31, డిసెంబర్ 2014, బుధవారం

ఆదివారమునాడు అరటి మొలచినది


ఇది నేను రెండవతరగతిలో ఉన్నప్పుడు మా తెలుగువాకచకంలో చదువుకున్న పాట. ఈ రోజున ఎవరో తమ టపాలో దీనిని ప్రస్తావించారు. ఇదింకా ఎవరికైనా గుర్తుందా అని. నాకు గుర్తుందని చెప్పాను కాని ఆ టపా రిఫరెన్సు ఇద్దాం ఇక్కడ అంటే అది కాస్తా ఇప్ప్పుడు గుర్తుకు రావటం లేదు! సరేనని ఈ పాటను మాత్రం ఇక్కడ ఇస్తున్నాను.ఆదివారమునాడు అరటి మొలచినది
సోమవారమునాడు చిగురు తొడిగినది
మంగళవారమునాడు మారాకు వేసినది
బుధవారమునాడు పొట్టిగెల వేసినది
గురువారమునాడు గుబురుగా పెరిగినది
శుక్రవారమునాడు చూడగా పండినది
శనివారమునాడు అత్తములు కోసితిమి
అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో
23, డిసెంబర్ 2014, మంగళవారం

నేటి వారిని నడిపించ నీక తగును


నేటి వారికి జెప్పు నేర్పుగలాడనే
నేరు పట్టిది చూడ నీక చెల్లు

నేటి వారల మేథ నాకింతయును లేదు
దాని మించిన మేథ తనరు నీక

నేటి కాలంబున నామాట లతుకవు
కాలోచితప్రజ్ఞ గలుగు నీక

నేటి వర్తనములు నే నేర్వగా లేను
నేరుపు లన్నియు నేర్తువీవ

నిన్న చెల్లితినో లేదొ నేనెఱుంగ
నేడు చెల్లుట కనరామి నిశ్చయంబు
నేడు రేపను బేధంబు నీకు లేదు
నేటి వారిని నడిపించ నీక తగును
22, డిసెంబర్ 2014, సోమవారం

జీవన చక్రం


ఒకజీవి కడుపులో నొకజీవి పొడమును
గర్భనరకమున గాసివడుచు

పూర్వభవంబుల బుధ్ధిహీనతచేత
జేసినచెయ్వుల జెప్పుకొనుచు

పరమాత్మ నీ దయ భావించి వేడుచు
పరిపరివిధముల పనవుచుండు

శపథంబు చేయును సచ్చరితంబున
నిలపైన మున్ముందు మెలిగెదనని

మాతృగర్భంబు వెల్వడి మహికి వచ్చి
మరచు నా గర్భనరకమున్ మరచు నిన్ను
మరచు శపధంబు మాయలో‌ మరల మునుగు
దుదిని వేరొక్క గర్భంబు దూరువరకు
20, డిసెంబర్ 2014, శనివారం

ఎఱిగిన దొక్క నీవే కదయ్య

ఈశ్వరా యీ సృష్టి యెందుకు చేసెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా జీవుల మెందు కిందుంటిమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా మాయలో నెందుకు ముంచెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా యేజీవి కెప్పుడు మోక్షమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

యేమి చేయుదు నీ ప్రశ్న లెవరి నడిగి
యేమి లాభంబు లేదని యెఱిగి తుదకు
చేయునది లేక కరుణతో చెప్పుమనుచు
నిన్ను ప్రార్థించుచుంటి ప్రసన్నమూర్తి
18, డిసెంబర్ 2014, గురువారం

నీకునై ఘనతపోనిష్ఠల పనిలేదు

నీకునై ఘనతపోనిష్ఠల పనిలేదు
తన మనంబున నిన్ను తలచుచున్న

నీకునై విద్యల నేర్వగ బనిలేదు
తన బుధ్ధి నీయందు తగిలియున్న

నీకునై జగమును ఛీకొట్ట బనిలేదు
తన యహమిక నిన్ను దాల్చియున్న

నీకునై యందదు నెమకెడు పనిలేదు
తన చిత్తమున నిన్ను గనుచునున్న

ఇల మనోబుధ్యంహకారములను నిన్ను
తవిలి యుండిన చాలదె భవము విడగ
నీశ్వరా యేను వెఱ్ఱినై యిన్ని నాళ్ళు
నింద్రియంబల దవిలితి నెఱుక లేక
16, డిసెంబర్ 2014, మంగళవారం

వాల్మీకిరామాయణంలో శివధనుర్భంగ ఘట్టం - వివరణతో. (66వ సర్గ)


వాల్మీకి రామాయణం.  బాలకాండ.  66వ సర్గ

[ ఈ టపా అసంపూర్ణం. మార్పులకోసం వేచియుండ వలసిందిగా విజ్ఞప్తి.]
66వ సర్గ సంపూర్ణంగా వ్యాఖ్యానించబడింది.  67వ సర్గ ఇంకా వ్యాఖ్యానం చేయాలి.

తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః 
విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం 1
జనకమహారాజు గారు ఉదయమే సంధ్యావందనాది నిత్య కర్మ లన్నింటినీ పూర్తి చేసుకున్నారు.  ఆ తరువాత మహాత్ముడైన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారిని, ఆయన శిష్యులుగా వచ్చిన రఘువంశానికి చెందిన ఆ ఇద్దరు రాచబిడ్డలతో సహా ఆహ్వానించారు. 
నిత్య కర్మలనీ నైమిత్తక కర్మలనీ రెండువిధాలు వైదిక కర్మలు. సంధ్యావందనాదులూ, దేవతార్చనా వంటివి నిత్యం చేయవలసినవి. ఏ దైనా సందర్భానికి అనుగుణంగా కాని ఇష్టకామ్యార్థసిధ్ధికి కాని ప్రత్యేకంగా చేసే కర్మలు నైమిత్తికాలు. అంటే పండగల్లో చేసే ప్రత్యేకపూజలూ, సత్యనారాయణవ్రతాలూ వంటివన్నీ నైమిత్తికాలు . ఈ నైమిత్తికాలకు అవి ఏఏ సమయాల్లో చేయాలో వాటి విధివిధానాలు ఆయా కర్మలకు సంబంధించి విడిగా ఉంటాయి. కానీ, నిత్య కర్మలన్నీ కూడా తప్పనిసరిగా సూర్యభగవానుడు ఉదయించటానికి ముందటి ముహూర్తంలోనే పూర్తి చేయాలి. ఈ ముహూర్తాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. ఈ మధ్య కొందరు తప్పుగా బ్రహ్మముహూర్తం అనటం వినిపిస్తోంది.

ఇక్కడ తతః ప్రభాతే అంటే ఆ ఉదయమే అని చెప్పారు కాబట్టి విశ్వామిత్రులవారు రామలక్ష్మణులతో సహా మిధిలాపురానికి రాత్రికాలంలో వేంచేసారు. ఆ రాత్రి గడచిన వెంటనే ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం అంతా అన్నమాట.

అలాగే విశ్వామిత్రుడికి మహాత్ముడని ఒక విశేషము వేసారు వాల్మీకి.  అలాగే రామలక్ష్మణులను రాఘవులు అన్నారు.  ఎందుకంటే విశ్వామిత్రుడు రామాయణకాలానికే బ్రహ్మర్షిత్వాన్ని సాధించిన మహనీయుడు. సగౌరవంగా అంతా ఆయనను భగవాన్ అని సంబోధిస్తారు.  ఇక ఈ అన్నదమ్ములను రాఘవులు -అంటే రఘువంశంవారు- అనటం మహా ఉచితమైన మాట. ఆ రఘుమహారాజు వారికి వంశకర్తకదా! కుబేరుడి మీదకే దండయాత్రకు సమకట్టగలిగిన మహావీరుడు. పరీక్షించటానికి వృధ్ధబ్రాహ్మణరూపంలో  ఇంద్రుడు వచ్చి, దాసీగా సాక్షాత్తూ మహారాణీనే కోరుకుంటే సరే దానమిస్తున్నాను తీసుకు వెళ్ళండి అనగలిగిన అసామాన్యమానవోత్తముడు. అటువంటి వారి వంశంలో పుట్టిన ఉత్తమక్షత్రియకుమారులని రామలక్ష్మణులను కీర్తించటం ఇలా రాఘవులూ అనటంలోని ఉద్దేశం.
తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేణ కర్మణా 
రాఘవౌచ మహాత్మానౌ తదావాక్య మువాచహ  2
శాస్త్రవిధిని చక్కగా అనుసరించి జనకమహారాజుగారు విశ్వామిత్ర మహర్షిని పూజించారు. అలాగే రఘువంశసంజాతులైన రామలక్ష్మణులను కూడా మహాత్ములవలెనే సంభావించి సముచితరీతిని సన్మానించారు మహారాజుగారు. అనంతరం అయన ఇలా అంటున్నారు.
అర్షధర్మంలో అన్నింటికీ విధివిధానాలను నిర్ణయించారు. ఆ నిర్ణయాలసమాహారానికే శాస్త్రం అని పేరు. శాసయతి ఇతి శాస్త్రః. అంటే ఇది ఇలా చేయాలి. ఇది చేయరాదు అని నిష్కర్షగా చెప్పేదే శాస్త్రం అన్నమాట. దానిని తూచ తప్పకుండా పాటించటాన్ని సముదాచారం అని పిలుస్తారు. జనకుడు స్వయంగా గొప్ప విద్వాంసుడు, వేదాంతి. ఆ ఆచారాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే రామలక్ష్మణులు అతిథులుగా వచ్చారు. అతిథి దేవోభవ అన్నారు కదా.  అందుచేత చాలా పధ్ధతిగా జనకమహారాజు గారు అ మహర్షికీ, అన్నదమ్ములకూ కూడా శాస్త్రోచితంగా సత్కారం జరిపారు స్వయంగా.  ఇక్కడ మన ఇంటికి వచ్చిన వారికి ఏదో తోచినట్లుగా కాకుండా ధర్మం ఎలాచెబుతోందో అలా శాస్త్రప్రకారం మర్యాదలు చేయాలీ అని వాల్మీకులవారు మనకి హితవు చెబుతున్నారు అన్యాపదేశంగా అని తెలుసుకోవాలి.
భగవాన్ స్వాగతం తేస్తు కింకరోమి తవానఘ
భవానాజ్ఞాపయతు మాం ఆజ్ఞాపయ భవతాహ్యహం  3
(వారికి సకల మర్యాదలూ జరిపించిన తరువాత విశ్వామిత్రమహర్షితో జనకులు అంటున్నారు.) ఓ భగవాన్, మీకు స్వాగతం. మీకు నేనేమి చేయగలను? నా వలసిన కార్యం ఏమిటో తమరు ఆజ్ఞాపించండి.
మన ఇంటికి వచ్చిన అతిధులను చూసి వారు ఎందుకు వచ్చారో అని మనం కొంచెం ఆత్రుత పడటం‌ సహజం. అలాగని వారు వచ్చీ రాగానే చెప్పులన్నా విప్పుకోకముందే, నిలబెట్టి, "ఏదో పనిమీద వచ్చినట్లున్నారే? ఏమిటి సంగతి? ఏమన్నా నా సహాయం‌ కావాలా?" అని అడగకూడదు కదా?  ముందు వచ్చిన వారికి తగిన మర్యాదలూ గట్రా చేసి వారు కాస్త కుదురు కున్నాక, అప్పుడు వారిని కుశలప్రశ్నలూ అవీ వేయటమూ, వారు వచ్చిన పని గురించి వివరంగా తెలుసుకుందుకు ప్రయత్నించటమూ ఉచితంగా ఉంటుంది.  అందుచేత జనకులవారు మహర్షికీ, ఆయన శిష్యులిద్దరికీ అతిథిమర్యాదలు శాస్త్రీయంగా జరిపించి, ఆ పిమ్మట, విశ్వామిత్రులవారిని ప్రశ్నిస్తున్నారు. పెద్దవారి ముందు మనం చూపవలసినది వినయం. వారు మనకి పని చెప్పటమూ ఒక్కొక్కసారి మనని అనుగ్రహించటమే! అందుచేత తమకు నా వలన కావలసిన కార్యం ఉంటే తప్పక ఆజ్ఞాపించండీ అని జనకులు సవినయంగా మనవి చేసుకుంటునారు.
ఏవ ముక్తా స ధర్మాత్మా జనకేన మహాత్మనా
ప్రత్యువాచ  మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః  4
మహాత్ముడైన జనకమహారాజు తన కేమి ఆజ్ఞ అని సవినయంగా ప్రార్థించగా విశ్వామిత్రులవారికి సంతోషమైనది. మాట్లాడటంలో అనే కళలో నేర్పరి ఐన ఆయన ఈ విధంగా రాజుగారికి జవాబు చెబుతున్నారు.
ఇక్కడ జనకేన మహాత్మనా అని జనకమహారాజుగారు మహాత్ముడు అని చెబుతున్నారు వాల్మీకి. అలా ఎందు కన్నారూ? నా కేమి ఆజ్ఞ అని ఆయన మాటవరసకు అన్నవాడు కాదు. అది ఆయన త్రికరణశుధ్ధిగా చెప్పిన మాటే. మహర్షి ఆజ్ఞను పాలించటం అంటే మాటలు కాదు. ఆయన చెప్పిన పని ఏదైనా చేయగల శక్తియుక్తులు కావాలి. అటువంటి స్థిరచిత్తమూ కావాలి. జనకులు అటువంటి వారు నిజంగానే. అయనేదో ముసలివాడూ వేదాంతగోష్టుల్లో కాలక్షేపంచేసే మనిషే కాని అవసరమైతే ఎవరిమీదనైనా విల్లెక్కుపెట్తగల ధీరుడా ఏమిటీ అని జనం సినీమాలూ సీరియళ్ళూ చూసి అనుకోవచ్చును. కాని ఆయన శాపాదపి శరాదపి అని నిలబడగల గొప్పవాడు. దానికి సంబంధించిన వివరం ఒకటి ఈ సర్గలోనే ముందుముందు వస్తుంది, చదువుదురు గాని. ఎంత అసాధ్యమైన పనిని విశ్వామిత్రులు ఇచ్చినా వెనుదీయక రంగంలోనికి దిగగల మహాత్ముడు. అందుకని వాల్మీకులు అలా మహాత్ముడనే విశేషణం వేసారు రాజుగారికి.  అలాగే ఈ‌శ్లోకంలో విశ్వామిత్రులను మునివీరులనీ వాక్యవిశారదులనీ అనటం కూడా గమనించండి. ఇక్కడా తగిన కారణాలున్నాయి.  నిష్కారణంగా వాల్మీకులవారినుండి ఒక్కముక్కా రాదుకదా. వీరుడన్నమాటను చూదాం. వీరత్వం యొక్క ప్రయోజనం లోకోపకారం. అలా కాని బలం ధూర్తత్వం అవుతుందంతే. విశ్వామిత్రులు లోకోపకారులు. అందులో ఏమీ సందేహం అక్కర లేదు. రాముణ్ణి శిష్యుణ్ణి చేసుకోవటం తనకోసమూ కాదు, రాముడు రక్షించిన యాగం విశ్వామిత్రుడికి స్వర్గభోగాలకోసమూ  కాదు. ఆ ఋషి చేసేదంతా లోకకళ్యాణమే. ఆయన బ్రహ్మర్షి. సాక్షాత్తూ భగవత్స్వరూపుడు. ఆయనకు స్వప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంతా లోకం కోసమే. అదీ ఆయన వీరం.  ఆయన వాక్యవిశారదత్వం ఆయన యందున్న భగవత్తత్త్వమే. అయనకు అందరి యోగ్యతలూ తెలుసును.  ఎవరు లోకాపకారులో తెలుసును. ఎవరి వలన ఎలా లోకోపకారమో తెలుసును. అందుచేత ఆయన వాక్కు సాక్షాత్తూ వేదమే. అందుచేత ఆయన జనకుడి యోగ్యతను తెలిసినవాడై అబినందన పూర్వకంగా, ఆయన వలన రాబట్టవలసిన లోకోపకారకక్రియను సూచించటానికి కాను, జనకుడికి ప్రీతి కలిగేలా ఇలా మాట్లాడుతున్నారు అని వాల్మీకులవారి హృదయం అని నా భావన.
పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ 
ద్రష్టుకామౌ ధనుశ్శ్రేష్ఠం యదేతద్వయి తిష్ఠితౌ  5
ఈ ఇద్దరూ దశరథమహారాజుగారి పుత్రులు. లోకప్రసిధ్ధులైన క్షత్రియులు. నీ‌ దగ్గర ఒక శ్రేష్ఠమైన ధనస్సు ఉందని తెలిసి దానిని చూడాలనే కోరికతో వచ్చారు.
ఈ‌ రామలక్షంణులను ఇద్దరినీ దశరథమహారాజుగారి కుమారులూ అని జనకుడికి పరిచయం చేయటం వరకూ బాగానే ఉంది. కాని వారిని విశ్వామిత్రులవారు లోకప్రసిధ్ధులూ అని చెప్పటం కొంచెం అశ్చర్యం కలిగిస్తుంది.

