28, జులై 2022, గురువారం

పాట మొదలుకాక ముందే

పాట మొదలుకాక ముందే పరవశత్వమా
పాట కాదు నిన్నుజూచి పరవశించేము

మధురమైన మాటల మాచిన్ని కన్నయ్యా ఆ
మధురిమకు మూలమేమో మాకు చెప్పరా ఈ
అధరములే గోపికలారా అంతకన్నను ఆ
మధురిమకు మూలము వేరే మరి యుండునా

సుధల చిలకరించు ఆ అధరముల నంటగా
మధురమైన పాటలు పాడు మంచిమురళి నా
సుధామధురాధరముల చొక్కుమందు నో
వధూమణులార గ్రోలవచ్చును కాదా

పరవశింపజేయు కొంటె పలుకులవాడా నీ
మురళిపాట వినిపించర మోహనాంగుడా ఈ
మురళిని చూచి పరవశమేలా ముగుదలారా నీ
కరముల నాడే మురళిదె భాగ్యము కాదా కృష్ణా
27, జులై 2022, బుధవారం

ఓ మహానుభావ

ఓమహానుభావ నీకేమని తెలుపుదు
నామూగవేదనను నాకన్నతండ్రీ

పుట్టినదాదిగా బోలెడన్ని వెతల
పుట్టవంటి దాయె బ్రతుకిదిగో నాకు
పట్టుబట్టి నేను పళ్ళబిగువున బండి
నెట్టులో లాగుచు నిట్టలుంటి గదయ్య

చిరుచిరునగవుల కురిపించుదువు కాని
కరుణించ వేమయ్య కర్మబంధవిముక్తి
వరము లేమడిగితిని దరిజేర్చుకొమ్మనుచు
మరిమరి యడుగుదు మరియేమి యడుగుదు

నాది కాదీ తనువు నాది కాదీ బ్రతుకు
నాది కాదీ మనసు నా తండ్రి సర్వమును
నీది నీదే నది నిశ్చయ మటులయ్యు
వేదన లివి మాత్రము నా వనకు రామా

23, జులై 2022, శనివారం

వనవాసమునకు వచ్చెదనంటే..


వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములనిండా క్రూరమృగములే భయపడుదువేమో జానకీ

వనములలో క్రూరమృగము లుండినా మనకేమి భయము రాఘవా
వినవే పులులూ సింహములంటే వనమయూరములా జానకీ

పురుషసింహుడవు నీప్రక్కనుండగ పుట్టదేభయమూ రాఘవా
సరసిజాక్షి మంకుపట్టు మానవే వనములు భయంకరములే

నరనాథ వనమైన నీప్రక్కనుండగ నగరతుల్యము నాకు రాఘవా
తరళాక్షి వనసుందరివి కావలెనని తలచుట మానవె జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములలోన రాకాసులుందురు వద్దువద్దే జానకీ

వనములనిండా రాకాసులుంటే మనకేమి భయము రాఘవా
వనజాక్షి నీవు వారినిచూచి భయపడుదువేమో జానకీ

వనజాక్ష నీవు నా ప్రక్కన నుండగ భయమేల కలుగును రాఘవా
అనుభవింఛినకాని వనవాసకష్టము లర్ధముకావా జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములలో నీవు చూడదగినవి కనరావు నాకు జానకీ

వనముల పునిపుంగవులను జూడగవచ్చు వద్దనకయ్య రాఘవా
మునులకన్నను ముందు మన కడవులలో పులులెదురౌనే జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనవాసకష్టము నిను సుకుమారిని  భరియింప మందునో జానకీ

నను నీ వడవుల భరియింపలేనని ఆడలుచున్నావో రాఘవా
వినవయ్య నీవబల వలె బల్కుటను నేను వినలేను వినలేను రాఘవా

హరిబోలు తేజంబు గలనీవు నిలచిన అడవి యుద్యానంబు రాఘవా
సరిసరి నీధృఢనిశ్ఛయ మెఱుగితి సంతోషమాయెను జానకీ

దైవనిర్ణయమిది నీవెంట నేనుందు పోవుదమడవికి రాఘవా
దేవతలెందుకు త్రోసిరడవికి  దాని తీర్చగ బోదుమె జానకీ

