16, మే 2024, గురువారం

నమ్ముడు మానుడు

 

కం. నమ్ముడు మానుడు రాముని

నమ్మిన మానవుడు చెడడు నమ్మక చెడుచో

నమ్మనుజుని రక్షింపగ

నిమ్మహి రామునకు దప్ప నెవ్వరి తరమౌ


ఈ ప్రపంచంలో  రాముణ్ణి నమ్ముకున్న వాడు చెడడు. నమ్మండి మానండి. ఇదే నిజం.

ఒక వేళ ఎవడన్నా రాముణ్ణి నమ్మకపోతే వాడు చెడిపోవచ్చును. నమ్మి మాత్రం ఎవరూ చెడరు.

ఎవడన్నా రాముణ్ణి నమ్మక చెడిపోతే వాణ్ణి ఎవరూ రక్షించలేరు.

ఒక్క రాముడే దయదలచి రక్షించాలి కాని మరెవరికీ అది తరం కాదు.


13, మే 2024, సోమవారం

లేడా రాముడు లేడా నీయెడ

లేడా రాముడు లేడా నీయెడ

వాడేగా నీకేడుగడ


కూరిమితో నిను చేరదీయుటకు

    శ్రీరఘురాముడు లేడా

వీరిప్రేమ కని వారిప్రేమ కని

    వెంపరలాడుట లేలా


ధారాళముగా దయలు కురియుటకు

    దశరథరాముడు లేడా

వీరికరుణ కని వారికరుణ కని

    వెంపరలాడుట లేలా


కొల్లలుగా సిరులెల్ల నిచ్చుటకు

    చల్లనిరాముడు లేడా

ఎల్లదిక్కులను సిరులను వెదకుచు

    నిటునటు తిరుగుట లేలా


వెల్లడిగా నరిషట్కము నణచగ

    వీరుడు రాముడు లేడా

అల్లరి చేసే కామాదులు గల

     వన్న బెంగ నీకేలా


చింతలన్నిటిని తొలగించుటకై

    సీతారాముడు లేడా

చింతలవంతల జిక్కి కృశించుచు

    చిన్నబోవ నీకేలా


అంతరంగమున శాంతి నించుటకు

    నయోధ్యరాముడు లేడా

అంతులేని దీసంసారం బని

     యంతగ భయపడ నేలా


10, మే 2024, శుక్రవారం

రామ రామ జయ దశరథరామా


రామ రామ జయ దశరథరామా 
    రామ రామ జయ రాఘవరామా

రామ రామ జయ రాఘవరామా 
    రామ రామ జయ రవికులసోమా

రామ రామ జయ రవికులసోమా 
    రామ రామ జయ సద్గుణధామా

రామ రామ జయ సద్గుణధామా 
    రామ జయ మునిజనకామా

రామ రామ జయ మునిజనకామా 
    రామ రామ జయ దైత్యవిరామా

రామ రామ జయ దైత్యవిరామా 
    రామ రామ జయ సీతారామా

రామ రామ జయ సీతారామా 
    రామ రామ జితభార్గవరామా

రామ రామ జితభార్గవరామా 
    రామ రామ దశకంఠవిరామా

రామ రామ దశకంఠవిరామా 
    రామ రామ జయ రాజారామా

రామ రామ జయ రాజారామా 
    రామ రామ జయ మేఘశ్యామా

రామ రామ జయ మేఘశ్యామా
    రామ రామ శ్రీవైకుంఠధామా

రామ రామ శ్రీవైకుంఠధామా
    రామ రామ జయ తారకనామా


8, మే 2024, బుధవారం

ఎంత మంచివాడవురా


ఎంత మంచివాడవురా యెంతని పొగడదురా
చింతలన్ని తీర్చినావు చిత్తజగురుడా

అంతులేని మోహంబుల నణచుట యది యెట్టులని
చింత జిక్కి యున్న నన్ను చేరదీసి
ఎంతలేసి మోహంబుల నిట్టే యణగించుదు నని
పంతమాడు నీనామమె పరగ నా కిచ్చితివి

అంతుపొంతు లేక సాగు నట్టి జన్మపరంపర
యెంతకాల మనుచు నేను చింతించగను
పంతగించి భవచక్రము పగులవేయు నీనామము
నెంతో దయ చూపి యినకులేశ నా కిచ్చితివి