అప్పటికి రాముడు చేసిన గొప్పపనులు తాటకావధ, మారీచసుబాహులను దండించి యజ్ఞాన్ని సంపన్నం చేయటం, అహల్యాశాపవిమోచనం అన్నవి. ఐతే అవి అప్పుడే దేశదేశాలూ తిరిగి రాముడికి అఖండఖ్యాతిని ఆర్జించి పెట్టాయా? లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ అరణ్యాలలో జరిగినవే కాని ఏదీ నాగరికుల మధ్యన జరిగినది కాదు.

మరి వాక్యవిశారదులైన వాల్మీకులవారు లోకవిశ్రుతులూ అని అనటం ఎలా నప్పుతున్నదీ?  దీనికి సమాధానం చూదాం.

అసలు లోకం అంటే ఏమిటి? భౌతికార్థంలో జీవులకు ఉనికియైన ప్రదేశం. కొంచెం లోతుగా చెబుతే లోకం అంటే జీవుల సమూహం. జీవులసమూహంలో ఈ కుఱ్ఱవాళ్ళిద్దరూ ప్రసిధ్ధులూ అంటున్నారు మహర్షి.  జీవులలో బహుప్రసిధ్ధుడు కేవలం భగవంతుడే.  అయన సర్వజీవులలోనూ తానే నిండి ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సర్వజీవరాశీ ఆయన యందే ఉన్నది అన్నదే సదైన అవగాహన. జీవులలో రెండవవాడుగా బహుప్రసిధ్ధుడు అ భగవంతుని యొక్క భక్తుడు. ఇతరులు అజ్ఞానులు కాబట్టి వారిని వదిలివేద్దాం. ఈ భక్తుడికే అత్యంతమైన అర్హతా, బహగవత్సాన్నిధ్యమూ. ఆ విధమైన భక్తిసామ్రాజ్యాధినేతల్లో అతి ముఖ్యుడు ఆదిశేషువు.

వైష్ణవసంప్రదాయంలో ఆయన గురించి ఒక ముక్క చెబుతారు. ఆదిశేషువు మనకు తెలిసి విష్ణుదేవునికి పరుపుగా ఉంటాడని మనకు తెలిసిన సంతతే కాని, ఇంకా విశేషం ఉందిట. శేషుడు భగవంతునికి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో దానిని తగిన విధంగా మారి సేవచేస్తాడట, శయ్యాసనపాదుకాది విధాలుగా అమరి. అన్నమాచార్యులవారు అంటారు కదా ఒక ప్రసిధ్ధమైన సంకీర్తనంలో, "విన్నపాలు వినవలె, వింతవింతలూ.. పన్నగపుదోమతెర పై కెత్త వేలయా?" అని ఆ దోమతెరగా మారిన పన్నగం అంటే‌ శేషుడే.  ఈ విధంగా జీవలోకంలో భగవానునికి అత్యంత సన్నిహితుడుగా అతిప్రసిధ్ధుడైనవాడు శేషయ్యగారు.

ఇలా ఈ రామలక్ష్మణులు ఇద్దరూ సమస్తలోకంలో ప్రసిధ్ధులైన దేవుడూ, ముఖ్యజీవుడూ అన్నది విశ్వామిత్రముని నర్మగర్భంగా సూచిస్తున్నారు. ఇదంతా చాలా దూరాన్వయంగా అనిపిస్తోందా? మరొక చిన్న సమర్థన ఉంది. ఇది మీకు నచ్చవచ్చును.  ఒకాయన వచ్చారు మన ఊరికి. నిజానికి మనఊరి పెద్దమనిషే ఈ మహానుభావుణ్ణి తీసుకొని వచ్చారు ఏదో సభకి. అక్కడ అందరికీ పరిచయం చేస్తూ, ఈయన ఫలాని నగరంలో ఉంటారూ, నాకు తెలిసినవారూ గొప్ప కవీ, జగత్ప్రసిధ్దులూ అంటారు. మనకి అక్షేపణ అనిపించదు. అదేమిటయ్యా మా ఊళ్ళో ఈయన ఎవరో తెలియదే జగత్ప్రసిధ్దుడేమిటీ అనం. ఓహో అక్కడ అందరికీ బాగా తెలిసినవాడన్న మాట అనుకుంటాం. నిజమే కదా? అలాగే మహర్షి ఇక్కడ రామలక్ష్మణులను దశరధమహారాజుగారి కుమారులూ అని చెబుతూ లోకవిశ్రుతులూ అన్నది అదే అర్థంలో అనుకోండి.  అక్కడ దశరధుడికన్నా కూడా రాముడికే ఎక్కువ గా జనం‌ ప్రీతులై ఉన్నారన్నా అశ్చర్యం లేదని మనకూ తెలుసుకదా?

ఇకపోతే, మహర్షి రామలక్ష్మణులు వచ్చిన పని గురించి క్లుప్తంగా నీ దగ్గర గొప్పవిల్లేదో ఉందిట కదా, దాన్ని చూదాం అని కుతూహలంతో వచ్చారూ అని చెబుతున్నారు.  ఇది గమనించండి. సినీమాలూ సీరియళ్ళూ చెప్పేటట్లుగా మిధిలాధీశులు ఏ ధనుర్యాగమూ చేయటం లేదు. సీతాస్వయంవర సభ అని ప్రకటన ఏదీ చేయలేదు. విల్లెక్కుపెట్టే పోటీ ఏదీ ఏర్పాటుచెసి దేశదేశాల వాళ్లనీ సభకు రావించలేదు కూడా. చూసారా అసలు కథకు మనం తెలుసూ అనుకుంటున్న కథావిధానానికి ఎంత తేడా ఉన్నదో?
ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ.
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః  6
(జనకమహారాజా!) నీకు శుభం కలుగుగాక. ఈ రాజకుమారకులకు ఆ ధనువును చూపించు. దానిని మనసారాచూసి ఈ బిడ్డలు యధేఛ్ఛగా తిరిగి వెళతారు.
ఇక్కడ గమనించవలసి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పిల్లలు మీ దగ్గర ఉన్న మహాధనువును చూడటానికే వచ్చారని విశ్వామిత్రమహర్షి చెబుతున్నారు. అ ధనస్సును ఎక్కుపెట్టాలన్న ఉద్దేశం వారికి గాని, వారు దానిని ఎక్కుపెడితే బాగుంటుందన్న ఉద్దేశం తనకే ఉన్నట్లుగాని విశ్వామిత్రులు చెప్పటం‌ లేదు. మనం ఎన్నో సినిమాలు, హరికథలు, నాటకాలు, టీవీ సీరియళ్ళలో చూసామో చెప్పనలవి కానంతగా మనకు రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకుడి దగ్గర ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టి స్వయంవరంలో విజేతలు కావాలని అన్నది ప్రచారం ఐపోయింది. కాని నిజానికి అటువంటిది ఏమీ లేదని తెలుసుకోవాలి.

వాల్మీకులవారి శ్రీమద్రామాయణం బాలకాండ 31వ సర్గలో ఈ శివధనువు ప్రసక్తి వస్తుంది.  రామలక్ష్మణులు విశ్వామిత్రులవారి యాగాన్ని సంరక్షించిన పిదప, మునుజనపరివేష్ఠితులైన ఆయనను సమీపించి తాము ఇక మీద చేయవలసిన కార్యం ఏమిటో అజ్ఞాపించవలసిందని అడుగుతారు.  అప్పుడు విశ్వామిత్రాది మునులు మిధిలాధిపతి జనకరాజు గొప్పయాగం చేస్తున్నారనీ మీరు కూడా రండనీ రామలక్ష్మణులకు చెప్పి, అందరూ మిధిలా ప్రయాణం మొదలు పెడతారు. ఇదే సందర్భంలో ఆ ధనస్సును గురించి మునులు రామలక్ష్మణులకు వివరంగా చెబుతారు. సీతాస్వయంవరం వంటి ప్రసక్తులేమీ లేవిక్కడ.

