భావగీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భావగీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2023, మంగళవారం

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము


        (కాఫీ)

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము
పాపమైన పుణ్యమైన పరగు నీ కర్తృత్వము

నా వద్ద కీవు వచ్చి న న్నడుగుచున్న దేమి
కావలయు ధనము లని కావలయు పదవు లని
నా విభవమేమి నీవు నాకు లంచ మిచ్చు టేమి
నీవు చేయు పాపములను నేను మన్నించు టేమి

జీవుల స్వాతంత్ర్యమును దేవు డేల హరించును
భావించి మంచిచెడుగులు వర్తించ వలయును
నీవు ప్రకృతివశుడ వైన నేనేమి చేయుదును
కావ మన్న నాడు కద కాపాడ రాగలను

నీ నిజ తత్త్వమును నీవెఱుగక యుండి
నే నుంటినా యని లోన శంకించు టేమి
పూని నేను నాదను బుధ్ధి పోనాడి కర్మము లెల్ల
మాను దేని నీవే నేను నేనే నీ వంతియె రామ


నేను నేనే కాను నీవాడ గాని...





నేను నేనే కాను నీవాడ గాన
నేను నీ దయచేత నిలచితి గాన


ఏనేల నైతినో యిటుల నీవాడ
నేనాడు నేలోప మింతయును లేదు
నీ నా విబేధము లించుక లేక
ప్రాణంబుగా నిలిచి పాలించె దీవు
నేను

నాలోన నిలచిన నావాడ వీవు
నాలావు నీవయ్య నాయున్కి వీవు
చాలు నాకిది యింత చక్కని చెలిమి
కాలమైనను గాని కదలించ లేదు
నేను

ఇది నీదు లీల యని యెఱుగుదు నేను
ఇది నాకు వరమని యెఱుగుదు నేను
వదలి యుండగలేని వాడనైతి నేను
వదలి యహమును నిన్ను బడసితి రామ 
నేను






ఇంకొక్క మాట....





మరల నింకొక మాట మనవిచేసెడు లోన
మరలిపోతివి నిన్న మంచి స్వప్నము లోన


చిరునవ్వు వెన్నెలలు చిక్కగా కురిపించి
మురిపించి ఎన్నెన్నొ ముచ్చటలు పలికి
నిరుపమానం బైన నీ దయలు చిలికి
మరి నాదు పొగడికలు మన్నించి వినుచు
మరల

నా కడకు వత్తువు నన్ను మన్నింతువు
నీ కడకు యేనాడు నేను వచ్చెదనని
వేడుక మీరగ వినయంబుతో‌ నిన్ను
వేడగ నెంచి నే విన్నవించగ నుండ
మరల

ఎన్నాళ్ళ నుండియో నన్నెఱుగిన రామ
అన్నియు నెఱిగి నా యాశ నీ వెఱురగవా
ఇన్ని యాశలు దీర్చి యీ యాశ దీర్చవా
అన్న మాటను నే నడుగ బోయెదనని
మరల






పొందినవే చాలు

పొందినవే చాలు పుడమిపై నీ జీవి
చెందనీ యిక రామ చెలగి నీ సన్నిధి

మాటికొక వేషమున మరలి వచ్చుట చాలు
పూటపూటకు భుక్తి నాటకమ్ములు చాలు
ఆటుపోటుల కోర్వ కలమటించుట చాలు
నేటికైనను నిన్ను నేను చేరుట మేలు

తొల్లింటి ప్రజ్ఞను తొలగియున్నది చాలు
డొల్లచదువుల వలన కొల్లపడినది చాలు
కల్లనడతల వలన కలతబడ్డది చాలు
చల్లగా నిను చేరి సంతసించుట మేలు

భయదభవవార్ధిలో పడి యీది నది చాలు
పయనించి పయనించి బడలుకొన్నది చాలు
దయలేని కాలమిడు దండనంబులు చాలు
రయమున నినుచేరుటయె చాల మేలు



