31, జనవరి 2016, ఆదివారం

ప్రమితాక్షరము.           ప్రమితాక్షరము.
           కరుణాలవాల నిను కన్నులతో
           నరయంగ రామ యెటు లబ్బునయా
           యరుదైనభాగ్యమది యట్లగుటం
           బరమాత్మ వచ్చెదవు స్వప్నములన్
         ప్రమితాక్షరము.

ఈ ప్రమితాక్షరవృత్తానికి గణవిభజన స-జ-స-స. అంటే పాదానికి పన్నెం డక్షరాలు. గురులఘుక్రమం IIUIUIIIUIIU.  యతిస్థానం తొమ్మిదవ అక్షరం.

ఈ ప్రమితాక్షరంలో ఉన్న గణాలన్నీ చతుర్మాత్రాగణాలన్నది గమనార్హం. కాబట్టి నడక చతురస్ర గతిలో  IIU IUI IIU IIU అనే విరుపులతో ఉంటుందని పించవచ్చును. కాని దీని నడక IIUI UIII UIIU అని నాలుగేసి అక్షరాలకు ఒక విరుపుతో కనిపిస్తున్నది ఇక్కడ నేను చూపిన పద్యంలో.

కరుణాల వాల నిను కన్నులతో
నరయంగ రామ యెటు లబ్బునయా
యరుదైన భాగ్య మది యట్లగుటం
బరమాత్మ వచ్చెదవు స్వప్నములన్

విశ్వనాథవారు ప్రమితాక్షరాన్ని రామాయణకల్పవృక్షంలో వాడలేదు. ఇతరకవు లెవరన్నాఈ ప్రమితాక్షరాన్ని వాడిన వివరం తెలియదు..

రామప్రియంవద          ప్రియంవద.
          మొదట చేయవలె మోక్షగామియై
          మదిని రామునకు మందిరంబుగా    
          వదలిపెట్ట వలె బంధసంతతిన్
          వదలరాదు హరిభక్తి మార్గమున్
         ప్రియంవద.
ఈ ప్రియంవదావృత్తానికి గణవిభజన న-భ-జ-ర. గురులఘుక్రమం  IIIUIIIUIUIU. పాదానికి 12అక్షరాలు. యతిస్థానం 8వ అక్షరం. 

విశ్వనాథవారు ప్రియంవదావృత్తాన్ని ఉపయోగించినట్లు తెలుస్తున్నది.

ఎవరు చెప్పినదో తెలియదు కాని ఒక ఉదాహరణ పద్యం కనిపిస్తున్నది.

    దివిషదీశ్వరుఁడు తేపమౌనులున్
    గవురుగప్పుచుపొగల్ వెలార్పఁగా
    నవుదపస్సుల మహాగ్నిరేగఁగా
    నవురయచ్చరలనంపునంటఁగా


ఈ ప్రియంవద నడకను పరిశీలిద్దాం. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని త్రికగణాలతో III UII IUI UIU న-భ-జ-ర అని చెబుతున్నాం. మొత్తం‌ మాత్రలసంఖ్య పదహారు. వీటిని  IIIUIII  UIUIUఅని గురులఘుక్రమాన్ని యతిస్థానం వద్ద రెండు కాలఖండాలుగా చేసి చూస్తే బాగుంటుంది. పూర్వాపరభాగాల్లో ఎనిమిఎదేసి మాత్రలు వస్తాయి.  ఇంకా వివరంగా ఒక్కొక్క భాగాన్ని మూడు ఖండాలు చేసి III UI II UI UI U అని 3+3+2  మాత్రలుగా ప్రతిభాగాన్ని చెప్పుకోవచ్చును.

మొదట చేయ వలె మోక్ష గామి యై
మదిని రాము నకు మంది రంబు గా
వదలి పెట్ట వలె బంద సంత తిన్
వదల రాదు హరి భక్తి మార్గ మున్

ఇతర విధాలైన నడకలు సాధ్యపడవచ్చును. కాని పైన చెప్పుకున్నది దీనికి సహజమైన నడక అనుకుంటున్నాను.శ్రీరఘురాముని కొక అంబురుహము.        అంబురుహము.
        శ్రీరఘురాముని చిన్మయరూపము చిత్తమందు రహించగన్
        శ్రీరఘురాముని తారకనామము జిహ్వపైన నటించగన్
        నారకబాధలు తీరగ శ్రీరఘునాథుడే కరుణించగన్
        శ్రీరఘురాముని చేరిన జీవుడు శీఘ్రమే తరియించురా

      అంబురుహము.

ఈ అంబురుహవృత్తానికి గణవిభజన భ-భ-భ-భ-ర-స-వ. గురులఘుక్రమం UII UII UII UII UIU IIU IU. అంటే‌ పాదానికి ఇరవై అక్షరాలన్నమాట. 13వ అక్షరం యతిస్థానం.

అంబురుహవృత్తాన్ని తిక్కన్నగారు స్త్రీపర్వంలో వాడారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారు తమ రామాయణంలో వాడారు. ఇంకా వేరే కవులెవరన్నా వాడారేమో.

నాకైతే ఈ వృత్తపు నడక కొంత వింతగా అనిపిస్తుంది యతిస్థానానికి ముందున్న నాలుగు భ-గణాలతోరణమూ ఒక రగడలాగా ధ్వనిస్తుంది. యతిస్థానం నుండి నడక మారిపోయి అదేదో ఉత్పలమాల వంటిదాని నడకలోనికి వస్తుంది. అతుకు కనిపించకుండా సాఫీగా నడిపించటంలోనే‌ కవికౌశల్యం‌ కనిపించాలి.

ఎందులోనిదో తెలియదు కానిఒక అంబురుహవృత్తం కనిపిస్తోంది.

    దేవకులార్చితదేవశిరోమణిదేవదేవజగత్రయీ
    పావనమూర్తికృపావనమూర్తివిభావనాకులచిత్తరా
    జీవబుధవ్రతజీవదశాపరిచేష్టితాఖిలలోకల
    క్ష్మీవదనాసవశీతలసౌరభసేవనాంచితజీవనా


30, జనవరి 2016, శనివారం

రామభుజంగప్రయాతము.        భుజంగప్రయాతము.
        సదా భక్తిమై రామచంద్రుం‌ భజింపం
        హృదిం బ్రీతిమై నిల్పియేవేళ వేడ్కన్
        వదాన్యుండు కారుణ్యవారాశి యిచ్చున్
        ముదం బొప్ప పాపౌఘముల్ గూల్చి ముక్తిన్

      భుజంగప్రయాతము.

ఈ‌ భుజంగ ప్రయాతవృత్తానికి గణవిభజన య-య-య-య. అంటే పాదానికి 12అక్షరాలు. గురులఘుక్రమం IUUIUUIUUIUU. యతిస్థానం 8వ అక్షరం.

ఈ‌ భుజంగప్రయాతవృత్తానికి  అప్రమేయ అని మరొక పేరు కూడా ఉందని తెలుస్తోంది.

తెలుగుకవులు  భుజంగప్రయాతాన్ని బాగానే ఆదరించారనే చెప్పాలి. పోతన్నగారి భాగవతంలో‌ పరీక్షిత్తు జననం నుండి ఒక భుజంగప్రయాతం.

    హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
    భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
    జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
    వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.

అధునికులు నేమాని రామజోగిసన్యాసిరావుగారి పద్యం.

    మహానంద వారాశి, మాయావిలోలున్
    మహర్షివ్రజ స్తూయమాన ప్రభావున్
    మహీజా హృదంభోజ మార్తాండు, రామున్
    మహీశాధినాథున్ క్షమాపూర్ణు గొల్తున్.25, జనవరి 2016, సోమవారం

శ్రీరామసుమంగళి        సుమంగళి.
        ఎలనాగ సీత పతినే మురిపించన్
        కలహంస సిగ్గుపడగా నడయాడున్
        కలవాణి కోకిలకు గానము నేర్పున్
        తిలకించు భక్తులను దీనత మాన్పన్

      


సుమంగళి.

ఈ సుమంగళీవృత్తానికి గణవిభజన స-జ-స-స-గ.  గురులఘుక్రమం IIUIUIIIUIIUU.  9వస్థానం వద్ద యతిమైత్రి. ఈ వృత్తానికే కలహంస అని మరొక పేరు కూడా కనిపిస్తోంది.

ఈ సుమంగళీవృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

ఈ‌వృత్తం‌ నడక చిత్రంగా ఉంది. IIUIUIIIUIIUU అన్న గురులఘుక్రమం IIUI UIII UII UU అని నాలుగు ఖండాలుగా కనిపిస్తోంది. ఇలా  5+5+4+4 మాత్రలుగా ఇది ఎలాంటి తాళానికి ఒదుగుతుందో మరి. చివరి రెండు చతుర్మాత్రాగణాలనూ‌ మరొక మాత్రకు సాగదీసి అవీ‌ పంచమాత్రాత్మకం చేస్తే అప్పుడు త్రిస్రగతిలో‌ రూపకతాళంలో ఉంటాయని చెప్పవచ్చును.

ఎలనాగ సీత పతి నే మురి పించన్
కలహంస సిగ్గుపడ గా నడ యాడున్
కలవాణి కోకిలకు గానము నేర్పున్
తిలకించు  భక్తులను దీనత మాన్పన్
రామసేవయే ప్రగుణము.       ప్రగుణము.
       వినవయ్యా నా
       మనవిన్ రామా
       నను నీ‌సేవం
       గొన నీవయ్యా

      


ప్రగుణం.

ఈ చిట్టి వృత్తానికి గణవిభజన స-గగ. గణవిభజన IIU UU. ఇంత చిన్న వృత్తానికియతిమైత్రి స్థానం అంటూ అవసరం‌ లేదు కాని ప్రాసనియమం మాత్ర్రం అవసరమే.

విశ్వనాథవారు ఈ‌ ప్రగుణవృత్తాన్ని వాడారు. ఇతరకవు లెవరైనా వాడినదీ‌ లేనిదీ‌ తెలియదు.

కేవలం ఎనిమిది మాత్రలకే పరిమితమైన ఈ వృత్తానికి ప్రత్యేకమైన నడక యేదీ‌ ఉన్నట్లు లేదు.రెండు చతుర్మాత్రాగణాలుగా పాదం ఉన్నది కాబట్టి చతురస్రగతి ఐతే సులభంగానే దీనికి పడుతున్నది.

24, జనవరి 2016, ఆదివారం

శ్రీరామభీమార్జునం.       భీమార్జునము.
       నీనామదివ్యమంత్రం
       బీనాడె గొంటి రామా 
       ఏనాడు లేని సౌఖ్యం
       బానందధామ గల్గెన్

      భీమార్జునము.
ఈ భీమార్జునవృత్తానికి గణవిభజన త-ర-గ. గురులఘుక్రమం UUIUIUU పాదం నిడివి 7అక్షరాలే కాబట్టి యతిమైత్రిస్థానం ఏమీ అక్కరలేదు. వృత్తం‌కాబట్టి ప్రాసనియమం మాత్రం ఉంటుంది.


ఈ‌భీమార్జున వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

ఈ భీమార్జునం నడకవిషయం చూదాం. దీని గురులఘుక్రమం UUIUIUU అనేదాన్ని UU IUI UU అంటే గగ-జ-గగ అని మూడు ఖండాలుగా  విడదీసి చూస్తే ఈ వృత్తపు నడక తెలుస్తుంది.  ప్రతి ఖండంలోనూ నాలుగేసి మాత్రలతో చతురస్రగతి కనిపిస్తుంది.

నీ‌ నా మ దివ్య మంత్రం
బీ నా డె గొంటి రామా
యే నా డు లేని సౌఖ్యం
బానం ద ధామ గల్గెన్


ఈ వృత్తపు నడకను మరొక విధంగా కూడా చూడవచ్చును. మొదటి గురువునే నాలుగు మాత్రలుగా సాగదీసి ముదటి ఖండంగానూ, అ తరువాత ప్రతి రెండక్షరాలూ ఒక్కొక్క ఖండంగానూ‌ నాలుగు ఖండాలుగా చేసి చూడవచ్చు. ఇప్పుడు మాత్రల దైర్ఘ్యం  4+3 + 3+4  అవుతున్నది.

నీ నామ దివ్య మంత్రం
బీ నాడె గొంటి రామా
యే నాడు లేని సౌఖ్యం
బా  నంద ధామ గల్గెన్
శ్రీరామశుధ్ధవిరాటి.       శుధ్దవిరాటి.
       కారుణ్యాలయ కానివాడనా
       వేరే దైవము పే రెరుంగరా
       నీరేజేక్షణ నీవె దిక్కయా
       శ్రీరామా దరిజేర్చుకోవయా

      

శుధ్ధవిరాటి.

శుధ్ధవిరాటి వృత్తానికి గణవిభజన మ-స-జ-గ. గురులఘుక్రమం UUUIIUIUIU.  పాదానికి  10అక్షరాలు. యతిస్థానం 6వ అక్షరం.

