31, మార్చి 2024, ఆదివారం

హరి హరి యనవే మనసా


హరి హరి యనవే మనసా అన
   మరచిన చెడుదువు మనసా

అలుపులేక హరి పాదాబ్జంబుల 
   నంటియుండవే మనసా
కలుషసాగరము సంసారములో 
   కలయదిరుగకే మనసా

సిరిని నమ్ముకొని హరిని మరచిన 
   చెడిపోదువుగా మనసా
హరిని నమ్ముకొన సిరులును కలుగును 
   తరచుగ నీకో మనసా

హరిభక్తులు విజ్ఞానుల మాటల
నాలకించవే ఓ మనసా
పరులు చెప్పు దుర్నీతులు వినిన
పరము దూరమగు నో మనసా

భవతారకమగు రామనామమును
వదలి యుండకే మనసా
భువనము నందున రాముడు మాత్రమె
ముఖ్యుడు నీకో మనసా

హరేరామ యని హరేకృష్ణ యని
మరువక పలుకవె మనసా
పరమంత్రంబుల నతిగా నమ్ముచు
భంగపడకె ఓ మనసా

భగవన్నామము వదలని వారికి
పరమపదము గలదో మనసా
తగని మమతలను తగులుకొన్నచో
గగనము మోక్షము మనసా


ఏమిరా చిన్నారి రామా


ఏమిరా చిన్నారి రామా యెందు కలిగి నావురా
నీమనంబున నొవ్వుకలిగిన నేను తాళలేనురా

గోముగా కైకమ్మ నీకు గోరుముద్దలు పెట్టదా
ప్రేమగా మహరాజు తొడపై పెట్టుకొని లాలించడా
తామసించి లక్ష్మణుడు నీ తప్పులెన్ని పలికెనా
ఏమిరా శ్రీరామచంద్రా యెందు కలిగి నావురా

నిన్ను పిలిచి సుమిత్ర ప్రేమగ నేడు ముద్దులు పెట్టదా
నిన్ను గురువు వశిష్ఠు లించుక నిష్ఠురంబుగ పలికిరా
నిన్ను దుష్ఠులు నల్లవాడని నేడు వెక్కిరించిరా
చిన్ని తండ్రీ రామచంద్రా  చిన్నబోవ నేలరా

కలువరేకుల కనులకాటుక కరిగి కాలువ లాయెరా
కళను చంద్రుని మించు ముఖమున కాంతి తరిగిపోయెరా
అలిగి మౌనము దాల్చి యుండక అమ్మతో మాటాడరా
పలుకరా శ్రీరామచంద్రా అలుక లిక చాలించరా

27, మార్చి 2024, బుధవారం

నుయ్యాల నూగ రావయ్యా


సీతమ్మతో గూడి శ్రీరామచంద్ర 
   ప్రీతితో నుయ్యాల నూగ రావయ్యా
భీతహరిణేక్షణను సీతమ్మ నిపుడు 
   చేతులను పొదవుకొన వలెను రామయ్యా

క్రిందికిని మీదికిని జీవులను మీర 
   లందముగ నాడించు చందమున మేము
సందడిగ మీయిద్దరను నూయలందు 
   చక్కగా నాడించ దలచు కొన్నాము
ముందుగా నూయల నెక్కి శ్రీరామ 
   ముదిత సీతమ్మును చేదుకోవయ్యా
అందరము మీదు డోలోత్సవం బిపుడు 
  డెందంబు లలర తిలకించేము నేడు

క్రిందుగా నూగ నుయ్యాల మీదైన 
   సుందరవదనారవిందముల జూచి
అందరము సంతోష మందుచును దయలు 
   చిందించు దృష్టులను బడసేము తండ్రి
సుందరీమణు లూప నుయ్యాల నున్న 
   సుదతి సీతయు మీరు మీదు  పాదార
విందములు మాతలల నుంచున ట్లెగయ 
   చెందెదము ధన్యతను శ్రితపారిజాత