సీతారామా యనగానే

 సీతారామా యనరా అది చేయు మేలు కనరా
సీతారామా యన్నమాట శ్రీకరమని తెలియరా

సీతారామా యనగానే చింతలన్ని తొలగును
సీతారామా యనగానే చీడపీడ లణగును
సీతారామా.యనగానే క్షేమము చేకూరును
సీతారామా యనగానే చిత్తశాంతి కలుగును

సీతారామా యనగానే చేకూరును శుభములు
సీతారామా యనగానే సిరులు పొంగిపొరలును
సీతారామా యనగానే చెడుతలపులు తొలగును
సీతారామా యనగానే జీవికి బుధ్ధి కలుగును

సీతారామా యనగానే జీవికి రక్ష కలుగును
సీతారామా యనగానే జీవికి భీతి తొలగును
సీతారామా యనగానే జీవభ్రాంతి తొలగును
సీతారామా యనగానే జీవికి ముక్తి దొరకును


తారకనామము చాలని.తెలియక

తారకనామము చాలని తెలియక ధరమీది జనులందరు
ఆరయ చేసే పనులన్నీ అక్షరాలా వెఱ్ఱివేషాలు

ఒకడేమొ ఉపవాసదీక్షలు-ఒకనాడు విడువక చేయును
ఒకడేమొ జపతపహోమాలు ఒళ్ళుమరచి చేయుచుండును
ఒకడేమొ నిత్యము దానాలు ఒట్టుపెట్టి చేయుచుండును
ఒకడేమొ తీర్ధాలు క్షేత్రాలు ఓహోహొ తిరుగుచు నుండును

వరుసపెట్టి ధర్మకార్యాలు మరువక చేసెడి వాడొకడు
తరచుగా గురుపాదపూజలని తత్తర పడుచుండు వాడొకడు
మరిమరి గొప్పగుడులంటూ పరుగులు పెట్టెడు వాడొకడు
అరరే క్షుద్రపూజలకే నిరతము తెగబడుచుండెడు వాడొకడు

పరమాత్ముని గూర్చి తెలియరుగా పతితపావనుని తెలియరుగా
మరి తెలియజెప్పే వారలతో నరులు స్నేహమును చేయరుగా
అరకొర తెలివిడితో వారు అవకతవకలునే చేసేరుగా
హరినామపరులై యున్నప్పుడే అపవర్గమును వారు పొందేరుగా

22, జులై 2022, శుక్రవారం

శ్రీరామనామమును చేయనిదే

శ్రీరామనామమును చేయనిదే నీవు 
చేరగలేవు మోక్షపుర సింహద్వారము

ఎన్నెన్ని చోట్లను తిరిగి ఎంతగా గడించినా
ఎన్నెన్ని విద్యలు నేర్చి ఎంతగా రాణించినా
ఎన్నెన్ని పనులను చేసి ఎంత పేరు బడసినా
ఎన్నెన్ని దానములచే నెంతపుణ్య మబ్బినా

ఎన్నెన్ని మంత్రంబులకు నెంతజపము చేసినా
ఎన్నెన్ని చక్కని వ్రతము లెంత నిష్ఠగ చేసినా
ఎన్నెన్ని గురుపూజలని యెంత ప్రాకులాడినా
ఎన్నెన్ని క్షేత్రంబులకు నేగి మ్రొక్కులిఛ్చినా

ఎన్నెన్ని దైవతంబుల నెంతగా మెప్పించినా
ఎన్నెన్ని శక్తులబ్బిన యెంతవాడ వైననూ
ఎన్నెన్ని జన్మములెత్తి ఎంతగా తపించినా
అన్నన్నా లాభములేదు అంతా దండుగయా

21, జులై 2022, గురువారం

హరేరామ నేను చేయ నపరాధము

హరేరామ నేను చేయ నపరాధము
హరేకృష్ణ నేను చేయ నపరాధము

హరి యునికిని నమ్మకుండు టపరాధము
హరి మహిమను నమ్మకుండు టపరాధము
హరి నన్యులతో పోల్చుట యపరాధము
హరి భక్తియె లేక యుండు టపరాధము

హరిసేవకు వెనుదీయుట యపరాధము
హరిసేవల నలసత్వం బపరాధము
హరిసేవవల కన్యమెంచు టపరాధము
హరిసేవకులను దిట్టుట యపరాధము