ఈ శుధ్ధవిరాటి వృత్తానికి విరాట్ అని మరొక పేరు.

ఈ విరాట్ వృత్తపాదానికి అదనంగా మరొకగురువును చివరన చేర్చితే అది విశ్వవిరాట్ వృత్తం (UUUIIUIUIUU) అవుతుంది.విరాట్ పాదంలోని తొలి గురువును రెండు లఘువులుగా మార్చితే అది శీధు వృత్తం‌ (IIUUIIUIUIU) అవుతుంది.

శుధ్ధవిరాటి నడక విషయం చూదాం. ఈ వృత్తపు గురులఘుక్రమం UUUIIUIUIU అనేదాన్ని UU UII UI UIU అని విడదీస్తే దీని నడక బోధపడుతుంది. రెండు ఖండాల్లోనూ మూడేసి గురువులూ  రెండేసి లఘువులతో‌ మాత్రాపరంగా సమతూకంగా ఉంది. యతిస్థానం దగ్గర విరుపు ఇలా పాదాన్ని సమద్విఖండనం చేస్తోంది. ప్రతిఖండంలోనూ మూడవ అక్షరం దగ్గర చిన్నస్థాయి విరువు మళ్ళా కనిపిస్తోంది.

కారు ణ్యాలయ కాని వాడనా
వేరే దైవము పేరె రుంగరా
నీరే జేక్షణ నీవె దిక్కయా
శ్రీరా మా దరి జేర్చు కోవయాశుధ్ధవిరాటికి పూర్వకవిప్రయోగా లేమన్నా ఉన్నాయేమో‌ తెలియదు.

శ్రీరామమనోరమ       మనోరమ.
       సురలకోర్కెదీర్చుస్వామియే
       ధరనుమానవోత్తముండుగా
       బరగి రావణు న్వధించ సం
       బరము నొందెనీ ప్రపంచమున్
       (7వస్థానం యతిమైత్రితో)

       మనోరమ.
       నరుడు రామనామ మొక్కటే
       తరచు నోటదాల్చు చున్నచో
       మరలిరాని మంచిచోటికిన్
       తరలిపోవు తాను ధన్యుడై
       (6వస్థానం యతిమైత్రితో)
      

మనోరమ.

ఈ‌ మనోరమావృత్తానికి గణవిభజన న-ర-జ-గ. అంటే గురులఘుక్రమం IIIUIUIUIU అవుతున్నది. పాదానికి 10 కాని అంతకంటే హెచ్చు స్థానాలు కాని ఉన్న వృత్తాలకు యతిస్థానం తప్పక ఉండాలి. ఇక్కడ యతిస్థానం 7వ అక్షరం. ప్రాసనియమం ఉంది.

మనోరమావృత్తానికి కల బంధుగణాన్ని చూదాం. మనోరమ పాదానికి ముందు రెండు లఘువులను చేర్చితే అది ప్రశృమరాళికా వృత్తం (IIIIIUIUIUIU) అవుతుంది. ముందు మూడు లఘువులను చేర్చితే అది అశోకపుష్పవృత్తం (IIIIIIUIUIUIU) అవుతుంది.  మనోరమావృత్తపాదానికి ముందొక లఘువునూ చివరన ఒక గురువునూ‌ చేర్చితే అది బలోర్జితావృత్తం (IIIIUIUIUIUU) అవుతుంది.  మనోరమావృత్తపాదానికి చివర ఒక య-గణాన్ని తగిలిస్తే అది సుకర్ణపూరం (IIIUIUIUIUIUU) అనే వృత్తం అవుతుంది.

నడక విషయం చూదాం. త్రికగణాలతొ న-ర-జ-గ అని చూసినప్పుడు దీనిలోని నడకను గ్రహించటం ఒకింత కష్టమే. మరొక విధానం కావాలి. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని మనం III UI UI UI U  అని న-హ-హ-గ వలె కూడా చూడవచ్చును. ఈ విధంగా చూస్తే నాలుగు త్రిమాత్రాగణాల పిదప ఒక గురువుగా ఉన్నది. నడకను త్రిస్రగతిగా చూడటం బాగుండేలాగు ఉన్నది. అటువంటప్పుడు యతిస్థానం 6వ అక్షరంగా బాగుండవచ్చును. అదీ కాక వీలైన సందర్భాల్లో గురువుపైన యతిమైత్రి వచ్చేలా చూడటమే వృత్తాల్లో అందగిస్తుంది.

ఈ చర్చ తరువాత మనోరమావృత్తానికి రెండు విధాల యతిస్థానాలతోనూ పద్యాలు చెప్పుకుంటే విషయం మరింతా సుగమంగా ఉంటుంది.

విశ్వనాథవారు మనోరమావృత్తాన్ని వాడినట్లు తెలుస్తున్నది.

మనోరమా వృత్తానికి 6వ అక్షరం యతిస్థానంగా వ్రాసిన పద్యం‌ నడకను చూడండి.

నరుడు రామ నామ మొక్క టే
తరచు నోట దాల్చు చున్న చో
మరలి రాని మంచి చోటి కిన్
తరలి పోవు తాను ధన్యు డై


23, జనవరి 2016, శనివారం

నందినీ వృత్తంలో‌ రామస్తుతి.       నందిని.
       చాలును దుర్భుధ్ది చరించుటల్
       చాలును దుర్మంత్ర జపంబులున్
       చాలును బుగ్గౌట జనించుటల్
       వ్రాలుము శ్రీరామ పదంబులన్

    


నందిని.

ఈ నందినీవృత్తానికి గణవిభజన భ-త-జ-గ. గురులఘుక్రమం UIIUUIIUIU.  పాదానికి 10 అక్షరాలు. తొమ్మిది దాటాయి కాబట్టి యతిమైత్రి అవసరం. యతిస్థానం ఆరవ అక్షరం. ప్రాసనియం ఉంది.

ఈ నందినీ వృత్తానికిపూర్వకవి ప్రయోగా లేమున్నదీ‌ తెలియదు.

ఈ‌ నందినీ వృత్తం నడక విషయం చూదాం. ఈ వృత్తపాదంలో మొత్తం పదునాలుగు మాత్రలున్నాయి. పై పద్యం చూస్తే, ఈ వృత్తపాదం 4+5+5 అని మూడు కాలఖండాలుగా కనిపిస్తోంది. ఇతరనడకలు కూడా సాధ్యం‌ కావచ్చును.

చాలును దుర్బుధ్ధి చరించుటల్
చాలును దుర్మంత్ర జపంబులున్
చాలును బుగ్గౌట జనించుటల్
వాలుము శ్రీరామ పదంబులన్భుజగశిశుభృత రామనామం.       భుజగశిశిభృతము.
       పలుకవలయు శ్రీరామా
       పలుకవలయు నీ‌ నామం
       బలుపు నెఱగుకుండంగం
       జిలుకవలెనె తీయంగన్
భుజగశిశుభృతము.

ఈ భుజగశిశుభృత వృత్తానికి గణవిభజన న-న-మ. గురులఘుక్రమం IIIIIIUUU. పాదానికి కేవలం‌ తొమ్మిది అక్షరాలు.  చిన్నవృత్తం‌ కాబట్టి దీనికి యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం ఉంది.

లక్షణసారసంగ్రహమూ ఛందోబుధీ దీనిని భుజగశిశురుతము అన్నాయి. కవిజనాశ్రమమూ, కావ్యాలంకారసంగ్రహమూ, అప్పకవీయము భుజగశిశురుతానికి లక్షణాన్ని న-న-య అని వేరు వృత్తంగా చెప్పాయి.

ఈ భుజగశిశుభృతవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ వృత్తం నడక చూదాం. దీని పాదంలో గణవిభజన న-న-మ కాబట్టి మెత్తం మాత్రల సంఖ్య పన్నెండు.  మొదట వచ్చే ఆరుమాత్రలూ పూర్తిగా లఘువులతోనూ‌, చివరి ఆరు మాత్రలూ మొత్తంగా గురువులతోనే యేర్పడుతున్నాయి. మొదటి ఆరు మాత్రలూ‌ పూర్తికాగానే విరుపు కనిపిస్తోంది. అందుచేత ఈ‌వృత్తపాదం మూడవగణం‌ ఐన మ-గణం వద్ద సమద్విఖండనం చేస్తూ విరుగుతున్నది.

పలుక వలయు శ్రీరామా
పలుక వలయు నీ నామం
బలుపు నెఱగ కుండంగం
చిలుక వలెనె తీయంగన్

ఈ వృత్తం వ్రాయటానికి సులభంగానే కనిపిస్తోంది. ఔత్సాహికులు ప్రయత్నించండి.


22, జనవరి 2016, శుక్రవారం

శ్రీరామ ప్రణవము.       ప్రణవము.
       వేదోధ్దారక విధిశక్రేశా
       నాదుల్గొల్చెడు హరివీవయ్యా
       నాదైవంబవు నరనాథా నా
       చేదోడై నడచెడు శ్రీరామా
ప్రణవము.

ఈ‌ ప్రణవ వృత్తానికి గణవిభజన మ-న-య-గ. అంటే పాదానికి 10అక్షరాలు. యతిస్థానం 6వ అక్షరం. గురులఘుక్రమం U UUIIIIUUU.ఈ గురులఘుక్రమాన్ని కుడినుండి వెనుకకు చదివినా అదే వస్తుంది.

ఈ ప్రణవవృత్తానికే పణవ అనీ, పణవకం అనీ‌ హీరాంగి అనీ వేర్వేరు పేర్లు కూడా కనిపిస్తున్నాయి.

పణవ అనే పేరుతో మరొక వృత్తం‌ కూడా  మ-న-జ-గ అనే గణవిభజనతో‌, అంటే UUU III IUI U అనే గురులఘుక్రమంతో‌ కనిపిస్తున్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రణవ లేదా పణవ వృత్తానికీ ఆ పణవవృత్తానికి తేడా య-గణం బదులుగా జ-గణం రావటమే. అంటే తొమ్మిదవస్థానంలో మనం గురువును తీసుకొంటే‌ ఆ వృత్తంలో లఘువన్నమాట.

ఈ ప్రవణ వృత్తానికి దగ్గరి చుట్టం వనితాభరణం అనే మరొకవృత్తం. ఈ ప్రణవవృత్తంలో ముందు వెనుకల గగ-గణాలలో ముందున్న దాన్ని  భ-గణంగా చివరి గగ-గణాన్ని స-గణంగా మార్చితే వనితాభరణం ఐపోతుంది. మాత్రలలో తేడారాదు. చివరి గగ-ను మార్చకుండా వదిలేస్తే అది శ్రితకమలా వృత్తం అవుతుంది. మొదటి దాన్ని మాత్రమే మార్చితే అది కుశల కళావాటిక అవుతుంది. గందరగోళంగా ఉందా? ఈ విధంగా చూడండి:

ప్రణవంUU  UIIIIU UU
వనితాభరణంUII UIIIIU IIU
కుశలకళావాటికUU  UIIIIU IIU
శ్రితకమలUII UIIIIU UU

ఈ ప్రణవ వృత్తానికి బంధువర్గాన్ని చూదాం. ఈ‌ వృత్తపాదానికి ఇరుప్రక్కలా ఒక్కొక్క గురువును తగిలిస్తే అది జలధరమాలా వృత్తం అవుతుంది. ఒక్కొక్క గురువుకు బదులుగా రెండేసి గురువులను తగిలిస్తే అది వాసంతీవృత్తం అవుతుంది. వాసంతీ వృత్తానికి చివరన ఉన్నగురువును మొదటికి మార్చితే అది కాలధ్వానం అనే వృత్తం అవుతున్నది. జలధరమాలకు చివర మరొక గురువును తగిలిస్తే అది లీలాలోలావృత్తం అవుతుంది.

ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని  UU UII IIU UU అని గగ-భ-స-గగ వలె కూడా విడదీసి చూదవచ్చును. ఇప్పుడు చక్కగా అన్నీ‌చతుర్మాత్రాగణాలు కనిపిస్తున్నాయి కదా. అందుచేత దీని నడక చతురస్రగతిలో ఉంటుందని స్పష్టం అవుతున్నది

21, జనవరి 2016, గురువారం

రామకృపాశుధ్ధధార.    శుధ్ధధార.
    భూమిమీద సర్వముం బుట్టిగిట్టు చుండు నం
    దేమి కోరుకొందురా యేల కోరుకొందురా
    తామసించి కోరుటే దప్పు తప్పు తప్పురా
    రామచంద్ర కోరగారాదు నీకు నన్యమున్
శుధ్ధధార.

