ఇతరములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇతరములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2024, సోమవారం

ఇక వ్యాఖ్యలు స్వీకరించబడవు.


శ్యామలీయం బ్లాగు ఇక వ్యాఖ్యలను  స్వీకరించదు.


ఈనిర్ణయానికి రావటం అంత సులభమైన విషయం కాదు. 

ఎంతో ఆలోచించి మథనపడిన తరువాతనే తప్పని సరి అని భావించి ఇలా చేయవలసి వచ్చింది.

కారణం ఏమిటో పాఠకులు సులభంగానే గ్రహించగలరని ఆశిస్తున్నాను.

ఐనా చెప్పవలసిన బాధ్యత ఉందని భావించి చెబుతున్నాను.

కొందరు అజ్ఞాతంగా చేస్తున్న వ్యాఖ్యల వలన ఇబ్బంది కలుగుతున్నది.

నేను ఆవ్యాఖ్యలను ప్రచురించవలసిన అవసరం లేదు. 

వాటిని పట్టించుకోవలసిన అవసరమూ లేదు.

పేరు కూడా దాచుకొని నా తప్పులను వెదకుతూ నాకు అహంకారమూ అవివేకమూ వంటి గుణాలను ఆపాదిస్తూ వ్రాస్తున్నారు.

సరే, వారు తమకారణాలను తాము చూపుతున్నారు.

సమంజసమైన అభిప్రాయాలు కాని అనుమానాలు కాని కొన్ని ఆవ్యాఖ్యలలో ఉన్నా వాటి ధోరణీ భాష వంటి కారణాలవలన ప్రచురణకు అంగీకరించటం జరగలేదు చాలా వాటి విషయంలో.

ఐతే అవి కొనసాగుతూనే ఉండటంతో వీటి ధోరణి ఎలా ఉందో పాఠకలోకానికి ఒకటపా ద్వారా కొన్నింటిని ఎత్తి చూపి పరిచయం చేయటం జరిగింది.

కాని ఆ విధమైన వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి.

సమంజసమైన అనుమానాలకు నేను నేరుగా (వ్యాఖ్యలను ప్రకటించకపోయినా) సమాధానాలను ప్రకటించటం చేస్తూనే ఉన్నాను.

ఐనా, అవి అలా కొనసాగటమే కాదు.

దమ్ముంటే నావ్యాఖ్యను ప్రకటించండి అనటం వరకూ వచ్చింది.

ఇప్పుడు ఆలోచించండి దయచేసి.

నేను బ్లాగు తెఱచినప్పుడు ముందుగా ఎవరి వ్యాఖ్య ఐనా ఉంటే పరిశీలిస్తాను. వ్యాఖ్యను పంపినవారిని వీలైనంత తొందరగా గమనించాలి కదా అని.

ఆతరువాత బ్లాగులో నామానాన నేను రామసంకీర్తనం వ్రాసుకుంటాను,.

నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. నువ్వెలా వ్రాయగలవో ఇంక చూస్తాం అన్న మహోద్దేశంతో కొందరు చేసే వ్యాఖ్యలు నాకు ఎందుకు ఇబ్బంది కలిగించాలి?

ఆవలి వారికి ఎంత ఆసక్తి ఉన్నా అనవసరమైన చర్చలకు నాకెందు ఆసక్తి ఉండాలి?

నాకు దొరికే సమయమే చాలా తక్కువ.

అది కాస్తా రాముడికి బదులు ఈఅనామకులకు ధారపోయలేను.

వాళ్ళు ఛాలెంజీలు చేస్తున్నారని కుస్తీ పట్టటానికి నేను సిధ్ధం కాలేను.

ఈబ్లాగును ఒక చర్చావేదికగా మార్చటానికి నేను సిధ్ధంగా లేను. ఎవరో ఏదో అంటారు. నేను జవాబు చెబుతాను. దానిని మళ్ళా వారో మరొకరో సాగదీస్తారు. రొంపిలోని దిగినాం కదా అని మరలా మరింత వివరణ ఇస్తాను. మళ్ళా మరికొన్ని మాటలు వస్తాయి. జవాబులు చెబుతూ పోవలసి వస్తుంది. ఇదంతా అవసరమా? తమాషా ఏమిటంటే తరచుగా ఇటువంటి చర్చలు టపాలోని విషయానికి సంబంధం కూడా లేకుండానే నడుస్తాయి. ఎందుకవి?

ఈఛాలెంజీలూ చర్చలూ అవసరమా?

నాకంత అవసరమూ లేదు.. ఆసక్తీ లేదు. సమయమూ లేదు. 

ఇకపోతే బ్లాగు అన్నాక వ్యాఖ్యలు స్వీకరించకపోతే చదువరులకు ఇబ్బంది కాదా అంటే అవుననే ఒప్పుకుంటాను. 

కాని ఈబ్లాగుకు వచ్చే వీక్షకుల సంఖ్యా తక్కువే, వ్యాఖ్యల సంఖ్యా తక్కువే.

ఆసక్తి కలవారు రామసంకీర్తనం చదివి ఆనందించటానికి ఈ నానిర్ణయం ఏమీ అడ్డంకి కాదు.

ఇప్పటికే కొందరు బ్లాగర్లు తమ బ్లాగుల్లో వ్యాఖ్యలను స్వీకరించటం లేదంటే వారికీ ఈఅనామకుల వలన వచ్చిన ఇబ్బందులే కారణమేమో

ఇకచాలు అనిపించి వ్యాఖ్యలను చేసే సదుపాయం ఉపసంహరించటం జరిగింది.


26, జనవరి 2024, శుక్రవారం

ఒక అనామకుడి వ్యాఖ్యావిన్యాసం.

కొన్ని గంటల క్రిందట ఈబ్లాగుకు కొన్ని వ్యాఖ్యలను ఎవరో అనామకుల వారు పంపారు వేరు వేరు టపాల క్రింద.

అవి ప్రచురణార్హం అనిపించక ప్రచురించక చెత్తబుట్టలో వేసాను.

ఐతే మన తెలుగు బ్లాగులోకంలో అనామకుల ధోరణి ఎలా ఉందో ఉంటుందో అందరికీ తెలిసిందే ఐనా మరొకసారి పాఠకులదృష్టికి తీసుకొని వద్దామని అనిపించి ఇక్కడ విడిగా ఒక టపాగా ఉంచుతున్నాను.


  1. మీరు బ్రహ్మాండమైన కవులు అనుకుంటున్నారా?? మీరు రాసేవి అద్భుతాలు అనేసుకుంటున్నరా?? పిచ్చి వాగుడు కట్టిపెట్టి నెత్తి కెక్కిన కళ్ళు కిందకు దించి చూడు. నువ్వు మామూలు మనిషివే..చిన్న పాటి కవివి కూడా కావు.
  2. దేవుని నిర్ణయం ప్రకారం కీర్తనలు పుడుతున్నాయి అని తెగ చెప్పుకోకు. ఎవరు ఏమి చేసినా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తాత గారు. కవిత, కథ రాసిన కూడా దైవ నిర్ణయం తోనే వారికి విషయం స్ఫురిస్తుంది. నువ్వు రాసేది దైవ నిర్ణయం, దేవుని కృప, పక్కవాడు రాసేది పేడ, పెంట. నువ్వు లోకాన్ని ఉద్దరించేవడవు. వేరొకరు పనికిమాలిన వారు. నీకు మాత్రమే తెలుసు దైవ నీతి, సాహిత్యం, పక్కవారికి ఏమీ తెలియదు. ఉత్త ఉబలటపడేవారు మాత్రమే. నీ కథలలో పస ఉందా? కీర్తనల అవి?? సంభాషణలు లాగ ఉన్నాయి, ఎగిరిపడింది చాలు, దిగు, నీ స్థాయి చిన్నది..రామదాసు అనుకోకు. నన్నయ్య తిక్కన సాహిత్యం అనుకోకు.
  3. కథలు అస్సలు బాగాలేవు. కీర్తనలు లో పస లేదు. ఫోన్ సంభాషణలు లాగ ఉన్నాయి. నువు రాసిన కవితలు నీకు మాత్రమే.. ఒక్కనీకు మాత్రమే..కేవలం నికే నచ్చి. నువ్వు తెగ ఫీలయి నీ దిక్కుమాలిన సాహిత్యం తో జనాలని వేదించడమే కాక, ప్రజల సాహిత్యం పై ఆరోపణలు కూడా చేస్తున్నావు. నీ అర్హత ఏమిటి? నువ్వు పీకింది ఏమిటి? ఎందులో గొప్ప నువ్వు అసలు. అక్షరం లో నైతే కావు. వయసులో ముసలోడివి అంతే..బుద్ధిలో చిన్న వాడవు
  4. నువ్వు ఎప్పుడు కవివి అవుతావు ఏడుపుగొట్టు తాత..అందరూ కవులు అయ్యారు అని విమర్శ ఏడుపు ఎందుకు? ప్రయత్నించు నువ్వు కూడా అవుతవేమో..మళ్ళా జన్మలో అవుదువులే..ఇప్పటి నీ రాతలకు సరస్వతి దేవి తలుపులు ముసేసుకుంది. ఇది నిజం తాత
  5. కవులు మయం అయ్యారా? నువ్వెప్పుడూ మయం అవుతావు.
  6. నువ్వు కవుల జాబితాలో ఉంటవనుకోకు. పోటు గాడి వి అనుకోకు. చేతకాని వాడివి


నాబ్లాగుకు అనామకుల తాకిడి తక్కువ. నిజానికి నాబ్లాగుకు వచ్చే వ్యాఖ్యలే తక్కువ.

ఇటువంటి వ్యాఖ్యలు రావటం అరుదు. 

పై  వ్యాఖ్యలలో పాటించబడిన సభ్యతాప్రమాణాలు ఎలా ఉనదీ పాఠకులు సులువుగానే గ్రహించగలరని అనుకుంటున్నాను. వాటిలోని భాషాదోషాలను గురించి ప్రస్తావించనవసరం లేదనుకుంటాను.


19, జనవరి 2024, శుక్రవారం

రెట్టమత శాస్త్రం

ఈరోజు 2024-01-19 నాడు కష్టేఫలి బ్లాగులో శర్మ గారు రెట్టమతశాస్త్రం అని ఒక టపాను ప్రచురించారు. విషయం ఒక వాట్సాప్ వ్యాసం లేదా అన్నారు.

ఆటపా విషయంగా కొన్ని విషయాలను గురించి సరైన వివరణలను నాకు తెలిసినంత వరకూ ప్రస్తావించటానికి గాను వ్రాయవలసి వస్తున్నది.

"ఈ రెట్టమత శాస్త్రం లో ఉన్న మనసు ఎవరు ఏమి చెప్పినా దానికి వెంటనే ప్రశ్న వేయడం, ప్రతీ సమస్యనూ వ్యతిరేక దిశలో చూడటం, దానికి విరుద్ధంగా సమాధానం చెప్పడం" అన్నది ఉంటుందని అభిప్రాయం ఉంది టపాలో.

ఈటపాలోని ఇంకొక అభిప్రాయం "రేణుక పరశురాముని తల్లి. భర్త ఏం చెబితే దాన్ని వ్యతిరేకంగా ఆలోచించేది, వ్యతిరేకంగా చేసేది. అందుకే రేణుకా మతం, రెటమత శాస్త్రం అనే పేరు వచ్చింది" అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

ఇంకా "ఈ రెట్టమత శాస్త్రం వారికి శ్రోతలు కావాలి. వారు ఏం చెబితే అది జేజేలు కొట్టడానికి సంఘాలు కావాలి. వీళ్ళు సింగిల్ గా ఉండలేరు.. వీళ్ళని ఎవరు భరించలేరు. వారు చెప్పేది ప్రతీ వ్యక్తీ వినాలి. వీళ్ళు మాత్రం ఎవరి మాటా వినరు" అంటూ మరొక అభిప్రాయం.

ఇంకా "ఇంకొందరు ఉంటారు వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం. ఇది కూడా రెట్టమతమే . సర్దుకోవడం, దిద్దుకోవడం ఈ రెండూ చేతకాని రెట్టమతం వారు" అన్నది.

ఈ అభిప్రయాలను పరిశీలిస్తే రెట్టమతం అంటే మూర్ఖత్వం అని నిర్ధారణ అవుతున్నది.

ఐతే నిజానికి రెట్టమతం అంటే మూర్ఖత్వమూ కాదు మరొక రకమైన మానవప్రవృత్తీ కాదు.  అది నిజంగా ఒక శాస్త్రం.

ఈ శాస్త్ర గ్రంథాన్ని సి.వి,కృష్ణా బుక్ డిపో (మద్రాసు) వారు ప్రచురించారు. ఈపుస్తకం పీడీయఫ్ కాపీని మనం ఆర్కీవ్ సైట్ నుండి దిగుమతి చేసుకోవచ్చును.

ఈ శాస్త్రం ఒక ఐదు ఆశ్వాసాల తెలుగు గ్రంథం. దీనిని వ్రాసిన వారి గురించి ఆశ్వాసాంత గద్యలో ఇలా ఉంటుంది.

ఇది శ్రీమ దొంటిమిట్ట రఘువీరకృపాలబ్ధసార సారస్వత ధుర్యాయ్యలు రాజవంశసంభ వాయ్యలాఖ్య భాస్కరాఖ్య కవిద్వయ ప్రణీతం బగు రెట్టమతశాస్త్రంబు నందు .. ఆశ్వాసము 

అని ఈవిధంగా ఆ గ్రంథంలో ప్రతి ఆశ్వాసం ముగింపులోనూ ప్రస్తావించబడింది.

ఈ గ్రంథం కొండ్రాజ వేంకటాద్రి నరేంద్రుడికి అంకితంగా వ్రాయబడిందని ఆశ్వాసాల్లోని మొదటి పద్యాల్లో చెప్పబడింది.

ఈ రెట్టమత శాస్త్రం గ్రంథంలో ఏమి ఉంటుందో ఆగ్రంథం నుండే చూపిస్తున్నాను. గ్రంథం అవతారికలో

ఈప్రబంధంబున కనుక్రమణీయం బెట్టిదనిన వర్షాది హేతువులగు భూజాతపుష్పఫల లక్షణంబును గోవ్రజార్చనా శకునంబును దూతలక్షణంబును పక్షిశకునంబును గర్భర్తు లక్షణంబును మేహలక్షణంబును  విద్యులక్షణంనును గర్జితలక్షణంబును నింద్రచాప లక్షణంబును పరివేష లక్షణంబును ప్రతిసూర్యాతప వాయులక్షణంబును గ్రహయుధ్ధ లక్షణంబును బీజావాపంబును నర్ఘలక్షణంబును నాకస్మిక లక్షణంబును గ్రహచారాస్తమ యోదయ లక్షణంబును గ్రహఫల లక్షణంబును సంవత్సరాది ఫలంబును వివరించి యుండు ...

అంతే కాదు ఈపుస్తకం రెట్టమతం అనటం ఎందుకో కూడా అక్కడ 57వ పద్యంలో స్పష్టంగా చెప్పారు.

సీ. వరుస గర్గాచార్యవర్యుని మతమున
      మతిశాలి హరిభట్టు మతము నందు
ధర కీర్తిఘనుడైన ధన్యుని మతమున
      ప్రతిభ జెన్నొందు శ్రీపతి మతమున
మేటియైన వరాహమిహిరాచార్యు మతమున
      సన్మేఘమాలికా శాస్త్రమునను
నుచిత కీర్త్యాఖ్యచే నొనరు నారాయణ
      భట్ట మతంబున బ్రాజ్ఞులైన
తే. జనుల యుక్తిని జ్యోతిషసారమునను
శకునచయమున కల యర్ధచయము దెలిసి
కృతి యొనర్చిన రెట్టని మతము నేను
వేడ్క దెనిగించెదను మీకు వేంకటేంద్ర

ఈపద్యం ప్రకారం ఎవరో రెట్టన అన్న మహానుభావుడు జ్యోతిషమూ శకునశాస్త్రమూ మొదలైనవి చక్కగా అధ్యయనం చేసి వాతావరణం గురించి గ్రహాదుల శకునాదుల వలన ఎలా తెలుసుకోవచ్చునూ అని ఒక శాస్త్రగ్రంథం రచించాడనీ ఈ కవులు ఇద్దరూ దీనిని తెలుగు చేసారనీ అర్ధం అవుతున్నది.

అయ్యా, ఈ రెట్టమతం అంటే ఒక శాస్త్రం అన్నమాట. జనులకు వాతావరణ విన్నాణం కోసం ఒక మహానుభావుడు తయారు చేసింది.

అందువలన రెట్టమతం అంటే అది మొండితనమూ మూర్ఖత్వమూ అని అనటం అంత సబబు కాదు.

