31, డిసెంబర్ 2015, గురువారం

విశేషవృత్తాలు 50 పూర్తయ్యాయి.


ఈ రోజు 2015-12-31తో పాహిరామప్రభో శీర్షికలో వెలువడుతున్న విశేషవృత్తపద్యాల వరుస నిరంతరాయంగా కొనసాగి 50వ పద్యంగా శ్రీ వృత్తం వెలువడింది. ఈ శీర్షికను ఆదరిస్తున్న పాఠకులకు ధన్యవాదాలు.


ఇప్పటి వరకు వచ్చిన 50 వృత్తాల పట్టిక


అజితప్రతాపముఅలసగతి ఇంద్రవంశం కుమారలలితకుమారవిలసిత
కౌముదిచంద్రవర్త్మచిత్రపదం జలదము తరళము
తోటకముత్వరితగతి ద్రుతవిలంబితం నర్కుటము నవమాలిని
పదమాలి పాదపము ప్రమాణి పంక్తిబింబము
భద్రకము భోగవిలసితమయూరసారి మాణవకంమానిని
మణిరంగము మాలిని మంగళమహాశ్రీ మదనవిలసితము మధుమతి
మంజులయాన రథోధ్ధతము లయగ్రాహి లలిత వసుంధర
వంశస్థము వినయము విభూతివిమానం సుకాంతి
సుందరిసింహగతి సింహరేఖ స్రగ్విణి సుకేసర
స్వాగతం శిఖరిణిశ్రీశ్రీపెంపు / స్త్రీహంసమాలి


ఇంకా రావలసిన విశెషవృత్తాలు చాలానే ఉన్నాయి.

శ్రీరామార్పణమస్తు.


శ్రీరామ శ్రీవృత్తం


      శ్రీ.
      రా
      మున్
      గొ
      ల్తున్
శ్రీ.

వృత్తాలన్నింటిలో అతి చిన్న వృత్తం ఏదీ అని ఎవరన్నా ఏదైనా పోటీపరీక్షలో అడుగుతారో లేదో తెలియదు. టివీషోల్లో వినిపించే తెలుగే అదొకరకం షోకుగా కాస్త తెలుగు వచ్చినవాళ్ళకి వింతగా ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్నని టివీలవాళ్ళు అడిగే అవకాశం లేదు. ఒకవేళ ఎవడికీ తెలియని ప్రశ్న కావాలికదా అని ఏ కోటి రూపాయల ప్రశ్న కోసమో అలా అడగ వచ్చును. ఒకవేళ ఎవరైనా అడిగితే సమాధానం ఒకటే, వృత్తాలన్నింటిలో అతి చిన్న వృత్తం 'శ్రీ' వృత్తం!

శ్రీ వృత్తానికి గణ విభజన 'గ'. అంటే ఒకే ఒక గురువు. పాదం నిడివి ఒకే ఒక అక్షరం. వృత్తం అయ్యేది కాకపోయేది ఒక అక్షరం‌కన్నా చిన్న పాదం కల పద్యం అంటూ ఒకటే తప్ప రెండవది ఉండే అవకాశం ఐతే‌ ఉండటానికి వల్లకాదు కదా!

వృత్తం అన్నాక ప్రాసనియమం తప్పదు అంటూ‌ ప్రతిసారీ వ్రాస్తున్నాను కదా, ఈ‌సారి అలా వ్రాయటానికి కూడా అవకాశం లేదు! ప్రాస అంటే పాదంలో రెండవ అక్షరం. ఉన్నది శ్రీ వృత్తానికి పాదానికి ఒకే అక్షరం‌ కాబట్టి ప్రాసనియమం ప్రశ్నే లేదు.

అన్నట్లు మరొక విశేషం కూడా ఉంది ఈ‌ శ్రీ వృత్తం విషయంలో. అందరు లక్షణ కారులూ ఈ‌వృత్తానికి ఈ‌పేరే చెప్పారు. ప్రతి వృత్తానికి సాధారణంగా వీళ్ళలో ఒకరైనా వేరే పేరు పెట్టటం చూస్తున్నాం‌ కదా. ఇక్కడ ఆ చిక్కును చూడం అన్నమాట.

వరసగా నాలుగు గురువులు వ్రాయగలరా? ఐతే అది పద్యం అవుతుంది. శ్రీవృత్తం అవుతుంది. మీరు కవి ఐపోతారు. ఎంత సులువైన దారో‌ చూసారా మరి!

రాముని శ్రీ పెంపు కనరండి.     శ్రీ పెంపు.
     రా మ 
     స్వామీ
     నా మా 
     టే మీ
శ్రీ పెంపు / స్త్రీ.

ఈ స్త్రీ వృత్తానికి గణవిభజన గగ. అంటే పాదానికి రెందు గురువులు మాత్రం. పాదం నిడివి రెండు కాని ఆపైన కాని ఉన్నప్పుడు ప్రాసనియమం‌ తప్పదు. పదక్షరాల లోపు పాదాల్లో యతినియమం అక్కర లేదు.

కావ్యాలంకారచూడామణి కారుడు ఈ వృత్తాన్ని శ్రీ పెంపు అనటం తప్ప మిగిలిన అందరు లక్షణకారులూ ఈ‌వృత్తానికి  స్త్రీ అన్న పేరే ఇచ్చారు. అంటే ఒకే వృత్తానికి వేరేవేరే పేర్లను పెట్టటం ఇక్కడి నుండే మొదలన్నమాట.

ఐనా, మనకు అనందం కలిగించే విషయం‌ ఒకటుంది ఈ వృత్తానికి సంబంధించి.  అదేమిటంటే, ఒక వృత్తానికి తెలుగుపేరు పెట్టటం. పెంపు అన్నది తెలుగు మాట కదా. అందుచేత మనం‌ తెలుగు వాళ్ళుగా సంతోషించాలి. సాధారణంగా కవులందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది వృత్తాల పేర్లన్నీ‌కేవలం సంస్కృతంలోనే ఉంటాయీ అని. ఈ శ్రీపెంపు వృత్తం ఆ నియమానికి మినహాయింపు అన్నమాట.

ఈ వృత్తనామ‌ శ్రీపెంపు గురించి ఒక ప్రశ్న రావాలి. వచ్చింది కూడా. శ్రీ పెంపు దుష్ట సమాసమా ? అని.  శ్రీ అనేది తెలుగు పదం‌ కాదు సంస్కృతపదం. పెంపు అనేది తెలుగుపదమే. సంస్కృతపదం తరువాత తెలుగుపదం వేసి సమాసం చేయరాదు మరి. దుష్టసమాసమే.  అందుకేనేమో కావ్యాలంకారచూడామణి కారుడు తప్ప అందరూ ఈ వృత్తాన్ని స్త్రీ వృత్తం అనటం‌ జరిగింది.  ఈ‌ శ్రీ పెంపు అన్నది దుష్టసమాసం‌ కావటం వలనో మరొక కారణమో తెలియదు ఆ పేరు ప్రచారంలో‌ లేదు. స్త్రీ అన్న పేరే ఈ‌వృత్తానికి ప్రచారంలో ఉన్నట్లుంది. ఐతే పూర్వ కవి ప్రయోగాలు కనిపించలేదు.

ఈ  శ్రీ‌ పెంపు లేదా స్త్రీ అనే వృత్తానికి అనంతుడు ఇచ్చిన ఉదాహరణ చూడండి:
    స్త్రీరూ
    పారున్‌
    ఘోరా
    ఘోరీ

30, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీరామ బింబము.


          బింబ.
          భూమిసుతా
          కాముని శ్రీ
          నామము చా
          లీ మహిలోబింబ.

ఈ బింబ వృత్తానికి గణాలు భ-గ. ఎంత పొట్టి వృత్తం! పాదానికి నాలుగే అక్షరాలు. ఉన్న నియమం ప్రాసనియమం ఒక్కటే!.

సుందరీ వృత్తానికి గణాలు భ-గగ ఐతే ఈ బింబానికి భ-గ. కాబట్టి బింబం సుందరిలో అణగి ఉంటుందన్నమాట. ఇది చిత్రకవిత్వం వ్రాసేవాళ్ళకి పనికి వచ్చే సంగతి.

ఈ బింబవృత్తానికి పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

శ్రీరామ సుందరి


       సుందరి.
       నామది గొల్చున్
       స్వామిని భక్తిన్
       రాముడు నాపై
       ప్రేముడి జూపున్

సుందరి.

ఈ సుందరీవృత్తానికి గణాలు భ-గగ. అంటే పాదానికి ఐదు అక్షరాలన్నమాట. పది అక్షరాలకన్న తక్కువగా పాదం నిడివి ఉంటే యతిస్థానం ఏమీ‌ ఉండదు. ఏ వృత్తమైనా ప్రాస తప్పదు.

ఈ వృత్తాని నాగవర్మ కాంచనమాల అంటే అనంతుడు పంక్తి అన్నాడు. ఈ వృత్తానికే ఇంకా అక్షరోపపదా , అక్షరపంక్తి , కుంతలతన్వీ , భూతలతన్వీ , హంసా అన్న పేర్లున్నాయని ఒకచోట చదివాను.

పాదానికి ఉన్న గణాలు భ అనేదీ గగ అనేదీ‌ కూడా చతుర్మాత్రా గణాలు. కాబట్టి పాదానికి ఎనిమిది మాత్రల ప్రమాణం అనికుడా చెప్పవచ్చును. నేను చెప్పిన పై పద్యంలో భ-గణం తరువాత విరుపు కనిపిస్తోంది కదా. అలాగని అక్కడ విరుపు రావాలని అనలేం. ఉదాహరణకు ఒక సుందరీవృత్తపాదంలో 'ఏమి మహాత్మా' అని వ్రాసాం అనుకోండి అప్పుడు సలక్షణంగా ఉన్నా విరుపు మూడవ అక్షరం పైన వచ్చింది కదా. అలాగే అదే రకమైన విరుపుతో‌ మొత్తం‌పద్యం వ్రాస్తే చదువరులు, ఓహో విరుపు మూడవ అక్షరం మీద బాగుంటుందన్న మాట అనుకోవచ్చును. పద్యాల్లో, ముఖ్యంగా యతివిరామం లేని పద్యాల్లో విరుపు ఎక్కడ వస్తుందో అన్నది పాదానికీ పాదానికీ కూడా మారినా అక్షేపణ ఉందదు.


ఐతే ఈ‌ సుందరీవృత్తానికి పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.


29, డిసెంబర్ 2015, మంగళవారం

శ్రీరామ భోగవిలసిత.


    భోగవిలసిత.
    నేడు సుదినమో నెలంతుకా
    పాడవె సుదతీ పదేపదే
    వేడుక రఘుభూవిభుస్తుతుల్
    వాడల నతి వైభవంబుగన్
 భోగవిలసిత.

ఈ భోగవిలసిత వృత్తానికికి గణవిభజన భ-స-జ-గ అనగా గురులఘుక్రమం  UII IIU IUI U తో పాదానికి 10 అక్షరాలుంటాయి. యతిస్థానం 7వ అక్షరము. ఈ‌వృత్తానికే వీరవిలసితోర్వి అన్న మరొక పేరు కూడా ఉంది.

గురులఘుక్రమం UI III UI UI U అని విడదీస్తే అది హ-న-హ-హ-గ. అనగా నాలుగు సూర్యగణములపై ఒక గురువు. రెండవది న-గణము కాగా మిగిలిన సూర్యగణములు హ-గణములు కావలెను. చివరి గురువును త్రిమాత్రగా సాగదీసు కోవచ్చును కాబట్టి ఇది త్రిమాత్రాగణాల అమరిక అవుతున్నది.

మరొక సంగతి. గురులఘుక్రమం UII IIU IU IU అని విడదీస్తే,  భ -స - వ - వ. ఇలా చూస్తే యతిస్థానమునుండి ఎదురునడక అన్నసంగతి స్ఫుటం అవుతుంది.

ఒక ఉదాహరణ పద్యం‌ కనిపిస్తోంది.
    భోగివిలసితస్ఫుటప్రభా
    భోగలసితు శంభుఁ గొల్తు నే
    నాగమనుతుఁ బుణ్యకీర్తనన్
    నాగమటుల మంత్రముగ్ధనై

ఈ‌భోగవిలసిత వృత్తానికి  కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.28, డిసెంబర్ 2015, సోమవారం

ఈ పంక్తి రాముడి కోసం


    పంక్తి.
    ఏ మనుజోత్తము లింపెసగన్
    రాముని నామము రామకథల్
    ప్రేముడి గొల్తురు రేబవళుల్
    స్వామికి వా రతి సన్నిహితుల్పంక్తి.

ఈ‌పంక్తి వృత్తానికి గణవిభజన భ-భ-భ-గ. అంటే పాదానికి 10అక్షరాలన్నమాట. యతిస్థానం 7వ అక్షరం.
ఈ వృత్తాన్ని నాగవర్మ చిత్రపదం అన్నాడు.  దీనికే దోధక, చిత్రగతి, సారవతీ, విశ్వముఖి అన్న పేర్లు కూడా ఉన్నాయి.