గణవిభజన ర-జ-త-ర-వ.పాదానికి 14అక్షరాలు. గురులఘుక్రమం UIU IUI UUI UIU IU. ఈ‌వృత్తానికి యతిమైత్రిస్థానం వివరాలు లక్షణకారులు ఎక్కడ అని నిర్దేశించినదీ తెలియదు. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని మనం ఇలా UI UI UI U UI UI UI U అని చూస్తే బాగుండవచ్చును. అంటే హ-హ-హ-గ -హ-హ-హ-గ అన్నమాట. అప్పుడు యతిమైత్రిస్థానం 8వ అక్షరంగా నప్పుతున్నది.

ఇక శుధ్ధధార నడక విషయాన్ని చూదాం. శుధ్ధధార గణవిభజనను హ-హ-హ-గ -హ-హ-గ అని భావించి తదనుసారిగా వ్రాయటమే సుకరంగా ఉంటుంది కాని త్రికగణాలతో దీని కూర్పును సరిగా పట్టుకోవటం‌ కష్టం. హ-గణ ప్రయుక్తంగా మనం విభజన చేసుకున్నప్పుడు హ-గణాలు త్రిమాత్రాగణాలు కావటమే కాదు, మధ్యలో ఉన్న గురువు కూడా త్రిమాత్రాప్రమాణంగా నడుస్తుంది. పాదాంతంలో ఉన్న గురువును ఎలాగూ మనం త్రిమాత్రాప్రమాణంగా చూడవచ్చును. అందుచేత ఈ‌ పద్యం‌ నడక త్రిస్రగతిలో చక్కగా ఉంటుంది.

ఈ శుధ్ధధారకు కల పూర్వకవి ప్రయోగాలు తెలియవు.
  
పైన చెప్పిన పద్యం‌ నడక ఇలాగు ఉంది:

భూమి మీద సర్వ ముం బుట్టి గిట్టు చుండు నం
దేమి కోరు కొందు రా యేల కోరు కొందు రా
తామ సించి కోరు టే తప్పు తప్పు తప్పు రా
రామ చంద్ర కోర గా రాదు నీకు నన్య మున్


20, జనవరి 2016, బుధవారం

శ్రీరామ కృష్ణగతిక       కృష్ణగతిక.
       భావనము సేయు వాడన్
       దేవుడవు కాన నిన్నే
       యీవి కల వాడ మోక్షం
       బీవలయు రామచంద్రా
కృష్ణగతిక.

ఈ కృష్ణగతిక వృత్తానికి గణవిభజన భ-జ-గగ. పాదానికి 8అక్షరాలు. యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. గురులఘుక్రమం UII IUI UU.

చిత్రపద వృత్తానికి భ-భ-గగ అన్నది గణవిభజన. ఈ కృష్ణగతికకు భ-జ-గగ కాబట్టి కొద్దిగా బేధం మధ్యన ఉన్న భగణ జగణాల పరంగా. ఒక జత గురులఘువులు స్థానచలనం చెందితే అది ఇదవుతుంది. ఈ కృష్ణగతిక అనేది అనేక వృత్తాల్లో అంతర్భాగంగా వస్తుంది. అలాగే చిత్రపదమూ అనేక వృత్తాల్లో అంతర్భాగంగా వస్తుంది.

ఈ కృష్ణగతికకు ప్రత్యేకమైన నడక ఉన్నట్లు కనిపించదు. పైపద్యంలో ఐదవ, ఏదవ స్థానాలవద్ద విరుపు కనిపిస్తున్నది.

పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.రుక్మవతీ శ్రీరామం.        రుక్మవతి.
        తల్లివి నీవే తండ్రివి నీవే
        చల్లగ జూచే స్వామివి నీవే
        యుల్లమునన్ ధ్యేయుండవు నీవే
        నల్లనివాడా నా రఘురామా
రుక్మవతి
ఈ రుక్మవతీ వృత్తానికి గణవిభజన భ-మ-స-గ. అంటే పాదానికి పది అక్షరాలు. పాదం నిడివి పది ఐనా అంతకన్నా ఎక్కువ అక్షరాలైనా యతినియమం ఉంటుంది. ఇక్కడ యతిస్థానం 6వ అక్షరం. అన్ని వృత్తాలకూ‌ వలె ప్రాసనియమం ఉంది. ఈ వృత్తపు గురులఘుక్రమం UII UUU IIU U.

ఈ వృత్తానికి రుగ్మవతి అని లక్షణకారులు ఎందుకు అంటున్నారో తెలియదు. రుక్మం అంటే రోగం. కాబట్టి రుగ్మవతి అంటే రోగిష్టిది అని అర్థం వస్తున్నది. బాగోలేదు కదా! అందుకని ఈ వృత్తాన్ని మనం కొంచెం పేరు సరిచేసి రుక్మవతి అందాం. రుక్మం అంటే బంగారం కాబట్టి రుక్మవతి అంటే బంగారుతల్లి అన్నమాట హేమవతి అన్నా అదే అర్థం కదా.

ఒక తమాషా ఏమిటంటే ఈ రుక్మవతికి చంపకమాల, చంపకమాలి  అన్న పేర్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ‌వృత్తం‌లోని గురులఘుక్రమం మనకు కందవినోద (UIIUUUIIUUU), కాముకలేఖ (UIIUUUIIUUI), కృతమాల(UUIIUIIUUUIIUU), నాసాభరణం (UUIIUUUIIUUIIU), మణిజీర(UUUUUUUIIUUUIIUUUU), నిష్కళాకాంతి (UIIUUUIIUUUIIUUIIUUIIU), వాసకలీల(UIIUUUIIUUUIIUUUIIUUUU), కోకపదం (UIIUUUIIUUIIIIIIIIIIIIUU), క్రోశపద (UIIUUUIIUUIIIIIIIIIIIIIIU) వృత్తాల్లో కనిపిస్తోంది. సౌలభ్యతకోసం క్రీగీటులతో చూపాను గమనించండి.

 ఈ రుక్మవతిలో చివరన ఉన్న గురువును తొలగిస్తే అది మణిమధ్యం అవుతుంది.

గురులఘుక్రమం UII UUU IIU U. పాదానికి మొత్తం 16మాత్రలు. యతిస్థానం 8మాత్రల తరువాత వస్తున్నది సమద్విఖండనంగా. గురులఘుక్రమాన్ని UII UU UII UU అని భ-గగ + భ-గగ అని కూడా చూస్తే విషయం మరింత స్పష్టంగా బోధపడుతుంది.  నడక విషయానికి వస్తే ఈ విభజన ప్రభావం‌ చక్కగా కనిపిస్తుంది.ఇవన్నీ చతుర్మాత్రాగణాలు కాబట్టి పద్యం నడక చతురస్రగతిలో ఉంటుంది.

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ జూచే స్వామివి నీవే
యుల్లము నన్ ధ్యే యుండవు నీవే
నల్లని వాడా నా రఘు రామాహలముఖీ వృత్తంలో విన్నపం.        హలముఖి.
        కాముకుండు దశముఖునిం
        రామచంద్ర దునిమితివే
        తామసంబు నణచుమయా
        యీ మనంబు దశముఖమే
హలముఖి.

హలముఖి వృత్తానికి గణవిభజన ర-న-స. అంటే పాదానికి తొమ్మిది అక్షరాలు. యతిమైత్రి ఏమీ అక్కరలేదు. ప్రాసనియమం ఉంది.

ఈ వృత్తానికి గురులఘుక్రమం  UIU III IIU. దీనిలో మొత్తం   12మాత్రలున్నాయి.  ఈ గురులఘుక్రమాన్నే మనం UI UI III IU అని త్రిమాత్రాగణాలుగా కూడా చూడవచ్చును.

విశ్వనాథవారు ఈ వృత్తాన్ని వ్రాసారని తెలుస్తోంది.  ఆ సందర్భాన్ని ప్రొద్దు పత్రికలో చదివాను. "ముక్కూచెవులు కోసేసినప్పుడు శూర్పణఖ కోపంతో బొబ్బలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అలా అలా ఎగిరిపోతున్న శూర్పణఖ మాటలు ఒక నాలుగు పద్యాలలో రచించారు. అందులో మొదటి పద్యం లాటీవిటమనే ఛందస్సు, రెండవది అసంబాధము, మూడవది హలముఖి, నాలుగవది వ్రీడ. మొదటి పద్యంలో పాదానికి యిరవయ్యొక్క అక్షరాలు. రెండవ దానిలో పధ్నాలుగు, మూడవ దానిలో తొమ్మిది, చివరి దానిలో నాలుగు అక్షరాలు. ఇలా పద్య పరిమాణం క్రమేపీ తగ్గుతూ పోతుంది."

నడక విషయానికి వస్తే, మొదటి ఆరుమాత్రల తరువాత అంటే నాలుగవస్థానం తరువాత విరుపు కనిపిస్తుంది. అంటే ఆరేసి మాత్రల చొప్పున పాదాన్ని సమద్విఖండనం చేస్తున్నది విరుపు.

19, జనవరి 2016, మంగళవారం

మదరేఖాశ్రీరామం        మదరేఖ.
        స్వామీ వందన మయ్యా
        నీ మాహాత్మ్యము నెన్నన్
        సామాన్యుండను రామా
        యే మాత్రంబును చాలన్
మదరేఖ.

మదరేఖావృత్తానికి గణవిభజన మ-స-గ. పాదం నిడివి 7అక్షరాలు. పొట్టి కాబట్టి యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. గురులఘుక్రమం UUU IIU U.

ఈ‌వృత్తానికీ తనుమధ్యావృత్తానికీ చాలా దగ్గరి చుట్టరికం. తనుమధ్యపాదానికి ముందు మరొక గురువును చేరిస్తే అది మదరేఖ అవుతుంది. తనుమధ్యకు గురులఘుక్రమం UUI IUU కదా.

మరొక సంగతి ఏమిటంటే మదరేఖా పద్యపాదం కందపద్యంలో బేసిపాదంగా కూడా సరిపోతుంది!  ఎందుకంటే మ-స-గ అనగా UUU IIU U అనే గురులఘుక్రమాన్ని UU UII UU అని వ్రాస్తే అది గగ-భ-గగ అవుతున్నది కదా, ఈ‌ గగ, భ గణాలను కందంలో వాడుకచేస్తాము కదా. బేసిపాదంలో గగ-భ-గగ నప్పుతుంది కాని సరిపాదాల్లో మూడవగణం‌ కందంలో జ-గణం కాని నల-గణం కాని కావాలి కాబట్టి ఆ పాదాలకు కుదరదు.

మదరేఖకు కల పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ‌ మదరేఖా వృత్తం నడకను చూదాం. ఈ వృత్త పాదంలో  గురులఘువులు UUUIIUU వీటిని UU UII UU అనగా గగ-భ-గగ అని మూడు చతుర్మాత్రాగణాలుగా వ్రాయవచ్చునని చూసాం. అందుచేత దీని నడక చతురస్రగతిగా ఉంటుంది. పై పద్యం నడక ప్రకారం ఈ‌క్రింది విధంగా చూడవచ్చును.

స్వామి వందన మయ్యా
నీ మా హాత్మ్యము నెన్నం
సామా న్యుండను రామా
యే మా త్రంబును చాలన్రామ తనుమధ్య


        తనుమధ్య.
        రామా కొన వయ్యా
        ప్రేమామృతసారా
        సామాన్యుడ నయ్యా
        నా మానస మిత్తున్

              


తనుమధ్య.

తనుమధ్య వృత్తానికి గణవిభజన త-య. గురులఘుక్రమం UUI IUU. అంటే ఆరక్షరాల పాదం. దానిలో రెండు లఘువులకు అటునిటు రెండేసి గురువులు.  పాదం పదక్షరాలలోపు పొడవు కాబట్టి యతిమైత్రి అవసరం‌ లేదు. ప్రాసనియమం ఉంది.

మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం గారి తనుమధ్య పద్యం ఒకటి ఒక ఈమాట వ్యాసం నుండి

     శ్రీవాక్తనుమధ్యల్
     నీవల్లను గల్గన్
     శ్రీ వాద్యవు గావే
     దేవీ తనుమధ్యా 

ఇతర పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

శ్రీరామ మదనకము.


        మదనకము.
        చిరుచిరు నగవులతో
        కరుణను కురియవయా
        నిరుపమశుభనిలయా
        వరదశరథతనయా
మదనకము.

ఈ మదనక వృత్తానికి గణవిభజన న-న-స .  గురులఘుక్రమం III III IIU అవుతున్నది.అంటే పాదానికి కల తొమ్మిది అక్షరాలలో ఎనిమిది లఘువుల తరువాత ఒక గురువు అన్నమాట. పాదం నిడివి తొమ్మిది అక్షరాలే కాబట్టి యతిమైత్రి అక్కరలేదు. ప్రాసనియమం తప్పదు.

ఈ మదనక వృత్తానికే కమలావృత్తము,  లఘుమణిగణనికరము అన్నపేర్లు కూడా ఉన్నాయి.

ఈ మదనక వృత్తంలో చివరన ఉన్న స-గణాన్ని తీసివేసి అక్కడ మ-గణం ఉంచితే అది భుజగశిశురుతము (భుజగశీశుభృతము) అన్న వృత్తంగా మారుతుంది.

పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

అంబుజవృత్తంలో రామస్తుతి.


             అంబుజము.
             ప్రేమమయుడౌ
             క్షేమకరుడౌ
             రాము డొకడే
             స్వామి యనగన్

             అంబుజము.
             నీ కరుణయే
             నా కొఱకునై
             వాకలుగ రా
             మా కలుగనీ
అంబుజము.

ఈ అంబుజవృత్తానికి గణవిభజన భ-లగ (భ-వ).  అంటే పాదానికి 5 అక్షరాలే. కాబట్టి ప్రాసనియమమే కాని యతిమైత్రిస్థానం అవసరం లేదు.

ఈ వృత్తానికి మండలం అని మరొక పేరు కూడా ఉంది.

ఈ వృత్తంలో గురులఘుక్రమం  UII IU. ఈ క్రమాన్ని కుడినుండి ఎడమకు చదివినా అదే అవుతున్నది.

అంబుజ వృత్తపు నడక విషయం చూదాం.  పాదానికి రెండుగురువులూ వాటి మధ్యన మూడు లఘువులూ ఉన్నాయి. ఏ లఘువు పైన ఐనా సరే విరుపు వచ్చే అవకాశం ఉన్నది. ఏ లఘువుపైనా విరుపు రాకపోయే అవకాశమూ ఉన్నది. కాబట్టి నిర్ధిష్టమైన నడక లేదు.

పైన నేను చెప్పిన మొదటి పద్యంలో నాలుగు పాదాల్లోనూ మొదటి రెండు స్థానాల తరువాత విరుపు వచ్చింది పదవిరామం కారణంగా.  పద్యం అంతా అలాగు రావటం యాదృఛ్ఛికం. నియమంగా అలా రావాలని లేదు. మరొక రకంగా విరుపులు చూపటం రెండవ పద్యంలో గమనించండి.

పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.


18, జనవరి 2016, సోమవారం

జలోధ్దతవృత్తంలో రామస్తుతి


     జలోధ్ధతము.
     అమాయకుడనై యనేక  భవముల్
     తమిన్ వలచితిన్ ధనాదికములన్
     భ్రమల్ విడెను సూర్యవంశతిలకున్
     సమానరహితున్ సదా కొలిచెదన్జలోధ్ధతము.

ఈ వృత్తానికి గణవిభజన జ-స-జ-స. పాదానికి 12అక్షరాలు. యతిస్థానం 7వ అక్షరం. అంటే యతిస్థానం దగ్గర పాదం సమద్విఖండితం అవుతున్నది.

ఈ జలోధ్ధత వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు,

నడక విషయానికి వస్తే ఈ జలోధ్ధతవృత్తంలో ఉన్న జ,స గణాలు చతుర్మాత్రాగణాలు. కాబట్టి ఈ వృత్తం అంతా చతురస్రగతిలో‌ నడుస్తున్నది.

అమాయ కుడనై యనేక భవముల్
తమిన్ వ లచితిన్ ధనాది కములన్
భ్రమల్ వి డెను సూ ర్యవంశ తిలకున్
సమాన రహితున్ సదా కొ లిచెదన్

ఈ వృత్తంలోని గణాలైన జ, స గణాలకు కొంతగా ఎదురు నడక లక్షణం ఉన్నది జ అంటే IUI  స అంటే IIU. ఈ రెండు గణాల్లోనూ గురువుకు ముందు లఘువు వస్తున్నది. జ-గణం వెంబడే స-గణం రావటంతో, ఆ గురువుల తరువాత కూడా లగువు విధిగా వస్తున్నది, ఒక్క చివరి అక్షరానికి తప్ప.అంటే జాగ్రత్తగాగమనిస్తే ఇందులో ఎదురు నడక పెత్తనం బాగానే కనిపిస్తుంది. చూడండి ఈ జలోధ్ధతవృత్తపు గురులఘుక్రమం IUIIIUIUIIIU లో 1-3, 5-7, 7-9  స్థానాల్లో జగణం ఉన్నది! లగ లేదా వ-గణం‌ నికార్సైన ఎదురు నడక కాబట్టి అలా చూస్తే 1-2, 5-6, 7-8, 11-12 స్థానాల్లో వ-గణం‌ ఉన్నది.

అంతే కాదు, పాదారంభంలోనే‌ కాక విరామానంతరమూ జగణమే రావటం ఈ వృత్తం ప్రత్యేకత.  ఇలాంటి నడుముకి సరిగ్గా విరిగే వృత్తాల్లో యతిస్థానం దగ్గర పదం విరిగితే అందం ఇనుమడిస్తుంది.

చంద్రవదనుడు శ్రీరామునకు హారతి.


        చంద్రవదన.
        పేరుగలవాడా
        మేరు నగధీరా
        హారతుల నందన్
        రార రఘువీరా
                
       

చంద్రవదన.

ఈ వృత్తానికి గణవిభజన భ-య. అంటే పాదానికి ఆరు అక్షరాలే. అందుచేత యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. ఈ వృత్తాన్ని నాగవర్మ శశికాంతం అన్నాడు.

ఈ‌వృత్తానికి గురులఘుక్రమం UII IUU. నడకప్రకారం చూస్తే  UI II UU అని రెండేసి స్థానాల వద్ద విరుపుతో బాగుంది.

ఈ చంద్రవదనవృత్తానికి ఏమైనా పూర్వకవి ప్రయోగాలున్నాయో లేదో తెలియదు.
చాలా లలితమైన వృత్తం. వ్రాయటం తేలిక. ఔత్సాహికులు సులభంగా ప్రయత్నించవచ్చును.


17, జనవరి 2016, ఆదివారం

నారాచక వృత్తంలో రామడికొక ప్రశ్న.


        నారాచకము.
        శ్రీరామ నిన్నుగాక సం
        సారంబు నెన్ను వాడనా
        కారుణ్య మేల బూనవో
        మారాడ వేల దైవమా
                
       

నారాచకము.

ఈ నారాచక వృత్తానికి గణవిభజన త-ర-వ. గురులఘుక్రమం UUI UIU IU. పాదదైర్ఘ్యం ఎనిమిది అక్షరాలే కాబట్టి యతిస్థానం ఏమీ‌ లేదు. వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం పాటించాలి.

ఈ వృత్తానికి నారాచ , నారాచిక అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

అంతర్జాలంలో ఒక ఉదాహరణ కనిపిస్తోంది. ఏ‌కవి ప్రయోగమో వివరం తెలియదు.

     ఈతండు రాఘవాగ్రజుం
     డేతెంచు శత్రునిం గరా
     ఘాతంబుచే వధించు ని
     ర్ఘాతంబు నామహాజిలో

ఇతర పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ‌వృత్తంలో పాదానికి 13మాత్రలున్నాయి.  ఇవి 5+3+5 మాత్రలుగా నడుస్తూ అందగిస్తున్నాయి. ఇక్కడ నేను ఇచ్చిన పద్యానికి నడకను చూద్దాం.

 శ్రీరామ నిన్ను గాక సం
సారంబు నెన్ను వాడనా
కారుణ్య మేల బూనవో
మారాడ వేల దైవమా

ఇదేదో‌ మిలట్రీ బాండు మేళం‌ నడకలా మీకు అనిపిస్తే అందులో మీ తప్పేమీ లేదు.

ఈ‌ నారాచక వృత్తంలో పద్యం వ్రాయటం సులభంగానే కనిపిస్తోంది కాబట్టి ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.16, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 5

నారాయణాపరస్వరూపమైన అర్జునుడి సంగతి తెలియక అత్యుత్సాహంతో‌ అతడిపై తలపడటానికి సాహసించి పరాభూతులై చట్రాతిపై కొట్టిన కుండ పెంకుల్లా తలొక దిక్కుకూ పరుగెడుతున్న ప్రమథగణాల్ని వారి నాయకుడైన దేవసేనాని కుమారస్వామి మందలిస్తున్నట్లుగా భారవి మహాకవి వ్రాస్తున్న అద్భుతమైన శ్లోకాల్ని చదువుతున్నాం.

కుమారస్వామి ఇలా అంటూన్నాడు. రాక్షసులతో ఒక ఆటలాగా యుధ్ధం చేసే మీ‌ శౌర్యం అంతా ఏమయ్యింది? మీ పరువు మీరే తీసుకుంటున్నారే! మీ‌రు అప్యాయంగా పదునుపెట్టుకున్న మీ కత్తుల తళతళలు మీ ముఖం మీదే పడుతూ‌ మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయే. ధనుర్భాణాలు ధరించి కూడా రక్షణ కోసం అడవిలో దారులు వెతుక్కుంటూ పరిగెడుతున్నారా

మీగురించి మీరు గొప్పగా భావించుకుంటారే. అదంతా చెడింది కదా? శివగణాలుగా మీకు లోకాల్లో వ్యాపించి ఉన్న కీర్తి అంతా మాయమైపోయి నట్లేనా? ఏ మంత గొప్ప ఆపద ముంచుకొచ్చిందని యుధ్ధం నుండి పారిపోతున్నారూ? ఇలా పారిపోవటం ఎంత పాప కార్యం. మీ వలన సదాశివుడికే చెడ్డపేరు వస్తోంది కదా?!

నాసురోఽయం‌ న వా నాగో
ధరసంస్థో న రాక్షసః
నా సుఖోఽయం నవాభోగో
ధరణిస్థోహి రాజసః


న+అసురః+అయం --> నాసురోఽయం అవుతుంది. ఇక్కడ, అయం అంటే ఇతడు అని అర్జునుడిని ఉద్దేశించి చెప్పటం. అసురః న అంటే దైత్యుడు కాడు. న + వా +‌నాగో -> నవానాగో అంటే నాగుడు కాదు. అంటే ఏ వాసుకియో ఆదిశేషుడో వంటి నాగేంద్రుడు కాదు అని. ధరసంస్థో అంటే ధర (భూమి) మీద ఉన్న, రాక్షసః న అంటే రాక్షసుడు కాదు. ధరసంస్థ అంటే భూమిమీద ఉండేది పర్వతం కదా అన్న అర్థంలో పర్వతం‌ లాంటి రాక్షసుకుడు కాదు అనటం  సుఖః + అయం -> సుఖోయం అంటే ఇతడు సుఖంగా (సులభంగా) గెలువ తగినవాడు. ఎందుకంటే ధరణిస్థః అనగా భూమిమీద బతికే వాడే కాని దివ్యుడు కాదు. న రాజసః -> రజోగుణం‌ పండిన వాడు కాదు (తపస్వికదా). నవ + అభోగః -> కొత్తగా తెలియనిది (యుధ్ధం) ప్రయత్నిస్తున్నవాడు.

భావం చూదాం. కుమారస్వామి ఏమని మందలిస్తున్నారంటే ప్రమథుల్ని, ఇతను దైత్యుడు కాదు,  పర్వతం లాంటి రాక్షసుడూ కాడు. ఏ మహానాగుడూ‌ కాదు. కేవలం‌ ఒక భూలోకవాసి ఐన మనిషి మాత్రమే. ఇతను తపస్సు చేసుకునే వాడే కాని యుధ్ధాల వంటి పౌరుషవిద్యల్లో ఆరితేరిన వాడు కాదు. కేవలం కొత్తకొత్తగా యుధ్దవిద్యను ప్రయత్నిస్తున్న వాడు మాత్రమే. ఇంత మాత్రానికే బెదిరి పరెగుత్తుతారా అని ప్రమథుల్ని గద్దించటం అన్నమాట.

ఈ శ్లోకంలో మొదట చెప్పుకోవలసిన విశేషం అసుర, రాక్షస అన్న రెండు మాటల్ని కవి వాడటం. సామాన్యంగా ఈ మాటల్ని సమానార్థప్రతిబోధకాలుగా వాడతాం కాబట్టి ఒకే అర్థం వచ్చే మాటల్ని రెండు వాడటం పునరుక్తి అనే దోషం కదా అన్న అనుమానం వస్తుంది అందరికీ. అది నివృత్తి చేసుకోవాలి.

సురలు అసురలు అని దేవయోనులు రెండురకాలు. సురలు అంటే దేవతలు అదితి సంతానం. వీళ్ళని ఆదిత్యులు అని అందుకే పిలుస్తారు. అసురలు అంటే దితి సంతానం. అందుకని వీళ్ళని దైత్యులు అని అంటారు. ఇకపోతే దనువు అనే వాడి సంతతిని దానవులు అని పిలుస్తారు. కశ్యపప్రజాపతికి సురస అనే ఆమె వలన జన్మించిన వారు, యక్షులు, రాక్షసులు అని రెండు జాతులు. సురస సంతానంలో ఆకలి బాధతో కొందరు యక్షామ అని మరికొందరు రక్షామ అని గోలచేసారు. వాళ్ళూ, వాళ్ళ సంతతి వాళ్ళూ యక్షులూ‌ రాక్షసులునూ అయ్యారు.కాని సామాన్యంగా అందరినీ కలేసి పిలుస్తూ ఉంటాం దానవులనీ రాక్షసులనీ, దైత్యులనీ.

