30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

కొండమీది గుడిలోని గోవిందుడేకొండమీది గుడిలోని గోవిందుడే నా
గుండెయనే గుడిలోని గోవిందుడు

వేదాంతులు బ్రహ్మమని పిలుచు గోవిందుడు
వేదవిదులు విష్ణువని పిలుచు గోవిందుడు
నాదోపాసకులకు గానంబు గోవిందుడు
నా దేవుడు రాముడైనాడు గోవిందుడు
కొండ

వేనవేల పేరులతో వెలుగు గోవిందుడు
ధ్యానించగ కర్మబంధ మణచు గోవిందుడు
జ్ఞానులకు గమ్యతత్త్వమైన గోవిందుడు
మానితముగ నాకు రాముడైన గోవిందుడు
కొండ

శక్తిహీనులను బ్రోచు శక్తి గోవిందుడు
భక్తజనులనంటి యుండువాడు గోవిందుడు
యుక్తమైన కోర్కెలెల్ల నొసగు గోవిందుడు
ముక్తిప్రదుడు శ్రీరామమూర్తి గోవిందుడు
కొండ
ఎన్నెన్నో నే చూచితినిఎన్నెన్నో నే చూచితిని నీ
వన్నియు చూపగ చూచితిని

మాయామయమగు జగమును నమ్మే మనుజుల మనసులు చూసితిని
కాయమె తానని తలచే వారల కష్టము నిత్యము చూసితిని
ప్రేయోమార్గము వెంట మనుషుల వెఱ్ఱిపరుగులను చూసితిని
శ్రేయోమార్గము గలదని తెలియని జీవుల కొల్లగ చూసితిని
తెలిసి

అక్కడక్కడ భ్రమలు తొలగిన అనఘుల కొందఱ జూసితిని
చక్కగ రాముని నమ్మిన మనసుల శాంతము సౌఖ్యము చూసితిని
అక్కజముగ శ్రీరాముడు వారికి దక్కుట వేడ్కను చూసితిని
మిక్కిలి ప్రేముడి కొలిచి రాముని దయనే బ్రతుకున చూసితిని
తెలిసి

కవనము నీ నామాంకిత మగుచో కలిగిన సౌఖ్యము చూచితిని
పవలని రేలని భావింపక నిను పాడుట మేలని చూచితిని
ధవళేక్షణ నీదయ నెల్లప్పుడు తలచి పాడగ జూచితిని
అవిరళముగ నటు చేయుటలో గల హాయిని మనసున చూచితిని
తెలిసి


29, సెప్టెంబర్ 2016, గురువారం

ఏది జరిగిన నది యీతని యానతి


ఏది జరిగిన నది యీతని యానతి
యేది వలదను నది యెన్నడు గానిది


ఎవ్వని కెయ్యది యెన్నడు కలిగెడు
నెవ్విధి కలిగెడు నెక్కడ దొరకెడు
నెవ్వ డెఱుంగెడు నీశ్వరు డీతడు
త్రవ్వి కర్మములు తలకు చుట్టగను
ఏది

జీవి కోరినవి దేవుడిచ్చునా
దేవు డిచ్చినవి జీవి మెచ్చునా
ఏవి లభించిన నీశ్వరేఛ్చయని
భావించుటయే జీవికి మేలగు
ఏది

భూమిని నరునకు పుట్టెడు కోర్కెల
నేమీయగ దగు రాము డెఱుంగును
రాము నీశ్వరుని రమ్యగుణాకరు
ప్రేమ మీఱగను వేడిన మేలగు
ఏది


తెలిసికొన్న కొలది తత్త్వముతెలిసికొన్న కొలది తత్త్వము తెలియలేమియె తెల్లమగురా । అది
తెలియవశము కాదు రామదేవునింక శరణువేడర

వయసు మీఱుటచేత మీదికి వచ్చిపడిన ప్రభుతవలన
దయను జూపుచు పెద్దవారు తత్త్వబోధలు చేయుచుందురు
భయము నయము వినయమొప్ప వాదులాడక వినెద వీవు
పయిడి పలుకుల తత్త్వమాధురి భావవీధుల నిలువకుండును
తెలిసి

కొంత పెద్దలవద్ద నేరిచి కొంత గురువుల వద్ద నేరిచి
కొంతతెలిసి కౌతుకముతో కోరి గ్రంథము లరయ బోతే
యెంతచదివిన కాని తత్త్వచింతనము సిధ్ధించకుండును
సుంతలాభము లేక చిత్తక్షోభయే తరచగుచునుండును
తెలిసి

ఘనముగా బోధించు వారు కాంచినదియు స్వల్పమేనా
ఘనతకెక్కిన గ్రంథరాశిని మనకుదొరకున దల్పమేనా
యనుచు నంతవిచార పడబో కసలు తత్త్వము రామతత్త్వమె
మనసు రామార్పణము చేసిన మంచిగా తత్త్వమ్ము తెలియును
తెలిసి


28, సెప్టెంబర్ 2016, బుధవారం

శ్రీరామ శ్రీరామ యనగానేశ్రీరామ శ్రీరామ యనగానే చింతలన్నీ దూరమయ్యేను
నోరార శ్రీరామ యనగానే కోరదగినది చేరువయ్యేను

నోరూరగా కాచి యెన్నెన్నో భూరుహంబున పండ్లు గమనించ
మూరెడెత్తున నూగుచుండంగ మోజుపడియును నందుకోలేడు
చేరి చెట్టు క్రింద మరుగుజ్జు చెట్టు దేముండును దోసమ్ము
శ్రీరామ యనలేక మూర్ఖుండు శ్రీరామకృప నందుకోలేడు
శ్రీరామ

నిండు పున్నమరేయి జాబిల్లి పండువెన్నెల కాయుచుండంగ
బండనిద్దురవచ్చి రేయెల్ల పండు కొన్నాడా ముసుగెట్టి
ఉండియూ ఊడియూ గగనాన ఒక్కటే కద చందమామయ్య
తిండి నిద్దుర బ్రతుకు శ్రీరామదేవునికృప నందుకోలేదు
శ్రీరామ

పిలచి పెండ్లివిందు భోజనము పెట్టగ పదిమంది తినుచుండ
కెలకుచుండు గాని జ్వరరోగి వలన కాకుండును భుజియింప
వలచి సిద్ధాన్నంబు తినలేని వాని వంటివాడు నాస్తికుడు
తలచి శ్రీరామ యనలేడో తాను రామకృప గొనలేడు
శ్రీరామ


మన యూరి చెఱు వెంత మహదొడ్డదైనామన యూరి చెఱు వెంత మహదొడ్డదైనా
వనరాశి కేమైన సాటి వచ్చేనా

దేవతయగు గాక దేవేంద్రుడగు గాక
వేవేల మహిమల వెలుగును కాక
సేవింపదగు గాక సిరులిచ్చు గాక
భావింపగ వాడు భగవంతుడగునా
మన

లోకంబులో వాడె లోకేశు డైన
లౌకికంబులు గాక నీ కీయలేడు
అ కొద్ది వరముల నందించినంత
ప్రాకటంబుగ వాడు భగంతుడగునా
మన

మోదమలరగ కొలిచి మోసపోనేల
ఏ దేవతయు మోక్షమిచ్చుట లేదు
వేదవేద్యుని రామవిభుని సేవించ
రాదా చేకొనరాదా పరంబు
మన


27, సెప్టెంబర్ 2016, మంగళవారం

దనుజులపాలి కోదండరాముడుదనుజులపాలి కోదండరాముడు భక్త
జనకోటిపాలిటి జానకీరాముడు

కరుణాళువు వీడు లోకకళ్యాణరాముడు
సురగణంబులకు సర్వశుభదరాముడు
అరయగా దశరథున కానందరాముడు
మురియు కౌసల్య కేమొ ముద్దులరాముడు
దనుజుల

మునిపత్నిపాలి శాపమోచనరాముడు
మునికోటులకు వీడు మోక్షదరాముడు
జనకరాజునకు వీడు జామాత రాముడు
జనకాత్మజామనస్సరసీరుహధాముడు
దనుజుల

సామాన్యులము మాకు సకలవరదరాముడు
కామాదిదుష్టవైరిఖండనరాముడు
పామరత్వమణచు నట్టి బంగారురాముడు
రామరాజ్యస్థాపకుడు రాజారాముడు
దనుజుల
26, సెప్టెంబర్ 2016, సోమవారం

పొడవైన నల్లని భూతము (అన్నమయ్య)పుడమి నిందరి బట్టె భూతము కడుఁ
పొడవైన నల్లని భూతము

కినిసి వోడమింగెడి భూతము
పునుక వీఁపు పెద్ద భూతము
కనలి కవియు చీఁకటి భూతము
పొనుగుసోమపు మోము భూతము
పుడమి

చేటకాళ్ళ మించిన భూతము
పోటుదారల పెద్దభూతము
గాఁటపు జడల బింకపుభూతము
జూటరి నల్లముసుగు భూతము
పుడమి

కెలసి బిత్తలే తిరిగేటి భూతము
పొలుపు దాంట్ల పెద్దభూతము
బలుపు వేంకటగిరిపయి భూతము
పులుగుమీఁది మహాభూతము
పుమి


(వరాళి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం. 18వ రేకు)

వివరణ:
ఈసంకీర్తనం ఒక దశావతార ప్రశంశా గీతం.  ఇందులోని అవతార ప్రసంగాలను ఇలా ఒక పట్టిక లాగా చూపుతున్నాను.

మత్స్యకినిసి వోడమింగెడి భూతము
కూర్మపునుక వీఁపు పెద్ద భూతము
వరాహకనలి కవియు చీఁకటి భూతము
నృసింహపొనుగుసోమపు మోము భూతము
వామనచేటకాళ్ళ మించిన భూతము
పరశుపోటుదారల పెద్దభూతము
రామగాఁటపు జడల బింకపుభూతము
కృష్ణజూటరి నల్లముసుగు భూతము
బుద్ధకెలసి బిత్తలే తిరిగేటి భూతము
కల్కిపొలుపు దాంట్ల పెద్దభూతముమత్సావతారసమయంలో మహావిష్ణువు ఒక పెద్ద చేపగా మారి సత్యవ్రతుడనే పరమభాగబతోత్తముడు సకలసృష్టికీ చెందిన జీవరాశుల మూలాలతో నిండిన ఓడను అధిరోహించగా దానిని తననోటితో పట్టుకొని ప్రళయాంబురాశిని దాటించాడు. అంత పెద్దఓడను నోటితో కరుచుకొని ఆయనసాగటాన్ని అన్నమయ్య గారు ఓడని మింగటంగా చెప్పారు చమత్కారంగా. అది ఎంత పెద్దమత్స్యం అంటే ఆ ఓడ ఇంచుమించు ఆయన నోట్లోనే ఉన్నట్లున్నదట. అదీ సమస్తజీవమూలాలతో కూడిన పెన్నోడ.

కూర్మావతారంలో మహావిష్ణువు ఇది కపాలం ఇది వీపు అని తెలియరాని చందంగా పెద్ద  తాబేలు అయ్యాడు కదా. తలను అంటే వీపు ఉన్నట్లుగా చూపుకు తోచి ఆ కపాలమే వీపుగా కూడా వ్యాపించిందా అనిపించే శరీరం దాల్చాడని చమత్కారం.

వరాహావతారంలో విష్ణువు చమత్కారంగా కనలి అటు హిరణ్యాక్షుణ్ణి పట్టి చీరి వధించాడు. ఇటు తన వీరవిక్రమవిహారాన్ని ఆనందించి ప్రస్తుతిచేసిన భూదేవితో శృంగారవినోదమూ చేసాడు. ఇక్కడ కవయటం అన్నమాట కాకువు. అంటే అటు హిరణ్యాక్షుడి పరంగా ఎదిరించి వదించటాన్ని సూచించటానికి, అలాగే ఇటు జతకూడు అన్న అర్థంలో భూవిష్ణువుల దాంపత్యాన్ని సూచించటానికి అన్నమాచార్యుల వారి చమత్కార ప్రయోగం.

నృసింహావతారంలో విష్ణుదేవునిది పొనుగు సోమపు మోము అంటున్నారు. పొనుగు అంటే ఐతే గడ్డి లేదా పొట్టి. కాదంటే తేజస్సులేకపోవటం. ఉన్నంతలో గడ్డి. అదీ బంగారు రంగు ఎండు వరిగడ్డి అనుకుంటే బాగుంటుంది. సోమము అంటే పరాక్రమం. కాబట్టి ఆయన ముఖం బంగారు వన్నెతో ఉన్న మహాపరాక్రమం కల సింహముఖం కలిగి ఉన్నారని భావం.

వామనమూర్తివి చేటకాళ్ళట. అంటే అంతంత పెద్ద వైన ముల్లోకాల మీదా అయన పాదం మోపితే వాటిమీద - ఏదో చిన్న వస్తువు మీద పెద్ద చేట బోర్లించినట్లుగా అయ్యిందని కవి వాక్యం. ఇక్కడ మించటం అంటే పరాక్రమించటమే. వామనుడికి త్రివిక్రముడని కదా పెద్దపేరు.

పరశురాముడు పోటుదారల వాడట. ఆకాలంలో ధర్మద్రోహులైన రాజులపై ఆయన గొడ్డలి పోట్లు వేయటం నెత్తుటి దారలతో నేల చెరువులు కావటం అన్నది ప్రస్తావిస్తూ అన్నమయ్య చమత్కృతి.

ఈ సంకీర్తనంలో రాముడిగా విష్ణువు గాటపుజడల వేషం వాడు. ధర్మవరోధియైన రావణుణ్ణి వధించటం అయన అవరారప్రయోజనం. అందుకే అరణ్యవాసమూ మునిలాగా దట్టంగా జడలు పెంచటమూను.  రావణుడి సీతాపహరణం తనకు తాను వాడు నెత్తిన కొరవి పెట్టుకోవటం. వాడి ఇరవైచేతులూ పదితలలూ విష్ణుతేజపు బింకంలో అణగిపోవటం ప్రస్తావించటానికే బింకపు అన్నమాట జోడింపిక్కడ.

ఇక కృష్ణయ్య. ఆయన జూటరి వాడట. అంటే భలే కొంటె కోణంగి అని. ఈ‌మాటని అన్నమయ్య అనేక మార్లు వాడాడు తన సంకీర్తననాల్లో. నల్లముసుగు అంటే నీలదేహం‌ అనో విష్ణుమాయ అనో చెప్పాలి.  నల్లని ముసుగువేసుకొన్న దొంగ చీకట్లో దొరకడు. అలాగే నల్లనయ్యా తాను ఎవ్వరికీ దొరకడు. లోకం మీద వెన్నుడు విసిరిన నల్లముసుగు విష్ణుమాయ. ఆ మాయావికృష్ణుని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు అన్నమయ్య.

అందరూ అనుకునే టట్లుగా శాక్యముని బుద్ధుడు దశావతారాల్లోని బుద్ధుడు కాదు. వేరే. ఆపన్నివారక స్తోత్రంలో దైత్యస్త్రీమనభంజినే అని చెబుతారు. దైత్యస్త్రీలు కూడా తమ పాతివ్రత్యమహిమతో అధర్మపరులైన రాక్షసరాజుల్ని అజేయుల్ని చేయటం గమనించి విష్ణువు పరమసమ్మోహనకరమైన దిగంబరయువసన్యాసి వేషంతో త్రిపురాల్లో సంచరిస్తూ ధర్మబోధలు చేయటం మొదలు పెట్టాడు. ఆయనను దర్శించి ఆ పతివ్రతలు కించిత్తు వ్యగ్రతకు లోనుకావటంతో త్రిపురాసురులకు రక్ష నశించింది. కెలసి అంటే విజృంభించి విచ్చలవిడిగా యువసన్యాసి బిత్తలగా తిరిగి కార్యసాధనం చేసుకోవటాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రస్తావన. వేరే సంకీర్తనంలో అన్నమయ్య పురసతుల మానములు పొల్లజేసినచేయి అని అనటం‌ గమనించండి.

