30, జనవరి 2016, శనివారం

రామభుజంగప్రయాతము.        భుజంగప్రయాతము.
        సదా భక్తిమై రామచంద్రుం‌ భజింపం
        హృదిం బ్రీతిమై నిల్పియేవేళ వేడ్కన్
        వదాన్యుండు కారుణ్యవారాశి యిచ్చున్
        ముదం బొప్ప పాపౌఘముల్ గూల్చి ముక్తిన్

      భుజంగప్రయాతము.

ఈ‌ భుజంగ ప్రయాతవృత్తానికి గణవిభజన య-య-య-య. అంటే పాదానికి 12అక్షరాలు. గురులఘుక్రమం IUUIUUIUUIUU. యతిస్థానం 8వ అక్షరం.

ఈ‌ భుజంగప్రయాతవృత్తానికి  అప్రమేయ అని మరొక పేరు కూడా ఉందని తెలుస్తోంది.

తెలుగుకవులు  భుజంగప్రయాతాన్ని బాగానే ఆదరించారనే చెప్పాలి. పోతన్నగారి భాగవతంలో‌ పరీక్షిత్తు జననం నుండి ఒక భుజంగప్రయాతం.

    హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
    భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
    జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
    వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.

అధునికులు నేమాని రామజోగిసన్యాసిరావుగారి పద్యం.

    మహానంద వారాశి, మాయావిలోలున్
    మహర్షివ్రజ స్తూయమాన ప్రభావున్
    మహీజా హృదంభోజ మార్తాండు, రామున్
    మహీశాధినాథున్ క్షమాపూర్ణు గొల్తున్.2 కామెంట్‌లు:

  1. బాగుంది. అంబురుహం చెప్పండి. మిమ్మల్ని వృత్తం అడగడమే మాకు పరీక్ష. మీరోగంటలో వృత్తం చెప్పేస్తే మాకు చదవడం, అర్ధం చేసుకో౦వడం పెద్ద పనులాయె! అందుచేత మేమడిగినా మీరురాసినా వృత్తాలని షెడ్యూల్ చేసి ఉంచెయ్యండి. రోజుకొకటో రెండో వృత్తాలు నియమిత కాలం లో వచ్చేలా చూడండి, మిమ్మల్ని కొద్దిగా అనుసరించగలం అనుకుంటా.
    ఇది విన్నపం సుమా

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.