హరిమార్గము మరచియుండు టపరాధము
హరినామము మరచియుండు టపరాధము
హరిని గూర్చి పలుకకుండు టపరాధము
హరిభక్తుల జేరకుండు టపరాధముమధుర కేల పోదువురా

మధుర కేల పోదువురా మానర కృష్ణా నిన్ను
మధుర కప్పగించలేము మన్నించరా

మధురలోన యింతకన్న మంచిపాలు దొరకునా
మధురలోన యింతకన్న మంచివెన్న దొరకునా
మధురలోన యమునకన్న మంచినది యున్నదా
మధురలోన మాకన్నా మంచికన్నె లుందురా

మధురలోని కంసమామ మంచివాడు కాడట
మధుర కేగ వాడు నిన్ను మాకు దక్క నిచ్చునా
మధురలోని జనులు నిను మాకు దక్క నిత్తురా
మధురాభోగములు నిను మాకు దక్క నిచ్చునా

అధరములకు మురళి చేర్చి ఆనందము మీఱ
మధురమధురముగ పాడే మాకృష్ణుడా నిను
మధురాపురి కప్పగించి మాకు బ్రతుక రాదురా
మధుర వారి దయలు లేక మనకేమి గడువదా

20, జులై 2022, బుధవారం

అరిది విలుకాడ మంచి యందమైన వాడ

అరిది విలుకాడ మంచి యందమైన వాడ
హరి మేని చాయ వాడ  చిరునగవు వాడ

తిరుగులేని చాల గొప్ప దొరతనము వాడ
మరుగులేని గొప్ప ధర్మ మార్గము వాడ
కరుణజూపు దేవు డన్న బిరుదుగల వాడ
స్థిరమైన కీర్తియున్న దేవదేవుడ

తిరుగులేని బాణాలను పఱపించు వాడ
హరివోలె దైత్యకులము నణగించు వాడ
పరమపురుషు డన్న మంచి బిరుదుగల వాడ
సరిసాటిలేని గొప్ప సార్వభౌముడ
 
పరమభక్తులకు నెపుడు పలుకుచుండు వాడ 
పరమయోగులకు మోక్షఫలమునిచ్చు వాడ
మరలమరల మాకు మంచి వరములిచ్చు వాడ
సరసహృదయ సీతారామచంద్రమూర్తి

చూడండీ బాలరాముని శోభను మీరు


చూడండీ బాలరాముని శోభను మీరు

వేడుకతో జనులార వేయికనులతో


పరమసుకుమారుడు మన బాలరాముడు వాడు

పరమమనోహరమూర్తి పురజనులకు

పరమవినయమూర్తి మన బాలరాముడు వాడు

గురుజనుల యెడల చూపు గొప్పభక్తిని


పరమవీరమూర్తి మన బాలరాముడు వాడు

సురవైరుల యెడల చాల కరకువాఠు

పరమభద్రమూర్తి మన బాలరాముడు వాడు

గురుయాగమునకు రక్షణ గూర్చువాడు


పరమబాహుబలశాలి బాలరాముడు.వాడు

హరుని వింటి పవలీలగ విరచినాడు

పరమకళ్యాణమూర్తి బాలరాముడు వాడు

ధరణిజ కేలూని ఇదే మెఱసినాడు

19, జులై 2022, మంగళవారం

రాముని నమ్మితే రాని దేమున్నది

రాముని నమ్మితే రాని దేమున్నది ఆ
కాముని నమ్మితే కడ కేమున్నది

రాముని నమ్మితివా ప్రసాదించు సంపదలు
కాముని నమ్మితివా కబళించును నీసిరులు
రాముని నమ్మితివా ప్రసాదించు వరములు
కాముని నమ్మితివా కలిగించు వికారములు

రాముని నమ్మువారు రాజ్యములను పొందినారు
కాముని నమ్మువారు ఘనత పొందలేరు భువిని
రాముని నమ్మి యొకడు బ్రహ్మపదము పొందినాడు
కాముని బ్రహ్మవంశఘనుడు నమ్మి చెడినాడు

రాముని నమ్మి చెడడు భూమిపైన నెవ్వడును
కాముని నమ్మి సుఖము గాంచడే మానవుడును
రాముని నమ్మి మోక్షగామి యగును ముముక్షువు
కాముని నమ్మి నరకగామి యగును పామరుడు

