24, అక్టోబర్ 2020, శనివారం

బాలా నీ వెవరవో

బాలా నీ వెవరవో యేలాగు తెలిసేను
కోలాహలము చేయు కొంటెకోణంగి

తరచు నాకలలలో తనివార నీతోడ
మురియుచు నాటల ప్రొద్దుపుచ్చేను
పరికింప నీవేమొ పరమాప్తవై యుండి
చిరునవ్వుల నన్ను మరపించు చుందువు

ఆటలధిక మాయె నానాటి కానాడు
మాటవరుస కైన మన బంధమేమిటో
నేటికైనను చెప్ప నీకు తోచుట లేదు
మేటి గడుసరి దాచ నేటి కమ్మా నీకు

ఒకవేళ  రామసహోదరి వనుకొందు
ఒక మహాసందేశ మున్న దనుకొందు
ఇక నీవు చెప్పక నెట్లు తెలియునమ్మ
ప్రకటించవే యింక బాల నీ విధము