అనంతుడు 'పంక్తి' అన్నది వేరే వృత్తం  - దానికి గణాలు భ-గగ.

అందరూ వికటకవి అన్న మాట వినే ఉంటారు. తెనాలి రామకృష్ణకవిని వికటకవి అంటారని నానుడి. ఆయన వ్రాసిన ప్రబంధం పాండురంగమహాత్మ్యంలో హాస్యాన్ని చచ్చీచెడి పిండవలసిందే. ఐనా దొరకదు. అందుచేత ఆయన్ను వికటకవి అనటం వట్టి పుకారే. అదలా ఉంచి ఈ‌ వికటకవి అన్న మాటలో ఒక విశేషం ఉంది. ఎడమనుండి కుడివైపుకు చదివినా కుడినుండి ఎడమవైపుకు చదివినా మాట అలాగే ఉంటుంది. ఈ‌ సంగతి ఆబాలగోపాలానికీ‌ తెలుసినదే. మరి ఒక పద్యంలో గురువులూ లఘువులూ ఉండే అమరిక కూడా ఇలాంటి తమాషాతో ఉండవచ్చునా అంటే భేషుగ్గా ఉండవచ్చును. దానికి ఈ‌ పంక్తి వృత్తం ఒక ఉదాహరణ.

అదెలాగూ ఈ‌పద్యానికి గణాలు భభగ కదా తిప్పిచదివితే వేరేగా ఉంటుంది కదా అనకండి. జాగ్రతగా చూడండి, నేను గురులఘువుల క్రమాన్ని కదా ప్రస్తావించినది? ఈ పంక్తి వృత్తానికి గురులఘుక్రమం UII UII UII U అనే దాన్ని UIIUIIUIIU అని చూస్తే ఈ వృత్తపాదంలో గురులఘువుల అమరికలోని సౌష్ఠవం బోధపడుతుంది. ఈ గురులఘుక్రమం త్రిప్పి చదివినా అలాగే ఉంది కదా. సులభంగా దీనిని మనం UIIU II UIIU అనో లేదా భగ-లల-భగ అనో గుర్తుపెట్టుకోవచ్చును. సమస్తవృత్తసమూహాన్నీ త్రికగణాలతో చూస్తూ కూర్చుంటే చాలా వృత్తాల మర్మమూ వాటి నడకా బోధపడనే‌పడవు.

ఈ పంక్తివృత్తానికి పాదపవృత్తానికీ చాలా దగ్గర చుట్టరికం. పంక్తివృత్త పాదానికి చివరన మరొక గురువును చేర్చితే అది పాదపం ఐపోతుంది!

ఈ పంక్తి వృత్తానికీ మాణవక వృత్తానికీ కూడా దగ్గర చుట్టరికం ఉంది. మాణవకానికి గణవిభజన భ-త-లగ. పంక్తి వృత్తానికి భ-భ-భ-గ. పోలిక కనిపించటం‌ లేదంటారా? గణవిభజనను త్రిక గణాలలో చుట్టరికం ఆట్టే లేని మాట వాస్తవమే. మాణవక వృత్తానికి గణవిభజనను భగ-భగ అని కూడా చూడవచ్చును. పంక్తి కైతే భగ-లల-భగ అని చూడవచ్చును. ఇప్పుడు చుట్టరికం‌ బోధపడుతోంది కదా. ఇది కేవలం సౌష్టవం తాలూకు చుట్టరికం. అందకంటే పెద్దచుట్టరికం మరొక టుంది చూడండి.

మీరు కొంచెం జాగ్రత్తగా గమనించితే ‌ఈ‌ పంక్తివృత్తం నడక కూడా తోటక వృత్తం నడకలాగా కనిపిస్తుంది. ఎందుకబ్బా అని కొంచెం ఆలోచించితే స్ఫురించే విషయం ఒకటుంది. ఈ పంక్తి వృత్తానికీ తోటకవృత్తానికీ కూడా దగ్గర చుట్టరికమే అని. తోటక వృత్తానికి గణాలు స-స-స-స. పంక్తికేమో భ-భ-భ-గ. చుట్టరికం ఎలాగూ‌ అనవచ్చును. మళ్ళా గురులఘువుల క్రమం చూడాల్సిందే. తోటకంలొ గురులఘుక్రమం IIU IIU IIU IIU ఐతే పంక్తికి  UII UII UII U. మంచిది. ఇప్పుడు చూడండి.  పంక్తి వృత్తపాదానికి ముందు రెండు లఘువులని చేర్చితే అది కాస్తా తోటకం పాదం ఐపోతోంది. II  UII UII UII U. -->  IIU IIU IIU IIU కదా.  అదన్నమాట ఈ పంక్తి వృత్తం‌ నడక తోటకం నడకలాగా కనిపించటానికి కారణం.  అంతే కాదు. ఈ‌ పంక్తి వృత్తానికి యతిస్థానం 7వ అక్షరం ఐతే తోటకానికి 9వ అక్షరం. అందుచేత తోటకానికీ పంక్తివృత్తానికి యతిమైత్రి ఒకే అక్షరం పైన వస్తుంది. చిత్రకవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళకు పంక్తిగర్భతోటకం వ్రాయటం  కొంత సులువు.  తోటకంలో ఒకటి, మూడు, తొమ్మిది స్థానాలకు యతిమైత్రి కూర్చుకుంటూ వ్రాయటమే కాబట్టి,

ఈ పంక్తి వృత్తానికి మణిమధ్యం అనే వృత్తంతో ఇంకా చాలా దగ్గరి చుట్టరికం‌ ఉంది. అదెలాగో చూడంది. ఈ పంక్తికి గురులఘుక్రమం UII UII UII U అంటే UIIU II UIIU కదా. ఈ మధ్యన ఉన్న రెండు లఘువుల్నీ తీసి వాటిస్థానంలో ఒక గురువును ఉంచితే అప్పుడు గురులఘుక్రమం UIIU U UIIU  అవుతున్నది కదా - అదే మణిమధ్యం అనే వృత్తం. మణిమధ్యం అనేదానికి మణిబంధం అన్న పేరూ ఉంది. ఆ  పద్యాన్ని తరువాత చెప్పుకుందాం.

మనం‌ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే స్వల్పమైన మార్పులతో ఒక వృత్తం మరొకటిగా మారటం చాలా తరచుగా చూస్తాం అన్నది.

లక్షణ గ్రంథాల్లోనిది కాబోలు ఒక ఉదాహరణ పద్యం వెబ్‌లో కనిపించింది.

దుర్ముఖుఁడీతఁడు తూగి సమి
త్కర్మ ప్రచండుఁడుకాహళరా
నోర్మిచలద్రవుఁ డత్థభుజా
కర్మఠుఁ డాహవకాలుఁడయా

ఈ‌ పంక్తి వృత్తానికి పూర్వకవుల ప్రయోగాలేమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

నూఱుమారులు పుట్టెరా


నూఱుమారులు పుట్టెరా వాడు నూఱుమారులు చచ్చెరా
తీరు మారలేదురా వాడు శ్రీరామ యనలేదురా
ఎన్ని విద్యలు నేర్చినా వాడెన్ని సిరులు గడించినా
ఎన్ని దేశము లేగినా వాడెన్ని బిరుదులు పొందినా
వెన్నుదన్నుగ  సిరులు బిరుదులు వెంబడించ నేర్చునా
ఎన్నడును శ్రీరామచంద్రుని యెఱుగడాయె శివశివా          
నూఱుతిరిగిరా నవుసరములేని దివ్యమైన మార్గమున్నది
తరచుగా శ్రీరామచంద్రుని తలచువారికి దొరకుచున్నది
ఉరక నటునిటు తిరుగవద్దని గురువులెంత చెప్పిచూచిన
సరకుచేయడు రామచంద్రుని సత్యమెఱుగడు శివశివా     
నూఱుదిక్కులేని వాని నీవే తిన్నగా కాశికి తెచ్చి
రెక్కలల్లార్చి హంస లేచిపోవు నపుడు చెవిలో
చక్కగా తారకమంత్ర మొక్కసారి చెప్పవయ్యా
అక్కజముగా పరమపదమున కఱుగు వాడిక  శివశివా
నూఱ

మే 2014.27, డిసెంబర్ 2015, ఆదివారం

సీతారాములకు మంగళహారతి పాట


 అంగన లందరు హారతు లీయరె అందాలరామునకు
 బంగారుతండ్రికి శృంగారరామున కీయరె హారతులు
 బంగారుతల్లికి శృంగారవతి సీతమ్మకు హారతులు
 మంగళకరులకు మహోత్సవముగా మంగళ హారతులు

 వేడుక మీఱగ వాడల నూరేగి వచ్చిరి దంపతులు
 ఏడేడు జగముల కేలిక లైనట్టి యీ దివ్యదంపతులు
 చేడియలారా దిష్టితీయుటకు చేయరె ప్రక్రియలు
 ఆడుచుపాడుచు నానందముగా అద్దరె హారతులు
అంగన
 పట్టరె సూర్యహారతి పడతులార మీరు  సూర్య
   వంశగౌరవవర్థనులైన సీతారాములకు
 పట్టరె చంద్రహారతి పడతులార మీరు పూర్ణ
  చంద్రశోభల చెన్నుమీఱెడు సీతారాములకు  
 పట్టరె నక్షత్రహారతి పడతులార మీరు  నక్షత్ర
  సంఖ్యను మీరు గుణముల నొప్పు  సీతారాములకు
 పట్టరె దివ్యహారతి పడతులార మీరు నానా
  దేవగణంబుల సన్నుతు లందెడు సీతారాములకు  
అంగన
 పట్టరె ఏకహారతి  పడతులార మీరు నేడు
   పతితపావనులు  మన యేలికలు సీతారాములకు
 పట్టరె  పంచహారతి  పడతులార మీరు నేడు
  భక్తపాలనా తత్పరులైన సీతారాములకు
 పట్టరె నేత్రహారతి  పడతులార మీరు నేడు
  పరగ కన్నుల వెన్నెల లొలొకే  సీతారాములకు
 పట్టరె పుష్పహారతి పడతులార మీరు నేడు
   భూమిని వెలసిన అదిదంపతులు సీతారాములకు
అంగన


ఏనుగు మీద రాముడు ఎంతో చక్కనిదేవుడు


    మత్తేభవిక్రీడితము.
    రవివారం బిది భానువంశతిలకా రామయ్య రావయ్య నే
    డవనీ పుత్రిక తోడ నుత్సవముగా నంబారి పైనెక్కి పం
    డువ జేయందగు జూచు కన్నులకు నీ వూరేగి యేనుంగుపై
    స్తవముల్ సేసలు పూలు గొంచు జనుచో సాకేత ముప్పొంగదే


ఇనకుల తిలకుని భానువారం మత్తేభం మీద చూడాలని ఆశ అన్నారు పెద్దవారు శ్రీ‌ శర్మగారు.  అయన రాముణ్ణి  ఆదివారం నాడు ఏనుగుపై ఎక్కిద్దామని ఉబలాటపడుతున్నారు. ఆయన ముచ్చట తీర్చటం‌ బాగుంటుందని నాకూ అనిపించింది. రాముడి శోభను ఊహించటం వర్ణించటం‌ కన్నా సంతోషం మరేముంటుంది? ముఖ్యంగా నాకు.

లోగడ నా రాముణ్ణీ సీతమ్మతల్లినీ ఏనుగు నెక్కించి ఊరేగిస్తూ ఒక రామకీర్తన వ్రాసుకున్నాను.  పాఠకులు దయచేసి వేదండము నెక్కి మైథిలితో కూడి కోదండపండితు డూరేగె వేదవేద్యుని కీర్తి వేదపండితు లెల్ల వేనోళ్ళ పొగదగ నూరేగె అన్నఆ కీర్తనను కూడా ఒక సారి చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.


26, డిసెంబర్ 2015, శనివారం

శ్రీరామ సుకాంతి

        సుకాంతి.
        తరింప జే
        యరా  పరా
        త్పరా  బిరా
        న రాఘవా


సుకాంతి.

ఈ సుకాంతి వృత్తానికి గణవిభన జ - గ. అంటే నాలుగే నాలుగక్షరాలు పాదాని కన్నమాట. ఈ వృత్తాన్నే నాగవర్మ జనోదయం అన్నాడు.  దీనికే కళా అని పేరు కూడా ఉంది. యతిస్థానం అంటూ లేదు కాని ఎంత చిన్న వృత్తానికైనా (శ్రీవృత్తం తప్ప) ప్రాసనియమం తప్పదు కదా.

ఈ‌ వృత్తానికి గురులఘుక్రమం IUI  U దీనినే మనం IU  IU అనీ చూడవచ్చును. అంటే పాదానికి రెండు ఎదురు నడకతో ఉండే వ-గణాలు.

విశ్వనాథవారు ఈ‌ వృత్తాన్ని వాడుక చేసినట్లు తెలుస్తున్నది. ఎవరికైనా  ఉదాహరణ లభ్యంగా ఉంటే దయచేసి పంపగలరు. ఇతర పూర్వకవులెవరన్నా సుకాంతి వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.రాముడికి వినయంగా

         వినయము.
         శరణం
         కరుణా
         కర దా
         శరథీవినయము.