కోలాహలంబుగ డొలోత్సవమును 
   గొప్పగా మీకిపుడు మేము చేసేము
నేల కూతురు సీత మిక్కిలిగ మురియ 
   డోలలూగ రయ్య మీ యిర్వు రిపుడు
చాల వేడుకతోడ దేవతలు కూడ  
   సందడిగ నింగిపై గుమిగూడి చూడ
నీలమేఘశ్యామ నిగమాంతవేద్య 
   డోలలూగగ రమ్ము దివ్యప్రభావ26, మార్చి 2024, మంగళవారం

రమ్మంటిమిరా

రమ్మంటిమిరా పూజలు గై
కొమ్మంటిమిరా వినతు లందు
కొమ్మంటిమిరా మంచి వరము 
లిమ్మంటిమిరా

జగముల నేలే ఓ జానకీరాముడా

పగతుని సోదరుని తగునని ప్రోచిన

జగదభిరాముడవు నిగమసంవేద్యుడవు

తగు నీభక్తులను దయ నేల రారా


దైవరాయ నీనామము తరచుగ పలికేము

దైవరాయ నీపూజలె తరచుగ చేసేము

పావనశుభనాముడవు పతితజనోధ్ధరుడవు

మావలన దొసగులన్న మన్నించి రారా


రారా ప్రహ్లాదవరద రారా కరివరద

రారా సుగ్రీవవరద రారా భవనాశ

కారణకారణ హరి కమలాయతాక్ష రార

రారా మమ్మేలే రామచంద్ర వేగ


అసలిసిసలు మంత్రమైన హరినామము


అసలిసిసలు మంత్రమైన హరినామము నా
రసనపైన వెలసినట్టి రామనామము

ప్రశమితరిపు డైన హరికి పరమనామము యిదే
దశకంఠుని దండించిన తండ్రినామము
దిశలన్నిట తేజరిల్లు దివ్యనామము నాకు
కుశలము చేకూర్చునట్టి గొప్పనామము

యోగివరుల గుండెలలో మ్రోగునామము యిదే
రాగద్వేషముల నణచు రమ్యనామము
భోగపరాయణుల కందబోని నామము మోక్ష
యాగరతుల కందునట్టి యమృతనామము

కామవైరి కరుణవలన కలుగునామము సర్వ
కామనలను గెలుచునట్టి రామనామము
ప్రేమమీఱ నన్నేలెడు స్వామినామము మోక్ష
భూమికి నన్నింక చేర్చబోవు నామము


25, మార్చి 2024, సోమవారం

చక్కనమ్మా ఓ జానకమ్మా


చక్కనమ్మా ఓ జానకమ్మా ధను
వెక్కిడిన రామునకు దక్కినమ్మా

ఎక్కడిదా శివధను వది యెంతపెద్దదా ధనువు
ఎక్కడెక్కడి వీరుల కది యెత్తరాని ధనువు
ఎక్కడి నుండి వచ్చెనో యీచిన్నవాడు వీ
డక్కజమున నెత్తి విరిచె నందరు పొగడ

చాల గొప్పవాడు వీడు సరసీరుహాక్షుడు
నీలమేఘశరీరుడు నీవా డైనాడు
చాల యదృష్టమే నీది సరసీరుహాక్షి నీ
కేలందు కొన వచ్చెను బాలరాముడు

శివుని ధనువు నెత్తుట యది శ్రీహరికే తగు గాని
భువిని గల సామాన్యుల కెవరికి వీలగును
వివరింపగ వాడు హరియె వేడుకతో మేము
నవనిజవు నీవు సిరివి యందుము నేడు