మరొక మాట. టపాలో పరశురాముల వారి తల్లి రేణుక గురించి వ్రాసిన మాటలు అన్యాయం. ఎంతమాత్రమూ సబబు కావు.

ఐతే జనం నోటిలో రెట్టమతం అన్నమాటకు క్రమంగా అపఖ్యాతి ఎందుకైనా వచ్చిందేమో మరి!

ఒక విషయం చెప్పటం మరచిపోయాను చివరిదాకా. ఈ రెట్టమతశాస్త్రం పుస్తకం నాదగ్గర ఉండేది. ఎక్కడో ఇంకా ఉందేమో కూడా. ఇది మాఅమ్మగారికి ఇచ్చాను. ఆవిడ దగ్గరనే ఉండేది. ఐతే ఆ పుస్తకం ప్రచురించినది సీ.వీ.కృష్ణా వాళ్ళు కాదని గుర్తు. 


3, నవంబర్ 2023, శుక్రవారం

ఒక ఘోరకథకు స్పందన. (updated)


నా పురాకృతపాపం కారణంగా ఈరోజున ఈమాట అంతర్జాల పత్రికలో  ఒక ఘోరమైన నేత్రోన్మీలనం అనే కథను చదువటం తటస్థించింది.

దెబ్బకు గిలగిలలాడి. ఆకథకు స్పందనగా నామాటను అక్కడ వ్రాసాను. ఈక్షణం అది పరిశీలనలో ఉన్న వ్యాఖ్య. ఈమాట వారు దానిని ప్రచురిస్తారో లేదో తెలియదు. ప్రచురించకపోతే ఆశ్చర్యం లేదు. అందుచేత నాస్పందనను ఇక్కడ నాబ్లాగులో ఉంచుతున్నాను.

మన్నించాలి. ఈకథ నామనస్సును బాగా గాయపరచింది. ప్రాణం పోయేంతగా!

శ్రీమద్రామాయణం ఒక కథ అనుకుంటే అది వ్రాసినది వాల్మీకి మహర్షి. అయన కథలోని పాత్రలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను ఆపాదించి కల్పనలు చేసే స్వాతంత్రం ఎవ్వరికీ లేదు.

శ్రీమద్రామాయణం ఒక చరిత్రగ్రంథం అనుకుంటే ఆచరిత్రను గ్రంథస్థం చేసినది వాల్మీకి మహర్షి. అయన చెప్పిన చారిత్రకకథనాన్ని వెక్కిరించేలా ఆరచనలోని పాత్రలకు కొత్తకొత్త వికృతమైన కల్పనలతో మసిపూయటం క్షమార్హం కాదు.

కవులకు రచయితలకూ ఆమాటకు వస్తే అన్నిరకాల కళాకారులకు కల్పనాస్వేఛ్చ తప్పకుండా ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల సృజనలోని అంశాలని విలోమం చేసి స్థలపాత్రకాలస్వభావాదులను ఇష్టారీతిగా మార్చిపారెయ్యటం కూడా స్వేఛ్చగా చేయవచ్చును అని అర్ధం కాదు.

రామాయణం ఆధారంగా అనాదిగా ఎందరో కవులు ఎన్నో ఎన్నెన్నో కల్పనలు చేసారు. కాని ఎవరూ రామాయణపాత్రలను అనుచితంగా చిత్రించి అపచారం చేయలేదు.

ఆధునిక భావజాలం పేరుతో భారతీయసనాతన సంప్రదాయాలనూ సాహిత్యాన్ని చరిత్రనూ కళలనూ అన్నింటినీ వెక్కిరిస్తూ వినూత్నకల్పనలు చేసి సంతోషించే గుణం పెరిగిపోతూ ఉన్నది. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. భారతీయులు తమ మూలాలపట్ల సిగ్గుపడాలీ అని ప్రచారం చేయటమే ఈఆధునికత యొక్క లక్ష్యంలాగా తోస్తోంది. ఈపైత్యం వెనుక వాముపక్షమో జీలకర్రపక్షమో ఏదో భావజాలాన్ని అందిస్తే ఇలా వ్రాస్తున్నారో లేదా కలిప్రభావం చేత సహజం గానే ఇలాంటి బుధ్ధులు అబ్బుతున్నాయో తెలియదు.

శ్రీమద్రామాయణం ప్రకారం సీత రావణుడి ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఆవిడ ఎంతో కోరికతో శ్రధ్దతో రావణుడి బొమ్మవేయటం అనే వికారమైన అనుచితమైన ఆలోచన చేసిన వారిని ఏమనాలో తెలియటం లేదు.

రావణుణ్ణి సీత బిడ్డగా భావించిందా – ఇదీ ఎంత దరిద్రమైన ఆలోచన!

సీతాపరిత్యాగానికి జానపదులు తమకు తోచిన కారణాలను తాము వెదుక్కున్నారు ఒక పాటలో. ఆపాట ప్రకారం శూర్పనఖ ఒక యోగిని వేషంలో అంతఃపురప్రవేశం చేసి సీతమ్మ దర్శనం చేసుకొని, సీతమ్మను రావణుడి బొమ్మ వేయమని అడిగితే ఆవిడ వాడి ముఖం చూడలేదంటే చూసిన భాగం వేయి అని అడిగింది. సీతమ్మ వాడి కాలి బొటనవ్రేలును మాత్రం చూసింది – అదే వేయగలిగింది. ఆబొమ్మను చుప్పనాక అచ్చు సీతవేసినట్లే రేఖావిన్యాసంతో పూర్తిచేసి ప్రాణం పోసి ఎవరూ గమనించని సమయంలో ఆబొమ్మను రాముడి తల్పంలో దాచి చక్కాపోయింది . అర్ధరాత్రి వేళ ఆబొమ్మ రావణుడు “రావేసీతా లంకకుపోదాం” అని పాట లంకించుకుంటాడు. చివరకు రాముడు ఆబొమ్మను కనుగొని ఆబొమ్మ సీతవేసినట్లుగా ఉందని గ్రహించి కోప్పడి సీతను పరిత్యజించాడు. ఒక చమత్కారకథ. అంతే. గమనించండి. ఇక్కడ రామాయణపాత్రల స్వరూపస్వభావాలను కించిత్తూ మార్చటమూ అపహాస్యం చేయటమూ వంటివి జరుగలేదు. ఈ రచయిత్రిగారి కథకు ఆజానపదకథ ఆధారం అని తెలుస్తూనే ఉంది.

ఈపూర్ణిమ తమ్మిరెడ్డి గారెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. తెలుసుకోవటం వలన ప్రయోజనం ఏమీ లేదు నాకు. కాని ఒక సనాతనధర్మానికి చెందిన స్త్రీ అయ్యుండే అవకాశం ఎక్కువ అనుకుంటాను. (ఏమో మతం మార్చుకున్నవాళ్ళూ ఈమద్య పేర్లు మార్చుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారు ఇలాంటి సనాతనసంప్రదాయవిరుద్ధమైన అవమానకరమైన ధోరణులతో.) కాని ఒక స్త్రీ అయి యుండి గతకాలపు మరొక గౌరవనీయ వనిత మీద బురదచల్లే ఇటువంటి రచన ఎలా చేసారో అర్ధం కావటం లేదు. బహుశః ఒక స్త్రీవాది సీతను సృజించి రామాయణాన్ని ప్రశ్నార్ధకం చేదామన్న అత్యాశో దురాశో కారణం కావచ్చును అనుకుంటున్నాను.

ఏమి చేసి నామనస్సుకు తగిలిన గాయం నుండి నేను కోలుకోగలను? అర్ధం కావటం లేదు.

ఇంకా ఇటువంటి భయంకరమైన రచనలను అధునికసాహిత్యధోరణుల పేరుతో ఐతే నేమి తమకూ బాగా నచ్చి అయితే నేమి ప్రచురించిన ఈ “ఈమాట” పత్రికను నేను తక్షణం దూరం పెట్టటం అత్యవసరం అని భావిస్తున్నాను.

ఈమాటవారూ, మీకో దండం. ఇకపై మీ ఈమాట పత్రికను పొరపాటున కూడా సందర్శించను! నాప్రాణం పోయేంత దెబ్బకొట్టారు మీ రచయిత్రి గారూ మీరూను.

రామచంద్రప్రభో! బుధ్ధితక్కువై ఈమాట పత్రికను చదివినందుకూ, ముఖ్యంగా ఈఘోరమైన కధను చదివినందుకూ నన్ను మన్నించు!

update on 2023-11-7
ఈమాట వారు ఆ కథను తమ సంచికనుండి తొలగించారు. వారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. అవెంతవరకూ నిజమో తెలియదు. ఆకారణాలను సాకుగా చూపించి ఉండవచ్చు నంతే. ఇది నాఊహ మాత్రమే. క్రింద సంపాదకులు మాచవరం మాధవ్ గారి మాటలు ఉటంకిస్తున్నాను.

"నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను."

1, ఫిబ్రవరి 2023, బుధవారం

హరికథకు పద్మశ్రీ

ఈ రోజున భండారు శ్రీనివాస రావు గారు హరికథకు దక్కిన పద్మశ్రీ అని ఒక టపా వేసారు. అది చదివిన తరువాత వ్రాస్తున్న నా వ్యాసం ఇది.

హరికథలు వినటం నాచిన్నతనంలో ఒక మంచి అభిరుచిగా ఉండేది. ఇప్పుడు విందామన్నా సరిగా కథ చెప్పే వారు ఉన్నారో లేదో తెలియదు. దూరదర్శన్ ఛానెళ్ళ వారు ప్రసారం చేస్తున్న హరికథలు అప్పుడప్పుడు వింటున్నా అవేవీ నన్ను అకట్టుకోవటం లేదు. నా చిన్నతనంలో మానాన్నగారు హరికథలను బాగా యిష్టపడటం వలన వారి నుండి ఆ అభిరుచి నాకబ్బింది. రేడియోలో వచ్చే‌ హరికథలను తప్పకుండా ఇద్దరమూ విని ఆనందించే వాళ్ళము.

అప్పట్లో ఆకాశవాణి వారు హరికథలనూ విరివిగా ప్రసారం చేసేవారు. నాటకాలనూ విరివిగా ప్రసారం చేసేవారు. తరచూ రేడియో‌నాటక సప్తాహాల్లాంటివి కూడా వచ్చేవి. అలాగే సంగీతకచ్చేరీలూ తరచుగ వచ్చేవి. మానాన్నగారూ నేనూ అవన్నీ వినేవాళ్ళం శ్రధ్ధగా. ఏడాది కొకసారి ఉగాది సందర్భంగా పండుగనాటి ఉదయం ఆకాశవాణి వారి కవిసమ్మేళనం ఉండేది. ఇద్దరం తప్పకుండా ఉత్సాహంగా వినేవాళ్ళం. మానాన్నగారు పద్యాలంటే ఎంతో ఇష్టపడే వారు. చాలా శ్రావ్యంగా పద్యాలను గానం చేసే వారు కూడా. ఆయనకు ముఖ్యంగా వడ్డాది సుబ్బారాయ కవి గారి భక్తచింతామణీ శతకం లోని పద్యాలంటే ప్రాణప్రదంగా ఉండేది. తరచూ వాటిని గొంతెత్తి మహాశ్రావ్యంగా పాడేవారు. ఉగాది కవిసమ్మేళనంలో విశ్వనాథ వంటి ఉద్దండుల కవిత్వాలను విని ఆనందించే వాళ్ళం. రాను రానూ పద్యాలను త్రోసిరాజని ఆకవిసమ్మేళనంలో వచనకవిత్వాలకు పెద్దపీట వేయటం మొదలయ్యింది. ఆధోరణి మానాన్నగారికి నిరుత్సాహం కలిగించేది. ఒకసారి ఐతే అందరూ వచనకవితలే చదివారు. ఒక్కరూ శ్రావ్యంగా ఒక్కపద్యమూ చదవకపోవటమూ - ఆవచనకవిత్వం ఏమిటో ప్రతిలైనూ రెండేసి సార్లు చదవటం ఏమిటో - ఆయనకు అస్సలు నచ్చలేదు. ఇంక మనం ఈకవిసమ్మేళనం వినక్కర్లేదు అనేసారు! అలాగే నాటకం ఐనా హరికథ ఐనా కూడా అది నచ్చితే దాని గురించి కొంచెం నాతో చర్చించే వారు.

అప్పట్లో మేము కొత్తపేట (తూ-గో-జి) గ్రామంలో ఉండే వాళ్ళం. ఆఊళ్ళొ వినాయకచవితి, శరన్నవరత్రాలూ చక్కగా జరిపేవారు. చవితికి ఊరినిండా వెలిసిన పెద్దపెద్దపందిళ్ళలోనూ నవరాత్రాలకు రాజరాజేశ్వరీ అమ్మవారి గుడిలోనూ హరికథాకాలక్షేపాలు తప్పనిసరిగా ఉండేవి.

కొత్తపేటను ఆనుకొని పలివెల పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శివుడు కొప్పులింగేశ్వరస్వామి వారు. ప్రాచీనాలయం. కాకతీయుల నాటి శాసనాలు అప్పటికి ఇంకా కొన్ని గుడి స్థంభాలపైన ఉండేవి. వాటికి నకళ్ళు తీసి మనవాళ్ళు భద్రపరచారో లేదో తెలియదు. అవి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో ఆధునికీకరణలో కొట్టుకుపోయాయో తెలియదు. ఆగుళ్ళో కూడా మహాశివరాత్రి గొప్పగా జరిగేది. ఇద్దరమూ తప్పక ప్రతి మహాశివరాత్రికీ పలివెల వెళ్ళే వారం. ప్రసక్తి వచ్చింది కాబట్టి మరొక మాట. మందపల్లి పుణ్యక్షేత్రం కూడా కొత్తపేటను ఆనుకొనే ఉంటుంది.

శివరాత్రి సందర్భంగానే కాక ఇతర సందర్భాల్లో కూడా పలివెల వెళ్తూ ఉండే వారం. అటువంటిదే ఒక సందర్భం పలివెల శివాలయంలో జరిగిన ఒక హరికథా కాలక్షేపం. కథకులు ఎవరో ఇప్పుడు గుర్తులేదు. మార్కండేయ చరిత్రం చెప్పారు. హరికథా గానం అంతా సంస్కృతంలో జరిగింది. రాత్రి తొందరగా భోజనాలు ముగించుకొని మానాన్నగారూ, ఆయనతో మరికొందరు ఉపాధ్యాయులూ, వారి వెంట నేనూ ఆ హరికథకు వెళ్ళాం. తిరిగి వచ్చేసరికి తెల్లవారుజాము ఐనది.చాలా గొప్పగా చెప్పారు హరికథను.

నాచిన్నతనంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను కూడా విన్నాను. స్థలం కొత్తపేట. సందర్భం ఎన్జీవో భవనం ప్రారంభోత్సవం ఆవిష్కర్త జిల్లా కలక్టర్ గారు. సభలో వినోద కార్యక్రమం శాస్త్రిగారి హరికథ. కథాంశం విరాటపర్వం.  అసలు ఆభవనం పైన ఎన్.జీ.వో భవనం అని ఉండవలసి ఉంటే ఎందుకో అందరూ ఆశ్చర్యపోయేలా ఎవరో కాని ఎన్.జి.జి.వో భవనం అని చెక్కించారు. మానాన్నగారూ మరికొంత మందీ అది చూసి బాధపడ్డారు.

హరికథను సచ్చిదానంద శాస్త్రి గారు ఎంతో అసహ్యంగా చెప్పారు ఆనాడు. స్టేజి మీదే వెకిలి రికార్డింగు డాన్స్ చేసారు. అసలు కథను మాత్రం నామమాత్రంగా చెప్పారు. అప్పట్లో నర్తనశాల సినిమా వచ్చి బాగా అడింది. అందులో పాటలు జగత్ప్రసిధ్ధం అయ్యాయి. జననీశివకామినీ అన్న భక్తి గీతం ఎంత గొప్పగా ఉందీ అంటే అందరికీ అది కంఠస్థం ఐపోయింది. శాఖాచంక్రమణంగా ఒక మాట చెప్పాలిక్కడ. మాశ్రీమతి అక్కగారు ఒకరు నిత్యం పూజలో ఈ జననీశివకామినీ అన్న పాటను పాడుతూ ఉంటారు! సరే శాస్త్రి గారు ఈపాటనూ పాడారు. జనరంజకత్వం కొసం అన్నట్లుగా ఆ నర్తనశాల లోనిదే ఐన దరికి రాబోకు రాబోకు రాజా అన్న పాటను పాడారు - అదీ పరమ వెకిలి చేష్ఠలతో.

