30, అక్టోబర్ 2020, శుక్రవారం

రామా రామా నీవు

 రామా రామా నీవు రాకాసుల జంపి

భూమి నేలితివయ్య మున్ను దేవ


ఏమయ్య యీ భూమి యెట్లున్నదో యేమో

మా మీద దయుంచి రామ చూడవే

స్వామీ నీవే వచ్చి చక్కగ మరియొక సారి

కామాసురుల నుండి  కావ రావయ్య


పరుని భార్యను చెరబట్టు వాని జంప

నరుడవై ఆనాడు విరుచుకు పడితివి

హరి హరి ధరను నేడు తరుణుల నాత్మజల

చెరబట్టు తుళువల చెండ వేగమె రావె


నరక రావణులను నమ్మి కొలిచెడి వారు

మరి నీ తప్పులెంచి తరచు వదరువారు

ధరను నిండి కనుబడు తప్పుడు కాలాన

మరియొక సారి వచ్చి మంచిని నిలుపవే


నదురుబెదురు లేనివాడు

నదురుబెదురు లేనివాడు నా దేవుడు

చెదరని విక్రమపు సీతారాముడు


నీటిలో దూరినా వేటలాడెను

నీటబడు కొండనే మీటి యెత్తెను

వాటముగ కోరతో వసుధ నెత్తెను

ధాటిగా పగవాని గోట చీరెను


అన్ని లోకములు తానాక్రమించెను

మన్నింపక పగతుర మట్టుబెట్టెను

మున్నేరు దాటి రిపు మొత్తిజంపెను

పన్నుగా భూమికి బరువుదించెను


చూపరియై దనుజుల రూపుమాపెను

రేపు వచ్చి ఈ కలిని రేవుపెట్టును

తాపముడిపి భక్తుల దయజూచును

నా పాలిట పెన్నిధియై నన్నేలును


శ్రీరామ శ్రీరామ యని

శ్రీరామ శ్రీరామ అని నీవు జపము 

   చేయవిదేమి ఓ జీవుడా

శ్రీరామ నామము చింతించక నెట్లు 

   చేరేవు పరమపదము జీవుడా


భవసాగరమునందు పడియున్న దీనుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

భవతారణైకమహానౌక శ్రీరామ

     పరమమంత్రమె కాద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరామ మంత్రమే

     చింతించకున్నచో నో జీవుడా

భవతారణము లేదు పరమపదము లేదు

    మివుల విచారించి మేలేమియును లేదు

     

భవదుర్గమారణ్యపరిభ్రమణశీలుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

భవవనమున దారి బాగా తెలిసిన మంచి

     వాడు రాముడే కద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరాముని చెంత

     చేరకుండిన యెడల నో జీవుడా

భవవనమున నుండి బయటపడుట లేదు

    మివుల విచారించి మేలేమియును లేదు


భవసర్పగాఢపరిష్వంగబధ్ధుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

ఎవనికి పెనుబామె యింపైన పరుపాయె

    వాడె రాముడు కద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరాము నొడికము

    చింతించక యున్న నో జీవుడా

భవసర్పము నిన్ను వదలుటన్నది లేదు

    మివుల విచారించి మీలేమియును లేదు


29, అక్టోబర్ 2020, గురువారం

ముక్తి కావలయును

 ముక్తి కావలయును ముక్తి నెవ్వరిత్తురు

ముక్తి దేవుడిచ్చును పోయి వాని వేడుము


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలది యతని దెల్పు శాస్త్రముల జదివెద

యుక్తియుక్త మన్నటులే యున్నది నీమాట కాని

ముక్తినిచ్చు వాడు శాస్త్రములకు దొరుకబోడు


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలదిగా పూజలు సాగించు నతనికై

యుక్తియుక్త మన్నటులే యున్నది నీమాట గాని

ముక్తినిచ్చు వాడు నీపూజలకు దొరుకబోడు


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలది వాని మంత్రజపము చేయుదు నేను

