7, నవంబర్ 2020, శనివారం

పద్యసంకలనాలు...


 ఆ మధ్య జడశతకం అంటూ‌ ఒక ప్రయత్నం వచ్చింది.

మిత్రులు వలబోజు జ్యోతి గారే అనుకుంటాను ఆ విషయం నాతో అప్పట్లో ప్రస్తావించినది. ఒక వేళ పొరబడితే ఆవిడ నన్ను మన్నించాలి. 

ఈ జడశతకం ప్రయత్నం ఏమిటంటే వీలైనంత మంది కవిశబ్దవాచ్యులం అనుకొనే వారు జడ అనే అంశం పైన కంద పద్యాలు వ్రాసి ఒకరికి పంపాలి. వారు ఆ పద్యాలన్నింటినీ‌ కలిపి ఒక సంకలనంగా వెలువరిస్తారు.

నాకైతే ఆ ప్రయత్నం నచ్చలేదు. అప్పట్లో నచ్చలేదు. ఇప్పుడూ నచ్చటం లేదు అటువంటి ప్రయత్నాలు.

నాకు ఆ ప్రయత్నంలో పాలుపంచుకోవటం వీలుపడదని చెప్పాను.

నా కారణాలు నాకున్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి అప్పట్లో అంటే ఆరేళ్ళ క్రిందటనే శంకరయ్య గారికి ఒక జాబులో చెప్పాను. అది ఇక్కడ ఉంటంకిస్తాను.   సామూహికంగా అన్నమాచార్యకీర్తనలను ఒక గంటసేపు గానం చేస్తే అది ఒక రికార్డు. అదీ లక్షగొంతులు కలిస్తే మరొక రికార్డు. ఎవరికీ భక్తి అవసరం లేదు చూడండి. అది ముఖ్యమైన రికార్డు. సామూహికంగా శతకరచన అన్నది ఒక వినోదం మాత్రమే.  అంతకు మించి మనం దానికి ఏ ప్రతిపత్తినీ ఇవ్వలేము. ఆధునికులు అదే సరైన విధానం అనుకుంటే కాలగతి అనుకోవటమే చేయగలిగింది.

ప్రవృత్తిపరంగా నాకు సాహిత్యం అంటే కేవలం ఒక వినోదం అన్న దృక్కోణం ఎంతమాత్రమూ నచ్చదు. నాకు సంబంధించినంతవరకూ సాహిత్యం అంటే అది ఒక యోగసాధన. అందరికీ అలాగు కాకపోవచ్చును. కాని సాహిత్యవ్యాసంగం అనే దానికి ఒక పవిత్రత అన్నది ఉంటుందని సమాజంలో కవిపాఠకవిమర్శకజనులు భావించాలని నా ఆకాంక్ష. ఎందుకంటే అటువంటి ఆకాంక్ష ఉండినంతకాలమూ సాహిత్యానికి సంబంధించి అందరూ ఎంతోకొంత నిబధ్ధతతో ఉంటారు. అది సమాజానికి మేలు చేస్తుంది.

ప్రస్తుత కాలంలో అవధానాలు పెరిగాయి. సమస్యాపూరణలు పెరిగాయి. పద్యాలను అల్లటం కోసం ఆరాటపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మరి పద్యాల వాసి పెరిగిందా అన్నది చదువరులు కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొంటే బోధపడుతుంది వాస్తవం.

నా ఊహకందినంతవరకూ అనేకులు పద్యాలను అక్షరాలా విస్తళ్ళు కుట్టినట్లు కుడుతున్నారు. సూడోకు గళ్ళలో అంకెలు బేరీజు వేసి ఇరికించి సంబరపడుతున్నట్లు గణాలు సరిపెట్టి పెద్యం ఐపోయిందని ఆనందం చెందుతున్నారు. ఇదంత మంచిదిగా అనిపించటం లేదు నాకు. నేను వట్టి చాదస్తుణ్ణి అంటారా, పోనివ్వండి. అది వాస్తవమే ఐనప్పుడు కాదనటం దేనికి. 

ఒకప్పుడు రావాడ కృష్ణ గారి దగ్గర కొంచెం అభ్యాసం చేసాను బొమ్మలు వేయటం. అప్పట్లో కొంచెంగా వేయగలిగి ఉండే వాడిని లెండి. ఇప్పుడు అదీ‌ లేదనుకోండి. అది వేరే సంగతి. నా బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయంటే, ఆయన నాకు అద్దంం, దువ్వెన, పుస్తకం, కత్తిపీట వంటి వాటిని పెన్సిల్ చిత్రాలుగా వేయమని అన్నారు. అయనకు ఒకమాదిరిగా కూడా నచ్చేలా అద్దం బొమ్మ కూడా వేయలేకపోయా నంటే నమ్మండి. ఐనా ఆయన బొమ్మలు వేస్తుంటే ప్రక్కనే కూర్చొని చూస్తూ ఆయన చెప్పే విషయాలు వింటూ ఉండేవాడిని.

