2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎవ్వడ తానని తలచేనో




ఎవ్వడ తానని తలచేనో యెవ్వడ వీవని యెంచేనో
రివ్వురివ్వున నివ్వలకవ్వల కివ్విధి తిరుగుట మానకను


గిలగిలలాడుచు తాపత్రయముల కువలయ మంతయు తిరుగుచును
మిలమిలలాడే బొమ్మల వెనుకనె వలపులు జూపుచు తిరుగుచును
తలపున నుంచగ దగు దైవంబును తనలో తలచక తిరుగుచును
కలుగుచు తొలగుచు నిత్యము నాసున కండెవోలె తా తిరుగుచును
ఎవ్వడ

తనభోగమునకె ధరలో సకలము తనరారెడునని తలచుచును
ధనములు గెలచుట మాత్రమె జీవన తాత్పర్యంబని తలచుచును
తనసంతోషమునకు మించినదొక ధర్మము లేదని తలచుచును
తనబ్రతుకునకును మించిన సత్యము ధరలో లేదని తలచుచును
ఎవ్వడ

మోహభూమికాసప్తక మందున మునిగి తేలుచు నిరతమును
దేహి విడువడు పంచమలముల తెలియ నేరడు పరమమును
ఆహా వాడు సుఖేఛ్ఛకు వచ్చుట యన్నది లేదను విషయమును
ఊహించి దయాళో శ్రీరామా యుధ్ధరించ మని యడిగెదను
ఎవ్వడ