29, జూన్ 2012, శుక్రవారం

పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా


సెల వీయర యింక నేమి చేయ గలను నా రామా
పలుకరా యుపాయ మొకటి కలదా యో పరమాత్మా

ఘడియయేని కొంటెవాడ కనులు మూసికొన దలచితి
విడువక ఘననిష్ట నీదు విభవము ధ్యానించదలచి
గడువలేదు నిముసమైన గాని వివశమాయె మనసు
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ

ఘడియయేని నీగుణములు కమ్మగ నే పాడదలచి
కడు ప్రీతిని పెదవి విప్పి కంఠము సవరించినాడ
గడువలేదు నిముసమైన గాద్గదికమాయె స్వరము 
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ 

ఘడియయేని నీ రూపము కాంచి సంతసించ నెంచి
గుడిలో కొలువైన నిన్ను కూరిమి తిలకించు చుంటి
గడువలేదు నిముసమైన కనుల భాష్పజలము నిండె
అడియాసయె మిగిలెనురా ఆహా నా భాగ్యమనగ

2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.