ఆయన తన హరికథలో తప్పకుండా ఓం హరా శంకరా అన్నపాట పాడతారు. ఆనాడూ పాడారు. పాడిన తరువాత ఈ నాపాటను మెచ్చుకొని జమున గారు నాకు పదివేలు చదివించారు అని అన్నారు. అంతకు పూర్వమూ ఆతరువాత కూడా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను విన్నాను నేను. ఆయన తప్పని సరిగా ఓం హరా శంకరా అన్నపాట పాడారు అన్ని కథల్లోనూ సందర్భం చూసుకొని.

ఆరోజు ఆయన చెప్పిన నానాకంగాళీ హరికథ సభలో ఉన్న ఎవ్వరికీ అస్సలు నచ్చలేదు. అస్సలు హుందాగా లేదని చాలా బాధపడిన వాళ్ళెందరో.

ఐతే ఇలాంటి హరికథలతో జనాకర్షణ బాగానే చేసి సచ్చిదానంద శాస్త్రిగారు బాగానే సంపాదన చేసారని చాలామంది చెప్పగా విన్నాను.

కొత్తపేటలో మేము గర్ల్స్ హైస్కూలు ఎదురుగా ఉన్న తాడిగడప వారి ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళం. సందుకు ఈపెడగా మాయిల్లు ఉంటే ఆపెడగా కరణంగారు సరస్వతుల వారి ఇల్లు ఉండేది. ఒక సారి శరన్నవరాత్రుల సందర్భంగా ఒక భాగవతార్ గారు వచ్చి సరస్వతుల వారి ఇంట్లో మకాం చేసారు బంధుత్వాన్ని పురస్కరించుకొని. ఆయన కథ కూడా చాలా బాగా చెప్పారు ఆరాత్రి. అప్పట్లో నవరాత్రులకు తొమ్మిది రోజులూ గుళ్ళో హరికథాకాలక్షేపం ఉండేది కదా, ఈయనది ఆరవరోజున జరిగింది అని ఇప్పటికీ‌ గుర్తే.

నేను ఉద్యోగార్ధం హైదరాబాదుకు రావటం జరిగింది. (తెరాస/భారాస వారు అప్పట్లో ఆరోపించినట్లుగా తెలంగాణాను దోపిడీ చేసేద్దాం అని రాలేదు లెండి). అక్షరాలా పొట్ట చేత్తో పట్టుకొని వచ్చాను. అప్పటికి మేము రంపచోడవరంలో ఉన్నాం. మొదటిసారి హైదరాబాదు నుండి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ట్రాన్సిష్టర్ రేడియో పట్టుకొని వెళ్ళాను మానాన్నగారి కోసం. అది ఎప్పుడూ ఆయన చేతుల్లోనే ఉండేదని మా అమ్మగారు అంటూ ఉండే వారు. ఎప్పుడన్నా ఒక్క మంచి రేడియో ప్రోగ్రాం మిస్ కాకుండా అది ఆయనకు కూడా ఉండి ఆనందాన్ని ఇచ్చేదట.

హైదరాబాదు వచ్చేసాక కూడా, రేడియో లోనూ ప్రత్యేకం గానూ నేను చాలానే గొప్ప హరికథా గానాలను విన్నాను. కొత్తపేట వదిలిన తరువాత కూడా హరికథలపై ఆసక్తి అలాగే ఉండేది. మానాన్నగారి నిర్యాణం అనంతరం కూడా ఇంకా కొన్నాళ్ళు రేడియో ప్రభ నడిచింది. అన్నాళ్ళూ‌ అంటే టీవీ వచ్చి రేడియోను మూలకు నెట్టేసే దాకా నేను రేడియోలో హరికథలను వినే వాడిని. నాటకాలనూ వినే వాడిని. కచ్చేరీలనూ వినేవాడిని.

ఇంతకీ సచ్చిదానంద శాస్త్రిగారికి పద్మశ్రీ అంటే అది అయన కథకు మెచ్చి ఇచ్చినది అనుకోవాలా? ఆయన జనాకర్షణ కల కళాకారుడు కాబట్టి ఇచ్చారని అనుకోవాలా? లేదా అయనకు ఏమన్నా మంచి పలుకుబడి కూడా ఉంది కాబట్టి వచ్చిందా? నాకు తెలియదు. ఈపద్మశ్రీ బిరుదులకు ఆట్టే విలువ ఇవ్వనక్కరలేదని నా అభిప్రాయం. 

ఈమధ్య నేను ఈపద్మ అవార్డుల గురించి చేసిన ఒక వ్యాఖ్యలో ఈఅభిప్రాయాన్నే వ్యక్తపరిచాను నెమలికన్ను బ్లాగులో .

అన్నట్లు హరికథకూ నాకు ఒక బాదరాయణ సంబంధం కూడా ఏర్పడింది! నా మామగారు స్వర్గీయ పోణంగి శరభరాజు గారు స్వయంగా హరికథా భాగవతార్. ఆయన హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారికి నేరుగా శిష్యులు.

19, ఆగస్టు 2022, శుక్రవారం

ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు?


 ఈ ధర్మరాజుగారు జూదం ఆడటం ప్రస్తావన వచ్చింది ఒక కష్టేఫలీ బ్లాగుటపా తాలూకు చర్చలో. సరే వచ్చింది. నేనా చర్చలో దూరి (అనవసరంగా అంటారా? కావచ్చును!) ఒక మాట అన్నాను. "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని. ఇది చూసి ఒక వ్యాఖ్యాత గారు "ఇది నాకు తెలియని కొత్తవిషయం. రిఫరెన్స్ ఇవ్వగలరా?" అని అడిగారు.

అలా అడగటాన్ని ఎద్దేవాచేస్తూ మరొకరు "వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే" అన్నారు కాని అది సరైన మాట కాదు.

ఎందుకంటే ఆంధ్రమహాభారతంలో మీకు ఈవిషయానికి సంబంధించిన వివరాలు దొరకవు. అలా ఎందుకో కొంచెం వివరిస్తాను.

సంస్కృతంలో వేదవ్యాసమహర్షి విరచించిన మహాభారతం ముఫ్ఫైలక్షల శ్లోకాల మహాపర్వతం. దానిని మానవమాత్రులు చదవటం మహాదుష్కరం. కాబట్టి మానవలోకంలో కేవలం లక్షశ్లోకపరిమితిగా మహాభారతం ఇవ్వబడింది. కాని కాలక్రమేణా, కలిముదిరి లక్షశ్లోకాల సంగతి అటుంచి సంస్కృతభాషలో ఉన్న ఇతిహాసాన్ని జనసామాన్యం చదవటం అసాధ్యం ఐపోయింది.

కవులు జనభాషల్లోనికి దానిని యధాశక్తిగా తీసుకొని రావటం మొదలైంది. సంస్కృతభారతాన్ని తెలుగులోకన్నా ముందుగా కన్నడంలో అనువాదం చేసారు. ఆచేసినాయన జైనమతస్థుడు. దానితో పాండవులంతా మహాశ్వేత భక్తులైపోయారు. ఇంకా చాలా మార్పులు జరిగి సనాతనధర్మాన్ని ప్రబోధించే మహాభారతం దుర్గతి పాలౌతోందని పెద్దలు వాపోవటం మొదలైంది. అప్పట్లో తెలుగు కన్నడ భాషలింకా పూర్తిగా విడిపోలేదు. మనవాళ్ళు రెండుభాషల్నీ ఆదరించేవారు. దాని వలన తెలుగుదేశంలో భారతాన్ని ఆంధ్రీకరించాలీ అనే ఒక తపన మొదలయ్యింది. నన్నపార్యుడు దానికి పూనుకోవటంతో శ్రీమదాంధ్రమహాభారతం రూపుదిద్దుకోవటం జరిగింది.

ఇది పూర్తికావటానికి బహుకాలం పట్టింది. నన్నయ్య, తిక్కన్న, ఎఱ్ఱన్న అని ముగ్గురు మహాత్ములు శ్రీమదాంధ్రమహాభారతంమనకి అందించారు మొత్తం మీద.

ఈ మహాభారతాంధ్రీకరణం అంటే మూలంలోని లక్షశ్లోకాలనూ ఎలాఉన్నవి అలా తెలుగులోనికి తేలేదు. అక్కడ ఉన్న కధలూ ఉపకథలూ అన్నీ అలాగే తేలేదు. కొంత ప్రణాళికవేసుకొని చేసారు. మనకాలం వారి శక్తికి అనుకూలంగా కొంత క్లుప్తీకరించారు.

గరుత్మంతుడి కథ రెండు చోట్ల వస్తుంది మూలంలో - దాన్ని ఆదిపర్వంలో మాత్రం చెప్పారు. ఇల్లాంటివి చాలానే స్వతంత్రమైన పోకడలు పోయారన్నమాట.

ఇక విషయంలోనికి వద్దాం.

ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసారు. అందరికీ తెలిసిన సంగతే. ఆయాగంలో కృష్ణుడికి అగ్రపూజ చేయటమూ దాన్ని అక్షేపించిన శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించటమూ కూడా అందరికీ తెలిసినదే.

యాగం పూర్తి అయ్యాక దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళారు. చివరగా బయలుదేరినది వేదవ్యాసమహర్షి. ఆయన్ను ఊరిపొలిమేర దాకా పాండవులు సాగనంపారు.

సరిగ్గా ఆసందర్భంలో ధర్మరాజుగారు వేదవ్యాసుల వారిని ఒక ప్రశ్న వేసారు.

ఈ రాజసూయమహాయాగం కారణంగా జనక్షయం అన్నది చెప్పారు కదా. అది ఈ శిశుపాల వధతో తీరిపోయినట్లే కదా అని అడిగారు.

దానికి వేదవ్యాసుడు చెప్పిన జవాబు వినండి. ధర్మరాజా, నీవీ‌ ప్రశ్న అడగకుండా ఉంటేనే బాగుండేదేమో. విను. ఈరాజసూయం తెచ్చే కలహం మాసిపోలేదు శిశుపాలవధతో. అది పదమూడు సంవత్సరాల తరువాత వస్తుంది మహా జనక్షయం జరుగుతుంది. అది నీ నిమిత్తంగా జరుగుతుంది. దానికి దుర్యోధనుడు కారణం అవుతాడు తన అత్యాశతో.

ఈసమాధానంతో ధర్మరాజు గారు హతాశుడయ్యాడు. ఇంటికి పోయి సోదరులతో సమావేశం ఐనాడు. వ్యాసభగవానుడు సెలవిచ్చిన మాటలు చెప్పి దుఃఖపరవశుడయ్యాడు.

హఠాత్తుగా ఒక నిర్ణయం ప్రకటించాడు. కలహానికి దుర్యోధనుడి దుర్బుధ్ది కారణం ఐనా అది నా నిమిత్తంగా వచ్చే‌ ప్రళయం ఐనప్పుడు దానిని శాయశక్తులా నివారించాలి. ఇకమీద దుర్యోధనాదులు ఏమి కోరినా కాదనను. అలా చేస్తే కలహానికి కారణమే ఉండదు కదా. అదే కర్తవ్యం నాకు అని.

దుర్యోధనుడు పాండవశ్రీని ఓర్వలేక తానూ రాజసూయం చేయాలని తలపోసాడు. కాని అది కుదరదు. చక్రవర్తి కాని వాడు చేయరాదనీ  అసలు దుర్యోధనుడు మూర్ధాభిషిక్తుడైన రాజే కాదు కనక కుదరదనీ పురోహితులు తేల్చి చెప్పారు. ఐతే ప్రత్యామ్నాయంగా వైష్ణవం అనే దొడ్డయాగం చేయవచ్చుననీ చెప్పారు.

సరే అని ఆ వైష్ణవయాగం చేసాడు దుర్యోధనుడు. గొప్ప సభాభవనం కూడా కట్టించాడు. పాండవులను ఆహ్వానించాడు. అపైన జరిగినది తెలిసినదే.

ఆవిషయంలో కొంచెంగా చెప్పుకోవాలి ఐనా సరే. పాండవులను సరదాజూదం పేరుతో సర్వవిధాలా అవమానించిన తరువాత ద్రౌపదీదేవి శపిస్తే పుట్టగతులుండవని ధృతరాష్ట్రుడు ఆవిడకు వరాలిస్తాడు. 

అంతేకాక తనంత తానుగా ఆవిడ ధర్మపరాయణత్వానికి ముగ్ధుడై మరొక వరం ఇస్తాడు. ఈ జూదం ముందు ఉన్న స్థితిని పునరుధ్ధరించుతున్నానని ప్రకటించాడు.

కడుపుమండి, దుర్యోధనుడు మళ్ళా జూదం నడిపించి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు.

అదీ సంగతి.

ఈ కథాక్రమంలో నన్నయ్య గారు తెలుగు చేయకుండా వదిలిన ఘట్టాల్లో ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా విరోధాన్ని నివారించటానికి పెట్టుకున్న ఒట్టు విషయం ఒకటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఐనది. ధర్మరాజు అలా ఒట్టు పెట్టుకోక పోతే జూదానికి ఒప్పుకోవలసిన అగత్యం ఉండేది కాదు. కలహ నివారణకోసం పెట్టుకున్న ఒట్టే కలహానికి బీజం వేసింది!

18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ - 2 (రెండు కథలు)



ఎందుకో కాని ఈ రెండు కథలనూ కొంచెం‌ క్లుప్తంగా ఐనా తప్పకుండా అందరికీ చెప్పాలీ అనిపించింది.

రెండూ అలనాటి కథలే.  అంటే దశబ్దాల క్రిందటి కథలే.

ఉత్తుత్తి కథలు కావు. నిజంగా జరిగిన కథలే. ఈ రెండూ కూడా ఒకే ఊరి కథలు.

మొదటి కథ శ్రీరామమూర్తి-భగవంతరావు గార్లనే అన్నదమ్ముల కథ.  శ్రీరామమూర్తి గారంటే ఒకప్పుడు తూ.గో.జి.లో ప్రసిధ్ధులైన డాక్టరు గారు. ఆయన ఆర్.ఎం.పీ. డాక్టరు గారు. ఐతేనేం ఇంగ్లీషు మందులూ‌ ఇచ్చే వారు. ఆయుర్వేదం‌ మందులూ ఇచ్చే వారు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం అన్న ట్లన్నమాట.

శ్రీరామమూర్తిగారికి కొత్తపేట మెయిన్ రోడ్ మీద ఒక క్లినిక్ ఉండేది. ఆ క్లినిక్ ముందు అంబారుఖానా శ్రీరామమూర్తి అని చాలా పెద్దపెద్ద అక్షరాలలో వ్రాసి ఉండేది.

ఎందుకో తెలియదు కాని ఆ బోర్డుమీద అయన తమ్ముడు భగవంత రావు గారి పేరు ఉండేది కాదు.

భగవంత రావు గారు అన్నగారితో పాటు ఆ హాస్పిటల్‌లో వైద్యం చేస్తూ మహా బిజీగా ఉండే వారు. ఆయన కూడా ఆర్.ఎం.పీ డాక్టరు గారే.

పేషంట్లను చూడాలి బయటకు వెళ్ళి అన్నప్పుడు భగవంత రావు గారు ఒక పెద్ద మోటర్ సైకిల్ మీద అన్నగారిని తీసుకొని వెళ్తూ ఉండే వాడు. తరచుగా తానొక్కడే వెళ్ళటం కూడా ఉండేది.

వారి ఆహార్యాలు తమాషాగా అనిపించేవి. ముఖ్యంగా శ్రీరామ మూర్తి గారి విధానం. ఆయన కొంచెం గోదుమ రంగు పంచె చొక్కా వేసేవారు. ఆచొక్కాని పంచలోనికి టక్ చేసే వారు. ఆపంచను తన బూట్లలోనికి దోపేవారు. అవి కూడా హంటర్ బూట్లు అంటామే‌ అలాంటివి. భగవంతరావు గారు ఎప్పుడు మల్లెపూల వంటి తెల్లటి పేంట్ షర్టు వేసుకొనే వారు. ఇతరత్రా అహార్యంలో వీరిద్దరినీ ఎప్పుడూ చూడలేదు.

ఇద్దరూ వైద్యం‌ చేస్తున్నా అందరూ శ్రీరామమ్మూర్తి గారి ఆస్పత్రి అనే అనే వారు.

ఆ ఆస్పత్రి నిజంగా ఒక ధర్మాసుపత్రి అనే చెప్పాలి. ఇచ్చే వారు వారి తాహతుని బట్టి ఇచ్చే వారు. ఇవ్వలేని బీదాబిక్కీ ఇవ్వరు. ఎవ్వరూ‌ ఇంత అని అడగటం కూడా ఉండేది కాదు. ఐనా ధనవర్షం‌ బాగానే కురిసేది.

కురవదా మరి? ఊళ్ళో శ్రీరామ్మూర్తి గారిదే వైద్యం ముఖ్యంగా. 

