30, జూన్ 2012, శనివారం

స్వామి రారా స్వామి రారా చక్కని నా స్వామి రారా

స్వామి రారా స్వామి రారా చక్కని నా స్వామి రారా
కోమలగాత్ర కువలయనేత్ర స్వామి పూతచరిత్ర రారా

రారా సర్వోపద్రవవారణ నారకభయసంశోషణ
రారా భక్తమహాజనపోషణ భూరిజయశుభకారణ

జగదుత్పత్తిస్థితిలయకారణ స్వామి భవభయవారణ
అగణితసద్గుణ అశుభవిమోచన అద్భుతకరుణ  రారా

తామసహరణ జ్ఙానవిహరణ స్వామి దివ్యప్రేమాభరణ
శ్రీమద్యోగిజనార్చితచరణ స్వామి రారా ముక్తివితరణ

29, జూన్ 2012, శుక్రవారం

పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా


సెల వీయర యింక నేమి చేయ గలను నా రామా
పలుకరా యుపాయ మొకటి కలదా యో పరమాత్మా

ఘడియయేని కొంటెవాడ కనులు మూసికొన దలచితి
విడువక ఘననిష్ట నీదు విభవము ధ్యానించదలచి
గడువలేదు నిముసమైన గాని వివశమాయె మనసు
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ

ఘడియయేని నీగుణములు కమ్మగ నే పాడదలచి
కడు ప్రీతిని పెదవి విప్పి కంఠము సవరించినాడ
గడువలేదు నిముసమైన గాద్గదికమాయె స్వరము 
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ 

ఘడియయేని నీ రూపము కాంచి సంతసించ నెంచి
గుడిలో కొలువైన నిన్ను కూరిమి తిలకించు చుంటి
గడువలేదు నిముసమైన కనుల భాష్పజలము నిండె
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ

22, జూన్ 2012, శుక్రవారం

వేసములు వేనవేలు వేసివేసి విసివితిని

వేసములు వేనవేలు వేసివేసి విసివితిని
మోసపోతిని ప్రకృతి మూలమెరుగ లేనైతిని

నానా యాతనలు పడితి నల్పబోగములకు యే
మైనను ఒక సుఖమును మాట లేదు నాకు

గాసిలి నను బ్రోవమని కడకు నిన్ను వేడితిని
నీ సరి వారెవరు లేరు దాసపోష శరణంటిని

నేను నీవు నొకటనే నిశ్చయమున్నది గనుక
మానక నా యార్తి దీర్చు మాయ బాపు మంటిని

21, జూన్ 2012, గురువారం

నీ వలె నుండ లేక నాకు తిప్ప లెన్నెన్నో

నీ వలె నుండ లేక నాకు తిప్ప లెన్నెన్నో
కావలసిన యొడుపు బాగ కలుగు దారి చెప్పరా

ఇవి యవి కావలయునని యేవేవో కామనలు
అవి దొరుకని వేళ చెప్ప నలవికాని భావనలు
పవలు లేదు రేయి లేదు పరితపించు నా మనసు
అవధరించ వయ్య యిది అంతులేని బాధ ప్రభూ

ఒక నాడు నీవు నేను నొక్క రీతి నుంటిమిగా
సకలము మనదగుట నాశామోహము లెరుగకను
అకట వేరు చేసితివి అవని కంపితివి నన్ను
వికటాట్టహాసములతొ  విరుచుకు పడెరా ఆశలు

విభవములు వింత లిచట వేలున్నా వలదు నాకు
అభయమిమ్ము దురాశల నధిగమించు సుళువిమ్ము
ఉభయుల మొకటే ననుట ఉట్టిమాట కానీకుము
ప్రభు నాకిక స్వస్వరూపావబోధ కలిగించుము