16, జులై 2022, శనివారం

రాముడె నాకిక రక్ష

రాముడె రక్ష రాముడె రక్ష రాముడె నాకిక రక్ష

రాముని భక్తుడ నైతిని నేను రాముడె నాకిక రక్ష
రాముని సన్నిధి నుందును నేను రాముడె నాకిక రక్ష
రాముని నమ్మి చరించెద నేను రాముడె నాకిక రక్ష
రాముని నామము మరువను నేను రాముడె నాకిక రక్ష
 రాముని స్మరణము విడువను నేను రాముడె నాకిక రక్ష
రాముని చరితము నుడివెద నేను రాముడె నాకిక రక్ష
రాముని కీర్తన చేసెద నేను రాముడె నాకిక రక్ష
రాముని ప్రార్ధన చేసెద నేను రాముడె నాకిక రక్ష 
 రాముని తోడిదె లోకము నాకు రాముడె నాకిక రక్ష
రాముని సేవించెదను నేను రాముడె నాకిక రక్ష
రాముని కన్యము నెఱుగను నేను రాముడె నాకిక రక్ష
రాముని శరణము వేడితి నేను రాముడె నాకిక రక్ష


శ్రీరామచంద్రుని చేరవే చిలుకా

శ్రీరామచంద్రుని చేరవే చిలుకా
ఆ రామచంద్రుని అడుగవే చిలుకా
 
చిరునగవులను చిందు శ్రీరామచంద్రుడు
కరుణ కలిగిన వాడు కసరడే చిలుకా
హరి చెంత చేరవే ఆనందపరచవే
మురిపాలమాటల ముద్దుల చిలుకా 
 
పంచవెన్నెల చిలుక మంచిచిన్నెల చిలుక
కొంచెము నామాట గోవిందు నడుగవే
మంంచిమాటలు చెప్పి మన్నింపుమని యడిగి
ఇంచుకంతగ విషయ మెఱిగరా చిలుకా

మరియెన్ని గండాలమారి జన్మల నెత్తి
తరియింతునో నేను తనను నీ వడుగవే
హరి నడిగి తెలిసికొని ఆమాట చెప్పవే
సరిసాటిలేని ఓ చక్కన్ని చిలుకా
 

 

వీరుడ వంటే నీవేలే

వీరుడ వంటే నీవేలే అరి
వీరభయంకరుడా రామా

మూడుఘడియలు ముగియులోపలే
వాడిబాణముల బరపి ఖరాదుల
పోడిమి నణచిన వాడవు కావో
ఏడీ నీసరి వా డెవడయ్యా

పరక వైచితివి పరుగిడు కాకికి
తిరిగి యెచ్చటను త్రిభువనములలో
శరణము కరవై భ‌రపడి తుది నీ
చరణము లంటగ చా వెడలె

పంతగించి పైబడి కురిపించిన
అంతులేని నీ అలుగుల ధాటికి
గంతులు వేసెను ఘనరణభూమిని
బంతుల వలె రావణుని శిరంబులు

జననాథకులజలధి చంద్రుడా

జననాథకులజలధి చంద్రుడా భక్త
జననాథ శ్రీరామచంద్రుడా

నీవే నాపతివని యందురా ఇంక 
నీవే నాగతివని యందురా
నీవే భవజలధిని నావవై నీ
తావునకు తోడుకు పొమ్మందురా

హరివి నీవేనని యందురా మనో
హరుడవు నీవేలే యందురా
సరగున రక్షించ మందురా ఓ
పరమాత్మ నీవే దిక్కందురా

కరుణగల వాడవని విందురా వేగ
కరుణజూప వేమని యందురా
హరి నీవే సర్వస్వ మందురా నాకు
మరి యెవరును లేరనే యందురా


14, జులై 2022, గురువారం

కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు

కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు మంచి 
కోతినే బ్రహ్మను చేసిన గొప్ప దేవు డితడు

పోడిమి చెడిన కోతులరాజును బుజ్జగించినాడు
వాడి శత్రువును పడగొట్టగ నొక బాణమేసినాడు
వేడుక వానిని రాజును చేసి ప్రీతిచెందినాడు
వాడిని ప్రత్యుపకారివి కమ్మని వేడినాడు వీడు 

