌసల్య పెద్దరికము కనవచ్చు నీలో
కౌసల్య ఓరిమియే కనవచ్చు నీలో
కౌసల్య శాంతగుణము కనవచ్చు నీలో

కైకమ్మ పెంపకమున గడుసుదనము నేర్చి
కైకమ్మ మంకుతనము కాస్తంత నేర్చి
కైకమ్మ ధీరగుణము ఘనముగా నేర్చి
లోకాన వెలుగు రామ లోకాభిరామ




భజభజ రామమ్

భజభజ రామమ్ భజభజ రామమ్
భజభజ రామమ్ వైకుంఠేశం 

భజ రఘునాథమ్ పావనచరితమ్
భజ రఘునాథమ్ భండనభీమమ్
భజ రఘునాథమ్ బంధవిదారమ్
భజ రఘునాథమ్ భజభజ రామమ్

భజ రఘునాథమ్ పరమదయాళుమ్
భజ రఘునాథమ్ పరమపవిత్రమ్
భజ రఘునాథమ్ పరమ ప్రశాంతమ్
భజ రఘునాథమ్ భజభజ రామమ్

భజ రఘునాథమ్ పరమోదారమ్
భజ రఘునాథమ్ పరమానందమ్
భజ రఘునాథమ్ పట్టాభిరామమ్
భజ రఘునాథమ్ భజభజ రామమ్

9, జూన్ 2021, బుధవారం

ఆటలాడు బాలుడా అందాలరాముడా

ఆటలాడు బాలుడా అందాలరాముడా
సూటిగా బాణమేసి చూపవయ్యా

ఎగురుచున్న పక్షినే ఇపుడు కొట్టమందువా
తగనికార్య మదిసుమా దశరథాత్మజా
తగనిపని ఎటులాయె తల్లీ కైకమ్మా
తగదు వినోదార్ధమై దండించుట కొడుకా

చెట్టుమీద బాణమేసి కొట్టమందువా
చిట్టచివరి రెమ్మపై చిన్నికాయనే
కొట్టరాదు కసుగాయను కొడుకా ఎన్నడును
కొట్టదగిన దొక్క మంచిగురిని చూపవమ్మా

పిట్టబొమ్మ నొకటి మేము పెట్టినామురా
చెట్టమీద కొమ్మల్లో చిన్నివీరుడా
ఇట్టే ఒక్కబాణాన ఇలకు పడగొట్టరా
కొట్టతిని చూడవమ్మ కూలెను నీమ్రోల












8, జూన్ 2021, మంగళవారం

ముద్దు ముద్దు మాటల మోహనరామ

ముద్దు ముద్దు మాటల మోహనరామ నీ
వద్ద నున్న బాణాల వాడి యెంతరా

వాడివేడి బాణాల.వాడను కైకమ్మ
పాడురాకాసుల పనిపడతా
నేడేరేపో నాగొప్ప పోడిమి గూరిచి
వాడవాడలందు జనవాక్య మగును

తొడిగి విడచు బాణాలు తుంటరి వారల
నడగించు బ్రహ్మాదు లడ్డమైనను
జడివానగా వీడు జల్లు బాణాలని
జడిసేరు వీరాగ్రేసరులు లోకాన

హరివోలె రాక్షసుల నందర గొట్టేవొ
హరిని నేనే యనుకో వమ్మ కైకమ్మ
మరి యంత వీరుడవై మాయని కీర్తిని
ధరనేలుదువు లేరా దశరథాత్మజ








5, జూన్ 2021, శనివారం

మన్నించి వినవయ్య రామయ్యా

మన్నించి వినవయ్య రామయ్యా నా
విన్నప మొక్కటి రామయ్యా

రామదాసుడ గాని రామయ్యా నేను
కామదాసుడ గాను లేవయ్యా
నామీద దయజూప వేమయ్యా రామ
ప్రేమతో నన్నేలు కోవయ్యా

శిష్టుల సంగమే చాలయ్యా రామ
దుష్టుల జేరంగ బోనయ్యా 
కష్టించి బ్రతుకుదు రామయ్యా నాకు
కష్టాలు రానీక కావవయా

పరదైవమవని నమ్మి యుంటినయా రామ
పెఱదైవముల నేను కొలువనయా
కరిరాజవరదుడ వైనటులే రామ
కరుణించి నన్నాదు కోవయ్యా