ఒక్క కాశిన చిన్నంరాజు గారని ఒక ఎంబీబీయస్ డాక్టరు కూడా ఉండే వారు కాని వారు ఖరీదైన డాక్టరనే‌ ప్రతీతి. అందుచేత ఎక్కువ మంది వెళ్ళేది శ్రీరామమూర్తి గారి దగ్గరకే. 

అదీ‌కాక ఈ‌ చిన్నంరాజు గారికి ఒక తమాషా పేరుండేది - ఎంత చిన్న సమస్య కైనా పేజీకి తక్కువ మందులు వ్రాయరని. అది నిజమే  కూడాను. మా పక్కవాటా వక్కలంక నరసింహ మూర్తి గారి సతీమణికి ఒకసారి చాలా ఉధ్ధృతంగా శిరోవేదన వచ్చింది. ఇక తప్పదని డాక్టరు గారిని పిలిచారు. చిన్నంరాజు గార్ని అన్నమాట. ఆయన వచ్చి పరీక్షించి అక్షరాలా పేజీ నింపేశారు మందులతో. అవన్నీ ఇక్కడ దొరుకుతాయా మన కొత్తపేటలో అంటే  ప్రయత్నించండి అన్నారు. దొరకనివి చాలానే ఉండినవి - వాటిని మర్నాడు రాజమండ్రికి వెళ్ళి కొనాల్సిందే అనుకున్నారు. ఆరాత్రికి ఆవిడకు ఏమన్నా మందులు ఇచ్చారా అన్నది తెలియదు. ఏదైతేనేం తెల్లవారేసరికి తలనొప్పి గిలనొప్పి జాడలేదు. రాజమండ్రి పోలేదు. మందులూ తేలేదు. అందరూ చాలా కాలం నవ్వుకొనే వారం ఆ డాక్టరు గారి మందుల పట్టీ చూసి.

ఎందుకు అందరూ శ్రీరామ్మూర్తి గారి దగ్గరకు వెళ్ళి ఒకటి రెండు రూపాయల వైద్యంతో హాయిగా ఉండే వారో అర్ధం ఐనది కదా. అదీ సంగతి.

ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఈ‌ భగవంతరావు గారు మానాన్నగారికి చిన్ననాటి స్నేహితుడే - బెంచిమేట్ అనుకుంటాను. అందుచేత సహజంగా మా యింటి వైద్యం అంతా శ్రీరామమూర్తి గారు మరియు భగవంత రావు గార్ల చేతిలో నడిచేది.

ఈ శ్రీరామమూర్తి గారు కొత్తపేట ఊరి చివరన, పలివెల వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ మీద భవంతి కట్టుకున్నారు. గృహప్రవేశం కోలాహలంగా జరిగిందని విన్నాను కాని వివరాలు గుర్తులేవు. కాని ఆ తరువాత కాలంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మాకు కూడా ఒక ప్రత్యేకమైన అహ్వానం అందింది. హాస్పిటల్‌కు వచ్చిన వారికి ఆహ్వానం ఇచ్చినట్లుగా ఇవ్వటం కాదు, ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచారని గుర్తు.

ఆరోజున సత్యనారాయణ వ్రతం మధ్యలో చదివింపులు మొదలయ్యాయి. డాక్టరు గారికి అన్నమాట. అవేమి చదివింపులో గంటో గంటన్నరో ఐనా తెమలటం‌ లేదు. ఆతరువాత మానాన్నగారు చెప్తే అర్ధమైంది. డాక్టరు గారు వైద్యం చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఊరి వారు యథాశక్తిగా కానుకలు సమర్పించుకోవటం అది అని. ముఖ్యంగా ఈచదివింపుల్లో ముప్పాతిక మువ్వీసం ధనరూపంలోనే. అలా వచ్చింది ఎన్నో వేలుంటుంది ఆ అరవైల్లోనే అంటే అతిశయోక్తి ఏమీ‌ లేదు.

ఈ వ్రతం జరిగే నాటికి నేను హైస్కూలు విద్యార్ధిని. దరిమిలా కొన్ని సంవత్సరాల తరువాత నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాను. కొంతకాలం తరువాత శ్రీరామ మూర్తి గారు కాల గతి చెందారు.

ఆపుడు తెలిసింది ధనం అంటే ఏమిటో‌ దాని ప్రభావం ఏమిటో అన్నది.

శ్రీరామమూర్తి గారూ భగవంతరావు గారూ ఇద్దరూ రామలక్ష్మణులే అన్నట్లుండే వారు. రాముడెక్కడన్నా లక్ష్మణుడిని ముంచుతాడా నిలువునా?

ఈ కలియుగ రామ మూర్తి గారు ముంచారనే జనం విస్తుపోయారు.

ఆస్తిపాస్తులన్నీ రామమూర్తి గారివే. చివరకు భగవంత రావు గారి దర్జా స్కూటరూ శ్రీరామ మూర్తి గారి పేరనే ఉంది. ఈ లక్షణుడికి కనీసం ఉండటానికి స్వంత ఇల్లు ఐనా లేదు. పూచిక పుల్లంతైనా ఆస్తి పాస్తులన్నవి లేవు.

యావజ్జీవం ఏ‌హాస్పిటల్ కోసం ఊడిగం చేసాడో అందులో కాలు పెట్టరాదన్నారు.

కట్టుబట్టలతో మిగిలాడు ఈ అభినవ లక్ష్మణుడు. 

తానూ‌ డాక్టరే, వేరే చిన్న ఆస్పత్రి పెట్టుకున్నాడు. 

మిగిలిన కథ ఏముంది. ఉనికి కోసం కష్టపడ్డారు భగవంత రావు గారు. పిల్లలు అంది వచ్చారు లెండి దైవకృప వలన.

అన్ని పరిణామాలూ ఈకథలో నాకు అంత వివరంగా తెలియవు.


* * *


ఇప్పుడు రెండవ కథ. చెప్తాను. ముళ్ళపూడి వారు వారి ఇంటి పేరు. ఈ ఇంటిపేరు కల వారు అనేక వర్ణాల్లో ఉన్నట్లున్నారు. వీరు బ్రాహ్మణులు. శాఖా గీకా గురించి నాకు తెలియదు. అదేమీ ముఖ్యం కాదు. 

ఇంట్లో ఉండేది కొంచెం మందే. గృహస్థు, ఆయన భార్య, బావమరది, కుమారుడు మాత్రమే. ఇందులో నాకు తెలిసిన వ్యక్తి ఆ కుమారుడు ఒక్కడే. వాడి పేరు సత్యనారాయణ. మాస్కూల్‌మేట్. నాకన్నా ఒక క్లాసు దిగువన చదివే వాడు. కాని నాతో‌  మంచి దోస్తీ‌ ఉండేది. 

ఒక చేదు జ్ఞాపకం. ఎందుకో కాని వాడూ‌ నేనూ ఒకనాడు స్కూలు గ్రౌండ్‌ లోనే‌ బాగా తన్నుకున్నాం. ఎందుకో గుర్తులేదు. ఎవరిది తప్పూ అన్నది ఎవరికి గుర్తు. కొట్టుకున్నాం ఏదో చిన్న చిలిపి కారణానికే. కాని అది మా స్నేహానికి కించిత్తు కూడా దెబ్బ కొట్టలేదు. 

సత్యనారాయణ తండ్రి గారు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉండే వారు. సంప్రదాయిక వైద్యుడు. ఆయన మీద గురి ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉండే వారేమో - వారి జరుగు బాటు బాగానే ఉండేది. వారి ఉనికి వారి స్వంత ఇంటిలోనే. చిన్నదే అయినా పక్కా పెంకుటిల్లు. ఆయింటికి నేను బోలెడు సార్లు వెళ్ళాను. వాడు కూడా మాయింటికి లెక్కలేనన్ని సార్లు వచ్చాడు. 

సత్యనారాయణ తండ్రిగారు అయన బావమరది కూడా ఆయుర్వేద వైద్యులే. ఈ బావమరది గారు స్వయాన వైద్యుడు కాకపోవచ్చును అని నా ఉద్దేశం. వైద్యం ఆపెద్దాయన చేస్తూ ఉంటే మందులు చేయటంలోనూ పేషంట్లను చూసుకోవటం లోనూ బావమరది సహాయకుడిగా ఉండే వారు. ఆయన చెప్తుంటే ఈ‌బావమరది మందులు కలపటమూ‌ నూరటమూ వంటివి చేస్తూ ఉండటం నేను స్వయంగా చాలా సార్లే చూసాను.

కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. ఉన్నట్లుండి ముళ్ళపూడి వారు జబ్బుపడ్దారు. ఊరిలో ఉన్న వైద్యులు కొన్నాళ్ళు వైద్యం చేసి చేతులెత్తే సారు. కాకినాడ పెద్దాస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించండి అని సలహా ఇచ్చారు.

ఊళ్ళో‌ వైద్యం అంటే అది వేరే సంగతి. ఎంతైనా సాటి వైద్యులన్న గౌరవంతో ఎవరూ రొక్కించి అడగక పోవటంతో ఆట్టే ఖర్చు లేకుండానే ఇంత కాలమూ నడిచింది. కాకినాడ పట్నమే. ఎరగని ఊరే మరి. అక్కడెలా?

సకుటుంబంగా కాకినాడ వెళ్ళారు. వైద్యం నడుస్తోంది. దనం ధారాళంగా కర్చు అవుతున్నది.

మరీ అంత ఉన్నకుటుంబం కాదాయిరి. ఊళ్ళో నుండి కొంత సహయం అందిందేమో కొన్నాళ్ళు ఎలాగో అలా ఖరీదైన వైద్యానికి తట్టుకొని నిలిచారు.

జబ్బు తగ్గటం లేదు.

చివరికి తమ స్వంత ఇల్లు తెగనమ్మి వైద్యం చేయించాలని నిశ్చయించారు.

నిశ్చయించటం అంటే ఎవరిది నిర్ణయం?

సత్యనారాయణ తల్లికి ఉన్న దిక్కూ సలహా దారు తన తమ్ముడే. సత్యనారాయణ అంటే ఇంకా చిన్నపిల్లాడే‌ కదా.

వినండి. తప్పని సరై ఇల్లు అమ్మేసారని ఊరంతా గుప్పుమంది.

అందరూ చాలా బాధపడ్దారు. ఆకుటుంబం మంచి అందరికీ తెలుసును ఊళ్ళో. మా అమ్మగారూ‌ నాన్నగారూ కూడా బాధపడటం‌ నాకు బాగానే గుర్తుంది. తెల్లవారిలేస్తే ఈ సత్యనారాయణ అనే చిన్నపిల్లవాడు కళ్ళముందు తిరుగుతూ ఉండే వాడు కదా. అస్తమానం మాయింటికి వస్తూనే ఉండే వాడు కదా. వాడి కుటుంబానికి వచ్చిన కష్టం కదిలించకుండా ఉంటుందా చెప్పండి.

పెద్దాయన వైద్యం కోసం అని చెప్పి,  అక్కాతమ్ముళ్ళు వచ్చి ఇంటిని ముఫ్ఫైవేలకు అమ్మి సొమ్ముతో‌ అదరాబాదరా వెళ్ళిపోయారు కాకినాడకు.

మరి కొద్ది రోజుల్లోనే దుర్వార్త వినవలసి వచ్చింది.

దానితోపాటే అందర్నీ కలచివేసింది మరొక ముఖ్యమైన సంగతి.

సొమ్ముని మగదిక్కు తమ్ముడు గారు జాగ్రత్తగా పట్టుకొని అక్కగారితో‌ కాకినాడ వెళ్ళాడు. ఆవిడ భర్తను చూడటానికి అదరాబాదరా పరుగెత్తింది. 

కొద్ది సేపటికి డబ్బు సర్దుబాటు చేసుకొని వచ్చారా అని ఆస్పత్రి వారు అడిగారు. అవునండి, ఇదిగో మా తమ్ముడి దగ్గరుందీ.. అంటూ ఆవిడ తమ్ముడి కోసం చూసింది.

ఇంకా ఎక్కడి తమ్ముడు?

ఇంకా ఎక్కడి డబ్బు?

ఆ తమ్మయ్య గారి జాడ ఎవ్వరికీ ఎన్నటికీ దొరకలేదు.

ఇటు పెద్దాయనా దక్కలేదు.

అక్షరాలా అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో వెనక్కు వచ్చారు స్వగ్రామానికి! ఇంకా ఏం‌ స్వగ్రామం, ఇక్కడ నిలువ నీడ లేదు.

ఊరందరికీ మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణ ఇలా జరిగింది అని కన్నీళ్ళతో చెప్తుంటే వింటున్న మాకు మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణా వాళ్ళమ్మ గారూ‌ మరి ఎలా నిలద్రొక్కుకున్నారో నాకు సరిగా తెలియదు. వారు ఆ తరువాత పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో అద్దెకు ఉండే వారు. ఇప్పుడు ఆ సత్యనారాయణ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో!

 

****

 

ఈ రెండు కథలను గమనించారుగా, డబ్బు ఎలాంటి ఎలాంటి తమాషాలకు కారణం అవుతుందో. అందుకే‌ అన్నారు "మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః" అని. డబ్బు ముందు అన్నీ‌ దిగదుడుపే అవుతున్నాయి దురదృష్టవశాత్తు. మానవసంబంధాలను ఈడబ్బు ఈడ్చి అవతల పారేస్తున్నది.


16, డిసెంబర్ 2020, బుధవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం.

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ అనగానే కొంతమందికి ఒక మంచి సినిమాపాట గుర్తుకు వస్తుంది. ఇదిగో ఆపాట. అన్నట్లు కొంతమందికే‌ గుర్తుకు వస్తుందీ అని ఎందుకనటం అంటే ఆధునికుల్లో అనేకులు తెలుపు-నలుపు సినిమా అంటే చచ్చినా చూడరు. అ పాతచింతకాయపచ్చడి సినిమాల్లో ఏముంటుందీ అనేస్తారు. రంగురంగుల హంగుల సినిమాల్లోనే ఎంతో గొప్పగొప్ప కథలూ నీతులూ అదేదో‌ ఎంటర్‌టైన్‌మెంట్ అంటారే అదీ, ఇంకా బోలెడు విలువైనవీ ఉంటాయని వాళ్ళ గాఠ్ఠి నమ్మకం మరి.



 

వార్తాపత్రిక తెప్పించటం మానివేసి చాలాకాలం ఐనది. ఎప్పటి నుండీ అని అడక్కండి. నాకూ తెలుసు, మీకూ తెలుసు కరోనాకాలం మొదలైనప్పటినుండి అని. కరోనామూలంగా వాడు పేపర్ వేయటానికి లేకుండా పోయింది. ఈమధ్య మళ్ళా పేపర్ వేస్తానూ అంటూ ఫోన్ చేస్తే, వద్దులే నాయనా మేం ఇలా అలవాటుపడిపోయాంలే అని చెప్పేసాం.

నిజానికి పేపర్ వస్తున్నాసరే బహుకాలంగా వార్తలకోసం టీవీలోని వార్తాఛానెళ్ళూ వివిధపత్రికలవాళ్ళ అంతర్జాలపత్రికలూ ఉపయోగించటం చేస్తున్నాం.

ఒకప్పుడు కొత్తవార్తలు అంటే అవి ఉదయం వచ్చే వార్తాపత్రికతోనూ లేదా రేడీయోలో సమయప్రకారం వచ్చే వార్తాప్రసారాలతోనూ మనదాకా వచ్చేవి. ఆ రేడియోల కాలం పోయింది. ఇప్పుడు ఎఫ్‌ఎమ్‌ అంటూ రణగొణధ్వానాల స్టేషన్‌లు వచ్చాయి కాని వాటిని వినే ఓపిక మాకు లేదు. ఇక టీవీలో ఐతే వచ్చే వార్తలకన్నా నరజీవులకుండే ఓపికను పరీక్షించే అడ్వర్టైజ్‌మెంట్ల గోలే చాలా ఎక్కువ.

అందుచేత తీరిక దొరికినప్పుడు అంతర్జాలంలో చూస్తాను వార్తల కోసం. 

అలా ఈఉదయం‌ కంటబడ్డది నయనకంటకమైన వార్త ఒకటి - కన్నతల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ వేసిన ప్రబుధ్ధుల గురించి.



(పైన ఇచ్చిన ఫోటో, ఆంధ్రజ్యోతి వారి వార్తతో ప్రచురించినది.)

ఏమిటీఅన్యాయం!

నిన్న టీవీలో వార్త చూశానన్నారు మిత్రులు విన్నకోట వారు.   అన్ని విలువలనూ పూర్తిగా వదిలేసిన సమాజంలాగా తయారవుతోంది. మీడియా, సినిమాలు, వ్యాపారులు ఈ రుగ్మతకు కారణం అంటున్నారు వారు.

