ఈ తెలుగు బ్లాగులోకం ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావటం లేదు. ఎవరికి ఇబ్బంది కలిగినా నా మాటలవల్ల, ఎవరికి ఆక్షేపణ ఉన్నా నా మాటలపట్ల, ఒక్కటి మాత్రం పచ్చినిజం. తెలుగుబ్లాగుల్లో రాశి అత్యధికం వాసి అత్యల్పం అన్నట్లుగా ఉంది నేటి బ్లాగులోకపరిస్థితి.
కొన్ని బ్లాగులు విద్వేషానలం వ్యాపింపజేస్తున్నాయి. అందులో మతవిషయక, రాజకీయవిషయక మైన బ్లాగులు కూడా ఉన్నాయి.
కొన్ని బ్లాగులు సజ్జలు. ఈ మాట అర్థం కావాలంటే త్రిపురనేని గోపీచంద్ గారి 'అసమర్థుడి జీవితయాత్ర' నవలను చదవాలి. కోళ్ళు సజ్జలు తిని సజ్జలు పెడతాయట, అలాగు కొందరు పత్రికల్లో చదివినవి బ్లాగుల్లోకి ఎక్కిస్తున్నారు. వారి ఆనందం వారిది.
కొందరు సొంతపైత్యాన్ని జనం మీద రుద్దేందుకు బ్లాగులు వ్రాస్తున్నారు. ఈ శ్యామలీయమూ ఆదే కోవ లోనిది కావచ్చునంటారా? మీ రౌనంటే నే కాదంటానా?
ఈ బ్లాగుల్లోనూ అతివాద మితవాద, దుర్వాద, నిర్వాద, దురదవాద బ్లాగులు బోలెడున్నాయి. సంతలో సందడి సృష్టించటం అనే కార్యక్రమాన్ని వీళ్ళంతా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు దిగ్విజయంగా.
కొన్ని కొన్ని వినోదప్రధాన బ్లాగులున్నాయి. కొన్నికొన్ని వివాదప్రధాన బ్లాగులున్నాయి.
కొన్ని కొన్ని జండాల వాదాల బ్లాగులున్నాయి. అందులో కొన్నింటికి ముసుగులూ ఉన్నాయి. అంటే ఇలాంటి బ్లాగుల్ని నిర్వహించే వారిని ముసుగు మనుషులు అనుకోవచ్చా అన్నారనుకోండి. మీ యిష్టం మీది అంటాను.
కొన్ని కొని ఎజెండాల బ్లాగులున్నాయి. వీళ్ళకి ఇదమిథ్థమైన జండా ఏమీ ఉండక పోవచ్చును. కాని ఓపెనో హిడెనో ఏదో రకమైన ఎజండా మాత్రం ఉంటుంది. అంటే వీటిలోనూ ముసుగు సహిత ముసుగు రహిత అనే రకాలుంటాయన్న మాట గమనార్హం.
కొన్ని బ్లాగులు ఏదో సాధించేద్దా మన్నట్లు మొదలవుతాయి. పాపం, జనాదరణ దొరికే దారిని వెతుక్కుంటూ చివరకు ఏవేవో వ్రాసుకుంటూ పోతుంటాయి.
వీటిల్లో కొన్ని బ్లాగులైతే ఎడారిలో దారి తప్పిన బాటసారుల వంటివి.
కొన్ని అదృష్టజాతక బ్లాగులుంటాయి. ఇవి రెండు రకాలు. టపాలపంట బ్లాగులూ, కామెంట్ల పంట బ్లాగులూ అని. కొన్ని కొన్ని ఉభయవర్గాల్లోకీ వస్తాయి.
వీటికి ఎప్పుడు తిరునాళ్ళ సందడే. ఏ రకమైతేనేమీ, ఇవి పెట్టిపుట్టిన హిట్లవిరాట్లు.
కామెంట్లపంట బ్లాగులకు సాధారణంగా ఆస్థానవిద్వాంసు లుంటారు. ఆ విద్వాంసులు నిరంతరాయంగా కామెంట్లను వండి వారుస్తూ ఉండటం వల్ల, సాధారణంగా ఆ బ్లాగులకు ప్రధాన పాఠకవర్గమూ వారే కావటం వల్లనూ హిట్లే హిట్లు, చాలా బ్లాగులకన్నా వేల రెట్లు. అట్లు గాక ఇంకెట్లు?
టపాలపంట బ్లాగులలో రెండు రకా లున్నాయి. స్వయంకృషి అనే దానికి కట్టుబడి మరీ పంటలు పండించే బ్లాగులూ, టపాలపంట ఎలా వస్తేనేం, ఎలా తెస్తేనేం అనే పరాన్నభుక్కు బ్లాగులూ అని ఇక్కడి వర్గాలు.
కొన్ని కొన్ని బ్లాగులు పండగల్లాగా అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటాయి. అంటే ఏదో పండక్కి కొత్తబట్టలు పెట్టినట్లుగా అరుదుగా టపాలు పెడుతూ ఉంటాయన్న మాట.
కొన్ని కొన్ని బ్లాగులు తోకచుక్కలు. ఎప్పుడన్నా తోకచుక్కను చూసారా? అతి అరుదు కదా? కాని తోకచుక్క వస్తే అనేక రోజులు వరసగా కనిపిస్తుంది ఆ తరువాత దీర్ఘ కాలం పాటు మాయం!
కొన్ని కొన్ని బ్లాగులు ఇక్కడికి వచ్చి కొంచెం నలుగురితో కలిసిమెలిసి ఉందా మనుకుంటాయి. ఇక్కడ నెగ్గుకు రావాలంటే ఏం చేయాలో తెలియక, ఎంతో నిబధ్ధతతో వ్రాసిన టపాలు జనామోదం నోచుకోక ఇది మనకు సరిపడే వ్యవహారం కాదులే అని మూసుకొని పోతూ ఉంటాయి.