అందుచేత రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకమహారాజునూ, ఆ శివధనస్సునూ దర్శించాలనే.
ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్.
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి  7
ఈ విధంగా విశ్వామిత్రులు సెలవియ్యగానే, జనకమహారాజుగారు విశ్వామిత్రమహామునికి ఇలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అయ్యా, ఏ కారంఅగా ఆ మహాధనుస్సు మా వద్ద ఉన్నదీ (ముందుగా) తమకు తెలియజేస్తాను.
ఇక్కడొక చమత్కారం ఉంది.  విశ్వామిత్రులకు ఈ మహాధనస్సు సంగతి వివరంగా తెలియదనా జనకులు మరలా చెప్పటం? అయనకు స్పష్టంగా తెలిసి ఉంటుందనటంలో‌ జనకులకు అనుమానం అక్కర లేదు. అలాగే ఆయన ఈ పిల్లలను ఫలాని గొప్పధనస్సును చూపిస్తాను రండి అని తీసుకొని వచ్చారంటే దాని అర్థం మహర్షి ద్వారా ద్బనస్సుకు సంబంధించిన సకలవృత్తాంతమూ ఈ కుఱ్ఱవాళ్లకూ తెలిసి ఉంటుందన్నదీ రాజుగారికి ఎలాగూ అర్థమయ్యే ఉంటుంది. ఐనా సరే, రాజుగారు మరలా ధనస్సు గొప్పదనమూ అది తమ వద్ద ఉన్న కారణమూ అన్నవి మరలా ఎందుకు చెబుతున్నట్లూ అన్నది ఆసక్తికరమైన సంగతి. మనకూ జనకుల నోట వృత్తాంతం అంతా విన్నాక అయన అలా ఎందుకు దాని కథంతా చెప్పిందీ అర్థం అవుతుంది. ప్రస్తుతానికి వేచి ఉందాం.
దేవరాత ఇతి ఖ్యాతో నిమేష్షష్ఠో మహీపతిః
న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా  8
భగవాన్ విశ్వామిత్రమహర్షీ. మా వంశకర్త నిమి అనే మహాత్ముడు. అయన నుండి ఆరవ రాజుగారి పేరు దేవరాతుడు. సాక్షాత్తూ పరమశివుడే సంరక్షించ వలసిందిగా ఈ వింటిని అ దేవరాతుడికి ఇచ్చాడు.
ఏదైనా అపురూపమైన వస్తువును మనం ఇతరులకు చూపించే సందర్భంలో దాని వైశిష్ట్యాన్నీ, అది మనవద్దకు చేరిన విధానాన్నీ అందరిముందూ మరొకసారి ప్రస్తావించటం సహజం. ఇక్కడ జనకమహారాజుగారూ అదేపని చేస్తున్నారు. ఇప్పుడాయన రెండు విషయాలు ప్రస్తావించారు. అవి ఆ ధనువు సాక్షాత్తూ పరమశివుడిదీ అన్న సంగతీ, దాన్ని ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా స్వీకరించినది తమ వంశంలోని పూర్వీకుడు కాని అది ఈ మధ్య సంగతి కాదు అన్నదీ. ఈ దేవరాతుడు నిమినుండి ఆరవవాడైతే, జనకమహారాజుగారి నుండి పదహారు తరాల పైన వాడు. అంటే ఎంతో కాలం నుండీ ఆ దివ్యధనువు జనకుల ఇంట పూజలందుకుంటూ ఉన్నదన్నమాట. ఇదే శ్లోకంలో మరొక కీలకమైన మాట మన దృష్టినుండి తప్పిపోరాదు. దానిని శివుడు తమ వంశంవారికి 'న్యాసం'గా ఇచ్చాడట.  దాని అర్థం, ఆ ధనువుకు దాము సంరక్షకులమే కాని దానికి తాము యజమానులం కాము అన్నది చెబుతున్నారు.
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్.
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్  9
శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో, ఆయన ఆ యజ్ఞానికి వెళ్ళిన దేవతలమీదా ఆగ్రహించారు. వారి అవజ్ఞతకు రోషించిన ఆయన కోపంతో వారిపైన విల్లెక్కు పెట్టి ఇలా అన్నాడు.
ఒకప్పుడు దక్షుడనే ప్రజాపతి ఒక యాగం చేసాడు - అదీ శివుడికి యజ్ఞభాగాన్ని పరికల్పించకుండానే. అందుచేత నింద్యమైన యజ్ఞానికి వెళ్ళి దేవతలూ తప్పుచేసినవారయ్యారు. ఆ దక్షప్రజాపతి శివుడికి సాక్షాత్తూ మామగారు. ఈ దేవతలు అంతా శివుడి అనుజ్ఞతో లోకాలను సంరక్షించే వారు.  భగవద్విరోధం కారణంగా దక్షుడు, శివరహితయాగం పేర నేరం చేసి శిక్షార్హుడైనాడు. అటువంతి యాగం లోకోపద్రవకారణం కాబట్టి దాన్ని శివుడు విఛ్ఛిన్నం చేసాడు. అలా లోకహితేతరమైన యాగానికి లోకరక్షకులైన దేవతలు పోవచ్చునా? పోరాదన్న సంతతి తెలిసీ, ప్రజాపతి అన్న గౌరవంతో దక్షుణ్ణి మన్నించి ఆ యాగానికి వెళ్ళారే కాని శివేతరమైన ఆ యాగం సాక్షాత్తూ శివుణ్ణే అగౌరవించటం అని అర్థమైన తరువాత వాళ్ళు అ యాగాన్ని తిరస్కరించాలి కదా? అలా చేయకపోవటం లోకేశ్వరుడైన శివుణ్ణే తిరస్కరించటం అవుతున్నది కదా? అందు కని వారు శివుడి ఆజ్ఞ మీరిన వారయ్యారు. అందుకే శివుడు వారిపై కోపించి రుద్రుడై ఇక లోకాలకు మీ వలన ప్రయోజనం శూన్యం అని వారిపై విల్లెక్కు పెట్టాడు.
యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః
వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వః  10
వేదవిహితమైన క్రతుభాగాన్నినాకు సమర్పించకుండా యజ్ఞం చేయవచ్చునా ఓ దేవతలారా? మీ‌ ఉత్తమాంగాలను నేను నా ధనుస్సుతో ఖండించి వేస్తాను.
యజ్ఞంలో దేవతలకు హవిస్సులు అర్పించబడతాయి. అవి దేవతలకు తేజస్సును వృధ్ధి చేస్తాయని వేదం చెబుతున్నది. హవిస్సులు అందుకున్న దేవతలు యజ్ఞకర్తకు కామితార్థాన్ని ప్రసాదిస్తారు. యజ్ఞాలలో దేవతలకే కాదు, అంతకన్న ముఖ్యంగా త్రిమూర్తులకూ భాగం కల్పించబడుతుంది.  త్రిమూర్తుల తేజస్సును ఆ హవిస్సులు వృధ్దిచేస్తాయనా? కాదు. వారు లోకకర్తలు. వారికి అర్పించబడిన హవిస్సు లోకాలకు తేజోవృధ్ధి కరం. అంటే లోకక్షేమకరం. అందుచేత విహితమైన భగవద్భాగాల యొక్క ప్రయోజనం లోకక్షేమకరమై లోకకర్తకు లోకేశ్వరుల అశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఇదీ దాని రహస్యం. ఐతే మంగళదాయకుడైన పరమేశ్వరునికి యజ్ఞభాగాన్ని కల్పించకపోవటం తప్పు అన్న స్పృహ లేకపోగా ఆయనను విడచి కేవలం కామ్యార్థఫలప్రదాతలు మాత్రమే ఐన దేవతలకు హవిస్సులు అందించటం, లోకక్షేమాన్ని విసర్జించి కేవలం స్వార్థం కోసమే యాగం చేయటం. అది ఘోరం. కాబట్టి ఆ యజ్ఞమూ చెడింది. దానినుండి హవిస్సులు ఆశించిన దేవతలూ శిక్షార్హులయ్యారు. అందుకే పరమేశ్వరుడు, మీ శిరస్సులను తీసివేస్తాను అని హెచ్చరిస్తున్నాడు.
తతో విమనసస్సర్వే దేవా వై మునిపుఙ్గవ
ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతో భవాద్భవః 11
ఓ మునిపుంగవా, విశ్వామిత్రా, ఆ మాటలు విని హతాశులైన దేవతలంతా దేవాధిదేవా పరమేశ్వరా మా తప్పు కాచి మాపైన దయ చూపవలసింది అని పరిపరి విధాలుగా వేడుకున్నారు. ఆయన వారికి ప్రసన్నుడై రుద్రుడుగా ఉన్న మూర్తినుండి కరుణాసముద్రుడైన భవుడుగా మారాడు.
ముందటి తొమ్మిదవశ్లోకంలో శివుడు కోపంతో రుద్రుడయ్యాడని చదువుకున్నాం. రుద్రుడంటే శోకింప జేసేవాడు, నశింపచేసేవాడు. ఇప్పుడేమో‌ దేవతలు తప్పైపోయింది రక్షించండీ అని ప్రార్థిస్తూ కాళ్ళమీద పడగానే ప్రసన్నుడై భవుడు అంటే జన్మప్రసాదకుడు అయ్యాడు. ఈ సందర్భంలో చావుదప్పి దేవతలకు పునర్జన్మ లభించినట్లే కదా. అందుకనే భవుడు అనటం అన్నమాట.
ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వ కే విభో  12
దేవతలపై ప్రీతి చెందిన పరమేశ్వరుడు వారికి ప్రాణదానం చేయటమే కాదు.  వాళ్ళపై తాను ఎక్కుపెట్టిన ఆ మహాధనస్సునూ ఆ దేవతలకే అనుగ్రహంతో ఇచ్చివేసాడు. ఓ మహర్హీ,  అలా శివుడు తమకు అనుగ్రహించిన ధనూరత్నాన్నే ఆ దేవతలు మా పూర్వీకుడైన దేవరాతునికి దాచమని ఇచ్చారు.
చూడండి, శివుడు ఎంత కరుణాసముద్రుడో.  ఆయనకు కోపం వచ్చి తప్పుచేసిన దేవతలని దండిస్తానని రుద్రుడై ఒక మహా ధనస్సుని వాళ్ళపైకి ఎక్కుపెట్టాడు.  మళ్ళా ఆ దేవతలు తప్పొప్పుకుని కాళ్ళమీద పడగానే అనంతమైన కరుణతో వారికి తన కోపాగ్నినుండి పునర్జన్మను ప్రసాదించాడు.  అంతే కాదు శివుడి కోపానికి బిక్కచచ్చి చిన్నబోయిన దేవగణాల్ని సంతోషపెట్టాలని తన వింటిని, ఆ దేవతలకు బహుమతిగా ఇచ్చేసాడు.
అథ మే కృషతః క్షేత్రం లాఙ్గూలాదుత్థితా మయా
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా  13
ఆ పిమ్మట కొంత కాలమునకు నేను నాగలితో యాగభూమిని దున్నుచు శుధ్ధి చేయుచు నుండగ ఆ భూమిని చీల్చుకొని పైకి వచ్చి నా కొక బాలిక లభించినది.  అమె సీత యన్న పేరుతో‌ ప్రఖ్యాతి గాంచినది.
ఇక్కడ పిమ్మట అని చెప్పినది, దేనిని గురించి? శివుడు ధనస్సును దేవతలకు ఇచ్చుట, దానిని వారు నిమి వంశమునకు నిక్షేపముగా నిచ్చుట యను నవి జరిగిన కొంతకాలము నకు అని.  అప్పటికి జనక మహారాజు కాలము వచ్చినది.
భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా
వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా   14
అప్పుడు భూతలమునుండి పైకి వచ్చి ఈమె నా స్వంత బిడ్డగా పెరిగినది. అంతేకాని ఒక స్త్రీగర్భమునుండి సాదారణ బాలికవలె జన్మించలేదు.  ఈమెను తన ప్రతాముతోనే గెలుచుకొన గలిగినవానికి ఇచ్చుటకు నిశ్చయించుకొంటిని.
ఉథ్థానం అంటే పైకి లేవటం. ఈ శ్లోకంలో జనకమహారాజుగారు సీత స్వయంగా భూతలాన్ని చీల్చుకొని పైకి ఆవిర్భవించిందని స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ తల్లి తనంతతానుగా భూమినుండి ఆవిర్భవించి, నాగలితో నేలను దున్నుతున్న జనకులవారి ముందు ప్రత్యక్షం ఐనది. అంతే కాని ఇందులో జనకులు కాని మరొకరు కాని ప్రయత్నంతో ఆమెను భూమినుండి పైకి తీయలేదు.

సీత అన్నమాటకు నాగేటి చాలు అని అర్థం ఉంది. అంటే నాగలితో భూమిని దున్నుతుంటే దాని ములికితో ఏర్పడిన లోతైన చారిక అన్నమాట.  అలా జనకులవారి నాగలి ఒక చాలు తీస్తూ పోతూ ఉంటే దానినుండి హఠాత్తుగా భూమిని చీల్చుకొని అమ్మ ఆవిర్బవించింది బాలికా రూపంలో.

ఒకానొక ప్రవచనంలో శ్రీచాగంటివారు ఆ బాలిక తనపేరు సీత అని అప్పుడే అందరికీ స్పష్టం చేసిందని చెప్పారు. అంటె సీత అన్నది జనకులో ఆయన పురోహితులో ఆ బాలికకు ఇచ్చిని పేరు కాదు.

ఉథ్భిజము అంటే భూమిని చీల్చుకొని జన్మించేది చెట్టు అన్న అర్థం సాధారణంగా చెబుతూ ఉంటాము. జీవులు నాలుగు రకాలు స్వేదజములు, అండజములు, ఉథ్భిజములు జరాయుజములు అని. స్వేదజము అంటే చెమటనుండి జనించినవని కీటకాదులు. అండజము అంటే గ్రుడ్ఢునుండి జనించినవి అని పక్షులు, ఉథ్భిజము అంటె భూమిని పెకలించుకొని పుట్టినవి అని వృక్షజాతి, జరాయుజములు అంటే మావినుండి జనించినవి అని పశుమనుష్యజాతులు.

ఇక్కడ సీతమ్మవారు భూమిని స్వయంగా చీల్చుకొని ఆవిర్బవించినది. అది కేవలం దైవసంబంధమైనదే  ఐన జననం కాని తదన్యం‌ కాదు.

జనశ్రుతిలో ఒక కథ ఉన్నది.  సినిమాలలోనూ కనబడుతున్నది, జనకమహారాజుగారు యజ్ఞార్థం భూమిని దున్నుతుంటే, నాగేటి చాలులో ఒక చిన్న పెట్టె దొరికిందనీ, దానిని తెరిచి చూస్తే అందులో కనిపించిన బాలికయే సీత అని.

ఇంకా చిత్రమైన విషయం కూడా ఉన్నది. రామాయణసారోధ్దారము అనే ఉద్గ్రంథంలోనూ కనిపిస్తున్నది. ఆ కథలో పితా స్త్వాం దుహితరాం అంటూ రావణుడిని ఉద్దేశించిన ఒక విషయం ప్రస్తావనకు వస్తుంది. సీత రావణపుత్రికయే నట. ఆమెవల్ల లంకకు చేటు అని కార్తాంతికులు చెప్పగా రావణుడే ఆ బిడ్దను ఒక పెట్టెలో పెట్టి భూస్థాపితం చేసాడనీ ఆమె తదనంతరం జనకుడికి దొరికి ఆయన పుత్రికగా పెరిగి అన్నంతపనీ చేసిందనీ.

ఇతే ఈ‌ కథలకు శ్రీమద్రామయణంలో ఆథారం కనిపించదు.  జనకులవారు సీత భూమినుండి ఆవిర్భవించింది అని చెబుతున్నారు కాబట్టి పెట్టె గిట్టె అన్నది అసంగతం. ఆమె స్వయంగా ఆవిర్బవించినప్పుడు అయోనిజ కావటమే స్పష్టం.  పెట్టెలో దొరికితే వేరెవరో అక్కడ వదిలి వెళ్ళి ఉండవచ్చును కదా అన్న అనుమానం ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది కదా? స్వయంగా ఆవిర్భవించిన తల్లి తాను సీతను అని అన్నది అందరితో అప్పుడే అని చాగంటివారు చెప్పినది సముచితంగానే అనిపిస్తోంది. 
భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్
వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ  15
ఓ మునిపుంగవా, వినండి. అలా భూమినుండి ఉద్భవించి దినదిన ప్రవర్థమానయై వివాహయోగ్యమైన వయస్సు వచ్చిన నా పుత్రికను వరించి ఎందరో రాజులు ఆశతో వచ్చారు.
ఈ శ్లోకంలో కొంతభాగం ముందటి శ్లోకంలోనుండే తీసుకున్నట్లు కనిపించటం లేదూ?

సీత సామాన్య స్త్రీ కాదూ, ఆమె స్వయంజాత. అయోనిజ. నా కళ్లముందే భూమిని చీల్చుకొని వచ్చిన తల్లి అని ఆయన అనందంతో మరొకమారు అదే విషయాని నెమరు వేసుకుంటున్నారు. అదేమీ అసహజం కాదు కదా. పైగా ఎంతో సమయోచితమైన భావన. ఇక్కడ సీత ప్రసక్తి నడుస్తోంది. ఆమె గురించి చెబుతూ జనకులవారు తన్మయులై ఉన్నారని మనం స్పష్టంగా గ్రహించాలని శ్రీవాల్మీకులవారి భావన.

అంతే కాదు, ముందటి శ్లోకంలో వలనే ఇందులోనూ మమాత్మజా అని సీతను సంబోధిస్తున్నారు జనకులవారు. ఆత్మజులు అంటే లౌకికార్థంగా సంతానం అనే అర్థం. లౌకికార్థంలో కవిత్వంలో కూడా ఆత్మ అన్న మాటను తాను అన్న పదానికి పర్యాయంగా వాడుకచేస్తూ ఉంటాం. అందుచేత ఆత్మజుడు అంటే కొడుకు. ఆత్మజ అంటే కూతురు.