అందమెంత చందమెంత


అందమెంత చందమెంత యిందుగలుగు విషయంబుల
పొందనేమి వీటిగొప్ప మూడునాళ్ళ ముచ్చటగద

అందమైన నగలటంచు నతిప్రీతిగ ధరింతు రవి
అందగించు టెంతదాక యనగ మోజు తీరుదాక

అందగించు బాంధవ్యము లన్నవి సిరులుండు దాక
అందగించు ప్రాభవంబు లన్నవి పదవులుండు దాక

అందగించు మంచి కీర్తి యపజయమది కలుగు దాక
ఆందగించు గుణగణంబు లపనిందలు కలుగు దాక

అందగించు దేహబలము యవ్వనమది యణగు దాగ
అందగించు బుధ్ధిబలము నంకురించు దాక ముదిమి

అందగత్తె తళుకుబెళుకు లన్నవి యవి యెంత దాక
కొందళపడ వయసు మీరి యందమంత నణగు దాక

అందమైన రామనామ మందుకొన్న నదే చాలు
నందగించు నిహము పరము నందివచ్చు మోక్షమును


రామనామ మన్నది చాలును


రామనామ మన్నది చాలును నాకీ
రామనామ మున్నది చాలును

రామనామము నాకు భావము రామనామము నాకు జీవము
రామనామము నాకు బ్రతుకు రామనామము నాకు మెతుకు
రామనామము కన్న మిక్క్లిలి రమ్యమైన నామ మేది
రామనామము కన్న నమృత మేమి గలదు భువిని దివిని

రామనామము నాకు సిరియగు రామనామము నాకు సంపద
రామనామము నాకు భోగము రామనామము నాకు భాగ్యము
రామనామము కన్న సుఖకరంబైనది భువిని కలదె
రామనామము కన్న నాకు భూమి నేదియు ముఖ్యము కాదు

రామనామము నాకు లోకము రామనామము నాకు ప్రాణము
రామనామము నాకు సర్వము రామనామము నాకు గర్వము
రామనామము కన్న నేది ప్రాణి కోరవలయు నయ్య
రామనామము చాలు చాలు రాముని కరుణ చాలు చాలు


మ్రొక్కరె మ్రొక్కరె మీరిపుడు


మ్రొక్కరె మ్రొక్కరె మీరిపుడు
బహుచక్కగ భక్తిప్రపత్తులతో
మిక్కిలి దయతో నిజభక్తులను
మేలుగ నేలెడు రామునకు

ఘనయోగీంద్రులు మునిరాజేంద్రులు
ననయము సభలో తన యెదుట
హనుమత్సుగ్రీవులు విభీషణుడు
నంగదజాంబవదాదులును
విని మురియగను పరిపరివిధముల
వినుతించగ చిరునగవులతో
వినుచు ప్రసన్నత గనబరచెడు యీ
ఘనుడు రామునకు వినయముగ

నిరంతరంబుగ నానారద తుం
బురులు పాడగను తన యెదుట
గరుడుడు విష్వక్సేనుడు శేషుడు
సిరియును భూదేవియు వినుచు
శిరము లూపగను చిత్తగించుచును
పరిపరి విధముల కీర్తనల
చిరుచిరు నగవుల కనవచ్చెడు యా
హరియే యితడని వినయముగ

వైకుంఠంబున వెలిగెడు హరియే
సాకేతంబున రాముడని
లోకేశ్వరుడగు శ్రీహరియే యీ
లోకారాధ్యుడు రాముడని
శ్రీకంఠాదులు మిక్కిలి పొగడెడు
శ్రీహరియే యీ రాముడని
తేకువ మీరగ శ్రీరామునకు
దేవదేవునకు వినయముగ
నేనైనను బ్రహ్మయైన