కొన్ని కొన్ని అమాయక బ్లాగులు. కొందరు పెద్దమనుషులు ఇలాంటి అమాయక బ్లాగులు వ్రాస్తుంటారు. ఏదో జనానికి పనికి వచ్చే పని చేసేస్తున్నామూ అని వాళ్ళలో వాళ్ళే తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. నిజం కూడానూ. ఏదో ప్రపంచానుభవాన్ని నలుగురికీ పంచే వాళ్ళు, చదివి తెలుసుకున్నవి పదిమందికీ చెప్పాలనుకున్న వాళ్ళు, సామాజికస్పృహో చట్టుబండలో ఏదో ఒకటి - దాని పట్టుకుని పది మందికోసం అంటూ వ్యాసాలూ వగైరా దంచే వాళ్ళు ఇల్లాగా అనేకమంది కొద్దో గొప్పో యమ సీరియస్సు గానే బ్లాగులు వ్రాసే వాళ్ళున్నారు. ఇందులో సాంకేతికపరమైన అంశాలమీద నడిచే బ్లాగులూ ఉన్నాయి.
ఇలా తెలుగు బ్లాగు ప్రపంచం పరమ సందడిగా ఉందొ. కాని అది ఒక సంతలాగా ఉంది కూడా. అమ్మకందార్ల అరుపులు కొనుగోలుదార్ల విరుపులూ కలగాపులగంగా కలిసి ఒక సంత అంతా ఎలా గందరగోళంగా ఉంటుందో బ్లాగులోకమూ అలాగే ఉంది. మిగతా బ్లాగులలోకాల గురించి నాకు తెలియదు కాని మన తెలుగు బ్లాగులోకం మాత్రం అచ్చం ఇలాగే ఉంది.
ఒకప్పుడు -అంటే - నేనింకా పహెలా పచ్చీసులో ఉన్న రోజుల్లోనే ఏవో యాత్రలంటూ ఊళ్ళు తిరిగాం చాలాసార్లే. ఒకసారి బెంగుళూరూ తగిలింది ఆ యాత్రల్లో ఒక దానిలో. రవి వర్మ ఆర్ట్ గ్యాలరీ చూదాం అంటే ఒక్కరూ ఆసక్తి చూపలేదు. ఏదో నేనూ, మరొక మిత్రుడూ వెళ్ళాం మంథా లక్ష్మణమూర్తితో - ఆయన మంచి చిత్రకారుడు లెండి. బెంగుళూరు నుండి తిరుగు ప్రయాణంలో ఉండగా చూద్ధుము కదా, అనేక మంది చేతుల్లో ఆర్ట్ పీసులు అవీ, బెంగుళూరు వీధుల్లో షాపుల్లో కొన్నవి. అద్భుతమైన కలాపోసన మనది.
ఈ ముక్క ఎందుకు ప్రస్తావించానంటే, బ్లాగు సంత లోకపు వ్యవహారమూ ఇలాగే. ఏదో విషయం ఉన్న క్లాసు బ్లాగులూ ఆర్ట్ గ్యాలరీల్లాగా సందర్శకుల కోసమూ వారి నుండి ఒక్క మంచి ముక్క కోసమూ ముఖం వాచవలసినదే. పికాసోవి పిచ్చి బొమ్మలూ అనే బాపతు వాళ్లలాగా ఈ అమాయక బ్లాగుల్లో దూరి అల్లరి చేసే వాళ్లకు మాత్రం కొరత ఆట్టే ఉండదు.
లోకంలో ప్రసిధ్ధి చెందిన చిత్రకారుల అపూర్వ చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనకు దర్శనం ఇచ్చేవి చాలావరకూ నకిలీలూ అంటే నిజంగా మతిపోతుంది. కాని అది నిజమే. అలాగే, కళ్ళముందే తమ టపాలకు నకిలీలూ , ఆ నకిలీలకే భళాభళీలూ చూస్తూ పాపం అమాయకులు ఎలా తట్టుకోగలరు చెప్పండి. విషయపరిజ్ఞానం బొత్తిగా లోపించిన మహానుభావులు ఈ క్లాసు బ్లాగుల్లో దూరి నిందలూ వాళ్ళ బొందలూ లాంటి కామెంట్లకు దిగి విసిగిస్తుంటే ఆ అమాయకులు ఎన్నాళ్ళు ఓపిగ్గా తట్టుకుంటూ సమాధానాలిస్తూ కాలక్షేపం చేయగలరు చెప్పండి? ఎంత కాలక్షేపం కోసమే వ్రాసినా, ఎంత పనిలేదని వంకబెట్టి వ్రాసినా పనీపాటా లేని జనంతో కాలక్షేపం చేయాలంటే విసుగు పుట్టదా మరి చెప్పండి.
అందుకే కొందరు బ్లాగర్లు వ్రాయలేక మానలేక అవస్థ పడుతున్నారు.
కొందరు బ్లాగర్లు ఇలా ఇంకెన్నాళ్ళూ అని బాధపడుతున్నారు.
చివరికి, కొందరు బ్లాగర్లు ఇంక నాకు సాధ్యపడదూ అని చెప్పలేక చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన బ్లాగుప్రపంచం కావాలంటే మనం అంటే బ్లాగులు వ్రాసేవాళ్లమూ చదివే వాళ్లమూ మంచి పధ్ధతులు పాటించాలి. లేకపోతే ఇది ఇంకా కుప్పకూలి పోతుందని నా అనుమానం.