29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

లోకము శోకము నీకేలా



లోకసంసర్గమే శోకసంసర్గము
లోకము శోకము నీకేలా వినుము

పదివేలమారులు పరువిడి యటునిటు
వదలించుకొన లేక వ్యామోహము
హృదిని విషయవిష మది నించెదవు
తుదిని శోకంబున దోయిలింతువు

నీ సత్యమగు స్థితి నీవెఱుగగ లేక
మోసపోదువు దేహమోహమున
వేసరి తుదకెల్ల విషయము లూడ్చి
చేసిన పనుల నెంచి చింతించెదవు

తనకర్మంబే తనదైవంబని
మనసున నెఱిగక మసలెదవు
వినుమే కామితమును లేకుండిన
కనుగొన నొక శోక మనునది లేదు


22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

జరుగని సంగతులపై చర్చలేల



జరుగని సంగతులపై చర్చలేల
జరుగుచున్న దెల్ల నీ సంకల్పమే

నిన్ను మరచి నే నుండుట
నన్ను విడచి నీ వుండుట
మిన్ను మిరిగి మీదపడు గా
కెన్నడైన జరిగేనా

ఆ వంకన నీ వుంటివి
ఈ వంకన నే నుంటిని
చేవమీఱ నీదుదునా
ఈ విషభవజలధిని

నేను నీ వను భేదము
నేను నీవు పాటించము
కాని లోక మిరువురని
తా నెంచుట మానేనా



21, సెప్టెంబర్ 2017, గురువారం

అంత కాని వాడనా యింత మౌనమా



                అంత కాని వాడనా
                యింత మౌనమా

                నిను గూర్చి తలచి నా
                మనసు మురియు వేళ
                ననుగూర్చి తలపు నీ
                మనసులోన మెదలునా

                యుగములాయె కాలము
                జగములాయె దూరము
                గగనమాయె దరిసెనము
                వెగటుతోచె జీవనము

                నీవు పంప నిట నుంటి
                నీవు పిలువ నట నుందు
                నా వలన నలుగు టుడిగి
                రావించు కొనరాదొకొ


20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎవరికైన ఎఱుకయ్యేనా



        ఎఱుకయ్యేనా  ఏనాడైనా
        ఎఱుకయ్యేనా ఎవ్వరి కైనా

           పవలనక రేయనకుండా
           ఎవరెవరి మనసుల లోన
           ఎవరెవరు నెలకొన్నారో
           ఎవరికైన ఎఱుకయ్యేనా

              ఎవరెవరి ఊహల లోన
              చివురెత్తే ఆశల వెనుక
              ఎవరెవరు కదలాడేరో
              ఎవరికైన ఎఱుకయ్యేనా

                 ఎవరెవరి కలల లోనికి
                 కవగూడి సందడిసేయ
                 ఎవరెవరు వస్తున్నారో
                 ఎవరికైన ఎఱుకయ్యేనా


17, సెప్టెంబర్ 2016, శనివారం

ఎవరెవరిని తలచిరి యేల తలచిరి



ఎవరెవరిని తలచిరి యేల తలచిరి
ఎవరెవరిని పిలచిరి యేల పిలచిరి

బిరబిరా రమ్మని పిలచినా డనుచు
ఉరుకుల పరుగుల నొయ్యారి నదులు
తరలుచున్నవి చాల తహతహ లాడుచు
నిరుపముడు సముద్రుడు నిజవిభు డనుచు
హరికై

కాలమే తలచునో కర్మమే పిలచునో
నేలకు దిగి జీవులెల్ల గోలగోలగా
పాలుమాలుచు గడపి పరువులెత్తేరు
నేల మరల రండని నిష్ఠురం బాడ
హరికై

తమకుతామె జీవులు తరలివచ్చేరు
తమకుతామె జీవులు తరలిపోయేరు
భ్రమలెల్ల తొలగి మోక్షమునకై కొందరే
విమలురై కొలిచేరు విభుడు శ్రీరాముని
హరికై




21, ఆగస్టు 2016, ఆదివారం

మెలకువ రాగానే పలకరింతు రాముని ...




