30, జనవరి 2024, మంగళవారం

రామనామరసాస్వాదన


రామనామరసాస్వాదనామగ్న శుభస్థితి

సామాన్యులు పొందుటనగ సాధ్యమేనా


ఎన్నెన్ని జన్మలెత్తి ఎంతపుణ్యము చేసి

ఎన్నెన్ని పూజల నొనరించిన కలుగు

ఎన్నెన్ని మారు లోయీశ్వరా కావుమని

విన్నపములు చేసిన పిమ్మట కలుగు


భోగముల నుజ్జగించి రాగమర్దనము చేసి

యోగసాధనలు చేయ నొప్పుగ గలుగు

త్యాగుల కాజన్మవిరాగులకు భక్తులకు

బాగొప్పగ స్వామికృపాభాగ్యము కలుగు


కలుగునా మాబోంట్లకు కలిసర్పదష్టులకు

కలనైన రామనామకలిమి ఎక్కడ

తలచి కరుణాళువైన దశరథరాముడే

తెలియుమని యది యిచ్చి దీవించనిదే


మోక్ష మెవ్వరిస్తారో


మోక్ష మెవ్వరిస్తారో  మోక్ష మెవ్వరిస్తారో 
మోక్ష మెవ్వరిస్తారో మ్రొక్కేము వారికే

దిక్కు లన్నియును నిండి దేవత లున్నారు
చక్కగా మోక్షమీయ జాలుదురా వారు
మ్రొక్కితే వరములిచ్చు ముచ్చటయే గాని
ఒక్కరును మీకు మోక్ష మొసగనే లేరు

ఏడు కోట్ల మంత్రాలవి  యెందుకున్నట్లు
వేడితే మోక్షమీని వేల్పుల మంత్రాలు
వేడ దగిన వానినే వేడవలయు నండి
వేడ దగిన విధముగా వేడవలయు నండి

వేడదగిన వాడెవ్వడు వేడుటది యెట్లు
వేడదగిన శ్రీరామ విభుని వేడుడు వాని
వేడుకైన నామమును విడువక స్మరియించి
వేడుగగా గైకొనుడు విభుడొసగును ముక్తి


రసనా యిక పలుకవే రామనామము


రసనా యిక పలుకవే రామనామము

రసహీనపదములు మాని లక్షణంబుగా


ఇంతకన్న మంఛినామ మెక్కడున్నదే యిది

అంతులేని సౌభాగ్యము లందించునదే

సంతతమీ నామమునే స్మరణచేయవే యిక

అంతులేని సంసారమె యంతరించునే


పరమాత్ముని నామమిది పసందైనది యిది

హరినామము లందు శ్రేష్ఠమైనదే

పరమశ్రధ్ధతో స్మరించు వారి నన్నచో నిది

పరమపదము చేర్ఛు గాని వదలిపెట్టదే



27, జనవరి 2024, శనివారం

తామసులకు కలుగునా రామనామము


తామసులకు కలుగునా రామనామము శాంతి
కాముకులకు దొరకునట్టి రామనామము

అందమైన దతిసులభ మైనదీ నామము
ఇందువదన సీతాసతి కిష్టనామము
అందుకొనుడు వేగ సుజనులార యీనామము
పొందదగిన నామము గోవిందు నామము

హనుమదాది సద్భక్తుల కారాధ్యనామము
మునివరు లనునిత్యమును పొగడు నామము
వనజసంభవుడు తలచి పలుకాడు నామము
అనిశము శ్రీహరుడు పలుకునట్టి నామము

యోగివరుల గుండియల మ్రోగు నీనామము
రాగద్వేషముల నణచు రమ్యనామము
భోగపరాయణు లెన్నడు పొంద రీనామము
వేగముగా మోక్షమిచ్చు విష్ణునామము