యుక్తియుక్త మైన రీతి నున్నది నీమాట నీవు

శక్తికొలది రామనామ జపము చేయుమా యిక


28, అక్టోబర్ 2020, బుధవారం

సభలను నీపేరు

 సభలను నీపేరు చక్కగ వినిపించ

విభుడవు నీవని విదులు నిశ్చయించ


వేడు కన్న మాదే కద వేడుకన నుండ

ఆడి పాడి నర్తింతు మట్టి చోట్ల

చూడ చూడ నట్టి సభలు సొంపుగ నెల్లెడ

వాడక యగుట మాకు పండువాయె


నిను వేడు వారే కద కన నెల్ల రన నుండ

తనివి తీరు మా కట్టి తావు లందు

కనకన నట్టి సభలు కననాయె నెల్లెడ

దినదినము పండువాయె వినుతశీల


అన్ని సభల నీభక్తు లతి మాన్యులై యుండ

నిన్ను పొగుడు వారె యిట్టి నెలవు లందు

ఎన్నడైన నెచటనైన మిన్నంటి నీప్రభ

లన్నిట నిండ పండువాయె మాకు


24, అక్టోబర్ 2020, శనివారం

బాలా నీ వెవరవో

బాలా నీ వెవరవో యేలాగు తెలిసేను
కోలాహలము చేయు కొంటెకోణంగి

తరచు నాకలలలో తనివార నీతోడ
మురియుచు నాటల ప్రొద్దుపుచ్చేను
పరికింప నీవేమొ పరమాప్తవై యుండి
చిరునవ్వుల నన్ను మరపించు చుందువు

ఆటలధిక మాయె నానాటి కానాడు
మాటవరుస కైన మన బంధమేమిటో
నేటికైనను చెప్ప నీకు తోచుట లేదు
మేటి గడుసరి దాచ నేటి కమ్మా నీకు

ఒకవేళ  రామసహోదరి వనుకొందు
ఒక మహాసందేశ మున్న దనుకొందు
ఇక నీవు చెప్పక నెట్లు తెలియునమ్మ
ప్రకటించవే యింక బాల నీ విధము