ఇప్పుడు ఈ‌శ్లోకంలో చెప్పుకోవలసిన రెండవదీ ముఖ్యమైనదీ‌ అయిన విశేషం, బంధకవిత్వం. బంధకవిత్వం అనేది చిత్రకవిత్వ ప్రక్రియల్లో ఒకటి. ఒక పద్యాన్నో శ్లోకాన్నో ఒక పజిల్ వంటి అమరికలో పేర్చి చూపటం బంధకవిత్వం అవుతుంది.   ఇక్కడ ఈ‌ శ్లోకంలో‌ భారవి మహాకవి చూపిన బంధకవిత్వ విశేషం గోమూత్రికాబంధం.


నా
సు
రో
యం

వా
నా
గో


సం
స్థో

రా
క్ష
సః

X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
నా
సు
ఖో
యం

వా
భో
గో


ణి
స్థో
హి
రా

సః


ఈ గోమూత్రికా బంధం ఒక తేలికైన బంధం. మీరు మొదటి రెండు పాదాలను ఒక వరుసగానూ చివరి రెండు పాదాలనూ ఒక వరుసగానూ వ్రాయండి. పై వరుస మొదటి అక్షరం, తరువాత క్రిందివరుస రెండవ అక్షరం, మళ్ళా పై వరుస మూడవ అక్షరం అలా కలిపి చరివితే అది పై వరుస అవుతుంది. (పైన పటంలో నీలం రంగులొ చూపిన అక్షరక్రమంలో చదవండి) అలాగే క్రిందివరుసనుండి అలాగే క్రిందికీ పైకీ అక్షరం మార్చి అక్షరం చదువుతూ పోతే మళ్ళా అది క్రింది పాదమే అవుతుంది. (పైన పటంలో ఆకుపచ్చరంగు అక్షరాలను క్రమంలో చదవండి).

ఇలా గోమూత్రికా బంధం కురరాలంటే పైవరుసలో సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలు క్రింది వరుసలోని సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలతో సరిగ్గా సమానంగా ఉండాలి.

ఈ విధమైన బంధానికి గోమూత్రిక అని పేరెందుకు వచ్చిందీ అన్న సందేహం వస్తుంది కదా.  గోజాతి నడుస్తూ మూత్రవిసర్జన చేసినప్పుడు క్రింద తన్మూత్రం చేసే చిత్రాకృతి ఇంచుమించు ఇలా ఉంటుంది కాబట్టి ఈ బంధానికి గోమూత్రిక అన్న పేరు.

నిజానికి ఈ‌ గోమూత్రికా బంధాన్ని మరికొంచెం జటిలంగా కూడా వ్రాస్తారు. పైన ఇచ్చిన పటంలో మధ్యవరుసలో X అనే గుర్తు పెట్టి చూపటం గమనించారు కదా.  ఆ స్థానాల్లో X బదులుగా అక్షరాలు వచ్చేలా వ్రాస్తే అది కూడా గోమూత్రికా బంధమే కాని వ్రాయటంలో ప్రయాస హెచ్చుగా ఉంటుంది.

అలాంటి జటిలమైన గోమూత్రికా బంధానికి ఉదహరణ ఒకటి మన ముక్కు తిమ్మన్న గారి పారిజాతాపహరణంలో ఉంది.

కం. విదళితదైత్య రమాగృహ
పదసారస వినతదేవ పతగేశహయా
చిదమిత చైత్యశమావహ
మదసరణ విమలభావమతపాశజయా (5-94) 

వి
ళి
దై

గృ

సా


దే

గే

త్య
మావి
యా
చి
మి
దైవా


భా

పా
ఈ రకమైన గోమూత్రికాబంధాన్ని చదివే విధానం ఏమిటంటే పైవరుసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అలాగే క్రిందివరసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అంటే మధ్యవరుసలోని అక్షరాలు పైవరుసకీ క్రిందివరుసకీ కూడా సమంగా వర్తిస్తాయన్నమాట.  పై కందపద్యం ఒక సారి పరిశీలనగా చూడండి. సరిస్థానాల్లో మొదటి రెండు పాదాల్లో ఏఏ అక్షరాలున్నాయో సరిగ్గా అవే స్థానాల్లో అవే అక్షరాలు క్రింది రెండు పాదాల్లోనూ‌ ఉన్నాయి కదా.

బారవి మనమీద దయతలచి గోమూత్రికాబంధాన్ని రెండుపేటల్లో అల్లితే ముక్కు తిమ్మనార్యుడు మరో రెండాకులు ఎక్కువ చదివి నట్లున్నాడు. ఏకంగా తిమ్మన్నగారు మూడుపేటల గోమూత్రికాబంధం వ్రాసారు.శ్రీరామ ఖటకము


     ఖటకము.
     సదా రఘురాముని సన్నిధిలో
     ముదంబున నుండుట ముఖ్యముగా
     మదిం దలపోసెడు మాన్యులకుం
     దదన్యము తోచును తప్పనుచున్ఖటకము.

ఈ ఖటకవృత్తానికి గణవిభజన జ-జ-జ-వ అంటే గురులఘుక్రమం  IUI IUI IUI IU అవుతున్నది. పాదానికి 11అక్షరాలు. యతిస్థానం 8వ అక్షరం. అన్ని వృత్తాలకు వలె ప్రాసనియమం తప్పదు.

ఈ ఖటకవృత్తపు గురులఘుక్రమం IUI IUI IUI IU కదా, దీనిని మరొకవిధంగ విభజించి చూస్తే IU IIU IIU IIU అవుతున్నది. అంటే వ-స-స-స అన్న మాట.  తోటక వృత్తం గుర్తు,ంది కదా స-స-స-స అన్న గణ విభజనతో. ఇప్పుడు ఈ ఖటక తోటక వృత్తాల మధ్య చుట్టరికం కనిపిస్తున్నది కదా. తోటక వృత్తం గురులఘుక్రమం IIU IIU IIU IIU నుండి మొదటి లఘువుని తొలగిస్తే వచ్చే IU IIU IIU IIU కావటం జరిగి అది ఖటక వృత్తంగా మారుతున్నదన్న మాట. చాలా దగ్గరి చుట్టరికం కదా.  అందుకే ఈ‌ఖటక వృత్తం‌ నడక కూడా తోటక వృత్తం నడక లాగునే ఉంటుంది.

ఈ ఖటకవృత్తపు గురులఘుక్రమం IUI IUI IUI IU లో మొదటి లఘువును గురువుగా మారిస్తే వచ్చే గురులఘుక్రమం UUI IUI IUI IU త-జ-జ-వ అవుతున్నది కదా. అది వేరేగా మోటనకం అనే వృత్తం. దానికే‌కలికాంతం అనే మరొక పేరు కూడా ఉంది. యతిస్థానంలో‌మార్పు కూడా అవసరం లేదు!

ఖటక వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

15, జనవరి 2016, శుక్రవారం

భోగి పండుగనాడు కొత్త వృత్తం రామభోగి.


        రామభోగి.
        లేరు శ్రీరాముని సాటిగా
        ధారుణిం జూపగ వెవ్వరుం
        జేరుమా రాముని పాదముల్
        కోరుమా మోక్షము వేడుకన్రామభోగి.

ఈ‌ రామభోగి అనేది నేను కొత్తగా కల్పించుకున్న చిన్న వృత్తం

రామభోగికి గణవిభజన ర-భ-ర  . పాదానికి 9 అక్షరాలే కాబట్టి, యతిస్థానం అవసరం లేదు

ఈ భోగి వృత్తానికీ భౌరిక వృత్తానికీ దగ్గరి చుట్టరికం. దీని గణాలు ర-భ-ర ఐతే భౌరికానికి ర-ర-ర. ఆరవస్థానంలో ఉన్న లఘువును తీసి గురువును ఉంచితే అది భౌరికం అవుతున్నది!  ఆ భౌరికాన్ని విడిగా చూద్దాం.

ఈ రామభోగి వృత్తానికి గురులఘుక్రమం UIUUIIUIU. ఈ‌ గురులఘుక్రమం మరికొన్ని తెలిసిన వృత్తాలలో అంతర్భాగంగా ఉంది.

వృత్తం గురులఘుక్రమం
ఇంద్రవజ్రం UUI UUI IUI UU
ఉపేంద్రవజ్రం IUI UUI IUI UU
ఇందువంశ UUI UUI IUI UIU
నిమగ్నకీల IUI UUI IUI UUI
వంశస్థం IUI UUI IUI UIU
అంబుదావళి IIU IUU IIU IUI U
కరపల్లవోద్గత IUU IUU IIU IUI U
వృధ్ధవామ UUI UUI IUI UUI U
సార్థపాద UIU IUU IIU IUI U


ఇలా ఈ భోగివృత్తం మరితొమ్మిది వృత్తాల్లో అంతర్భాగం అవుతున్నది కాబట్టి చిత్రకవిత్వప్రియులకు ఇది మరింత ఆసక్తి కలిగించ వచ్చును.


13, జనవరి 2016, బుధవారం

ముకుళితకళికావళితో రామప్రశంశ.


     ముకుళితకళికావళి.
     పుట్టినా డనిన పుడమి పొంగునే
     గిట్టినా డనిన గిరులు క్రుంగునే
     పుట్టి రాఘవుని పొగడ నేర్వడా
     యట్టివా డవని కమిత భారమౌముకుళితకళికావళి.

ఈ ముకుళితకళికావళి వృత్తానికి గణవిభజన ర-న-న-ర అంటే పాదానికి 12అక్షరాలు. యతిస్థానం 7వ అక్షరం. ఈ వృత్తం గణవిభజన ర-న-న-ర లో ఉన్న గణాలు సౌష్టవగణాలైన ర (UIU) మరియు న (III) కాబట్టి గణాల ప్రకారం చూసినా గురులఘు క్రమం (UIU III III UIU) ప్రకారం చూసినా పాదంలో కూడా సౌష్టవం ఉంది. అంటే ఎడమనుండి కుడివైపున కైనా కుడినుండి ఎడమకైనా ఒకే గురులఘుక్రమం‌ అలాగే‌ అదే గణవిభజన వస్తుంది.

ఈ వృత్త పాదంలో మొత్తం 5+3+3+5 = 16మాత్రలు. ఎనిమిది మాత్రల తరువాత విరామం వస్తున్నది. బహుశః త్రిస్రగతి మఠ్యతాళం అనువుగా ఉండవచ్చునేమో.

ముకుళితకళికావళికి కల పూర్వకవిప్రయోగాల గురించి సమాచారం లేదు.


కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 4

దేవత లన్నాక రాక్షసులతో యుధ్ధాలు రాకుండా ఉండవు. రాక్షసు లన్నాక వాళ్ళకి లోకం మీద పడి అల్లకల్లోలం చేయకపోతే తోచదు. దేవతలతో తలపడక పోతే వాళ్ళకు తీట తీరటమూ‌ కుదరదు. ఒక్కో సారి రాక్షసులదే‌ పైచేయ్యి ఐనట్లూ కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు వస్తే దేవతలు పోయి శివకేశవుల ముందు గోడు వెళ్ళబోసుకుంటారు. అవసరం ఐన సందర్భాలలో విష్ణువు భూలోకానికి వచ్చి మరీ రాక్షసుల సంగతి చూస్తాడు. ఒక్కొక్క సారి శివుడే స్వయంగా ప్రమథగణాలతో సహా వెళ్ళి దేవతలకు యుధ్ధంలో సహాయం చేస్తాడు.  ఆ యుధ్ధాలలో‌ ప్రమథులకు రాక్షసులతో‌ యుధ్ధం మంచినీళ్ళ ప్రాయంగా ఉంటుంది. అదొక అట వాళ్ళకి.

అలాంటి ప్రమథులు శివుడితో పాటు పోయి అర్జునుడనే నారాయణాంశసంభూతుడితో తలపడి తలలు బొప్పి కట్టించుకొని పారిపోసాగారు.  కుమారస్వామి వాళ్ళకు నాయకుడు కాబట్టి వాళ్ళను మందలిస్తున్నాడు.

మీరేమో‌ రాక్షసులతోనే ఒక ఆటలాగా యుధ్ధం చేసే వాళ్ళే. ఎంత వీరుడైనా కానీ ఒక మనిషి ముందు నిలబడలేక పారిపోతారా? అని కోప్పడి ఇంకా ఇలా అంటున్నాడు.

మీరు కంగారు కంగారుగా పరుగులు పెడుతూ‌ పారిపోతుంటే, మీ‌ బడాబడా కత్తులమీద సూర్యకాంతి తళుక్కు తళుక్కు మని మెరుస్తూ మీ‌ ముఖాల కేసి చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓరి బడుధ్ధాయిలూ యుధ్ధంలోంచి పారిపోయేవాళ్ళకు కత్తులెందుకురా అని మిమ్మల్ని అవి పరిహాసం చేస్తున్నాయి సుమా.