కోతుల చక్కని కోతిని పిలచి కోమలి కీయుమని
నాతికి గుర్తుగ చేతియుంగరము ప్రీతి నొసగినాడు
ఆతడు భామిని నారసివచ్చిన నబ్బురపడినాడు
నాతమ్ముడవని కౌగలించుకొనినా డీదేవుండు
 
కోతులదండు సాగరమునకు గొబ్బున వారధిని
ఆతురపడుచు కట్టగ రావణు నంతుచూచి నాడు
సీతారాముడు సీతను కూడి చింతవీడి నాడు
కోతులసాయముతో గెలుపొందిన గొప్పదేవు డితడు


రామ రామ యనవే

రామ రామ యనవే రసనా రసనా  శ్రీ‌రఘు
రామునింక పొగడవే రసనా రసనా

ఏడేడు జగములను వేడుకతో రసనా
ఆడించెడు రమాపతి వాడేనే రసనా
వాడి కంటె నిక గొప్పవాడెవడే రసనా
వేడుకతో నోరారా పిలువగదే రసనా

నారాయణుని వేయి నామములను రసనా
శ్రీరామనామమే శ్రేష్ఠమనుచు రసనా
గౌరీపతి పలికెనే గొప్పగాను రసనా
నోరారా రామా యని నుడువగదే రసనా

శ్రీరామా యన్నచాలు జీవి నింక రసనా
చేరదీసి శ్రీరాముడె చింతదీర్చు రసనా
ఆరాముని యాశ్రయించి హాయిగాను రసనా
చేరవచ్చు మోక్షపురికి శీఘ్రముగా రసనా13, జులై 2022, బుధవారం

హరేరామ హరేకృష్ణ యని పాడు వేళ

హరేరామ హరేకృష్ణ యని పాడు వేళ
మరే సంగతుల పైన మనసు పోరాదు

ధనధనేతరముల పైన మనసు పోరాదు
తన మంచిచెడుల పైన మనసు పోరాదు
తన హితు లహితుల పైన మనసు పోరాదు
తన యూరిగొడవలపై మనసు పోరాదు

మాయదారి సుఖములపై మనసు పోరాదు
మాయదారి విద్యలపై మనసు పోరాదు
మాయగురుబోధలపై మనసు పోరాదు
మాయాసంసారముపై మనసు పోరాదు

మన కితరుల మెప్పుపై మనసు పోరాదు 
జనులాడెడు మాటలపై మనసు పోరాదు
జనార్దనుని పైన దక్క మనసు పోరాదు
మనసు హరిమయమైతే మన కదే చాలు


9, జులై 2022, శనివారం

శ్రీరఘురాముడు కలడు కదా

శ్రీరఘురాముడు కలడు కదా చింతలు మీకిక వలదు కదా

దారిద్ర్యము లేకుండు కదా ధనధాన్యంబులు కలుగు కదా
కోరిక లిక నెఱవేరు కదా గొప్ప సుఖంబులు కలుగు కదా

కష్టము లన్నియు తొలగు కదా నష్టము లన్నియు కరగు కదా
దుష్టుల పీడన తొలగు కదా శిష్టుల సంగతి కలుగు కదా

తాపము లన్నియు తొలగు కదా శాపము లన్నియు మలగు కదా
పాపము లన్నియు తొలగు కదా కోపాలసతయు తరుగు కదా

నవచైతన్యము కలుగు కదా జ్ఞానసంపదయు కలుగు కదా
భవరోగము శమియించు కదా వైకుంఠము ప్రాప్తించు కదా

కొలువు తీరి నావు బలే

కొలువు తీరి నావు బలే గొప్పగాను లోక
ముల నేలు రామచంద్రమూర్తి నీవు

వైకుంఠపుర మందు బహువిలాసము గాను
శ్రీకాంతతో శేషసింహాసనము పైన
లోకేశుల వినతులు సాకల్యముగ వినుచు
ప్రాకటముగ శ్రీహరివై వెలుగొందుచును

సాకేత పురమందు జానకీసతి గూడి
శ్రీకరుడవై రత్నసింహాసనము పైన
లోకస్థులు మునివరులు నీకు స్తోత్రము చేయ
రాకేందువదన శ్రీరాముడవై వెలుగుచును

భక్తహృదయపురమున పరమానందముతో
యుక్తభావనార్పిత ముచితాసనము పై నను
రక్తితో కూర్చుండు రామబ్రహ్మంబువై
ముక్తిప్రదుడ వగుచు ముచ్చటగ వెలుగుచును7, జులై 2022, గురువారం