ఈ వినయ వృత్తం ఒక చిట్టిపొట్టి వృత్తం. పాదానికి ఒకే ఒక గణం. స-గణం.  అంటే పాదం నిడివి మూడు అక్షరాలే. మరి ప్రాసను పాటించాలి కదా వృత్తం అన్నాక.

ఈ వినయ వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

ఇంత చిన్న పద్యానికి ఇంత చిన్న టపా చాలు.

లయగ్రాహిలో రామస్తుతి

    లయగ్రాహి.
    భూవలయ మందు బడి బావుకొన నేమి గల దీవిషయ మఙ్ఞుడను కేవలము రామా
    భావనము చేయగల ధీవిభవమే యెఱుగ నావనజ సంభవుని యీవి యిటులయ్యా
    నా వివిధదోషములు నీ వెరుగనివి కావు కేవలము నీదుకృప నావలన నుంటం
    గావుమన ముక్తిగొను ద్రోవ గనజేసితివి నీ విధము లద్భుతములై వెలుగు గాదే
లయగ్రాహి

లయగ్రాహి ఒక పెద్దపద్యం.  దాని పాదానికీ‌ ఏకంగా 30 అక్షరా లుంటాయి.
ఈ‌లయగ్రహికి గణవిభజన భ - జ - స - న - భ - జ - స - న - భ - య అని చాలా పొడుగ్గా ఉంటుంది.
పాదానికి 26అక్షరాల కన్నా పొడుగున్న వృత్తాలని ఉధ్ధురమాలా వృత్తాలు అని పిలుస్తారు.
కాబట్టి లయగ్రహి ఒక ఉధ్ధురమాలా వృత్తం

ఈ లయగ్రాహిలో విశేషం‌ఏమిటంటే యతిస్థానం ఏమీ లేదు.
సాధారణంగా ప్రాసయతి వృత్తాలో  అంగీకరించరు.
లయగ్రాహిలో వాడేది ప్రాసయతిని మాత్రమే. దానిని 10, 18, 26వ స్థానాల్లో వచ్చేలా వేయాలి.

ప్రాసయతి అంటె కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రాసస్థానంలోని అక్షరానికిమాత్రమే కాదు. ప్రాసస్థానంలోని అక్షరానికి ముందు ఉన్న అక్షరానికీ‌ సంబంధించినది.  ప్రాసకు ముందు అక్షరం గురువైతే ప్రాసయతిస్థానంలో ఉన్న అక్షరానికీ ముందు గురువు ఉండాలి. ఇక్కడ లక్షణం ప్రకారమే అది సిధ్ధిస్తోంది అన్నది గమనించండి. ప్రాసాక్షరం గురువైతే ప్రాసయతిస్థానంలోనూ‌గురువుండాలి. ప్రాసాక్షరం బిందుపూర్వకమైతే ప్రాసయతిస్థానంలోనూ అక్షరం బిందుపూర్వకంగానే ఉండాలి.  ప్రాసాక్షరం ఏ హల్లు ఐతే‌ ప్రాసయతి కూడా అదే హల్లుగా ఉండాలి. ప్రాసాక్షరం ద్విత్వాక్షరమో సంయుక్తాక్షరమో ఐతే ప్రాసయతి అదే ద్విత్వమో సంయుక్తాక్షరమో కావాలి. గుణితంతో ఇబ్బంది లేదు. ఇన్ని నియమాలున్నా ప్రాసయతి ఆట్టే కష్టమైనదేమీ‌ కాదు.

ఉదాహరణకు 'నాతి'కీ  'కోతి'కీ ప్రాసయతి కుదురుతుంది.  కాని 'నాతి'కీ 'పతి' కీ ప్రాసయతి కుదరదు. 'వంక'కి 'డొంక'తో ప్రాసయతి కుదురుతుంది కాని 'మేక'తో కుదరదు.  'అక్క' కీ ముక్కు' కీ‌ ప్రాసయతి కుదురుతుంది కాని 'అక్క'కీ‌ 'అప్ప'కీ కుదరదు.  'పది'కి 'పంది'తో ప్రాసయతి కుదరదు.  అలగే 'రాజు'కీ  'బూజుకీ కుదురుతుంది కాని 'రాజు'కీ 'రాతి'కీ ప్రాసయతి కుదరదు. ఇలా తెలుసుకోవాలన్న మాట.

లయగ్రాహిలోని చివరి ప్రాసయతిని తొలగించినప్పుడు, దానిని లలిత వృత్తము అంటారు.. 

ఒక ముఖ్య విషయం ఏమిటంటే పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారని మనకు తెలుసు. ఈ‌ లయగ్రాహిలో పాదంలో మూడు  సార్లు ప్రాసయతిని వేయాలి. మొదటి ప్రాసస్థానంతో కలిపితే మొత్తం‌ నాలుగు సార్లు ఐనది. ఆన్ని పాదాలను ఒకే‌ ప్రాసతో వ్రాయాలి కదా వృత్తం అంటే. అందుచేత పద్యం మొత్తం మీద ఒకటే ప్రాసాక్షరం నాలుగునాలుగులు పదహారు సార్లు వస్తుంది. సాధారణ కవులకు  అంటే‌ డాంబికం వదిలేసి చెప్పాలంటే నాబోటి అల్పకవులకూ ఇది ఒక పరీక్ష లాంటిదే! ఐతే కేవలం అదృష్టవశాత్తు ఈ‌ లయగ్రాహి నేను భయపడినంతగా కష్టపెట్ట లేదు. దానికి ఒక కారణం సులభప్రాసాక్షరాన్ని ఎంచుకోవటమే అనుకోండి. ఇంతకు ముందు ఎప్పుడూ ఒక్క లయగ్రాహినీ‌ వ్రాయలేదేమో ఎందుకైనా మంచీదని ప్రాస సులభంగా ఉండేలా చూసుకున్నానన్న మాట.

లయగ్రాహిలో గణాలు భ జ స న భ  జ స న భ య అని చెబితే దాని నడక గురించి ఏమీ‌ తెలియదు. చాలా వృత్తాలకు ఇలాగే అవుతూ‌ ఉంటుంది.  త్రికగణాలతో‌  గణవిభజన చెప్పటం వలన నడక గురించి తెలిసేది తరచు శూన్యంగా ఉంటుంది.

ఈ వృత్తానికి గణాలు భ జ స న భ  జ స న భ య కాబట్టి, గురులఘుక్రమం UII IUI IIU III UII IUI IIU III UII IUU అవుతున్నది. ఈ‌ అమరికను మరొకలా చూడండి UIII UIII UIII UIII UIII UIII UIII UU అవుతున్నది. అంటే భల-గణం ఏడు సార్లు వచ్చి ఆపైన గగ అన్నమాట. ఇప్పుడు సుభగంగా ఉంది కదా.

లయగ్రాహి పాదంలో లఘువులు 21, గురువులు 9.  అంటే లఘువులు 70% అన్నమాట. ఐతే మాత్రల పరంగా చూస్తే లఘువులు 21 గురువు 18 కాబట్టి తూకం బాగానే ఉందనుకోవచ్చును.

లయగ్రాహి అనగానే నన్నయ్యగారు గుర్తుకు రావాలి. ఆయన వ్రాసిన ఆదిపర్వం‌ పంచమాశ్వాసంలోని ఈ వసంత ఋతువర్ణన పద్యాలు గుర్తుకు రావాలి.

      కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
      తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా
      లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
      రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్

      చందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
      కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ
      కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
      నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్

పోతన్నగారు కూడా భాగవతంలో లయగ్రాహి పద్యాలు వ్రాసారు. వాటిలో ఒకటి.

     కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
     ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్వినులు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
     వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
     భీల గతితోడఁ దమ కేలి ధనువు ల్విడిచి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో మనోరమావృత్తాంతం అని ఒక మనోహరమైన కథ ఉంది. దానిలో‌మనోరమా వివాహ ఘట్టంలోని లయగ్రాహిని చూడండి. 

    అన్నగముపై జరఠ పన్నగపతిస్ఫట లన న్నెగసి కోటతుదల న్నెగడుకొమ్మల్‌
    మి న్నగల రాయ రుచిఁ జెన్నగు విమానముల పన్నుగడ పన్నుగఁ బ్రభిన్న గజఘోట
    చ్ఛన్న గహనాపణముల న్నిగనిగద్యుతి రవి న్నగుమణి ప్రకర మున్న గరిమం బే
    రెన్నఁగల యంగడుల వన్నె గని సంపదలమన్నగరి యొప్పు బలభిన్నగరి ఠేవన్‌.

ఆతుకూరి మొల్ల వ్రాసిన రామాయణం, మొల్ల రామాయణంగా ప్రసిధ్ధి కెక్కింది. ఆ కవయిత్రీమణి రామాయణం నుండి ఒక లయగ్రాహి.

    తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటు సాయకము లేర్చి యిపుడేయగ దొడంగెన్
    తోయద పథంబున నమేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ గాయగ గడంగెన్
    కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లే యెడల జూచినను మ్రోయుచు జెలంగెన్
    నాయెడ కృపారసము సేయ కవివేకమున నీ యెడల నుండు టిది న్యాయమె లతాంగీ

ఆధునికులు శ్రీ‌నేమాని రామజోగి సన్యాసి రావుగారు తమ శ్రీమధ్యాత్మరామాయణంలో వ్రాసిన క్రింది లయగ్రాహిని చూడండి.

    కొందరను ద్రొక్కుచును కొందరను మ్రింగుచును కొందరను బట్టి కపి బృందముల యందున్
    కొందరను గూల్చుచును కొందరను జీల్చుచును కొందరను మొత్తునెడ దుందుడుకు మీరన్
    కొందలము నొంది కపు లందరును బర్వులిడ నందరను దాటుచును ముందునకు నెంతే
    తొందరగ నాహవము నందు నసురుండు చనె నందరకు డెందముల యందు భయదుండై

అలాగే శంకరాభరణం బ్లాగుతో‌జగత్ప్రసిధ్ధులైన కంది శంకరయ్య మాష్టారు గారి లహగ్రాహి పద్యం‌ ఒకటి

    మన్మథునిఁ జంపెనఁట సన్మునుల మెచ్చెనఁట సన్మతులఁ బ్రోచు శివునిన్మదిఁ దలంతున్
    చిన్మయుఁడు పర్వతసుతన్మదిని మెచ్చి తనువున్ముదముతో సగముగన్మఱి యొసంగెన్
    తన్మయముతోడ భవునిన్మహితు వెడెదను మన్మలిన జీవనగతిన్మలుపుమంచున్
    మన్మనములోన నెపుడున్మెరసియుండి కరుణన్మెలఁగుమంచును నుతిన్మిగులఁ జేతున్.

ఈ‌ లయగ్రాహి చాలా పెద్ద సైజు పాదంతో‌ గాభరా పెడుతుంది చదివే‌ వారిని. అందుచేత  దీన్ని ఒక సీసంలాగా పాదాన్ని రెందు భాగాలుగా చేసి  వ్రాయటం ఒక ఆచారం ఉంది.  ఉదాహరణకు ముద్రణలో పైన చూపిన నేమాని వారి పద్యం ఇలా ఉంది. పనిలో‌పనిగా ప్రాసయతి స్థానాలను క్రీగీటుతో‌ చూపుతున్నాను.

    కొందరను ద్రొక్కుచును కొందరను మ్రింగుచును
        కొందరను బట్టి కపి బృందముల యందున్
    కొందరను గూల్చుచును కొందరను జీల్చుచును
        కొందరను మొత్తునెడ దుందుడుకు మీరన్
    కొందలము నొంది కపు లందరును బర్వులిడ
        నందరను దాటుచును ముందునకు నెంతే
    తొందరగ నాహవము నందు నసురుండు చనె
        నందరకు డెందముల యందు భయదుండై

ఈ రోజుల్లో వచనకవిత్వాల పుణ్యమా అని పాదానికి ముఫైయారు అక్షరాలైనా సాగదీస్తూనే అదే కవితలో పాదానికి ఒకటి రెండు అక్షరాలు వ్రాయటాన్ని కూడా చూస్తున్నాం. ఐతే పూర్వలక్షణకారుల్లాగా ఈ కాలం వారిలో‌ పలువురు లయ గురించి ఏమీ పట్టించుకోవటం‌ లేదు.  అసలు తెలుగుభాష గురించే‌ ఆట్టే పట్టించుకోవటం లేదనుకోండి, అది వేరే సంగతి. వచన కవిత్వాన్ని ప్రచారంలోనికి తెచ్చిన శ్రీశ్రీ చక్కగా లయాత్మకంగా వ్రాసారన్నది గమనార్హం. వివాదాలు మనకెందుకు గాని, ఈ‌ లయగ్రాహిని మరింత ఆధునిక విధానంలో వ్రాయటం సులభం అని చెప్పటం నా ఉద్దేశం.  ఎలాగంటే, రెండేసి గణాలను ఒక పాదంలాగా చూపటమే.  ప్రాసయతులన్నీ ప్రాసలుగా మారిపోతాయి.  అలా వ్రాస్తే ఎలా ఉంటుందో నేమాని వారి పద్యం ఎలా వస్తుందో చూదాం.