22, అక్టోబర్ 2020, గురువారం

నమ్మిన వారిని చల్లగా జూచే

 నమ్మిన వారిని చల్లగ జూచే నారామునకు జేజేలు

కమ్మని వరములు కొల్లగ కురిసే కన్నతండ్రికి జేజేలు


ఆజుల దనుజుల తేజము లణచే తోజోనిథికి జేజేలు

రాజన నితడే రాజన నేలిన రాజరాజునకు జేజేలు

జేజేలంతా సతతము మ్రొక్కే సీతాపతికి జేజేలు

రాజలోకపు పూజల నందే రామరాజునకు జేజేలు


పరమవీరులు పడిపడిమ్రొక్కే పరమవీరునకు జేజేలు

పరమహంసలు నిరతము తలచే పరమపురుషునకు జేజేలు

పరమాత్ముడని హరుడు తెలిపిన పరంజ్యోతికి జేజేలు

నరుడై ధరపై వెలసిన శ్రీమన్నారాయణునకు జేజేలు


కాలరూపునకు జగదోద్భవక్షయ కారణమూర్తికి జేజేలు

నీలాంబోధరశ్యామునకు కమనీయగాత్రునకు జేజేలు

మేలుగ సద్భక్తాళిని బ్రోచు దయాలవాలునకు జేజేలు

నాలో నిలచిన నాశరహితునకు నారాయణణనకు జేజేలు


21, అక్టోబర్ 2020, బుధవారం

అప్పా రామప్పా

అప్పా రామప్ఫా నే నొప్ప మరలా పుట్ట

చప్పున మోక్షమే యిప్పించవయ్య


మరల పుట్టి గర్భనరకము చొరలేను

మరల మరణభయము భరియింప లేను

మరల సిరుల కొరకు పరుగు లెత్త లేను

మరల కాపురుషుల మాటలు పడలేను


మరల పుట్టి నిన్ను మరచుదునో యేమొ

మరల మాయ లోన మసలుదునో యేమొ

మరల దుశ్చేష్టలు మరగుదునో యేమొ

మరల నీదయవచ్చు మాటెప్పుడో యేమొ


మరల మరల పుట్ట మరి నా వశము కాదు

మరల మరల నీదు చరణముల పడుదు

మరల మరల నిన్ను మాతండ్రి వేడుదు

మరల మరల నన్ను మరి పుట్ట జేయకు


19, అక్టోబర్ 2020, సోమవారం

రామకీర్తన లివి

 రామకీర్తన లివి రాముని సొత్తు చాల

ప్రేమతో పాడు భక్తవీరుల సొత్తు


విని తరించగోరు నట్టి విబుధుల సొత్తు యివి

పనవిపనవి సంతసించు మనసులసొత్తు

జనుల కందించ గోరు ఘనులకు సొత్తు యివి

తనివారగ చదువుకొను ధన్యుల సొత్తు


భజన చేసి సంతసించు వారల సొత్తు యివి

ఋజువుగా కొలుచుకొను సుజనుల సొత్తు

సజలనయనులై పాడు సర్వుల సొత్తు భవ

రుజాంతకమని నమ్మెడు ప్రజలకు సొత్తు


ధర్మవీరులగచు వెలుగు దాంతులసొత్తు సత్య

ధర్మములను గారవించు ధన్యుల సొత్తు

నిర్మలురగు రామజప నిష్ఠుల సొత్తు యివి

శర్మదాయినులు కాలచక్రము సొత్తు


చదువుల్లో దొడ్డవైన చదువు లేవి

చదువుల్లో దొడ్డవైన చదువు లేవి యవి
చదువు వారి కొదవునట్టి పదవులేవి

చదువవలయు మొదట రామచరిత మందరు అది
చదువుటచే నబ్బు ధర్మాచరణ నిష్ఠ
చదివి రామచరిత మే పదవి పొందు మానవుడు
పదవులు లట్టు లుంచి పుణ్యపదము పాందగలడు

చదువవలయు భారతమును పిదప నందరు అది
చదువుటచే కార్యాకార్య జ్ఞానమబ్బు
చదివి మహాభారత మే పదవి పొందు మానవుడు
పదవు లట్టు లుంచి వాడు ప్రజల మన్నన పొందు

చదువవలయు భాగవతము సర్వజనులును అది
చదువుటచే కలుగును బ్రహ్మజ్ఞానము
చదివి భాగవతము నే పదవి పొందు మానవుడు
పదవులు కాదయ్య వాడు పరమపదము పొందును

బలేబలే చదువులను బాగొప్ప చెప్పితి విటు
కలిసి రా వవి చదివిన కాసులు కలవె
మలి వయసున వాటి విలువ తెలియు మానవుడు
తెలిసి దుఃఖ ముంది యిందే తిరుగుచుండును


రామతత్త్వ మనగ నేమి

రామతత్త్వ మనగ నేమి శ్యామలరాయా శ్రీ

రామతత్త్వ మంటే పరబ్రహ్మ తత్త్వమే


పిల్లికి బిడాల మనే విధ మిదయ్యా కాస్త

వెల్లడించ వయ్య అసలు విషయ మేమిటో

ముల్లోకంబులును ప్రకృతి మూటను కలవు ఆ

ముల్లె పరబ్రహ్మము మూపున కలదు


ప్రకృతి లోనె నామరూపాదులు కలవు ఆ

ప్రకృతి కవలి బ్రహ్మమునకు పట్టవట్టివి

ప్రకృతిజనుల కెట్లు తెలియు బ్రహ్మము గూర్చి ఈ

ప్రకృతి లోని కా బ్రహ్మము వచ్చు నందుకే


వచ్చె నట్లు రాముడై బ్రహ్మ మొకపరి అట్లు

వచ్చిన ఆ రాముని పరమతత్త్వమే

అచ్చమైన బ్రహ్మతత్త్వ మని యెరుగుటయే తా

ముచ్చటగా రామతత్త్వమును యెరుంగుట




ధన్యత చెందెను రామయ్యా

ధన్యత చెందెను రామయ్యా నీ దయచే నా బ్రతుకు
అన్య మెఱుగ నని జాలిచెంది నన్నాదరించి నావు