శ్రీరామ వందనం సీతారామ వందనం

శ్రీరామ వందనం సీతారామ వందనం
తామరసనయన గుణధామ వందనం

సురలమెఱ విని భువిని సూర్యాన్వయము సొచ్చి
సురవైరుల ద్రుంచిన హరి నీకు వందనం
నరుడవై వనముల నడయాడి మునివరుల
కరుణించుచు తిరిగిన హరి నీకు వందనం

శాపములను బాపెడు సర్వేశ వందనం
పాపములను తొలగించు పరమేశ వందనం
తాపత్రయవారణదక్ష నీకు వందనం
మాపాలి దైవమా మారామ వందనం

నీలమేఘశ్యామ నీకిదే వందనం
పాలితాఖిలభువనజాల హరి వందనం
వాలాయముగ మమ్మేలు దొర వందనం
చాలు నీ‌దయ మాకు సనాతన వందనం


6, జులై 2022, బుధవారం

రామ జయమ్మని యనరే

రామ జయమ్మని యనరే శ్రీరఘురామ జయమ్మని యనరే
రాముని జయగీతికలను పాడుచు మీమీ భక్తిని చాటుచు

కుమతులు విమతులు దుర్మతులును గగ్గోలు పుచ్చుచు లోకమును
భ్రమలను ముంచుచు బెదిరించుచు దుష్ప్రచారములనే చేయుచును
విమలమనస్కులు సజ్జనులను బహువిధములుగాను దూఱుచును
సమరోత్సాహము చాటుచునుండగ సదా రామునకె జయమనుచు

ఒంటికాలిపై ధర్మదేవతకు కుంటక తప్పని యుగమనుచు
కంటను నీరిడి చూచుచు నుండక కాసెబిగించి సుజనులార
తుంటరి కలిని వాని సైన్యమన దోచెడు దుష్టుల మూకలను
కంటగించుచును కలిలో నైనను ఘనుడు రామునిదె జయమనుచు

ఎడరు చెందునెడ నార్షధర్మమున కీశ్వరుడే రక్షకుడగుచు
తడయక స్వస్థితి నిలుపగ దానే స్వయముగ పూనుకొని
గడుసుదనంబున ధర్మద్రోహులై పుడమిని తిరిగెడు వారలను
కడముట్టించును కాని విడవడా కంజాక్షునిదే జయమనుచు
 

వినుడు రామభక్తుని విధము

వినుడు రామభక్తుని విధ మిట్టిదై యుండును
కను డాతని రాముడును కటాక్షించుచుండును
 
రామా యని నిదురలేచు రామా యని నిదురవోవు
రామా యని పనుల నారంభించును తానెపుడును
రామా యను సకలకార్యావసానముల యందు
రామా యనకుండ నుండరా దతని రసన కనగ

రామానుగ్రహ మనిపల్కును ప్రజలు తన్ను పొగడుచో
రామరామ యనుకొనును ప్రజలు నిందించుచో
రామునిపై భారముంచి ప్రవర్తించు నెల్లపుడు 
రామచంద్రుడే తనను రక్షించునని నమ్మును

రాముడొకడె సర్వజగ్రద్రక్షకుడని నమ్మియుండు
రాముడొకెడె భుక్తిముక్తి ప్రదాతయను నెల్లప్పుడు
రామచంద్రుడు శ్రీమన్నారాయణుడని యెఱిగియుండు
రాముచంద్రు నాత్మలోన లక్షించును తానెపుడును


5, జులై 2022, మంగళవారం

చెప్పండీ రామచంద్రు నెప్పటికీ విడువమని

చెప్పండీ రామచంద్రు నెప్పటికీ విడువమని
చెప్పండీ రామనామ మెప్నటికీ మరువమని

చెప్పండీ నరనాథుడు శ్రీరామచంద్రుడని
చెప్పండీ సురనాథుడు శ్రీరామచంద్రుడని
చెప్పండీ భువనేశుడు శ్రీరామచంద్రుడని
చెప్పండీ భగవంతుడు శ్రీరామచంద్రుడని