వనేఽవనే వనసదాం
మార్గం మార్గముపేయుషామ్‌
బాణైర్భాణైః సమాసక్తం
శంకేఽశంకేన శామ్యతి

వనసదాం అన్న మాటకు వనాలు అనగా అడవుల్లో తిరిగేవారని అర్థం.  వనే+అవనే --> వనేఽవనే అవుతున్నది. ఇక్కడ అవనము అంటే రక్షణ అని అర్థం. వనే అన్న మాటకు మార్గం+ ఉపేయుషాం (దారిని పట్టిన వారికి) అన్న చోటి మార్గం తో‌ అన్వయం.  బాణైః + బాణైః  --> బాణైర్బాణైః అంటే (రివ్వు రివ్వుమని) చప్పుడు చేస్తూ పోయే బాణాలు అని అర్థం.  శంకే+అశం+కేన --> శంకేఽశంకేన అవుతోంది. అశం అంటే దుఃఖం. శంక అంటే తెలిసిందే‌,అనుమానం అని. కేన అంటే ఎలాగు అని ప్రశ్నార్థం.

ఈ‌శ్లోకం‌ భావం తెలుసుకుందాం. అడవుల్లో మృగాలుంటాయి. వనచరులైన మనుష్యులూ‌ ఉంటారు. వాళ్ళ సంచారానికి అనువైన మార్గాలు కొన్ని అడవిలో గుర్తులుగా తెలుస్తూనే ఉంటాయి. ఆ మార్గాలు వాళ్ళ గుంపులు సంచరించే మార్గాలు కాబట్టి వాటిలో తిరుగున్నంత కాలం ఆ వనచరులకు ఆ అడవుల్లో కొంతగా రక్షణ ఉంటుంది. దారితప్పి తిరిగితే వాళ్ళకూ‌ భయమే అడవుల్లో. ఇప్పుడు మీరంతా అలాంటి సురక్షితమైన దారుల్ని ఈ అడవులో వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నారు అని ప్రమథులపై కుమారస్వామి ఆక్షేపణ. అలా తలదాచుకుందుకు పరిగెట్టే మీకు చేతులో దనుస్సులూ మూపున వాడిబాణాలూ‌ ఎందుకూ? రివ్వురివ్వున చప్పుళ్ళు చేస్తూ‌ శత్రువులను హడలెత్తించే బాణాలతో‌ కూడిన అమ్ములపొదులు మీ‌ మూపున ఉన్నా ఏమీ లాభం లేకుండా ఉందే? మీ‌ కష్టం ఎలా తొలగుతుందా అని నాకు అనుమానం వస్తోంది అని కుమారస్వామి తన వీరులపైన జాలి పడుతున్నాడు.

చేతిలో‌ తళతళల కత్తులూ మూపున వేగంతోనే భయంకరమైన చప్పుళ్ళు చేసే‌ బాణాలూ ఉన్న మీకు ఎంత కష్టం వచ్చిందీ అని కుమారస్వామి ఎత్తిపొడుపు.

ఈ శ్లోకంలో‌ కూడా యమకాలంకారం ఉంది.

ఐతే ఇక్కడ యమకానికి వాడిన అక్షరసముదాయాలు వెంటవెంటనే‌ పాదం మొదటనే రావటం చూస్తున్నాం. దీన్ని పాదాది యమకం అంటారు. సంధికార్యాలవలన యమకం సాధించటం కొన్నిచోట్ల చూస్తున్నాం. వనేమార్గే అంటే అడవిదారిలో అనీ, మార్గముపేయుషాం అంటేదారి వెతుక్కుంటున్నారనీ అర్థవైచిత్రి ఒకటి చూస్తున్నాం, అలాగే బాణైః అన్నపదాన్నే రెండుసార్లు వరసగా ప్రయోగించినా అర్థాలు వేరుగా తీసుకున్నాడు కవి.అల్పాక్కరకు సరిపోయే వృత్తలక్షణాలు.


అల్పక్కరకు గణవిభజన ఇం-ఇం-చం. అంటే రెండు ఇంద్రగణాలు, ఆపైన ఒక చంద్రగణం. ఇంద్రగణాలంటే భ,ర,త అనే మూడు త్రికగణాలూ, నల,నగ, సల అనే నాలుగక్షరాల గణాలూ అన్నవి. ఇవి మొత్తం 6. చంద్రగణాలు మొత్తం 14. అవి నగగ, నహ, భల, సలల, భగ, మల, సవ, సహ, తల, రల, నవ, సలల, రగ, తగ అనేవి. చంద్రగణాలు తెలుగులో వాడుకలో లేవు. అందుచేత అక్కరల వాడుక కూడా లేదు. మధ్యాక్కర కొద్దిగా వాడబడినా అది కూడా క్రమంగా మరుగున పడి ఇటీవలి కాలంలో కొంచెం‌ ఆదరణకు నోచుకుంది. మధ్యాక్కరలకు ప్రాచుర్యం కల్పించినది శ్రీవిశ్వనాథవారు ఆయన ఏకంగా మధ్యాక్కరలతో పది శతకాలు వ్రాసారు! ఐతే. మధ్యాక్కరలో‌ చంద్రగణం లేనేలేదు కాబట్టి ఇది అసలు ఒక అక్కర కానే‌కాదని కూడా అనవచ్చును.

ఏదైనా ఒక అక్కర పాదంలో చివరన ఉన్న చంద్రగణం గురువుతో అంతమయ్యే పక్షంలో (అంటే అది రగ, నగగ, తగ, సవ, భగ, నవ అనే వాటిలో ఒకటైతే) ఆ గురులఘుక్రమంతో ఒక వృత్తం కూడా సరిపోలవచ్చును. అంటే, ఆ వృత్తాన్ని వ్రాసినప్పుడు అది అల్పాక్కర క్రిందకూడా గణవిభజనకు సరిపోతుంది. అప్పుడు అది అటు సంస్కృతవృత్తమూ‌ ఔతుంది ఇటు తెలుగు ఛందస్సులోని పద్యమూ‌ అవుతుంది.

అల్పాక్కనే పరిగణనలోనికి తీసుకుంటేఒక వృత్తపాదం అల్పాక్కరకూ లెక్కకు వచ్చే విధంగా ఉన్న వృత్తాలను ఈ క్రింద ఒక పట్టికలో చూపుతున్నాను.

ఇంద్రగణాలు ఆరు. అవి రెండూ ,మనం గుర్వంతంగా ఉన్న చంద్రగణాలు ఆరూ తీసుకొంటున్నాం కాబట్టి  6 x 6 x 6 = 216 రకాల వృత్తాలకు అల్పాక్కరలతో పోలిక వచ్చే సందర్భం ఉంది. ఇందులో కొన్నే పేరుగల వృత్తాలు. అందుచేత వీటినే పట్టికలో చూపుతున్నాను.

సంఖ్య గురులఘుక్రమం అల్పాక్కర గణాలు వృత్తం పేరు వృత్త గణాలు
1IIIIIIIIIIIIUనల-నల-నలగహరవనితన-న-న-న-గ
2IIIIIIUIIIIUUనల-సల-నగగవిధురవితానమున-న-భ-స-గ
3IIIIIIUIUIUUనల-సల-రగపరిమితవిజయన-న-ర-య
4IIIIIIUIUUIUనల-సల-తగప్రభన-న-ర-ర
5IIIIUIIUIIUనల-భ-భగసుముఖిన-జ-జ-వ
6IIIIUIUIIIUUనల-ర-నగగనయమాలినిన-జ-భ-య
7IIIIUUIIIIUUనల-త-నగగకుసుమవిచిత్రన-య-న-య
8IIIUIIIUIIUIUనగ-నగ-సవసారసనావళిన-భ-జ-జ-గ
9IIUIIIIUIIIIUసల-నగ-నలగఉపసరసిస-న-జ-న-గ
10IIUIUIIUIUUసల-భ-రగపటుపట్టికస-జ-జ-గగ
11IIUIUIUUIUUసల-ర-రగవిహారిణిస-జ-త-గగ
12UIIIIIIIIIIUభ-నల-నలగభాసితసరణిభ-న-న-స
13UIIIIIIUIIUభ-నల-భగఅర్థశిఖభ-న-జ-వ
14UIIIIUIIIIUUభ-సల-నగగఅర్పితమదనభ-స-న-య
15UIIIIUIUIUUభ-సల-రగఅమందపాదభ-స-జ-గగ
16UIIUIIUIIUభ-భ-భగవిశ్వముఖిభ-భ-భ-గ
17UIIUUIIIIUUభ-త-నగగఅనుకూలభ-త-న-గగ
18UIUIIIIIIUIUర-నల-సవముకుళితకళికావళిర-న-న-ర
19UIUIIIUIIIIUర-నగ-నలగచంద్రవర్త్మర-న-భ-స
20UIUUIIUIIUర-భ-భగకేరంర-భ-భ-గ
21UIUUIUUIUUర-ర-రగహేమహాసర-ర-ర-గ
22UUIIIIIIIIIUత-నల-నలగరూపావళిత-న-న-స
23UUIIIIIIIIUUత-నల-నగగవిరతిమహతిత-న-న-య
24UUIUIIUIIUత-భ-భగపరిచారవతిత-భ-భ-గ
25UUIUIIUUIUత-భ-తగవర్హాతురత-భ-త-గ
26UUIUUIIIIUUత-త-నగగఉదితవిజోహత-త-న-గగ
27UUIUUIUUIUత-త-తగవిశాలాంతికంత-త-త-గ

భాసితసరణి వృత్తాన్ని దుఃఖభంజనకవి వాగ్వల్లభలో పేర్కొన్నాడని జెజ్జాల కృష్ణమోహన రావు గారు వ్రాసారు. ఈ వృత్తాల లక్షణాలన్నీ ఇక్కడ సంస్కృతంలో కనిపిస్తున్నాయి.

అంతర్జాలంలో ఛందం అని ఒక ఉపకరణం‌ ఉంది. దానిలో ఒక్కొక్క సారి పై వృత్తలక్షణం అందుబాటులో లేనప్పుడు అది అక్కరగా సరిపోయేలా ఉంటే అక్కర (ఉదా: అల్పాక్కర) అని చెబుతుంది. పై ఛందస్సుల లక్షణాలు అల్పాక్కరకూ వృత్తాలకూ కూడా సమానంగా కనిపిస్తున్నాయే మరి అల్పాక్కర అనాలా వృత్తం అనాలా అన్న ప్రశ్న వస్తుంది.

సంస్కృతంలో సుగంధి అన్న వృత్తం‌ ఉంది. గణవిభజన ర-జ-ర-జ-ర. మరొక విధంగా చెప్పాలంటే ఏడు హ-గణాల పిమ్మట ఒక గురువు.  తెలుగు పద్యఛందస్సులో ఉత్సాహం అని ఒకటుంది. దానికి గణవిభజన ఏడు సూర్యగణాల పైన ఒక గురువు. ఇప్పుడు గమనిస్తే సుగంధి పద్యాలన్నీ ఉత్సాహాలే అవుతున్నాయి. ఉత్సాహ పద్యాలన్నీ సుగంధికి సరిపో నక్కర లేదు. ఎందుకంటే సూర్యగణం అన్నాక హ-గణమూ న-గణమూ కదా. కాని సుగంధిలో‌అన్నీ హ-గణాలే‌ కాని న-గణం‌ లేదు. అందుచేత అన్నీ‌ హ-గణాలతో వ్రాసినప్పుడు అది సుగంధి అనే అనాలి కాని ఉత్సాహ అనకూడదు. ఇడే పధ్ధతిని అవలంబించాలి ప్రస్తుత సమస్య విషయంలో‌ కూడా.

ఒక సమవృత్తంలో‌ నాలుగు పాదాల్లోనూ ఒకే గురులఘుక్రమం ఉండాలి. అలా ఉంటే మనం అక్కరకు పోలినా వృత్తనామమే వాడాలి. నాలుగుపాదాల్లోనూ గురులఘుక్రమం ఏ కొద్దిగానో తేడా వచ్చి అది అక్కరగా మాత్రం సరిపోయినట్లైతేనే మనం అక్కర అనాలి.11, జనవరి 2016, సోమవారం

శ్రీరామోత్సుకము.


        ఉత్సుకము.
        రాముని నామమె చాలదా
        రాముని గాథలె చాలవా
        రాముని పాటలె చాలవా
        రాముని తత్త్వము నేర్పగన్ఉత్సుకము.

ఈ ఉత్సుకము అనే వృత్తానికి గణవిభజన భ-భ-ర. అంటే పాదానికి తొమ్మిది అక్షరాలు. కాబట్టి యతిస్థానం అక్కరలేదు. వృత్తం కాబట్టి ప్రాస పాటించవలసి ఉంటుంది. ఈ వృత్తానికే  మదనోద్ధురా అని మరొక పేరు.