అంశలు స్థావరజంగమములు నీయందని తెలిసితిని
సంశయరహితుడనై నీపదముల చక్కగ నొదిగితిని

పుణ్యము పాపము రెండును వలదని బుధ్ధి నెఱింగితిని
అన్యులు లేరిట నందరు నీవా రన్నది తెలిసితిని

నిరుపమానమగు నీతత్త్వమునే నిత్యము తలచితిని
పురుషోత్తమ నీపదపీఠికపై పూవై నిలచితిని

నను చేరిన పొగడిక లవి నీవని మనసున తలచితిని
నను తెగనాడెడు వారును నాహితులనుచు సహించితిని

పరమాత్ముడవగు నీ పారమ్యము భక్తి నెఱింగితిని
హరియే నీవని హరుడవు నీవని యాత్మ నెఱింగితిని

శ్రీచక్రస్థిత లలితాపరమేశ్వరివని యెఱిగితిని
నీ చెయిదంబులు సృష్టిమూలమని నిజముగ తెలిసితిని

నిను కీర్తించుట నాభాగ్యముగా మనసున నెంచితిని
మనవిని విని నా కీర్తనలను విని నను మన్నించితివి

ఇసుమంతైనను తనివి తీరదే యెంతగ పొగడిననను
వసుమతి నిటులే పొగడుచు నుండెద వసుధాధిప నిన్ను
 

కోరిన వరమిచ్చువాడె గొప్పదేవుడు

కోరిన వరమిచ్చువాడె గొప్పదేవుడు చాల
కూరిమితో నుండువాడె గొప్పచుట్టము

మరువక నిన్నాదరించు మంచివాడె మిత్రుడు
కరుణామతి నన్నోదకంబు లిచ్చు వాడే దొర
గరువము లేకుండ నీవి కలుగువాడే దాత
తరియించు విద్యనిచ్చు దయాశాలియే గురువు

హరిని గూర్చి తెలుపునదే యసలుసిసలు విద్య
హరికి జోడించు నట్టి కరములే‌ కరములు
హరి పైన నిలచి యుండు నట్టి బుధ్ధి బుధ్ధి
హరియె సర్వస్వమను నట్టి వాడె పో నరుడు

సరగున ఫలించి ఫలమొసంగు నదే మంత్రము
మరియాద నిలుపునట్టి మంచిమాటయే మాట
హరినామములె పలుకు నదియే చక్కని నోరు
తరచు రామతత్త్వమును తడవునట్టిదే మనసు

18, అక్టోబర్ 2020, ఆదివారం

ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు

ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు
చతురత రామునకు సరి వారెవరు

ఎందుబోయి డాగి కొన్న నెదిరించ రాగలడు
క్రింది మీదులను తానై క్రీడించ గలడు
ముందుకురికి మీదికెత్తు భూగోళ మైనను
సందుజూచి యెత్తగల డెందులేని వేసము

మెల్లగాను కాలుపెట్టి కొల్లగొట్టు సర్వమును
కొల్లపుచ్చు నెంతవారి గొప్పలైనను
చల్లని చూపుల నేలు సర్వలోకములను
కల్లలాడు వారి తోడ కలహము లాడును

భూమికి బరువైన వారి బొందపెట్టు చుండును
భూమిని కలిపెత్తనము పోనడగించు
ప్రేమ జూపు భక్తులకు రెట్టింపు సేయుచు
కామితార్ధముల నెల్ల కరుణించు చుండును


17, అక్టోబర్ 2020, శనివారం

రమణీయం బగు రాముని చరితము

రమణీయం బగు రాముని చరితము
విమల ముదారము విబుధార్చితము

హరి నీవే ముష్కరుడగు రావణు
పరిమార్చుమని సురవరు లడుగగ
నరుడై శ్రీమన్నారాయణుడే
పరమాధ్బుతముగ బరపిన లీల

కలుగ రాముడై కమలాపతియే
వెలసెను వేదమె విభుని చరితమై
కలకాల మిది నిలచి యుండునని
తెలిసి కొలుచుటే దివ్య భాగ్యము

ఇల భవతారక మీతని నామము
పలికిన చాలును తొలగును పాపము
కొలుచిన వారికి కొంగుబంగరై
కొలుచును మోక్షము కూరిమితోడ

