8, సెప్టెంబర్ 2016, గురువారం

వట్టిమాటలు కాని గట్టిపనులు లేక..పుట్టి సాధించిన పుణ్యమే ముండును
వట్టిమాటలు కాని గట్టిపనులు లేక

వయసున దేవుని వంకకు పోకుండ
వయసుడిగన నాడు భజనలు మొదలిడి
భయమును భక్తియు పడుగుపేకల చేయ
పయనించెడునాడు ఫలమిచ్చేనా
పుట్టి

దినమున కొక్కొక్క దేవుని పూజతో
మనసున నేతత్త్వమును నిలువకయున్న
తనకిది హితమని తానెరుగ లేకున్న
తనబ్రతుకున కొక దారితెన్నును లేక
పుట్టి

లొట్టసిధ్ధాంతాల లోగుట్టు తెలిసేనా
మెట్టవేదాంతాన మేలొండు జరిగేనా
పట్టక శ్రీరామపాదాబ్జములు తన్ను
పట్టిన పెనుమాయ ప్రక్కకు తొలగేనా
పుట్టి


4 వ్యాఖ్యలు:

 1. రామపాదాలే పెనుమాయను తొలగిస్తాయంటూ మంచి గేయాన్ని అందించారు. రాగ తాళాలను పేర్కొంటే గాయకులకు అనుకూలంగా ఉంటుంది కదా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాగతాళాలేవో ఆధారం చేసుకోకుండా సంకీర్తనం వ్రాయలేము కదండీ. కాని తరచుగా ఆ రాగం పేరు విషయంలో పొరపాటు పడే అవకాశం మెండు. అలాగే తాళం మరీ శుధ్ధంగా ఉండకలోవచ్చును. రాగప్రస్తారమూ అలాగే ఉండవచ్చును. ఈ‌ పరిస్థితికి కారణం నేను సంగీతజ్ఞుడను కాకపోవటమే. అందుచేత స్వరపరచుకొనే బాధ్యతను సంగీతజ్ఞులకే వదలటం‌ మంచిది. నిజానికి ఒక రాగంలో ఉన్న పాటను మరికొన్ని ఇతరరాగాల్లోనూ‌ ఒదిగించవచ్చు నన్నది సామాన్య సంగీతవిద్యార్థులకు కూడా చక్కగా తెలిసిన విషయమేను.

   తొలగించు
 2. సర గుణ పాదములకు స్వాంతమను సరొజమును సమర్పణము సేయు వారెందరో ...

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.