భ-భ-ర అంటే మనకు ఉత్పలమాల గుర్తుకు రావాలి. దాని గణ విభజనలో భ-భ-ర అని వస్తుంది కదా, అందుకని.

పూర్వకవి ప్రయోగాలున్నాయా ఉత్సుక వృత్తానికి అన్నది తెలియదు.


9, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 3

అర్జునుడు చాలా మాసాలనుండీ తపస్సు చేస్తున్నాడు. అందువల్ల బాగా చిక్కిపోయి కూర్చున్నాడు. తనదగ్గర ఆయుధాలన్నీ ఉంచుకున్నా ఆయన వాటితో సాధన చేయటం లేదు కాబట్టి అభ్యాసం తప్పి ఉండాలి. అదీ కాక కొండలూ‌ అడవులూ వంటి ప్రాంతాల్లో యుధ్ధం చేయటం తమకు అలవాటైన వ్యవహారం‌ కాని పట్టణవాసి ఐన అర్జునుడికి కొత్తే‌ కదా. అదీ‌ కాక  తమను స్వయంగా దేవసేనాపతి ఐన కుమారస్వామివారు యుధ్ధానికి తీసుకొని వచ్చారు. అర్జునుడికి ప్రక్కన ఎవరూ వ్యూహకర్తలుగా లేరు. తామా మంచి బలగంగా ఉన్నారు. అర్జునుడా ఒంటరిగా ఉన్నాడు. పైగా ఈ యుధ్ధాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడే ప్రోత్సహించి స్వయంగా దానిలో‌ పాల్గొన వచ్చాడు. ఇంక తమకు తిరుగేముంది. అర్జునుడికి తమతో తలపడటం ఎలాసాధ్యం?

ఇలా ఆలోచించారేమో ప్రమథులు. కాని అర్జునుడు వాళ్ళమీద విరుచుకుపడి వాళ్ళ ధైర్యాన్ని క్షణంలో మటుమాయం చేసాడు. హఠాత్తుగా అనుకోనిది జరిగితే ఎంతవారూ వెనుకంజ వేయక తప్పుతుందా? దానితో ప్రమథగణం పలాయనం చిత్తగించసాగారు. అప్పుడు చిరాకుపడి కుమారస్వామి వాళ్ళని మందలించి యుధ్ధానికి పురికొల్పటానికి పూనుకొని ఇలా అంటున్నాడు.

మా విహాసిష్ట సమరం
సమరంతవ్యసంయతః
క్షతం క్షుణ్ణాసురగణై
రగణైరివ కిం యశః 

ఇది ఈ కిరాతార్జునీయం, పదిహేనవ సర్గలోని 8వ శ్లోకం.

దీని భావం ఏమిటంటే, మీరెంత గొప్ప వీరులో మీకు గుర్తుందా? మీరంతా యుధ్ధాన్నీ ఆటనీ సమానంగా చూస్తారని పేరే!  అలాంటిది మీరు ఇప్పుడు యుధ్ధరంగం  నుండి పారిపోతారా? యుధ్ధం వదిలిపోవద్దు. మీరంతా అసురగణాల్ని క్షుణ్ణం చేసేవారే (అంటే పొడిచేసేవారే అని) అలాంటిది మీరే ఒక గణంగా (ఒక జట్టుగా) నిలబడలేక తలొకదారీ పడుతున్నారా? ఇలా సామాన్యుల్లాగా ప్రవర్తించి మీ‌ కీర్తికి నష్టం కలిగించే పనిని మీరే స్వయంగా చేస్తున్నారు సుమా అంటున్నాడు కుమారస్వామి.

ఇప్పుడు ఈ శ్లోకంలోని విశేషం చూదాం.

శ్లోకంలో‌ కొన్ని చోట్ల క్రీగీటులు పెట్టంట‌ం‌ జరిగింది గమనించారు కదా?  మొదటి పాదం చివర సమరం అని వచ్చింది. ఆ సమరం అనే దానితోటే రెండవపాదం మొదలయ్యింది. మూడవపాదం చివర రగణై అని అన్నది ఉన్నది కదా అదే నాలుగవపాదం మొదట్లోనూ వచ్చింది.

ఇలా కొన్ని పదాలు లేదా పదభాగాలు మళ్ళామళ్ళా రావటాన్ని యమకం అంటారు. ఇక్కడ ఉన్న యమకం విశేషాన్ని పాదాంతాది యమకం అంటారు. పాదాంతం అంటే పాదం చివర అనీ పదాది అంటే పాదం మొదట అని అర్థం.

యమకం అనేది ఒక అలంకారం. మనకి అలంకారం అంటే నగ అన్న సామాన్యార్థం తెలుసు. కావ్యాల్లో అలంకారం అన్నమాటకు అర్థం చూదాం.

పాఠశాలల్లో తెలుగు నేర్చినప్పుడు ఉపమా ఉత్ప్రేక్షా అంటూ కొన్ని అలంకారాలు హడలేసి చదివించి ఉంటారు కదా. మార్కుల చదువుల్లో అవి భట్టీయం వేసి హమ్మయ్య అని గట్టెక్కేయటమే‌ కాని రసదృష్టితో‌ వాటిని ఆలోచించే అవకాశమూ‌ మనకు ఆరోజుల్లో ఉండదు. దానికి తగిన పరిణతీ‌ మనకు అప్పుడు ఉండటమూ‌ అరుదే. అందుచేత ఇప్పుడు మరొకసారి అవసరమైనంతగా ఈ విషయాన్ని స్పర్శిద్దాం.

అలంకారాలను అసలు ఎందుకు ధరిస్తారు ఆడవాళ్ళు? "ఆ మాటకు వస్తే పూర్వం మగవాళ్ళూ ఆడవాళ్ళతో పోటీగా సమానంగానే నగలు ధరించే వారు. ఇప్పుడు వాళ్ళకు చేయించటానికే ఎక్కడి డబ్బులూ సరిపోవటం లేదు కాబట్టి మగాళ్ళు నగలు వేసుకోవటం మానేసా"రని ఒకసారి మానాన్నగారు చమత్కరించారు. అది సరే, ఎందుకు ధరిస్తారు నగలు అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం అందం కోసం అని. అందగా ఉన్నా అలంకారాలు ధరిస్తూనే ఉన్నారే మరి?  అలాగంటే, అలంకారాలవలన అందం ఇనుమడిస్తోంది కాబట్టి అని సమాధానం.

అలాగే కావ్యం యొక్క సౌందర్యం దానిలోని రసమే. ఆ రసాన్ని అవిష్కరించేవి కథా, కథాగమనమూ, కవితాపుష్ఠీ వగైరా. ఐతే ఒక రసపుష్ఠి కల కావ్యానికి కూడా దాని సౌందర్యాన్ని ఇనుమడింప జేయటానికి కొన్నికొన్ని కవితాప్రక్రియలను కవులు వాడుక చేస్తూ ఉంటారు. అవి అనేక రకాలు. అన్నింటి గురించీ వ్రాయటానికి ఇది సందర్భం కాదు. కాని వాటిలో ముఖ్యమైనవి కావ్యానికి శోభను ఇనుమడింప జేసేవి కొన్ని విధానాలను అలంకారాలు అంటారు. అవి సాధారణంగా మాటలపొందిక కారణంగా చేసే చమత్కారాలూ (అంటే శబ్దాలంకారాలు) అలాగే చిత్రవిచిత్రమైన భావనలనూ అన్వయాలనూ చూపటంతో చేసే చమత్కారాలూ (అవి అర్థాలంకారాలు) అంటారు. ఇవి చదువరులకు మరింత అహ్లాదాన్ని కలిగిస్తాయి. అప్పుడు కావ్యం‌ మరింతగా బాగుంటుంది. భలే అందమైన కావ్యమే‌ అని మనచేత అనిపిస్తాయీ ఈ‌ అలంకారాల చమత్కారాలు.  అందుచేత కావ్యంలో అలంకారం అంటే సౌందర్యం అనే అర్థం చెప్పుకోవాలి. ఉన్న కావ్యగత సౌందర్యానికి ఈ‌ అలంకారాలు జోడింపు సౌందర్యాలన్నమాట.

అందుకనే వామనుడు తన కావ్యాలంకారసూత్రంలో సౌందర్యమలంకారః అని చెప్పాడు. వాచా ఈ మాటల కర్థం అలంకారం అంటే సౌందర్యం అనే.

అలంకారశాస్త్రగ్రంథం ఐన అలంకారసర్వస్వం అని ఒకటుంది. దాన్ని వ్రాసింది 12వ శతాబ్దం వాడైన రుయ్యకుడు.  ఎందకనో కాని ఆయనను రాజానక రుయ్యకుడు అని పిలుస్తారు. అందులో ఆయన యమకానికి నిర్వచనంగా "స్వరవ్యంజనసముదాయపౌనర్యుక్తం యమకమ్‌" అని చెప్పాదు.

స్వరములు అంటే అచ్చులు . అ, ఆ.. మొదలైన అచ్చులు.
వ్యంజనాలు అంటే హల్లులు. క, ఖ,గ,ఘ... మొదలైనవి.
సముదాయం అంటే ఒకటి కన్న ఎక్కువగా ఉండటం.
స్వరవ్యంజన సముదాయం అంటే ఒకటికన్న ఎక్కువ అక్షరాలలో అచ్చులు హల్లుల వరుస అని.
పునరుక్తి అంటే చెప్పినదే మళ్ళా చెప్పటం.
పౌనర్యుక్తం అంటే ఏవైనా మరలా మరలా చెప్పబడినవి అని అర్థం.
ఇప్పుడు స్వరవ్యంజన సముదాయ పౌనర్యుక్తం అంటే వరుసగా ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో అచ్చులూ‌ హల్లులూ పునరుక్తిగా వచ్చిన సందర్భం అన్నమాట.
దీనినే రుయ్యకుడి సూత్రం యమకం అంటోంది.

వరుసగా కొన్ని అక్షరాలు సామ్యంగా (అవే అచ్చులూ హల్లులుగా) ఉండటం అన్నారు కాని అవే పదాలు అనలేదు. ఇది బాగా గమనించాలి మనం.

ఇలా సామ్యం కల భాగం పూర్తి మాట కానక్కరలేదు. అందుచే ఆ ఫణంగా దానికొక అర్థం ఉండవలసిన పనిలేదు. ఒకవేళ పూర్తిమాట ఐతే  కూడా కావచ్చును. అభ్యంతరం‌ లేదు.

పునరుక్తి అంటున్నాం కదా, ఒక చోట పూర్తిమాటగా ఉండి మరొక చోట అంతకన్నా పెద్దపదంలో భాగం కావచ్చును. అందుచేత ఒకచోట ఆ అక్షరసముదాయం అర్థవంతంగా ఉండి మరొకచోట ఉండకపోవచ్చును.  ఒకవేళ రెండుచోట్లా పూర్తిగా అదే పదం ఐన పక్షంలో వేరు వేరు అర్థాలు చెప్పుకొనేలా ప్రయోగించబడాలి.

ఇక్కడ పరిస్థితి చూదాం.

మావిహాసిష్ట సమరం అన్నప్పుడు సమరం అన్నది యుధ్ధం అన్న అర్థంలో ఉన్నది. వెంటనే రెండవపాదంలో సమరంత అన్న చోట  సమ రంత అని రెండు మాటలున్నాయి. సమ అంటే తెలిసిందే సమానంగా అని. రంత అంటే క్రీడించే వాడు అనీ అర్థం. సమరంత అన్న సమాసోక్తిగా చూస్తే సమరం అన్న అక్షరసముదాయం వచ్చింది.

అలాగే  క్షుణ్ణాసురగణైః అని మొదటి ప్రయోగాన్ని క్షుణ్ణ + అసుర గణైః అని విభజించుకోవలసి ఉంది. వెంటనే వచ్చే రెండవ ప్రయోగం కొంచెం చిత్రం. ఎందుకంటే గణైః + అగణైః అన్న చోట సంధి కార్యం వలన గణైరగణైః అయ్యింది ఈ ర- నుండి నాలుగవ  పాదం మొదలై రగణై అన్న అక్షరసముదాయం పునరుక్తి ఐనది.

ఈ విధంగా కవి ఇక్కడ యమకం అన్న అలంకారాన్ని వాడాడు.