4, జూన్ 2021, శుక్రవారం

రాజారామ రాజారామ రాజలలామ రాజారామ

రాజారామ రాజారామ రాజలలామ రాజారామ
రాజారామ రాజారామ రాక్షసాంతక రాజారామ

సౌమిత్రీయుత రాజారామ సాకేతప్రియ రాజారామ
భూమిసుతాయుత రాజారామ పురుషశ్రేష్ఠ రాజారామ
 
కాననసంచర రాజారామ కంపితరాక్షస రాజారామ
మౌనిజనాశ్రయ రాజారామ జానకిరమణ రాజారామ

మాయామానుష రాజారామ మాయావంచిత రాజారామ
తోయధిబంధన రాజారామ శ్రీయుతమూర్తి రాజారామ

రావణసంహర రాజారామ దేవగణార్చిత రాజారామ
దేవదేవ హరి రాజారామ స్థిరకీర్తియుత రాజారామ
 
భూవలయాధిప రాజారామ పుణ్యవివర్ధన రాజారామ
పావనమూర్తి రాజారామ పాపవినాశన రాజారామ

భక్తజనప్రియ రాజారామ భవభయవారక రాజారామ
ముక్తిప్రదాయాక రాజారామ మోహనరూప రాజారామ

పూచికపుల్ల బాణాలు బొమ్మవిండ్లును

పూచికపుల్ల బాణాలు బొమ్మవిండ్లును
రాచబిడ్డవు నీ కేల రారా రామయ్య

నూటికిపైన బాణాలు సూటిగ క్షణములో
ధాటిగ వేయువిద్యనే తండ్రీ నేర్పెదను
సాటిలేనట్టి మేటి చక్కని విలుకాడు
నీటుకాడని జనులు నిన్నే పొగడేరు

సుకుమారి కౌసల్య చురకత్తి నైన
ఒకనాడు నీవు తాకకుండగ పెంచేను
వికటరిపువర్గవహరణ విక్రమంబును
ప్రకటనము నీవు చేయ వలయును రేపు

కైకమ్మ మాట వింటే కదనరంగాల
నీకు శాత్రవువులెల్ల మోకరిల్లేరు
లోకాన నాకీర్తి లేకుండు నుండు
నీకీర్తి శాశ్వతమై నిలువజేయుదు

2, జూన్ 2021, బుధవారం

ద్రాక్షబూరెలు

మీరు సరిగ్గానే చదివారు.

ఈ మహాపాకం పేరు ద్రాక్షబూరెలే.

బోల్డన్ని కబుర్ల లలిత గారికి వాగ్దానం చేసినట్లుగా ఈ స్వీటు గురించి వ్రాస్తున్నాను.

చాలా సంవత్సరల క్రిందట ఏదో ఒక సందర్భంలో మాఅత్తవారి తరపు ఇండ్లలో విందు కార్యక్రమం జరుగుతున్నది.

మా పెద్దబావమరది మాచిరాజు గారి భార్య కీ.శే. మీనాక్షి గారు, మరొకరూ (పేరు గుర్తుకు రావటం లేదిప్పుడు) కలిసి బూరెలు వేస్తున్నారు.

అక్కడ డైనింగ్ టేబుల్ మీద రకరకాల పండ్లు కూడా ఉన్నాయి.

ఏదో ఒక పనిమీద నేను వంటగది లోనికి వెళ్ళాను.

ఇంక బూరెలు ఐపోతే వంట పూర్తయినట్లే అని కాబోలు అన్నారు మీనాక్షి గారు.

పనిలోపనిగా ద్రాక్షపండ్లతో కూడా బూరెలు వేసెయ్యండి. పూర్ణం బూరెల కన్నా సులువుగా వచ్చేస్తాయి అని సలహా ఇచ్చాను.

పేలవూ అని ప్రశ్న వచ్చింది.

పేలవు అని నా నమ్మకం. ఆ మాటే చెప్పాను.

నా ప్రోద్బలం మీద కొన్ని ద్రాక్షపండ్లను (అవన్నీ శుభ్రంగా కడిగి పళ్ళెంలో పెట్టినవే‌ లెండి) తీసుకొని చోవిలో ముంచి నూనెలో వేసారు. చక్కగా వేగాయి. పిండి కూడా వాటిమీద బాగానే పట్టింది.