చివరగా కలియుగాంతంలో వచ్చే కల్క్యావతారం. ఆ కల్కిమూర్తి పేరు విష్ణుయశుడు. ఆయన ఎంతో ధైర్యంగా పెద్దపెద్ద అంగలతో కలిమీదకు ఉరికి తరిమివేస్తాడని ఇక్కడ ప్రశంస.

బలుపు అంటే ఇక్కడ సర్వావతారాల బలసంపదల సమాహారమైన తత్త్వం. ఆది ఊతగా శ్రీవిష్ణువు వేంకటగిరిపై వెలసి అందర్నీ రక్షిస్తున్నాడట. అన్నట్లు ఆయన పులుగుమీద విహరించే వాడు. ఆపులుగు అంటే పక్షి - గరుత్మంతుడు. గరుడుడు వేదస్వరూపుడే. శ్రీవేంకటేశ్వరుడు వేదములను అధిష్టించి ఉండటం అంటే అయన వేదవేద్యుడు అని సూచన.

అ వేదవేద్యుడు శ్రీవేంకటేశ్వరుడు భూమిపైన అందరినీ చేపట్టి రక్షించుచున్నాడని పల్లవిలో సూచన.


చిత్తము లోపల శ్రీరాము డున్నాడుచిత్తము లోపల శ్రీరాము డున్నాడు
మెత్తని వాడు దైవసత్తము డితడు

పూర్వభవంబుల పొందిన వరమా
సార్వభౌముడులోన సాక్షాత్కరించె
దుర్వారమైనట్టి గర్వాదులను గెంటి
సర్వస్వమై బుధ్ధిసామ్రాజ్య మేలె
చిత్తము

వెడదకన్నులవాడు వీరోత్తముడు
నిడుదచేతులవాడు నిష్కల్మషుడు
అడుగకయే లోన నడుగిడి నాడు
అడుగడుగున రక్షయై నిల్చినాడు
చిత్తము

చిరుతనోటికి నేర్పె శ్రీరామ యనుట
నరనరమున భక్తి నాటి సంరక్షించె
తరమా శ్రీరామునిదయ యిట్టిదనగ
నిరుపమానమది నిర్హేతుకము
చిత్తము
25, సెప్టెంబర్ 2016, ఆదివారం

మానరాని ప్రయాణముమంచిరోజు చూడకయే మనిషిచేయు ప్రయాణము
మంచిచెడుల నెంచరాని మానరాని ప్రయాణము

పాపాత్ముడు పుణ్యాత్ముడు పండితోత్తముడు శుంఠ
శాపోపహతు డదృష్టజాతకుడు విరాగి
కోపదారి శాంతమతి గుణవంతుడు ప్రతివాడు
నీ పయనము చేయుటకే యిచట వేచియుండును
మంచిరోజు

పనిగొని తా మంచిచెడుగులను చూచి జనించడు
మనసారగ పంచాంగము కనుగొని మరణించడు
మనుజులకు రాకపోకలను కాలము గణించును
కనుక వచ్చిపడిననవాడు కదల వేచియుండును
మంచిరోజు

ఈరాకలుపోక లింక నెందుకని యెంచువాడు
పోరాడిన ఫలములేదు పొగిలినను ఫలములేదు
దారివేరొండు లేమి యారసి చిత్తంబున
శ్రీరామునిపాదములను చింతించవలె నింక
మంచిరోజు
24, సెప్టెంబర్ 2016, శనివారం

దైవమా నీకేల దయరాదయ్యాదైవమా నీకేల దయరాదయ్యా
ఏవిధి భవవార్నిధి నీదేనయ్యా

కనుల కెపుడు కనరాని ఘనుడవని గమనించి
మనసులోన నెంతగానొ నినుగూర్చి చింతించి
పనికిరాని భోగములను భావించుట వర్జించి
కొనసాగుచు నుంటిగద కొంచమైన దయరాదా
దైవమా

తల్లివీవు తండ్రివీవు దాక్షిణ్యమూర్తివీవు
ఎల్లచుట్టాలకన్న నెక్కుడయిన వాడవీవు
చల్లగాను చూచునట్టి సర్వలోకవిభుడవీవు
మెల్లగ నాకిపుడు కొంత మేలుచేయ తలచరాద
దైవమా

సామాన్యుడనయ్య నిన్ను చాలనమ్మి కొలుచుచుంటి
నీమమొప్ప రామరామ రామయనుచు పలుకుచుంటి
స్వామి నిన్నె తగిలియుంటి కామాదుల వదలియుంటి
శ్రీమంతుడ రామచంద్ర చింతదీర్చమనుచు నుంటి
దైవమా


23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నాతి యెఱింగెను నారాయణుడనినాతి యెఱింగెను నారాయణుడని
యాతని ఘనమహిమాతిశయమును

చేయని తప్పుకు శిలవలెమారి
ఆయహల్య ముని యనుమతమునను
వేయేండ్లుగ హరి వేడుచు శ్రీరఘు
నాయకుస్పర్శకు నాతిగ మారెను
నాతి

శ్రీదయితునకై సీతగ తానే
ఆదిలక్ష్మియే యవతరించినది
మేదినిపై నట మిథిలానగరిని
వేదవిహారిని పెండ్లాడినది
నాతి

అ రఘురాముడె యాదివిష్ణువని
ఆరసి కళవళమందె మందోదరి
ఆ రావణుడది పరికింపడుగా
ధారుణి కూలెడు తరుణము దాక
నాతి


22, సెప్టెంబర్ 2016, గురువారం

జీవాతుమై యుండు చిలుకా (అన్నమయ్య సంకీర్తనం)జీవాతుమై యుండు చిలుకా నీ
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయమున నుండి నా చేతనే పెరిగిన చిలుకా
జాతిగాఁ కర్మపు సంకెళ్ళఁ‌బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపు రెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
నెన్నెవరు

బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ‌ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రు లారుగురికిఁ గాక అడిచిపడువే నీవు చిలుకా
వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁ గూడి మెలగిన చిలుకా
నిన్నెవరు

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ చిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తమ్ములో నుండి సేవించుకొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపున బాయని చిలుకా
యేవియును నిజముగా వివి యేఁటికని నాకు నెఱిఁగించి నటువంటి చిలుకా
నిన్నెవరు


(ఆహిరి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం. 8వ రేకు)

వివరణ:

ఇది ఒక తత్త్వప్రబోధకమైన గీతం. ఇలాంటివాటికి తెలుగుదేశంలో తత్త్వాలు అని పొట్టిపేరు గట్టిగా ప్రచారంలో ఉండేది. ఐతే ఆదునిక కాలంలో పాట అంటే సినిమా పాట మాత్రమే ఐపోయినందువలన జనబాహుళ్యానికి తత్త్వము అంటేనూ తెలియదు తత్త్వాలు అంటేనూ తెలియదు. అది వేరే సంగతి.

ఈ‌తత్త్వాలలో ఒక సామాన్యలక్షణం ఏమిటంటే అవి సాధారణంగా జటిలంగా ఉంటాయి. అన్నీ తెలిసిన మాటలే ఉన్నా ఆ పాటల్లో ఉండే కొన్నికొన్ని పడికట్టుమాటలూ కొన్ని కొన్ని తెలిసినట్లే ఉండే మాటలకు గూఢార్థాలూ కారణంగా అవి ఏ‌ జనబాహుళ్యాన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయే ఆజనబాహుళ్యానికే బోధించి చెబుతే కాని బోధపడవు. ఆయా పాటలు వ్రాయబడిన రోజుల్లోని పరిస్థితి అంత దీనంగా లేదేమో కాని ప్రస్తుతం అవి వ్యాఖ్యానాపేక్ష కలవేను.

సరే ఈ తత్త్వగీతం చూదాం.

ఓ చిలుకా నీవు జీవాత్ముడవుగా ఉన్నావు.
ఈవల ఈప్రకృతిలో నీవు జీవాత్మవే కావచ్చును.
కాని ఆవల అంటే ప్రకృతికి వెలుపల, నీ నిజమైన స్వరూపంలో నీవు పరమాత్ముడవే.
అయ్యో ఈ‌సంగతి నీకు తెలియదు. ఈ‌ప్రకృతి నీకు ఆ సంగతిని మరపులో ఉండేలా చేస్తోంది.

నీ యొక్క నిజమైన స్వరూపాన్ని నేనే చూడు. తెలివి తెచ్చుకో.
ఆత్మ అనే పంజరంలో నీవు నీ నిజస్థితిలో నాకు ప్రతిబింబమాత్రుడివిగా ఉన్నావు.
నీ స్వస్వరూపంలో నాచేతుల్లో ఉంటూ నాలాగే  మెలిగేవాడివి.
కానీ ఇప్పుడు అలా లేవే.

ఎప్పుడైతే నానుండి నీవు 'నేను వేరు' అన్న భావనను పొందావో ఆ అహంభావం నిన్ను నానుండి దూరం చేసింది. అది  ఒక వదలించుకోలేని బంధం ఐపోయింది. అక్కడి నుండీ నీవు ఏది చేసినా అది 'నేను చేస్తున్నాను' అన్న పొరపాటు భావనతోనే చేస్తూ వస్తున్నావు. అదే కర్మబంధం! అందులో పడిచిక్కుకున్న నీవు నీతెలివిని పోగొట్టుకొని పేదవైనావు. ప్రకృతిలో అప్పటివరకూ నాలాగే స్వతంత్రంగా వ్యవహరించిన నీకు ప్రకృతికి బానిసగా మారిపోవలసిన స్థితి కలిగింది.

ఈ ప్రకృతి యొక్క కాలస్వరూపాన్ని దాని తత్త్వాన్ని తెలిపే సమస్తవిజ్ఞానాన్ని నీకు నేను ముందే అందించాను. ఎంతో చక్కగా నేర్చి ప్రకృతిలో హాయిగా విహరించే వాడివి. కాని ఎప్పుడైతే నీవు అహంకరించి నా అంతవాడిని నేను అన్న తప్పుడు భావనకు వచ్చావో నాకన్నా భిన్నుడను అనుకున్నావో, అప్పటినుండి నీవు కేవలం ఒక దేహివి మాత్రం ఐపోయావు. నీవు ప్రీతిగా పొందిన ఆదేహం అల్పమైనది. దానిలో దాగి ఉండాలని నీ ప్రయత్నం. కాని అది నిన్ను రక్షించలేకపోతోంది కదా. దాని రక్షణలో ఉన్నానని అనుకొనే నీవు ఈ ప్రకృతిదెబ్బలకు ఓర్చుకోలేకపోతున్నావు కదా. ఇప్పటికైనా తెలివితెచ్చుకో. నీవు ఈదేహానికి బధ్ధుడివి కావు. నీవు నీవే. నా ప్రతిబింబానివి. మేలుకో.

నిన్ను ఈప్రకృతిలో అన్నివైపులకు గుంజుతున్న ఈ పంచేంద్రియాలకు భయపడి అన్నివైపులకు పరుగెడుతున్నావే. నీకేమో ఆరుగురు శత్రువులున్నారు. వాళ్ళని నేను అరిషడ్వర్గం అని అంటాను. నీవేమో మంచి మిత్రు లనుకుంటున్నావు లాగా ఉంది. ఎంతో గర్వించి వాళ్ళతో చెలిమి చేస్తున్నావే.

వారి చెలిమి వలన నీవు టక్కరివైపోయావు. తిండి సంపాదించి ఈ‌ నీదని భావించుకొనే దేహానికి పెట్టంటం కోసం పదివేల పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు నిత్యం. ఒకప్పుడు నువ్వేనా నాతో కలిసిమెలిసి ఉండి నువ్వేనేనని ఎంతో మమతతో మెలిగినది అని ఆశ్చర్యం వేస్తుంది.

నిత్యం నీవు-నేను అంటూ ఉంటావే! నిజానికి నువ్వెవరు? నేనెవరు? ఇద్దరమూ ఒకటే కదా.
ఇకనైనా మేలుకో.
శ్రీవేంకటాద్రికి చేరుకో.
నీ చిత్తంలో నీవు స్థిరంగా నిలచి నీవెవ్వడవో ఆలోచించుకో.
తపించి నిజం స్థిరపరచుకో.

అలా వేంకటాద్రిని చేరుకున్నావా?
ఆ వేంకటాద్రీశుడిని సేవించుకున్నావా?
ఆయనకృపతో నీకు తత్త్వం బోధపడిందా?

ఏది దైవసంబంధమైన ప్రకాశతత్త్వమో తెలిసిందా?
ఏది మానుషమై అహంకారం కారణంగా నిలకడలేక తిరుగుతున్న తప్పుడు జీవితమో తెలిసిందా?
ఆ రెండింటినీ చిత్తంలో చక్కగా కనుగొన్నావా?
ఆ బోధపడిన తత్త్వం నీ చిత్తంలో స్థిరంగా కుదురుకున్నదా?
ఎన్నడూ ఇంక ఆ సత్యస్వరూపాన్నుండి దూరంగా జరిగిపోవటం లేదు కదా.
తస్మాత్ జాగ్రత. మరలా ప్రకృతిమాయలోనికి జారిపోగలవు.

స్థిరంగానే ఉన్నావా. సంతోషం సంతోషం.
"ఈ లోకంలో ఏవీ‌ సత్యవస్తువులు కావు. ఇవన్నీ నాకెందుకు" అంటున్నావా.
చాలా మంచిది.
ఈ మాటను నాతో స్థిరంగానే చెబుతున్నావు కదా.
ఇప్పుడు సరైనదారి లోనికి చక్కగా వచ్చావు.