నేనైనను బ్రహ్మయైన నీలకంఠుడైనను
పూని నిన్ను పొగడువార మేను రామచంద్ర

తక్కుంగల దేవతలును తమతమ శక్తికొలది

నిక్కువముగ పొగడుదురు నిన్నే శ్రీరామ

దిక్కులన్ని గను మిదే నిను పొగడు వారితో

పిక్కటిల్లి యున్నవయా విజయరాఘవ


పవలు రేలు దిశలు ప్రకృతి పంచభూతమ్ములును

భువనంబుల సృష్టిచేసీ పోషించు చుండి

చివర కన్నిటిని నీలో చేర్చుకొనెడు శ్రీహరివి

అవధరించి మమ్మేలుము కువలయేక్షణ


ఏమని చెప్పుదు

 ఏమని చెప్పుదు నెన్నెన్ని జన్మము
   లెత్త మందువయ్య చిత్తజగురుడ

నళినాక్ష పరదైవముల నేను గొలువగ

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీపేరే నాకెఱుక గాకుండ

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీమహిమ నాకఱుక గాకుండ

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీయందు నాకు గురి కుదరక

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీపైన నాభక్తి నిలువక

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీకేమొ నాపైన దయరాక

   నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ

నళినాక్ష నీదయ కలుగుటకై నేను 

   నరజన్మముల నెన్ని కరిగించ వలె రామ

నళినాక్ష యికనైన నాపైన దయజూపి

   యిల నింక పుట్టించ వలదయ్య రామ23, మార్చి 2024, శనివారం

ముద్దులకొడుకీ రాముడు

రాముడు బాలరాముడు రఘురాముడు మన శ్రీరాముడు


ముద్దరాలు కౌసల్యకు సర్వము ముద్దులకొడుకీ రాముడు

దిద్దరాని వయ్యారాల కైకకు ముద్దులకొడుకీ రాముడు

హద్దులేని ప్రేమరాశి సుమిత్ర ముద్దులకొడుకీ రాముడు

ముద్దుమాటల కువకువలాడే ముద్దులకొడుకీ రాముడు

పెద్దకన్నుల నిడుదచేతుల ముద్దులకొడుకీ రాముడు

సద్దుచేయక ఆడుచునుండే ముద్దులకొడుకీ రాముడు

సద్దుచేయని చల్లనినగవుల ముద్దులకొడుకీ రాముడు

నిద్దురనైనను చెదరనినగవుల ముద్దులకొడుకీ రాముడు

ముగ్గురమ్మలకు కన్నులవెలుగగు ముద్దులకొడుకీ రాముడు

పెద్దలందరకు నంతఃపురమున ముద్దులకొడుకీ రాముడు

విద్దెలు నేర్చుచు వర్ధిల్లుచున్న ముద్దులకొడుకీ రాముడు

భూమినాథుడు యగ్గగ్గలాడే ముద్దులకొడుకీ రాముడు


నుడువరేల రామా యని


నుడువరేల రామా యని నోరారా జనులారా

నుడువ నుడువ శ్రీహరి కనబడును కాదా


నిదురలేచి కనులుతెఱచి నిండుమనసుతో మీరు

మృదుమధురముగను మొదటి మాట గాను

సదయుడైన హరిని రామచంద్రుని మదిలోన తలచి

ముదమారగ జిహ్వ మిగుల పునీతమై పోవగ


పగలు మీరు పొట్టకూటిపనుల మధ్య నుంటి మనుచు

జగదీశుని దివ్యనామస్మరణ మేల మాన నగును

తగ నోటికి ముద్దజేర్చు తరుణమందు హరినామము

ప్రగాఢానురక్తి తోడ రసనాగ్రము నందు జేర్చి


నిదురవేళ కెల్లపనులు నిశ్చయముగ జక్కపరచి

వదలక నైహికము లందు పరగు బుధ్ధి నడచి

ముదమారగ హరిపాదములను జేర్చి మీమనసుల

సదయుడైన విభునిపేరు జహ్వాగ్రములను జే‌ర్చిరాముడు నాప్రాణమని

 