ఒకరోజున నాదగ్గర అప్పట్లో ట్యూషన్ కోసం వస్తూ ఉండే సర్కిల్ గారి అమ్మాయి కృష్ణగారిని మాష్టారూ‌ నా బొమ్మ వేయరా అని అడిగింది. అమె చేత కొంచెం‌ బ్రతిమాలించుకొని, ఆయన రెండంటే రెండే నిముషాల్లో ఆమె నోట్‌బుక్‌లో ఒక ఖాళీపేజీలో పెన్‌తో ఒక స్కెచ్ వేసారు. అచ్చుగుద్దినట్లు ఆ అమ్మాయిలాగా వచ్చింది. ఆమె సంబరం మాటల్లో చెప్పలేం. 

చేయితిరిగిన కళాకారుడు ఒక బొమ్మ వేస్తే అది అలా ఉంటుంది. నాలాంటి వాడు లక్షతుడుపులతో బొమ్మని కిట్టించితే అది నరమానవాకారంలో కొంచెం ఉంటేనే గొప్ప, ఇంక పోలికలదాకా ఎందుకు లెండి.

అలాగే చేయితిరిగిన కవి ఒక పద్యంవ్రాస్తే అది కూడా అలా కృష్ణగారి బొమ్మలాగా ఉంటుంది సహజంగా. ఎక్కడా అతుకులబొంతలా ఉండదు మనబోటి వారి పద్యాల్లా.

గళ్ళుకట్టి బొమ్మనకలు వేసి కొలతలు సరిపోయాయి కదా అనుకున్నా ఆ బొమ్మలో సహజత్వం లేకపోతే అది ఎలా దండగో, సహజసుందరమైన పద్యంగా వచ్చేదాకా అతుకుబొతుకుల పద్యాలూ అలా దండగే.

ఇలా అని ఎవరినీ‌ నిరుత్సాహపరచటానికి అనటం లేదు.

ఒకసారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు. అయ్యా మీరింతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. అయన అన్నారూ, నేను ప్రకటించినవి ఒక ముఫ్ఫైవేలుండ వచ్చును. నేను వ్రాసి చించివేసినవి యాభైవేలైనా ఉంటాయి అని. అంటే ఆయన పద్యం పట్టుకుందుకు అంత తీవ్రకృషి చేసారన్నమాట.

ఇప్పుడేం జరుగుతోంది? గణాల్లో అక్షరాలు పొదిగితే చాలు , అది పద్యం ఐపోయింది. దాన్ని ప్రకటించెయ్యటమే!

దానికి తోడు, ఈ‌ బాపతు ఉబుసుపోక పద్యాలను సాహిత్యంగా జనానికి అందిచాలన్న తపన కూడా పెరుగుతున్నది. 

ఆనాటి జడకవిత్వం అన్నది అటువంటి ప్రయత్నం అనుకున్నాను. కాబట్టే దాన్ని హర్షించలేదు. దాని జోలికి పోలేదు.

కుట్టుడు పద్యాల గురించి ఎందుకంత ఆక్రోశం అని అనవచ్చును ఎవరన్నా. అవెలా ఉంటాయో ఒక పద్యం చిత్తగించండి.

కం. వ్యధపెట్టు వ్యవస్థ యొక వ
నధి! గాజులు గల్లుగల్లనఁగ గాండివమె
త్తె ధనంజయుండనిన్ చే
రి ధర్మము ధరణిని నిలువరింప జిలేబీ !

దీనిలో‌ కందపద్యం తాలూకు నడక ఏమాత్రం ఐనా ఉందా? కేవలం గణాలు సరిపోయాయి కాబట్టి, ఏదో దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ దీన్ని కందపద్యం అనేసింది కాబట్టి ఇది కందపద్యం ఐపోయిందా? నిజానికి ఆ సాఫ్ట్‌వేర్ ప్రయోజనం దానికి ఉంది లెండి, కాని దేన్నైనా మనం దురుపయోగం చేయవచ్చును కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను కూడా అంతకన్నా దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ ఒకటి అలాంటిది తయారు చేసుకుంటున్నాను. దానికి నిర్దేశించిన ప్రయోజనం దానికి ఉంది.

ఇటుచంటి పద్యాలను నేను పద్యాలనటానికి కూడా ఇష్టపడక గిద్యాలని అన్నందుకు నాపైన కొందరికి కించిత్తుగా కినుక ఉన్నమాట యదార్ధం.