సత్యమైన తత్త్వం నీకు బోధపడినపిమ్మట ఇంకా నేనేమిటి నువ్వేమిటి?
ఇద్దరమూ ఒకటే అనటం బాగుంటుంది.
అవును. నీవే నేను - నేనే నీవు.గండరగండడవు నీవుగండరగండడవు నీవు కాంతలము మేము గాన
మెండుధాష్టికమును జూపి మెఱసెదవీవు

ఎన్నెన్నో యిళ్ళుకట్టి యెన్నరాని వింతలకు
నన్నిటిని నెలవుచేసి యందాలను కుప్పబోసి
యన్నన్నా యెందరినో యన్ని చోట్ల నిలిపేవు
పన్నుగ నీమాయలోన పడద్రోసి యుంచేవు
గండర

ఇందరుండి యిన్నిచోట్ల నెఱుగ రెవరు నీపేరు
అందరిలో తిరిగెడు నిన్నరసిన జాణలు లేరు
ఎందునుండి యిటువచ్చెద వెఱిగిన వారలు లేరు
ఎందులకని యిటనుంటిమొ యెఱిగిన వారలు లేరు
గండర

పనులన్నీ మాని నిన్ను పట్టదలచి తిరుగువారు
కనుగొంటిరి వారు నీదు కరుణామృతవృష్టిని
ఘనులు వారు రాముడవని నిను జెప్పగ వింటిమి
మనసారగ నిను గొల్చుచు వినుతించుచు నుంటిమి
గండర
21, సెప్టెంబర్ 2016, బుధవారం

హరిసమ్మతి గొని యారంభించినహరిసమ్మతి గొని యారంభించిన
జరుగును జయము సకలకార్యముల

హరియనుమతమున నంబరీషుడు
హరివాసరవ్రత వ్యగ్రుడు గావున
పరమోగ్రుడు దుర్వాసుని క్రోధము
కరుణను హరి చక్రముచే నణచె
హరి

హరియనుమతమున అర్జునుడు సం
గరమొనరించెను కౌరవతతితో
కెరలు భీష్మగురువరులను గెలిచెను
దురమున నరదము హరి నడిపించగ
హరి

హరి యనుమతమున నాడుచుంటిని
ధరపై నేనా దశరథరాముడు
తిరముగ మదిలో తేజరిల్లగ
కరమనురక్తిని కడగి పొగడుచును
హరి
20, సెప్టెంబర్ 2016, మంగళవారం

నిన్నెవరు నమ్మెదరేనిన్నెవరు నమ్మెదరే నీవు మాటలాడకే
వన్నెచిన్నె వేషాలు వగలు చాలించవే

పదిమంది బంటులతో పడివచ్చి పెత్తనము
ముదమార చేసిచేసి ముంచిపోదువే
పదిమందిలో నన్ను పలుచనగ చేయుదువే
వదిలిపెట్టవే యింక వయ్యారి చిత్తమా
నెన్నెవరు

ఎప్పటికి తగినతొడు గప్పుడు బలె కప్పెదవే
తప్పుదారుల నన్ను త్రిప్పాలని చూసెదవే
తప్పొప్పుల మరపించు తిప్పతీగవే నీవు
నిప్పచ్చపుబుద్ధితో నీల్గెదవే చిత్తమా
నిన్నెవరు

తీరుగ నీసంగతిని తెలిపి వేడుకొంటినే
శ్రీరామరక్షనే కోరుకొని నిలచితినే
శ్రీరామచంద్రుడే చేరదీసె చిత్తమా
ఆరాముని పాదముల నాశ్రయించ బోవే
నిన్నెవరు
19, సెప్టెంబర్ 2016, సోమవారం

బాపు దైవమా (అన్నమయ్య)బాపు దైవమా మా పాలిభవమా
తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం

కాలనేమి పునుకిది కంచువలె లెస్స వాఁగీ
తాళమెత్తరే తత్త తత తత్తత్త
కాలమెల్ల మాభూతగణమెల్ల వీఁడె కాచె
నేలఁబడి నేఁడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం
బాపు

పగగొని మానక పచ్చినెత్తు రెప్పుడును
తెగి కొనుఁ దానె తి త్తి తి త్తి తి త్తి తి
తగు మహోదరువీఁపు ధణధణమని వాఁగీ
బిగియింహరే తోలు బింభిం బింభిం బింభింభిం
బాపు

మురదనుజుని పెద్ద మొదలి యెముకఁ దీసి
తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు
తిరువేంకటగిరిదేవుఁడు గెలిచిన స
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ
బాపు


(మాళవి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం 20వ రేకు)


వ్యాఖ్య:

ఈ పాటను అన్నమాచార్యులవారు శివమెత్తి పాడుతూ చెప్పినట్లుగా అనిపిస్తోంది.

కాలమెల్ల మాభూతగణమెల్ల  అన్నచోట ఎల్ల అన్నది పునరుక్తిగా ఉంది కాని సంకీర్తనాల్లో అడపాదడపా ఇలాంటివి చెప్పుకోదగ్గ దోషాలు కావు.

కాలనేమి, మహోదరుడు, మురాసురుడు అనే రాక్షసుల్ని శ్రీవారు సంహరించటాన్ని ప్రస్తావిస్తూ ఈ సంకీర్తనలోని చరణాలున్నాయి.

పునుక అంటే కపాలం. కాలనేమి పుఱ్ఱె ఒక కంచు పాత్రలాగా మోగుతోందట. దాంతో భేషుగ్గా తాళం వేసుకోవచ్చును పాటకి అని చెబుతున్నారు.

మహోదరుడి వీపైతే ధణధణ మని మోగుతుందట. ఆ తోలుతో‌ ఢక్కా బిగించి వాయించండి పాటకి వాయిద్యంగా అంటున్నారు.

తురులు అన్నది ఆ కాలంలో ఉన్న ఒక గొట్టాంలాంటి గాలిఊది వాయించే వాద్యవిశేషం కావచ్చు.  మురాసురుడి నుండి తీసిన పెద్ద యెముకను అలా తురులుగా చేసి ఊదండి పాటకి అంటున్నారు.

శ్రీవేంకటేశ్వరుడి విజయగీతికలు పాడటానికి ప్రక్కవాయిద్యాలుగా అలాంటివీ ఇలాంటివీ‌ కాదు ఆ చచ్చిన రాక్షసుల శరీరాల్లోంచే వాయిద్యాలు చేసిమరీ బాదుదాం అంటున్నారు.

అవును మరి భూతగణాలన్నింటినీ పీడించిన కాలనేమినీ, పచ్చినెత్తురు తాగి వినోదించే మహోదరుణ్ణీ చంపినందుకు శ్రీవారి మహిమని వాళ్ళ శరీరాల్నే కీర్తించేటట్లు చేయటం గొప్పగా ఉండదా.

మురాసురుడైతే తనని ముట్టుకున్నవాళ్ళు మరణించాలి తక్షణం అని బ్రహ్మగారిని అడిగి అలా వరం పొందాడు. చివరకు విష్ణువు చేతిలో వాడు చావక తప్పలేదు.

ఇలా లోకకంటకులను చంపిన శ్రీవారి మహిమలను వాళ్ళ శరీరభాగాలతో చేసిన వాద్యాల సహకారంతోనే పాడదాం అంటున్నారు అన్నమయ్య గారు.
ఎన్నెన్నో చిలకలుఎన్నెన్నో రామచిలుక లెగురుతున్నాయి
అన్నికొమ్మల మీద నాడుతున్నాయి

పొట్టితోకల చిలుకలు పొడుగుతోకల చిలుకలు
గట్టిముక్కుల చిలుకలు గడుసుగెంతుల చిలుకలు
చెట్టుచెట్టున పండ్లన్నీ చిటుకున మెక్కే చిలుకలు
ఇట్టేయిట్టె కొమ్మకొమ్మకు నెగిరే రామచిలుకలు
ఎన్నెన్నో

ఎన్నిమొక్కిన తనివితీరని యెన్నో రామచిలుకలు
అన్నికాయలు నేలకుదులిపే యెన్నో తుంటరి చిలుకలు
ఉన్నట్లుండి తోటను వదలి యూరికిపోయే చిలుకలు
అన్నప్రాప్తికి తోటకు చేరి యాబగ మెక్కే చిలుకలు
ఎన్నెన్నో

రాముని పెంపుడు చిలుకలు వసుధారామములోని చిలుకలు
కామితమైన కర్మఫలంబుల గోముగ మెక్కే చిలుకలు
రామనామము పలుకుచు తిరుగును ప్రేమగ కొన్ని చిలుకలు
క్షేమముగా శ్రీరామపాదముల చేరును కొన్ని చిలుకలు
ఎన్నెన్నో
18, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బని యేమిఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బనియేమి
శాశ్వతసుఖమే నాదైతే క్షిణికసుఖంబుల పనియేమి

ఎఱుగదగినదే యెఱిగితినా యితరవిద్యలే వలదు కదా
పొరబడి హరినే మరచితినా పొందగలిగినది లేదు కదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా
ఈశ్వరుడే

చిరుచిరువరములు కురిసేవారగు సురలనడుగుటే వలదుకదా
పొరబడి యడిగి తప్పైనదని పొగులుకర్మమే వలదుకదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా
ఈశ్వరుడే

అరకొర బ్రతుకుల నరులకు దొరకని హరికృప దొరకిన చాలుగదా
పరమభాగవతజనమందారుడు వదలకబ్రోచిన చాలుగదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరామముడు నన్ను పాలించుటయే చాలుగదా
ఈశ్వరుడే


17, సెప్టెంబర్ 2016, శనివారం

ఎవరెవరిని తలచిరి యేల తలచిరిఎవరెవరిని తలచిరి యేల తలచిరి
ఎవరెవరిని పిలచిరి యేల పిలచిరి

బిరబిరా రమ్మని పిలచినా డనుచు
ఉరుకుల పరుగుల నొయ్యారి నదులు
తరలుచున్నవి చాల తహతహ లాడుచు
నిరుపముడు సముద్రుడు నిజవిభు డనుచు
హరికై

కాలమే తలచునో కర్మమే పిలచునో
నేలకు దిగి జీవులెల్ల గోలగోలగా
పాలుమాలుచు గడపి పరువులెత్తేరు
నేల మరల రండని నిష్ఠురం బాడ
హరికై

తమకుతామె జీవులు తరలివచ్చేరు
తమకుతామె జీవులు తరలిపోయేరు
భ్రమలెల్ల తొలగి మోక్షమునకై కొందరే
విమలురై కొలిచేరు విభుడు శ్రీరాముని
హరికై
16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపుహరికై పలికిన పలుకా యది యందమొలికెడి పలికు
హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపు

హరిపారమ్యము నెఱుగనివాడై నరుడు గడపునది బ్రతుకా
హరిని విడచి యామరుని కొలుచు నే నరుని దైన నొక బ్రతుకా
హరినామము రానట్టి ప్రసంగము లను సలిపెడునది బ్రతుకా
హరి హరి హరి యని యానందముగా ననలేనిది యొక బ్రతుకా
హరికై

పొరిపొరి వాదంబులతో కాలముపుచ్చిన కలదే ఫలము
తరచుగ నితరుల మెప్పుల కొఱకై తడవిన కలదే ఫలము
హరిగుణగానము చేయని నాలుక యాడియు శూన్యము ఫలము
నరుడు శరీరము విడచెడు నప్పుడు నాలుకపస నిష్ఫలము
హరికై

నరులందరకును దారిచూపుటకు పరమాత్ముండగు హరియే
ధరపై నరుడై తద్దయుప్రేమను దశరథసుతుడై వెలిసె
నరులారా శ్రీరామచంద్రుని నామామృతమును గొనరే
పరమభక్తులై యన్యభావనల వదలరె రామా యనరే
హరికై


15, సెప్టెంబర్ 2016, గురువారం

ఇంతకాలము నుండి యీతనువున నుండిఇంతకాలము నుండి యీతనువున నుండి
యింతగ దీని నీసడించ నేమిటి కయ్య

పూర్వపుణ్యఫలముగ బొందిన దేహము
సర్వవిధముల నీకు సహకరించగా
నిర్వహించి బ్రతుకుచు నెఱుసగు నెఱుకకు
గర్వించి చీదరించి కాఱుకూతలా
ఇంత

బహిరాకాశ మనగ భగవన్మయమే
దహరాకాశ మనగ దైవనిలయమే
బహిరంతరము లిట్లు పావన మగుచో
అహహా తనువేటికి నలుసాయె నిపుడు
ఇంత

ఇది నీకు లేకున్న నీకును రాముని
మది నెంచి కొలువగా మరి వశమౌనే
అది నీవు తెలిసి రామార్పణ మనగా
ముదమున నుండనిచ్చి మోక్షము గొనవే
ఇంత


14, సెప్టెంబర్ 2016, బుధవారం

శ్రీరామసార్వభౌమ చిత్తగించవయ్యశ్రీరామసార్వభౌమ చిత్తగించవయ్య
యీరోజు రే పనవల దిపుడే మన్నించవయ్య

సారహీనమైన సంసార మందు ద్రోసి
ధారుణిపై త్రిప్పిత్రిప్పి దండనములు చేసి
క్రూరమైన యీమాయ కుటిలబుద్ధి చూపి
ఘోరకర్మపాశవితతి పేరిచి ననుబట్టె
శ్రీరామ

వేమారులు పుట్టిగూడ విషయము లందుండి
కామాదుల గెలువకుండ కాసులను రోయక
నీనామ మెఱుంగకుండ నీతత్త్వ మెఱుగక
నీమార్గము పట్టకుండ నేనెంతో చెడితి
శ్రీరామ

చాలుచాలు చెడిన దింక నీలావు తెలిసితి
మేలుచేయవయ్య నాకు మిగిలిన బంధముల
నీలీలను తొలగించుము నీకుపుణ్యముండు
వాలాయము నీకు దీనపాలనంబు దేవ
శ్రీరామ


13, సెప్టెంబర్ 2016, మంగళవారం

వనితలు పతిమీఁద వలపు చల్లుదురు (అన్నమయ్య సంకీర్తనం)దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు
అనుకొన్న మగవాని కాదరించ వలయు

మనసులు సోదింతురు మచ్చికలు చూపుదురు
కనుసన్న గావింతురు కాఁక సేతురు
గునుతురు సొలతురు గుట్టు తెలుసుకుందురు
వనితలు పతిమీఁద వలపు చల్లుదురు
దానికేమి

అసలెల్లా రేఁతురు అయము లంటుదురు
బాస సేయించుకొందురు భ్రమయింతురు
పాసివుండ రొరతురు పైకొని పెనఁగుదురు
వాసి నింతు రిట్లానే వలపు చల్లుదురు
దానికేమి

కడుసేవలు సేతురు కాఁగిటఁ గూడుదురు
బడివాయకుండుదురు పై కొందురు
యెడయక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పడి నావలె నిందరు వలపు చల్లుదురు
దానికేమి


(అన్నమాచార్య సంకీర్తనం 1678వ రేకు)

వ్యాఖ్య:

ఇది అన్నమాచార్యుల వారి మరొక అందమైన శృంగారసంకీర్తనం.

ఈ శృంగారసంకీర్తనంలో అన్నమాచార్యుల వారు నాయిక నోట నాయకుడిని ఉద్దేశించి పలికిస్తున్న మాటలు ఇవి.

ఇక్కడ నాయికానాయకులు అలమేలుమంగా వేంకటేశ్వరులు ఎప్పటిలాగానే. ప్రాకృతమానవులను ఉద్దేశించి అన్నమాచార్యుల వారు గానం చేయరు కదా.

నాయకుడు దక్షిణనాయకుడు.

అందుచేత నాయిక అలిగినది.

యథాప్రకారం నాయకుడు బ్రతిమలాడుకోవటమూ నాయిక ప్రసన్నురాలు కావటమూ జరిగినది.

జరిగిన దానిలో తప్పు ఎవరిదీ?

నాయకుడినే ప్రాణాధికంగా భావించి సేవించుకొనే తనదా?
మరొక స్త్రీని కూడా ఆదరించి వచ్చిన తన నాయకుడిదా?
తన ప్రాణంలో ప్రాణం అయిన నాయకుడిని తన వలపులవలలో వేసుకొన్న ఆ స్త్రీదా?
ఎవరిది తప్పూ అని?

ఇందులో ఎవరి తప్పూ‌లేదు లేవయ్యా అంటున్నది గడుసుగా నాయకుడితో నాయిక.

అవునయ్యా ఇందులో ఎవరి తప్పూ లేదు.
నాలాగే, ఆమెకూడా నువ్వే తన పురుషుడవని కొలుచుకుంటున్నది.
నేనైనా తానైనా సరే మా స్త్రీలందరకూ‌ నీతివర్తనం ఒకటే సుమా.
తనవాడు అని ఒకడిని అనుకున్న తరువాత ఆతడిని ఆదరించి తీరవలసినదే.

నావాడవై తనవద్దకు వచ్చావని ఆమె నిన్ను నిరాదరణ చేయలేదు మరి. అది భావ్యం కాదు.
అలాగే తనవాడవై నా వద్దకు వచ్చావని నేను నిన్ను నిరాదరణ చేయరాదు.
ఇందులో ఆమె దోషమూ లేదు, నాదోషమూ‌లేదులే.
అందుచేత ముఖ్యంగా అమె యేదో నాకు ద్రోహం చేసిందని నేను వగచనక్కర్లేదు.
అందరు స్త్రీల వలెనే ప్రవర్తించింది.
నిన్ను ఆదిరించి తనవాడిని చెసుకొన్నది.
బాగుందిలే.

స్త్రీల సంగతి నీకు తెలియదనా?
ఒకరికంటే ఎక్కువమందికి మగడివై కూర్చున్నావు కదా.
ఐనా మీ మగవాళ్ళకి ఎంత తెలిసినా స్త్రీల గురించి సరిగా తెలియనే తెలియదు సుమా.
నచ్చిన మగవాడి చేత వలపించుకోవటం స్త్రీ అన్నదానికి వెన్నతో పెట్టిన విద్య.

