17, జులై 2015, శుక్రవారం

రామకృపాధార ఒకటి నా మీద కురిసెను
రామకృపాధార ఒకటి
నా మీద కురిసెను
ఆ మధుర సుధావృష్టి
నా మనసు తడిసెను

అంతులేని ప్రయాణము
చింతలతో నరకము
ఎంత తిరిగినా తెలియ ద
చింత్యమైన గమ్యము
సుంత విశ్రాంతి గొనే
టంత భాగ్య మెక్కడిది
పంతమేల రామ యొ
క్కింత సాయపడమంటే

ఒక నల్లని మేఘమై
ఒక చల్లని గాలియై
ఒక హాయగు స్పర్శయై
ఒక కమ్మని తావియై
ఒక సుమధుర గర్జయై
సకలతాప మర్దనియై
ఒక లీలను నను ముంచుచు
వికసించెను విభుని దయ

ఇది నాకు చాలు గదా ఈ జన్మకు
ముదితాత్ముడ నైతి రామభూవరు కృపకు
విదితమాయె ఆ మబ్బు వెంబడి పోయి
సదయుని గేహమ్ము చేరజాలుదు ననుచు
అదిగదిగో కదలు చున్నదా నల్లమబ్బు
కదలిపోవు చుంటి రామ కారుణ్యవృష్టి
పదే పదే హాసశంపాలతల వెలుగుల
నిదే దారిచూపుచుండె నీశ్వరుడు నాకు
3 కామెంట్‌లు:

 1. సీ||మోటు నిషాదుడు మౌనివరుడు పోవు
  మార్గాన క్రూరత్వ మావహించి

  జోడుకూడిన జంట క్రౌంచములందు పో
  తును కూల్చగా యాడుదాని బాధ

  మనసును కదిలించి మరిమరి వేధించి
  శాపమై.నిందయై - కావ్యధార

  గంగయై పొంగి - లోకాన మరల నిట్టి
  ఘాతుకమును చేయ కుండునట్టి

  తే||సాధు సజ్జనులను పెంచు దీక్ష తోడ
  గిరులు ఝరులు ఉండువరకు నిలిచిపోవు
  రామకధను తీరిచి దిద్దినాడు మౌని,
  సాహితీమూర్తు లందు శాశ్వతుడు గాగ!
  (17.07.2015)

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. కృతజ్ఞతలు!
   శ్యామలీయం మేష్టారి రామభక్తికి నా చిన్ని కానుక!
   ఈ సింధువులో క బిందువుగా నిలిచినా చాలు కదా!

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.