చెప్పండీ మాచుట్టము శ్రీరామచంద్రుడని
చెప్పండీ మాగురువు శ్రీరామచంద్రుడని
చెప్పండీ మాకు తండ్రి శ్రీరామచంద్రుడని
చెప్పండీ మాదైవము శ్రీరామచంద్రుడని

చెప్పండీ సంపదలను శ్రీరాము డిచ్చునని
చెప్పండీ సుఖములను శ్రీరాము డిచ్చునని
చెప్పండీ శుభములను శ్రీరాము డిచ్చునని
చెప్పండీ అపవర్గము శ్రీరాము డిచ్చునని

3, జులై 2022, ఆదివారం

రాలుగాయి మనసా

రాలుగాయి మనసా రాలుగాయి మనసా రాముని కొలువవే మనసా
చాలు నీవేషాలు శ్రీరామచంద్రుని చక్కగ కొలువవే మనసా

వేరువారల గొల్చి వెఱ్ఱివి కాబోక విభుని వేడవె నీవు మనసా
కారుణ్యాంబుధియైన శ్రీరామచంద్రుని ఘనముగ కొలువవే మనసా

ఘోరసంసారపు తీరంబుజేర్చెడి ఘననౌక రాముడే మనసా
తారకరాముని కొలిచెడు వారలె ధన్యులీ జగతిని మనసా

మారజనకుని శ్రీమన్నారాయణుని నీవు మరిమరి వేడవె మనసా
మారవైరియుకూడ రామనామము యొక్క మహిమచాటుచు నుండు మనసా

నారదాదులు  మునిముఖ్యులు సేవించు నారాయణుని నీవు మనసా
చేరి సదా చిత్తశుధ్ధితో కొలిచినచో చేకూరునే ముక్తి మనసా

తప్పుడు గురువుల బోధలు వినినీవు తప్పుదారుల బోక మనసా
ఒప్పుగ శ్రీరామపాదాలు సేవింప నుత్సహించవె నీవు మపసా

తప్పక శ్రధ్ధతో శ్రీరామనామము తలదాల్చియుండవే మనసా
ఎప్పటికైనను శ్రీరామచంద్రుడే యిచ్చునే మోక్షమును మనసా

శ్రీరామ శ్రీరామ యనకుండ

శ్రీరామ శ్రీరామ యనకుండ మోక్షము చిక్కేది లేదని తెలియండీ మీకు
శ్రీరామచంద్రుని దయలేక మోక్షము చిక్కేది లేదని తెలియండీ

విచ్చలవిడిగాను వెదజల్లి ధనములు విలుచుకొనగలేరు తెలియండీ
హెచ్చుగా యజ్ఞయాగాలు చేసినగాని ఏమీ లాభములేదు తెలియండీ
అచ్చుపడగ శ్రధ్ధ మంత్రజపంబుల నతిశయించిన రాదు తెలియండీ
మెచ్చగ పదిమంది దానాలనేకము మెఱయించిన రాదు తెలియండీ

వేదంబు లెఱిగిన విద్వాంసులని మీకు బిరుదులుండినగాని రాదండీ
వేదాంతశాస్ర్రవిజ్ఞానులై మీరెంత పేరుకెక్కినగాని రాదండీ
ఏదేవతల నెంత మెప్పించగలిగిన నెవ్వరు మీకీయలేరండీ
లేదు వేరొకదారి శ్రీరామకృప కాక వాదాలు మాని గ్రహించండీ

భక్తుల కెపుడను పరమసులభుండైన భగవంతుడు రాము డున్నాడు
భక్తుల యోగక్షేమాలభారంబును వహియించు మన రాము డున్నాడు
భక్తిశ్రధ్ధలు కలిగి పరమాత్ముడాతని భావించితే వాడు మీవాడు
యుక్తి మరొక్కటి యోచించ వద్దు హరిభక్తులకే మోక్ష ముందండీశ్రీరాముని దయయుండ

శ్రీరాముని దయయుండ చింతలేల నోట
శ్రీరాముని నామ ముండ చింతలేల

నరులను నమ్ముకొన్న నానాచింతలు కాని
హరిని మనసార నమ్మినప్పు డుండునా
పరుల సేవలోన పలుబాధలును చింతలగు
హరిసేవలోన బాధ లసలుండునా

ధనముల వెంటబడిన తగులును చింతలు కాని
మనసు హరిధ్యానమగ్న మైన తలుగునా
వనజాక్షుల సేవలోన బాధలగు చింతలగు
వనజాక్షుని సేవలోన బాధలుండునా