ఆడవాళ్ళు మగవాళ్ళ మనసులు బాగా శోధిస్తారు. ఆ విద్య మీకు చేతకాదులే, ఆడదాని మనసును తెలుసుకోవటం బ్రహ్మతరం కూడా కాదు.
మగవాళ్ళు నచ్చితే ఆడవాళ్ళు వాళ్ళతో చక్కగా స్నేహం చేస్తారు. వారిపై ఎంతో చనువు చూపిస్తారు.
నచ్చినవారికి ఆడవాళ్ళు కనుసైగలు చేస్తారు. అబ్బే అవి మరీ కొట్టొచ్చినట్లుండవు కాని నా కేసి చూసిందా అన్న సందేహమూ ఆశా మీకు కలిగేనా అలా ఓరగా కనీకనుపించకుండా చేస్తారులే.
ఆపైన మీమగవాళ్ళేదో కొంచె చనువు తీసుకోబోతే వేడివేడిగా అలిగిపలుకుతారు.
బెదిరి మగవాడు పారిపోతే కథ సమాప్తం అనుకో, అలాంటి వాళ్ళతో‌పని లేదు. కొంచెం సరసుడై మాటకలపగలిగిన వాడైతే ఎంతో బిడియం నటిస్తూ గునుస్తూ మాట్లాడతారు.
మీతో‌ మాట్లాడితే తమకేదో మర్యాదాభంగం ఐపోతోందని భయం‌ చూపిస్తూ జాగ్రత్తగా విముఖత్వం ప్రదర్శిస్తారు - ఒకప్రక్క ఆనుకూల్యతను చాకచక్యంగా చూపుతూనే.
దానితో మీరేమో గాభరాపడిపోయి ప్రసన్నం చేసుకుందుకు తొందరపాటు చూపిస్తూ ఏవేవో ప్రసంగాలు చేస్తారు. అమ్మాయి ఎక్కడ జారిపోతోందో అన్న ఆత్రుతతో.
అదీ అలాగే బాగా నటన పండించి ఆడవాళ్ళు మీ‌గుట్టుమట్లన్నీ లాగుతారు.
మీకేమీ తెలియదు.
ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళ మీద వలపులు చల్లి వశం చేసుకుంటారు.
ఐనా ఆమె తప్పేముందిలే. అందరిలాగే నీవూ ఆ వలపులవలలో పడిపోయావు.
ఆమెవాడి వైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఇంకా చెబుతాను విను. నచ్చినమగవాళ్ళను కొంగునకట్టుకుందుకు ఆడవాళ్ళ దగ్గర చాలానే ఉపాయాలున్నాయి.
ఆశలు రేకెత్తిస్తారు.
వట్టిమాటలకే కొందరు పడిపోతారులే.
కొందరికేమో అవి చాలవాయె.
అలాంటివారిని ఆడవాళ్ళు తాకీతాకనట్లుగా తాకి వాళ్ళకి ఉడుకెత్తిస్తారు.
ఇదేదో మీ విద్య అనుకునేవు సుమా. అచ్చంగా అది మా విద్యేను.
అప్పటికే వలలో పడతారు దాదాపుగా అందరు మగవాళ్ళూ.
ఇంక వాళ్ళని కదలకుండా కట్టెసుకోవమే తరవాయి.
ఓ దానికేం. వాళ్ళతో తీయతీయగా మాట్లాడుతూ కొంచెం దగ్గరైనట్లు వేషం చేసూ వాళ్ళ చేత ఎక్కడలేని ప్రమాణాలూ చేయించేసుకుంటారు ఆడవాళ్ళు.
ఓ దర్జాగా బాసలు చేసేస్తారు మగవాళ్ళు - వాళ్ళని బాగా భ్రమపెట్టేస్తారు ఆడవాళ్ళు పూర్తిగా లోబడినట్లే మెలగుతూ.
ఐనా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళుంటారు కాని మిమ్మల్ని మాత్రం పూర్తిగా నమ్మి ఉండరు. అందుచేత మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటారు.
మీరేదో తమని క్షణం ఎడబాయలేకుండా ఉన్నారని భావిస్తూ బోల్తాపడుతూ ఉంటారు.
మగవాళ్ళను అనుక్షణం తమవశంలోనే ఉన్నారు కదా అని పరీక్షించి చూచుకుంటూ ఉంటారు. మీ బుధ్ధులు ఎలాంటివో ఎవరికి తెలియవు కనుక?
హమ్మయ్య నా వాడే అని రూఢి చేసుకున్నాక అప్పుడు మీతో తామే చనవు తీసుకొని స్వస్త్రీలలాగే మెలగుతారు.
ఇలా మెల్లమెల్లగా తమ మధ్య మంచి అనుబంధం కల్పించుకొంటారు.
అలా ఆడవాళ్ళు మగవాళ్ళ మీద వలపులను చల్లి వశంచేసుకుంటారు.
ఆమె కూడా అలాగే చేసి నిన్ను తనవాడిగా చేసుకుంది.
ఆమెవాడివైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఐనా ఆడవాళ్ళంతా ఎంతలేదన్నా మగవాళ్ళకు విధేయులేలే.
తనవాడైతే చాలు, ఆ మగవాడిమీద ఆడది ఎంతో నికార్సైన ప్రేమనే చూపుతుంది.
నిత్యం ఎన్నో విధాలుగా ఎంతోసేవ చేస్తుంది.
అలా తమవారైన మగవారి కౌగిళ్ళలో వారూ తమసేవాకష్టానికి తగినప్రతిఫలమైన ఊరట పొందుతూ ఉంటారు.
ఒక్కక్షణం‌కూడా విడిచిపెట్టకుండా అంటకాగి ఉంటారు.
ఎప్పుడూ తమ మగలకు ఇంకా ఇంకా ఎలా ప్రియంగా ఉండాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు.
వాళ్ళని అంటిపెట్టుకొని ఉండి తమస్పర్శాసౌఖ్యం నుండి వాళ్ళు దాటిపోకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.
లేకపోతే మీలు బుధ్ధులు ఆడవాళ్ళకు బాగానే తెలుసును కదా. వాళ్ళ జాగ్రత్త వారిది మరి.
ఇదిగో ఇలా అమె కాస్తా నువ్వే నేను నేనే నువ్వు అన్నట్లుగా నిత్యమూ మీదపడి ఉంటే ఆమె వశం అవక మరొకలా ఎలా అవుతుందీ?
ఆమెవాడివైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఐనా ఇప్పుడేం ములిగిపోయిందీ అని?
నాదగ్గరకు వచ్చేసావుకదా?
నాతోనే ఉన్నావు కదా?

ఐనా ఒకర్ననేది ఏముందిలే?
అందరిలాగే నేనూ.
నాలాగే అందరు సపత్నులూ కూడా.

అందరమూ నిజానికి నిన్ను లోబరుచుకొనాలని ప్రయత్నించి మేమే నీకు లోబడి ఉన్నాము.
నేనైనా ఆమె ఐనా ఈవిషయంలో సమానులమే.
నేను నీమీద నా వలపులు చల్లినట్లే పాపం ఆమె కూడా అదే చేసింది.
అందరూ అలాగే చేస్తారు.
నిన్ను వశం చేసుకోవాలని ఆరాటపడతారు.
అందరూ నీకు వశవర్తులై ఉంటారు.

ఇదీ ఈ శృంగారసంకీర్తనంలోని భావం.

వేదాంతపరమైన వ్యాఖ్యానం చూదాం.

ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. తక్కిన జీవులందరూ స్త్రీలే.
స్త్రీలకు భర్త ఎలా ముఖ్యమో, ఎలా భర్తను తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని స్త్రీలంతా ఎలా తహతహలాడుతారో అలాగే జీవులంతా కూడా పరమాత్మను తమవాడిగా చేసుకుందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.
పరమాత్మకు ఏది ఇష్టమో తెలుసుకొని అలా ఉండటం ద్వారా ఆ జగన్నాథుడిని ఆకట్టుకుందుకు యత్నిస్తారు. అయనను తమకు స్నేహితుడిగా భావిస్తారు. ఆయన తమకు అనుకూలంగా ఏమీ కనిపించటం లేదని అనిపిస్తే తాపానికి లోనైపోతారు. ఎంతగా నేను ఇష్టపడుతున్నా నాముఖం పట్టించుకోవేం అని సణుక్కుంటారు. దీనుల్లాగా ఐపోతారు. ఆగురువుల్ని అడిగీ ఈ‌భక్తుల్ని అడిగీ అయన తమకు అభిముఖుడయ్యే గుట్టుమట్లన్నీ తెలుసుకుంటారు - అక్కడికి దాకా వస్తే అందరూ ప్రయత్నం చేసేవారే కదా. ఇలా ఉంటే నువ్వు ప్రసన్నుడివి అవుతావా అ ఉంటే అవుతావా ఐతే అలానే ఉంటాలే అని ఆయనకే ఆశలు చూపుతారు. ఆయనకు సంబంధించిన గుళ్ళూ క్షేత్రాలూ అన్నీ తిరుగుతూ ఉంటారు - ఎక్కడన్నా చిక్కకపోతాడా అన్న ఆశతో. ఇదిగో ఇది నీకు మహా ఇష్టమైన దివ్యక్షేత్రంట కదా - ఇక్కడికి వస్తే కనిపించాలి మరి అలాగైతే ఇక తరచూ వచ్చి దర్శనం చేసుకుంటాను -కాదు కాదు అక్కడే ఉండిపోతాను అంటూ దేవుడితోనే బాసలూ ఆయననే బెలిపించటాలూ చేస్తారు. ఎప్పుడన్నా ఏదైనా కాస్త ఆనుకూల్యసూచన కనిపించిందా ఆస్థితి నుండి అనుకోండి ఆక్షేత్రాదులనుండి అనుకోండి దూరంగా ఉండాలంటే భయపడుతారు -ఎక్కడ మళ్ళా ఆయన అనుగ్రహం తప్పిపోతుందో అని. కొంచెం అయన అనుగ్రహం సరిగా ఉందాలేదా అన్న అనుమానం కలిగితే పోట్లాడతారు కూడా. ఏవిధంగా ఇంకా ఇంకా సేవించి భగవంతుడి అనుగ్రహాన్ని నిలబెట్టుకోవాలా అని నిత్యం తపిస్తూ ఉంటారు. నిత్యమూ ఆయన యొక్క విభూతివిశేషాలకు కించిత్తు కూడా దూరంగా ఉండకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటూ వాటియందే దర్శనస్పర్శనపూజనాది క్రియలలో నిమగ్నమై ఉంటారు. తీవ్రమైన అభినివేశంతో సర్వేశ్వరుడి సాన్నిధ్యాన్ని అనుభవించుతూ ఉంటారు.

ఈవిధంగా భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించుకున్న భక్తజీవులకి అదే ప్రయత్నంలో వివిధావస్థల్లో ఉన్న సాటిభక్తజీవులపట్ల సానుకూల దృక్పథమే ఉంటుంది. తరించిన వారు తరణమార్గంలో ఉన్నవారిని అభినందనపూర్వకంగా గమనిస్తూ ఉంటారు. వారిపట్ల ఆదరం కలిగి ఉంటారు. భగవంతుడికి జీవులందరూ సమానమే. అందరి యెడలా ఆయనకు అపారమైన ప్రేమయే ఉంటుంది.


రామభక్తిమార్గమే రాజమార్గమురామభక్తిమార్గమే రాజమార్గము ఈ
భూమి నెల్లవారలకును ముక్తిమార్గము

కాముకులు కలనైన కాంచరాని మార్గము
తామసులు బుధ్ధిలోన తలపబోని మార్గము
పామరత్వమును వీడి పరమాత్ము నెన్నెడు
రామభక్తులందరకును రమ్యమైన మార్గము
రామభక్తి

మొద్దులైన వారికెపుడు బుధ్ధిపోని మార్గము
పెద్దలెన్నుకొన్న గొప్ప పేరుపడ్డ మార్గము
హద్దులేనిసంతోషపు హర్మ్యమునకు మార్గము
రద్దీగా నుండనిదిది రామభక్తిమార్గము
రామభక్తి

లజ్జుగుజ్జులాడువారు లక్షించని మార్గము
ఒజ్జలైనవారు చెప్పు నుచితమైన మార్గము
ముజ్జగముల వారికిదే ముఖ్యమైన మార్గము
సజ్జనులగు రామభక్తజనులుపోవు మార్గము
రామభక్తి


12, సెప్టెంబర్ 2016, సోమవారం

తలపులు నీ నామముపై నిలవనీ రామాతలపులు నీతత్త్వముపై నిలువనీ రామా
పలుకులు నీనామముపై నిలువనీ రామా

పలుగాకి పనులతో పవలు గడువకుండ
ఇలలోని సంగతులే కలల నిండకుండ
మెలకువలో కలలలో మెదలనీ తలనిండ
తులలేని నీ నామము తొలగనీ భవము
ఇదియే

వట్టివి ఇహసుఖములు వట్టివి పరసుఖములు
గట్టివి నీ దివ్యనామగానమహాసుఖములు
పట్టి నీవు ప్రోవ నే పరవశించి యుండుటలు
ఇట్టె ఇట్టె గడిచెనుగా ఎన్నెన్నో భవములు
ఇదియే

ధారుణిపై నుండుటలు దబ్బర జీవితములు
కోరుదునా నేను నిన్ను చేరి యుంట గాక
ఊరక నీవానిగా నుంచుటయే కాదు
శ్రీరామ లీనమే చేసికొనుము నన్నింక
ఇదియే


11, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఊటుకూరి కోనేటిరాయా! (అన్నమయ్య సంకీర్తనం)కోరిక లీడేరె నేఁడు కోనేటి రాయ - ఇట్టె
కూరిముల వూటుకూరి కోనేటిరాయ

కుమ్మరించేవు సిగ్గులు కోనేటిరాయ - యీ
కొమ్మలెల్లఁ జూడఁగాను కోనేటిరాయ
కొమ్మువంటి కొనగోరఁ గోనేటిరాయ - మేను
కుమ్మెలుగా నొత్తకుమీ కోనేటిరాయ
కోరిక

కొప్పుగడు వెడజారె కోనేటిరాయ - నిండా
గుప్పేవు సెలవినవ్వు కోనేటిరాయా
కుప్పరింపుఁ జెమటలఁ గోనేటిరాయ - యెంత
గొప్పవాఁడవయ్య నీవు కోనేటిరాయ
కోరిక

కొండికపాయ మమరెఁ గోనేటిరాయ - పైఁడి
గొండెలపచ్చడముతోఁ గోనేటిరాయ
అండనే శ్రీవేంకటాద్రి నలరి నన్నేలితివి
కొండలలో నెలకొన్న కోనేటిరాయ
కోరిక


(సామంతం రాగంలో అన్నమాచార్య సంకీర్తనం. 1650వ రేకు)

వ్యాఖ్య:

ఈ సంకీర్తనంలో కనిపించేది ఊటుకూరి కోనేటిరాయడు.

ఆ ఊటుకూరికీ అన్నమాచార్యులకూ మంచి అనుబంధమే ఉంది.

అన్నమాచార్యులవారి పితామహుడు నారాయణయ్య. అయనకు చదువు అబ్బలేదు. తండ్రి బాగా అలోచించి  ఊటుకూరిలోని తనబంధువుల ఇంటికి పంపాడు. అమ్మానాన్నల గారాబం వలన చదువురావటం లేదేమో బంధువుల వద్ద ఐతే కాస్త దారిలోనికి వస్తాడని ఆయన ఊహ కాబోలు. ఈ ఊటుకూరు కడపజిల్లాలో, రాజంపేట మండలంలో ఉంది. అక్కడికిపోయి అయ్యవార్లదగ్గర చేరి ఎంత ప్రయత్నించినా ఆ నారాయణయ్యకు చదువు అబ్బింది కాదు. బంధువులూ విసుక్కుంటున్నారు. చదువుపైన ఆసక్తి లేక కాదు, బుధ్ధికుశలత లేక ఆపిల్లవాడికి చదువు రావటం లేదు. అందరూ చీదరిస్తుంటే, తోటిపిల్లలు చక్కగా ప్రయోజకులౌతుంటే అవమానభారంతో క్రుంగిపోయాడు ఆ అబ్బాయి.