ఐతే, ఇక్కడ అర్థం కొంచెం విశేషం కలదిగానే చెప్పుకోవాలి. జనకులకూ, సీతమ్మకూ ఉన్న సంబంధం ఆత్మసంబంధం. జనకుడు మహాయోగి. ఆయన పరబ్రహ్మానుసంధానమైన స్థితిలో నిత్యం ఉండే మహానుభావుడు. ఆయనకు విదేహుడు అని బిరుదు. విదేహుడు అంటే దేహంతో సంబంధం లేని స్థితిలో ఉండేవాడు. ఆయన కుమార్తెగా  వచ్చి అమ్మవారు వైదేహి అన్న నామధేయంతో ప్రసిధ్ధ ఐనది. అమ్మవారు జగన్మాత. ఆవిడ ఆత్మవిద్యాస్వరూపిణి. శ్రీలలితాసహస్రనామావళిలో

 ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా।
 శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా॥

అని ఉంది కదా. ఆత్మయోగి ఐన మహాత్మునకు అత్మవిద్యాస్వరూపిణి పుత్రికగా రావటం ఆశ్చర్యం కలిగించదు కదా. అమ్మ అనుగ్రహం అనేది అద్భుతం. అది ఆనాడూ, ఈ నాడూ కూడా అదే విధంగా గోచరిస్తూనే ఉంది. మనకాలం వారే ఐన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు. ఆయనను అమ్మవారు చిన్నపిల్ల రూపంలో నిత్యం ప్రత్యక్షంగా అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేది. అందుచేత సందేహించవలసింది ఏమీ లేదు. జనకులదీ సీతమ్మవారిదీ ఆత్మసంబంధం.  అందుకే మమాత్మజా అని ఆయన చెప్పుకున్నారు. కేవలం లౌకికార్థంలో కాదని గ్రహించాలి.
తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్
వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్ 16
భగవాన్ విశ్వామిత్రమహర్షీ, వాళ్ళు వరించి వచ్చినా,  నా పిల్లను కేవలం ఎవరైనా సమర్థుడు పరాక్రమంతో గెలుచుకోవలసిందే అని చెప్పి,  నా కన్యను వారిలో ఎవరికి ఇవ్వటానికీ నేను ఒప్పుకోలేదు. 
తన బిడ్డ కేవలం పరాక్రమం చేతనే గెలుచుకోదగినదీ అని జనకులవారు మరలా స్పష్టంగా చెబుతున్నారు. తన మనోనిశ్చయాన్ని ఇంతకు ముందే ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆ నిశ్చయాన్ని ఇప్పటికే ఆమె కోసం వచ్చిన రాజులకు చెప్పానని చెబుతున్నారు.

అంటే అనేక మంది రాజులు ఆ అమ్మాయి అందచందాల గురించి విని తమ కిమ్మని కబురులు చేసి ఉంటారు. కాని జనకమహారాజుగారు మాత్రం అలా ఎవరికి పడితే వారికి ఇవ్వటం కుదరదనీ, అపురూపమైన ఆ కన్యను కేవలం పరాక్రమంలో అద్వితీయుడిగా నిరూపించుకున్న వాడికే ఇవ్వటం జరుగుతుందనీ సమాధానం పంపించారన్న మాట.

అది అప్పటి కాలానికి అనుగుణమైన సంగతిగానే మనం పరిగణించాలి.  బ్రాహ్మణులలో వేదాధ్యయనమూ, క్షత్రియుల్లో పరాక్రమమూ, వైశ్యుల్లో ధనసంపత్తీ, ఇతరుల్లో కార్యదక్షతా అనేవి ముఖ్యగుణాలుగా చెప్పబడతాయి కదా. సహజంగానే ఒక క్షత్రియుడికి తన కుమార్తెకు ఉత్తమమైన సంబంధం అంటే వరుడు క్షాత్రగుణసంపన్నుడుగా ఉండటమే అని అనటంలో ఆశ్చర్యకరం ఏమీ లేదు.

ఐతే మరొక సంగతీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. వివిధ దేశాల రాజులు లేదా వారి తండ్రులు సంబంధం కలుపుకుందుకు వర్తమానాలు చేసారు అంటే అక్కడ వంశప్రశస్తి ఆధారంగా కూడా సంబంధాలు కుదిరేవని అనుకోవచ్చును. అలాగే రాజ్యాధిపతులను నుండి వర్తమానాల వెనుక ఆయా రాజ్యాల బలాబలాలూ అంచనాకు వస్తాయి కదా. అంటే బలవంతమైన రాజ్యానికి అమ్మాయిని కోడల్ని చేస్తే అమెకు భద్రత అన్న కోణమూ అప్పట్లోనూ పరిశీలనలో ఉండేదీ అన్నది కూడా అవగతం చేసుకోవచ్చును.

ఐతే, జనకుల వారు మాత్రం అబ్బే మీ గొప్పలూ అవీ ఏవీ లెక్కలోకి రావూ మీ మీ వరుల పరాక్రమం చూసాకే నిర్ణయించటం అవుతుందీ అని ఖరాఖండిగా చెప్పేసారు.
తతస్సర్వే నృపతయ స్సమేత్య మునిపుంగవ
మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా  17
ఓ మునిపుంగవా విశ్వామిత్ర మహర్షీ, అప్పుడు, తమతమ పరాక్రమాలను నిరూపించుకొనే ఆసక్తితో ఆ రాజులంతా కలిసి మిథిలకు వచ్చారు.
ఇక్కడ మనం గమనించ వలసిన విషయాలు ఏమిటంటే, రాజులంతా కలిసి మిథిలకు రావటం. వారికి తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆసక్తి కలగటం.

నిజానికి ఒకరాజు మరెవరైనా రాజును నీ  బలం నిరూపించుకో అనటం యుధ్ధరంగంలోనే జరుగుతుంది కాని మరొక రకంగా జరగదు. జనకమహారాజు ఈ మాట అనేకమంది రాజులతో అన్నాడు.  వాళ్ళంతా ఒప్పుకొని మిథిలకు వచ్చారు.

మానవ స్వభావంలోని ఒక విశేషం చూడండి. ఒక బలీయమైన కాంక్ష కలిగినప్పుడు మనషులు దానిని సాధించుకుందుకు గాను ఎటువంటి వాటినైనా త్యజించటానికి సిధ్ధపడతారు. వారు ఇంటిప్రతిష్ఠను పణంగా పెడతారు. యావత్తు కులంప్రతిష్ఠను కూడా పణంగా పెడతారు. తమ వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్ఠలను పణంగా పెడతారు.

సీత అనే అమ్మాయి యొక్క సౌందర్యం అనేది మిగతా రాజలోకానికి ఎంత ఆకర్షణీయమైనది అయ్యింది అంటే వారు ఆమెను సాధించుకోవాలనే పట్టుదలతో సాటి రాజు జనకుని వద్దకు తమతమ బలాలకు అయనపెట్టే పరీక్షను ఎదురుకుందుకు సిధ్ధపడి వచ్చారు.

వాళ్ళకు జిజ్ఞాస కలిగిందట. ‌ఈ‌ జనకుడు తమబలాన్ని ఎలాపరీక్షిస్తాడూ‌ అని.  దానితో‌ పాటుగా తమలో ఎవరికి ఆ మహాబలశాలి అన్న కీర్తిదక్కుతుందీ‌ అని కూడా తప్పకుండా  జిజ్ఞాస కలిగే ఉంటుంది.

అన్నింటికన్నా ముందుగా తాము అంతకాలమూ ఏ అమ్మాఅయి సౌందర్యాన్ని గురించి ఐతే కడు కుతూహలంతో వింటూన్నారో ఆమె నిజంగా ఎంత గొప్ప సుందరాంగి ఐనదీ తమ కళ్ళతో చూడాలి స్వయంగా అన్న జిజ్ఞాస తప్పకుండా కలిగే ఉంటుంది.

ఇలా తహతహలాడుతూ ఆ రాజులంతా మిథిలానగరానికి వచ్చారట.  జనకమహారాజుగారు వాళ్ళంతా కలిసే వచ్చారు అన్నారు అన్నప్పుడు ఫలాని రోజున రమ్మని జనకులవారు ఏమైనా నిర్ణయం చేసి చెప్పారా అన్నది స్పష్టంగా లేదు.
తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్
న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేపి వా  18
అలా జిజ్ఞాసతో వచ్చిన రాజులు తమ వద్దకు తీసుకొని రాబడిన శివధనువును చేబట్టలేక పోయారు. ఎవరూ దానిని తిన్నగా చేతులలో తిన్నగా నిలబెట్టేందు శక్తులు కాలేదు.
ఈ శివధనువు అనేది మహాసత్త్వవంత మైనది. దానిని సాక్షాత్తూ పరమమేశ్వరుడే ధరించదగినవాడు కాని అన్యులు దానిని స్వాధీనం చేసుకొన లేరు. అటువంటి ధనస్సును ఆ మానవమాత్రులు ఎలా లొంగదీసుకోగలరు? ఆ శివధనుస్సు ఒక మందసంలో నిక్షిప్తమై ఉంది. ఆ మందసాన్ని ఒక చక్రాలబండి వంటి వేదికపైన అమర్చి ఉంచారు.

వచ్చే సర్గలో వాల్మీకులవారు అలా పదిలపరచబడిన శివధనస్సును ఐదువేలమంది బలవంతులైన పురుషులు కష్టపడి తీసుకొని వచ్చారన్నది చెబుతారు. కొన్ని రామాయణాలలో శివధనస్సును వందలకొద్దీ శ్రేష్ఠమైన వృషభాలు లాగికొని వచ్చాయనీ, అది భారమైన ధనువు కాబట్టి అనేకమంది లాగికొనివచ్చారనీ చెప్పారు.  ఐనా మనకు శ్రీమద్రామాయణం అనే ఆదికావ్యాన్ని ఇచ్చిన వాల్మీకులవారి వచనమే ప్రమాణం ఈ విషయంలో. జనశ్రుతిలోనికి ఒక కథ వచ్చి చేరింది. అది నాటకాలద్వారానూ సినిమాలద్వారానూ మరింతగా ప్రజలలో వ్యాపించింది, ఆ కథ ప్రకారం, ఒకానొక సందర్భంలో సీతాదేవి ఆ ధనువు ఉన్న చక్రాలవేదికను అవలీలగా ప్రక్కకు జరిపి దాని క్రిందకు పోయిన తన బంతిని తీసుకుందట. ఈ‌ కథ వాల్మీకం అనుకోను. ఐనా పరిశీలించకుండా నిర్థారణగా చెప్పనూ లేను. ఈ కథ ద్వారా స్పష్టీకరించబడే విషయం యేమిటంటే సీతాదేవి సాక్షాత్తూ శక్తిస్వరూపిణి ఐన జగన్మాత కాబట్టి అలా జరిగిందని.

ఏది యేమైనా ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అది దైవసంబంధమైన దనువు. దాని మీద దైవానికి, దైవభక్తులకూ మాత్రమే యేమైనా అధికారం ఉంటుంది కాని అన్యులకు ఎంతమాత్రం దాని జోలికి పోవటం వల్లకాదు. ఈ బలపరాక్రమాలను ప్రదర్శించటానికి వచ్చిన రాజులకు దృష్టి రెండే రెండు విషయాలమీద ఉన్నది. ఒకటి తమ శక్తిని ప్రదర్శించే విషయంలో ఉత్సాహమూ గర్వమూ. రెందవది సీతాకరగ్రహణం చేయాలనే మనోభీష్టమూ. అంతే‌కాని ఆ ధనువును గురించి వారి మనస్సులలో భక్తిశ్రధ్ధలు లేవు. కాబట్టి వారందరికీ‌ పరాభవం తప్పదు. ఒకవేళ వారిలో ఎవరికైనా ఆ ధనువు దైవీయమైనది అన్న స్పృహ కలిగితే‌ కలుగవచ్చును. కాని తాత్కాలికంగా వారికి కలిగే ఆ వినయం సంస్కారజం కానీ దైవీయమైనది కానీ కాదు కనుక వారికీ పరాభవం నిశ్చయమే.

శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టే సందర్భంలో ఆయనకు క్షత్రియోచితమైన కుతూహలమే కాని రాజదర్పమూ బలగర్వమూ ఏమీ లేవని స్పష్టంగా తెలుస్తున్నది కథాగమనంలో. ఆ ధనువును కూడా ఆయన గురువుల అనుజ్ఞ మేరకే ఎక్కుపెట్టిన వినయశీలి. శివకేశవులకు అబేధం కనుక ఆ ధనువు ఆయనదే. దైవీయమైన ఆ ధనువును అందుకే ఆయన ఒక్కడే ఎక్కుపెట్టగలిగాడు.
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన  19
మహామునీ విశ్వామిత్రా, ఈ రాజులంతా అలసత్త్వులని తెలిసిపోయింది. ఓ‌ తపోధనా, నిర్మొగమాటంగా వాళ్ళందరినీ నీరాకరించి పంపివేసాను. 
జనకమహారాజుకు సీతమ్మ యొక్క తత్త్వం దైవీయమైనది అని తెలుసు. ఆమె అయోనిజ, తనంత తానుగా భూమి నుండి ఆవిర్భవించి స్వయంగా నేను నీ కూతురిని అని ప్రకటించినది ఆ బాల. అటువంటి దైవసంబంధమైన ఘటన కాక మానవలోక సహజం కానే కాదు కదా. 

ఈ శివధనస్సు దైవీయం. భగవదనుగ్రహం వలనే ఆ ధనువూ, ఈ పుత్రికా తనకు లభించారు. అందుచేత ఆ కుమార్తెకు వరుడుగా అర్హమైన వ్యక్తి కూడా దైవీయమైన శక్తి యుక్తులు కలవాడే అవుతాడు. 

అన్యులు ఏ పాటి? వారి శక్తులు ఏ పాటి? వారంతా తమకు తాముగా పరీక్షకు అంగీకరించి ఓడి తమది అల్పసత్త్వమే‌ కాని ఏ దైవీయమైన విశేష బలపరాక్రమాలూ తమ వద్ద లేనేలేవని తామే సభాముఖంగా నిరూపించుకున్నారు. జనకమహారాజుగారి ఆంతర్యాన్ని మూర్ఖులైన ఆ రాజులు గుర్తించలేరు. సామాన్యులైన సభాసదులు ఎవరూ గ్రహించలేరు. 

కాని మహా తపస్వి ఐనవాడూ, అపరబ్రహ్మ ఐన విశ్వామిత్రమహర్షి గ్రహించగలడని చెప్పటానికి యేమీ అనుమానం ఉండదు కదా. ఆ రాజులను అల్పసత్త్వులని చెప్పటమూ, విశ్వామిత్రులను మహామునీ, తపోధనా అని రెట్టించి సంబోధించటమూ ఈ విషయాలను గుంభనగా చెబుతున్నాయి.
తతః పరమకోపేన రాజానో నృపపుఙ్గవ
న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః  20
తమతమ ప్రతాపాల గొప్పలు సందేహాస్పదం అని ఇలా సభాముఖంగా ప్రకటించినట్లుగా జరిగింది. దాంతో అవమాన భారంతో ఆ రాజులందరికీ పిచ్చికోపం వచ్చింది. వాళ్ళు అవమానంతో కుతకుతలాడి, అంతా కలిసి మిథిలను ముట్టడించారు.
నిజానికి ఆ రాజులంతా శ్రేష్ఠమైన పరాక్రమం కలవాళ్ళే కాని సభలో విల్లుముందు తేలిపోయారు. ఆ మాట చెప్పటానికే ఆ రాజుల్ని జనకులు నృపపుంగవులు అన్నారు. 