పండీపండని భావములను వచ్చీరాని భాషలో
వండి కీర్తనల జేసి వడ్డించినను
నిండుమనసు తోడ మెచ్చి నీవు నీనామము నా
కండ జేయు చుంటివి కోదండరామ దండము


7, మే 2024, మంగళవారం

వరమీవయ్యా


వరమీవయ్యా రామ వరమీవయ్యా మంచి

వరమీవయ్యా నాకు వరమీవయ్యా


పరమపురుష నీనామ స్మరణమును మరువకుండ

పరమభాగవతుల స్నేహబాంధవ్యము లబ్బునటుల


నిన్ను గాక నేనన్యుల నెన్నడును స్మరించకుండ

నిన్ను తిట్టు నీచులతో నెన్నడు పనిబడకుండగ


సిరులపైన వ్యామోహము చెందకుండ నాచిత్తము

నిరంతరము నీయందే నిలిచియుండ నాచిత్తము


తవులకుండ పాపపుణ్యద్వంద్వము నాకికపైన

భవచక్రము పగులదన్ని వచ్చునటుల నీవద్దకు


భజన చేయరే రామభజన చేయరే

భజన చేయరే రామభజన చేయరే 
భజన చేయరే మీరు భజన చేయరే


రామ రామ యని భజన చేయరే
    రాముని మహిమను చాటించుచును

రామ రామ యని భజన చేయరే
     రాముని కరుణను వర్ణించుచును

రామ రామ యని భజన చేయరే
    రాముని శౌర్యము నగ్గించుచును

రామ రామ యని భజన చేయరే
    రాముని గుణగణములు పొగడుచును


రామ రామ యని భజన చేయరే
     స్వామినామమును తాళము తప్పక

రామ రామ యని భజన చేయరే
     ప్రేమమీఱగను వివిధగతులను

రామ రామ యని భజన చేయరే
     స్వామిభక్తిని చాటించుచును

రామ రామ యని భజన చేయరే
      రాదిక జన్మం బని నమ్ముచును


రామ రామ యని భజన చేయరే
    రమణీమణి సీతమ్మ మెచ్చగను

రామ రామ యని భజన చేయరే
    లక్ష్మణస్వామియు మురిసిపోవగను

రామ రామ యని భజన చేయరే
    రయమున హనుమయు మీతో గలియ

రామ రామ యని భజన చేయరే
     రాముడు సత్కృప వర్షింపగను


6, మే 2024, సోమవారం

రాముని కొలువరే


రాముని కొలువరే సీతా
    రాముని కొలువరే
రాముని గగనశ్యాముని పరం
    ధాముని కొలువరే

రాముని కొలుచు వారి కడకు 
    కాముడు రానే రాడట
రాముని కొలుచు వారి తాప
    త్రయ మణగి పోవునట

రాముని కొలుచు వారి పాప
    రాశి బూది యగునట
రాముని కొలిచి మోక్షద్వా
    రమును దాట వచ్చునట

రాముని కొలుచు వారి సర్వ
    కామనలు తీరునట
రాముని కొలిచి నంత మోక్ష
   రాజ్యమే కలుగునట


హరిశుభనామము చాలని


హరిశుభనామము చాలని తెలిసిన 
    నరుడే విజ్ణుడు పోరా
హరిశుభనామము గళమున నించిన 
    నరుడే నేర్పరి పోరా

హరినామముపై రక్తి కలిగితే 
    నరుడు తరించును కాని
హరినే తెలియక ధరపై తిరిగుచు 
    నరుడు తరించుట కలదా

హరినామముపై ననురాగముతో 
    నరుడు తరించును కాని
హరి హరి యనుటకు చిరాకు చూపెడు 
    నరుడు తరించుట కలదా

హరి సర్వాత్మకు డని లోనెఱిగిన 
    నరుడు తరించును కాని
హరియే లేడని డంబము లాడే 
    నరుడు తరించుట కలదా

హరిభక్తులతో సంగతి నెఱపిన
    నరుడు తరించును కాని
హరిభక్తుల గని వెక్కిరించెడు 
    నరుడు తరించుట కలదా