గ్రామదేవత చింతాలమ్మవారి గుడికిపోయి మొఱపెట్టుకున్నాడు. ఆవిడ ఏమీ పలకనేలేదు. తాను వ్యర్థుడనని తెలిపోయింది. జీవితాశ నశించిపోయింది. అంతే గుడిబయట ఉన్న పుట్టలో చేయి దూర్చేసాడు! పాము కరువలేదు. చింతాలమ్మ ప్రత్యక్షమైంది.

బాలుడిని చింతాలమ్మతల్లి ఓదార్చింది. గొప్పహరిభక్తుడై మీ వంశాన్నే తరింపచేసే మహానుభావుడికి నువ్వు తాతవు కావలసి ఉందయ్యా. మీ ఊరు తిరిగివెళ్ళు. మీ తాళ్ళపాక పెన్నిధి చెన్నకేశవస్వామిని దర్శనం చేసుకో - అయన అన్నీ అనుగ్రహిస్తాడు నీకు అని చెప్పింది. ఆవిడ చెప్పినట్లే స్వామిదర్శనం చేసుకొని ఆయన అనుగ్రహంతో‌ నారాయణయ్య మహావేదవిద్వాంసుడయ్యాడు.  ఆ నారాయణయ్య కొడుకు నారాయణసూరి. ఆ నారాయణసూరి తనయుడే మన అన్నమాచార్యుల వారు.

ప్రస్తుతం చింతాలమ్మ గుడి లేదు ఊటుకూరిలో. అక్కడి శివాలయంలో చింతాలమ్మ అని అందరూ చెప్పుకొనే ఒక దేవత విగ్రహం ఉంది.

ఈ సంకీర్తనంలో అన్నమాచార్యులవారు ఆ ఊటుకూరిలో ఉన్న విష్ణువును ప్రార్థిస్తున్నాడు.

ఇందులో వర్ణించబడినది నాయికానాయకుల మధ్య సంయోగశృంగారం. నాయకుడైన శ్రీవేంకటాద్రీశుడే ఊటుకూరిలోని కోనేటిరాయడు. నాయిక అలమేల్మంగమ్మయే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.  కోరికలన్నీ నెఱవేరాయని అమ్మవారు అయ్యవారితో చెబుతున్నట్లుగా ఉంది ఈ సంకీర్తనంలో.

అమ్మవారు అయ్యవారి వద్దకు చెలిమికత్తియలతో సహా వచ్చినది. అందరూ చూస్తూ ఉండగా వేంకటేశ్వరుడు ఎంతో సిగ్గు అభినయిస్తున్నాడు. అదంతా దొంగవేషం. ఆడవాళ్ళతో మాట్లాడాలంటేనే బెరుకూ సిగ్గూ అని గొప్ప అభినయం. కాని నిజానికి ఆయన ఈ స్త్రీజనం అంతా ఎప్పుడు తమని వదిలి సెలవు తీసుకుంటారా ఎప్పుడు తమ ఇద్దరికీ ఏకాంతం దొరుకుతుందా అని తహతహలాడుతున్నాడు. కాని వాళ్ళేమే ఆ దంపతుల్ని ఒకచోట చేర్చి వాళ్ళని తనివితీరా చూస్తూ ఆ ముచ్చట్లూ ఈ‌ముచ్చట్లూ చెప్పుకొంటూ వారితో రకరకాల పరిప్రశ్న చేస్తూ అక్కడే పాతుకుపోయారు. ఒకపట్టాన వదిలేలా లేరు. వారు అయ్యవారి అవతారాదికాలను మహిమాదికాలనూ వర్ణిస్తూ రకరకాల ప్రసంగాలూ చేస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. వారి కర్ణపేయమైన వాక్చమత్కృతులను ఆస్వాదిస్తూ ఎంత ప్రొద్దుపోతున్నదీ కూడా గమనించటం లేదు. శ్రీవారికి అసహనంగా ఉంది. తన పరోక్షంలో ఐతే అది వేరే సంగతి. తన సమక్షంలో తనగొప్పల్ని వీళ్ళంతా చిలువలు పలువలు చేసి ఆకాశమే హద్దుగా అనర్గళంగా మట్లాడుతూ పోతుంటే చికాకు వస్తోంది. సామాన్యంగానే సజ్జనులకు తమను ఎవరన్నా ఎదుటపడి కీర్తిస్తూ ఉంటే వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి భగవంతుణ్ణే వాళ్ళు ఈ‌ఇబ్బందికి గురిచేస్తున్నారే. పైగా ఎంతకీ కదలరే.

అందుచేత శ్రీవారు ఏంచేస్తున్నారయ్యా అంటే, ఇంక చాల్లే, వీళ్ళని ఎలాగో అలా పంపించేసేయ వలసింది అని ఆమెకు సన్నలు చేస్తున్నాడు. ఎదురుగా ఉన్న జనం చూడకుండా ఎలాగయ్యా అవైనా చేయటం? కంటిచూపుతో సైగ చేయాలంటే ఎదురుగా జనం ఉండగా కుదరదు కదా. ఏదన్నా నర్మగర్భంగా మాట్లాడి దేవేరికి చెబుదాం‌ అంటే వాళ్ళంతా విజ్ఞానులు జాణలు వాళ్ళకు దొరికిపోవటం తథ్యం.

కాబట్టి శ్రీవేంకటేశ్వరుడికి మిగిలింది ఒకటే మార్గం. ప్రక్కనే ఉన్న దేవేరిని కొనగోళ్ళతో గిచ్చుతున్నాడు. ఎలాంటి గోళ్ళవీ అంటే వాటికొసలు కొమ్ముల్లాగా ఉన్నాయట. అంటే కొమ్ముల్లాగా మొనదేరి ఉన్నా యన్నమాట.

అమ్మవారికి తెలియనివా అయ్యవారి వేషాలు! అందుచేత ఆవిడ అయనతో అందరిముందూ ఏమి సిగ్గులు నటిస్తావూ పైగా నన్ను గిచ్చిగిచ్చి పెడుతున్నావూ‌ అని హాస్యమాడుతున్నారు.

అందర్నీ ఎలాగో ఆవిడ మెత్తగా మాట్లాడి సెలవిచ్చి పంపిన తరువాత అయ్యవారి అసలురంగు బయటపడింది.  ఆయన కొంటే చేష్టలకు ఆమె ఎంతో కష్టపడి సింగారించుకున్న అందమైన కొప్పు కాస్తా జారిపోయి ఎడాపెడా ఐపోయింది. ఐనా ఆవిడ సింగారించుకుందా స్వయంగా ఆవిడ నెచ్చెలులే ఆవిడ మెచ్చాలనీ ఆకొప్పుసోయగాన్ని శ్రీవారు మెచ్చాలనీ ఎంతో శ్రధ్ధగా తీర్చిదిద్దారా మరి. అదికాస్తా అయన చెదరగొటేశాడు. పైగా అలా కొప్పు జారిపోవటం చూసి ఆయన పెదవుల చివరినుండి ముసిమిసి నవ్వులు చిమ్ముతున్నాడు. ఆవిడ విడివడ్డ కొప్పుతో చీకట్లు అలముకున్నట్లుగా ఐతే ఆయన చిరునవ్వుల ప్రకాశంతో ఆ గదినిండా వెలుగు క్రమ్ముకున్నట్లు ఐనది. శ్రీవారి గొప్పదనం ఇంతా అంతా అనరాదు.

అదిదంపతుల శృంగారక్రీడ వారికి చెమటలు పట్టించినది అట. అన్నమయ్య ఈ మాటను అతివేలంగా ఉపయోగిస్తాడు. వెంకన్న గొప్పదనాన్ని అమ్మవారు ప్రశంసిస్తున్నారు చెమటలు పడుతున్నా చిరునవ్వులు చెదరనీయవు కదా అని.

అవును మరి. శ్రీవారికి వయసు ఎంతనీ? అమ్మవారికి వయసు ఎంతనీ? వారు పురాణదంపతులే కావచ్చును ప్రపంచానికి. కాలమే వారి కనుసన్నల బానిస అన్నప్పుడు వారికి ఎప్పుడూ నూత్నయౌవనమే కాదా. ఇద్దరూ ఎప్పుడూ కొత్తదంపతులేను. ఆ దాంపత్యంలో పాతబడటం మొగమ్మొత్తడం లాంటివేమీ‌ ఉండవు సుమా. అవన్నీ లౌకికుల గోలలు. ఇది పారలౌకికం.

ఆ వేంకటరాయడు పైడికొండెలపచ్చడం ధరించిన వాడట. ఆయన ధరించిన బంగారు వన్నెల వస్త్రానికి అంచుల్లో అందమైన కుచ్చుల ముడులు ఉన్నాయట.  ధగధగలాడే ఆ బంగారు పంచెను ధరించి శ్రీవారు మరింత కుఱ్ఱదనంతో కనిపిస్తున్నారని అమ్మవారు ముచ్చట పడుతున్నారట.

ఇదంతా గతరాత్రి జరిగిన విశేషంగా మనం భావించాలి. అవన్నీ గుర్తుచెస్తూ అమ్మవారు శ్రీవారితో ఇలా ముచ్చటించారని ఈ‌కీర్తన నేపథ్యంగా మనం అర్థం చెసుకోవాలి.

ఓ క్షీరాబ్దినిలయుడవైన వేంకటేశ్వరుడా నువ్వు ఏడుకొండలపై వెలసి ఇలా సంతోషంగా నాతో‌కలిసి విహరిస్తున్నావు గతరాత్రి ముచ్చటలు ఇవీ అని అమ్మవారు అంటున్నారని అన్నమయ్య సంకీర్తనాన్ని ముగిస్తున్నాడు.

ఈ కీర్తనకు కొంచెం వేదాంతపరమైన వ్యాఖ్యానం ప్రయత్నిద్దాం.

యథాప్రకారం నాయిక అంటే ఇక్కడ జీవుడు. నాయకుడు ఈశ్వరుడు. ఈ జీవేశ్వరుల కలయికయే మోక్షం. దానికే కైవల్యం అని పేరు. ఎందుకంటే కలయిక అనటమే ఇద్దరు ఒకటి కావటం కాబట్టి.

జీవుడికి ఈశ్వరసాన్నిధ్యం కలిగినా తాదాత్మ్యం కలుగకుండా చెసేవి ప్రకృతిసంబంధమైన తత్త్వాలు. అవే ఇక్కడ చెలిమి కత్తెలు అనుకుందాం. లేదా జీవుడికి ఉన్న సంస్కారరూపబంధాలనే ఆ చెలిమికత్తెలు అనుకోవచ్చును. ఏవిధంగా అనుకున్నా తాత్పర్యం‌ ఒక్కటే జీవేశ్వరులమధ్యన బహురూపియైన ప్రకృతి బంధాలుగా పరిణమించి ఉంటుంది. ఈశ్వర సాన్నిధ్యం అన్నది సిధ్ధించినట్లే ఉన్నా అది ఈశ్వరుడికి తనకూ‌ మధ్య అడ్డుగా ఉండనే ఉంటుంది. దానిని కూడా విసర్జిస్తేనే ఆ కైవల్యప్రాప్తి అనేది.

జీవుడికి ఈశ్వరుడిలో ఐక్యం కావాలన్న కోరిక ఎంత బలీయమైనదో ఈశ్వరుడికి జీవుడు ప్రకృతిని తరించి తనను చేరుకోవాలన్న అనుగ్రహదృష్టి కూడా అంతకన్నా బలమైనది. ఈశ్వరుడి కోరిక అనకూడదు. ఈశ్వరుడికి కోరికలు ఏమీ‌ ఉండవు. అలా చెప్పటం అశాస్త్రీయం. జీవుడు బంధవిముక్తికోసం చేసే యత్నంలో ఆయన అనుగ్రహం అంతకు పదింతలుగా ఉంటుందని చెప్పటమే జరుగుతున్నది. జీవుడిని ఈశ్వరుడు  బంధాలు వదిలించుకో అని పదేపదే హెచ్చరించి చెప్పటం అన్నమాటనే ఇక్కడ నాయికను నాయకుడు నఖక్షతాలరూపంలో హెచ్చరించటం‌గా సూచించటం జరిగింది.

ఈశ్వరుడుతో జీవుడు తాదాత్మ్యం చెందటంతో అన్ని బంధాలకు చెల్లు చీటీ ఇవ్వటం  జరిగిందన్నదానికి సూచనగా ఇక్కడ నాయిక యొక్క అందమైన కొప్పుజారిపోవటం.  కొప్పు పరంగా నాయకుడిది శృంగారచేష్ట ఐతే ఈశ్వరుడు జీవుడి బంధాలను స్వయంగా తొలగించాడన్నది ఇక్కడ వేదాంతపరమైన సమన్వయం. జీవుడు ప్రయత్నం మాత్రం చేయగలడు. కాని అంతిమంగా జీవుడి బంధాలు తొలగేది ఈశ్వరానుగ్రహం వలననే సుమా అన్నది సూచితం.

ఈశ్వరుడు జీవుడి ఉన్నతి కోసం క్లేశం పొందటాన్ని ఆనందంగా చేయటమే ఇక్కడ నాయకుడు నాయికప్రియం కోసం‌ చెమటలు పట్టేలా శృంగారం నెఱపటం అని అర్థం చేసుకోవాలి. భక్తాధీనుడైన దేవుడు జీవుడికోసం ఇదంతా చిరునవ్వుతోనే జరిపించుతాడు.  అక్కడ క్లేశం అంతా లీలామాత్రం. ఈశ్వరుడికి నిజంగా క్రియలూ‌ శ్రమలూ ఏమీ‌ఉండవు కదా.

నిజానికి బ్రహ్మసత్యం జగం‌మిథ్య అంటుంది వేదాంతం. కాని లోకం వ్యావహారిక సత్యం అని ఒప్పుకోకపోతే బండి నడవదు.అలా అనుకున్నప్పుడు జీవుడు నిత్యత్వం‌ కలవాడే, ఈశ్వరుడూ‌ నిత్యత్వం కలవాడే అనా అంటే కాదు. ఈశ్వరుడే నిత్యం. జీవుడి ఉనికి ఒక ప్రతిబింబం లాంటిది. అది కనిపిస్తున్నంత వరకే సత్యం అన్నమాట. నిజానికి బింబప్రతిబింబాలెట్లాగో ఈశ్వర జీవులు అట్లాంటి వారు.

ప్రకృతిలో ఉన్న జీవుడు తాను తనకొక ఉనికి ఉన్నదను కుంటాడు. ఆ తాను అనేదే మొదటి బంధం. అది మిగిలిన బంధాలను కలిగిస్తుంది. అవన్నీ వదల్చుకోవటానికి ఈశ్వరానుగ్రహం కారణం. యోగసిద్ధులైనా ఈశ్వరానుగ్రహంతో ప్రకృతి బంధాలు వదల్చుకొని అపిదపనే ఈశ్వరుడితో కలుస్తున్నారు.

ఆవరణ రహితుడైన ఈశ్వరుడికి ప్రసస్తమైన ఆవరణం (అంటే వస్త్రం)గా భాసించేది ప్రకృతి. అది ఆయన సంకల్పం చేత నిత్యం. ఆయన ఎలాగూ నిత్యనూతనుడు. ఆ ప్రకృతిని దాటి ఈశ్వరుడిని కలిసిన జీవుడికి ఆ ఆవరణంతో శోభించే ఈశ్వరుడు మరింత సొగసుగా అనిపిస్తున్నాడట. ప్రకృతిమాయను దాటితే ఆ ప్రకృతి జీవుడిని భయపెట్టేదీ‌ బాధపెట్టేదీ‌ ఏమీ ఉండదు. ఈశ్వరుడితో దాని చేరికలోనూ అందమే కనిపిస్తుంది.