రాముడు నాప్రాణమని రమణి కైక పలుకగ

నేమి విడ్డూర మనుచు నెగిరె మంధ‌ర


అరచేతులను చూడవె యందలి గీత లెఱుగవె

పరమదివ్యలక్షణములు భావన చేయవే

వి‌రాజిల్లు రామయశము ధరాతల ముండు వరకు

పరమసత్య మిది యనుచు పలికె కైక


సాముద్రికశాస్త్ర మనుచు చట్టుబండ లనుచు నీవు

రాము నింత ముద్దుచేయ రాదనెను మంధర

ఏమే నాకు భరతుడును రాముడును రెండు కండ్లు

రామునిపై నసూయపడ రాదనె కైక


రాము డెక్కు వాయెనా ఏమమ్మా మన భరతున

కేమీ తక్కు వాయెనో యెఱుకపరచుము

ప్రేమ సవతికొడుకుపై వెల్లువెత్తు నిన్ను బోలు

భామామణి యుండదని పలికె మంధర


సదానంద సురానంద


సదానంద సురానంద సదాయోగిజనానంద
విదళితసురవైరిబృంద వేదవేద్యగోవింద

పాహి పాహి సామీరీవందితపాదారవింద
పాహి పాహి సకలలోకపాలనచణ గోవింద
పాహి పాహి ధరాత్మజాప్రాణనాథ గోవింద
పాహి పాహి రామచంద్ర భక్తవరద గోవింద

పాహి పాహి ముముక్షుజనవరద మహానందకంద
పాహి పాహి పరమపురుష పరమేశ్వర గోవింద
పాహి పాహి శివపంకజభవసన్నుత గోవింద
పాహి పాహి రామచంద్ర భవతారక గోవింద

రాముడే పరబ్రహ్మము


రాముడే పరబ్రహ్మము సీతా
రాముడే పరబ్రహ్మము 

ఏమి పండితచర్చలకు నిందు తావు లేనే లేదు
తామసులకు శ్రీరాముని తత్త్వ మెన్న డెఱుక కాదు
రామభక్తవరేణ్యుల కేమి సందియమును లేదు
సామాన్యుల నమ్మకమున రాముడు పరబ్రహ్మమే

రామునకును నామమునకు నేమియు భేదంబు లేదు
రామనామ మున్న చోటు రామసన్నిధాన మగును
రామసన్నిధాన మందు క్షేమ మెల్ల జీవులకును
ప్రేమ మీఱ పలుకవయ్య రామ రామ రామ యనుచు


21, మార్చి 2024, గురువారం

కాముడు కాపాడునా

కాముడు కాపాడునా కాలుని నుండి
రాముడే తప్పకుండ రక్షించును కాని

కాముడు నిన్ను వట్టి కాముకునిగ జేసి

భూమి జనులు తిట్ట నీపోడిమి నడచు

రాముడు నీలోపలి కాముకత్వ మణగించి

భూమి జనులచే నిన్ను పొగడించును


కాముని నమ్ముకొన్న ఘనపాపి వగుదువు

పామరుడవై కాలుని బారిని పడుదువు

రాముని నమ్ముకొన్న రాగంబుల విడుతువు

భూమినింక పుట్ట వారామునే చేరుదువు


ఎవరి కెపుడు కలుగునో


ఎవరి కెపుడు కలుగునో యీరామభక్తి
యెవరు చెప్పగలరురా యీభువిలోన

పురాణేతిహాసములను పొలుపుగా చదివినను
నరునకు కుదురకుండు హరిమీద భక్తి
పురాకృతము తగినంత ప్రోద్భల మీయకను
హరి దయ వానిపైన నప్పటికి రాకను

నాలుగు వేదంబులును  నయముగా నేర్చినను
చాలునా హరిభక్తిని సమకూర్చ తనకు
కాలమును తగినంతగ కలిసిరా కున్నపుడు
లీలగా హరిదయయు మేలు చేయనిది

పురాకృతము బాగున్న బోయ వాని కైనను
శ్రీరాముని నామమది చేరును హృదయమున
సురారుల వంశమందు హరిభక్తు డుదయించి
సరాసరి శ్రీరాముని చరణమంట వచ్చు

శ్రీరామనామమె జీవికి రక్ష

శ్రీరామనామమె జీవికి రక్ష శ్రీరామనామమె రక్ష
వేరొక రక్షయె లేదులేదురా శ్రీరామనామమె రక్ష

కారడవులలో చిక్కిన వేళల శ్రీరామనామమె రక్ష
మీరిన పట్టుల కుమతుల చేష్ఠలు శ్రీరామనామమె రక్ష

మారుని గడబిడ మిక్కుటమైతే శ్రీరామనామమె రక్ష
ధారుణి జీవిక దుర్లభమైతే శ్రీరామనామమె రక్ష