హరేరామ యని హరేకృష్ణ యని 
    నరుడు తరించును కాని
మరొక్క విధమున మసలుచు నుండిన
    నరుడు తరించుట కలదా

తరింపజేసే తారకనామము
    వరించ తరించు కాని
మరొక్క విధమున మానవమాత్రుడు
    తరించు టన్నది కలదా

రామనామమే తలచండి


రామనామమే తలచండి శ్రీ
    రామనామమే పలకండి
రామనామమునె పొగడండీ శ్రీ
    రామనామమునె పాడండి

రామనామమున రక్తి కలుగగా 
    ప్రజలకు బోధన చేయండి
రామనామమున పొందరానిదే 
    భూమిని లేదని చాటండి
రామనామమును చేసెడు వారికి 
    రక్షణ కలదని చాటండి
రామనామమున ముక్తి కలుగునని 
    ప్రజ లందరకును చాటండి

రామనామమే సంపత్కర మని 
    ప్రజలకు సత్యము చాటండి
రామనామమే ప్రజలందరకు 
    క్షేమకరంబని చాటండి
రామనామమే వరదాయక మని 
    భూమి నందరకు చాటండి
రామనామమే భవతారకమని 
    ప్రజ లందరకు చాటండి

రామరామ యను నామమంత్రము


రామరామ యను నామమంత్రము 
    నేమరకుండిన చాలును
రాముని నామము చాటుచు తిరుగుచు 
    భూమి నుండుటే చాలును


అవదాతాంబుజలోచను రాముని
    యనిశము దలచుట చాలును
భువనమోహనును రాముని నిత్యము
    పొగడుచును నుండిన చాలును
దివారాత్రములు రాముని కీర్తన 
    తీయగ చేయుట చాలును
భవబంధములను చిక్కక రాముని
    పదముల నుండిన చాలును


సదమలమగు శ్రీరాముని కీర్తిని
    చక్కగ చాటుట చాలును
మదిలో రాముని తత్త్వచింతనము
    మానక చేయుట చాలును
పదములె చాలును రామా యనుచును
    పాడుచు మురియుట చాలును
హృదయపద్మమున రాముని రూపమె
    యమరి యుండినది చాలును 
వదలక రాముని నామము దలచెడు
    భక్తుల స్నేహము చాలును


చాలుచాలు శ్రీరామనామ మను 
    చక్కని స్పృహయే చాలును
చాలుచాలు శ్రీరామనామ మన
    జాలెడు భక్తియె చాలును
చాలుచాలు శ్రీరామనామ మని 
    చాటెడు శ్రధ్ధయె చాలును
చాలుచాలు శ్రీరామనామ మది 
    చక్కగ ముక్తి నొసంగును


సదా వందనీయుడ వగు సాకేతరామ

 

సదా వందనీయుడ వగు సాకేతరామ
సదా నన్నేలుచుండు సర్వేశరామ

నిన్ను సదా కీర్తించుచు నున్నారు విబుధులు
నిన్ను సదా వర్ణించుచు నున్నారు కవులు
నిన్ను సదా చింతించుచు నున్నారు యోగులు
నిన్ను సదా పూజించుచు నున్నారు భక్తులు

నిన్ను సదా ధ్యానించుచు నున్నారు మునులు
నిన్ను సదా సేవించుచు నున్నారు దాసులు
నిన్ను సదా ప్రార్ధించుచు నున్నారు సుజనులు
నిన్ను సదా చేరుకొనుచు నున్నారు జ్ణానులు

నిన్ను సదా భావించుచు నున్నా నిట నేను
నన్ను సదా మన్నించుచు నున్నా విదె నీవు
నిన్ను సదా నేను నమ్మి యున్నాను గావున
నన్ను సదా రక్షించుచు నున్నావు నిజము


చాలును రాముని నామము చాలను


చాలును రాముని నామము చాలను
చక్కని యింద్రియ సంపద
మేలుగ నదియే కలిగిన మోక్షము
మిక్కిలి సులభము కావున

నాలుక మీదను రాముని నామము
నడచుచు నుండిన చాలును
చాలును పామరవాక్యము లాడని
చక్కని నాలుక చాలును