అన్ని విషయాలూ‌ పుస్తకాల్లో ఉండక పోవచ్చు. కాని పెద్దలనుండి కొంత, అభ్యాసం ద్వారా కొంత తెలుసుకోవాలి. దేశికవిత్వంలో పాదాంతవిరామం పాటించితే‌ పద్యాల నడక సాఫీగా ఉంటుంది. లేకపోతే అస్సలు ఉండదు. పదాలు వీలైనంతవరకూ గణాల వద్ద ఆరంభం కావటం మంచిది. ఈ లక్షణాలు మార్గికవిత్వాన్ని కూడా అందగింపచేస్తాయి కాని దేశికవిత్వం విషయంలో ఇవి మరింత ముఖ్యం. ధారాశుధ్ధిగా లేని పద్యాలను చదవటం‌ ఎవ్వరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వదు. వ్రాయండి. పుంఖానుపుంఖాలుగా వ్రాయండి. నిరంతరాయంగా నిర్భయంగా వ్రాయండి. కాని వ్రాసిన ప్రతిపద్యాన్నీ ప్రకటించాలన్న దురదను మాత్రం దూరం‌ పెట్టండి. క్రమంగా మంచి ధార తప్పక వస్తుంది. 

మళ్ళీ మొదటీకి వస్తున్నాను. ఆమధ్య జడ శతకం వచ్చిందన్నాను కదా. దానిని శంకరాభరణం వారు ప్రచురించినట్లు గుర్తు. నాది పొరపాటు కావచ్చును. ఇదెందుకు ఈరోజున ప్రస్తావనకు వచ్చిందంటే  శతకపద్యాలకు ఆహ్వానం అంటూ ఒక బ్లాగుటపా కనబడింది.  అందులో‌ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో ఒక శతకాన్ని సకలకవీశ్వర శతకంగావెలువరించాలని శ్రీ పద్మాకర్ గురుదేవులు సంకల్పించారు అని చెప్పారు. సకలకవీశ్వరులూ ఒక్కొక్క పద్యం వ్రాయటం ఏమిటీ? ఈరోజుల్లో అందరూ‌ కవులు కావటం‌ కన్నా ముందుగానే‌ కవీశ్వరులు అవుతున్నారు కదా. కాబట్టి ఔత్సాహికులు అందరూ తలకొక పద్యం చొప్పున పంపితే వారు ఒక శతకాన్ని కుట్టి తయారు చేస్తారన్నమాట. అంతకంటే మరేమీ లేదు.

ఐతే ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అందరూ తలొక రకంగా వ్రాస్తారు కదా అని. ఐతే ఏమి. అదొక ప్రతిబంధకం కాదు. కాని నిజమైన చిక్కు మరొకటుంది. ఔత్సాహికులు వ్రాసే పద్యాల్లోని లక్షణదోషాల సంగతి ఏమిటీ‌ అని. అవును కదా. అచ్చు వేసేందుకు పూనుకున్నాక ఆ పద్యాలను సాధ్యమైనంతగా పరిష్కరించాలి మరి. ఎవరో ఒకరు ఈపని చేస్తారు. కాబట్టి పంపేవారు వారికి చేతనైననట్లు వ్రాసి పంపితే పరిష్కర్తలు తప్పులుంటే సరిచేస్తారు. వీరు చెప్పిన మాటల్లో నాకు నచ్చినది ఒకటుంది అది కవులందరూ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో పద్యాన్ని తాత్పర్యసహితంగా వ్రాసి పంపమనటం. ఇది చాలా ముఖ్యం అని నాస్వానుభవం. పద్యాన్ని దిద్దవలసి వస్తే అసలు కవిహృదయం తెలియటం వలన తద్విరుధ్ధంగా శుధ్ధప్రతి తయారు కాకుండా ఉంటుంది.

అదేమిటీ దిద్దే వారికి ఆమాత్రం పద్యం తాలూకు అన్వయం తెలీదా, మళ్ళా కవి స్వయంగా చెప్పాలా అనవచ్చును. నాస్వానుభవంతో చెబుతున్నాను. రకరకాల కారణాల వలన కవిగారి ఉద్దేశం వేరు పరిష్కర్త సిధ్ధం చేసే పాఠం చెప్పే అర్ధం వేరు కావచ్చును.

ఒక సంకలనానికి నేను కూడా కొంత తటపటాయించిన పిదపనే నాలుగు పద్యాలు పంపాను. (నాలుగు నిబంధన వారు పెట్టినదే). అవి అచ్చయిన పిదప చూసుకుంటే చాలా బాధ కలిగింది. వాటిలో ఒక మచ్చుతునకను మీకు చూపుతాను.