16, అక్టోబర్ 2020, శుక్రవారం

రామచిలుక నుడువవే

రామచిలుక నుడువవే రమ్యముగ హరి పేర్లు
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ఏమి తెలివితేటలే రామచిలుక నీవి బలే
రామ నామ మంటేనే ప్రేముడి కడు హెచ్చటే
కామించి అది యొకటే గడగడా పలికేవే
ఏమే శ్రీహరికి పేర్లెన్నెన్ని లేవే

సరే వినుము శ్రీరామ జయరామ సీతారామ
తరణికులపవిత్రరామ దశరథాత్మజరామ
పరమసుగుణధామరామ పౌలస్త్యవిరామరామ
కరుణాసాగరరామ భక్తవరదరామ

బలే మంచి చిలుకవే బంగారు చిలుకవే
పలుకమంటె రామనామ భజన చేయు చిలుకవే
కులుకుచు శ్రీరామునే కొలుచుకొనే చిలుకవే
తెలిసినదే నీవు సీతాదేవి చిలుకవే

15, అక్టోబర్ 2020, గురువారం

రామచంద్రుని మరువగరాదు

రామచంద్రుని మరువగరాదు సుజనులార
ప్రేమతో సేవించి పెంపుగొనుడు

ఒక్కడైన రామునకు మ్రొక్కకుండ మీరు
చిక్కులు కొని తెచ్చుకున్న చింతలయ్యేను
చక్కగా విచారించి సాగుడయ్య రేపకడ
మిక్కిలి విచారించ మీ కేమిటికి

అవియు నివియు కోరి మీ రన్యదేవతలను
పవలు రేలు కొల్చినను ఫలమే ముండు
భవబంధమోచనుడు రవికులేశ్వరుడని
యవగతము కాక లే దావలి యొడ్డు

ఇతరులను కొలుతురా యిచటనే యుందురా
ప్రతిదినమును శ్రీరాముని ప్రార్ధింతురా
మతిమంతులార మీరు మంచి మార్గ మెంచి
ప్రతిఫలముగ మోక్షమును బడయ వలయును

నీవేలే నా నిజమిత్రుడవు

నీవేలే నా నిజమిత్రుడవు
నీవే నా ప్రాణేశ్వరుండవు

నరుడవు కమ్మని నను పనిచితివి
కరుణామయ నే కాదనగలనా
నిరుపమానుడ నిను పొగడుటకై
నరలోకములో తిరుగుచుంటిని

నిను మరిచిన దిన మనునది కలదా
నిను పొగడని దిన మనునది కలదా
దినకరవరకుల తిలక నీవే
మనసున నెరుగుదు వని తలచెదను

జననుత రామా జగదభిరామా
దనుజవిరామా తరచుగ నిటులే
మనుజుడ నగుచు మరి నిను పొగడుచు
మన నెయ్యమును మరువక యుందును




12, అక్టోబర్ 2020, సోమవారం

ఐదైదు గుమ్మాలున్న అందమైన యిల్లిది

 ఐదైదు గుమ్మాలున్న అందమైన యిల్లిది

నీదేలే నీదేలే నీవు నాకిచ్చినదే


నీ పనుపున నేనున్నను నీదేగా యీయిల్లు

నా పని నీయింట నుండి నీపనులు సేయుటయే

కాపలా వాడననుము కావలసివాడ వనుము

ఓ పరమాత్మ నన్నిట నుంచితి వే నుంటిని


నా యింటికి రమ్మని జనాంతికముగ నందును

నాయిల్లా నిజమున కిది నీయిల్లని యెరుగనో

నీ యింటికి వచ్చి పోను నిన్ను నే పిలిచెదనో

నా యిల్లని జగమనుకొను నీ యింటికి రావయ్య


పదునాలుగు లోకముల ప్రతిగృహము నీయిల్లే

సదయ నీవు నన్నుంచిన చక్కని యీ యింటిలో

ఎదురు చూచుచుంటి నయా ఎపుడు వత్తువో యని

పదము లిందు మోపవయా పతితపావన రామ


మాయమ్మ సీతమ్మతో మాయింటికి రావయ్యా

మాయమ్మ సీతమ్మతో
మాయింటికి రావయ్యా

దశరథనందన ధర్మవివర్ధన
ప్రశమితరావణ పాపవిదారణ
యశోవిశాల దయామయ రామయ
దిశలను వెలిగించుచు నేడే