మేలుగ రాముని నామము మనసున
మెదలుచు నుండిన చాలును
చాలును దుశ్చింతనలను చేయని
చక్కని మనసే చాలును

రెండు కర్ణముల రాముని నామము
నిండుచు నుండిన చాలును
పండువగా హరినామమునే విన
వలచెడు చెవులే చాలును

చాలును కరములు రామభజనలో
తాళము చరచిన చాలును
చాలును రాముని సేవలు చేసే
చక్కని కరములు చాలును

చాలును రాముని భజనకు పరువిడు
చక్కని రెండు పాదములు
చాలును రాముని సేవకు పరుగిడు
చక్కని చరణము లుండిన


2, మే 2024, గురువారం

అతడేమొ శ్రీరాము డాయె - 2


అతడేమొ శ్రీరాము డాయె చూడు
డతని బాణమున కడ్డు లేదు

కం. పట్టము గట్టెద ననియును
నట్టడువుల కంప దండ్రి నాతికి దనకున్
గట్ట కుటీరము దమ్ముడు
పట్టపురా జట్లు రామభద్రుం డుండన్

కాకాసురుడు వచ్చినాడు వాడు
లోకమాతను గీరినాడు చూచి
చీకాకు కాకమ్ము పైన కినిసి
కాకిపై శరమంపినాడు మూడు
లోకమ్ము లాకాకి తిరిగి తుదకు
చేకొని రక్షించు మనుచు రామ
నే కోరి శరణమ్ము బ్రతికె కన్ను
గైకొని బాణమ్ము విడువ

దండకారణ్యంబు నందు దైత్యు
లుండి రొక పదునాల్గు వేలు వారి
కుండిరి నాయకుల్ ఖరుడు దూష
ణుండనగ గర్వాంధు లగుచు వారు
దండెత్తిరా రాము డపుడు కినిసి
దండిగా బాణముల్ బరపి వేగ
చెండాడ రామబాణముల వలన
దండకయు నిర్దైత్య మాయె

అతడేమొ శ్రీరాము డాయె - 1

అతడేమొ శ్రీరాము డాయె చూడు
డతని బాణమున కడ్డు లేదు

కం. ధరపై దశరథసుతుడై
హరి యుండగ యాగరక్షణార్ధము కడు సం
బరమున విశ్వామిత్రుడు
బిరబిర గొనిపోవు నట్టి వేళ నడవిలో

తాటక పైకొనగ వచ్చె రాము
నాటంక పరుచగ జూచె జూచి
నాటించు బాణమ టంచు గురువు
సూటిగా రెట్టించి నంత శరము
నాటించె రఘువీరు డపుడు దాని
యాటోప మణగారె నంత నీవు
మేటి ధానుష్కుడ వనుచు రాము
ధాటిని శ్లాఘించె గురువు

కం. మునియాగము మొదలాయెను
వనజాక్షుడు కాచుచుండె బహువేడుకతో
ఘనుడగు తమ్ముడు లక్ష్మణు
డును తోడుగ నిలువ నంత నోర్వని దుష్టుల్

మునియాగమును చెఱుపగాను వచ్చి
దనుజు లల్లరి చేయగాను రాము
డనలాస్త్రమును వేయగాను ఒక్క
దనుజు డాయెను బూది గాను రాము
డనిలాస్త్రమును వేయగాను ఒక్క
దనుజుడు కడు దవ్వుగాను పోయి
వనధిని వడి కూలగాను మునియు
వనజాక్షు దీవించె తాను

కం. పిమ్మట రాముడు లక్ష్మణు
డమ్ముని గొనిపోవ మిథిల కరుగన్ శివచా
పమ్మును గని యెక్కిడగా
నమ్మునివరు డనుమతింప నతిసులభముగా

శివచాప మల్లన విరిచి రాము
డవనీసుతను పెండ్లియాడ కనలి
శివుని శిష్యుడు పరశురాము డపుడు
కవల చాపము విష్ణుధనువు జూపి
రవికులేశుని దాల్చు మనగ నెత్తి
సవరించి బాణంబు నతని దర్ప
మవలీలగా నణచి నిలచె పొగడి
భవుని శిష్యుడు వెడలిపోయె