చిన్నగా గుండ్రంగా గోళీల్లాగా ఈబూరెలు భలే‌ బాగా వచ్చాయి చూడ్దానికి.

తినటానికీ బాగానే ఉన్నాయని అందరూ సంతోషపడ్డారు, మరీ అంత ఎక్కువ తీపి ఉండవూ చప్పగానూ‌ ఉండవు. బాగున్నాయవి.

ఆరోజు బోలెడన్ని ద్రాక్షబూరెలు చెల్లిపోయాయి.

మామూలు పూర్ణం బూరెల కైతే పూర్ణం ముద్దను తయారు చేసుకోవటం. దానికోసం బెల్లంతో కొంచెం పని. మళ్ళా ఏలకులో మరేవో వేయకపోతే బాగుండవు. కొబ్బరి కూడా వేసుకోవచ్చును. ఇదంతా కొంచెం పెద్దపనే చివరికి. 

అదే ద్రాక్షబూరెలైతే ద్రాక్షపండ్లు ఒక సైజుగ ఉన్నవి పుష్టిగా ఉన్నవి తీసుకోవాలి. చిన్నచితకా వదిలెయ్యండి. వడిలిపోయినవీ వదిలెయ్యండి. యధాప్రకారం‌ బాగా కడిగి శుభ్రం చేసుకోండి. 

ఈ బూరెలకోసం గింజలు లేని ద్రాక్షపండ్లు మాత్రమే వాడాలి. కారణం స్పష్టమే. అవెలా ఉంటాయో వెబ్ నుండి గ్రహించిన ఒక బొమ్మ చూపుతున్నాను ప్రజాసౌకర్యార్ధం.



చోవి పిండి తయారు చేసుకొని ఈ‌మంచి ద్రాక్షలతో బూరెలు వేసెయ్యటమే.

మహాసుళువు కదా.

ఆసక్తి ఉన్నవాళ్ళు తగుజాగ్రతలు తీసుకొంటూ తప్పక ప్రయత్నించి చెప్పండి.

చూడరే బాలుని శోభనాకారుని

చూడరే బాలుని శోభనాకారుని
వాడప్పుడే విల్లు పట్టెనదే చూడరే

బొమ్మవిల్లు చేతబట్టి మురిసిపోవుచున్న వాని
అమ్మముందు నిలిచి దాని అందమును చూపు వాని
నెమ్మదిగ వంచి గుణము నిమ్ముగాను సంధించి
అమ్మా బాణాలు కావాలమ్మా యనే వానిని

నారి తొడుగు ఒడుపు జూచి నాతి కౌసల్య నవ్వె
చేరి బాణాలనడుగ చిన్నగా సుమిత్ర నవ్వె
రారా నావద్ద గలవు రామచంద్ర బాణాలు
తీరైన విండ్లు నీవు కోరినన్ని యనె కైక

అవును కైకమ్మ బలే యస్త్రవిద్యావేత్తరా
సవినయముగ అమ్మవద్ద చక్కగా నేర్వరా
రవికులోత్తమ యనుచు రాము నెత్తి కౌసల్య
సవతి చేతి కందించగ చాల నవ్వె సుమిత్ర



1, జూన్ 2021, మంగళవారం

బాలరాము డటునిటు పరుగులు దీయ

బాలరాము డటునిటు పరుగులు దీయ
చాలముచ్చటగ దోచు సకియ లందరకును

రారా నాకన్నతండ్రి నా రాముడా యని
రారా కొడుకా యని రవికులోత్తమ యని
రారా బంగారుతండ్రి రఘునాయకా యని
కూరిమితో కన్నతల్లి కోసలసుత పిలువ

రారా నాకంటివెలుగ నా రామచంద్ర యని
రారా చిన్నారి దశరథరాముడా యని
రారా ఓ ప్రావృణ్ణీరదశ్యాముడా యని
గారాము చేయుతల్లి కైకమ్మయు పిలువ

కేరింతలు కొట్టుచును కిలకిలకిల నవ్వుచును
చేరబిలుచున్న తల్లుల చేతులలో వ్రాలగ
తూరీగవలె పరుగులువాఱు వాని నడ్డుకొని
రారా కొడుకా యని సుమిత్రామాత ముద్దిడ