    కొందరను ద్రొక్కుచును
    కొందరను మ్రింగుచును
    కొందరను బట్టి కపి
    బృందముల యందున్

    కొందరను గూల్చుచును
    కొందరను జీల్చుచును
    కొందరను మొత్తునెడ
    దుందుడుకు మీరన్

    కొందలము నొంది కపు
    లందరును బర్వులిడ
    నందరను దాటుచును
    ముందునకు నెంతే

    తొందరగ నాహవము
    నందు నసురుండు చనె
    నందరకు డెందముల
    యందు భయదుండై

ఇక్కడ ఇలా చూపటం వలన ప్రాసయతి గురించి చక్కగా అవగాహన అవుతున్నది కదా.  ఇలా పాదంలో వరుసగా మొదటినుండి వచ్చే ఏడు భల-గణాల్లో బేసి గణాలకు ప్రాసయతిని కూర్చాలి.

ఈ‌పద్యంలో పాదానికి ఏడు భల-గణాలు వస్తున్నాయి కదా అవి పంచమాత్రాగణాలు. చివరన ఉన్న గగ-గణం కూడా  దానికి నాలుగుమాత్రలే‌ ప్రమాణం ఐనా ఐదు మాత్రలుగా సాగదీసుకోవచ్చును. అంటే పద్యం మొత్తం పంచమాత్రా గణాలుగా నడుస్తున్నది అన్నమాట.  ఇలా ఐదు మాత్రల మీద నడిచే‌ నడకను ఖండగతి అంటారు. ఈ‌ సంగతి ఇప్పటికే కొన్ని పద్యాలలో ప్రస్తావించుకున్నాం. ఖండగతికి జంపె, ధ్రువ, మఠ్య తాళాలను వాడతారు.

ఇన్ని లయగ్రాహులను ఉదాహరణలుగా చూపటం‌ ఎందుకంటే బాగా చదివిన పిమ్మట గాని సాధారణ పాఠకులకు దీనిలో ఉన్న లయ బోధపడదు కాబట్టి.

ఈ‌ లయగ్రాహి ఒక లయప్రధానమైన వృత్తం‌ కాబట్టి  ప్రాసయతుల దగ్గరా, పాదాంతాలలోనూ‌ విరువు ఉంటే బాగా అందగిస్తుంది. లేదా అంతగా కళ గట్టక పోయే‌ ప్రమాదం ఉందని నా అభిప్రాయం. ప్రాసయతి దగ్గర విరుపు అంటే ప్రాసయతి పూర్వాక్షరం దగ్గర కొత్త పదం మొదలు కావటం అని నా ఉద్దేశం. పూర్వకవులు లయగ్రాహిని ఒక వృత్తంలాగే చూసి సాధారణమైన ప్రవాహశైలిలో దీనిని వ్రాయటం‌ జరిగింది. లయ ఉంటేనే‌ పద్యం పాఠకులను రంజింపజేస్తుంది.  లయగ్రాహివంటి లయప్రధానమైన వృత్తాలైతే చెప్పనక్కర లేదు. అసలు లయగ్రాహికే జీవం‌ దానిలోని లయ. ప్రాసయతులతో మరింతగా అందగించే లయ.


25, డిసెంబర్ 2015, శుక్రవారం

సురుచిర శ్రీరామం

     సురుచిర
     నామనమున నిన్నే
     నీమ మెసగ గొల్తున్
     ప్రేమ మయుడ సీతా
     రామ సుగుణ ధామా
సురుచిర .
ఈ సురుచిర వృత్తానికి గణాలు భ - స - గ. అంటే పాదానికి కేవలం 7అక్షరాలు. అందుచేత యతిమైత్రి అక్కరలేదు. ప్రాసనియమం తప్పదు.

పాదానికి 14అక్షరాల నిడివికల కమలవిలసితం అనే వృత్తానికీ‌ సురుచిర అనే మరొక పేరుంది! ఇలా ఒకఏ వృత్తానికి రెండో అంతకన్నా ఎక్కువో పేర్లుండటమూ ఒక పేరుతో ఒకటి కంటె ఎక్కువ వృత్తాలుండటమూ‌ కూడా ఒక తమాషా.

ఈ వృత్తానికి  త్రికగణాలు భసగ  అన్నాం కదా.. అంటే గురులఘుక్రమం UII IIU U. దీనినే మనం UI III UU అని వ్రాస్తే మొదటి రెండూ సూర్యగణాలు ఆ పైన ఒక గగ గణమూ అన్నమాట. ఐతే ఎక్కడ ఏసూర్యగణం అన్నది స్థిరం అనుకోండి.


ప్రస్తుత పద్యం నడక చూదాం:

నా మ నమున నిన్నే
నీమ మెసగ గొల్తున్
ప్రేమ మయుడ సీతా
రామ సుగుణ ధామా

ఈ చిట్టి పద్యం‌ బాగుంది కదా? ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.


24, డిసెంబర్ 2015, గురువారం

ముగ్గురే చదివిన పద్యం!

కవికి నిర్వేదం‌ కలిగించే సంగతి ఏమిటంటే వాడి కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోక పోవటం.

ఈ టపా వ్రాస్తున్న సమయానికి నేటి పద్యం 'రామరధోద్దతము'ముఖం చూసిన వారి సంఖ్య కేవలం మూడు. 
పదిహేడున్నర గంటల్లో మూడు సార్లు దర్శించబడిన టపా ఇది.
అంటే ఆరు గంటలకు ఒకరన్నమాట.
బాగుంది.

ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! అని ఒక పద్యంలో వస్తుంది.
ఆముక్కతో ఆ పద్యం ప్రసిధ్దం ఐనట్లుంది.
అదలా ఉంచి, ఆ మాట అక్షరసత్యం.

ఎందరో పద్య కవులు మనమధ్యన ఉన్నారు.
కొద్దిమంది చదువుతున్నారు నా పద్యాలను కూడా. అందుకు ఆనందం.
పది మంది పెద్దలు చదివి తప్పొప్పులు చెబితే నాబోటీ అల్పకవికి ఎదిగేందుకు కాస్త అవకాశం వస్తుంది.
లేకుంటే నా బోటివాడికి అభివ్బృధ్ధి ఎట్లాగు?

ఎందరో పద్యరచనా ప్రయత్నాలు చేస్తున్న ఔత్సాహికులున్నారు మనమధ్య.
వారిలో‌ అధికులు ఈ బ్లాగు ముఖం చూదను కూడా చూడరు!
బహుశః నేను వారి స్థాయికి తగిన వాడిని కాకపోవచ్చును.
అది వారిలో‌ కొందరి ఉద్దేశం‌ కావచ్చును.
కొందరికి నా కవిత్వంతో పరిచయం కూడా లేక పోవచ్చును.
కొందరికి వారి కవితావ్యాసంగంతోనే తీరిక లేక ఇతరులు వ్రాసేది చదివే ఓపికా తీరికా లేకపోవచ్చును.

కొందరు చదువుతున్నారు నా కవిత్వాన్ని.
అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నది.
శ్రీ విష్ణునందన్ గారు కావ్యనిర్మాణం చేసిన కవివరేణ్యులు. వారు సలహాలనిచ్చి ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ గుండు మధుసూదన్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వారు కూడా నాకు ప్రోత్సాహాన్నిస్తున్నారు నా పద్యాలను పరామర్శిస్తూ.
శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు లబ్ధప్రతిష్ఠులైన కవి.  వారు చదువుతున్నారు.  ఒక అభినందన వ్యాఖ్యకూడా ఇచ్చారు.

కొందరు వింతవింత వ్యాఖ్యలూ చేస్తున్నారు కాని వాటీ సంఖ్య స్వల్పమే.
అంటే స్వల్పమైన దర్శనాలు కల అంతకంటే స్వల్పమైన వ్యాఖ్యలు కల టపాల్లో -
స్వల్పసంఖ్యలోనే వింతవ్యాఖ్యలు వచ్చాయి లెండి.
గుడ్డిలో మెల్ల.

మొత్తం మీద చదువుతున్నవారు బాగా తక్కువే.
ఐనా వ్రాస్తూనే ఉంటాను.
ఎందుకంటే ఈ పద్యాలు నా రాముడి కోసం వ్రాస్తున్నవి.
ఎవరు నేడు చదివినా చదవక పోయినా ఇబ్బంది లేదు.
రాముడు మెచ్చిన చాలును కదా!

ఏ మంటారు?

రామరథోధ్ధతము

     రథోధ్ధతము.
     పంతగించి కలి బాధపెట్టినన్
     చింతయన్న దెటు చెంత జేరు నా
     యంతరంగవిభు డైన రాముడే
     సంతతంబు సుఖశాంతులీయగన్
    
    


రథోధ్ధతము.

ఈ రథోధ్ధత వృత్తానికి గణవిభనజన ర - న - ర - లగ.  మరొక రకంగా చూస్తే పాదం రెండు సగాలుగా విరచితే, పూర్వార్థంలో హ-హ-లల  ఐతే ఉత్తరార్థంలో హ-హ-గ. ఇలా చూడటం దీని నడకను పట్టుకోవటానికి ఉపయోగిస్తుంది.  పాదానికి ఉన్న 16 మాత్రలనూ ఇలా పూర్వార్థానికి ఉత్తరార్థానికి సమంగా పంచవచ్చును. అంతే కాదు ఈ రెండు సగాల్లోనూ నడక ఒకేలా వస్తున్నది కూడా. ఈ వృత్తానికి 7వ స్థానంలో యతిమైత్రి. అంటే యతిస్థానం దగ్గర సరిగ్గా సగానికి పాదం విరుగుతున్న దన్న మాట.

ఈ వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు బాగానే ఉన్నాయి. ఆధునికులు శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆథ్యాత్మ రామాయణం నుండి ఒక రథోధ్ధతం.

     వారిజాతహితవంశవర్థనా
     వారిజాక్ష శ్రితపారిజాతమా
     వారిజాతభవవందితా నమ
     స్కారమో వరద సద్గుణాకరా

ప్రస్తుత పద్యం నడక చూదాం:

పంత గించి కలి బాధ పెట్టి నన్
చింత యన్న దెటు చెంత జేరు నా
యంత రంగ విభు డైన రాము డే
సంత తంబు సుఖ శాంతు లీయ గన్


23, డిసెంబర్ 2015, బుధవారం

అలసగతి శ్రీరామం

    అలసగతి.
    హరిహరులు మిత్రులని యందరను టొప్పున్
    పురహరుని బాణముగ బొల్చె హరి యట్లే
    హరి నరుడుగా నగుడు నంధకరిపుండున్
    ధరకు డిగె మారుతిగ దాను కడు వేడ్కన్
అలసగతి.

ఈ‌అలసగతి వృత్తానికి గణాలు న - స - న - భ - య. అంటే పాదానికి 15 అక్షరాలు. యతిస్థానం 10వ అక్షరం.
నడక ప్రకారం ఇది మూడు పంచమాత్రాగణాల పైన ఒక చతుర్మాత్రా గణం అనుకోవచ్చును. పాదం చివరి గణానికి మనం అదనపు మాత్రలను అవసరం మేరకు చేర్చుకోవచ్చును కాబట్టి ఈ పద్యం అంతా పంచమాత్రాగణాల పైన నడుస్తుందని భావించితే పొరపాటు లేదు.

అలసగతి వృత్తాల్లో జెజ్జాల కృష్ణ మోహన రావు గారు వ్రాసిన వాటిలోఒకటి  ఈ క్రింద ఇస్తున్నాను. మిగిలినవి అక్కడ చదువుకొన గలరు.
 
    జనని నను బ్రోవఁగను శాంతముగ రావా
    కనుల దయ జూపఁగను గావఁగను రావా
    వినుము మన మందెపుడుఁ బ్రేమమయి నీవే
    దినము కడు చల్లగను దీవెనల నీవే

విశ్వనాథవారు కూడా అలసగతి వృత్తంలో వ్రాసినట్లు తెలుస్తున్నది. ఎవరైనా వారి పద్యాలు ఈ వృత్తం లోనివి తమవద్ద ఉంటే పంపితే ఇందులో చేర్చగలను.
 
మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి పద్యం

    అనువుగను వా రటు విహారమును జేయన్
    వన మదియు దానఁ గన వర్ణనను దానున్
    ఘనయశముఁ గాంచ ననఁగా నమృతభానుం
    డొనరె నపు డీశుఁ డిటు లొప్పుగను జెప్పెన్
 
ఇతర కవు లెవరైనా ఈ‌ అలసగతి వృత్తంలో వ్రాసారా అన్నది తెలియదు.