కలికాలం అన్నారు మిత్రులు శర్మ గారు.

నిజం చెప్పాలంటే, డబ్బుకు తప్ప జీవితంలో మరి దేనికీ విలువే లేదన్న ఆధునిక జీవనసత్యాన్ని ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలకు ఈకాలంలొ తలిదండ్రులే నూరిపోస్తున్నారు. చివరికి ఇలాంటి వికృత పరిణామాలు ఎదురైతే అందరూ గుండెలు బాదుకుంటూ గోలపెడుతున్నారు!

కొన్ని దశాబ్దాల క్రిందటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తున్నది. నేను హైదరాబాదుకు వలసవచ్చిన రోజులవి. అప్పట్లో మా మేనమామ గారింట్లో కొన్నాళ్ళున్నాను. ఆ తరువాత కాలంలో కూడా వారింటికి వెళ్తూనే ఉండేవాడిని. ఒకరోజున ఆయన తన కుమార్తెపైన కోపగించుకుంటుండగా వెళ్ళాను.

ఆ పిల్ల అప్పుడు ఎల్‌కేజీలోనో యూకేజీలోనో ఉంది. స్కూల్లో క్లాస్ మెత్తానికి నాలుగవస్థానంలో వచ్చిందట. అంతక్రిందటి సంవత్సరం మొదటిదానిగా వచ్చిందట. ఇలా చదువులో వెనుకబడిపోతే ఎలా? ఇలా చదివితే పెద్ద జాబ్ ఎలా వస్తుంది, ఎలా దర్జాగా బతుకుతావూ అని ఆ అమ్మాయి మీద అరుస్తూ‌ క్లాస్ తీసుకుంటున్నాడు! ఆ పిల్ల ఈమానవుడికి ఏమయిందో అర్ధం కాక బిక్కమొఖం పెట్టి చూస్తోంది.

ముక్కుపచ్చలారని వయస్సులోనే మనం పిల్లలకి డబ్బు ఎంత ముఖ్యం అంటే దానితరువాతే‌ జీవితం సుమా అని నూరిపోస్తున్నాం. ఆముక్కలు చాలాబాగా వంటబట్టించుకొన్న కొందరు ఆ డబ్బుకోసం ఆ తలిదండ్రులమీదే అఘాయిత్యాలు చేస్తున్నారు మరి. తప్పెవరిది?

ఎప్పుడు ఎరుకలోనికి వచ్చిందో ఇప్పుడు సరిగా గుర్తులేదు కాని మరొక సంఘటన ఇలాంటిదే ఉంది. 

ఒక జంటకు ఇద్దరు పిల్లలు. ఆ భార్యాభర్తలకు ఏమాత్రం సఖ్యత లేదు కాని పిల్లల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. సఖ్యత లేక పోవటం అంటే మరేమీ లేదు భార్యకు చిరుకోపం భర్తకు పెనుకోపం అన్నమాట. చిరుకోపం ఎందుకంటే డాక్టరు తినొద్దయ్యా అన్నవన్నీ తింటాడు ఇంటాయన. నువ్వు తినకూడదుగా అంటూ వండి పెట్టకపోతే ముందు అలుగుతాడు - ఆతరువాత కోపంతో అరుస్తాడు. రోజూ‌ తిండిదగ్గర పేచీలేను.

అన్నట్లు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయారు. కూతురు సరే సరి, కొడుకు వేరు కాపురం కదా, అదన్నమాట. 

ఒకరోజున కొడుకు వచ్చాడు. ఆలూమగలు సంబరపడ్డారు. కొడుక్కి ఇష్టమైనవి అంటూ‌ ఇంటాయన లిష్టు చదివాడు. వాడికోసం కొంచెం చేస్తానులే అని కసిరింది ఆవిడ. లడాయి మొదలు.

కాని భోజానాలు పూర్తయ్యాక అసలు లడాయి మొదలైంది. ఎలాగూ మీరు నాదగ్గర వచ్చి ఉండవలసిందే కదా రేపోమాపో, అందుకని ఈ ఇల్లూ, కొట్టూ వగైరా అంతా ఇప్పుడే రాసిచ్చేయి అన్నాడు కొడుకు.

అమ్మానాన్నా కుదరదన్నారు. 

అంతే అతడు పట్టుబట్టడం, వాదు పెరగటం జరిగింది.

అసలే కోడలు వచ్చి కొడుకుని నిజంగానే దూరం చేసిందన్న కక్షతో ఉన్న అమ్మ కొంచెం మాట విసిరింది. ఇదంతా నీకు నీ‌ పెళ్ళాం నూరిపోసిందిలే అని.

కొడుకు విచక్షణ కోలుపోయాడు. అమ్మని లాగి లెంపకాయ కొట్టాడు.

అమ్మానాన్నలు మ్రాన్పడిపోయారు.

అమ్మ గ్రుడ్లనీరు కుక్కుకుంది. కాని కొడుకుతో ఏమీ మాట్లాడాలి అనిపించక కాబోలు మౌనంగా ఉండిపోయింది.

తండ్రి రంకెలు వేసాడు. నా యింట్లోంచి బయటకు నడు అంటూ, ఏమేమో అన్నాడు.

కొడుకు కోపంలో తండ్రికి తగ్గ వారసుడేగా. ఊగిపోతూ తండ్రిమీదికి దూకాడు.

తండ్రిమీద చేయి వేసేలోగా ఉన్నట్లుండి విరుచుకొని పడిపోయాడు.

ఎందుకంటే తల్లి చీపురుకట్ట తిరగేసి వాడి తలమీద ఒక్కటిచ్చింది బలంగా! 

ఎంతైనా కన్నప్రేగు కదా. కొడుక్కేమైందో అని ఆలూమగలు లబలబ లాడారు. ఎన్నో ఉపచారాలు చేసారు. అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు వాడికి. కొద్దిసేపటికే స్పృహలోనికి వచ్చాడు. అమ్మానాన్నల్ని అనరాని మాటలన్నాడు. మీ అంతుచూస్తాను అని కూడా అన్నాడు. ఆతరువాత తండ్రికి వేలు చూపిస్తూ ఇంటినుండి వెళ్ళిపోయాడు.

సంగతి అంతా తెలిసి ఊళ్ళొనే ఉండే కూతురు అన్నగారి మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. వాడి మీద ఇప్పటికే  రౌడీషీటర్ అన్న బిరుదు ఉంది. మా అమ్మానాన్నలకి ప్రాణాపాయం ఉంది అని. వార్త పేపర్లకి ఎక్కింది.

ఏదో‌ నాదృష్టిలో ఉన్నది ఒకటి వ్రాసాను కాని ఇలాంటి తరచు చూస్తూనే ఉన్నాం.

నాగరికత పేరుతో ఆధునిక విద్యపేరుతో మనం సామాజిక విలువలను ఎప్పుడో ధ్వంసం చేసుకున్నాం. అందుకే ఇటువంటి సంఘటనలు సాధారణం అయిపోయాయి.

వేమన పద్యం ఒకటి గుర్తుకు వస్తున్నది.


తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


వేమన పద్యాలను ఈరోజుల్లో ఎక్కడా బళ్ళల్లో చెప్పరు. సుమతీ శతకం చెప్పరు. కృష్ణ శతకం చెప్పరాదు. అవన్నీ పాత చింతకాయలు. పనికిరావు నేటి చదువులకి. పసిపిల్లల చేత రైన్ రైన్ గో అవే‌వంటి దౌర్బాగ్యపు రైమ్స్ మాత్రం చెప్పిస్తారు. అదీ చూస్తామంటారా ఇదిగో



వీళ్ళకి వాన రావటం ఇష్టం లేదట. చాలా బాగుంది. వానలు పడకపోతే ముద్ద నోటికి ఎలావస్తుందో మరి.

అమ్మానాన్నలనూ, ఆమాటకు వస్తే అందరినీ గౌరవంగా ఎలా చూడాలో ఆదర్శంగా అచరించి చూపిన రాముడి కథను మెచ్చదు నేటి మేథావి గణం. రామాయణం విషభాండం అనో విషవృక్షం అనో చెప్తారు. టీచర్లను ఎలా ఎగతాళీ చెయ్యాలో పాపం స్కూళ్ళల్లో నేర్పటం లేదు కాని అందుకోసం మన సినిమాలవాళ్ళు ప్రతిసినిమాలోనూ తప్పకుండా పాఠాలు చెబుతూనే ఉంటారు.

దిక్కుమాలిన చదువులూ దిక్కుమాలిన నాగరికతాను, అమ్మానాన్నల్ని అవమానించటం మాత్రం బాగా నేర్పుతున్నాయి.

27, నవంబర్ 2020, శుక్రవారం

హౌస్ క్లీనింగ్

అందరమూ ఇల్లు సర్దుకోవటం లేదా హౌస్ క్లీనింగ్ అనే పనిని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం.

కొందరైతే ఈపనిని చాలా శ్రధ్ధగా చేస్తారు.

మరికొందరైతే ఈపనిని శ్రధ్ధగానే కాదు, చాలా తరచుగానూ ప్రణాళికాబధ్ధంగానూ చేస్తూ ఉంటారు. నాబోటి గాళ్ళు అనేకమందైతే ఇంక తప్పని సరి ఐతే చచ్చినట్లు చేస్తారు.

ఈ ఇల్లు సర్దుకోవటం అంటె కేవలం, ప్రహ్లాదుడు చెప్పినట్లు "ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలన్" అన్నట్లుడే నివాసగృహం‌ అనబడే దానికి మాత్రమే పరిమితం కాదు. అబ్బో‌ ఇంకా చాలా వాటికి కూడా భేషుగ్గా వర్తిస్తుంది.

ఒకప్పుడు ఆఫీసులో నాచేతిలో ఒకసారి అనేక ప్రాజెక్టులు ఉండి ఉక్కిరిబిక్కిరిగా ఉన్న పరిస్థితిలో ఒక రోజున మా బాస్ నా సీట్ దగ్గరకు వచ్చి "కొంచెం తీరిక చేసుకొని నీ‌ టేబుల్ కాస్త నీట్‌గా సర్దుకోవయ్యా" అని సలహా ఇచ్చి చక్కాపోయాడు. ఆ టేబుల్ అంత ఘోరమైన అరణ్యంలా ఉంది మరి!

పనిలో‌పనిగా టేబుల్ పైన ఉన్నవే‌ కాక దాని అరల్లో ఉన్న కాగితాలూ‌ కలాలూ వగైరా మొత్తం సామాను బయటకు ఈడ్చి సర్దటం‌ మొదలు పెడితే ఆ పని ఒక రోజంతా పట్టేసింది. చివరకు నాదగ్గర ఉన్న దానిలో చెత్తను పాడేస్తే పదిశాతం కూడా పనికివచ్చేవి లేవు కదా అని తేలింది.

మన యిళ్ళల్లోనూ‌ అంతే కదా తరచుగా. ఇప్పుడు మాయింట్లో ఉన్న చెత్తను కూడా ఊడ్చి పారేసే చూస్తే తొంభైశాతం బయటకు నడిచిందని తేలుతుంది. మీయింట్లో సంగతి యేమో కాని మా యింట్లో చెత్త లేదని బడాయికి పోకండి. అలా అంటే దానర్ధం మీఇంట్లో ఏమేం‌ ఉన్నాయో అన్నది మీకు బొత్తిగా తెలియదని. కొత్తగా పెళ్ళై ఇంకా ఇంటికి కావలసినవి ఏర్పాటుచేసుకుంటున్న వారిని మినహాయిస్తే అందరిళ్ళల్లోనూ 80-20 రూల్ అప్లై అవుతుంది. ఈ  80-20 రూల్ ప్రకారం అన్ని సందర్భాల్లో 80 శాతం పొల్లు అని. మీకు వందమంది ఫ్రెండ్స్ ఉంటే అందులో  20 మంది మాత్రమే అక్కరకు వచ్చేవారు. మీరు ఒక ప్రోగ్రాం వ్రాస్తే అందులో ఏ సమయంలో ఐనా ఇరవై శాతం‌ మాత్రమే చురుగ్గా ఉండే కోడ్. ఏదేశంలో ఐనా సరే 80శాతం సంపద 20శాతం మంది చేతుల్లో ఉంటుంది. ఇదంతా Pareto రూల్ అంటారు. మీరూ ఇలాంటివి బోలెడు ఊహించుకోవచ్చును. ఆకాశమే హద్దు.

అమెరికాలో కొన్నాళ్ళు శాన్‌ఫ్రాన్సిస్కో ఈష్ట్‌బే ఏరియాలో అలమీడాలో ఉన్నాను. అబ్బే ఎంతో‌ కాలం లేనండీ ఆర్నెల్లంటే అర్నెల్లేను. అక్కడ నాకు రాజేంద్ర అని ఒక స్నేహితుడు దొరికాడు. ఆయన ఒకరోజున ఉదయం టీ టైమ్‌లో అనుకుంటాను నలుగురి మధ్యలో ఒకరిని ఉద్దేశించి ఒకమాట అన్నాడు. అది ఇప్పటికీ‌ భలే గుర్తు. "అందరూ ఇక్కడకి ఇండియా నుండి రెండేసి సూట్‌కేసులతో  వచ్చినవాళ్ళే. సరిగ్గా రెండేళ్ళు గడిచేసరికి ప్రతివాడి కొంపలోనూ‌ రెండు ట్రక్కుల సామాను పైనే ఉంటుంది. అందులో ముప్పాతికశాతం వేష్ట్ పర్చేజెస్. ఏం చేస్తున్నారయ్యా మీరు, కనిపించిన దల్లా కొనెయ్యటమేనా? మీ‌దగ్గర ఉన్న సామానుల్లో ఎనభై శాతం కేవలం  మీకు అవసరం లేని చెత్తే"

జంతికల గొట్టం లేదని ఒకటి కొంటాం. కొన్నాళ్ళకు మరేదో వస్తువు కోసం వెదుకుతుంటే అప్పుడు ఈ‌ జంతికల గొట్టంతో పాటు మరొక జంతికల గొట్టం కూడా కనిపిస్తుంది. అరె అనుకుంటాం. జాగ్రత్తగా రెండూ ఒకచోట పెడతాం. తమాషా ఏమిటంటే జంతికలు చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండు గొట్టాలూ కూడా పత్తా ఉండవు. వెదికి విసుగొచ్చి పక్కింటి పిన్నిగారిది అరువు తేవటమే. ప్రక్కింటి పిన్నిగారు ఇవ్వనంటే, ఒళ్ళుమండి పిల్లాణ్ణి బజారుకు తోలి మరొకొటి తెప్పించటమే.

అసలు ఈజంతికల గొట్టాలో మరొకటో ఎందుకు కనిపించవూ‌ అంటే ఇంటినిండా సామాను ఎక్కువై పోతే వాటి మధ్యలో ఎక్కడో ఇరుక్కుని కనిపించవు అన్నమాట.

రాజేంద్ర ఒక సలహా ఇచ్చాడు. ఏదన్నా కొనాలీ అంటే అది కచ్చితంగా మనకి అవసరమా? అది మనకి ఇప్పుడే బాగా అవసరమా? అన్న ప్రశ్నలు వేసుకోవాలట. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందిలే అని ఏదీ కొనకూడదు అని ఆయన గట్టిగా హెచ్చరించాడు అందరినీ.

తరువాత ఇల్లు సర్ధుకుందాం వీలు చూసుకొని అని అందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటారు. ఇప్పుడు కూడా చదువరుల్లో ఆముక్క ఈరోజునో నిన్ననో అనుకున్న వాళ్ళూ తప్పక ఉండే ఉంటారు. అయ్యా ఆ వీలు అన్నది జన్మలో దొరకదు. గ్యారంటీ. మీరేమో ఆ వీలు కోసం ఎదురుచూస్తూ ఉండగానే ఏదో ఒకవస్తువును ఇంట్లో వెదకి పట్టుకోవటం అత్యవసరం ఐపోయి నానా గోలా అవుతుంది. ఇది కూడా గ్యారంటీ. తప్పనిసరై ఇల్లుపీకి పందిరి వేస్తారు. అంతకంటే ఇంట్లో అనవసరమైన సామాను చేర్చకుండా ఉండటమూ, తరచూ ఉన్నసామాగ్రిని పొందికగా సర్దుకోవటమూ చేస్తూ ఉంటే ఇల్లూ‌ శుభ్రంగా ఉంటుంది. అత్యవసరం వెదుకులాటలూ తప్పుతాయి. ఓస్ ఈమాత్రం నాకు తెలుసు అంటారు. తప్పకుండా అంటారు మీరు. కానీ మీరూ నేనూ అందరమూ తెలిసితెలిసే ఇళ్ళను గోడౌనుల్లా ఉంచుకుంటున్నాం కదా. అనుమానం ఉంటే ఒక్కసారి మీ యింటిలో అన్ని గదుల్లోనూ పరిస్థితి ఎలా ఉందీ అన్నది బేరీజు వేస్తూ పరిశీలించి రండి. అప్పుడు చెప్పండి నామాట ఎంతవరకూ సత్యమో.