చేరిన వేళల కుమతుల కొలువుల శ్రీరామనామమె రక్ష
క్రూరుల సభలం దడుగిడు నప్పుడు శ్రీరామనామమె రక్ష

నేరము చేయక నిందలు కలిగిన శ్రీరామనామమె రక్ష
ప్రారబ్ధముచే బాధలు కలిగిన శ్రీరామనామమె రక్ష

చేరిన వేళల తనువున రోగము శ్రీరామనామమె రక్ష
తీరిన వేళల తనువున కాయువు శ్రీరామనామమె రక్ష

సారెకు తనువుల దూరెడు జీవికి శ్రీరామనామమె రక్ష
దారిలేని భవసాగర మందున శ్రీరామనామమె రక్ష

అందరికీ రామనామ మందించండీ

అందరికీ రామనామ మందించండీ మీ
రందరిచే రామ రామ యనిపించండీ

అందరకును సుఖశాంతుల నందించెడు నామ మని
అందరకును సౌభాగ్యము నందించెండు నామ మని
అందరకును సంతోషము నందించెడు నామ మని
అందరకును మోక్షార్హత నందించెడు నామ మని

యోగివరుల గుండెలలో మ్రోగుచుండు నామ మని
భోగీంద్రుడు వేయినోళ్ళ పొగడుచుండు నామ మని
రాగద్వేషముల నణంచి రక్షించెడు నామ మని
ఆగని భవచక్రమునే యాపు దివ్యనామ మని

బహుదైవతముల గొలిచి భంగపడిన.వారికి
బహుజన్మములను దాల్చి బడలియున్న వారికి
 
బహుమంత్రములను జేసి ఫలమెఱుగని వారికి
బహుమతిగా నందించుచు భవతారక నామ మని

శ్రీరామ రామా శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా సీతామనోహర శ్రీరామ రామా
శ్రీరామ రామా శ్రీరామ రామా శ్రితపారిజాత శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా ధారాధరశ్యామ శ్రీరామ రామా
శ్రీరామ రామా శ్రీరామ రామా కారుణ్యధామా శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా వారిజలోచన శ్రీరామ రామా
శ్రీరామ రామా శ్రీరామ రామా నారాయణాచ్యుత శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా జీవలోకేశ్వర శ్రీరామ రామా
శ్రీరామ రామా శ్రీరామ రామా క్షిప్రప్రసాదన శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా కారణకారణ శ్రీరామ రామా 
శ్రీరామ రామా శ్రీరామ రామా శ్రీరఘునాయక శ్రీరామ రామా

శ్రీరామ రామా శ్రీరామ రామా చింతితఫలద శ్రీరామ రామా
శ్రీరామ రామా శ్రీరామ రామా ప్రీతిగ నన్నేలు శ్రీరామ రామా

శ్రీహరినామస్మరణము

శ్రీహరినామస్మరణము ప్రేమగ చేసినవారిదె భాగ్యము
ఆహా రామా కృష్ణా మాధవ యనెడు వారిదే భాగ్యము

మోహపాశముల విరిచివేయునది శ్రీహరినామస్మరణము

దేహతాపముల తీర్చివేయునది శ్రీహరినామస్మరణము


చింతలన్నిటిని తొలగించునది శ్రీహరినామస్మరణము

అంతకు రాకడ నడ్డగించునది శ్రీహరినామస్మరణము


సాహసించు కలి నడ్ఖగించునది శ్రీహరినామస్మరణము

దేహికి మోక్షము నిచ్చి ప్రోచునది శ్రీహరినామస్మరణము

నాలుకపై నుంచ రామనామము

నాలుకపై నుంచ రామనామము మనవద్దకు
రాలేరు రాలేరా కాలుని భటులు

రాముడని సర్వసుగుణధాముడని భవనాశక
నాముడని రఘుకులాబ్ధిసోముడని మేఘ
శ్యాముడని భూమిసుతాకాముడని లోకాభి
రాముడని యోగిహృదయధాముడని పలుకుచు