ఇక నడక ప్రకారం మనం చెప్పుకున్న శివకేశవస్తుతి పద్యం ఇలా ఉంది:

హరిహరులు మిత్రులని యందరను టొప్పున్
పురహరుని బాణముగ బొల్చె హరి యట్లే
హరి నరుడు గా నగుడు నంధకరి పుండున్
ధరకు డిగె మారుతిగ దాను కడు వేడ్కన్22, డిసెంబర్ 2015, మంగళవారం

రామా అజితప్రతాపా

    అజితప్రతాపము.
    తరియింపగోరు నెడ దాశరథిన్
    పరమపూరుషు ప్రపంచ నాధునో
    నరులార వేడ భవ నాశనమౌ
    పరుల జేరుట విపత్కరంబగున్

అజితప్రతాపము.
ఈ వృత్తానికి బేసి (అంటే 1వ, 3వ )పాదాల్లో గణాలు స - జ - స - స. సరి (అంటే 2వ, 4వ)పాదాల్లో గణాలు న -భ - జ -ర. యతిస్థానాలు బేసి పాదాల్లో 9వ స్థానమూ,సరిపాదాల్లో 8వస్థానమూ ఈ వృత్తానికి.

గమనించవలసిన విషయం ఒకటుంది. ఈ వృత్తలక్షణాలు వెబ్‌లో కూడా కనిపిస్తున్నాయి. ఐతే సరిపాదాల చివరి గణం ఆ పేజీల్లో భ-గణం అని పొరపాటును మొదట ఎవరు చేసారో కాని  అదే అన్ని చోట్లా కనిపిస్తుంది. నిజానికి ఈ లక్షణాలను చెప్పే పాఠం మొత్తం పరిశీలించకుండా అందరూ కాపీ చేసుకున్నారు! ఎవరికీ కూడా లక్షణంలో సరిపాదాల చివరి గణం‌ భ-గణం అని చెప్పినప్పుడు, వృత్తంలో చివరి స్థానంలో గురువే ఉండాలి కదా అన్న అనుమానం‌ కూడా రాకపోవటం వింతగా ఉంది. తమాషా ఏమిటంటే అన్ని చోట్లా కనిపించినది ఒకే ఉదాహరణ పద్యం  అన్నాను కదా, అది ఇలా ఉంది:

సజసాగణావలిఁ బ్రసన్న నభా
గ్రజరపంక్తి నభిరామరూపమై
యజితప్రతాపచెలువారుఁ గృతి
న్విజయవిక్రమణ విశ్వభూవరా

చూసారా, ఉదాహరణ పద్యంలో మాత్రం చక్కగా సలక్షణంగా సరిపాదాల్లో చివర ర-గణమే ఉంది.

విశ్వనాథవారు అజితప్రతాప వృత్తం వాడినట్లు తెలిస్తోంది కాని వివరం తెలియదు. విఙ్ఞులు తెలియబరుస్తే ఇక్కడ చేర్చగలను.

ఈ పద్యం నడక విషయానికి వస్తే నాకు దీనికి ప్రత్యేక మైన సంగతి యేమీ కనిపించటం లేదు.

21, డిసెంబర్ 2015, సోమవారం

రామ మయూరసారి

     మయూరసారి.
     కామ ముజ్జగింప కామితార్థం
     బేమి టంచు గిల్ల నేల నయ్యా
     స్వామి నీదు ప్రేమ చాలు తండ్రీ
     శ్యామలాంగ రామచంద్రమూర్తీ
మయూరసారి.

ఈ‌మయూరసారి వృత్తానికి గణవిభజ ర-జ-ర-గ. అంటే పాదం నిడివి 10అక్షరాలు. పది కాని అంతకన్నా హెచ్చు స్థానాలు కాని ఉన్న వృత్తాలకు యతినియమం ఉంటుంది. ఈ వృత్తానికి 7వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం అన్నది అన్ని వృత్తాలకు వలెనే దీనికి కూడా తప్పదు. ఈ వృత్తానికి ఉన్న గురులఘుక్రమాన్ని U I U I U I U I U U నాలుగు హ-గణాలపైన రెండు గురువులు అన్నట్లుగా కూడా చూదవచ్చును.

ఐదు హ-గణాలు వరుసగా ఉన్న పద్యపాదం దేశి ఛందమైన ఆటవెలది పద్యంలో సమ పాదాల్లో (అంటే 2, 4 పాదాల్లో) అమరుతుంది. అటువంటి ఐదూ హ-గణాలుగా ఉన్న ఆటవెలది పాదంలో చివరి లఘువు బదులుగా ఒక గురువు ఉంచి నాలుగు పాదాలుగానూ వ్రాస్తే అది మయూరసారి లేదా మయూరభాషిణి అనే ఈ వృత్తం ఐపోతున్నది. అదీ‌యతిస్థానంతో‌ సహా! ఆ చిన్న మార్పుకే పాదం నడక మారుతున్నదా అన్నది ఆలోచనీయం.

పూర్వకవి ప్రయోగాలు ఏమైనా ఉన్నవా అన్నది తెలియదు.

20, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీరామ మాణవకం

    మాణవక
    లోకము లేలేవు గదా
    శ్రీకర రామా కృపతో
    నీ‌కృపయే లేనపు డీ
    లోకములే లేవు గదా
మాణవక వృత్తం

ఈ‌మాణవక వృత్తానికి గణవిభజన భ - త - లగ. అంటే పాదానికి కేవలం 8 అక్షరాలన్నమాట. అందుచేత యతిస్థానం ఏమీ‌లేదు. ప్రాసనియమం ఉంది వృత్తం‌ కావట్టి. ఈ వృత్తానికి గురులఘు క్రమం UII UUI IU కదా. దీనినే మనం UIIU UIIU అని కూడా అనుకోవచ్చును. ఈ విధానం‌గా విడదీసి చూడటం దీని నడకకు అనుగుణమైన విభజన అవునా అన్నది ఆలోచనీయం. కాని వృత్తపాదంలో మొదటి సగమూ తదుపరి సగమూ ఒకే గురులఘుక్రమంతో ఉన్నవన్నది మాత్రం స్పష్టం అవుతున్నది కదా. త్రికగణాలతో‌ అన్నింటికీ ఒకే కొలబద్దతో లక్షణాలు వ్రాసుకోవటం వలన ఇలాంటి చిన్న పెద్దా విషయాలు మరుగున పడిపోతున్నాయి.

ఈ వృత్తానికి తెలుగులో పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి కవి గారి మాణవక వృత్తం ఇక్కడ చూడండి.

    మా యని శ్రీ యే నయమా
    మా యన లక్ష్మీశు యమా
    యా యశు శిక్షా శయమా
    మా యశ మౌగా నియమా

ఇదొక చిత్రకవిత్వ విన్యాసం కాబట్టి పద్యం మరీ సుభగంగా ఉండకపోవటంలో వింత లేదు. ఈ పద్యమే కొద్ది మార్పుతో‌ మరొక టపాలోనూ అదే‌ సైటులో కనిపిస్తోంది.

19, డిసెంబర్ 2015, శనివారం

శ్రీరామ ప్రమాణికం

    ప్రమాణి.
    ధరాత్మజామనోహరా
    మొరాలకింప వేమిరా
    పరాకు మాని ప్రోవరా
    తరింపజేయరా ప్రభూ
ప్రమాణి
ఈ‌ప్రమాణి వృత్తానికి గణవిభజన జ - ర - లగ.  అంటే పదానికి 8 అక్షరాలు మాత్రమే కల చిట్టి వృత్తం
రెండు ప్రమాణిపాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది.

జగత్ప్రసిధ్ధమైన  గణేశ పంచరత్న స్తోత్రం ఈ‌ పంచచామర వృత్తాల్లోనే ఉంది. ఒక సారి  ఇక్కడ చదువుకోండి.

నడక చూస్తే ఈ‌ప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - గల - ర అన్నట్లుగా ఉంటుంది.  ఎదురు నడకతో‌ ప్రారంభం కావటమే ఈ‌ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.

    ధరాత్మజా  - మనోహరా
    తరింప  -  జేయ - రా ప్రభూ
    నిరంతరం‌ - భజింతురా
    పరాకు - మాని -  బ్రోవరా

తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు.  అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆథ్మాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది.

ఇంకొకటి గుండు మధుసూదన్ గారి శ్లోకం చూడండి.

గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద!
స ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్


18, డిసెంబర్ 2015, శుక్రవారం

శ్రీరామ విమానం.

    విమానం.
    ధరాత్మజాప్రాణమంత్రం
    పురాంతకోపాస్యమంత్రం
    నిరంతరం రామమంత్రం
    స్మరించుటే మోక్షతంత్రం
విమానం.


ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తమే.  ఈ విమాన వృత్తం లక్షణసారసంగ్రహంలోనూ, అప్పకవీయంలోనూ కనిపిస్తోంది. దీనికి వారిశాల అన్న పేరుకూడా ఉన్నది.

దీనికి గణవిభజన  జ - త - గగ.  అంటే పాదం నిడివి కేవలం 8అక్షరాలే. చిన్ని వృత్తం కాబట్టి యతినియమం లేదు. ప్రాసనియమం తప్పదు.

నడకప్రకారం మొదటి నాలుగు అక్షరాల తరువాత విరుపు కనిపిస్తున్నది. మాత్రల లెక్క చూస్తే 3-3-3-4 క్రింద వచ్చినా ఇది త్రిమాత్రాగణాలు కూడా ఇక్కడ చతుర్మాత్రలుగా పలికి చతురస్రగతిలో పద్యం నడిపించ వచ్చును. పై పద్యం అలాగే నడుస్తున్నది కదా.  చతురస్రగతికి ఏకతాళం నప్పుతుందని అనుకుంటాను. పద్యం నడకలో మొదటి సగమూ త్రిమాత్రాగణాలు ఎదురునడకతో రావటం ఈ వృత్తంలో ఉన్న అందం అని నా అభిప్రాయం..

ఇదివరలోనే చెప్పుకున్నట్లుగా చిన్నిచిన్ని పాదాలున్న పద్యాలకు అంత్యప్రాసను కూర్చగలిగితే అవి మరింత శోభించే అవకాశం ఉంది.

ఈ విమానవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు.


17, డిసెంబర్ 2015, గురువారం

శ్రీరామవిభూతి

    విభూతి.
    కామవైరిసన్నుతా
    స్వామివన్న నీవెలే
    రామచంద్ర నిన్ను నే
    ప్రేమమీఱ గొల్చెదన్
విభూతి వృత్తం.

ఈ‌వృత్తానికి గణాలు ర - జ - గ.  పాదం నిడివి కేవలం 7అక్షరాలున్న చిట్టి వృత్తం ఇది.   కవిజనాశ్రయం, కావ్యాలంకారచూడామణి, లక్షణసారసంగ్రహం, అప్పకవీయం అన్నీ విభూతి అన్నాయి. ఈ వృత్తాన్ని నాగవర్మ మాత్రం సునామం అన్నాడు. అంతర్జాలంలో ఒకచోట ఈ వృత్తానికి చామరం అని పేరుందని అన్నారు. ఆధారం తెలియదు.

ఈ వృత్తానికి గణాలు ర - జ - గ అని చెప్పుకున్నాం‌కదా. గురులఘు క్రమం U I-U - I U I - U అన్నది మరొక రకంగా చూస్తే U I - U I - U I - U అవుతుంది . అంటే హ - హ - హ - గ అని అన్నమాట. నిజానికి సంప్రదాయం ప్రకారం వృత్తానికి మూడక్షరాల గణాల వరసలు వేసి చెప్పటం‌ కాని నడకప్రకారం మూడు హ-గణాలపైన గురువు అన్నదే‌ సరైన గణవివరణ. గురులఘువులు ఒకటి విడచి మరొకటి వస్తాయి ఇందులో.

పూర్వకవి ప్రయోగాలు గ్రంథస్తం ఐనవి తెలియదు.  అంతర్జాలంలో ఈ‌క్రింది రెండు పద్యాలు కనిపిస్తున్నాయి.

    స్వస్థ సద్విభూతి దా
    రస్థ జస్థగంబునన్
    స్వస్థ సద్విభూతి దా
    రస్థ జస్థగంబునన్

    ఆయెడన్ మునీశ్వరుం
    డీయెడన్ రఘూత్తముం
    డాయెడన్ రఘూత్తముం
    డీయెడన్ మునీంద్రుడున్

ఇందులో రెండవ పద్యంలో అచ్చుతప్పులు సవరించటం‌ జరిగిందని గమనించ గలరు.

ఇక ఈ‌విభూతి పద్యం‌ నడకను చూస్తే ఇలా ఉంది:

కామ వైరి సన్ను తా
స్వామి వన్న నీవె లే
రామ చంద్ర నిన్ను నే
ప్రేమ మీఱ గొల్చె దన్

ఇలా దీని నడక త్రిశ్రగతిలో ఉంటుంది.  త్రిశ్రగతికి రూపక తాళం అనుకుంటాను.

ఈ చిట్టిపొట్టి వృత్తాన్ని వ్రాయటం అంతకష్టం కాదు కాబట్టి ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి16, డిసెంబర్ 2015, బుధవారం

రామహంసమాలి.

