19, అక్టోబర్ 2020, సోమవారం

చదువుల్లో దొడ్డవైన చదువు లేవి

చదువుల్లో దొడ్డవైన చదువు లేవి యవి
చదువు వారి కొదవునట్టి పదవులేవి

చదువవలయు మొదట రామచరిత మందరు అది
చదువుటచే నబ్బు ధర్మాచరణ నిష్ఠ
చదివి రామచరిత మే పదవి పొందు మానవుడు
పదవులు లట్టు లుంచి పుణ్యపదము పాందగలడు

చదువవలయు భారతమును పిదప నందరు అది
చదువుటచే కార్యాకార్య జ్ఞానమబ్బు
చదివి మహాభారత మే పదవి పొందు మానవుడు
పదవు లట్టు లుంచి వాడు ప్రజల మన్నన పొందు

చదువవలయు భాగవతము సర్వజనులును అది
చదువుటచే కలుగును బ్రహ్మజ్ఞానము
చదివి భాగవతము నే పదవి పొందు మానవుడు
పదవులు కాదయ్య వాడు పరమపదము పొందును

బలేబలే చదువులను బాగొప్ప చెప్పితి విటు
కలిసి రా వవి చదివిన కాసులు కలవె
మలి వయసున వాటి విలువ తెలియు మానవుడు
తెలిసి దుఃఖ ముంది యిందే తిరుగుచుండును


3 కామెంట్‌లు:

  1. చదువు అనేది జ్ఞానోపార్జన మాత్రమే కాదు.
    ఎదుటి మనిషి భావాలను భావోద్వేగాలను కొలవటం కూడా చదువే.
    జనుల మనసు నెఱిగి మసలుకోవటం కూడా జ్ఞానమే
    పరుల మనసు నొప్పింప కుండా వుండటమూ జ్ఞానమే

    జ్ఞానోపార్జన సమాజాన మనలను వేరుగా కాకుండ సమాజంలో ఒకరిగా గుర్తించటం కూడా జ్ఞానమే
    సంస్కారమనే అలంకారం కోల్పోతే ఎంతటి సౌందర్యమున్నా శూన్యమే.. [గోరా చెహరా కాలా దిల్ (బాబా సేహగల్)]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్నించాలి. మీ ఆంతర్యం బోధపడటం లేదు. కీర్తనలో ఏదైనా లోపం ఉందని భావిస్తున్నారా? లేదా అదనంగా మీ అభిప్రాయం కూడా చెబుతున్నారా?

      తొలగించండి
  2. అయ్యో.. మీ కీర్తనను తప్పు పట్టలేదు శ్యామల్ రావు సర్.. ఎటువంటి లోపం లేదు. నే రాసిన వ్యాఖ్య మీ రచన లో ఏదో ఒక అంశం పై నాకు తోచినంతలో అభిప్రాయముగానే వ్రాస్తిని. మీకు మరోలా అనిపించి ఉంటే క్షంతవ్యుణ్ణి.

    మీరు చదువును గూర్చి కీర్తన లో విపులంగా తెలిపిన అంశాలు బాగున్నాయి, చదువు అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. జిజ్ఞాస కొలది నేర్చుకుని తద్వార సమాజ హేతువుకై వుపయోగము కలిగే వంటి సంస్కారవంతమైనదై ఉండాలనే ఉద్దేశ్యము వచ్చేలా వ్రాయటం జరిగింది. బహుశ నా భాష ప్రయోగమో ఏమో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసివుంటే మన్నించండి ఆచార్య. కేవలం అభిప్రాయ నిమిత్తమే గమనించగలరు.

    స్వస్తి..

    మీరిలాంటి రచనలు వీలును బట్టి టపాలుగా ప్రచురించాలని ఆ ఏడుకొండల రేడను వేడుకుంటు. శెలవు.

    జై శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.