ఈ శ్లోకంలో శబ్దాలంకారం ఉన్నది కాని చిత్రకవిత్వం లేదు. నిజమే. కాని ప్రతిశ్లోకంలోనూ‌ ఉండక్కర్లేదుగా. అత్యథికశాతం శ్లోకాల్లో ఉన్నాయి. మొత్తం మీద శ్లోకాని కొక తీరున చిత్రంగా అనిపించే విధంగా ఈ‌ సర్గ అంతా ఉంటుంది. అందుచేత చిత్రకవిత్వం నేరుగా లేదు కదా అని ఈ‌ శ్లోకాన్ని టూకీగా తేల్చకుండా విస్తృతంగా వ్రాయవలసి వచ్చింది. మొత్తం సర్గకు మనం వ్యాఖ్యానించుకున్నాక మరలా అన్ని శ్లోకాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఈ‌ సర్గయొక్క వైభవం కవి యొక్క కవితాపాటవం మనకి బాగా అనుభూతిలోనికి వస్తాయి. ముఖ్యంగా యమకాలతో అక్షరాలా సర్కసుఫీట్లు చేయించటమూ మనం బాగా ఆనందించగలం.శ్రీరామ మణిమధ్యం.


   మణిమధ్యము.
   మానవుడా యో మానవుడా
   మానక శ్రీరామా యనరా
   దేనికయా సందేహము వే
   రైనది మంత్రంబా చెపుమామణిమధ్యం.

ఈ వృత్తానికే మణిబంధం అనే మరొక పేరు కూడా ఉంది.

ఈ‌మణిమధ్య వృత్తానికి గణవిభజన భ-మ-స. కాబట్టి గురులఘుక్రమం UII UUU IIU. దీని పాదానికి తొమ్మిదే అక్షరాలు. పాదదైర్ఘ్యం పదక్షరాలలోపే కాబట్టి యతిమైత్రి అక్కరలేదు. కాని వృత్తాలన్నింటికీ‌ ప్రాసనియయం ఎలాగూ తప్పని సరి.

దీని పాదంలో గురులఘుక్రమం  UII UUU IIU అని కాక UIIU U UIIU అనిచూడంటం సముచితంగా ఉంటుంది. అంటే భగ-గ-భగ అని అన్నమాట. ఇలా చూడటం వలన నడకను సులువుగా అంచనా వేయటానికి వీలవుతుంది.

ఒక తమాషా ఏమిటంటే ఈ‌గురులఘుక్రమం  UII UUU IIU అనేది ఎడమనుండి కుడికి బదులు కుడినుండి ఎడమకు చదివినా తేడా రాదు. అద్దం ముందు బింబప్రతిబింబ సామ్యం అన్నట్లు.

ఆధునికులు  జెజ్జాల కృష్ణ మోహన రావు గారి మణిమధ్య వృత్తాలు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి.

ఈ మణిమధ్యానికి 5వ స్థానాన్ని యతిమైత్రికి స్వీకరిస్తే బాగుంటుందని జె.కె.మోజనరావుగారి అభిప్రాయం, కాని నిజానికి అంతకంటే 6వ స్థానమే బాగుంటుంది  . మణిమధ్యంలో ఉన్న మధ్య గురువును రెండులఘువులుగా మారిస్తే అది చిత్రగతి లేదా పంక్తి వృత్తం‌ అవుతున్నది. అలా మణిమధ్యంతో ఆంతరంగిక మైత్రికల చిత్రగతికి ఆయన ఆయన తీసుకున్న యతిమైత్రి 7వస్థానం. ఆ సంగతి కూడా మణిమధ్యానికి 6వస్థానాన్నే యతిస్థానానికి ఉచితం అని బలపరుస్తోంది. ఇప్పటికే మనం పంక్తి వృత్తం చెప్పుకున్నాం . కాని నిజానికి పదక్షరాలలోపు పాదానికి యతిమైత్రి అవసరం కాదు. ఇక్కడ నేను వ్రాసిన పద్యంలో 6వ స్థానం యతిమైత్రి కూర్చటం కేవలం ఐఛ్ఛికమైన వ్యవహారంగానే భావించండి.

ఈ మణిమధ్యంలో మొత్తం మాత్రల సంఖ్య 14. చివరి గురువు మరొక రెండుమాత్రలు అధికంగా ధ్వనించి మొత్తం‌16 మాత్రలిగా దీని నడక చతురస్రగతిలో ఉంటుంది.

మానవు డా ఓ మానవు డా
మానక శ్రీరా మా యన రా
దేనిక యా సం దేహము వే
రైనది మంత్రం బా చెపు మా8, జనవరి 2016, శుక్రవారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 2

అర్జునుడితో తలపడి తలలు బొప్పికట్టించుకొని కుయ్యోమొఱ్ఱో అని ప్రమధులు ఆయుధాలనుకూడా పారేసి పారిపోయారని చదువుకున్నాం. వాళ్ళకి తమపక్షాన సాక్షాత్తూ పరమశివుడే ఉన్నాడు కదా భయం దేనికి అన్న ఆలోచన కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ సేనాపతి దేవసేనాని కుమారస్వామి నాయకత్వం వహిస్తూ అక్కడే వాళ్ళమధ్యనే ఉన్నా వాళ్ళెవరూ ఆ సంగతే ఆలోచించలేదు. పారిపోయారంతే. సరే లెండి, అసలు అక్కడ సాక్షాత్తూ శివుడున్నా వాళ్ళు పారిపోయారంటుంటే కుమారస్వామి గురించి ఎందుకు అనటం?

అలా పారిపోతున్న వాళ్ళ మీద అర్జునుడికి కాస్త దయ కలిగిందని కదా అన్నాడు కవి? అవును మరి. గొప్పగొప్ప వాళ్ళు అసలే బాధలో గోలపెడుతున్నవాళ్ళని మరింతగా బాధించటానికి ప్రయత్నిస్తారా ఏమిటి? ప్రయత్నించరు కదా. అందుకే అర్జునుడు కూడా వాళ్ళని కొంచెం మెల్లమెల్లగానే అదిలించాడు. అంతే కాని ఆ వెన్ను చూపుతున్న వాళ్ళని మరీ ఏడిపిస్తూ వాడిబాణాలతో వేగంగా తరమలేదు.

ఇదంతా చూసి శివుడు నవ్వుకున్నాడేమో. కాని కుమారస్వామికి మాత్రం ఉక్రోషం వచ్చి ఒళ్ళు మండిపోయింది. తన సమక్షంలోనే తన సైన్యం తననీ కనీసం శివుణ్ణైనా లెక్కపెట్టకుండా పొలోమని యుధ్ధరంగం నుండి పరిగెత్తటమా? వెంటనే ఆయన ఆ పారిపొతున్న సైన్యం ముందుకు వేగంగా వెళ్ళి నిలబడి అదిలించాడు. వాళ్ళు కొంచెం సంశయంగా అగగానే వాళ్ళకు గట్టిగా పాఠం చెప్పటం మొదలు పెట్టాడు.

అథాగ్రే హసితా సాచి
స్థితేన చిరకీర్తినా
సేనాన్యా తే జగదిరే
కించిదాయస్త చేతసా

ఈ శ్లోకం‌ యొక్క భావం ఎమిటంటే, చిరస్థాయిగా ఉండే గొప్పకీర్తికల ఆ  కుమారస్వామి, తన సైన్యం దురవస్థ చూసి, వాళ్ళ ఎదుటకు వెళ్ళాడు. అయన మనస్సు కొంచెం‌ బాధతో ఉంది. ఐనా నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన వాళ్ళకు ధైర్యం చెప్పటానికి గాను ఇలా మాట్లాడుతున్నారు అని.

ఈ శ్లోకంలో చిత్రంగా ఉండే సంగతి ఏమిటబ్బా అని అడుతున్నారు కదా?

ఇది ఒక నిరోష్ఠ్య శ్లోకం. అర్థం కాలేదా? ఓష్ఠం అంటే పెదవి. ఓష్ఠ్యం అంటే పెదవుల సహాయంతో కుదిరేది అని అర్థం. నిరోష్ఠ్యం అంటే పెదవుల సాయం అక్కర్లేనిది అని.

ఈ శ్లోకాన్ని పైకి చదవండి. పెదవులు కదపకుండానే మొత్తం శ్లోకం‌ నడిచింది కదా?

అదే ఇక్కడి విశేషం.

లాక్షణికులు చెప్పేది ఏమిటంటే ఏ మాట(ల) కైతే ప-వర్గమూ (అంటే ప,ఫ,బ,భ.మ) , వ, ఉ,ఊ, ఒ,ఓ అనే అక్షరాలూ వాడమో అవి నిరోష్ఠ్యాలు అని. మొత్తం శ్లోకమైనా తెలుగుపద్యమైనా అలా వ్రాస్తే అది నిరోష్ఠ్యం అనిపించుకుంటుంది.

నిరోష్ఠ్యం గా పద్యం వ్రాసినా శ్లోకం వ్రాసినా అదీ చిత్రకవిత్వమే అవుతుంది.

దండి అనే‌ కవి సంస్కృతంలో దశకుమారచరితం అని ఒక అద్భుతమైన కావ్యం వ్రాసాడు. అందులో అనేక కథలున్నాయి. ఒక కథ మంత్రగుప్తుడు అనే సాహసి గురించినది. ఆ మంత్రగుప్తుడు సాహసయాత్రల్లో ఒకదానిలో ఒక అందమైన అమ్మాయిని సంపాదించుకున్నాడు. సరసంలో భాగంగా ఆ పిల్ల మంత్రగుప్తుడి పెదవి కొరికింది. కొంచెం ప్రేమ ఎక్కువైనట్లుంది. అందుకని పెదవి చిట్లింది. ఒక వైపు బాధ, మరొకవైపు ఆనందం ఆ మహానుభావుడికి. సరే అతను ఆ అమ్మాయికి కథ చెప్పటం‌ మొదలు పెట్టాడు. కాని ఎట్లా పెదవులు కలిపితే బాధ కలుగుతుందే! అందుకని దండి ఆ మంత్రగుప్తుడి పాత్రతో చెప్పించిన కథ అంతా నిరోష్ఠ్యంగా వ్రాసాడు. చూసారా మరి. సారస్యం అంటే అదీ. ఎవరండీ పాత కవుల భావుకతని ఎగతాళి చేసేదీ?

మీరు కందుకూరి వీరేశలింగం‌ పంతులు గారి పేరు వినే ఉంటారు కదా. ఆయన గురించి నాలుగు మాటలు చెప్పమంటే ఆయన సంఘసంస్కరణాకార్యక్రమాల గురించి చెబుతారు కదా? ఐతే మరొక సంగతి కూడా ఆయన గురించి ఈ సారి చెప్పండి. వీరేశలింగం పంతులు గారు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచననైషధము అని ఒక అచ్చతెలుగు కావ్యం వ్రాసారు. అంటే ఒట్టుపెట్టుకొని ఒక్క సంస్కృతం ముక్కా ఎక్కడా రాకుండా  నలుడి చరిత్రను ఏకంగా ఒక కావ్యంగా వ్రాసారన్న మాట. అదే గొప్ప విశేషం ఐతే అంతకన్నా గొప్ప విశేషం, అది నిరోష్ఠ్యకావ్యం కావటం. అంటే ఆ కావ్యం మొత్తం మీద ఎక్కడా ప, ఫ, బ,భ, మ, వ ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరాలు లేవు. అన్నట్లు నిర్వచనం అని కూడా ఆ గ్రంథం పేరులో ఉంది కదా. దానర్థం పద్యాలు తప్ప వచనంగా పంతులు గారు ఎక్కడా వ్రాయలేదన్నమాట. సామాన్యమైన సంగతి కాదు కదా ఈ కావ్యం ఆయన వ్రాయటం?

శాకల్యమల్లయ్య భట్టు అనే కవి నిరోష్ఠ్య రామాయణం వ్రాసాడు.

మరింగంటి సింగనాచార్యులు శుద్దాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం కావ్యం రాశారు.

వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు నిరోష్ఠ్య కావ్యాలు వ్రాసారని విన్నాను వివరాలు తెలియవు.

నల్లంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనరసింహాచార్యులు అనే‌ కవి గారు శుద్ధాంధ్ర నిర్గద్య నిరోష్ఠ్య కేకయ రాజనందన చరిత్రం అనే గ్రంధం వ్రాసారు. నిర్గద్యం అంటే గద్యం లేనిది అని. నిర్వచనం అన్నా అర్థం అదే.

ఇలా నిరోష్ఠ్యంగా ఒక పద్యమో శ్లోకమో వ్రాయటమే‌ కాదు, ఏకంగా కవులు కావ్యాలే వ్రాసారు.

ఇప్పుడు మరొకసారి భారవి ఇచ్చిన ఈ‌నిరోష్ఠ్యశ్లోకాన్ని పెదవులు అస్సలు కదపకుండా హాయిగా చదివి ఆనందించండి. మీదే ఆలస్యం. ఇంకా కొంచెం అనుమానం ఉన్న వాళ్ళకి ఒక ఉపాయం చెప్పనా, పెదవుల సంగతి అలా ఉంచండి. పళ్ళను గిట్టకరచుకొని ఈ‌ శ్లోకాన్ని చదివిచూడండి, పెదవులతో‌ పని లేకుండా ఎలా పనిజరిగిపోతుందో.