ఇలా నిగూఢంగా ఈ సంకీర్తనంలో జీవేశ్వరుల ఐక్యతకు సంబంధించిన సంగతి ప్రాతిపదికగా కనిపిస్తుంది.


ఇదియే మేలని నీవంటే నాకదియే చాలని నేనంటాఇదియే మేలని నీవంటే నా
కదియే చాలని నేనంటా

వదలక తెలతెలవారున దాదిగ
సదమలతారకసన్మంత్రమునే
మదిలో దలచుచు మరిమరి మురియుచు
సదయా చక్కగ శాంతుడ నైతిని
ఇదియే

భవసాగరమున పడి యీదుచు నే
నవలంబించిన దగు నీ నామము
భవతారకమగు భవ్యనౌక యని
నవలియొడ్డు కననగు నని తలచితి
ఇదియే

కోరికలన్నిటి కూల్చి నిలచి సం
సారమోహమును చక్క నదిమితిని
శ్రీరామా నిను చేరి నమ్మితిని
తారకనామము దాల్చి నిలచితిని
ఇదియే


10, సెప్టెంబర్ 2016, శనివారం

వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి (అన్నమయ్య సంకీర్తనం. సవ్యాఖ్యానం)ఎన్నిపోలికలకు నీ విరవైతివి
వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి

పొలఁతులు నీవుఁ గూడి పువ్వుల వసంతమాడి
లలి సింగారపుఁ దోటవలె నుంటివి
బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి
తొలుకరికాలమువలె నుంటివి
ఎన్ని

కడలేని వేదుకతో‌ కప్పురవసంతమాడి
వడిఁ జుక్కలలో చంద్రునివలె నుంటివి
జడిగొని కుంకుమవసంతములు సారెనాడి
గిడిగొని మాణిక్యాల కొండవలె నుంటివి
ఎన్ని

తిరముగ నీవు ముత్తెములవసంతమాడి
వరుసఁ‌ బాలజలధివలె నుంటివి
నిరతి శ్రీవేంకటేశ నీవు నలమేల్మంగయు
సురతవసంతమాడి సోనవలె నుంటివి
ఎన్ని


(దేవగాంధారి రాగంలో 1665వ రేకులోని అన్నమాచార్యసంకీర్తనం)

వ్యాఖ్య:

అన్నమయ్య తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుని వివిధకోణాల్లో తనివితీరా అభివర్ణిస్తూ ఉంటాడు.

అలా స్వామిని అనుక్షణమూ వివిధభంగులుగా భావించటంలో ఉన్న ఆనందం కేవలం‌ మహాభక్తులైన వారికే అనుభవైక వేద్యం. మనబోటి సామాన్యులం అంత ప్రగాఢమైన అనుభూతిలో శతాంశమైనా ఆయన సంకీర్తనలను చదివీ వినీ వాటిని మనసా ధ్యానించీ స్వంతం చేసుకోగలగటం ఒక అదృష్టం అనే చెప్పాలి.

ఈ పరమమనోహరమైన శృంగారసంకీర్తనంలో ఆన్నమాచార్యులవారు తనకు శ్రీవేంకటేశ్వరుడు వన్నెవన్నెల పెండ్లికొడుకులాగా కనిపిస్తున్నాడని ఇలా వర్ణిస్తున్నారు.

ఓ శ్రీనివాసుడా ఎన్ని ఎన్ని రకాల పోలికలకు నువ్వు తావుగా ఉన్నావయ్యా - వన్నెల పెండ్లికొడుకులాగా అంటూన్నారు
నువ్వూ నీ‌ దేవేరులూ కలిసి పువ్వులతో వసంతం ఆడుకున్నారు కదా. ఎక్కడ చూసినా పువ్వులే. మీ ఒళ్ళ నిండా పువ్వులే. తోటనిండా పువ్వులే. అన్ని లతా గుల్మాలనే కాదు నేలంతా కూడా పువ్వులమయం చేసేసారు కదా. నీ‌ఒంటి నిండా రంగురంగుల పూలతో నువ్వే ఒక పూలతోటలాగా ఉన్నావే! అచ్చం ఒక శృంగారవనం అని నిన్నే అనాలి సుమా బాగుంది బాగుంది.

అని అన్నమయ్య తన దేవదేవుణ్ణి ప్రశంసిస్తూ ఉండగానే ఆయన తన దేవేరులతో‌ కలిసి పన్నీటికొలనులో జలకాలాడటం‌ మొదలు పెట్టాడు. ఇంతసేపూ మరి ఆయన పూవులతోటలో వసంతాలాడుతో కలయదిరిగి అలసిపోయడు కదా. అలసట తీరటానికి అన్నమాట ఈ‌జలక్రీడ. పాపం ఆయన ఎంత అలసిపోయాడో పూవులు జల్లుతూ‌జల్లించుకొంటూ పూలవనం అంతా తిరుగుతూ - అందుచేత చాలా సేపు జలకం ఆడిమరీ బడలిక తీర్చుకున్నాడుతున్నాదు. ఇలా జలక్రీడా వసంతోత్సవం ఆడుతున్న ఓ శ్రీవేంకటేశ్వరుడా నీవే ఒక వర్షాకాలం అనే దైవతం లాగా ఉన్నావయ్యా అంటూన్నాడు అన్నమయ్య.

జలక్రీడలయ్యాయండీ. దేవుడూ దేవేరులూ అందరూ ఆహ్లాదం‌ కొఱకు కర్పూరం తమ ఒడళ్ళకు అలదుకున్నారు. ఇంకేముంది అందరూ తెల్లగా ధగధగలాడుతూ‌ ఉన్నారు. అన్నమయ్య కండ్లకు ఆ దేవేరులంతా నక్షత్రాలుగా కనిపిస్తున్నారు. అందరూ తమతమ ఒడళ్ళకు కర్పూరం అలదుకుంటే అందరూ ఒకే మాదిరి ధావళ్యం‌ కలిగిఉండాలి కదా. అవునంతే ఆ దేవేరులంతా అలాగే ఇంచుమించు సమధావళ్యంతో ఉన్నారు. కాని వాళ్ళంతా పోటీలుపడి మరీ వారిప్రియపతి ఒళ్ళంతా దట్టంగా కర్పూరం అద్దేశారు. దానితో ఆయన ధావళ్యం ఇంతింత అనరానట్లుగా ఉంది. అందుచేత చుక్కల మధ్య చంద్రుడికి మరింత ప్రకాశం ఉన్నట్లుగా అయన ధావళ్యం అందరి ధావళ్యాలనూ అతిక్రమించి ఉంది. ఈ కర్పూరవసంతోత్సవంతో, ఓ శ్రీవేంకటేశ్వరా నీవు ఈ మెరుపుచుక్కల దేవేరుల మధ్యన సాక్షాత్తూ చుక్కలమధ్య చంద్రుడిలాగా ఉన్నావయ్యా అని అన్నమయ్య ఆనందంగా ప్రశంసిస్తున్నాడు.

అందరూ ఇలా స్నానానంతరం మైపూతగా కర్పూరం అలదుకొని శ్రీవేంకటేశ్వరుడైతే ఇబ్బదిముబ్బడిగా కర్పూరం అలదించుకొని సేదతీరారు.

దేవేరు లందరూ సింగారించుకొన్నారు. శుభ్రవస్తాలు ధరించారు. అందరూ పాపట కుంకుమ ధరించారు. పనిలో పనిగా శ్రీవేంకటేశ్వరునికీ కుంకుమదిద్దారు. మళ్ళీ వాళ్ళల్లో స్వామివారిసేవ విషయంలో పోటీలు పడటం ఒకటుంది కదా. పొలోమని ఎగబడి ఆయన్ను కుంకుమతో ముంచెత్తేశారు. శ్రీవేంకటేశ్వరుడు ఈ‌కుంకుమవసంతోత్సవం కారణంగా ఒక మాణిక్యాల కొండలాగా బహుసొగసుగా ఉన్నాడని అన్నమయ్య ఆంటున్నాడు.

ఇంక తరువాతి కార్యక్రమం అలంకరణలు చేసుకోవటం‌ ఒకటుంది కదా. అందరూ ముత్యాలసరాలు ధరించారు. మళ్ళా పోటీలుపడి మరీ పతిదేవుడి ఒంటినిండా తమ ముచ్చటతీరా ముత్యాలగొలుసులూ ముత్యాలదండలూ అంగుళం ఎడంలేకుండా ముంచెత్తేసారు. తెల్లని బట్టలు - అవును ఆయన త్రైలోక్యచక్రవర్తికదా - అందుకని చక్రవర్తికి ఉచితంగా తెల్లని వస్త్రాలు, ముత్యాల తలపాగా, ఒంటినిండా ముత్యాలతో పెండ్లికొడుకులాగా అలంకరణలు. ఇలా ముత్యాల వసంతోత్సవంతో అన్నమయ్య కంటికి శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్తూ పాలసముద్రంలాగా కనిపిస్తున్నాడట.

సాయంకాలపు వనవిహారం పూర్తయింది. శ్రీవేంకటేశ్వరుడు అలమేలుమంగమ్మ అంతఃపురానికి విచ్చేసాడు. ఇంకేముంది తెల్లవార్లూ ఒకటే కోలాహలం చేసారు. అలసి చెమటలు కారుతున్న స్వామి శ్రీవేంకటేశ్వరుడి అవతారం అన్నమయ్య కండ్లకు అది ఒక అందమైన వర్షం అనే వసంతోత్సవంలా కనిపించింది.

ఇలా శ్రీవేంకటేశ్వరుడు ఆడిన వసంతోత్సవంలో ఆయన రంగురంగుల్లో దర్శనం ఇచ్చి భక్తుడిని ఆనందపరవశుణ్ణి చేసాడు.

ఇప్పుడు ఈ‌ శృంగారసంకీర్తనం యొక్క వేదాంతపరమైన ఆర్థాన్ని ఆకలింపు చేసుకుందాం.

ఈ సంకీర్తనంలో శ్రీవేంకటేశ్వరుడు ఎప్పటిలాగే‌ కేంద్రస్థానంలో ఉన్నాడు. ఆయనకు దేవేరులుగా ఉపచారాలు చేసిన సతులు జీవకోటి అనే భావించాలి. వారితో ఆయన పుష్పవసంతం ఆడటం వారి పూజలను స్వీకరించటం. పూవుల్లో వివిధవర్ణాలుంటాయి. అలాగే పూజలు వివిధాలు. కొందరి పూజ శ్రుతివిహితమైన మంత్రాలతో ఉంటుంది. కొందరి పూజ కల్పోక్తవిధానంలో శ్లోకాదుల రూపంలో ఉంటుంది. కొందరు మానసికపూజాదురంధరులు - బాహిరమైన పూజాకలాపాదుల అవసరం దాటిన వారు. కొందరు వేదాంతులు వారి పూజ అయన తత్త్వాన్ని చింతించటం అనే విధం. కొందరికైతే ఏవిధమైన పూజావిధానమూ తెలియదు. భక్తిపూర్వకంగా నమస్కరించటమో, ఏదైనా ఆలయంలో తోచినది కానుకచేయటమో చేసి సంతోషిస్తారు. ఏలాంటి విధమైన పూజ ఐనా అయన ఆనందంగా ఒకేలా స్వీకరిస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. బొత్తిగా శ్రుతిబాహ్యమైన పూజనైనా తిన్నని పూజను పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరించలేదా మరి. కుమ్మరి వాడు మట్టిపువులను మాత్రం అర్పించగలిగితే శ్రీవేంకటేశ్వరుడు వాటినే పరమానందంగా స్వీకరించలేదా చెప్పండి. జీవులు దేవుణ్ణి తమకుతోచిన విధంగా తమశక్తి మేరకు సంతోషపెడతారు. అది ముఖ్యం. నావాడు అని భావించి ఎవరు కోరినా వారికి ఆయన సదా సుముఖుడే అన్నది ఇక్కడ మనం భావించాలి

అలాగే జీవులు భగంతుడికి చేసే పూజలో భాగంగా విలేపనవస్త్రాభరణాదులను సమర్పించటమే ఇక్కడ దేవేరులు పోటీలు పడి మరీ స్వామికి తమ సేవను అందించంటం అన్నది భావించాలి. ఆయన ఎవరిసేవనూ వద్దనడు. ఏసేవనూ వద్దనడు. నీకిది ఇవ్వాలనుందా - అలాగే కానివ్వు. నీకీ సేవ చేయాలనుందా - ఆలాగే కానివ్వు అనే శ్రీవారు ఎప్పుడూ అనుమతిస్తారు. మన సేవలతో స్వామిని ముంచెత్తటం వలన ఆయనకు ఏమీ ఇబ్బంది ఉందదు. అదంతా ఆయకు ఒక ఉత్సవంగానే ఉంటుంది. భక్తుల సంతోషమే భగవానుడి సంతోషం అన్నది ఆయన సిద్ధాంతం మరి.

సంకీర్తనం ముగింపులో వచ్చే అలమేల్మంగా శ్రీవేంకటేశ్వరుల దివ్యసమాగమం అన్నది ఆత్మనివేదనం అన్నదానికి సూచకం. భక్తజీవుడు ఎంతో ఆర్తితో తన యొక్క అస్తిత్వాన్ని శ్రీనివాసుడికి ధారపోస్తాడు. నిజానికి అత్మనివేదనం అన్నది జీవుడి సంకల్పం ఐనా నామరూపాత్మకమైన ప్రకృతిలో ఉన్న జీవుడిని ఉధ్దరించటానికి భగవంతుడు కొంత కృషి చేయవలసి ఉందన్నది కఠోరవాస్తవం. ఆయన జీవుడిలోని చతుర్వింశతి తత్త్వాలను తనలో ఐక్యం చేసుకున్నప్పుడు కాని జీవుడు కేవలం ఆత్మస్వరూపుడుగా కాడు. జీవుడికి ఈ‌ ఉధ్ధరణ కలిగించటంలో ఆయన ఆనందంగా గ్రహించీన క్లేశాన్నే ఈ సంకీర్తనంలో సురతానంతరం చెమటపట్టటంతో పోల్చటం జరిగింది.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

ఇలా భక్తిలో వివిధమైన మార్గాలు చెబుతుంది భాగవతం. అన్నింటికంటే పరమమైనది ఆత్మనివేదనం. అందుకే దానిని సంకీర్తనం చివరన ప్రస్తావించారు అన్నమార్యులు.

ఈ విధంగా అందరు జీవులను వివిధావస్థల్లో ఉన్నవారిని వివిధంగా తనను సేవించే వారిని చేపడుతూ శ్రీవేంకటేశ్వరుడు నిత్యపెండ్లికొడుకు లాగా ఉన్నాడు.

అలమేల్మంగమ్మకైతే ఆయన ఎప్పుడు కొత్తపెళ్ళికొడుకేను.