    హంసమాలి.
    అతడే వెన్నుడయ్యా
    యతడే రాముడయ్యా
    అతనిం గొల్వవో‌ స
    ద్గతియే నాస్తి కాదా
హంసమాలి అనేది మరొక చిన్నారి వృత్తం. దీనికి గణవిభజన స - ర - గ.  గురులఘుక్రమం IIUUIUU. అంటే పాదంలో ఉండేవి 7 అక్షరాలే అన్నమాట. కాబట్టి యతినియమం‌లేదు.

లక్షణ సారసంగ్రహం‌ఈ వృత్తాన్ని హంసమాలి అంటే అప్పకవి హంసమాల అన్నాడు. ఈ‌వృత్తాన్నే నాగవర్మ సరళ అన్నాడు. ఈ వృత్తానికే భూరిధామ అన్న పేరు కూడా ఉంది.

హంసమాలికి ముందొక లఘువును చేర్చితే అది వాంతభార వృత్తం IIIUUIUU అవుతుంది.

ఈ‌వృత్తం‌ నడకను చూస్తే మొదట నున్న స-గణం తరువాత విరుపు కనిపిస్తుంది.

పూర్వకవి ప్రయోగాలు యేమన్నా ఉన్నాయా ఈ‌వృత్తానికి అన్నది తెలియదు.

15, డిసెంబర్ 2015, మంగళవారం

రామకుమార విలసితం

     కుమారవిలసితం.
     పురాకృతమున నే
     నరుండ నయితి నా
     కరంబు గొనుమయా
     బిరాన రఘుపతీ
కుమారవిలసితం.

ఈ కుమారవిలసితవృత్తానికి గణవిభజన జ-న-గ. యతిస్థానం లేదు. ప్రాసనియమం ఉంది.

ఈ జ-న-గ లక్షణంతొ వృత్తం కవిజనాశ్రయంలో కుమారవిలసితం అని కనిపిస్తుంది. మనం ఈ పేరుతోనే వ్యవహరిద్దాం. ఈ‌వృత్తాన్నే కావ్యాలంకారచూడామణి కారుడు కుమారలలితం‌ అన్నాడు. నడకను చూస్తే ఇది గణాంతాలలో విరుపుతో వస్తున్నట్లుగా అన్నట్లు కనిపిస్తోంది.

పై పద్యం నడక ఈ క్రింది విధంగా ఉన్నది:

పురా-కృ తమున నే
నరుం-డ నయితి నా
కరం-బు గొనుమ యా
బిరా-న రఘుప తీ

ఇందులో ప్రాసస్థానంపైన ఉన్న గురువును రెండు మాత్రల కాలం కన్నా మూడు మాత్రలుగా ఉఛ్ఛరించటం బాగుంటుంది. అలా చేసినప్పుడు మొదటి రెండు అక్షరాలతో ఒక చతుర్మాత్రాగణం గానూ పిదప నాలుగక్షరాలూ మరొక చతుర్మాత్రాగణంగానూ ఏర్పడతాయి.  పాదాంతగగురువును కూడా మరొకరెండు మాత్రలుగా ఆ అక్షరాన్నే ఒక చతుర్మాత్రాగణంగా ఉఛ్ఛరించటం పధ్ధతిగా ఉంటుంది. చివరి గురువుముందు విరుపుతో పైపద్యం నడిచింది. అలాగే తొలిగురువు తరువాత కూడా ఒక విరుపు ఉన్నది.  ఇలా ఈ వృత్తం ఒక చతురస్రగతిలో చక్కగా నడుస్తుంది. చతురస్రగతికి ఏకతాళం వాడుక చేయటం జరుగుతూ ఉంటుంది.

వేరే విధంగా కూడా ఈ చిట్టివృత్తాన్ని నడిపించటం కుదురుతుందేమో ఆలోచించ వలసిన విషయమే.

ఈ కుమారవిలసితానికి పూర్వకవి ప్రయోగాలున్నాయేమో తెలియదు.

14, డిసెంబర్ 2015, సోమవారం

రామకుమారలలితం

    కుమారలలిత.
    సురేశహితకామా
    సురారిగణభీమా
    పురారినుతనామా
    పరాకు రఘురామా
కుమారలలిత వృత్తం.

కాకునూరి అప్పకవి ఇచ్చిన లక్షణం ప్రకారం, కుమారలలితవృత్తానికి గణాలు జ-స-గ. అంటే పాదానికి అక్షరాలా అక్షరాలు ఏడే నన్నమాట!. కాబట్టి ఈ‌వృత్తానికి ప్రాసనియమమే కాని యతిస్థానం ఏమీ లేదు. ఈ వృత్తం నడక జ - సగ అనిపిస్తుంది. కావ్యాలంకారచూడామణి కుమారలలితవృత్తం అని పేర్కొన్నది వేరే లక్షణం కలది ఉన్నది. ఇలాగు లక్షణ గ్రంథాలలో తరచుగా ఒకే వృత్తానికి  ఒకో గ్రంథంలో ఒకో పేరుండటమూ,  ఒకే‌ పేరుతో వివిధ గ్రంథాలలో వేరులక్షణాలతో వృత్తా లుండటమూ‌ మామూలే.

ఇలాంటి చిన్నిచిన్ని వృత్తాలకు అంత్యానుప్రాసలు బాగుంటాయి.  అన్ని పాదాలకు ఒకే విధంగా కాని, మొదటి రెండింటికీ ఒకరకంగా చివరి రెండింటికి మరొక విధంగా కాని, పాదం విడచి పాదానికి నప్పే విధంగా కాని ఎలాగైనా అంత్యానుప్రాసను కూర్చవచ్చును.

ఈ కుమారలలిత వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నవో‌ లేవో తెలియదు.


13, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీరామకౌముది

 కౌముది.
 సురలకేమో సుఖావాప్తిగన్
 సురగణారిన్ సొదం బెట్టగన్
 వరలె రామావతారం బిలన్
 పరమధర్మప్రకాశంబుగన్
           (యతి 6వ స్థానం)

 కౌముది.
 దివిషదుల్ గోర శ్రీరాముడై
 భువికినే తెంచె నా వెన్నుడే
 భువనసమ్మోహనాకారుడై
 భువనసంరక్షణోద్యోగియై
          (యతి పాటించలేదు)

 కౌముది.
 అనితరం బైన దా రూపమే
 అనితరం బైన దా శౌర్యమే
 తనువునం దాల్చి తా వెన్నుడే
 మనుజుడై పుట్టె మా రాముడై
           (యతి 7వ స్థానం)
ఈ కౌముది ఒక పొట్టి వృత్తం.

దీనికి గణవిభజన   న -- త -- త -- గ .  పాదం నిడివి 10 అక్షరాలు.  ఇంత చిన్న వృత్తానికి యతిస్థానం అవసరం లేదని నా అభిప్రాయం. కాని లక్షణకారులు 6వ అక్షరం యతిస్థానం అని చెప్పారు. ప్రాసనియమం తప్పదు. నడక విషయం చూదాం. మనం దీనిలోని గురులఘుక్రమాన్ని నల -- ర -- ర అని పంచమాత్రాగణాలుగా విభజన చేయవచ్చును. బహుశః ఇదే సహజమైన గణవిభజన అనుకోవచ్చును. నడక ననన-నా నాననా నాననా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉదాహరణలు చూదాం .

మొదటగా 6వ అక్షరం యతిస్థానంగా ఒక పద్యం.

    సురలకేమో సుఖావాప్తిగన్
    సురగణారిన్ సొదం బెట్టగన్
    వరలె రామావతారం బిలన్
    పరమధర్మప్రకాశంబుగన్


యతినియమం వదిలి పెట్టి ఒక పద్యం.

     దివిషదుల్ గోర శ్రీరాముడై
     భువికినే తెంచె నా వెన్నుడే
     భువనసమ్మోహనాకారుడై
     భువనసంరక్షణోద్యోగియై


ఈ‌ పద్యం పంచమాత్రాగణాలతో‌ కూడిన నడకతో‌ ఉన్నది. ఆ ప్రకారం విడదీసి చూపితే ఈ‌క్రింది విధంగా ఉంటుంది.  ఐదు-ఐదు మాత్రలతో‌  నడిచే తాళగతిని ఖండగతి అంటారు.

దివిషదుల్ గోర శ్రీ రాముడై
భువికి నే తెంచె నా వెన్నుడే
భువన స మ్మోహనా కారుడై
భువన సం రక్షణో ద్యోగియై

ఈ కౌముదీవృత్తానికి యతిస్థానంగా 7వ అక్షరాన్ని గ్రహించటం కూడా బాగుంటుంది. యతిస్థానం కూడా ఒక గురువు పైన వస్తుంది. ఇలా కూడా ఒక పద్యం చెప్పుకుందాం.

     అనితరం బైన దా రూపమే
     అనితరం బైన దా శౌర్యమే
     తనువునందాల్చి తా వెన్నుడే
     మనుజుడై పుట్టె మా రాముడై

యతిస్థానం 7వ అక్షరంగా విరచి చదివితే దీని నడక భిన్నంగా తమాషాగా ఉంటుంది

అనితరం బైన దా - రూపమే
అనితరం బైన దా - శౌర్యమే
తనువునం దాల్చి తా  - వెన్నుడై
మనుజుడై పుట్టె మా - రాముడే

కొందరు  యతిస్థానం 6వ అక్షరంగా నప్పుతుందనీ మరి కొందరు 7వ అక్షరంగా నప్పుతుందనీ అభిప్రాయ పడవచ్చును. అలాగే యతిస్థానం లేకపోవటమే ఉత్తమం అనీ కొందరు అనుకోవచ్చును.  వాడంకం మీద కాని ఏ ఆలోచన సరైనది అని నిగ్గుతేలదు.

ఈ కౌముదీవృత్తానికి పూర్వకవుల ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.


12, డిసెంబర్ 2015, శనివారం

శ్రీరామపదమాలి

     పదమాలి.
     దయగల తండ్రి కృతాంతదండనా
     భయమును ద్రోసి యనన్యభక్తిమై
     జయజయరామ యటంచు జక్కగా
     ప్రియముగ పాడు బుధాళి వేడుకన్
పదమాలి వృత్తానికి గణాలు న - జ - జ - ర అనేవి. యతిస్థానం 10వ అక్షరం.

దీని నడక మిశ్రగతిలో వస్తుంది. మిశ్రగతి అంటే 3-4 మాత్రల గణాలు వరుసగా వస్తూ ఉండటం.

ఈ మిశ్రగతిలో పై పద్యం నడక ఇలా ఉంటుంది.


దయగల తండ్రి కృతాంత దండ నా
భయమును ద్రోసి యనన్య భక్తి మై
జయజయ రామ యటంచు చక్క గా
ప్రియముగ పాడు బుధాళి వేడు కన్


ఇక్కడ నడక 4 - 3 - 4 - 3 - 2 మాత్రలుగా కనిపిస్తోంది కదా అంటే పాదాంతంలో గురువును మనకు కావలసి వస్తే మరో రెండు మాత్రల కాలానికి పొడిగించుకోవచ్చును. అప్పుడు 4 - 3 - 4 - 3 - 4 మాత్రలుగా అవుతున్నది.  ఇలా ఉంది కాబట్టి మిశ్రగతి అన్నమాట. మిశ్రగతికి నప్పే తాళం త్రిపుటతాళం. ఇక్కడ మనకు సానుకూలాంశం యతిస్థానం తాళం మధ్యలో రావటం లేదు.  అందుచేత ఈ నడక సహజంగానే నప్పుతుందని నా విశ్వాసం.

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఇంద్రవంశంలో‌ రామస్తుతి.    ఇంద్రవంశం.
    శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే
    నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
    రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్

ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తానికి గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగుటపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యమే అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి వేసాం. పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను అభ్యాసం చేయవచ్చును.


10, డిసెంబర్ 2015, గురువారం

సింహగతి శ్రీరామం.

      సింహగతి.
      రామునే తలపరాదా
      ప్రేమతో పిలువరాదా
      నీ‌ మనోరథము నీయన్
      స్వామి నీ కడకు రాడా
 
      సింహగతి.
      భామ  లందరును రారే
      ప్రేమ మీఱగను సీతా
      రామచంద్రులకు వేడ్కన్
      క్షేమహారతుల నీరే
సింహగతి అనేది ఒక కొత్త వృత్తం. నా సృష్టియే.  దీనికి గణవిభజన ర-న-గగ చిన్న వృత్తం‌కాబట్టి యతిస్థానం ఏమీ‌ ఉండదు. ప్రాసనియయం మాత్రం ఉంటుంది.

ఈ వృత్తానికీ‌ సింహరేఖకీ‌ చాలా దగ్గర చుట్టరికం. ఒకే ఒక అక్షరంలోనే తేడా. క్రీగీటుతో‌చూపుతున్నాను ఆ తేడాను.