19, జూన్ 2012, మంగళవారం

పలుకాడక నేడు నీవు పారిపోలేవు

పలుకాడక నేడు నీవు  పారిపోలేవు
పలు జన్మల తపఃఫలము  పండి దొరకినావు

అన్నన్నా నీవు నేను నొకటని పలుకుచునే
ఎన్నెన్నో దేహముల నేల దూర్చి యాడింతువు

సకలభూతహృదయాలయస్వయంజ్యోతి నందువు
అకట అజ్ఞానతిమిర మందు మమ్ము ముంచెదవు

అరుదైన స్వస్వరూపావబోధ నిత్తునని
తరచుగ నుబ్బించి నన్ను తప్పించుకొందువు

ఇదే ఇదే వచ్చితిరా ఇక నీవే చాలునురా

ఇదే ఇదే వచ్చితిరా ఇక నీవే చాలునురా
సదయా నీ సన్నిధిని వదిలేది లేదురా

నీదు మధురమధుర వచోమకరందము గొన వచ్చితి
నీదు చంద్రప్రభాధవళదరహాసము కన వచ్చితి

నీదు కృపామృతసరసిని జలకము లాడగ వచ్చితి
నీదు పాదసరోజముల కనుల కద్దు కొనవచ్చితి

నీదు చెలిమి కోరి జగము నెల్ల విడిచి యిటు వచ్చితి
నీదు కలిమి కోరి నన్ను విడువ వని యిటు వచ్చితి

18, జూన్ 2012, సోమవారం

నీ పరీక్షలకు నిలబడుటయు నది నీ కృప చే గాదా

నీ పరీక్షలకు నిలబడుటయు నది నీ కృప చే గాదా నిజముగ
నీ పనుపున గా కితరులు పనిగొని తాపము కలిగించెదరా

పురాకృతంబులు భూరిపాపములు భోగింపక తీరవుగా నే
నిరాకరించుచు పరాయి వారల నిందించుట మేలా
పరాత్పరా నను చక్కబరచునవి పరీక్షలే కాదా

తరతమభేదము లెంచుచు బ్రతుకుచు తప్పులు చేయుచు నే
మరలమరల తను భావము దాల్చుచు పరులననగ నేలా
గురుడవు జ్ఞానము గరపుచు పరీక్ష గొనుట మంచిదేగా

ఇహపరముల గురు తెరిగెడు దాక  తహతహ సహజము గా
అహము విడచి దుష్కర్మము గడచి యమితానందమున
విహరించగ నా స్వస్వరూపమున వెత లనునవి గలవా

14, జూన్ 2012, గురువారం

సారెకు నిన్నే చక్కగ పిలువక శాంత మెక్కడిది రా సఖుడా

సారెకు నిన్నే చక్కగ పిలువక
   శాంత మెక్కడిది రా సఖుడా
వీరిని వారిని పిలిచి ముచ్చటల
   తేరుటలో రుచి లేదుగదా

అన్నిట నీవే కాన వచ్చెదవు

చిన్నగ నవ్వుచు పలుకరించెదవు
నన్నెప్పుడు నెడ బాయకుందు విక
నిన్ను మరతునా నేనొక క్షణమును

నీ పనుపున నే నిల కేతెంచితి

నీ పనిలో క్షణ మేమరచితినా
లోపమగును నే నన్యము దలచిన
నీ పనియే నాపనిరా సుఖమును

యేనాటి దయ్య మన సాన్నిహిత్యము

ప్రాణ సఖుడ పరుల నే నెరుగనయా
నేనును నీవు నిటు మానుగ నొకటను
పూనిక నుంటిమి పొలుపు మీరగ నిక

9, జూన్ 2012, శనివారం

తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను

తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
విలసిల్లె నీరీతి విడని బంధము రామ

క్షణక్షణమును నీది దినదినమును నీది

కనుగవ యెదుట నుండి కరగు కాలము నీది
వెనుకటి గొడవలన్ని విడిపించి నన్ను నీ
కనుసన్నల నుంచి కాచేవు భళిభళి

ఘటికుడ యెన్నెన్నొ కష్టజన్మము లెత్తి

కటకట పడుచుండ కని యూరకున్నావు
చిటుకున నిపుడు నీవు చేకొన చిక్కు లన్ని
మటుమాయ మాయెనే మంచిది భళిభళి

కలిగి యవిద్య చేత కలవర పరచినట్టి

కిలుమెల్ల వదలినది తలకెక్కె తత్వము
నిలచితి స్వస్వరూప నిష్టుడనై యుండుట
తెలియగ నీవిచ్చిన తెలివిడి భళిభళి

8, జూన్ 2012, శుక్రవారం

అన్ని వేళల నీవే ఆలోచనల నిండి యున్నావు రా

అన్ని వేళల నీవే ఆలోచనల నిండి
యున్నావు రా నీ యుద్దేశ మేమి
నన్ను పదుగురి వోలె నడువగ నీయవు
తిన్నగ నీయునికి పట్టు తెలియగ నీయవు