ఇల్లు సర్ధుకోవటం అవసరం అని ఇంకా నొక్కి వక్కాణించనక్కర లేదు. కాని ఈ‌యిల్లు సర్దటం అన్నది మాత్రం ఒక మహాయజ్ఞం. ఒకపట్టాన తెమలదు.

అన్నింటికంటే తేలికైన పని ఏదీ అంటే ధర్మరాజుగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఇతరులకు సలహాలు ఇవ్వటం అట. అవును కదా. అందుకని నేను మీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాను.

మొదటిది. ఖరీదైన వస్తువులు. వీటిని కొని వాటి బిల్లులూ, వారెంటీ‌ కాగితాలూ మాన్యువల్స్ వంటివి ఒక పద్దతిలో దాచిపెట్టరు. ఇది గొప్పగొప్ప చిక్కులను సృష్టిస్తుంది. అవసరమైనప్పుడు కంపెనీవాడు మిమ్మల్ని కాగితాలు అడుగుతాడు. ఎంతవెదికినా అవి మీకు దొరకవు! అందుచేత ప్రతి ఖరీదైన వస్తువు తాలూకు ముఖ్యమైన కాగితాలూ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంచి అలాంటి కవర్లనీ ఒక ఒక జిప్ ఫోల్డర్ వంటి దానిలో ఉంచాలి.

రెండవది. రకరకాల సర్టిఫికేట్లు, నగానట్రాకొన్న రసీదులు, ఆస్తుల దస్తావేజులు. వీటినీ పైవిధంగానే చేయాలి.

మూడవది. చిన్నచిన్న విలువైన వస్తువులు. అది మీ నాన్నగారి వాచీ‌ కావచ్చు, మీ అత్తగారు పెట్టిన, ఇప్పుడు మీ వేలికి పట్టని , ఉంగరం కావచ్చు. ఇలాంటి వన్నీ చిన్నచిన్న పెట్టెల్లో దాస్తారు లెండి తెలుసు. కాని ఏది ఏపెట్టెలో? ఇలాంటి వివరాలను ఒక నోట్ పుస్తకంలో రికార్డు చేసుకొని అది వారెంటీ పేపర్లూ వగైరా దాచే సంచీలో ఉంచండి.

మీరు ఎవరికైనా అప్పున్నా, మీకు ఎవరైనా అప్పున్నా అటువంటి వ్యవహారాలు కూడా అలాంటి రికార్డులో ఉండాలి.

ఇలాంటి సూత్రాలూ గట్రా మీరే తయారు చేసుకోవచ్చును. కాని చిక్కల్లా నిష్టగా పాటించటం దగ్గరే.

ఈ సర్దుకోవటం అన్నది ఇంటికే‌ కాదు అనేక చోట్ల అవసరం అని చెప్పాను కదా. అలాంటి అవసరాలు కొన్ని చూదాం.

మీ‌ దగ్గర బోలెడు పుస్తకాలుంటాయి. ఒక్కోసారి అందులో మీకు అనవసరం అనిపించేవీ‌ ఉంటాయి. మీరు గమనించరు అంతే. నా దగ్గర అలాంటివి చాలానే ఉన్నాయి. అమెరికాలో నా ఫ్రెండ్ ఒకతనికి టీ షర్టుల పిచ్చి. ఎన్నో‌ కొంటూ‌ ఉండే వాడు. ఒకసారి ఒక తమాషా విషయం చెప్పాడు. లివర్ మూర్ వెళ్ళి అక్కడ ఒక టీ షర్టు కొన్నాడు, ఏదో ఫాక్టరీ ఔట్‌లెట్ దగ్గర. మర్నాడు ఎందుకో అనుమానం వచ్చి వెదికితే మెర్విన్ వాడి దగ్గర కొన్న మరొక టీషర్ట్ బయటపడింది. అదే‌ డిజైన్ అనే కాదు అదే‌ షర్ట్ మరొక కాపీ. మెర్విన్ వాడి స్టిక్కర్ ఇంకా దాని మీదే ఉంది $17 అని. ఇప్పుడు అరవై మైళ్ళ దూరం పోయి తెచ్చుకున్నది చవగ్గా కేవలం $40 ధరకే. ఫన్నీగా లేదూ. అతను మాత్రం కొంచెం విచారంగా నాట్ సో ఫన్నీ అన్నాడనుకోండి. ఇలా ఎందుకు జరిగిందీ అంటే కొని పాడేసి ఎప్పుడొ బుధ్ధిపుట్టినపుడు వేసుకొనే అలవాటు వలన ఎన్నో‌ పోగులు పడ్డాయి. చెత్త పేరుకుపోయి స్పష్టత లేక శృంగభంగం అయింది. ఇది అతడి ఉద్దేశమే నాది కాదు!

అమ్మాయిలూ‌ తక్కువ కాదు ఈవిషయంలో . అమ్మాయిల హేండ్ బ్యాగుల్లో ఏముంటాయి? అన్నీ‌ పనికి వచ్చేవేనా? నాకు లలితా శ్రీనివాసన్ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఎందుకో ఒకనాడు ఒక పిన్నీసు అవసరం పడింది. పిన్నీసు కదా అని లలిత డెస్క్ దగ్గరకు వెళ్ళి నీదగ్గర ఒక పిన్నీసు ఉంటే ఇవ్వవా అని అడిగాను. అమె తన హేండ్ బ్యాగ్ తెరిచి ఒక పెద్ద చైన్ అఫ్ పిన్నీసులు తీసింది. ఆ తోరణంలో ఒక ఒక యాభై ఉంటాయి. ఇంత పెద్ద దండ ఎందుకూ అన్నాను. నవ్వుతూ బ్యాగ్ లోనుండి మరొక దండ తీసింది అందులో నూటయాభై పైన ఉంటాయి. ఓర్నాయనో అనుకున్నాను. ఇలాగని సూర్యప్రభ గారు అనే‌ మరొక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడతో‌ చెప్తే, ఆవిడ కసురుకుంది. అమ్మాయి హేండ్ బ్యాగ్ అంటే మినీప్రపంచం తెలుసా పో అంది. అలా అని ఊరుకుందా, ఆవిడ తన హేండ్ బ్యాగ్ నా ముందు బోర్లించింది టేబుల్ మీద. అప్పుడు  అందులోంచి ఒక కీ బయటపడి అవిణ్ణే అశ్చర్యానికి గురిచేసింది. దానికోసం మొన్ననే వెదుక్కుందిట ఆవిడ.  మరి అలాగని అమ్మాయిలు తమ హేండ్ బ్యాగులు ఎప్పుడన్నా సర్దుకుంటూ ఉంటారా అంటే ఏమో‌ తెలియదు.

మీ దగ్గర కంప్యూటరు ఉంది. లేదా కనీసం మొబైల్ ఉంది. అదీ నానా గడ్డీ గాదంతో‌ నిండిపోయి గోల అవటం చూస్తూనే ఉన్నాం కదా. ఈ‌వాట్సాప్ పుణ్యమా అని ఈ‌నిండిపోవటం దారుణమైన వేగంతో‌ జరుగుతుంది తరచుగా. అన్నట్లు వాట్సాప్ వాడు వారం తరువాత హుష్ కాకీ అని కొత్త ఫీచర్ ఇచ్చి నిన్ననే పుణ్య‌ం కట్టుకున్నాడు.

మీ దగ్గర వందల వాట్సాప్ కాంటాక్ట్ లిష్ట్ ఉంది కదా. అది ఎప్పుడన్నా క్లీన్ చేసారా? ఎనభై శాతం‌ పైచిలుకు చెత్తే‌ అక్కడ చూసుకోండి! అసలు మీ ఫోన్ కాంటక్ట్స్ లిష్ట్ ఒకమాటు పరిశీలించండి బోలెడు మంది అక్కడ అనవసరంగా ఉన్నారని తెలుస్తుంది.

మీ కొక బ్లాగు ఉంది. లేదా బోలెడు బ్లాగులున్నాయి. కాని ప్రతిబ్లాగులోనూ కాలంచెల్లిన టపాలూ, ఇప్పుడొకసారి చదివి చూసుకొంటే అనవసరంగా వేసాం అనిపించే టపాలూ,  అసమగ్రంగా ఉన్నాయని ఇప్పుడనిపించే టపాలూ, మనకే ఇప్పుడు నచ్చని టపాలూ వగైరా బోలెడు చెత్త టపాలు కనిపిస్తాయి. అందులో‌ కొన్ని ఫక్తు అయోమయం టపాలూ ఉంటాయి చూసుకోండి. అవన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తారూ? ఎన్ని టపాలు వేసాం అన్నది ముఖ్యం అన్న స్థితిని మీరు దాటిపోయి ఉంటే మీరు తప్పకుండా వాసిగల టపాలు ఎన్ని అని ఆలోచించుకొన వలసిన సమయం వచ్చే ఉంటుందని గమనించండి. ఇలా బ్లాగ్ క్లీనింగూ ఒక హౌస్ క్లీనింగే. చాలా ముఖ్యమైన క్లీనింగ్ కూడా.

బ్లాగు అనే‌ కాదండి. మనిషి బుఱ్ఱ ఆనేదీ చెత్తతో నిండిపోతూ ఉంటుంది తరచుగా. చెత్త అభిప్రాయాలూ, చెత్త నిర్ణయాలూ, చెత్తఆలోచనలూ, చెత్తవిషయాలూ, చెత్తసమాచారమూ, చెత్తలెక్కలూ వంటివి బోలెడు మన బుఱ్ఱల్లో నిండిపోయి గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఆత్మావలోకనం చేసుకుంటూ చెత్తను వదలించుకుంటూ 'అలా ముందుకు పోవాలి' లేదా చెత్తబ్రతుకు ఐపోతుంది. చెత్తవదిలించుకోవటం అంటే‌ అది మూడు విభాగాలుగా ఉంటుంది. 'మూల కారణం బెవ్వడు' అంటూ ప్రతిచెత్తకూ మూలాల్ని గ్రహించి వాటిని దూరం‌ పెట్టాలి. చెత్తను సరే‌ ఎలాగూ వదిలించుకోవాలి. మూడవది ఆ చెత్తయొక్క మూల కారణం మనకు దగ్గర కావటానికి కల మన బలహీనతలూ పొరపాట్లూ ఏమిటో గ్రహించి వాటినీ‌ నిగ్రహించాలి. అప్పుడు మనం సరిగ్గా ముందుకు పోగలం.


ఈ సోదంతా ఎందుకు వ్రాసానూ అంటే‌ నాకే‌ సమాధానం తెలియదు. కాని వ్రాయాలని అనిపించింది. వ్రాసాను. ఎవరికైనా ఈ వ్యాసం వలన ఉపయోగం ఉంటే మంచిది. నా వరకు నాకు ఈ‌ఆలోచన ఇక్కడ ఉంచటానికి ఉన్న కారణం ఈబ్లాగులో కూడా చెత్తను తీసివేయటం అనే కార్యక్రమం అవసరం అని నా భావనగా చెప్పటం. చదువరులు తమతమ బ్లాగుల్లో చెత్తను వదల్చుకోవటం‌ మానటం తమయిష్టం. కొందరైతే చెత్తను పేర్చటమే‌ ఏకైక కార్యక్రమంగా తమ బ్లాగుల్ని నడిపిస్తున్నారనుకోండి. వాళ్ళెవరని అడక్కండి. మీకూ‌ తెలుసు నాకూ తెలుసు సమాధానం.

చెత్తను వదల్చటం అంటే చెత్త మెటీరియల్ అనే‌ కాదు, చెత్తగా అనిపించిన లేదా చెత్తగా తయారైన విధానాలను కూడా వదల్చుకోవటం అన్న నా భావన చదువరులు అర్ధంచేసుకోగలరు. నాకా నమ్మకం ఉంది. నా బ్లాగులో చెత్తను ఎత్తివేయటం‌ మొదలు పెడుతున్నాను. చెత్తవిధానాలూ కొన్ని మార్చుతున్నాను. వాటి గురించి త్వరలోనే‌ మరొక లఘువ్యాసంలో చెప్తాను.
 
 

7, నవంబర్ 2020, శనివారం

పద్యసంకలనాలు...


 ఆ మధ్య జడశతకం అంటూ‌ ఒక ప్రయత్నం వచ్చింది.

మిత్రులు వలబోజు జ్యోతి గారే అనుకుంటాను ఆ విషయం నాతో అప్పట్లో ప్రస్తావించినది. ఒక వేళ పొరబడితే ఆవిడ నన్ను మన్నించాలి. 

ఈ జడశతకం ప్రయత్నం ఏమిటంటే వీలైనంత మంది కవిశబ్దవాచ్యులం అనుకొనే వారు జడ అనే అంశం పైన కంద పద్యాలు వ్రాసి ఒకరికి పంపాలి. వారు ఆ పద్యాలన్నింటినీ‌ కలిపి ఒక సంకలనంగా వెలువరిస్తారు.

నాకైతే ఆ ప్రయత్నం నచ్చలేదు. అప్పట్లో నచ్చలేదు. ఇప్పుడూ నచ్చటం లేదు అటువంటి ప్రయత్నాలు.

నాకు ఆ ప్రయత్నంలో పాలుపంచుకోవటం వీలుపడదని చెప్పాను.

నా కారణాలు నాకున్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి అప్పట్లో అంటే ఆరేళ్ళ క్రిందటనే శంకరయ్య గారికి ఒక జాబులో చెప్పాను. అది ఇక్కడ ఉంటంకిస్తాను.   సామూహికంగా అన్నమాచార్యకీర్తనలను ఒక గంటసేపు గానం చేస్తే అది ఒక రికార్డు. అదీ లక్షగొంతులు కలిస్తే మరొక రికార్డు. ఎవరికీ భక్తి అవసరం లేదు చూడండి. అది ముఖ్యమైన రికార్డు. సామూహికంగా శతకరచన అన్నది ఒక వినోదం మాత్రమే.  అంతకు మించి మనం దానికి ఏ ప్రతిపత్తినీ ఇవ్వలేము. ఆధునికులు అదే సరైన విధానం అనుకుంటే కాలగతి అనుకోవటమే చేయగలిగింది.

ప్రవృత్తిపరంగా నాకు సాహిత్యం అంటే కేవలం ఒక వినోదం అన్న దృక్కోణం ఎంతమాత్రమూ నచ్చదు. నాకు సంబంధించినంతవరకూ సాహిత్యం అంటే అది ఒక యోగసాధన. అందరికీ అలాగు కాకపోవచ్చును. కాని సాహిత్యవ్యాసంగం అనే దానికి ఒక పవిత్రత అన్నది ఉంటుందని సమాజంలో కవిపాఠకవిమర్శకజనులు భావించాలని నా ఆకాంక్ష. ఎందుకంటే అటువంటి ఆకాంక్ష ఉండినంతకాలమూ సాహిత్యానికి సంబంధించి అందరూ ఎంతోకొంత నిబధ్ధతతో ఉంటారు. అది సమాజానికి మేలు చేస్తుంది.

ప్రస్తుత కాలంలో అవధానాలు పెరిగాయి. సమస్యాపూరణలు పెరిగాయి. పద్యాలను అల్లటం కోసం ఆరాటపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మరి పద్యాల వాసి పెరిగిందా అన్నది చదువరులు కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొంటే బోధపడుతుంది వాస్తవం.

నా ఊహకందినంతవరకూ అనేకులు పద్యాలను అక్షరాలా విస్తళ్ళు కుట్టినట్లు కుడుతున్నారు. సూడోకు గళ్ళలో అంకెలు బేరీజు వేసి ఇరికించి సంబరపడుతున్నట్లు గణాలు సరిపెట్టి పెద్యం ఐపోయిందని ఆనందం చెందుతున్నారు. ఇదంత మంచిదిగా అనిపించటం లేదు నాకు. నేను వట్టి చాదస్తుణ్ణి అంటారా, పోనివ్వండి. అది వాస్తవమే ఐనప్పుడు కాదనటం దేనికి. 