వాళ్ళెంత పరాక్రమవంతులైనా వారి పరాక్రమంలో దైవీయమైన కోణం ఏమీ లేదు కాబట్టి ఆ విల్లు వారిని నిరోధించింది. అందుకే జనకులు వారిని పొమ్మన్నారు. వాళ్ళకి కోపం రావటంలో వాళ్ళ తప్పు కాని ధూర్తత్వం కాని ఏమీ‌ లేదని ఈ‌ శ్లోకంలో జనకులు ఈ‌నృపపుంగవ అన్న మాటతో సూచించారు. 

ఏదో ఒక్క ముక్క పట్టుకుని ఇలా అనటం కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది. వాల్మీకి మాటల్లో పొల్లుమాటలు ఉండవు. అందులోనూ జనకుడి మాటలుగా చెబుతున్నవి ఖచ్చితంగా జనకమహారాజు హృదయాన్ని ఆవిష్కరించేవే కాని ఏదో పూరణకోసం అల్పకవి వాక్యాలుగా ఉండనే ఉండవు.
ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవాః
రోషేణ మహతాఽఽవిష్టాః పీడయన్మిథిలాం పురీమ్  21
ఓ మునిపుంగవా,  ఈ రాజులంతా నేనేదో వాళ్ళని కావాలని అవమానించి పంపివేసానని భావించారు. అందుకే వాళ్ళంతా కలిసి మిథిలపైన ముట్టడి చేసారు.
అంటే ఆ రాజులంతా ఈ మిథిలారాజు కపటి అని భావించారని అర్థం. 

ప్రపంచంలో ఒక వస్తువు యొక్క ధర్మాలను మనం మన ఇంద్రియానుభూతుల సహాయంతో నిర్ణయిస్తాం. తరచుగా పూర్వానుభవమూ, లోకానుభవమూ అనేవి కూడా సహాయం చేస్తాయి ఈ విషయంలో. 

ఇది ఒక రకంగా బలమే. నిత్యజీవితంలో అనేకవిషయాలను పదే పదే అనుభవించవలసిన పరిస్థితి తప్పుతుంది.  తడిగా ఉన్న నున్ననిగచ్చు మీద నడిస్తే పడతామని లేదా ఇతరులు పడగా తెలుసుకున్నామనీ జ్ఞానం ఉన్నప్పుడు ప్రతిసారీ పడి తెలుసుకోవలసిన పని లేదు కదా? అలాగే చెక్క వస్తువు కన్నా ఇనుపవస్తువు బరువుగా ఉంటుందన్నదీ స్వానుభవమో లోకానుభవమూ కూడా కదా. 

ఇలాంటి ఇంద్రియ జ్ఞానాన్ని భ్రమపరచి తప్పుదోవ పట్టించి ఇంద్రజాలికులు వినోదం కలిగిస్తారు. మోసగాళ్ళు నిలువునా ముంచి పోతూ ఉంటారు. జనకమహారాజు ఒక విల్లును ఎత్తమన్నాడు. విల్లును ఒక ధృఢమైన వెదురు వంటి వాటితో చేస్తారు. కాని లోహంతో చేయరు కదా.  తీరా చెక్కవస్తువు అని భ్రమపెట్టేలా ఏదో బరువైన లోహపు వింటిని ఇచ్చాడు జనకుడు. అదీ కాక పట్తుకుందుకు అనువుగా లేకుండా దాని తయారీలోనే ఏదో చమత్కారం ఉంది. అది ఒక విల్లు అని భ్రమపడి అందరూ మోసపోయారు. పిల్లని ఇవ్వటం ఇష్టం లేక మిథిలా రాజు ఈ ఎత్తు వేసి అందర్నీ నిందుసభలో అవమానం చేసాడు. 

ఇదీ ఆ రాజుల అనుమానం. 

బహుశః ఆ వింటి గొప్పను జనకుడు ఆ రాజులకి చెప్పినా వాళ్ళు పామరత్వంతో ఆ కథనాన్ని నమ్మలేరు. అంతా మోసం అనే వారి అనుమానం. జనకుడు కూడా బలశాలి ఐన రాజోత్తముడు కాబట్టి ఏ రాజో దండెత్తి ఓడించేది అనుమానం. అందుకే అందరూ కలిసి జనకుణ్ణి ఓడించాలని మిథిలా నగరాన్ని ముట్టడించా రన్నమాట.
తతస్సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః 
సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః  22
ఈ‌ రాజులంతా కలిసి ఒక సంవత్సరం పాటు ముట్టడించారు. నగరంలో ఆహారపదార్థాలకు కొఱత వచ్చే పరిస్థితి దాపురించింది. ఓ ముని శ్రేష్ఠా, అది నాకు చాలా కష్టం కలిగించింది.
అంటే వాళ్ళంతా కలిసి ముట్టడించినా మిథిల లొంగలేదు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు పట్టువిడవకుండా ఆ దాడిని కొనసాగించినా జనకుడు వాళ్ళని సమర్థంగా నిగ్రహించగలిగాడు. 

ఏ‌ కాలంలో ఐనా ఒక ప్రాంతాన్ని దశదిశలా దిగ్భంధం చేసి ముట్టడిస్తే ఎంత సమర్థంగా వాళ్ళని లోపలకి చొరబడకుండా నిలువరించినా క్రమంగా చిక్కుబడ్డ ప్రాంతానికి తిండి కొరత వస్తుంది తప్పకుండా.  

ఎందుకంటే ఏ ప్రాంతమూ సర్వవిధాలా స్వయం సమృధ్ధం కాలేదు కదా. కొన్ని రకాల తిండి దినుసులను మనం తయారు చేసుకుంటే మరికొన్ని ఇతరప్రాంతాలనుండి దిగుమతి చేసుకుంటాం. ఒకచోట్నే అన్ని అవసరమైన పంటలూ పండవు కదా. అలా బయటినుండి రావలసిన దినుసులకు తప్పకుండా కరువు వచ్చితీరుతుంది. 

ఆన్ని దినుసులూ ముఖ్యావసరాలు కాకపోవచ్చును. కాని వాటిలో కొన్నైనా ముఖ్యావసరాలు ఉండితీరతాయి. కేవలం చింతపండుకో, ఉల్లిపాయలకో కొరత వస్తే ఎంత గడబిడ చెలరేగుతుందో అందరం చూస్తూనే ఉంటాం కదా. అలాంటిది నిత్యావసరాలు బయటినుండి నగరంలోనికి వచ్చే దారులన్నీ మూసుకొని పోతే, అదీ ఒక సంవత్సరం పాటు ఐతే. నగరంలో జీవితం అత్యంత సంకతస్తితిలోకి వచ్చేస్తుంది. 

పాలకుల మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఇలా వచ్చింది ముట్టడి ప్రభావం అని జనకులు చెబుతున్నా రిక్కడ,
తతో దేవగణాన్ సర్వాన్ తపసాఽహం ప్రసాదయమ్
దదుశ్చ పరమప్రీతా శ్చతురంగ బలం సురాః   23
నేను సమస్త దేవగణాలనూ‌ సహాయం కోసం ప్రార్థించాను. వారి దయ కోసం నేను చేసిన తపస్సుకు దేవతలు సంతోషించి నాకు చతురంగ బలాల్నీ అనుగ్రహించారు.
మానవ ప్రయత్నంతో జనకరాజుగారు కోపాలసులైన ఆ రాజుల్ని ఏడాది పాటు ఎదిరించి నిలిచినా, పౌరజీవనానికి అంతరాయం కలగటం వలన దుఃఖించి, ఈ ముట్టడిని అంతంచేసే శక్తి కోసం దేవతల్ని ప్రార్థించారు. 

జనకుడు తనకోసం కాక ప్రజలకోసమే దేవతలను ఉద్దేశించి తపస్సు చేసారు కాబట్టి ఆ దేవగణాలు చాలా సంతోషించాయి. వారి అనుగ్రహం ఎలా వచ్చిందంటే దేవతలు ఆయనకు చతురంగబలాలను సమకూర్చారట. అంటే దేవతలదయ వలన ఆయనకు రథ, గజ, తురగ పదాతి బలాలు కొత్తగా సమకూడా యన్నమాట. దీని విషయంలో మనకు వివరం తెలియదు. కాబట్టి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి మనమే. 

యుద్దంలో క్షతగాత్రులైన సైనికులూ, అలాగే గాయపడిన గుఱ్ఱాలూ, ఏనుగులూ అన్నీ తిరిగి మంత్రం వేసినట్లుగా మరలా యుధ్ధానికి సర్వం సిధ్ధం కావటం‌ జరిగి ఉండవచ్చును. దెబ్బతిన్న రథాలన్నీ దేవతల అనుగ్రహం వలన సులభంగా బాగుపడి ఉండవచ్చును. దానితో ఆయన బలం పెరిగి ఉండవచ్చును. 

దేవతలు అఘటనఘటనా సమర్థులు కాబట్టి నిజంగా వారి మాయ వలన బోలెండంత బలగం ఆయనకు ఏర్పడి ఉండవచ్చును అని కూడా చెప్పుకోవచ్చును.
తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః
అవీర్యా వీర్యసన్దిగ్ధా స్సామాత్యాః పాపకర్మణః  24
దానితో ఆ పాపాత్ములైన రాజులంతా సందిగ్థంలో పడిపోయారు. పెరిగిన నా బలాన్ని ఎదుర్కోలేక ఇంక తమతమ ప్రతాపాలను నమ్ముకోలేక ఆ రాజులూ వారిని ప్రేరేపీస్తున్న మంత్రులూ అంతా చెల్లాచెదరుగా తలో దిక్కుకూ పారిపోయారు. 
ఇక్కడ జనకమహారాజుగారు ఆ రాజుల్ని పాపాకర్ములని నిందిస్తున్నారు. తాము తమ చేతకాని తనంతో కొనితెచ్చుకున్న పరాభవానికి జనకుని నిందించటమూ, ఆయనతో యుధ్ధం పేర పౌరులకు తిండికి తిప్పలు తేవటమూ అనే తప్పుడు పనులకు వాళ్ళు పాల్పడ్డారు. అమాయకులకు హింసచేసే వాళ్ళని పాపకర్ములని తిట్టరా మరి? 

సాధ్యమైనంత వత్తిడి తెచ్చారు. మిథిల లొంగలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కాని మరింత సైన్యంతో విరుచుకు పడి జనకమహారాజు తమని ఊచకోత కోస్తున్నాడు. అందుకే వాళ్ళకు దిక్కు తోచలేదు. అసలు ఈయన మూలబలం ఇంకా ఎంత ఉందో ఏమిటో? ఏడాదైనా అలవడు. చివరకు తమబలం అంతా నాశనం అయ్యే చిక్కు ఉంది. 

అందుకే ఇంకేమీ చేసేది లేక, ఆయనకు తాళలేక ఎవరి ఊరి దిక్కుకు వాళ్ళు చక్కాపోయారు. అంటే ఇన్నాళ్ళూ ఐకమత్యంగా ముట్టడి చేసారు కాని ఇంక ఎవరి మాటా ఎవరూ వినే స్థితి లేదు. ఎగదోస్తున్న మంత్రులూ, నచ్చచెబుతున్న పట్టు వదలని రాజుల తాలూకు మంత్రులూ అంతా కూడా నోరు మూసుకోవలసి వచ్చింది. గందరగోళం నెలకొంది. ఎవరి దారిన వారు ఎవరు ఏమి చెబుతున్నా వినకుండా పలాయనం చిత్తగించారు.
తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్
రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత  25
ఓ ముని శార్దూలా, ఇదే నయ్యా ఆధనుస్సు సంగతి. అది అత్యంత ప్రకాశవంతమైనది.  ఆ వింటి జోలికిపోయే వచ్చిన రాజాదిరాజు లందరూ చిన్నబోయినది. ఈ రామలక్ష్మణులకు కూడా ఈ వింటిని చూపిస్తాను.
జనకుడు చెప్పిన ఈ మాటలు గమనార్హమైనవి. ఆయన ఇంకా రామలక్ష్మణుల సామర్థ్యాన్ని నమ్మటం లేదు. నమ్మటానికి ఆట్టే ప్రాతిపదికలు లేవు కూడా కదా ఆయనకు.  

రాముడూ ఆయన తమ్ముడూ విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షించిన సంగతి జనకుడికి ఈ‌ పాటికి తెలిసే ఉండవచ్చును. అలా జరగటం నిస్సందేహంగా గొప్ప విశేషమే. కాని అందులో విశ్వామిత్రుడి మహత్తు కూడా ఎంతో ఉండి ఉందవచ్చును రామలక్ష్మణుల గొప్పదనం కన్నా కూడా. 

ఏమో తనకు ఏమి తెలుసును? అరణ్యంలో ఎన్ని జంతువులు ఉన్నా అవన్నీ పులిముందు తోక ముడుస్తాయి. అలాగే పులి లాంటి ముని ఐన విశ్వామిత్రుడి ముందు రాక్షసులు ఒకరిద్దరి ఆటలు సాగుతాయా? ఆయన తలచుకోబట్టే రామలక్ష్మణులు ఆ రాక్షసుల్ని ఎదిరించే సాహసం చేసి ఉండవచ్చును కదా? అందులో అసంభావ్యం ఏమీ లేదు. 

అందుకే కొంచె ముక్తసరిగానే అదే నయ్యా విల్లు కథ, ఈ పిల్లలకీ చూపిస్తాను అనేసాడు.
యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్  26
మహామునీ, ఒకవేళ ఈ‌ రాముడు గనుక ఆ వింటికి నారిని తొడగ గలిగితే, ఆయోనిజ ఐన నా కుమార్తె సీతను ఈ‌ దాశరధికి ఇస్తాను.
రాముడు శివధనస్సుకు నారిని తొదగగలిగితే అతడికి సీతను ఇస్తాను అంటున్నారు జనకమహారాజు. ఆయనకి రాముడి పైన పూర్ణవిశ్వాసం కలగలేదు కనుకనే అలా చేయగలిగితే అని అనటం. 

ఈ‌ రాముడేమో కాకలు తీరిన యోధుడా? ఆయన పేరు వీరుల్లోకి ఎక్కి దేశదేశాలా ప్రాకిందా? ఇంకా అలాంటి దేమీ‌ లేదే? ఇతనా పిల్లవాడు. దశరథుడు విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపటానికి మొదట తటపటాయించాడు కదా. నిర్మొగమాటంగా "ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః" అని అన్నాదు కదా నిండా పదహారు యేళ్ళు లేని పిల్లవాడే అని సాకు చెబుతూ. 

కాకలు తీరిన భుజబలశాలురు ఓడి వెనుదిరిగిన సంగతి చూసిన జనకుడు, ఆ వింటిని ఈ నూనూగు మీసాల రాముడు ఎత్తగలడనీ దానికి నారిని సంధించగలదనీ ఒక పట్టాన ఎలా నమ్మగలడు? 15, డిసెంబర్ 2014, సోమవారం

పాపఫలం


రామాలయం దగ్గర పెద్దగా హడావుడి ఉండదు. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట ఆగుడి కట్టినప్పుడు  భక్తుల రాక బాగానే ఉండేదట. కాలక్రమంలో అది గణనీయంగా పడిపోయింది. నిత్యం రెండుపూటలా గుడికి వచ్చేది కేవలం అర్చకులవారే. కొందరు  పెద్దలు మాత్రం సాయంకాలం  పూట గుడికి వస్తూ ఉంటారు.