సింహరేఖ   U I U I U I U U
సింహగతి   U I U I I I U U

అంతే తేడా. కాని నడక వేరుగా వస్తుంది.  ఈ‌ సింహగతిలో సాధారణంగా  'న' గణం‌ దగ్గర విరుపు వస్తుంది. లేదా న-గణానికి పూర్వాక్షరం మీద విరుపు వస్తుంది. అలాగే చివరన ఉన్న 'గగ' పైన కూడా ఒక చిన్న విరుపు ఉందని గమనించండి.

      రామునే - తలప - రాదా
      ప్రేమతో - పిలువ - రాదా
      నీ‌ మనో - రథము - నీయన్
      స్వామి - నీ కడకు - రాడా

ఇందులో మొదటి మూడు పాదాల్లోనూ న-గణం దగ్గరా, చివరిపాదంలో తత్పూర్వాక్షరం పైనా విరుపు గమనించండి.  రెండవరకం విరుపు ప్రథానంగా ఉన్న పద్యం.

     భామ -లందరును - రారే
     ప్రేమ -మీఱగను - సీతా
     రామ - చంద్రులకు - వేడ్కన్
    క్షేమ - హారతుల - నీరే


ఇది వ్రాయట‌ం సులభం కాబట్టీ ఔత్సాహికులు ప్రయత్నించండి.

9, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీరామచంద్రవర్త్మ


    చంద్రవర్త్మ.
    రాము డల్పుడని రావణు డనియెన్
    రామబాణమున ప్రాణము వదిలెన్
    కాముకుండు నరకంబున కరిగెన్
    భామతోడ రఘువల్లభు డరిగెన్

చంద్రవర్త్మ

దీని గణవిభజన ర - న - భ - స.  యతిస్థానం 7వ అక్షరం.

ఇది స్వాగతవృత్తానికి కవలసోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట.

ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.

    రాము  - డల్పు - డని  - రావణు - డనియెన్
    రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
    కాము - కుండు - నర - కంబున కరిగెన్
    భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్

8, డిసెంబర్ 2015, మంగళవారం

ద్రుతవిలంబితం

     ద్రుతవిలంబితం.
     ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
     నచటి భోగము లెప్పుడు గోరినా
     నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
     నచట నుండెద నంతియ జాలదే

      
            ద్రుతవిలంబితం.
ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే గియితే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU          న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                     

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.  ఇలా ద్రుతవిలంబితంలో తేటగీతిని గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.

7, డిసెంబర్ 2015, సోమవారం

శ్రీరామ నవమాలిని

      నవమాలిని.
      ఇనకుల నాయకా యితరు లేలా
      నను నిను కన్నుగానకను తిట్టన్
      దనుజుల పైన నాదరము ధర్మం
      బన నగు నట్టి వీ రసురు లేమో
      
            
నవమాలినీ వృత్తం

ఈ నవమాలినీ వృత్తానికి గణవిభజన న - జ - భ - య.  యతిస్థానం 8వ అక్షరం. వృత్తానికి ప్రాసనియమం ఉంటుంది.
ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.

పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

దీని నడక చూస్తే ఇల్లా ఉంది:

      ఇనకుల - నాయకా - యితరు - లేలా
      నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
      దనుజుల - పైన నా - దరము - ధర్మం
      బన నగు - నట్టి వీ - రసురు -లేమో

 వేరే‌ నడకలతో ఈ వృత్తంలో‌ పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.6, డిసెంబర్ 2015, ఆదివారం

చిత్రపద శ్రీరామం

      చిత్రపద
      రాముని నమ్మిన వాడా
      నీమము దప్పని వాడా
      స్వామియె తోడుగ లేడా
      కామిత మీయగ రాడా

చిత్రపద వృత్తం.

దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని.  వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.

     భక్తి జనావన దక్షా
     ప్రాక్తన శాసన పక్షా
     యుక్త విచారణ దీక్షా
     సక్త మహేశ్వర రక్షా

ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.5, డిసెంబర్ 2015, శనివారం

జలద వృత్త పద్యాలు

    జలదం.
    పుట్టువు లేని వాడొకడు పుట్టెనయా
    పుట్టెడు నెల్లవారలకు పుట్టువులే
    పుట్టని మంచిదారి రఘుపుంగవుడై
    యిట్టి దటంచు జూపె నటు లేగుదమా
    
    జలదం.
    రామచరిత్రముం జదువ రక్కట శ్రీ
    రాముడు చెడ్డవాడనుచు రావణుపై
    ప్రేమను చిల్కరించి చెలరేగెద రీ
    భూమిని కొంతమంది కలి బోధితులై

జలదం.

గణ విభజన భ - ర - న - భ - గ.  యతిస్థానం 10వ అక్షరం.

ఈ‌ జలద వృత్తం  ఉత్పలమాలకు దగ్గరి చుట్టం.

ఉత్పలమాల గణాలు భ - ర - న - భ - భ - ర - వ. అంటే ఉత్పలమాలలో మొదటి 13అక్షరాలకుకుదిస్తే అది జలదం అన్నమాట.

ఈ‌ జలదవృత్తానికి పూర్వకవి ప్రయోగాలున్నాయో లేదో నాకు తెలియదు.

ఇక్కడ నేను రెండు పద్యాలను చూపాను.  రెండింటికి నడకలో బేధం ఉండటం గమనించండి.  రెండు పద్యాల్లోనూ ప్రవాహగుణం చూడవచ్చును. ప్రవాహగుణం అంటే పాదంచివరి మాట తరువాతి పాదంలోనికి చొచ్చుకొని పోవటం అన్నమాట. ఇది పద్యానికి కొంత గాంభీర్యత తెస్తుందన్న అభిప్రాయం కొంత కవిలోకంలో తరచు వినబడుతుంది.  పూర్తిగా కాదు కాని అది కొంతవరకు నిజం. కాని సంస్కృతంలో మాత్రం ఏ పాదానికి ఆపాదం పూర్తికావాలి.  పాదం చివరి మాట తరువాతి పాదంలో కొనసాగటం నిషిధ్ధం. అందువల్ల సంస్కృత కవిత్వంలో గాంభీర్యానికి లోపం ఏమీ రాలేదు కదా.  తెలుగులో దీర్ఘాంతంగా ముగిసే పదాలు తక్కువ.  అందుచేత సంసృతవృత్తాలను తెలుగు భాషలో పద్యాలుగా వ్రాసేటప్పుడు పాదోల్లంఘనాన్ని అనుమతించక తప్పదు.  లేకపోతే విడివిడిగా పద్యాలు కుదురుతాయేమో కాని కథాకథనానికి పద్యాలు సహకరించవు.


4, డిసెంబర్ 2015, శుక్రవారం

మణిరంగంతో రామస్తుతి.

       మణిరంగం.       
       శ్యామలాంగ వియచ్చరపూజ్యా
       రామచంద్ర సురారివిరోధీ      
       నామనంబున నమ్మితి నయ్యా
       ప్రేమ నేలవె వేదసువేద్యా


ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం.

గణవిభజన ర - స - స - గ .
యతిస్థానం 6వ అక్షరం.
ప్రాసనియమం ఉంది.

నడక ప్రకారం దీని గణ విభజన (హ భ) (భ గగ) అన్నట్లు ఉంటుంది.  సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.

       శ్యామ - లాంగ వి - యచ్చర - పూజ్యా
       రామ - చంద్ర సు - రారివి - రోధీ      
       నామ - నంబున - నమ్మితి - నయ్యా
       ప్రేమ - నేలవె - వేదసు - వేద్యా

ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.3, డిసెంబర్ 2015, గురువారం

మంజులయాన వృత్తంలో విన్నపం.

    మంజులయాన.
    కనులార భవదీయ కమనీయ రూపమున్
    కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
    తనివార నిను జూడ తగనందువా ప్రభూ
    మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా

ఈ 'మంజులయాన' వృత్తం కూడా నేను సృష్టించినదే. అప్పట్లో దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా.

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

దీని లక్షణాలు. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం.  ఇది నడకప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
     అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు తదుపరి అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

2, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీరామ భద్రకం

      భద్రకం.
      రాముడా యతడు దేవుడే
      ఏమి సందియము లేదులే
      భూమిపై నిలుప ధర్మమున్
      స్వామి తా నిలకు వచ్చెలే

భద్రక వృత్తం.

ఈ‌ భద్రకం అనే చిట్టిపొట్టి వృత్తానికి గణాలు ర - న -ర. అంటే‌పాదానికి 9 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిస్థానం ఉండదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంటుంది.  ఈ‌ పద్యం నడక గణాంతాల్లో విరుపుతో ఉంటుంది.

నాకు తెలిసి పూర్వకవి ప్రయోగాలు లేవు.

పై పద్యంలో నేను సరిపాదాలకు అంత్యప్రాసను కూర్చాను.  కాని నియతంగా అంత్యప్రాసాదులు వాడవలసిన పని లేదనే అనుకుంటాను.

భద్రకాలు వ్రాయటం సులువు గానే కనిపిస్తోంది.

వీలైతే మీరూ‌ కొన్ని భద్రకాలు వ్రాయండి.

1, డిసెంబర్ 2015, మంగళవారం

రాముడు మీకు నచ్చకపోతే ఈ బ్లాగుకు రాకండి దయచేసి

ప్రపంచం చాలా చిత్రమైనది.

భగవంతుడి సృష్టి కదా. అలాగే ఉంటుంది.  వైవిద్యంలేకుంటే సృష్టి ఎలాగు మరి?  తెల్లరంగు కాగితం మీద అదేతెలుపు రంగుకల సిరాతో బొమ్మవేయలేం కదా. రెండవ రంగు లేనిదే బొమ్మలేదు. అలాగే సృష్టిలో అన్ని విషయాల్లోనూ అటు మొగ్గు చూపే వారూ‌ ఉంటారు, ఇటు తిరిగే వాళ్ళూ‌ ఉంటారు. అది సహజం.

మీరు ఏ వస్తువును తీసుకోండి. దానిని యిష్టపడే వాళ్ళుంటారు. అది బొత్తిగా ఇష్టం‌ ఉండని వారుంటారు.  ఏ విషయం తీసుకోండి మీతో విబేధించే వాళ్ళు తప్పకుండా ఉంటారు.

మీరు ఇష్టపడే భావనలను అసహ్యించుకొనే వారుంటారు. మీ భావనకు అందిన దానిని మరింతగా భావన చేయగలిగిన వారుంటారు. పదిమంది ఏదో ఒక సందర్భంగా వచ్చి సంతోషంగా భోజనం చేసి వేడితే అది ఎంతో శుభం అనీ తమకు జయం‌ అనీ‌ తృప్తి పడే వారుంటారు. ఇలాంటి వన్నీ‌ దండగమారి ఖర్చులని చీదరించుకొనే వాళ్ళుంటారు.

మీరు ఇష్టపడే కూరను అసహ్యించుకొనే వారుంటారు.  ఒకసారి మా యింటికి ఒక దగ్గరచుట్టం‌ అబ్బాయి భోజనానికి వచ్చాడు. మేం ఎంతో ఆదరంగా పిలిస్తేనే లెండి. మా ఆవిడ ఎంతో ఆప్యాయంగా గుత్తివంకాయకూర చేసింది. అదొక్కటే అని అనుకోకండి, మిగతావాటితో‌పాటు ముఖ్యంగా అదీ ఉందన్నమాట.  ఆ అబ్బాయి మిగతా అన్ని ఆధరవులనీ కానిచ్చాడు కాని గుత్తివంకాయ కూరను తాకనన్నా తాకలేదు. అయ్యో‌ అనుకున్నాం. అది వేరే సంగతి.  ఆ తరువాత కొన్నాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఆ అబ్బాయికి వంకాయ ఇష్టంలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే వంకాయంటే పరమ అసహ్యంట!