ఒకప్పుడు రావాడ కృష్ణ గారి దగ్గర కొంచెం అభ్యాసం చేసాను బొమ్మలు వేయటం. అప్పట్లో కొంచెంగా వేయగలిగి ఉండే వాడిని లెండి. ఇప్పుడు అదీ‌ లేదనుకోండి. అది వేరే సంగతి. నా బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయంటే, ఆయన నాకు అద్దంం, దువ్వెన, పుస్తకం, కత్తిపీట వంటి వాటిని పెన్సిల్ చిత్రాలుగా వేయమని అన్నారు. అయనకు ఒకమాదిరిగా కూడా నచ్చేలా అద్దం బొమ్మ కూడా వేయలేకపోయా నంటే నమ్మండి. ఐనా ఆయన బొమ్మలు వేస్తుంటే ప్రక్కనే కూర్చొని చూస్తూ ఆయన చెప్పే విషయాలు వింటూ ఉండేవాడిని.

ఒకరోజున నాదగ్గర అప్పట్లో ట్యూషన్ కోసం వస్తూ ఉండే సర్కిల్ గారి అమ్మాయి కృష్ణగారిని మాష్టారూ‌ నా బొమ్మ వేయరా అని అడిగింది. అమె చేత కొంచెం‌ బ్రతిమాలించుకొని, ఆయన రెండంటే రెండే నిముషాల్లో ఆమె నోట్‌బుక్‌లో ఒక ఖాళీపేజీలో పెన్‌తో ఒక స్కెచ్ వేసారు. అచ్చుగుద్దినట్లు ఆ అమ్మాయిలాగా వచ్చింది. ఆమె సంబరం మాటల్లో చెప్పలేం. 

చేయితిరిగిన కళాకారుడు ఒక బొమ్మ వేస్తే అది అలా ఉంటుంది. నాలాంటి వాడు లక్షతుడుపులతో బొమ్మని కిట్టించితే అది నరమానవాకారంలో కొంచెం ఉంటేనే గొప్ప, ఇంక పోలికలదాకా ఎందుకు లెండి.

అలాగే చేయితిరిగిన కవి ఒక పద్యంవ్రాస్తే అది కూడా అలా కృష్ణగారి బొమ్మలాగా ఉంటుంది సహజంగా. ఎక్కడా అతుకులబొంతలా ఉండదు మనబోటి వారి పద్యాల్లా.

గళ్ళుకట్టి బొమ్మనకలు వేసి కొలతలు సరిపోయాయి కదా అనుకున్నా ఆ బొమ్మలో సహజత్వం లేకపోతే అది ఎలా దండగో, సహజసుందరమైన పద్యంగా వచ్చేదాకా అతుకుబొతుకుల పద్యాలూ అలా దండగే.

ఇలా అని ఎవరినీ‌ నిరుత్సాహపరచటానికి అనటం లేదు.

ఒకసారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు. అయ్యా మీరింతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. అయన అన్నారూ, నేను ప్రకటించినవి ఒక ముఫ్ఫైవేలుండ వచ్చును. నేను వ్రాసి చించివేసినవి యాభైవేలైనా ఉంటాయి అని. అంటే ఆయన పద్యం పట్టుకుందుకు అంత తీవ్రకృషి చేసారన్నమాట.

ఇప్పుడేం జరుగుతోంది? గణాల్లో అక్షరాలు పొదిగితే చాలు , అది పద్యం ఐపోయింది. దాన్ని ప్రకటించెయ్యటమే!

దానికి తోడు, ఈ‌ బాపతు ఉబుసుపోక పద్యాలను సాహిత్యంగా జనానికి అందిచాలన్న తపన కూడా పెరుగుతున్నది. 

ఆనాటి జడకవిత్వం అన్నది అటువంటి ప్రయత్నం అనుకున్నాను. కాబట్టే దాన్ని హర్షించలేదు. దాని జోలికి పోలేదు.

కుట్టుడు పద్యాల గురించి ఎందుకంత ఆక్రోశం అని అనవచ్చును ఎవరన్నా. అవెలా ఉంటాయో ఒక పద్యం చిత్తగించండి.

కం. వ్యధపెట్టు వ్యవస్థ యొక వ
నధి! గాజులు గల్లుగల్లనఁగ గాండివమె
త్తె ధనంజయుండనిన్ చే
రి ధర్మము ధరణిని నిలువరింప జిలేబీ !

దీనిలో‌ కందపద్యం తాలూకు నడక ఏమాత్రం ఐనా ఉందా? కేవలం గణాలు సరిపోయాయి కాబట్టి, ఏదో దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ దీన్ని కందపద్యం అనేసింది కాబట్టి ఇది కందపద్యం ఐపోయిందా? నిజానికి ఆ సాఫ్ట్‌వేర్ ప్రయోజనం దానికి ఉంది లెండి, కాని దేన్నైనా మనం దురుపయోగం చేయవచ్చును కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను కూడా అంతకన్నా దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ ఒకటి అలాంటిది తయారు చేసుకుంటున్నాను. దానికి నిర్దేశించిన ప్రయోజనం దానికి ఉంది.

ఇటుచంటి పద్యాలను నేను పద్యాలనటానికి కూడా ఇష్టపడక గిద్యాలని అన్నందుకు నాపైన కొందరికి కించిత్తుగా కినుక ఉన్నమాట యదార్ధం.

అన్ని విషయాలూ‌ పుస్తకాల్లో ఉండక పోవచ్చు. కాని పెద్దలనుండి కొంత, అభ్యాసం ద్వారా కొంత తెలుసుకోవాలి. దేశికవిత్వంలో పాదాంతవిరామం పాటించితే‌ పద్యాల నడక సాఫీగా ఉంటుంది. లేకపోతే అస్సలు ఉండదు. పదాలు వీలైనంతవరకూ గణాల వద్ద ఆరంభం కావటం మంచిది. ఈ లక్షణాలు మార్గికవిత్వాన్ని కూడా అందగింపచేస్తాయి కాని దేశికవిత్వం విషయంలో ఇవి మరింత ముఖ్యం. ధారాశుధ్ధిగా లేని పద్యాలను చదవటం‌ ఎవ్వరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వదు. వ్రాయండి. పుంఖానుపుంఖాలుగా వ్రాయండి. నిరంతరాయంగా నిర్భయంగా వ్రాయండి. కాని వ్రాసిన ప్రతిపద్యాన్నీ ప్రకటించాలన్న దురదను మాత్రం దూరం‌ పెట్టండి. క్రమంగా మంచి ధార తప్పక వస్తుంది. 

మళ్ళీ మొదటీకి వస్తున్నాను. ఆమధ్య జడ శతకం వచ్చిందన్నాను కదా. దానిని శంకరాభరణం వారు ప్రచురించినట్లు గుర్తు. నాది పొరపాటు కావచ్చును. ఇదెందుకు ఈరోజున ప్రస్తావనకు వచ్చిందంటే  శతకపద్యాలకు ఆహ్వానం అంటూ ఒక బ్లాగుటపా కనబడింది.  అందులో‌ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో ఒక శతకాన్ని సకలకవీశ్వర శతకంగావెలువరించాలని శ్రీ పద్మాకర్ గురుదేవులు సంకల్పించారు అని చెప్పారు. సకలకవీశ్వరులూ ఒక్కొక్క పద్యం వ్రాయటం ఏమిటీ? ఈరోజుల్లో అందరూ‌ కవులు కావటం‌ కన్నా ముందుగానే‌ కవీశ్వరులు అవుతున్నారు కదా. కాబట్టి ఔత్సాహికులు అందరూ తలకొక పద్యం చొప్పున పంపితే వారు ఒక శతకాన్ని కుట్టి తయారు చేస్తారన్నమాట. అంతకంటే మరేమీ లేదు.

ఐతే ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అందరూ తలొక రకంగా వ్రాస్తారు కదా అని. ఐతే ఏమి. అదొక ప్రతిబంధకం కాదు. కాని నిజమైన చిక్కు మరొకటుంది. ఔత్సాహికులు వ్రాసే పద్యాల్లోని లక్షణదోషాల సంగతి ఏమిటీ‌ అని. అవును కదా. అచ్చు వేసేందుకు పూనుకున్నాక ఆ పద్యాలను సాధ్యమైనంతగా పరిష్కరించాలి మరి. ఎవరో ఒకరు ఈపని చేస్తారు. కాబట్టి పంపేవారు వారికి చేతనైననట్లు వ్రాసి పంపితే పరిష్కర్తలు తప్పులుంటే సరిచేస్తారు. వీరు చెప్పిన మాటల్లో నాకు నచ్చినది ఒకటుంది అది కవులందరూ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో పద్యాన్ని తాత్పర్యసహితంగా వ్రాసి పంపమనటం. ఇది చాలా ముఖ్యం అని నాస్వానుభవం. పద్యాన్ని దిద్దవలసి వస్తే అసలు కవిహృదయం తెలియటం వలన తద్విరుధ్ధంగా శుధ్ధప్రతి తయారు కాకుండా ఉంటుంది.

అదేమిటీ దిద్దే వారికి ఆమాత్రం పద్యం తాలూకు అన్వయం తెలీదా, మళ్ళా కవి స్వయంగా చెప్పాలా అనవచ్చును. నాస్వానుభవంతో చెబుతున్నాను. రకరకాల కారణాల వలన కవిగారి ఉద్దేశం వేరు పరిష్కర్త సిధ్ధం చేసే పాఠం చెప్పే అర్ధం వేరు కావచ్చును.

ఒక సంకలనానికి నేను కూడా కొంత తటపటాయించిన పిదపనే నాలుగు పద్యాలు పంపాను. (నాలుగు నిబంధన వారు పెట్టినదే). అవి అచ్చయిన పిదప చూసుకుంటే చాలా బాధ కలిగింది. వాటిలో ఒక మచ్చుతునకను మీకు చూపుతాను.

నేను పంపిన పద్యం:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా
వందనములు వారికి నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్

పరిష్కర్తలు ప్రకటించిన పద్యప్రతి:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా!
వందనములు వారికి। నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్!!

ఎందుకు అనుకున్నారో తెలియదు, పరిష్కర్తలు నావనే కాదు, అందరి పద్యాల్లోనూ కొల్లలు కొల్లలుగా ఆశ్చర్యార్ధకాలను  చేర్చి ప్రకటించారు. ఇందువలన తెలిసీ తెలియకా చాలా చోట్ల అర్ధవిపరిణామాలు చోటుచేసుకున్నాయి. పద్యాల అన్వయాలు మారిపోయాయి! అసలు తెలుగు పద్యాలలో విరామచిహ్నాల అవసరం ఏమీ‌ లేదు. అవి వాడవద్దని అందరికీ‌ నా మనవి.

నేను "రామా వందనములు,  వారికి నీ వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్" అని ఉద్దేశిస్తే పరిష్కర్తలు నా నమస్కారాలను రాముడి నుండి ఉపసంహరించి "రామా, వందనములు వారికి" అని అవి శంకరయ్య గారికి అందజేసారు.

నాకు పద్యవిద్యలో ఓనమాలు దిద్దించిన గురుదేవులు స్వర్గీయ వేదుల వేంకటరావు గారు. ఒక సందర్భంలో వేరే ఒక తెలుగుమాష్టారు గారి పద్యాలను దిద్దటం వలను పడక ఆయన భావాలతో నేనే మరలా వ్రాసి ఇచ్చాను పద్యాలు. అవి ఆయన స్టేజీమీద చదివారు. అప్పుడు నేనూ కొన్ని చదివాను అనుకోండి అది వేరే సంగతి. మాగురువుగారు మాత్రం ఉగ్రులైపోయారు. నన్ను పిలిపించుకొని చీవాట్లు వేసారు. భగవంతుడిని తప్ప ఎవరినీ పొగుడుతూ పద్యాలు వ్రాయవద్దని హెచ్చరించారు. ఆయన ఆదేశాన్ని మీరిందెన్నడూ‌ లేదు. అందుచేత ఈ సందర్భంలో శంకరయ్యగారిని ఆశీర్వదించమని రాముణ్ణి వేడుతూ‌ పద్యాలు పంపుతే పరిష్కర్త గారు నా నెత్తిన పిడుగు వేసారు! నాకైతే నా అతితెలివికి తగిన శృంగభంగం ఐనదా అని కూడా అనిపించింది. నేను తేరుకుందుకు చాలా సమయం పట్టింది.

అందుచేత చేతనైతే అవసరం అనుకుంటే నేను పద్యాలను వ్రాస్తానే‌ కాని ఎవరో వాటిని మార్చే అవకాశం ఉన్నచోట ఇకనుండైనా చాలా చాలా జాగ్రతగా ఉంటాను.  

అందుచేత ఇలాంటి సంకలనాలకు పద్యాలను పంపేవారు కొంచెం‌ గమనికగా ఉండాలి. శతకం కాస్తా మిక్చరుపొట్లంలాగా ఉంటే జనం ఆసక్తిగా దాన్ని గ్రహించక పోవచ్చును. అసలు తెలుగుపుస్తకాలను చదివే వాళ్ళే తక్కువ. అటువంటప్పుడు జనం చేత చదివించలేవని ముందే తెలిసిన పుస్తకాల కోసం కవులు శ్రమపడాలా అన్నది ఆలోచనీయం.

అదీ కాక శతకం అంటే ఫలాని కవిగారు వ్రాసారనటం‌ కద్దు. రోజులు మారి ఫలాని గ్రూపు వారు వ్రాసారనో ఫలాని గ్రూపువారు సేకరించారనో అంటారేమో నవీనశతకాల్లో చాలా వాటికి. 

అందుకే   శతకపద్యాలకు ఆహ్వానం అంటూ వచ్చిన ఈ అహ్వానమూ‌ నాకు రుచించక ఒక ముక్క అన్నాను. 

కం. ఒకకవి యొకకృతి చేయుట
యొకవిధమగు సంప్రదాయ ముచితము నటుగా
కొకరొక పద్యము చొప్పున
నొక కలగాపులగపుకృతి యొక శతకంబా?

ఈ అభిప్రాయాన్ని ఉదయం పంపాను కాని వారు ఇంకా అచ్చువేయలేదు. పోనీయండి. వారిష్టం వారిది. నా అభిప్రాయాన్ని విపులంగా ఇక్కడ వ్రాసుకుంటున్నాను. 

11, ఆగస్టు 2020, మంగళవారం

రాధేయుడు అంటే కృష్ణుడట!

"రాధేయుడు అంటే కర్ణుడు కదా
ఇక్కడ గుడిలో ప్రవచనాలు చెబుతుంది ఒకావిడ.కృష్ణుడు అంటోంది.నిజమేనా
"

పైన ఉన్నది వాట్సాప్‌లో మాచెల్లెలు అరుణ పంపిన ప్రశ్న.

 

మా చెల్లెలికి నేను చెప్పిన మాటలు

"పరమశుంఠలు సభాపూజ్యులైరి ఒక శతకకారుడు అన్నాడు. దాని అర్ధం ఇదే. కుంతి కొడుకు కర్ణుడిని అతిరథుడు అనే సూతుడు గంగలో దొరికితే తీసుకొని వెళ్ళి తనభార్య ఐన రాధ చేతికి ఇచ్చాడు. అలా కర్ణుడు రాధేయుడు అంటే రాధకొడుకు అయ్యాడు. ఈసంగతి మనదేశంలో అందరికీ తెలుసును. ఇదిగో కొత్తకొత్త గురువులు వస్తున్నారు. జాగ్రత జాగ్రత అని పిల్లలకి చెప్పాలి మర్చిపోకు."

 

ఇంత చక్కని గురువును జనానికి పరిచయం చేయకపోతే ఎలా అని అనిపించి ఈముక్కలు బ్లాగులో వ్రాస్తున్నాను.

ప్రజలారా తస్మాత్ జాగ్రత. కొత్త గురువుల నుండి పిల్లలను కాపాడుకోండి!


23, జూన్ 2020, మంగళవారం

చెత్త ఆప్స్ గుర్తించి సహాయపడగలరా?


నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ నిండా బోలెడన్ని అప్లికేషన్లు ఉండటంతో కొంచెం చిరాకు కలుగుతోంది. నిజానికి వాటిల్లో అత్యధికం‌ ఇంతవరకూ నేను ఎప్పుడూ వాడనివే.











చూసారు కదా, బోలెడన్ని అప్లికేషన్లు!  వీటిలో కొన్ని మాత్రమే  నేను డౌన్‌లోడ్ చేసినవి. మిగతావి అన్నీ‌ ఫోన్ తీసుకున్నప్పుడే దానితో వచ్చాయి. అప్పటికీ ఒకటి రెండు నేను పీకేసినట్లు గుర్తు.

ఇప్పుడు ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే,మీకు తెలిసినంత వరకూ అనవసరమైనవి, అవసరమైనవి అన్న విభజనకు తోడ్పడవలసింది అని.

చెత్త ఎత్తివేస్తే ఫోన్ మరింత బాగా పనిచేయవచ్చును కూడా.


18, ఫిబ్రవరి 2020, మంగళవారం

వేదపండితులకు ఫించను - కంచి కామకోటి మఠం నుండి.

వేదపండితుల ఫించను - ఈ సదుపాయాన్ని అర్హులైన పండితులకు వివరించండి.

కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు.

ఈ సదుపాయాన్ని, ఏ ప్రాంతం‌వారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును. మీరు పంపవలసిన వివరాలు -

పేరు:
పుట్టిన తేది:
వయసు:
గోత్రము:
తండ్రి పేరు:
తల్లి పేరు:
చిరునామా:
ఫొటో:
సెల్ నం:
ఇల్లు‌: (సొంత ఇల్లు) లేదా (అద్దె)
చదివిన వేదం:
పాఠశాల పేరు:
పాఠశాల చిరునామా:
అధ్యాపకుల పేరు:
ఆధార్ కార్డు వివరాలు (కాపీ జతపరచాలి)
వేదం కోర్సు సర్టిఫికేట్‍ (కాపీ జతపరచాలి)

వివరాలు (ఆంగ్లంలో మాత్రమే పంపాలి) పంపవలసిన చిరునామా:

 Shri Ramana Dikshithar,
136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com
సెల్ నం: 9443188245.

I,  raghurama murthy  confirm that i talked with sri ramana deekshadhar garu and the above information is correct

గమనిక: ఇది నాకు వాట్సాప్‍లో కొద్దిసేపటీ క్రిందట వచ్చిన సందేశం.  నిజానిజాల నిర్ధారణ కొరకు ప్రయత్నం చేసాను 9443188245 నంబరుకు కాల్ చేసి. ఈ వార్త నిజమే అని తెలిసింది. ఇంకొంచెం స్పష్టత వచ్చింది. ఈ వివరాలను పైన కూడా జోడించాను.


  • వృధ్ధులు అంటే 60 దాటిన వేదపండితులకు మాత్రమే
  • ఆధార్‍ కార్డు కాపీ జతపరచి పంపాలి.
  • వేదం కోర్సు పాసయి ఉండాలి. దాని సర్టిఫికేట్‍ యొక్క కాపీ కూడా జతపరచాలి.
  • ముఖ్యంగా అప్లికేషన్ ఆంగ్లంలో మాత్రమే పంపాలి. తెలుగులో పంపరాదు.



7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోండి


మీరు వాడుతున్న విండోస్ 7 కనుక సరియైన వెర్షన్ ఐన పక్షంలో విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోండి.

మీ విండోస్ 7కు మైక్రోసాఫ్ట్ నుండి గత నెలలో నిలచిపోయే వరకూ కనుక అప్‍డేట్‍లు వస్తూ ఉన్న పక్షంలో మీరు మీ విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోగలరు. కాని పక్షంలో మాత్రం వీలు కాదనే అనుకుంటాను.

మీరు మొట్టమొదట మీ కంప్యూటర్ ఈ అప్‍గ్రేడ్‍ చేయటానికి తగినదేనా అని నిర్దారించుకోవాలి!  అంతా ఓకే అనుకుంటే ముందుకు సాగండి.

మీరు మైక్రోసాఫ్‍ డౌన్‍లోడ్‍ విండోస్ 10 సైట్‍ నుండి Create Windows 10 installation media అనే టూల్ డౌన్‍లోడ్ చేసుకొని రన్ చేయాలి. అదీ పధ్ధతి.

కానీ  Create Windows 10 installation media ద్వారా వచ్చిన ఈ టూల్ నాకు సరిగా పని చేయలేదు. ఐతే కొద్ది రోజుల క్రింద అక్కడ ఉండిన వెర్షన్, మా మావయ్య గారి దగ్గర ఉంది. అది మాత్రం చక్కగా పని చేసింది.

మిత్రుల సౌకర్యార్ధం ఆ పనిచేసే వెర్షన్ గూగుల్‍ డ్రైవ్‍ లోనికి అప్‍లోడ్‍ చేసి అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. ఈ సౌకర్యం కొన్నాళ్ళే ఇవ్వగలను. పెద్ద ఫైల్ కాబట్టి ఒకటి రెండు నెలల తరువాత తీసివేస్తాను.

Windows10.iso

ఇది పెద్ద ISO ఫైల్. 4gb సైజులో ఉంది.  Winrar వాడి మీరు unpack చేయవలసి ఉంటుంది. డెస్క్-టాప్‍ మీదే మీరు unpack చేయవచ్చును.

మీరు ఈ Windows10.iso ఫైల్‍ను ఏదనా పెన్‍డ్రైవ్‍ మీద కాపీ చేసుకోవచ్చును. అది మీ మిత్రులకు ఉపయోగిస్తుంది. మళ్ళా ఎక్కడినుండో డౌన్‍లోడ్ చేయనక్కర లేకుండా. ఐతే అలా కాపీ చేసే ముందు మీ పెన్‍డ్రైవ్‍ను తప్పనిసరిగా exfat ఫైల్ సిస్టం ఉండేటట్లుగా ఫార్మాట్‍ చేయాలి.

మీరు మొదట మీ విండోస్‍ 7 సిస్టమ్‍ లో ఉన్న ముఖమైన ఫైళ్ళూ ఫోల్డర్లూ backup చేసుకోండి. నిజానికి అలా చేయటం అవసరం లేదు. మీ ఫైళ్ళూ ఫోల్డర్లూ ఏమీ చెక్కు చెదరవు.

అప్‍గ్రేడ్‍ చేయటానికి ముఖ్యంగా మీకు మంచి ఇంటర్నెట్‍ కనెక్షన్ కావాలి.

మీరు unpack చేయటం ద్వారా తయారు చేసిన Windows 10 ఫోల్డర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న

setup

అనే executable file ను రన్ చేయండి.

అప్‍గ్రేడ్ సమయంలో మీరు చేయవలసినది ఆట్టే ఏమీ లేదు.

విండోస్ కీ కూడా అది మిమ్మల్ని అడగదు. ఆ కీ ఏదో అది మీ సిస్టం నుండే గ్రహిస్తుంది కాబట్టి. (కాని కొత్త టూల్ కాని తెచ్చుకుంటే అది మీదగ్గర కీ ఉంటే ఇవ్వండి అని అడుగుతోంది)

మీ విండోస్ 7 ఎటువంటి మోడల్ అన్నదానిపై ఆధారపడి మీ విండోస్ 10 మోడల్ వస్తుంది. ఉదాహరణకు మీ వద్ద ఉన్నది విండోస్ అల్టిమేట్ అయితే మీకు విండోస్ 10 ప్రో వస్తుంది.

అప్‍గ్రేడ్ కోసం కొద్ది గంటలు పడుతుంది. మీ నెట్‍ స్పీడ్ ఎంత బాగుంటే అంత త్వరగా పని జరుగుతుంది.  నా దగ్గర 100MBPS కనెక్షన్ ఉంది. మొత్తం మీద 2గం. చిల్లర కాలంలో పని జరిగింది.

అన్నట్లు అప్‍గ్రేడ్ సమయంలో మీ కంప్యూటర్ పదేపదే రీబూట్ కావచ్చును.

ఒకవేళ మీ కంప్యూటర్‍ మీద విండోస్‍తో పాటుగా ఉబంటూ ఉన్నా ఇబ్బంది లేదు. నా దగ్గర అలా ఉంది కాని ఇబ్బంది రాలేదు. విండోస్ అప్‍గ్రేడ్ అయ్యింది. ఉబంటూ సుబ్బరంగా ఉంది ఆతరువాత కూడా.


1, ఫిబ్రవరి 2020, శనివారం

బ్లాగుపరిచయం: నందనవనం పారిజాతాలు


ఈరోజున నందనవనం పారిజాతాలు అన్న ఒక బ్లాగును చూసాను. బాగుంది.  అసక్తి కలవారు దర్శించండి.

ఆ బ్లాగులో బ్రహ్మశ్రీ నందనవనము  వెంకట సుబ్బరామయ్య శర్మ గారు 1974లో రచించిన  శ్రీవేంకటేశ్వర శతకము చదివి సంతోషించాను.

అలాగే తూము లక్ష్మీనరసింహ దాసు గారి కీర్తనలు కూడా అక్కడ చూసి చదివి సంతోషించాను.

ఆ బ్లాగును వారు మాలికలో చేర్చినట్లు లేదు. కాబట్టి ఎక్కువమంది మిత్రులకు తెలియబరచాలని భావించి ఈటపా వ్రాస్తున్నాను.

అసక్తి కలవారు తప్పక దర్శించండి.

31, జనవరి 2020, శుక్రవారం

న్యాయంతో నిర్భయ హంతకుల బంతులాటలు


వాస్తవం అన్నది  ఒక్కొక్కసారి నమ్మశక్యంగా ఉండదు.

2012నాటి నిర్భయ కేసులో నిందితులు కాదు కాదు నేరస్థులు మరొకసారి న్యాయవ్యవస్థతో బంతులాట ఆడారు. సమాజాన్ని మరొకసారి వెక్కిరించారు.

మొట్టమొదట ఆ రాక్షసాధముల్లో ఒకడు బాలుడట!

వాడు బాలుడా?

బాలుడి ప్రవర్తన అలాగ కూడా ఉంటుందా ఎక్కడన్నా?

అటువంటి నీచకృత్యాలు బాలురు చేసేవా?

అంత నీచంగా ప్రవర్తించగలిగిన వాడిది మానసికంగా బాలప్రవృత్తి అనగలిగిన వాళ్ళది నాలుకా తాటిమట్టా?

సాంకేతికంగా వాడికి బాల్యావస్థ దాటలేదట. ఇంకొక పది నిముషాలు సమయం ఉన్నా ఆ బాల్యావస్థావినోదం దాటటానికి, వాడు ఎలాంటి నీచనికృష్టమైన దారుణానికి తెగబడినా, బాలుడన్న నిర్వచనం క్రిందకే వచ్చేసాడు మరి. అహా మన న్యాయవ్యవస్థ ఎంత ఉదారమైనది! తలచుకుంటే ఎవ్వరికైనా ఒళ్ళు కంపరం ఎత్తిపోవలసిందే కదా దేవుడా!

అందుచేత వాడు తన బాల్యం అన్న బంతిని ఎరవేసి ఇంచక్కా తప్పించుకున్నాడు, ఆ తప్పించుకున్న ఘనకార్యం వలన ఎంత లభ్ది వాడికి?

ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అసలు వాడెవడో కూడా ఎవరికీ తెలియదు. వాడి పేరుతో సహా అన్నింటినీ వాడి సంక్షేమం కోసం మార్చి మహోపకారం చేసి వాడి నెత్తిన పాలు కాదు కాదు అమృతం కురిపించింది మన వ్యవస్థ. వాడి గురించి ఎవరికీ ఏమీ తెలియకూడదు. వాడికి ఎవరన్నా అపకారం చేస్తారేమో అని వాడికి ఇలా శ్రీరామరక్ష కల్పించారు. అందుచేత వాడు హాయిగా జనం మద్యన తిరుగుతూ మరొక ఘోరం చేసేందుకు వాడికి అన్నివిధాలా అనుజ్ఞ దయచేసి సంరక్షించటం జరిగిందన్న మాట.

ఈ అరడజను మందీ ఇలా బాలురు అన్న నిర్వచనం లోనికి రాలేకపోయారు కదా పాపం. అందులో ఒకడు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి మన చట్తాల గొప్పదనం మీదా వాటిని అమలు చేయవలసిన వ్యవస్థల ప్రయోజకత్వం మీదా అనవసరంగా చాలా నమ్మకం ఎందుకు కుదిరేసిందో తెలియదు. వాడు చచ్చి నరకానికి పోయాడు.

ఇక మిగిలింది నలుగురు. వీళ్ళు బంతాటలో ఎంత ఘనులో చూడండి. మన శిక్షావ్యవస్థను అక్షరాలా ఆడుకుంటున్నారు.

ఒకరి వెనుకాల ఒకరు పిటీషనులు దాఖలు చేస్తూ ఉరిశిక్షను విజయవంతంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతున్నారు.

ఈ నేరస్థులు ఎవరూ తమ చేతికి చిక్కిన అమాయక జీవికి తప్పించుకుందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదే, మరి వీళ్ళకి వ్యవస్థలు అవకాశాల మీద అవకాశాలు అనంతంగా ఇస్తూ పోవటం ఏమిటీ? ఏమిటీ విడ్డూరం?

ఇలా అవకాశాలు ఇస్తూ పోవటానికి అంతేం లేదా?

ఇప్పటిదాకా సామాన్య జీవులం అంతా రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరిస్తే అంతే సంగతులు అనుకుంటూ ఉండే వాళ్ళం కదా? అంతే కదా?

కాదట!

రాష్ట్రపతికి వివరాలు సరిగ్గా చెప్పలేదూ అని కోర్టుకు విన్నవించుకోవచ్చునట.

ఠాఠ్‍ రాష్ట్రపతి నిరాకరించటం వెనుక కుట్ర ఉందీ అని న్యాయస్థానానికి ఎక్కవచ్చునట!

ఇంకా నయం , రాష్ట్రపతికి తిరస్కరించే హక్కు లేదూ అనో ఆ హక్కునుప్రశ్నిస్తున్నాం అనో కూడా న్యాయస్థానానికి ఎక్కవచ్చునేమో.

ఇవన్నీ చెల్లని వాదనలు కావచ్చు.

కాని ప్రతిసారీ న్యాయస్థానాలు సాదరంగా వారి దిక్కుమాలిన అర్జీలను స్వీకరించటం ఒకటి.

వెంఠనే ఉరిని నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేస్తూ ఉండటం ఒకటి.

మళ్ళా ఏదో బ్రహ్మాండమైన పాయింట్లున్న కేసుల్లాగా వాటిపైన తీరిగ్గా విచారణలు జరిపించటం ఒకటి.

ఏమిటిదంతా?

బాధితులు న్యాయం కోసం యుగాలకు యుగాలు ఎదురుచూడవలసి రావటం వారికి అన్యాయాన్ని తీవ్రతరం చేయటమే కాదా?

అది బాధితులకు మరింత అన్యాయం చేయటమే కాదా?

పైపెచ్చు ఈ రాక్షసులకు ఎప్పటికీ ఉరిశిక్ష అమలు కాదంటూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఘట్టిగా బాధితురాలి తల్లిని ఛాలెంజి చేయటం ఎంత దారుణం. అలా ఆవిడను వెక్కిరించే హక్కు ఆ లాయరుగారికి ఎవరిచ్చారు? అసలు అటువంటి వ్యక్తిని న్యాయవాది అనటం కూడా అన్యాయం కావచ్చును.

ఒకడిని చట్టం అక్షరాలా రక్షించగా, మరొకడు భయపడి చావగా ఇంక మిగిలిన వారు కేవలం నలుగురు మాత్రమే. ఇలా ఒకరి తరువాత ఒకరు బంతాటను నడిపిస్తూ ఎంత కాలయాపన చేసినా , మనం చూస్తుండగానే ఆ ఆటలన్నీ అంతం కాక తప్పదు. వాళ్ళకు ఉరి కూడా తప్పదు.

గ్రుడ్డిలో మెల్ల అన్న ఒక సామెత ఉంది. ఇక్కడ ఆట ఆడుతున్నది నలుగురు మాత్రమే. అదృష్టం కొద్దీ అదేదో కేసులో లాగా  ఇరవై ముగ్గురో నలభై ముగ్గురో కాదు.

అంటే ఇలా సామూహిక అత్యాచారాల వంటి అకృత్యాలకు దిగే వాళ్ళకు అధికస్య అదికం ప్రయోజనం అన్నమాట ఉరితప్పించుకొనే బంతాటలో.

ఇంకా మనకు తెలియని దిక్కుమాలిన చట్టసౌలభ్యాలే మన్నా ఉన్నాయేమో మెల్లగా అవీ తెలియవస్తాయి.

అసలు ఇంత హంగామా జరగటానికి పూర్వరంగంలో వవస్థ ఎంత కాలయాపన చేసిందీ ఎంత ఉదాసీనంగా ఉన్నదీ అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు.

సినిమాల్లో చెబుతూ ఉంటారే ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదూ అంటూ, అటువంటి గొప్ప ఆత్రంలో మన వ్యవస్థలు నేరగాళ్ళకు తప్పించుకు తిరిగేటందుకు గాను వీలైనంత పొడవైన తాళ్ళని అందిస్తూ ఉన్నాయన్న మాట. ఎంత ఔదార్యం ఎంత ఔదార్యం!

ఆదేవుడెవరో పాపులను రక్షించును అన్నట్లుగా ఈ వ్యవస్థ ఏదో నేరస్థులను రక్షించును అని అనిపిస్తోంది.

అవును మరి justice delayed is justice denied కదా!

చట్టం నేరస్థులకి శిక్షలు అమలు చేస్తుంది అని ఎలా నమ్మకం కలుగుతుంది ఇంక మన దేశంలో సామాన్యులకు?