ఆ రోజున మాత్రం ఒక విశేషం‌ జరిగింది. సూర్యోదయం వేళకే అర్చకులవారూ ఆయన మనవడూ పూజాద్రవ్యాలతో ఆలయం దగ్గరకు వచ్చేసరికి అంతకన్నా  ముందుగానే ఎవరో ఒకాయన వచ్చి ఆలయం ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చున్నారు. అర్చకులవారు గాని ఆయన మనవడు కాని పట్టించుకోలేదు.  అప్పుడప్పుడూ దారినబోయేవాళ్ళూ బిచ్చగాళ్ళూ ఆ మంటపంలో దర్శనం ఇస్తూనే ఉంటారు కాబట్టి యీ వచ్చిన వారు ఎవరని ఆరా తీయవలసిన అవసరం కనబడలేదు వారికి.

పదకొండు గంటలకి గుడి తలుపులు మూసి అర్చకులవారు ఆలయం బయటికి వచ్చారు. ఆయన ఒక్క  కేక పెట్టేసరికి ఆయన మనవడూ ఉద్యానవనవిహారం చాలించి తాతగారిముందు ప్రత్యక్షం అయ్యాడు.

ఇంకా మంటపంలో తిష్టవేసిన మనిషి అక్కడే ఉన్నాడు. ఉదయం ఎక్కడ కూర్చుని ఉన్నాడో అక్కడే అలాగే కూర్చుని ఉన్నాడు. ఒక్కటే తేడా.  ఇప్పుడు మంటపంలో ఎఱ్ఱటిఎండలో కూర్చుని ఉన్నాడు. తాతామనవళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగింది.  ఈసారి ఆయనమీద తగినంత గౌరవభావమూ కలిగింది.

దగ్గరకు వెళ్ళి పలకరించారు అర్చకులవారు.

సమాధానం లేదు. ఆయన ఉలకలేదు పలకలేదు.

కొంచెంసేవు పలకరించటానికి ప్రయత్నించి విఫలం అయ్యాక దేవుడి ప్రసాదం కొంత ఆయన సన్నిధిలో ఉంచి వెనుదిరిగారు.

'ఎవరో మహానుభావుడు. మన ఊరి గుడిలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు ' అన్నారు అర్చకులవారు మనవడితో ఇంటికి నడుస్తూ.

సాయంకాలం అయ్యాక తాతామనవళ్ళు తిరిగి గుడికి వచ్చారు. ఉదయం మంటపంలో ధ్యానంలో ఉండి కనిపించిన కొత్త ఆయన ఇప్పటికీ అలాగే కూర్చుని ఉన్నారు. ఆయన ఎదురుగా ఉంచిన ప్రసాదపాత్ర అలాగే ఉంది ప్రసాదంతో సహా.

తాతామనవళ్ళకి పరమాశ్చర్యం అయింది ఈ సారి.

ఆయన్ను పలకరించటానికి కూడా  ఇద్దరికీ సాహసం చాల లేదు.

అర్చకులవారు గుడి తలుపులు తీస్తూ, 'ఈ సంగతి కరణంగారికి చెప్పిరా 'అని మనవణ్ణి పంపారు.  అంతకంటే ఏమి చేయాలో ఆయనకు తోచలేదు.

చీకటి పడే లోగా ఆలయం ముందు ఒక పెద్ద తీర్ధం తయారయింది. పిల్లామేకాతో సహా మూడువంతుల ఊరు గుడిముందు ప్రత్యక్షం అయింది.

ప్రతిరోజూ చేసేటట్లుగానే ఆరోజు ఏడున్నరకే గుడితలుపులు మూయలేదు అర్చకులు. మూసేవారే నేమో.  కాని ఏడుగంటల ప్రాంతంలో ఎవరో వచ్చి సాధువుగారు కొంచెం కదిలారన్న వార్త చెప్పారు. దానితో అంతా  ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఇంచుమించు  ఎనిమిదిగంటల ప్రాంతంలో మంటపంలోని పెద్దమనిషి నిజంగానే కళ్ళుతెరిచి చుట్టూ చూసారు. చుట్టుపక్కల జనమే జనం.  ఆయన వారినేమీ పట్టించుకోకుండా తిన్నగా దైవదర్శనానికి నడిచారు.

కొందరు కాళ్ళమీద పడబోయారు కాని ఆయన అడ్డంగా తలతిప్పి వారించటంతో తగ్గారు.

దైవదర్శనం చేసుకుని ఆయన మళ్ళా మంటపంలో కూర్చున్నారు.

ఈ సారి ఊరిపెద్దలు కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళి నమస్కరించబోయారు.

'తప్పు. దైవసాన్నిధ్యంలో మరెవరికీ నమస్కరించరాదు.' అన్నా రాయన వారిని వారించి.

ఊరిపెద్దలు ఎంతో వినయంగా స్వామీ మీ గురించి చెప్పండి అని అడిగారు.  అయన ఒక్క నిముషం మౌనంగా ఉండి పోయాడు. తరువాత మృదువుగా  'ఈ రోజు నవమి కదా! పౌర్ణమినాటి ఉదయం చెబుతాను నా గురించి' అన్నారు. 'రాత్రి యీ‌ మంటపంలోనే పడుకుంటాను , ప్రొద్దుపోయింది మీరంతా వెళ్ళిరండి' అని కూడా అన్నారు.

కరణంగారు పాలూ ఫలహారమూ పంపిస్తానంటే సాధువుగారు చిన్నగా నవ్వి, తల అడ్డంగా ఊపారు.

ఆ రోజు జరిగిన విశేషం గురించి ముచ్చటించు కుంటూ అందరూ ఇళ్ళకు మళ్ళారు.

ఎన్నడూ లేనిది మర్నాడు ఊరు ఊరంతా గుడికి వచ్చింది. వాళ్ళంతా రాములవారి దర్శనానికి వచ్చారని చెప్పటం‌ కన్నా సాధువుగారి దర్శనానికి వచ్చారని చెప్పటమే సరిగా ఉంటుంది.

సాధువుగారి గురించి న వార్త చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా దావానలంలాగా వ్యాపించింది. గుడి చరిత్రలో ఎన్నడూ లేనంత మంది జనం వస్తున్నారు ఉదయాస్తమయాలు. సాధువుగారు ఎవరినీ పట్టించుకోకుండా మంటపంలోనే కూర్చుంటున్నారు.  అహారమూ నీళ్ళూ ఏమీ‌ అవసరం లేనట్లున్నాయి  ఆయనకు. జనం మాత్రం ఎంతో క్రమశిక్షణగా మౌనంగానే అయన దర్శనం చేసుకుని వెడుతున్నారు.

పౌర్ణమి వచ్చేలోగానే ఊరిపెద్దలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సాధువుగారు సరేనంటే ఆయనకు ఒక ఆశ్రమం కట్టించి ఇవ్వటానికి ఊళ్ళో ఒక్కరు కూడా అభ్యంతరం  చెప్పలేదు.

పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజు ఉదయం‌ గుడి ప్రాంగణం జనసముద్రమే అయింది.

మళ్ళా కరణంగారు మునసబుగారు మొదలైన ఊరిపెద్దలంతా సాధువుగారిని స్వామీ తమగురించి నేడు చెబుతానన్నారు అని సవినయంగా గుర్తు చేసారు.

'ఈ రోజున పౌర్ణమి.  క్షురకర్మ చేయించుకో వలసిన దినం.'  అని సాధువుగారు చుట్టూ చూసారు. జనం మధ్యలో ఉన్న ఒక ఆసామీని  పేరు పెట్టి పిలిచారు 'నాకు క్షవరం చేయాలి రావోయ్' అని.

సాధువుగారు సర్వవేది అని జనం అంతా మహదానందం పొందారు.  రమారమి అరవైయేళ్లప్రాయంలోని ఊరి క్షురకుడు ఒకాయన ముందుకు వచ్చి నమస్కరించి 'మహా భాగ్యం' అన్నాడు.  సాధువుగారు నవ్వి పద అన్నారు.

గుడి పక్కనే ఉన్న కోనేటి గట్టున సాధువుగారికి క్షురకర్మ జరిగింది. సాధువుగారు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చారు. వెనుకనే క్షురకుడు.

చెప్పరానంత కోలాహలం చెలరేగింది.

కొందరి చేతుల్లో కఱ్ఱలూ పైకి లేవటం‌ జరిగింది.

అర్చకులవారైతే నోట మాట రాక రాయిలా నిలబడిపోయారు.

సాధువుగారు యథాప్రకారం మంటపంలో కూర్చుని చుట్టు ఒకసారి చూసారు.

'పెద్దలూ, ఊరిప్రజలూ అంతా  నేను ఎవరినో గ్రహించారు కదా!' అని చిరునవ్వు నవ్వారు.

అక్కడ ఉన్నవాళ్ళంతా తమలో తాము గుంపులుగుంపులుగా గడబిడగా చర్చించుకోవటం మొదలు పెట్టారు.

ఉన్నట్లుండి జనం మధ్యలోనుండి ఎవ్వరో 'కరణంగారూ పోలీసులను పిలవండి' అని పెద్దగా అరిచారు.

సాధువుగారు కులాసాగా నవ్వారు. 'పిలవండి. వద్దన్న దెవరూ' అన్నారు.

ఆ మాటతో అక్కడ సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం ఏర్పడింది.

మెల్లగా ఆలయం అర్చకులవారు  మంటపం వద్దకు వచ్చారు.

'నువ్వా  హనుమంతూ! ఎన్నాళ్ళకి తిరిగి వచ్చావూ!  నువ్వనే అనుకోలేదు సుమా! స్వాములవారివి ఎలా అయ్యావూ? ఇదంతా ఏమిటీ?' అన్నారు  విస్మయంగా.

'అర్చకులవారూ, హనుమంతు అనేది నా పూర్వనామం' అని సాధువుగారు చిరునవ్వు నవ్వారు.

కరణంగారు అయోమయంలో ఉన్నారు. సాధువుగారు చేయెత్తి, కరణంగారిని దగ్గరకు రమ్మని పిలిచారు.  కరణంగారు వచ్చారు.

'అమ్మ పరిస్థితి ఎలా ఉంది' అన్నారు సాధువుగారు.

కరణంగారు మాటల కోసం వెదుక్కుంటున్నారు.  సాధువుగారు చిరునవ్వు నవ్వారు. 'నాకు తెలుసు ఆ సంగతి' అని  మెల్లగా కొంచెం విచారంగా అన్నారు.

'అమ్మ నన్ను ఒక్క సారి చూసి కళ్ళు మూయాలని ఆశపడుతోంది.  నేను ఊళ్ళో కాలు పెడితే పోలీసులు పట్టుకు పోతారని ఆవిడకు భయమూ‌ బెంగాను .  అవునా?' అన్నారు.

కరణంగారు తల ఊపారు.

రోజూ అందర్నీ గదమాయించి మాట్లాడే కరణం గారు మన్నుతిన్న పాములా అలా మందకొడిగా ఎలా ఉన్నారో  అని జనం అనుకోలేదు. 'ఇప్పుడు మేనల్లుణ్ణి పోలీసులు పట్టు కెడతారని జంకుతున్నాడు, చూస్తున్నారా ' అని అనేకులు చెవులు కొరుక్కున్నారు.

అప్పటికే  ఎవరెవరో పోలీసులకు  వర్తమానం అందించటం జరిగింది.

సాధువుగారు మంటపం దిగి కరణంగారి చేయి పట్టుకున్నారు.  'పదండి అమ్మని చూడాలి'  అన్నారు.

ఎవరో యువకుడు అరిచాడు 'ఎక్కడికి వెళ్ళేది? పోలీసులు వస్తున్నారు' అన్నాడు.

సాధువుగారు నవ్వి మళ్ళీ మంటపం లోనికి పోయి కూర్చున్నారు.

రెండు సందుల అవతల ఉన్న పోలీసుస్టేషను నుంచి పోలీసులు ఎంతసేపట్లో రావాలీ? నిముషాల మీద వచ్చారు జీపు  వేసుకుని.

అక్కడ ఉన్న జనంలో అనేకు లైతే ఇలాంటి వాణ్ణి  ఏదో పెద్ద సాధువు అనుకొని బ్రహ్మరథం పట్టామే అన్న అపరాథభావనలో ఉన్నారు.  కొందరైతే ఈ దొంగసాధువుని పోలీసువాళ్ళు సంకెళ్ళు వేసి పట్టుకుని వెళ్ళవలసిందే అన్న పట్టుదలతోఉన్నారు.  కొందరైతే ఏదో ఉంది, మనకు సరిగా అర్థం కావటం‌లేదు అని తలలు పట్టు కుంటున్నారు.

పోలీసు ఇనస్పెక్టరు కూడా అలాగే అనుకున్నాడు జరిగినదంతా  ఊరిపెద్దల ముఖతా తెలుసుకుని.

సాధువుగారు ఇనస్పెక్టరు తనకు కొంత గౌరవం ఇచ్చి మాట్లాడటం చూసి  అడిగాడు, 'అంతా నన్ను దొంగ అంటున్నారు కదా? మీరు నాతో ఏమీ దురుసుగా మాట్లాడటం లేదే వింతగా ఉందీ' అని.

ఇనస్పెక్టరు విస్తుపోయాడు. 'మీరు మీ నిర్దోషిత్వం ఋజువు చేసుకోవాలని వచ్చారని నా కనిపిస్తోంది. స్వయంగా మిమ్మల్ని మీరు వెల్లడించుకుని పోలీసులకు పట్టుబడటానికి సిధ్ధం కావటం వెనుక ఇదే కారణం కాకపోతే మరేమిటీ?' అన్నాడు.

సాధువుగారు చిరునవ్వు తో చూసారు ఇనస్పెక్టర్ని. 'అమ్మ కోరిక తీర్చవలసి ఉంది. లేకపోతే రావలసిన పని లేదు' అన్నాడు.

ఇనస్పెక్టరు అనుమానంగా అడిగాడు 'మీ రెక్కడ ఉన్నదీ‌ మీ అమ్మగారికి తెలుసుకదా?  ఆవిడ కబురు పెడితే వచ్చారు కదా?'

సాధువుగారు తల అడ్డంగా ఆడించారు. 'మా అమ్మ నాకు కబురు చేయటం ఎలా కుదురుతుందీ? అదీ కరణంగారికి తెలియకుండా? కరణంగారికి తెలిస్తే నన్ను ఎప్పుడో పట్టించే వారు కదా?' అన్నారు.