హరి ప్రియమనగా నన్యంబనగాహరి ప్రియమనగా నన్యంబనగా
నరయగ వర్తన మిరుభంగులయా

వినయము వెలుగగ పెద్దల సుజనుల
ననయము గొలచుట పనిగా తిరుగుట
తనభోగమునకు ధనసంపాదన
మునకై నిరతము భూమిని తిరుగుట
హరి

హరిచరితములను హరిభక్తుల ఘన
చరితములను విని సంతోషించుట
బిరుదుల పదవుల తరుణుల వెదకుట
సరియగు విధమని సంతోషించుట
హరి

ధీరత మీఱగ శ్రీరఘురాముని
తారకనామము దాల్చియుండుట
మారజనకుని మాటయె తలపక
మారుని మదిలో దాల్చియుండుట
హరి


9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఆతడు పెట్టిన యన్నము కానిది ఆరగింపు కలదె
ఆతడు పెట్టిన యన్నము కానిది ఆరగింపు కలదె
ఆత డొసంగిన శక్తియుక్తుల కన్యమొండు కలదె

ఆతడిచ్చిన తనువిది కాక ఆకృతి యన నేది
ఆతడిచ్చిన ఊపిరి కాక ఆధారం బేది
ఆతడిచ్చిన తలపులె కాక అన్యబుద్ధి యేది
ఆతడిచ్చిన పలుకులె కాక అన్యం బొండేది
ఆతడు

ఆతడు నడిపించు నట్లే అడుగులు కదిలేను
ఆతడు తలపోసి నట్లే అన్నియు నమరేను
ఆతడు సెలవిచ్చు నట్లే అన్నియు జరిగేను
ఆతడు నీవాడనేలే యననటె జరిగేను
ఆతడు

ఆతడు నాదేవదేవుడే యన్నది తెలిసేనే
ఆతడు కరుణాంతరంగుడే యన్నది తెలిసేనే
ఆతడు నా ప్రాణపతియే యన్నది తెలిసేనే
అతడు శ్రీరామచంద్రుడే యన్నది తెలిసేనే
ఆతడు


8, సెప్టెంబర్ 2016, గురువారం

వట్టిమాటలు కాని గట్టిపనులు లేక..పుట్టి సాధించిన పుణ్యమే ముండును
వట్టిమాటలు కాని గట్టిపనులు లేక

వయసున దేవుని వంకకు పోకుండ
వయసుడిగన నాడు భజనలు మొదలిడి
భయమును భక్తియు పడుగుపేకల చేయ
పయనించెడునాడు ఫలమిచ్చేనా
పుట్టి

దినమున కొక్కొక్క దేవుని పూజతో
మనసున నేతత్త్వమును నిలువకయున్న
తనకిది హితమని తానెరుగ లేకున్న
తనబ్రతుకున కొక దారితెన్నును లేక
పుట్టి

లొట్టసిధ్ధాంతాల లోగుట్టు తెలిసేనా
మెట్టవేదాంతాన మేలొండు జరిగేనా
పట్టక శ్రీరామపాదాబ్జములు తన్ను
పట్టిన పెనుమాయ ప్రక్కకు తొలగేనా
పుట్టి


7, సెప్టెంబర్ 2016, బుధవారం

విజ్ఞుడనో కానొ
విజ్ఞుడనో కానొ వివరింపు మీవే
అజ్ఞుడ నను వార లటులుండ

ఈ నేలపై బుట్టి యిన్ని మారులును
మానుగ నీయందు మదినిలిపి
పూని నీవును నన్ను పొలుపుగ నేలగ
నీ నెయ్యమున జేసి నిలచితి గాన
విజ్ఞుడ

భావించెదను నేను పరమాత్ముడవని
నీ వాల్లభ్యపు నిత్యభాగ్యమున
పావన రామ నీపద దాసుడను
నీవాడనై నేడు నిలచితి గాన
విజ్ఞుడ

నాకు దేవుడవీవు నీకు నే దాసుడ
నీకై బ్రతుకుట నా కర్తవ్యము
లోకేశ శ్రీరామ లోకమునందు
నీకన్య మెఱుగక నిలచితి గాన
విజ్ఞుడ


6, సెప్టెంబర్ 2016, మంగళవారం

జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ
మోతగ మాటలు నీవు నేర్పక తైతైబొమ్మ పలెకెడి దేమి
నీతులు రీతులు నీవు నేర్పక తైతైబొమ్మకు తెలిసిన దేమి


వచ్చే దాకా కన్నులు రెండూ విచ్చే దాకా తానెవరో
వచ్చి భూమికి కన్నులు రెండూ విచ్చిన పిదప తానెవరో
వచ్చే టప్పుడు బుధ్ధిగ బ్రతికే ప్రతిన చేసిన తానెవరో
చచ్చి హెచ్చిన గరువముతోడ వదరుచు నెఱుగదు తానెవరో
మోతగ

ఆటలాడుచు స్వయముగ తానే అంతా నేర్చితినని పలికే
మాటలాడుచు మరి వాగ్విభవం‌ బంతా తనదే నని పలికే
చీటికిమాటికి తన తలపండున చెలగును తెలివిడి యని పలికే
ఓటికుండకు మోత యెక్కుడన నోటిదురరతో కడు పలికే
మోతగ

తనయునికికి కారణమగు నిన్నే తలచకున్నది ఈ‌బొమ్మ
తనమనికికి నీదయ కారణమని తలచకున్నది ఈబొమ్మ
మనవిచేసెదను మాయచేత నిను మరచియున్నదిర ఈ బొమ్మ
జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ
మోతగ


5, సెప్టెంబర్ 2016, సోమవారం

సింగారరసము లోన ... (అన్నమయ్య) సవ్యాఖ్యానంసింగారరసములోనఁ జీకాకులేలే
అంగన నీవే నేను అనుమానమేలే

మాణికాలపెట్టె వంటి మగువ నీనోర నన్ను
జాణ నిష్టూరా లిన్నేసి చల్లఁదగదే
ఆణిముత్యాల చిప్పలయంతలు గన్నుల నన్ను
రాణించు వేఁడిచూపుల రమణి చూడకువే
సింగార

చల్లనిచందురువంటి సతి నీమోమున నన్ను
చల్లు వెడబొమ్మలను జంకించనేలే
యెల్లగాఁ జిగురువంటి నివిగో నీ కరములు
వెల్లవిరిగాఁ బట్టితే విదిలించనేలే
సింగార

బంగారువోవరివంటిపడఁతి నీ కాఁగిటిలో
చెంగలింపు సిగ్గులనే చీఁకటు లేలే
రంగగు శ్రీవేంకటాద్రిరాయఁడ గూడితి నిన్ను
ముంగురుల నీలాలముసుఁ గింకనేలే
సింగరా


(హిందోళవసంత రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1624వ రేకు)

వ్యాఖ్య:
ఈ సంకీర్తనంలో ప్రతిచరణమూ ఒక చిత్రమైన సమాసం ప్రయోగించటంతో మొదలౌతుంది. సమాససంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఉంటుందీ సంకీర్తనలో.  మాణికాలపెట్టె వంటి మగువ నీనోర అన్న చోట మాణికాలపెట్టె వంటిది నోరు. అలాగే చల్లనిచందురువంటి సతి నీమోమున అన్నచోటనూ బంగారువోవరివంటిపడఁతి నీ కాఁగిటిలో చోట కూడా అంతే కదా. చల్లనిచందురువంటిమోము అన్నది మధ్యలో ఖండితమై పడతీ నీ అన్న మాటలు ఇరికించారు ఆచార్యులు. బంగారువోవరివంటికాఁగిటిలో అన్నది సమాసం. ఇక్కడ సాహిత్యపరంగా యతి అన్నది తప్పని సరి కావటంగా నియమం ఉంది కాబట్టి అలాంటి చమత్కారమైన ప్రయోగాలు.

ఇది అద్వైత సిద్ధాంతప్రతిపాదకమైన ఒక చక్కని శృంగారసంకీర్తనం.

మొదటగా మనం ఈ సంకీర్తనానికి నాయికీనాయకులమధ్యన నడిచే ప్రణయకలహం పరంగా అర్థవిశేషం చెప్పుకుందాం.

దక్షిణనాయకుడైన పతిపైన నాయిక అలిగి ఉంది. యథాప్రకారం నాయకుడు వచ్చి సతీవియోగం భరించలేక బ్రతిమలాడుకుంటూన్నాడు.

నాయిక నోరు మాణిక్యాలపెట్టె అట. మాణిక్యం ఎఱ్ఱగా ఉంటుంది. మాణిక్యాలతో నింపిన పెట్టె తెరువగానే ఆ ఎఱ్ఱదనం కళ్ళుజిగేల్మనేలాగా ఉంటుంది. తాంబూలచర్వణం శృంగారోద్దీపనం అని పెద్దలభావన. అందుకే పూర్వం విద్యార్థిదశలో ఉండిన వారికి తాంబూలం నిషిధ్ధవస్తువుగా ఉండేది. గృహస్థులకు మాత్రమే తాంబూలసేవనాధికారం ఉండేది. నాయిక నిత్యతాంబూలసేవనాతత్పర అని ఇక్కడ ఒక సూచనామాత్రంగా సంకీర్తనాచార్యులు సెలవిస్తున్నారు. తాంబూల సేవనంతో అమె నోరంతా ఎరుపుదనంతో నిండి ఉంటుంది. మరి తాంబూలం సేవించేదే తనకు పతియెడల శృంగారభావోద్దీపనానికీ ఆయనకు తనయెడల అనురాగాధిక్యతకూ అన్నప్పుడు అలా తాంబూలం యొక్క అరుణిమతో నిండిన నోట శృంగారోద్దీపనకరమైన శుభవాక్యపరంపర రావాలి కానీ ఆవిడ నోట నిష్టూరపు మాటలు రావటం విడ్డూరంగా ఉండదా? పైగా ఏదో ఒక పరిహాసానికి అన్నమాటో పోనీ ఒక పుల్లవిరుపు మాటో అని కాదుట. అనేకంగా నిష్టూరాలు. అన్యాయం‌ కదా అని నాయకుడి ఘోష.

పెద్దపెద్ద కన్నులు అన్నవి మనదేశంలో అందంగా భావిస్తాం. చిన్నచిన్నకళ్ళే అందం అనుకొనే దేశాలూ ఉన్నాయట. మనకు పెద్దకళ్ళ అమ్మాయిలే అందకత్తెలు. అందులోనూ నాయిక కళ్ళున్నాయే - అవి ఆణిముత్యాల చిప్పలట. అంటే పెద్దవి సౌష్టవంగా ఉన్నవీ ప్రశస్తమైన ముత్యాలకు నిలయంగా ఉండేవీ‌ ఐన ముత్తెపు చిప్పలు ఆ కళ్ళు. నాయిక తన పెద్దపెద్ద కన్నులతో ఓరచూపులతో నాయకుణ్ణి పరవశుణ్ణి చేయటం శృంగారోద్దీపనాల్లో ఒకటి. ఓరచూపు కోరచూపు ఒకటనుకోకోయ్ అని ఒక సినిమా పాటలో వస్తుంది. అలాగ అంత పెద్దకళ్ళతో అందమైన ఓరచూపుకు బదులు కోపోద్రేకంతో నాయిక కోరచూపులు విసిరితే? నాయకుడు ఆ చూపుల వేడిమికి తట్టుకోగలడా చెప్పండి? పైగా ఆ చూపులు రాణిస్తూ ఉండటం అంటే వాటి వేడిమికి ఆ కళ్ళబడ్డ ఏవస్తువూ తట్టుకోలేక పోతోందట - అంటే ఆమె కోపంతో కంటబడ్డ వాటిని దహించేలా చూస్తోందో, ధ్వంసమే చేస్తోందో! ఎదటబడటానికి నాయకుడికి గుండెధైర్యం చాలటం లేదన్నమాట. ఆమె తనకు తెలిసి రమణి కదా? అంటే ఆమె భావాలూ చేష్టలూ మనస్సును రంజింపచేసేలా ఉండాలి కదా, మరి ఇదేమి ఉపద్రవం! అదీ ఆయన గోల.

నాయిక ముఖం చల్లని చంద్రుడట. చంద్రుడికి హిమకరుడు అని కూడా పేరుంది కదా. ఎంత చంద్రుడైనా నిత్యశీతలత్వం కష్టం. అయనకు వృద్ధిక్షయాలున్నాయి మరి. నిండుచంద్రుడు మాత్రమే నిజంగా చల్లని వెన్నెల కురిసే వాడు. కాబట్టి నాయకుడిదృష్టిలో నాయిక ముఖం చల్లని నిండుచంద్రుడి వంటిది. చంద్రుడిలాగా ఆహ్లాదం కలిగించేది కదా ప్రియసఖి నెమ్మోము. కాని ఇప్పుడు పరిస్థితి అలాగు లేదు. అవిడ కనుబొమలు అనిష్టాన్ని సూచిస్తూ నాయకుణ్ణి తిరస్కరిస్తున్నాయి. ముఖం చిట్లించుకుంటున్నది అమె. అందుచేత పెడపెడగా అవుతున్నాయి ఆమె కనుబొమలు. అది చూసి నాయకుడికి జంకు కలుగుతోంది. బడాయి కాకపోతే తప్పులేని వాడికి జంకెందుకు చెప్పండి. నన్నలా నీ కనుబొమలు పెడగాపెట్టి జడిపించకు అని దీనంగా బ్రతిమాలుకుంటున్నాడు.

నాయిక కరములు అంచే చేతులు చిగురు రెమ్మలవంటివి అట. అంటే ఆమె లేలేత వయసుకత్తె అని చెప్పటం. నాయకులు అలా భావించటమూ చెప్పటమూ అన్నది సరసంలో భాగం. కొంచెం ముసలిదానివై పోతున్నట్లున్నావు అని ఎవడైనా సతితో అని బ్రతక్కలడా? అందులోనూ అభిముఖుడైన నాయకుడికి నాయిక యొక్క తనులాలిత్యం నిత్యభావనాగోచరంగా ఉంటుంది కదా. ఐనా దేవతలకు త్రిదశులు అని పేరు. అంటే వారికి ముఫై ఏళ్ళ వయసే ఎల్లప్పుడూ. వారి నాయికలు కొంచెం చిన్నగా పాతికలోపే ఉంటారు కదా అందుచేత వారి తనువులు నిత్యలలితాలు. ఆయన నాయికను బ్రతిమలాడుకోవటంలో భాగంగా అమె చెతులు పట్టుకొని అనునయించటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కాని అమె కోపోద్రేకంతో ఉన్నది కదా - ఆయన చేతుల్ని విదిలించి కొడుతున్నది. ఎలా విదిలిస్తోం దనుకున్నారు? వెల్లవిరిగా - అంటే ఎలాపడితే అలా, అన్నివైపులకున్నూ. ఇక్కడ కొంచెం సారస్యం తెలుసుకోవాలి మనం. ఆవిడ తన నాయకుడి ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది. చేతుల్ని పట్టుకోనీయకుండా అటూ ఇటూ శరీరాన్ని త్రిప్పుతోంది. ఆయనేవో తిప్పలు పడుతున్నాడు. ఎలాగో అలా ఆమె లేలేత చేతుల్ని దొరికించుకుని అనునయంగా ఏదో చెబుతున్నాడు. అవిడ తనపతి చేతుల్ని విదిలిస్తోంది అంతే తీవ్రంగా ప్రయత్నిస్తూ. ఈ వ్యవహారంలో వాళ్ళిద్దరూ అన్ని వైపులకూ తిరుగుతున్నారు. ఆ చేతుల్ని విదిలించటం అన్నిదిక్కులా అమె చేస్తోంది. ఏదిక్కునా ఆయనకు లొంగటం లేదు. అదీ సంగతి.

ఓవరి అంటే అంతఃపురం. బంగారం శ్రేష్ఠత్వానికి చిహ్నం. ప్రియసఖి కౌగిలి బంగారం లాంటి అంతఃపురం అట. అంతఃపురం అంటే అక్కడ తానూ తనవారూ తప్ప మరెవరూ ఉండరు. ఇద్దరి మధ్యా ఏ అరమరికలూ లేని చనువు ఉండే ఏకాంతస్థలం. బ్రతిమలాడగా బ్రతిమలాడగా ప్రియసఖి సుప్రసన్న ఐనది. ఆనందంగా అమె పతికౌగిట చేరినది. కాని అంతలోనే అమె కడులజ్జను పొందింది. తాను పతిని అన్న మాటలకూ ఆయనపై చూపిన చేష్టలకూ ఎంతో సిగ్గుపడుతూ ఉంది. తలచుకొన్న కొద్దీ ఆ సిగ్గు అతిశయిస్తోందే కాని తగ్గటమే లేదే. అన్నమాటలన్నీ తలచుకొని ముడుచుకుంటున్నది. చేసిన చేష్టలను తలచుకొని తలచుకొని ఆయనకు ఎంత కష్టం కలిగించానో కదా అని తల్లడిల్లుతూ ఉంది. అమె అలా బిడియపడుతూ ఉండటం గమనించి నాయకుడు అమెను ఓదారుస్తున్నాడు. ఎందుకే అంతగా సిగ్గులు నీకు? ఆ సిగ్గులన్నీ మనిద్దరి మధ్యా చీకటి తెరల్లాగా అడ్డం వచ్చేస్తే ఎలా? నేనేమీ అనుకోవటం లేదులే అలా సిగ్గుపడక్కర్లేదు ఇలా చూడు అని అడుగుతున్నాడు.