ధర్మాత్ములు నీతమ్ములు మువ్వురు
నిర్మలహృదయులు నీతో‌ నడువగ
కమ్మని మారుతి గానము వినుచు
నిమ్ముగ నీ వూరేగుచు నేడే

కలిగిన వాడను కాకపోయినను
కలిగిన వాడను కాదా భక్తి
యిలలో ధనమన నిదియే‌ కాదా
తెలిసిన వాడవు దేవా నేడే

10, అక్టోబర్ 2020, శనివారం

అరుబయట స్థలమున హాయిగ ఏకాంతమున

అరుబయట స్థలమున హాయిగ ఏకాంతమున
శ్రీరామ నిను ధ్యానము చేసుకొను భాగ్యమేది

పుట్టిచచ్చుటను మాన్పు పురుషార్ధమును పొంద
గట్టిగా ప్రయత్నించ గలమా మా బోంట్లము
పుట్టించి లోకముల పోషించు విభుడవే
యట్టి నిన్ను తలచుకొనుట కైన తీరి కున్నదా

ముక్కుక్రింది గోతి కింత ముద్దవేయు పనిలోనే
దిక్కుమాలిన జీవితాలు తెల్లవారుచున్నవి
మక్కువతో‌ నిన్నొడలు మరచి ధ్యానించు నంత
చక్కని యవకాశము దక్కుటే యఱుదు కదా

పురాకృత కర్మముల బూదిచేయు నీస్మరణ
దొరకుటయే పదివేలు కరుణామయ మాకు
నరుల బాధ లెఱిగిన నారాయణ మా సకృత్
స్మరణమాత్రమున నీవు సంతుష్టుడ వగుము

రామనామ మొక్కటే రాదగినది నోట

చిన్నప్రశ్న సమాధానము చెప్పవయ్య
అన్నన్న ఎంతమాట అడుగవయ్య

ఏమయ్యా దైవ మంటే యెట్టు లుండును
రాముని వలె నుండును రాముడే దైవము

ఏమయ్యా ధర్మ మంటే యెట్టు లుండును
రాముని వలె నుండును రాముడే ధర్మము

ఏమయ్యా సత్య మంటే యెట్టు లుండును
రాముని వలె నుండును రాముడే సత్యము

ఏమయ్యా సద్గురువన నెట్టు లుండును
రాముని వలె నుండును రాముడె సద్గురువు

ఏమయ్యా అన్నిటికిని రాము డందువు
రాముడే జవాబు నీ ప్రశ్న లన్నిటికిని

రామనామ మొకటి తప్ప రాదా నీ నోట
రామనామ మొక్కటే రాదగినది నోట

రాముడే ఆదర్శము

భూమినున్న జనులకెల్ల రాముడే ఆదర్శము
రామతత్త్వమె కాలసాగరరమ్యదీపస్తంభము


సృష్టి నెనుబదినాల్గులక్షల జీవగణము లందున
సృష్టికర్త మనుజజన్మము చేసె నతిశ్రేష్ఠముగ
దుష్జమార్గము లందు బోవక తొలగక సత్పథమును
శిష్టులై శ్రీరామభక్తవిశిష్టులై తరియించుడు


ఎవరి కేది ప్రాప్తమో అది యెట్టులైనను కలుగదా
ఎవరి కెవరీ లోక మందున నేల కార్పణ్యములయా
చివరి కందర కున్న చుట్టము భువిని రాము డొక్కడే
పవలు రేలును రామచంద్రుని భక్తితో సేవించుడు


నిత్యము శ్రీరామచరితము నెమరువేయు మనుజుని
సత్యముగ పరమేశ్వరుని కృప సర్వవిధముల కాచును
భృత్యుడై శ్రీరాముని సేవించు నట్టి మనుజడు
స్తుత్యుడా దేవతలకైనను సుజనులారా నిక్కము