సాధువుగారు మళ్ళీ అన్నారు 'ఐనా అమ్మ కబురుపెడితే  చూడాలని వచ్చినవాడినైతే గుట్టుచప్పుడు కాకుండా చూసి వెళ్ళలేనా? నా అంతట నేనే వచ్చాను, నాకు తోచినట్లే చేస్తున్నాను.'

ఇనస్పెక్టరు బుఱ్ఱ గోక్కున్నాడు.

సాధువుగారు స్థిరంగా అన్నారు 'ముందు మా అమ్మగారిని చూడాలి.  ఆ తరువాత, కావలిస్తే మీరు నన్ను అరెష్టు చేసుకోవచ్చును'.

ఇనస్పెక్టరు ఒప్పుకోలేదు. 'మిమ్మల్ని అరెష్టు చేస్తున్నాం. మీరు మీ అమ్మగారిని చూడా లనుకుంటే కోర్టువారి అనుమతితో అలాగే చేయవచ్చును' అన్నాడు.

సాధువుగారు నవ్వారు. 'అంత తతంగం అవసరమా? మీరు నన్ను  స్టేషనుకు తీసుకుని వెళ్ళాలంటే కరణంగారి ఇంటి మీదుగానే కదా జీపు వెళ్ళేదీ? మీరే స్వయంగా నన్ను మా అమ్మగారికి చూపించి తీసుకొని వెళ్ళండి' అన్నారు.

కొంత తర్జనభర్జన జరిగింది. ఆశ్చర్యం ఏమి టంటే కరణంగారే సాధువుగారి ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. 'ఇప్పుడావిడ చివరిదశలో ఉంది. ఇతణ్ణి చూసి మరింత క్షోభపడటం తప్ప మరేమి ఒరుగుతుంది ఆవిడకి? హనుమంతును తీసుకుపొండి. ఈ భ్రష్టుణ్ణి మా అక్కకి చూపించ నవుసరం లేదు 'అని భీష్మించుకుని కూర్చున్నాడు.

చివరికి ఇనస్పెక్టరు సాధువుగారి వైపే మాట్లాడాడు. 'ఇవాళ కాకపోతే రేపు ఆవిడకి తెలిసి బాధపడదా,  ఊళ్ళో కొచ్చిన కొడుకుని కనీసం కళ్ళారా చూసుకోలేకపోయానని? మేము ఆవిడకి చూపించే తీసుకుని వెళతాం లెండి' అన్నాడు.

కరణంగారి ఉక్రోషం కట్టలు తెంచుకుంది. 'ఈ హనుమంతూ మీరూ క్లాస్‌మేట్లై ఉంటారు.  అందుకే వాడి వైపు మాట్లాడుతున్నారు' అన్నారు.

చివరికి సాధువుగారిని  సంకెళ్ళు వేయకుండానే జీపెక్కించుకుని ఇనస్పెక్టరు కదిలాడు.  అక్కడున్న వాళ్ళంతా ఊరేగింపుగా జీపు వెనకాలే వెళ్ళారు ఏం జరుగుతుందో చూద్దామని.

కరణంగారి ఇంటి చుట్టు దిట్టంగా పోలీసు పహారా ఏర్పాటు చేయబడింది. నలుగురు కానిస్టేబుళ్ళతో కరణంగారి ఇంటిలోనికి వెళ్ళాడు ఇనస్పెక్టరు. జబ్బుగా ఉన్న ముసలావిడ హనుమంతు తల్లి ఉన్న గదికి ఒకటే ద్వారం ఉంది. బయట కానిస్టేబుళ్ళని ఉంచి ఇనస్పెక్టరు సాధువుగారితో సహా ఆవిడ గదిలోనికి వెళ్ళాడు.  ఇనస్పెక్టరుతో పాటు ఆలయ ధర్మకర్తగారు కూడా లోపలికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే, కరణంగారూ వాళ్ళతో పాటే వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళకుండా బయటే ఉండి పోయారు.

ముసలావిడ కొడుకుని చూసి చాలా సంతోషించింది.

ఐతే, కొడుకు వెంట పోలీసులు వచ్చారని తెలిసి హతాశురాలైంది.

కొడుకు తల్లిని ఓదార్చకుండా ఉండలేడు కదా. "అమ్మా, నా చేతుల్లో కన్ను మూయాలని కలవరించావు. నేను  ఇప్పుడు సన్యాసిని. ఆసంగతి నీకు తెలియదు. కాని నీ కోరిక నా మనస్సుకి తెలిసింది. అందుకే నీ ఆశ తీర్చాలని వచ్చాను. అందరూ అనుకుంటున్నట్లు నేను దేవుడి నగలు దొంగిలించి పారిపోలేదు.  నన్ను దొంగని చేసి, జైలు పాలు చేసి, నీకు నాన్నగారి ద్వారా సంక్రమించిన నాలుగెకరాలూ స్వాధీనం చేసుకోవాలని మావయ్యే ఈ‌ ఎత్తు వేసాడు. గుళ్ళో దేవుడి నగలు తెచ్చి నీ సందుగుపెట్టెలో దాచాడు. నా మాట ఎవరు నమ్ముతారు? మావయ్య కట్టు కథలు చెప్పి పోలీసుల దృష్టిలోనూ‌జనం దృష్టిలోనూ నన్ను దుష్టుణ్ణీ దొంగనీ చేసాడు. ఎదిరించి నిలచే వయసూ సామర్థ్యమూ లేని నేను ఊరు వదిలి పారిపోయాను. సన్యాసి వేషం వేసుకుని ఊళ్ళు పట్టుకుని  తిరిగాను, కనిపించిన గుడికల్లా వెళ్ళి నా నిర్దోషిత్వాన్ని ఋజువు చేయమని దేవుణ్ణి వేడుకున్నాను కొన్నాళ్ళు. చివరికి  సన్యాసం స్వీకరించాను. అదంతా వేరే పెద్దకథ.  టూకీగా  చెప్పాలంటే,  ఆ రోజుల్లో ఒక స్వాములవారు నన్ను మందలించి వెంట తీసుకొని వెళ్ళారు.  అనంతర కాలంలో ఆయనే నాకు శిక్షణ నిచ్చి సన్యాసమూ ఇచ్చారు. ఇప్పుడు నీ‌కోరిక తెలిసి వచ్చాను."

ముసలావిడ గుండెలు బాదుకుంది.

ధర్మకర్తగారు తెల్లబోయారు. కరణం ఇలాంటి వాడని ఆయన ఊహకు కూడా ఎప్పుడూ అందలేదు మరి.

ఇనస్పెక్టరు కరణంగారి పాత్ర గురించి వచ్చిన అభియోగం విని విస్తుపోయాడు. "మీ‌ మాటలకి  ఆధారం ఏమిటీ" అని అడిగాడు.

స్వాధువుగారు చిరునవ్వు నవ్వారు.

తల్లి ఆర్తిగా అడిగింది 'అవున్నాయనా, మనం దొంగలం కాదని నిరూపించుకోవాలి కదా' అని.

సాధువుగారు చిరునవ్వు నవ్వి  'కరణంగారు దేవుడి నగల దొంగతనం నా మీద వేసినా, లోభం కొద్దీ వాటిల్లో చాలా వాటిని తానే దాచేసుకున్నాడు. జనం నేను వాటితో పారిపోయాననుకున్నారు. కరణంగారు వాటిని దాచటానికి  పాపం చాలా అవస్థపడ్డారు. వాటిని అమ్మటానికి కాని కరిగించటానికి కాని బయటకు తీస్తే దొరికిపోతాననే భయంతోఆ సాహసం చేయలేక పోయారు. తిరిగి గుడికి చేర్చే  దారీ తోచలేదు, బుధ్ధీ పుట్టలేదు. ఇన్నాళ్ళూ    నిధికి పాములాగా ఆయన వాటికి కాపలా కాస్తూ ఉండిపోయారు. నన్ను ముంచటానికి ఆయన దొంగ అవతారం ఎత్తితే, ఆ పాపఫలం కారణంగా, ఆయన పెద్దకొడుకు దుర్వ్యసనాలపాలై ఆయన్నే ముంచటానికి నిన్న ఆ నగలను దొంగిలించి పారిపోయాడు. ఈ ఉదయమే , పోలీసులకు దొరికిపోయాడు అవి అమ్మబోతూ. ఇప్పుడు పట్నం నుంచి సర్కిల్‌గారు ఆ పుత్ర రత్నాన్ని జీపులో ఇక్కడికే తీసుకుని వస్తున్నారు' అన్నారు.

ఇంతలో బయట పెద్ద కోలాహలం వినిపించింది. ఒక కానిస్టేబుల్ తలుపు కొద్దిగా తోసి సర్కిల్‌గారి రాకని తెలియబరిచాడు ఇనస్పెక్టరుకి.

ఇనస్పెక్టరు అప్రతిభుడైపోయాడు ఒక్క నిముషం పాటు. తరువాత గబగబా బయటకు వెళ్ళాడు.

సాధువుగారి తల్లి ముఖం వికసించింది. 'నాయనా నింద నుండి బయట పడ్డాం. ఇంక ఇక్కడే ఉండిపోరాదూ' అంది.

సాధువుగారు తల అడ్డంగా ఆడించి ఇలా అన్నారు. 'అమ్మా. సన్యాసికి బంధాలు ఉండరాదు. గుర్వాజ్ఞప్రకారం నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. నీకు ఇంకా ఆరేడు సంవత్సరాలు ఆయుర్దాయం ఉంది. మావయ్య మిగతా కొడుకులూ, కూతుళ్ళూ  చాలా యోగ్యులు. నిన్ను బాగా చూసుకుంటారు. నేను వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వు' అన్నాడు.

ఆవిడ  స్థిరంగా 'నువ్వు రాకుండా నా ప్రాణం  పోదు నాయనా' అన్నది.

సాధువుగారు నవ్వి 'అలాగే నమ్మా' అన్నాడు. మళ్ళా ధర్మకర్తగారి వైపుకి తిరిగి 'మీరు కరణంగారి దగ్గరకు వెళ్ళండి. ఆఖరుక్షణాల్లో మీతో ఆయన చెప్పా లనుకుంటున్న  మాటలున్నాయి.' అన్నాడు.

ధర్మకర్తగారికి అయోమయంగా అనిపించింది. కాని తొందరగానే తెప్పరిల్లి గబగబా బయటకు నడిచాడు.

బయటకు వెళ్ళిన ఇనస్పెక్టరుకు, బేడిలతో దర్శనం ఇచ్చిన పెద్దకొడుకుని చూడగానే గుండెపోటు వచ్చి పడిపోయిన కరణంగారు కనిపించారు.

కరణంగారిని హుటాహుటిని పెద్దాసుపత్రికి తరలించారు.

ఈ కోలాహలం ముగిసి సాధువుగారి కోసం సర్కిలూ, ఇనస్పెక్టరూ ముసలమ్మగారి గదిలోకి వెళ్ళారు. కాని అక్కడ ఆయన లేడు. 'బయటకు వెళ్ళాడు  బాబూ మీ వెంబడే' అని ముసలమ్మగారు చెప్పింది ఇనస్పెక్టరుతో.

కాని ఆ సాధువుగారు  అసలు గది బయటకు రావటమే ఎవరూ చూడలేదు.

(ఇది లోగడ జనవిజయం‌బ్లాగులో ప్రచురితమైన కథ)

ఈ నెల డిసెంబరు 2014 మాలిక పత్రికలో ప్రచురితమైన నా రచన


ఈ నెల డిసెంబరు 2014 మాలిక పత్రికలో నా రచన వాగుడుకాయ కథను ప్రచురించారు.


12, డిసెంబర్ 2014, శుక్రవారం

కవులెల్ల నినుగూర్చి ఘనముగా వ్రాయరే

కవులెల్ల నినుగూర్చి ఘనముగా వ్రాయరే
వర్ణనలందుండు వారికి రుచి

పౌరాణికుల నుడుల్ పొడవులై సాగవే
భవదద్భుత కథల్ వారికి రుచి

వేదాంతు లాత్మ నన్వేషించరే నిన్ను
బ్రహ్మవిజ్ఞానంబు వారికి రుచి

భక్తు లనిశమును భావించరే నిన్ను
పరవశించుటలోన వారికి రుచి

ఎవరి రుచి యెందు వర్తించు నెట్టి భంగి
నట్లు బుధులెల్ల నిన్నెప్పు డఱయు వారు
పామరుడ వీరిలో జేరువాడ గాను
నన్ను కృపజూడు మీశ్వరా కన్నతండ్రి
1, డిసెంబర్ 2014, సోమవారం