మీకు నచ్చిన దైవం‌ కొందరి దృష్టిలో‌ దయ్యం. తమాషా ఏమిటంటే దయ్యం‌ అన్నమాట గురించి చాలా మందికి తెలియదు. దేవుడు ప్రకృతి దయ్యము వికృతి. హైస్కూల్లో ప్రకృతి వికృతుల గురించి చదివే ఉంటారు కదా, అందులో ఇదొకటి చిన్నయసూరిగారు పంచతంత్రంలో ఒక చోట దయ్యంబునకు దయాలేశంబునుం గలుగదు అని అంటారు. ఈ వాక్యంలో దయ్యం అంటే దేవుడే మరి. నా చిన్ననాటి స్నేహితులు కొందరు వీరశైవులు. కాని పేర్లు అన్నీ‌పెట్టుకుంటారు లెండి. ఒకతని పేరు వీరవేంకట సత్యనారాయణ, మరొకతని పేరు పాండురంగారావు. అప్పటికే వీరత్వాల గందరగోళాలు శైవంలో నుండి తప్పుకున్నాయి. కనీసం నా ఉద్దేశం అలా ఉండేదా? ఒకనాడు వేరే వాళ్ళు కొందరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. నేను విన్నాను - ఆశ్చర్యంతో తలమునక లయ్యాను. ఇంకానా? అనిపించింది వాళ్ళ ధోరణి. ఒకబ్బాయి మరొకడితో అన్నాడు, 'ఏదో విష్ణుమూర్తి అంతవాడు ఇంతవాడు అంటారు కాని శివుడి ముందు బలాదూర్. అందుకని శివుణ్ణే పూజించాలి కాని విష్ణుపూజ దందగ' అని. సరి సరి, గతించిన కాలంలో శైవులూ వైష్ణవులూ చచ్చేట్లు కొట్టుకున్నారనుకోండి. ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటీ? కాలం ఏదైనా నా దృష్టిలో దేవుడు మీకు పూచికపుల్ల కావచ్చును. ఒకే కుంటుంబంలో జనం మొదట, జై హరనాథ బాబా, జై కుసుమకుమారి అని భజనలు చేయటం చూసాను, ఆతరువాత షిర్దీసాయిబాబా భజనలు చేయటం చూసాను, అలాగే పుట్టపర్తి సాయిబాబా భజనలు చేయటమూ చూసాను. మధ్యలో కొందరు ఆ బాబా గొప్ప ఈ‌ బాబా గొప్ప అని దొమ్ములాడుకోవటమూ చూసాను. నిష్ఠ అంటే నిష్ఠగాదు పరమనిష్ఠగా ఘడియఘడియకూ దేవుడికి దందాలు పెట్టుకొనే వ్యక్తి హఠాత్తుగా ఏదో మిషన్ వారు వద్దన్నారని శ్రీరామపంచాయతన విగ్రహాలని హుస్సేన్ సాగర్‌లో‌ పారేయటమూ చూసాను. రాముడి ఫోటో‌ ఇంట్లో‌ ఉంటే అది విగ్రహారాధన క్రిందికి వస్తుందని పీకి విసిరేసిన వాళ్ళే, బాత్ రూముల తో సహా ఇంటినిండా వారి గురువుగారి ఫోటోలు అతికించుకున్నారు. అది విగ్రహారాధన కాదా అంటే కాదట. కేవలం రాముడు కృష్ణుడు శివుడు వగైరాల బొమ్మలే పనికిరావుట.

నేను ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న రోజుల్లో ఒక పెద్దమనిషిని కలిసాను. దూరపు బంధువే లెండి. మంచి స్థాయిలో ఉన్నాడు. సి.ఏ పరీక్షలకు పేపర్లు గట్రా తయారు చేస్తాడట ఆయన. ఏం చదివావ్ అన్నాడు. బి.యస్సీ అన్నాను. ఆయన చిరాకు పడ్డాడు. ఇలాంటి చెత్త సబ్జెక్టులు ఎందుకు చదువుతున్నారు కుఱ్ఱాళ్ళు. నువ్వు బి.కాం ఎందుకు చేయలేదు - అదైతే బాగుండేది ఫ్యూచర్ అని విసుక్కున్నాడు.  అయన లైన్ కానిదంతా ఆయనకు చెత్త.

ఒక సారి నా కారులో జాస్మిన్ సెంట్ కావాలన్నాను కార్‌వాష్ అబ్బాయితో. అదే వచ్చింది. మర్నాడు మరొకతనికి రైడ్ ఇచ్చాను ఆఫీసునుండి, దారిలో అతను అన్నాడు కదా. 'ఈ‌ డర్టీ జాస్మిన్ సెంట్ కొట్టేస్తారు వాళ్ళు నువ్వు లవెండర్ అడక్క పోయావా' అని. ఏం‌ మాట్లాడాలి? నాకూ‌ మా ఆవిడకూ‌ కూడా జాస్మిన్ (మల్లె) వాసన బాగుంటుంది. రేపెవడో సంతలో చింతకాయకు నచ్చాలని రూలుందా? నచ్చకపోతే మానాలని రూలుందా? ఆతరువాత కూడా నేను జాస్మిన్ సెంట్ కొట్టించుకున్నాను చాలాసార్లు.

తెలుగు బ్లాగుల్లో‌ రకరకా లున్నాయి.  కొందరు సినిమాకబుర్లు వ్రాస్తారు. కొందరు రాజకీయాలు వ్రాస్తారు. కొందరు జ్యోష్యం‌ లాంటివి రాస్తారు. కొందరు లోకాభిరామాయణం వ్రాస్తారు. కొందరు గాలికబుర్లు వ్రాస్తారు. కొందరు అక్కడా అక్కదా పోగేసుకొచ్చిన సమాచారం ఏదో నలుగురికీ నచ్చుతుందనో‌ ఉపయుక్తంగా ఉంటుందనో వ్రాస్తారు.  కొందరు ఆధ్మాత్మిక విషయాలు వ్రాస్తారు. కోందరు ఆధ్యాత్మిక విషయాలు వ్రాయటానికి ప్రయత్నం చేస్తారు.  కొందరు తమ తమ సర్వఙ్ఞత్వాన్ని ప్రదర్సించుకుందుకు వ్రాస్తారు. కొందరు హాస్యపుజల్లులు కురిపించటానికి వ్రాస్తారు. కొందరు హోరాహోరీ చర్చలను రేకెత్తించటానికి వ్రాస్తారు. కొందరు కామెంట్లపంట కోసం వ్రాస్తారు. కొందరు కాలక్షేపం కోస వ్రాస్తారు.  కొందరు ఆలోచనలను రేకెత్తించటానికి వ్రాస్తారు. కొందరు విఙ్ఞానం పంచుతారు. కొందరు తలనొప్పిని పంచుతారు. కొందరు జీవితానుభవామృతాన్ని పదిమందికీ పంచటానికి నిష్కామంగా వ్రాస్తారు. కొందరు తమకు తెలిసినదానికి మించి  జీవితానుభవం అంటూ ఉండదన్న భ్రమలో పడి ఏదేదో వ్రాస్తారు. కొందరు కవిత్వం వ్రాస్తారు, కొందరు కవిత్వంలాంటిది వ్రాస్తారు.కొందరు తాము వ్రాసేది కవిత్వం అనుకుంటారు.

ఐతే అందరూ అన్నిబ్లాగుల్నీ చదువుతున్నారా? లేదు కదా. అసలు అలా చదవాల్సిన అవసరం ఉందా? లేదు కదా.  ఏదన్నా ఒక బ్లాగు మనకి నచ్చాలన్న రూలే మన్నా ఉందా? లేదు కదా. మనకి బాగా నచ్చే బ్లాగులో నన్నా ప్రతిటపా మనకి గాఢంగా నచ్చాలన్న రూలేమన్నా ఉందా?‌ లేదు కదా.

అందుచేత చదువరులు తమకి నచ్చిన బ్లాగులు చదువు కోవచ్చును.  నచ్చని వాటికి దూరంగా ఉండవచ్చును. నచ్చిన టపాను మెచ్చవచ్చును.  నచ్చని దానిని విస్మరించవచ్చును.

ఒక బ్లాగుపధ్ధతి హితవు ఐతే అది చదవట‌ం సహజం. ఒక బ్లాగు పధ్ధతి ఎవరి కైనా హితవు కాకపోతే దానికి దూరంగా ఉండటం కూడా సహజమే. కాని ఫలాని బ్లాగు ధోరణి ఫలాని రకంగా ఉందనీ ఉంటుందననీ‌ తెలిసి, ఇది నచ్చలేదూ‌ అది నచ్చలేదూ, నువ్వలా వ్రాయకూడదూ‌, ఇలా వ్రాయకూడదూ‌ అని అనటం ఉచితం కాదు. ఇంగ్లీషు వాడిదో‌ సామెత ఉంది. You go to your church,  I go to mine అని. మీకు మీరే, మాకు మేమే ఎందుకీ‌ రుసరుస నసనస అన్నట్లన్నమాట.

ఈ శ్యామలీయం బ్లాగు ప్రథానంగా ఆద్మాత్మిక వ్యాసంగంతో‌ నడిచే‌ బ్లాగు.  ఈ విషయంలో రహస్యం ఏమీ‌ లేదు. ఈ శ్యామలీయం బ్లాగు బేనర్ ఇలా చెబుతున్నది.

  దేహబుధ్యా తు దాసోఽహం
  జీవబుధ్యా త్వదంశకః
  ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌
  ఇతిమే నిశ్చితా మతిః


నాకూ‌ రాముడికీ విడదీయరాని అనుబంధం ఉంది. అనేక విషయాలను సభాముఖంగా మాట్లాడటం సబబు కాదు. కాబట్టి అలాంటివి ప్రస్తావించను. ఒక్కటి మాత్రం చెబుతాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నా రాముడు నాతోనే ఉన్నాడు. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నేను ఆ విషయంలో చెప్పేది ఏమీ‌ లేదు. నా ఙ్ఞాపకశక్తి తీక్షత నాకు బాగానే తెలుసును. నాకు మూడు సంవత్సరాల చిల్లర ప్రాయంలో మా పితామహులు కాలం చేసారు. కాలం చేయక ముందు కొన్ని నెలలు మంచం పట్టారు. అంతకు ముందు ఆయన నన్ను చంకన వేసుకొని ఊళ్ళో తిరగటం నాకు గుర్తుంది బాగానే. ఆయన ముఖమూ, వేషమూ చేతికర్రా కూడా ఇప్పటికీ‌ చాలా బాగా గుర్తున్నాయి. అప్పుడప్పుడు ఆయన నన్ను మా వూళ్ళో ఉన్న కుర్ర షావుకారు కనకయ్య పచారీ కొట్టుకు తీసుకొని వెళ్ళటమూ, అక్కడ పంచదార బిళ్ళలు ఇప్పించటమూ‌ బాగా గుర్తున్నాయి. ఆఖరికి ఆయనకు ప్రాణోత్ర్కమణం జరిగిన నాటిరాత్రి నేనొక అర్థణా బిళ్ళ మింగేసిప్పుడు రేగిన గడబిడ కూడా నాకు గుర్తుంది. ఇవన్నీ‌గుర్తున్నట్లే నాకు రాముడు ఊహ తెలిసినప్పటినుండీ వెనుగాచి యున్నదీ‌ బాగా గుర్తుంది.

నేను నా రాముడి అనుగ్రహం కోసం వ్రాసుకుంటున్నాను. అలా వ్రాసుకోవటంలో నాకు తృప్తి ఉన్నది. అందుచేత వ్రాస్తున్నాను.  అందరికీ‌ నచ్చాలని వ్రాయటం లేదు. ఎవరికీ నచ్చకపోయినా మానటమూ‌ లేదు. ఇకముందు మానటమూ‌ జరగదు కూడా ఇది నా  తృప్తికి సంబంధించిన విషయం కాని జనాకర్షణకు సంబంధించిన విషయం‌ కాదు.

నేను నా బ్లాగులో ఏమి వ్రాయాలో వ్రాయకూడదో ఎవ్వరూ నిర్ణయించలేరు. ఎవరైనా అలా అనుకుంటే అది కేవలం వారి అఙ్ఞానం మాత్రమే.

నేను రాముణ్ణి పొగడటం అనే వ్యవహారం ఎవరికో నచ్చకపోతే దానికి నా పూచీ ఏమీ‌ లేదు.  రామో‌విగ్రహవాన్ ధర్మః అని రాముడికి కితాబు ఇచ్చిన వాడు రాక్షసుడైన మారీచుడు. ఏ విశ్వామిత్రుడో బ్రహ్మాగారో ఇంద్రుడో అన్నమాట కాదిది.

రాముడి గురించి పద్యాలూ కీర్తనలూ వ్రాయటం నాతో‌ మొదలు కాలేదు. నా కంటే ముందు ఎందరో‌ మహానుభావులైన భక్తులు ఆ పని చక్కగా చేసారు.  శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీరామకర్ణామృతం వ్రాసారు.  పెళ్ళి శుభలేఖలమీద తరచుగా (అప్పుతచ్చులతో) కనిపించే‌ జానక్యాః కమలామలాంజలి పుటే... అన్న శ్లోకం అందులోనిదే.

ఏదో నా శక్తి మేరకు నా తృప్తి కొరకు నేనూ వ్రాసుకుంటున్నాను. నా ధోరణి తెలిసి, అది నచ్చిన వాళ్ళు ఆ కీర్తనలనీ పద్యాలనీ‌ చదువుకొన వచ్చును. నచ్చని వాళ్ళు మహారాజుల్లాగా మహారాణుల్లాగా తమకు నచ్చిన బ్లాగులు హాయిగా చదువుకోవచ్చును.

అంతే కాని నా రచనలు పట్టుకొని వాటిలో తమకు నచ్చని విషయాలేవో ఉన్నాయని, ఎవరైనా కయ్యాలకు దిగటం సరైన పధ్ధతి కాదు.  అటువంటి అభ్యంతరాలకు జవాబులు చెప్పటం వలన ప్రయోజనం‌ ఉండదని నా అభిప్రాయం. అందుచేత ఆ పని చేయటం వీలుపడదు.

అందుచేత సోదర బ్లాగరు బ్లాగరిణీ‌ మహాశయులకు విఙ్ఞప్తి ఏమిటంటే రాముడు మీకు నచ్చకపోతే ఈ బ్లాగుకు రాకండి దయచేసి.

ఇంతకంటే చెప్ప వలసింది ఏమీ‌లేదు.