హరిభక్తి లేనివారి కనేకములు చింతలగు
హరిభక్తుల కెందు చింతలన్నవి కలవు
హరిభక్తుల మంచిచెడుగు లరయుచు హరియుండ
మరి చింత యనునట్టి మాట యెక్కడిది

2, జులై 2022, శనివారం

లచ్చుమయ్య లచ్చుమయ్య రామానుజుడా

లచ్చుమయ్య లచ్చుమయ్య రామానుజుడా నిన్ను
మెచ్చనివా రెవరయ్యా మేదిని మీద

గడుసుకైకమ్మ తనకొడుకు కొఱకు రాజ్యమడిగి
అడవులకు పొమ్మనె నీయన్న నటంచు
నిడుదకత్తితీసి డించి నడచితివే యన్నతో
వడివడిగా నీరామభక్తి మెఱయగా

అడవులలో నీవు నీ యన్నకును వదినకును
అడుగడుగున తోడునీడ వైనిలచితివి
బడబానలంబు వంటి బాధ రామునకు రా
నడపించినావు లంకానాథుని పైకి

పదునాలుగేండ్లు నిదురవదలి గడపితివి
నదినెకు నన్నకును నీవు బంటువైతివి
కదనంబున నింద్రజిత్తు కంఠముత్తరించి దశ
వదను పదను మట్టిజేయువాడ వైతివి


1, జులై 2022, శుక్రవారం

ఏమంత్రమో యది

ధీమంతులగు మీకు తెలిసియుండగ వచ్చు
నేమంత్రమో యది యెఱిగించుడీ మాకు

కామితార్ధములెల్ల ప్రేమతో నందించు ఘనమైన మంత్ర మదేదందురు
నీమమొప్పగ జేయ మిముగాచి మోక్షంబునే యిచ్చు మంత్ర మదేదందురు
పామరులకు గూడ పలికినంతనె గొప్పఫలమిచ్చు మంత్ర మదేదందురు
ఏమందు మేమందు మది రామచంద్రుని యింపైన తారకమంత్రము

జడునైన తులలేని పండితునిగ జేయు చక్కన్ని మంత్రంబు నేమందురు
పడియున్న శిలనైన భామినీమణిజేయు కడుగొప్ప మంత్రంబు నేమందురు
కడకు రక్కసునైన ఘనభాగవతుజేయు ఘనమైన ముత్రంబు నేమందురు
పుడమిపై భవతారకంబన్న ప్రఖ్యాతి బడసిన శ్రీరామమంత్రము

పరమయోగివరులు భావించుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
పరమభక్తులెపుడు పఠియించుచుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
పరమశివుడు తాను జపియించుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
మరియేమి మంత్రము శ్రీరామచంద్రుని మంత్రము తారకమంత్రము

శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు

శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు
శూరవరేణ్యుడవు నీవు శుభ్రయశస్కుడవు

దానవవీరుల కాలునివోలెను దండనచేయుచు నుండెడి వాడవు
మానవకోటిని కన్నతండ్రివలె మంచిగ పరిపాలించెడువాడవు
జ్ఞానులభక్తులనర్ధార్ధులను చక్కగ సంరక్షించెడువాడవు
దీనజనావన బిరుదాంకితుడవు దినకరకోటిసమానతేజుడవు

పురుషోత్తముడవు పురాణపురుషుడ వరిందముడవు హరసన్నుతుడవు
వరవిక్రముడవు తరణికులేశుడ వరవిందాక్షుడ వఖిలేశ్వరుడవు
నరనాయకుడవు సురనాయకుడవు ధరణీతనయాప్రాణేశ్వరుడవు
వరగుణయుతుడవు మునిగణనుతుడవు సురగణనుతుడవు పరమేశ్వరుడవు

బ్రహ్మాండములు సృజించెడువాడవు వాటికిపోషణ చేసెడివాడవు
బ్రహ్మవేత్తలకు నిత్యము చక్కగ బ్రహ్మానందము నిచ్చెడివాడవు 
బ్రహ్మేంద్రాదుల పొగడిక లందెడు వాడవు రామబ్రహ్మం బనగా
బ్రహ్మర్షులతో నిండిన సభలో బంగరుగద్దియ నుండెడివాడవు