నేను పంపిన పద్యం:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా
వందనములు వారికి నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్

పరిష్కర్తలు ప్రకటించిన పద్యప్రతి:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా!
వందనములు వారికి। నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్!!

ఎందుకు అనుకున్నారో తెలియదు, పరిష్కర్తలు నావనే కాదు, అందరి పద్యాల్లోనూ కొల్లలు కొల్లలుగా ఆశ్చర్యార్ధకాలను  చేర్చి ప్రకటించారు. ఇందువలన తెలిసీ తెలియకా చాలా చోట్ల అర్ధవిపరిణామాలు చోటుచేసుకున్నాయి. పద్యాల అన్వయాలు మారిపోయాయి! అసలు తెలుగు పద్యాలలో విరామచిహ్నాల అవసరం ఏమీ‌ లేదు. అవి వాడవద్దని అందరికీ‌ నా మనవి.

నేను "రామా వందనములు,  వారికి నీ వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్" అని ఉద్దేశిస్తే పరిష్కర్తలు నా నమస్కారాలను రాముడి నుండి ఉపసంహరించి "రామా, వందనములు వారికి" అని అవి శంకరయ్య గారికి అందజేసారు.

నాకు పద్యవిద్యలో ఓనమాలు దిద్దించిన గురుదేవులు స్వర్గీయ వేదుల వేంకటరావు గారు. ఒక సందర్భంలో వేరే ఒక తెలుగుమాష్టారు గారి పద్యాలను దిద్దటం వలను పడక ఆయన భావాలతో నేనే మరలా వ్రాసి ఇచ్చాను పద్యాలు. అవి ఆయన స్టేజీమీద చదివారు. అప్పుడు నేనూ కొన్ని చదివాను అనుకోండి అది వేరే సంగతి. మాగురువుగారు మాత్రం ఉగ్రులైపోయారు. నన్ను పిలిపించుకొని చీవాట్లు వేసారు. భగవంతుడిని తప్ప ఎవరినీ పొగుడుతూ పద్యాలు వ్రాయవద్దని హెచ్చరించారు. ఆయన ఆదేశాన్ని మీరిందెన్నడూ‌ లేదు. అందుచేత ఈ సందర్భంలో శంకరయ్యగారిని ఆశీర్వదించమని రాముణ్ణి వేడుతూ‌ పద్యాలు పంపుతే పరిష్కర్త గారు నా నెత్తిన పిడుగు వేసారు! నాకైతే నా అతితెలివికి తగిన శృంగభంగం ఐనదా అని కూడా అనిపించింది. నేను తేరుకుందుకు చాలా సమయం పట్టింది.

అందుచేత చేతనైతే అవసరం అనుకుంటే నేను పద్యాలను వ్రాస్తానే‌ కాని ఎవరో వాటిని మార్చే అవకాశం ఉన్నచోట ఇకనుండైనా చాలా చాలా జాగ్రతగా ఉంటాను.  

అందుచేత ఇలాంటి సంకలనాలకు పద్యాలను పంపేవారు కొంచెం‌ గమనికగా ఉండాలి. శతకం కాస్తా మిక్చరుపొట్లంలాగా ఉంటే జనం ఆసక్తిగా దాన్ని గ్రహించక పోవచ్చును. అసలు తెలుగుపుస్తకాలను చదివే వాళ్ళే తక్కువ. అటువంటప్పుడు జనం చేత చదివించలేవని ముందే తెలిసిన పుస్తకాల కోసం కవులు శ్రమపడాలా అన్నది ఆలోచనీయం.

అదీ కాక శతకం అంటే ఫలాని కవిగారు వ్రాసారనటం‌ కద్దు. రోజులు మారి ఫలాని గ్రూపు వారు వ్రాసారనో ఫలాని గ్రూపువారు సేకరించారనో అంటారేమో నవీనశతకాల్లో చాలా వాటికి. 

అందుకే   శతకపద్యాలకు ఆహ్వానం అంటూ వచ్చిన ఈ అహ్వానమూ‌ నాకు రుచించక ఒక ముక్క అన్నాను. 

కం. ఒకకవి యొకకృతి చేయుట
యొకవిధమగు సంప్రదాయ ముచితము నటుగా
కొకరొక పద్యము చొప్పున
నొక కలగాపులగపుకృతి యొక శతకంబా?

ఈ అభిప్రాయాన్ని ఉదయం పంపాను కాని వారు ఇంకా అచ్చువేయలేదు. పోనీయండి. వారిష్టం వారిది. నా అభిప్రాయాన్ని విపులంగా ఇక్కడ వ్రాసుకుంటున్నాను. 

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.