మెలకువ రాగానే పలకరింతు రాముని
పులకరించి పలకరింతు జలధరసుశ్యాముని


నా రాముని దయవలన నాకు గలిగె నీ‌ తనువు
నా రాముని సేవలోన నడచి పోవు నా బ్రతుకు
నా రాముని తలపులే నా కన్నము పానము
నా రాముని పొగడుటయే నాకు సంతోషము
మెలకువ

నా రాముడు లేని చోటు నా కగుపడకుండు
నా రాముడు పవలురేలు నన్ను కాచియుండు
నా రాముడు నిదురనైన నన్ను వదలకుండు
నా రాముడు కలల నన్ను చేరి యాడుచుండు
మెలకువ

నా రాముని పాటలతో నాకు ప్రొద్దుపోవును
నా రాముని యనుజ్ఞతో నాకు నిదురకల్గును
నా రాముని నామముతో నాపెదవులు కదలును
నా రాముని పొగడుకొనగ నాకు తెల్లవారును
మెలకువ






17, ఆగస్టు 2016, బుధవారం

రాముని తలచవే మనసా ....


రాముని తలచవె మనసా శ్రీ
రాముని తలచిన సేమము కలుగును
రాముని తలచవె మనసా


ఎవరే బంధుగణంబులు నీకు
ఎవరే మిత్రగణంబులు నీకు
అవలి యొడ్డునకు చేరే వేళ
ఎవరే నీతో నడచే వారు

రాముని

నిందలు వేసే వారిని చూసి
ఎందుకు నీవు చింతించెదవే
అందుకు వారే ఆ సమవర్తి
ముందర నిలచి వాపోయేరే

రాముని

తెగడే వారిని తెగడ నీయవే
పొగడే వారిని పొగడ నీయవే
జగమును విడచే టప్పుడు నీతో
వగపులు మురిపెము లేవీ రావే

రాముని

వచ్చిన కార్యము రాముడు మెచ్చగ
ముచ్చటగా నెఱవేర్చుకు పోవే
ఇచ్చట మొఱిగే కుక్కలు నీతో
మచ్చరించు టవమానము కాదే

రాముని


23, జులై 2016, శనివారం

రావయ్యా ఈ‌ జీర్ణకుటీరము ...





రావయ్యా యీ‌ జీర్ణకుటీరము
పావనముగ జేయ - వేగమె
రావయ్యా నీ నిజభక్తునకు
దీవన లందీయ బిరబిర


నిదురను గూడ నిన్ను మరువక
ఎదురు చూచుచు నిన్ని యుగంబులు
పదిలముగా శుభభావన నిలిపిన
యెదలో ఆశల నింకగ నీకుము
రావయ్య

నీ కృపచే నిట నిర్మిత మైనది
నాకు నెలవుగ నీవు చేసినది
నీ కటాక్షమున నిలచియున్నది
చీకి కూలి ధర చేరక మునుపే
రావయ్యా

సువిశాలంబును సుందరమగు నొక
భవనము గాదిది పాతయిల్లె నీ
కవరోధము వలె హాయి గొల్పగా
సవరించితి నే శక్తికొలదిగా
రావయ్యా






22, జులై 2016, శుక్రవారం

ఎవరెవెరో ఏమేమో ...





ఎవరెవెరో యేమేమో పలికి
సవరింతురె యీ శ్యాముని మనికి


ఎత్తిన జన్మము లెన్నెన్నో అవి
మెత్తిన తెలివిడి యెంతెతో నా
చిత్త మెఱింగిన స్నేహితుడా నీ
మెత్తని పలుకులు వినుచుండ
ఎవరెవరో

పరమాప్తా స్వప్నావబోధముల
సరళములను హితకరముల నేను
నిరతము వినుచు నీ ప్రియభాషలు
మరువక మదిని స్మరియించు నెడ
ఎవరెవరో