పగలు రామనామమును పలుకుచు తానుండి
తగ నిద్దుర నైన గాని దాని విడువక
జగదీశుని శుభనామమె సంసారనిరవర్తక
మగణితశుభకరం బనుచు నెఱుగుచు

మనుకొని హరినామమునే ముప్పొద్దుల జేయగా
వినాతాసుతవాహనుడే విని మెచ్చడా
తనివారగ హరికథలే తర్కించుచు తానుండిన
జనార్దనుడు గమనించి చాల మెచ్చడా

రాళ్ళు కరుగ పాడండి


రాళ్ళు కరుగ పాడండి రామ రామ రామ యని
నోళ్ళు నొవ్వ పాడండి నోరున్న దందుకే

భూమినున్న జనుల కెల్ల బుధ్ధికెక్కు నట్లుగా
రామనామమాహాత్మ్యము లక్షణముగ చాటండి
రామనామ జపము చేసి సామాన్యు డైన గాని
ఆమోక్షనగరంబున కరుగునని చాటండీ

రామచంద్రు డేలినట్టి భూమిమీద పుట్టిన
సామాన్యులు పండితులకు సర్వవేళ లందున
రామనామ మాహాత్మ్యము రక్షణకవచంబని
ప్రేమతో తెలియజెప్ప వివిధగతుల పాడండీ

రాముని మాహాత్మ్య మెల్ల ప్రజలెరుగగ పాడండి
రాముని దయచేతనే బ్రతుకనుచును పాడండి
రాముడే దేవుడనుచు ప్రజలెరుగగ పాడండి
రామనామ మిచ్చు మోక్షరాజ్య మనుచు పాడండి


రామ రామ జయరామ రామ


రామ రామ జయరామ రామ రఘురామ రామ శ్రీరామా
రామ రామ గుణధామ రామ శుభనామ రామ శ్రీరామా

రామచంద్ర నిను నమ్మినాను నను రయమున బ్రోవగ రారా
శ్యామలాంగ హరి కోమలహృదయా చప్పున బ్రోవగ రారా
పామరత్వమున చేసిన తప్పులు పాటించక హరి రారా
స్వామి నీమనసు కరుగుదేమి హరి చప్పున బ్రోవగ రారా

భక్తుల యోగక్షేమము లెపుడును భావించెడు హరి రారా
శక్తికొలది నీనామము చేసెడు సజ్జను బ్రోవగ రారా
రక్తి లేదు ప్రాపంచికములపై రామ చంద్ర హరి రారా
ముక్తి కోరి నిను భజింయించెడు నను బ్రోవగ రామా రారా

రారా కమల దళేక్షణ రామా రారా హరి సుకుమారా
రారా మునిజనమోహనరూపా రారా ప్రోవగ రారా
రారా పురరిపుసన్నుత నామా రారా వేదవిహారా
రారా భవభయవిదళనశీలా రారా ప్రోవగ రారా


15, మార్చి 2024, శుక్రవారం

మీరు ధన్యజీవులు

మీరు ధన్యజీవులు మీరు హరిని చేరెదరు
మీరు భూమి కింక తిరిగి రారు రారు రారు

నరులారా శ్రీహరినే నమ్ముకున్నారు మీరు

పరమపురుషు డతనిపై భక్తి గలవారు

సిరు లశాశ్వతము లని యెఱిగియున్నారు మీరు

తరచు హరిసేవ లందు మురియుచున్నారు


పురుషోత్తము డతడినే పొగడుచున్నారు మీరు

పరుల నెపుడు పొగడ మని పలుకుచున్నారు

హరితీర్ధము లెల్లప్పుడు తిరుగుచున్నారు మీరు

హరికథలను తడవి తడవి మురియుచున్నారు


హరిసన్నిధి మాకు నిత్య మనుచునున్నారు మీరు

హరినామము భవతారక మనుచునున్నారు

హరినామామృతమె చాలు ననుచునున్నారు మీరు

హరేరామ యనుచు నెపుడు మురియుచున్నారు