హనుమంతుడి కోరిక
శ్రీరామచంద్రుడు సింహాసనమున
కూర్చుండి యుండగా కొలువుకూటమున
లోకవృత్తము లెల్ల సాకల్యముగను
దక్షులై మంత్రులు తన కెఱిగింప
ఉచితాసనంబుల నున్నట్టి వారు
సామంతరాజులా సరిలేని దొఱను
కొలిచి యాదేశముల్ తెలియు చుండగను
కవులు నట్టువరాండ్రు గాయకు లెల్ల
విద్యల జూపంగ వేచి యుండగను
మునివరేణ్యులు నవ్వుమోముల వారు
తులలేని మహిమలు గలిగిన వారు
సాకేతపురనాథు సభలోని కంత
నాకాశమార్గాన నరుదెంచినారు
వచ్చిన తపసుల వసుధేశు డంత
సింహాసనము డిగ్గి సేవించి తగిన
యాసనంబుల నుంచి యందర కపుడు
ప్రీతిగా నిటుబల్కె వినయంబు మీఱ
మునిసత్తములు మీరు జననాథు నొకని
గనవచ్చు టది వాని ఘనభాగ్య మగును
వాని రాజ్యంబున పాడిపంటలకు
సమృధ్ధి కలుగును సర్వకాలముల
వాని రాజ్యంబున ప్రజల కందరకు
పూర్ణాయువులు గల్గు పొల్పు మీఱగను
వాని రాజ్యంబున ప్రజల కందరకు
ధర్మార్ధకామముల్ తప్పక దొఱకు
మీ రాకయే మాకు మిక్కిలి శుభము
మీ రాకయే మాకు మిక్కిలి జయము
మా పుణ్యములు పండి మాకు మీ దివ్య
దర్శనభాగ్యంబు తాపసులార
కలిగిన దిక మీద తెలుపుడు మాకు
మీ‌ యాజ్ఞ రాముడు మీఱడు దాని
ననవుడు శ్రీరాము గనుగొని మునులు
ఆదినారాయణుండవు నీవు రామ
జానకీహృదయేశ జగదభిరామ
రఘుకులాంబుధిసోమ రాజలలామ
రావణనిర్మూల రణరంగభీమ
కారుణ్యగుణధామ తారకనామ
పరమర్షిగణములు సురలు భూదేవి
ధాతయు నినుజేరి తద్దయు భక్తి
ప్రార్థించి యోదేవ రావణాసురుని
ఆగడంబుల తీరు నణచగా నీవు
నరరూపమును దాల్చు తరుణ మేతెంచె
నని విన్నవించగా నపుడు వారలకు
నభయంబు దయసేసి యవని కౌసల్య
గర్భవాసంబున కడువేడ్క నిట్లు
ప్రభవించితివి శేషఫణి లక్ష్మణుడుగ
చక్రశంఖంబులు చక్కగా భరత
శత్రుఘ్నులను పేర జనియించినారు
రఘువంశమున నీవు రామచంద్రునిగ
అవతరించగ నుంటి వనెడు సత్యమును
చిత్తమం దెఱిగి వశిష్టుండు మున్నె
మీ కులగురువుగా మెలగుచున్నాడు
నిత్యానపాయిని నీకు తోడుగను
శ్రీయాదిలక్ష్మియే శీఘ్రంబుగాను
అవని కడుపునుండి యవతరించినది
రావణు నడగించి దేవాధిదేవ
పట్టాభిషిక్తుండ వగునాడు నీదు
వైభోగమును చూడవచ్చుట కేము
యాగదీక్షితులమై యడవులనుండి
రాలేకపోతిమో రామయ్య తండ్రి
వచ్చితి మీనాడు వనజాక్ష నిన్ను
కనులార చూడ సంకల్పంబు జేసి
మాకు సీతను జూపుమా రామచంద్ర
మాకు లక్ష్మణు జూపుమా రామచంద్ర
మాకు భరతు జూపుమా రామచంద్ర
శత్రుఘ్ను జూపించు సాకేతరామ
సామీరినిం జూపు సాకేతరామ
చూపవె శ్రీరామ సుగ్రీవు నటులె
యందర వీక్షించి ఆశీర్వదించి
స్వస్థానముల కేము చనువార మయ్య
యీ చిన్ని కోరిక నీడేర్ప వలయు
వేఱొండు వలదని వినిపించినంత
నీరేజ నేత్రుండు నెవ్వెరపాటు
చెంది యీ రీతిగ చెచ్చెర బలికె
ఘనులార మునులార వనవాసులార
వినుడయ్య సభ కేను పిలిపింతు నిపుడు
మా తమ్ము లందర మహిత సత్వులను
రాజసభకు వచ్చు రాముడు పిలువ
సీతామహాదేవి శిరసావహించి
మీ‌పాదముల కేము మీఱిన భక్తి
మ్రొక్కువారము గాని తక్కుంగ లట్టి
సామీరి ప్రభృతుల్ సభకు రాలేరు
మునివరేణ్యుల యాన గొని రాముడెట్లు
తప్పి చరించునో తాపసులార
కావున వారికి కబురంపు వాడ
వారెల్ల వచ్చెడు వరకు మా యింట
విడిది చేయుడు మిమ్ము వేడెద నింక
ననవుడు మునులెల్ల రాశ్చర్యపడుచు
రాచనగరుల నుండ రాదు మా కెపుడు
వారు వచ్చెడు దాక వారిజనేత్ర
మీ యింటనే విడిది చేయుట యెట్లు
పోనిమ్ము నినుజూచి పొంగితి మదియె
మాకు చాలని యెంచి మరలి పోయెదము
కలగకు మో రామ కమలాయతాక్ష
యని యూరడించుచు నాడిరి నగుచు
నా మాటలొప్పక నంబుజోదరుడు
శ్రీరామచంద్రుడు చిన్మయు డపుడు
కులగురువుల వంక తిలకించి బలికె
వీరు మహాత్ములు విచ్చేసి నారు
కోరిన కోరిక కోసలరాజు
తీర్చలేదని బల్కి తిరిగిపోయెదరు
కాలంబు నన్ను వెంగళిజేయ నెంచె
నా కీర్తి ప్రభలెల్ల లోకాన నణగ
కాల మొనరించిన గారడీ విద్య
పుణ్యమా యని నేడు పుట్టె నీ చిక్కు
రఘువంశ మర్యాద రక్షించ వలయు
బ్రహ్మర్షి పరమపావనమూర్తి మీరె
యనినంత నా మాట లాలించి మునుల
కనునయంబుగ బల్కె నంత వశిష్ఠ
మౌనీంద్రు డో దయామయులార మీరు
మూడు పవళ్ళును మూడు రాత్రులును
విడిసిన చాలును తడయక నిపుడు
పుష్పకంబును రామభూపాలు డంపు
సౌమిత్రి తానేగి సుగ్రీవ హనుమ
దాదుల గొనివచ్చు నా పైన వారి
నందర వీక్షించి యరుగుట యొప్పు
నని నంత ఋషివరు లట్లు గాదయ్య
వనముల నుండుటే భావ్యంబు మాకు
నొక దినంబున కన్న నొండొక్క చోట
నుండుట మా కెప్పు డుచితంబు గాదు
బ్రహ్మర్షి మము దప్పు పట్టకు మయ్య
యనుచు వాక్రుచ్చగా నాత్మగతమున
శ్రీరామచంద్రుండు చింతించె జొచ్చె
నన్ను నే నెఱిగియు నరుని పధ్ధతిని
వర్తించు చుంటిని పరమర్షు లిపుడు
నన్నుపరీక్షింప నెన్నిన యట్లు
కనుపించు చున్నది కాన వీరలకు
కామితం బొనరించ గడగుదు నింక
నని నిశ్చయంచుచు వనజాక్షుడంత
మంచిది మునులార మహితాత్ములార
దయతోడ దిన మొండు తమరిందు విడిసి
మము కృతార్థుల జేయ మన్నించవలయు
మీరు కోరిన యట్లు పేరోలగమున
పురజనంబుల ముందు భూపుత్రితోడ
మా సోదరులతోడ మారుతితోడ
సూర్యకుమారుడౌ సుగ్రీవుతోడ
నాతని పుత్రుడౌ నంగదుతోడ
వీతరాగుండు విభీషణుతోడ
ఋక్షేశ్వరునితోడ ఋజువుగ మిమ్ము
దర్శించగల నిట్లు దయచేయ వలయు
నని విన్నవింఛిన హర్షించి వారు
విడుదుల కేగిరి విభుని కీర్తించి
రాజేంద్రు డంతఃపురంబున కేగి
సభలోన జరిగిన సంగతు లెల్ల
సీతామహాదేవి చెవులొగ్గి వినగ
విశందబుగను జెప్పి పిదప నిట్లనియె
రేపటి సభలోన తాపసవరులు
నగరవాసులు జూడ నాతోడ నీవు
సింహాసనస్థవై చెన్ను మీఱగను
నా తమ్ములందరు నా ప్రక్కనుండ
మారుతిప్రభృతుల్ మనసమక్షమున
నేత్రోత్సవంబుగా నెలకొని యుండ
రఘువంశమర్యాద రాజిల్లుగాక
ననవిని సీతమ్మ అవనీశ యింత
నవ్యవధిగా నెట్టులా కపివరులు
సభలోని కరుదెంచజాలుదు రనియె
చిరుచిరు నగవుల శ్రీరాముడంత
నింతిరో యిదియెల్ల నెరిగెద వెల్లి
పేరోలగంబున వారల నోట
చింతించవలదని సీత నోదార్చె
నంతట జానకి యగ్నిహోత్రునకు
విన్నపంబులు సేసె వేవేగ నీవు
పవనాత్మజాదుల భావంబులందు
రామదర్శనకాంక్ష రగిలించవయ్య
ఉన్నవా రున్నట్లు తిన్నగా రేపు
రఘునాథు కొలువుకు రావలెనయ్య
అఖిలదేవతలందు నాద్యుండ వగుచు
నాపదలను గాయు నగ్నిహోత్రుండ
మున్ను గాచినయట్లు నన్ను నా పతిని
కావవే యెల్లి యో కరుణాంతరంగ
యని చాలమారులు వినతులు చేసె
అగ్నిహోత్రుని గూర్చి యానాటి రాత్రి
కులగురువులు కూడా కోరిరా రీతి
సామీరిలంకేశజాంబవదాంగ
దాదులు సర్వులు దశరథసుతుని
కొలువున కెల్లి రా గూర్చుమీ వనుచు
నరనాథు డంతట మరుచటిదినము
ఘనముగా నారవకాలంబు నందు
సభదీర్చ జనులెల్ల చనుదెంచినారు
సౌమిత్రులిర్వురు చనుదెంచినారు
పరువున వచ్చెను భరతుడా సభకు
హనుమంతుడంతలో నరుదెంచినాడు
రాక్షసనాథుండు రయమున వచ్చె
జాంబవంతుడు వచ్చె సంతోషమొప్ప
ఘనుడు సుగ్రీవుండు కపిరాజు వచ్చె
నంగదనీలాదు లరుదెంచినారు
ఎక్కెడెక్కడివారు నెక్కటి కపులు
వచ్చిరి శ్రీరామవల్లభుసభకు
నంతలో నరుదెంచె నవనిజ గూడి
విభు డయోధ్యాపతి వేడుక మీఱ
నంతలో ఋషివరు లరుదెంచినారు
కులగురువుల తోడ జలజాక్షుసభకు
సింహాసనంబున సీతమ్మతోడ
నీరేజనేత్రుండు నేత్రపర్వముగ
ఉపవిష్ఠుడై యుండ తపసులెల్లరును
తనివితీరగ గాంచి ధన్యులైనారు
జయరామ శ్రీరామ సాకేతరామ
రావణాంతకరామ రాజలలామ
కళ్యాణగుణధామ కమనీయనామ
అద్భుతదర్శనం బందించినావు
మా కోరికను నీవు మన్నించినావు
షష్టిఘడియలలోన సర్వులం జూపి
కన్నుల పండువ గావించినావు
పోయివచ్చెద మింక భూనాధ నీకు
శుభమగు ననిపల్కి శ్రుతుల వల్లించి
దండిగా దీవించి తాపసోత్తములు
సభ యొల్ల జూడంగ క్షణమాత్రమందె
అంద రంతర్హితులై చనినారు
వచ్చిన సామీరి ప్రభృతులకును
బహుమతు లందించె పార్థివు డపుడు
బహుమతు లొల్లక పలుకాడ దొడగె
సామీరి యంతట స్వామికి మ్రొక్కి
ఏ మయ్య నాకేల నీ బహుమతులు
నిన్న మా నిదురలో నీవు కన్పించి
ఉన్నపాటుగనె రమ్మన్నంత లేచి
ఎగిరివచ్చితి మయ్య యెల్లవారలము
నీకు దూరంబుగ నే నుండజాల
సాకేతరామ నీ చరణారవింద
సేవనాశీలుండ నై వసియింతు
నీ మ్రోలనే యుండి నీ పరిచర్య
చేయుచుండుట చాలు నేయితరములు
నే నొల్లనో తండ్రి నీ చిత్తమనిన
నీ కోర్కి యిదియని నే నెఱుగుదును
కావున నిది యెల్ల కల్పించినాడ
నీవు వేఱొక్కచో నిలువగ నేల
నే రీతి నది నాకు హితమౌను హనుమ
కావున నిది యెల్ల కల్పించినాడ
పుత్రవాత్సల్యంబు పొంగారు చుండ
సీతామహాదేవి చింతించు నిన్ను
కావున నిది యెల్ల కల్పించినాడ
సమ్ముఖంబుననుండి సామీరి నీవు
పరమహర్షమ్మున వర్థిల్లవయ్య
యని స్వామి ప్రియమార హనుమకు నుడివె

అమ్మ - తెలుగు

ఆదరించేవాళ్ళు లేక అమ్మ చచ్చిపోతోంది
పలకరించేవాళ్ళు లేక తెలుగు చచ్చిపోతోంది.

అంతగా అన్నవస్త్రాలు అవసరమా అన్నది ఒక ప్రశ్న
అన్నిఅక్షరాభరణాలు అవసరమా అన్నది ఒక ప్రశ్న

అమ్మా అని పిలవకూడదూ అని బళ్ళల్లో హెచ్చరించి చెబుతున్నారు
తెలుగులో మాట్లాడితే శిక్ష తప్పదని కూడా కఠినంగా చెబుతున్నారు

ఇప్పటికే అనేకానేకమంది అమ్మలు మమ్మీలుగా మారిపోయారు
ఇప్పటికే తెలుగమ్మ కూడా చాలావరకూ డమ్మీగా మారిపోయింది

పాలిచ్చి పెంచి అవసరాలు తీర్చేందుకు అమ్మ ఒక పనిముట్టుగా మారిపోయింది.
సరదాగా మాట్లాడి వినోదంగా చూసేందుకు తెలుగు ఒక పనిముట్టుగా మారిపోయింది.

కేవలం మనిషైనందుకు అమ్మకు పనిముట్టు అన్న అగౌరవవాచకం మాత్రం వాడం
కేవలం జీవం లేనిదేకదా అనిపించినందుకే తెలుగుకు మాతృగౌరవం కూడా ఇవ్వం

మాతృమూర్తి ఒక పనిముట్టు అనిపించుకోని పనిముట్టు
మాతృభాష తెలుగు మనం గొప్పవాళ్లం కాబట్టి ఒక పనిముట్టు

పడి ఉండకపోతే అమ్మని బయటకి విసిరేస్తున్నారు ఆధునికులు
నోటికి పట్టుబడకపోతే తెలుగును చీరి ఆరేస్తున్నారు ఆధునికులు

అమ్మ మనం చెప్పినట్లు వినాలి కదా ముసలిదైపోయిన తరువాత
తెలుగు మనం కోరినట్లు మారాలికదా మనం మారమన్న తరువాత

మారని మాతృమూర్తిని ఎవరు మాత్రం ఎంతకాలం ఆదరిస్తారు పాపం
మారనంటే మాతృభాషని ఎవరు మాత్రం ఎంతకాలం ఆదరిస్తారు పాపం

అందుకే మన ఆధునికతాప్రీతి దెబ్బకు లోకంలో అమ్మ చచ్చిపోతోంది
అందుకే మన ఆధునికతాప్రీతి గొప్పకు లోకంలో తెలుగు చచ్చిపోతోంది

మాతృమూర్తి అనిపించుకున్నందుకు ఆ పిల్లల చేతిలో ఏదన్నా కాక తప్పదు కదా
మాతృభాష అనిపించుకున్నందుకు ఈ జనం చేతిలో ఏదన్నా కాక తప్పదు కదా

అందుకే, ఆదరించేవాళ్ళు లేక అమ్మ చచ్చిపోతోంది
అలాగే, పలకరించేవాళ్ళు లేక తెలుగు చచ్చిపోతోంది.