కనులు ముక్కును మూసి ఘన యోగ ముద్రనుండి

మనసు నీ లోకము నుండి మరలించగ నా వశమా
పనిగట్టుకొని నీవే పట్టుకొన్నావుగ నన్ను
నను కికురించ నీకు  న్యాయమగున చెప్పవయ్య

కొంటె వాడ నా చుట్టూర కొల్లలుగ బలగము నిటుల

అంటగట్ట నేకతమును  ధ్యానమును నావశమా
తుంటరివై నీవె నాకు తొడగినా వీ బంధములను
కంటబడ విది నీకు తగిన  కార్య మగున చెప్పవయ్య

నాకు తోడై యుందు నని నమ్మించి పంపి యిలకు

నా కర్మమునకు నిచ్చట నన్ను వదలి పెట్టినావు
నీ కేమొ యాటయె గాని నా కిది సంకటము గాదె
శ్రీకర నీవింత బెట్టు చేయనేల చెప్పవయ్య

7, జూన్ 2012, గురువారం

చిరుచిరు తృణకుసుమాల పూజలు చేకొనగలవా దేవా

చిరుచిరు తృణకుసుమాల పూజలు 
     చేకొనగలవా దేవా
మరిమరి మురియుచు నీ కందీయగ 
     మాకడ నేమియు లేవుగా

మా మా రేకులు మరియును చిన్నవి 
     మంచి వర్ణములు లేనివి
కోమలములు గా వేమియు స్వామీ 
    యేమను కొనక గ్రహించవే

మధురమధురములు మకరందంబులు 
     మాకు కొంచెమును లేవుగ
వ్యధలే గాని సుధలే లేని 
     వారము స్వామి గ్రహించవే

సుమనోహరములు సుకుమారంబులు 
     సొంపగు వాసన లెరుగమయా
విమలోదారము లమరు మనంబులు 
     వేడుక తోడ గ్రహించవే

5, జూన్ 2012, మంగళవారం

ఏమయ్యా మంచివాడ యెంతో చక్కని వాడ

ఏమయ్యా మంచివాడ యెంతో చక్కని వాడ
గోముగ సేవించు పూల గోడు కాస్త వినవయ్య

ఈ మా సువాసనలు స్వామీ మీ దయ చేత
మా మా తనువులను మన్నించి చేరినవి
ఈ మహిత సృష్టిని నీ మహిమను గాక
ఏ మైన కలిగెనా యేమి తేగలమయ్య
మా మా భాగ్యములు మాపరీమళములను
మీ మేన నలదుటకు వే మారులు వేడెదము

ఈ రేకుల వన్నెలు ఈ సౌకుమార్యములు
చేరినవి మాతనువుల శ్రీకర నీకరుణచే
ఆరయ ఘనప్రకృతిలో నన్నియు నీ మహిమయే
కూరిమి నమరించగా కొల్లలై గలిగినవి
వేరుగ మేమేమి తెచ్చి విన్నవించగలము
తీరుగ మా భాగ్యమైన మా వన్నెచిన్నెలే
మీరు పరిగ్రహింపగ  వే మారులు వేడెదము

ఈ మా గుండెలలో నిండి పొంగి పొరలెను
స్వామీ మీ ప్రేముడియే చక్కని తేనియగా
యేమని చెప్పవచ్చు నింతకన్న తీయని దిం
కేమైనా సృష్టిలోన నెచటనైన నున్నదా
ఏమీ అనుకొనక యీ తీయతీయని
ప్రేమనే గైకొనుమని  వే మారులు వేడెదము

4, జూన్ 2012, సోమవారం

కోవెల తలుపులు తెరిచారమ్మా పూవుల్లారా రండమ్మా

కోవెల తలుపులు తెరిచారమ్మా పూవుల్లారా రండమ్మా
భావాతీతుని చేరి కొలువ పూబాలల్లారా రండమ్మా

అందమైన దేవుని సుందరవదనారవింద
సందర్శనానందసౌభాగ్యవేళాయె

అందమైన దేవుని మధురమధురమందహాస
సందర్శనానందసౌభాగ్యవేళాయె

అందమైన దేవుని సుందరచరణారవింద
సందర్శనానందసౌభాగ్యవేళాయె

అందమైన దేవుని యంగాంగ పూజల నాత్మా
నంద మనుభవించి తరించు నట్టి మంచి వేళాయె