... సశేషం

రామ రామ సీతారామ్


రామ రామ సీతారామ్ హరి

రామ రామ రాజారామ్


రామ రామ రామ రామ్ శ్రీ

రామ రామ రామ రామ్ రఘు

రామ రామ రామ రామ్ హరి

రామ రామ రామ రామ్


రామ రామ రామ రామ్ ఘన

శ్యామ రామ రామ రామ్ గుణ

ధామ రామ రామ రామ్ హరి

రామ రామ రామ రామ్


రామ రామ రామ రామ్ జిత

కామ రామ రామ రామ్ ముని

కామ రామ రామ రామ్  హరి

రామ రామ రామ రామ్


రామ రామ రామ రామ్ రణ

భీమ రామ రామ రామ్ జయ

రామ రామ రామ రామ్ హరి

రామ రామ రామ రామ్


రామ రామ రామ రామ్ శుభ

నామ రామ రామ రామ్ సుఖ

ధామ రామ రామ రామ్ హరి  

రామ రామ రామ రామ్



1, మే 2024, బుధవారం

హరివే నీవని యెఱుగని వాడా


హరివే నీవని యెఱుగని వాడా
నరహరి శ్రీరఘురామా శ్రీ
హరివే నీవని యజు డనుదాక
యెఱుగని దశరథరామా

హరివే నీవని యెఱుగవు పులుగున
కందించితివే మోక్షము
హరివే నీవని యెఱుగవు బ్రహ్మగ
హనుమ కిచ్చితివి వరమును
హరివే నీవని యెఱుగవు శివుడే
సరి నాకంటివి యనిలో
హరివే నీవని యెఱుగ వన్నిటను
హరివలె మెలగితి వయ్యా

హరివే నీవని యెఱిగిన మునివరు
డడవికి నినుగొని పోయెను
హరివే నీవని యెఱిగి యహల్య
ఆతిథ్యమిచ్చెను వేడ్కను
హరివే నీవని యెఱిగిన మారుతి
పరమభక్తుడాయె నీకు
హరివే నీవని యెఱుగని రావణు
డంతరించె నీవలనను

హరివే నీవని యెఱిగిన యోగులు
ధ్యానింతురు నీతత్త్వము
హరివే నీవని యెఱిగి బ్రహ్మాదు
లగ్గింతురు నిను నిత్యము
హరివే నీవని యెఱిగిన భక్తులు
మరువరు నీనామంబును
హరివే నీవని యెఱిగి త్రిలోకంబు
లనిశము నిను గొల్చుచుండు

శ్రీరఘునాయక


శ్రీరఘునాయక సీతానాయక 
    శ్రితజనపోషక రామా
వారిజలోచన పాపవిమోచన 
    భవభయమోచన రామా

భాసురముగ నినకులమున బుట్టిన 
    వైకుంఠాధిప రామా
దాసులనేలగ దయతో భూమికి 
    దయచేసిన హరి రామా

దశరథు నింటికి  వెలుగై వచ్చిన 
    దైత్యవిమర్ధన రామా
దశదిశలను నీతేజము నించుచు 
    దయచేసితివో రామా

సవనవివర్ధన ధర్మవివర్ధన 
    జ్ణానవివర్ధన రామా
రవికులనాయక రవిసుతవందిత 
    రవిశశిలోచన రామా

జయరఘునందన జయగుణనందన 
    జయసురనందన రామా
జయసురవందిత జయమునివందిత 
    జయజనవందిత రామా

చిత్తశాంతికి మార్గమా


చిత్తశాంతికి మార్గమా - చిత్తము

చిత్తము హరికిచ్చుటే - చిత్తము


చీకాకు కామాదులా - చిత్తము

చీకాకు లణగించగ - చిత్తము

శ్రీకాంతు డున్నాడురా - చిత్తము

చేకూర్చురా శాంతిని  - చిత్తము


చేరి శుభము నొందరా - చిత్తము

శ్రీరామ యని చూడరా - చిత్తము

చేరేను హరిసత్కృప - చిత్తము

చీరును కామాదుల - చిత్తము


శ్రీరాముడే శ్రీహరి - చిత్తము

శ్రీరామ స్మరణమ్మున  - చిత్తము

శ్రీరామ సాన్నిధ్యమే - చిత్తము

చేరుకొందువు తథ్యము  - చిత్తము