ఆ ముచ్చటలును నాలకించుమని
యేమయ్యా యీ యెకసెక్కెంబులు
నీ మాటలనే నే వినదలచెదు వే
రే మాటల విని యేమి చేయుదు
ఎవరెవరో






23, ఆగస్టు 2015, ఆదివారం

ఓ కోసలరాజసుతాతనయా




నా సంగతి  చక్కగ  నెఱుగుదువు
నీ సంగతి  కొధ్దిగ నెఱుగుదును
ఈ సంగతి జగ మేమెఱుగునయా ఓ
కోసలరాజసుతాతనయా

నను పట్టిన మాయను వదలించి
చనవిచ్చి మహాధ్భుత సత్పథము
కనజేసిన స్నేహితుడవు నీవు
నిను జేరి ప్రశాంతుడ నైతిని లే
నా సంగతి
నను లోకము మెచ్చును మెచ్చదుపో
తనియంగను క్రుంగను పనిగలదే
నను నీ పదసన్నిధి చేర్చితివి
నిను జేరి ప్రశాంతుడ నైతిని లే
నా సంగతి
శరణాగతుడగు జీవుడ నేను
కరుణామయుడవు దేవుడ వీవు
అరుదైనది మన యీ చుట్టరికం
తిరమైనదిలే నీ పెద్దరికం
నా సంగతి



17, ఆగస్టు 2015, సోమవారం

కలలన్నీ నీ కొఱకే కలిగినవి








కలలన్నీ నీ కొఱకే కలిగినవని తెలిసెను
కలరాని నాడు నీ వలిగితివని తెలిసెను



తీయని నీ పలుకు తేనెలతో ముఱిపించి
హాయిగా నా తోడ ఆడిపాడి వలపించి
వేయేల నేను నీ వేనని కడు రెట్టించి
పోయెదవు తెలవారిపోవులోన నమ్మించి
కలలన్నీ

కలలలో నీ తోడ కలిసియాడుదును నేను
కలిసి యాడుటే కాదు కడకు నీ యింటికి
పిలిచెద వొక నాడని తెలిసియింటిని నేను
నిలిపి నీ మీద యాశ నిలచియుంటిని నేను
కలలన్నీ

నీకొఱకే నాయాట నీకొఱకే నాపాట
నీకొఱకే నేలమీద నిలచి నడయాడుట
నీకొఱకే నా నిదుర నీకొఱకే నా కలలు
నాకు ప్రసన్నుడవు కమ్ము నా రామచంద్రుడ
కలలన్నీ







22, జులై 2015, బుధవారం

వేయికి మిక్కిలి జన్మము లాయె





వేయికి మిక్కిలి జన్మము లాయె
  వేచిన దింక చాలునయా
మాయ నుండి నను దయతో విడుదల
  చేయవె నీదరి చేరగ నీవె


కడు ముచ్చట పడి యడిగితి సరియే
పుడమికి నవ్వుచు పంపితి విచ్చట
నడుగిడి యుగములు జన్మలు పెక్కులు
గడిపితి నీతో నడిపితి నెయ్యము
గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము
విడువని నిన్నేమని పొగడుదును
నడుచెద నిటు నీ యడుగుల నడుగిడి
ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి

బడుగు వీ డని తలపవు రామా
కుడిపెద వోహో కరుణామృతము
కడలి కంటె గంభీరము నీ హృది
బడలనీక నను పాలించెదవు





17, జులై 2015, శుక్రవారం

రామకృపాధార ఒకటి నా మీద కురిసెను




రామకృపాధార ఒకటి
నా మీద కురిసెను
ఆ మధుర సుధావృష్టి
నా మనసు తడిసెను

అంతులేని ప్రయాణము
చింతలతో నరకము
ఎంత తిరిగినా తెలియ ద
చింత్యమైన గమ్యము
సుంత విశ్రాంతి గొనే
టంత భాగ్య మెక్కడిది
పంతమేల రామ యొ
క్కింత సాయపడమంటే