చూడు నేను నీకెంతో ఇష్టమైన ప్రాణసమానుడనైన వేంకటేశ్వరుణ్ణి కదా. నేను నీతోనే ఉన్నాను కదా ? నీ కౌగిట్లోనే ఉన్నాను కదా? ఎప్పటిలాగే నిన్ను కలిసే ఉంటాను కదా? అలాగే ఉన్నాను చూడు. ఇందాకటినుండి నువ్వు అపార్థం చేసుకొని అలిగి కూర్చుని ఉన్నావు. నీ ముంగురులన్నీ నీ విరహతాపానికి చెదరి ఉన్నాయి. అవన్నీ నీ ముఖమండలాన్ని ఒక నల్లముసుగు కప్పినట్లు కప్పేస్తున్నాయి. ఇప్పుడు అలకతీరింది కదా? ఇంకా ఆ ముంగురులు చెదరి ఉండటం ఏమీ ఉచితంగా లేదు అంటున్నాడు. అయన తన మునివ్రేళ్ళతో సఖి ముంగురుల్ని సరిచేస్తున్నాడని ఇక్కడ కవి సూచనామాత్రంగా చెబుతున్నాడు.

ఇలా ఆలుమగలైన అలమేలుమంగా వేంకటేశ్వరస్వాముల మధ్య జరిగిన ప్రణయకలహం తీరును ఈ దివ్యసంకీర్తనం వివరిస్తోంది.

ఇంక వేదాంతపరంగా ఈ‌ శృంగారసంకీర్తనం యొక్క పరమార్థం ఏమిటో చేతనైనంతగా వివరించటానికి ప్రయత్నిస్తాను.

సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. తక్కిన జీవులందరూ స్త్రీలు. ఇది సనాతనధర్మంలో ఒక అనూచానమైన అందమైన భావన. ఈ భావనను ఆశ్రయించుకొని అనేకమంది భక్తులు భగవంతుడిని నుతిస్తూ అనేక శృంగారపరమైన కీర్తనలను వెలయించారు. వీటిలో పైకి కనబడేది లౌకికమైన శృంగార భావన. కాని పరమార్థమూ భక్తి తత్త్వమూ ఆ కృతిలో అంతర్లీనంగా ఉంటుంది. లౌకికార్థం తీసుకొని అక్షేపించటం పామరత్వం. అంతరార్థంతో సహా గ్రహించగలగటం భాగవత లక్షణం. అలా గ్రహించగల స్థితికూడా భగవత్కృపవలననే సాధ్యమేమో.

ఇక్కడ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడే పరమపురుషుడు. భక్తుడు స్త్రీ తత్త్వంతో ఆరాధించే జీవుడు.

నారదభక్తిసూత్రాల్లో భక్తి తత్త్వాన్ని వివరిస్తూ సాత్ అస్మిన్ పరమ ప్రేమరూపా అని ఒక సూత్రం ఉంది. జీవుడికి పరమాత్మపై ఉండే భక్తి పరమప్రేమ. అది ఒక్క క్షణం ఎడబాటును కూడా తట్టుకోలేదు.

కొద్దిసేపు ప్రియుడు దూరమైతే ప్రియురాలి మనస్సు పరిపరివిధాల ఎలా పోతుందో మనకు తెలుసు. అత్యంతమైన తహతహతో ఆమె తన పతి మరొక స్త్రీ యందు ఆసక్తి కలిగి తనను నిర్లక్ష్యం చేసాడా అని కూడా భయపడుతుంది.

అలాగే భగవంతుడు తనకు నిత్యసుముఖుడు అని పరమప్రేమతో ఆరాధించే భక్తియుక్తజీవుడు కూడా కించిత్తుగానైనా సరే భగవంతుడితో విరహం కలిగినట్లు భావించినా సరే, ఆయన తనయందు విముఖుడయ్యాడా అని పరిపరివిధాల ఆలోచిస్తాడు.

అత్యంతమైన ఆత్మీయత కల ఆ జీవుడు భగవంతునిపై అలుగుతాడు కూడా. అది మనబోటి సామాన్యులకు వింతగా అనిపించ వచ్చును. ఆని ఆ దివ్యమైన ఆత్మీయత కల భగవంతుడికి-భక్తుడికి మధ్య అది సహజం. చాలా సహజం.

భగవానుడిని మనం ఎంత ఆత్మీయుడిగా కొలుస్తామో మననూ భగవానుడు అంతే అత్మీయుడిగా భావిస్తాడు. అవసరం ఐతే ఆ భక్తుడి విరహాన్ని పోగొట్టేందుకు తహతహ లాడుతాడు తాను కూడా.

భక్తుడు నిష్టూరాలు పలుకుతాడు. ఏమయ్యా నువ్వు దర్శనం ఇవ్వటం లేదు. కలల్లోకూడా కరువైపోయావు. అంటూ కోప్పడతాడు. నామీద నీకు ప్రేమ ఉందను కున్నానే - నువ్వు నన్ను వదిలి తిరుగుతున్నావే అని గొడవపడతాడు. నిత్యం భగవన్నామం అనేది సేవించే నోట నిష్టూరాలు తప్ప మరేమీ రావటం మానేస్తాయి. భగవంతుడు ఆయనకు నిదర్శనాలు చూపుతున్నా ఆయన వాటిని చిలిపి చేష్టలుగా కొట్టివేసి ఇల్లాంటి ఆటలు కావు ఏదీ రావేం అని అలిగి కూర్చుంటాడు. భగవత్కథలను చదువుతూ ఉంటాడు కాని మాటిమాటికీ భక్త్యావేశంలోని విరహం వలన కన్నులు మూస్తూ తెరుస్తూ ఆయనెందుకు వస్తాడూ అని కనుబొమలు చిట్లిస్తూ ఉంటాడు. అయన్నే తలుస్తూ తాదాత్మ్యంతో ఉండే ఆభక్తుడి విరహార్తి కారణం దేహస్పృహ సరిగా ఉండక ఆయన దేవుడికి నిత్యం చేసే ఉపచారాలన్నీ చెల్లా చేదరుగా నడుస్తూ ఉంటాయి. మాటవరసకు దేవుడికి పుష్పార్చన చేస్తుంటే అవి ఎక్కడెక్కడో పడుతుంటాయి కాని ఆయన వేదనలో ఉండి గమనించేస్థితిలో ఉండడు. ప్రేయసి భర్తకు నిత్యం ఉపచారాలు చేసే చేతులతోనే ఆయన్ను త్రోసివేస్తూ కూడా తన ప్రణయకోపంలో అపచారం అని గుర్తించే స్థితిలో ఉండనట్లే ఇది కూడా.

ఇలా ఉండే భక్తుడికి భగవంతుడు క్రమంగా స్వాంతన కలిగిస్తాడు. ఆ భక్తుడి మనస్సును రంజింపచేసే నిదర్శనాలతో ఆతడిని తిరిగి తనవాడిగాచేసుకుంటాడు. భక్తుడు కూడా అలకతీరి సంతోషం పొందుతాడు భగవంతుడు తనవాడే అని సంబరపడుతూ. అంతలోనే తన వలన భగవంతుడికి మహాపచారం జరిగిందని గుర్తెరికి తీవ్రమైన వేదనకు లోనైపోతాడు.

భగవంతుడు మరలా నేను నీ వాడనే కాని పరాయి వాడనా? అలా కించపడవద్దు అని అనునయిస్తాడు. నీముఖంలో విషాదం నాకు సమ్మతం కాదని హెచ్చరించి అది తన ప్రేమపూర్వకమైన చేష్టలతో తొలగించి భక్తజీవుడికి పరమానందం కలిగిస్తాడు.

ఎలా చెబుతే కోపించిన ప్రియురాలు అలక తీరుతున్నది. నీవే నేను నీవే నేను అని పతి పదేపదే నమ్మబలికిన పిమ్మటనే కదా? ఎలా చెబుతే భక్తుడికి విరహార్తి తీరుతున్నది? నీవే నేను నీవే నేను అని జగత్పతి పదేపదే నమ్మబలికిన పిమ్మటనే!

జీవేశ్వరుడైన దేవుడూ నేనూ ఒకటే అని భక్తుడు ఊరడిల్లుతాడు. తానూ తనపతీ ఒకటే అని విరహార్త ఐన సతి చివరకు ఊరడిల్లినట్లే.  ఎలా చూసినా ఇద్దరూ ఒకటేను సుమా.

జీవుడికీ దేవుడికీ అభేదం అని దేవుడి నోటనే అద్వైతసిధ్ధాంతం వినిపిస్తున్నది ఈ సంకీర్తనంఈమాత్ర మెఱుగనా ఈశ్వరా?
ఈ మాత్ర మెఱుగనా యీశ్వరా
ఈ మాయ నీదేగా యీశ్వరా


నీటిలోన చేప లెట్టు లీశ్వరా
నీటిబయట జగతి నెఱుగు నీశ్వరా
కోటిజన్మములకు నైన నీశ్వరా
సూటిగ తన్నెవ్వ డెఱుగు నీశ్వరా
ఈమాత్ర

ప్రకృతికవల నున్న ని న్నీశ్వరా
ప్రకృతిలోని జీవు లెఱుగ రీశ్వరా
వికృతమైన మాయమ మ్మీశ్వరా
సకృతుగానైన వదల దీశ్వరా
ఈమాత్ర

కొంచెపు జీవులమె కాని యీశ్వరా
యెంచనలవి కాని దయల నీశ్వరా
మంచిగ శ్రీరాముడవై యీశ్వరా
పంచి రక్షించు చుందు వీశ్వరా
ఈమాత్ర


4, సెప్టెంబర్ 2016, ఆదివారం

పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనాపేరుకొన్న యజ్ఞానం బూరకున్న తొలగేనా
ఊరకున్న తొలగునదై యున్న దొక్కకాయమే

ఏమయ్య యజ్ఞానం బెల్లరకు సహజమా
నాముఖాన ప్రొద్దుపొడిచి నన్ను పట్టుకొన్నదా
ఈమాయా జగమునందు సామాన్య మజ్ఞానము
సామాన్యమైతే దాని సాగనంపు టేలాగు
పేరుకొన్న

సాగనంప దలచితేని యోగమార్గ మున్నది
యోగమార్గ మందు నేను సాగిపోవు టేలాగు
రాగద్వేషములు విడచి రాము నాశ్రయించుము
యోగమందు రక్తి కలుగకున్న నూఱకుండుము
పేరుకొన్న

రక్తి లేక కాదు కాని శక్తి చాల దేమో
శక్తియుక్తులన్ని రామచంద్రు డిచ్చు నీకు
భక్తికలిగి రామదాసభావ మందు నిలచెద
యుక్తమైనవిధము రామయోగమందు నిలచుట
పేరుకొన్న


3, సెప్టెంబర్ 2016, శనివారం

ఊరు పేరు లేని వారుఊరూ పేరూ లేని వాడ వొకడవు నీవు
ఊరూ పేరూ లేని వాడ నొకడను నేను

వేల రూపముల నిన్నె వెదకెద నేను
వేల వేషములు నాకు వేసెద వీవు
ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ
వాలాయ మీ ముచ్చట మేలు మేలు
ఊరూ‌ పేరూ

వేల పేర్లు పెట్టెద నేను పేరు లేని నీకు
వేల మార్లు నాకు పేర్లు పెట్టెద వీవు
ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ
వాలాయ మీ ముచ్చట మేలు మేలు
ఊరూ‌ పేరూ

వేల క్షేత్రముల నీదు పెంపుగాంతు నేను
వేల క్షేత్రముల నన్ను పెంపుసేసె దీవు
పోలికల కేమిగాని పురుషోత్తముడవు
ఏలికవు నాకు రామా యిదిగో‌ దాసుడను
ఊరూ‌ పేరూ


2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎవ్వడ తానని తలచేనో
ఎవ్వడ తానని తలచేనో యెవ్వడ వీవని యెంచేనో
రివ్వురివ్వున నివ్వలకవ్వల కివ్విధి తిరుగుట మానకను


గిలగిలలాడుచు తాపత్రయముల కువలయ మంతయు తిరుగుచును
మిలమిలలాడే బొమ్మల వెనుకనె వలపులు జూపుచు తిరుగుచును
తలపున నుంచగ దగు దైవంబును తనలో తలచక తిరుగుచును
కలుగుచు తొలగుచు నిత్యము నాసున కండెవోలె తా తిరుగుచును
ఎవ్వడ

తనభోగమునకె ధరలో సకలము తనరారెడునని తలచుచును
ధనములు గెలచుట మాత్రమె జీవన తాత్పర్యంబని తలచుచును
తనసంతోషమునకు మించినదొక ధర్మము లేదని తలచుచును
తనబ్రతుకునకును మించిన సత్యము ధరలో లేదని తలచుచును
ఎవ్వడ

మోహభూమికాసప్తక మందున మునిగి తేలుచు నిరతమును
దేహి విడువడు పంచమలముల తెలియ నేరడు పరమమును
ఆహా వాడు సుఖేఛ్ఛకు వచ్చుట యన్నది లేదను విషయమును
ఊహించి దయాళో శ్రీరామా యుధ్ధరించ మని యడిగెదను
ఎవ్వడ


1, సెప్టెంబర్ 2016, గురువారం

కడు నిన్ను దూరనోప కానీవయ్యాకడు నిన్ను దూరనోప కానీవయ్యా
కడమలన్నియు బాసెఁ‌ గానీవయ్యా

నీ కితవైతేఁ జాలు నీ నెలఁత లేమన్న
కైకొనేము అందుకేమి కానీవయ్యా
ఆకెకు నీవు వలపు ఆకె నీకు వలవనీ
కాకు సేయకుంటేఁ జాఁలు కానీవయ్యా
నీకును

ఇంటికి వచ్చిన మేలు యేడనుండినా మేలు
కంటిమి నీగుణ మెల్లాఁ గానీవయ్యా
నంటున నిట్టె నవ్వు నవ్వకుంటే యాకెఁ జూపి
కంటకాలాడకు చాలుఁ గానీవయ్యా
నీకును

మూఁగినకోపము దీర మాఁటల బుజ్జగించితి
కఁగినకాఁకలు జారెఁ గానీవయ్యా
పొఁగి నాకు సతమయు పరచిత్తము మానితి
కాఁగిన శ్రీవేంకటేశ కానీవయ్యా
నీకును


(సౌరాష్ట్రంలో అన్నమాచార్య సంకీర్తనం)

నీకు సంతోషము నాకు సంతోషమునీకును నాకును నెయ్యము కలదని
నీకు సంతోషము నాకు సంతోషము

తెలిసీతెలియని దేబె స్నేహమని
తలచవు నన్ను చులకన చేయవు
పిలిచెద నేను ప్రేముడి మీఱగ
పలికెద వీవు పరమాదరమున
నీకును

నీవాడ నైతిని నీకు సంతోషము
నావాడ వైతివి నాకు సంతోషము
నీవేడ నేనేడ నావాడ వటనె
నీ విలాస మిది నిజమగు భాగ్యము
నీకును

వేల భవముల విరిసిన మైత్రి
నీలాగునే సాగ నీయుము రామ
చాలు నిన్నంటియుండు సద్భాగ్యమే
చాలు చాలు నాకు చాలును రామ
నీకును