ఒక నల్లని మేఘమై
ఒక చల్లని గాలియై
ఒక హాయగు స్పర్శయై
ఒక కమ్మని తావియై
ఒక సుమధుర గర్జయై
సకలతాప మర్దనియై
ఒక లీలను నను ముంచుచు
వికసించెను విభుని దయ

ఇది నాకు చాలు గదా ఈ జన్మకు
ముదితాత్ముడ నైతి రామభూవరు కృపకు
విదితమాయె ఆ మబ్బు వెంబడి పోయి
సదయుని గేహమ్ము చేరజాలుదు ననుచు
అదిగదిగో కదలు చున్నదా నల్లమబ్బు
కదలిపోవు చుంటి రామ కారుణ్యవృష్టి
పదే పదే హాసశంపాలతల వెలుగుల
నిదే దారిచూపుచుండె నీశ్వరుడు నాకు








16, జులై 2015, గురువారం

విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి





విడువక నాతో నిలచితివి నే
పాడినవి విని మెచ్చితివి నా
కేడుగడవు నీ కేమిత్తునయా నీ
వేడుక తీరగ పాడుట గాక

తడవకు తప్పులు వెదికే జగమును
విడిచి నీ మరువును సొచ్చితిని
గడబిడ పడు నా మనసున నీవే
వడివడి శాంతము నింపితివి 

గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము
విడువని నిన్నేమని పొగడుదును
నడువనిమ్ము నీ యడుగుల నడుగిడి
ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి

బడుగు వీ డని తలపవు రామా
కుడిపెద వోహో కరుణామృతము
కడలి కంటె గంభీరము నీ హృది
బడలనీక నను పాలించెదవు








3, మే 2015, ఆదివారం

ఈవేళ తేలిపోవాలి రావయ్య ఓ అందగాడా



నీవాడ నైతినో నేను
నావాడ వైతివో నీవు
ఈవేళ తేలిపోవాలి
రావయ్య ఓ అందగాడా

బెలిపించి భూమికి పంపింది ఎవరు
వలపించి కలలన్ని పండించి రెవరు
తలపులన్నిట నిండి తబ్బిబ్బు చేసిన
తులలేని స్నేహసద్గుణరాశి ఎవరు
॥నీవాడ॥
నేనన్న భావన నీవు చేసిన మాయ
ఆనాటి నుండి నే నీనాటి వరకు
నీ నాటకంబునే నీ తృప్తి కొఱకు
పూని యాడుచు నుంటి భూలోకమందు
॥నీవాడ॥
నీ వాడనే యని నీవు ఆడించితే
నా వాడవే యని నమ్మి యాడేను
ఏ వార లెవరి వా రెవరు తేల్చేది
రావయ్య మాయపొర లావల పెట్టి
॥నీవాడ॥



29, ఏప్రిల్ 2015, బుధవారం

కాలం చేసే గారడి నేను చాలా చూసాను



కాలం చేసే గారడి నేను చాలా చూసాను
కాలాతీతుని రాముని నాలో మేలుగ తలచాను 

కన్నులు తెరచిన తొలినాడే నే కలినే చూసాను
కలిమాయలలో చిక్కిన జనులు కలగుట చూసాను
కలగిన మనసులు సత్యపథమ్మును తొలగుట చూసాను
తొలగిన బేలలు చీకటులందు తిరుగుట చూసాను
॥కాలం చేసే॥
మాయామయమగు జగమును నమ్మే మనుజుల చూసాను
కాయమె తానని తలచే వారల కష్టము చూసాను
ప్రేయోమార్గము వెంట మనుషుల పరుగులు చూసాను
శ్రేయోమార్గము గలదని తెలియని జనులను చూసాను
॥కాలం చేసే॥
అక్కడక్కడ భ్రమలు తొలగిన అనఘుల చూసాను
చక్కగ రాముని నమ్మిన మనసుల సౌఖ్యము చూసాను
అక్కజముగ శ్రీరాముడు వారికి దక్కుట చూసాను
మిక్కిలి ప్రేముడి కొలిచి రాముని దయనే చూసాను 
॥కాలం చేసే॥