రామయ్యకు చెప్పచుందు నేమని


రామయ్యకు చెప్పచుందు నేమని నీవు

నామనసు నాక్రమించి నావని

రామయ్యకు విన్నవింతు నేమని నీవు

నామనవులు చిత్తగించ గలవని


నారసనను నీనామము నడచుచుండ నీయమని

వారిజాక్ష నీనామము వదలియుండ లేనని

కూరిమితో నీనామము గొని పలికెడు నాకిక

మారజనక నీదయలను మానకుండ కురియుమని


పరమపురుష నీనామము మరువకుండు వాడనని

తరచుగాను నీనామము తలచి మురియు వాడనని

సరసమైన నీనామము చాలు నందు నానిక

మరి పుట్టువు లేదనుచు వరదానము చేయుమని


కరి తలచిన నీనామము కలిగె నాకు నీదయచే

సురలు తలచు నీనామము శోభించెను నారసనను

హరుడు పలుకు నీనామము నాశ్రయించు నాకిక

పరమార్ధము నీసన్నిధి మరి యది దయచేయుమని



పో మితరుల కడకు


మేము రామభృత్యులము  పో మితరుల కడకు
మేము రామభక్తులము పో మితరుల కడకు

రాముని వలచేము రాముని తలచేము
రాముని కొలిచేము మేము పో మితరుల కడకు

రాముడు మానాథుడు రాముడు మాకాప్తుడు
రాముడు మాదేవు డండి పో మితరుల కడకు

రాముడు సర్వేశుడు రాముడు జగదీశుడు
రాముడు పరమేశు డండి పో మితరుల కడకు

రాముని  సేవింతుము రాముని పూజింతుము
రాముని కడ నుందు మండి  పో మితరుల కడకు

రామనామము చాలును రాము డొకడె చాలును
రాముడె మాలోక మండి  పో మితరుల కడకు

రామునిదయ చాలును  రామునిదయ చాలును 
రామునిదయ చాలు నండి  పో మితరుల కడకు



26, జనవరి 2024, శుక్రవారం

సరిసరి నీసాటి చక్కని వాడు

 
సరిసరి నీసాటి చక్కని వాడు
ధరణిని గలడా దశరథరామ

ధరణిని యని యేమి సురలోకమునను
పరమపురుష నీ సరివారెవరు
నిరుపమానమగు నీయందమునకు
వరమునిగణమే పరవశించె నన

చిరుచిరు నగవులు చిందించుచు నా
హరచాపముచే నందెడు వేళను
మురిపించెడు నీ మోహనరూపము
నరసిన సర్వులు పరవశించి రన

పరిణయశుభవేళ కరమున ధరణిజ 
కరమును గైకొని కర మనురక్తిని 
వరమాలాధర హరి నీవొప్పగ
పురజనులందరు పరవశించి రన


హరినామము రుచి మఱగినచో


హరినామము రుచి మఱగినచో

మరి యితరములకు మనసగునా


హరిపూజనమున నభిరుచి కలిగిన

పరపూజలలో దరసేనా

హరికీర్తనమున నభిరుచి కలిగిన

పురవాసుల నిక పొగడేనా


హరిచరితముపై నభిరుచి కలిగిన

సరి సరి యన్యము చదివేనా

హరితత్త్వముపై నభిరుచి కలిగిన

పెఱతత్త్వము లిక తఱచేనా


హరి రాముడని యాత్మనెఱింగిన

పరుల మనసులో నఱసేనా

హరికన్యము లేదని తానెఱిగిన

మరి హరినామము మరచేనా

హరినామము రుచికర మగునా


హరినామము రుచికర మగునా

నరులందరకును నారాయణా


హరిగలడని తెలియని వారలకు

హరినామము రుచికర మగునా

హరితో పనిలే దనువారలకు

హరినామము రుచికర మగునా


హరి నితరులతో ననిశము పోల్చుచు

దురుసులు పలికే దురితాత్ములకు

నిరుపమానమై నెగడుచు నుండెడు

హరినామము రుచికర మగునా


పరమార్ధముతో పనిలేదనుకొను

నరులకు కుక్షింభరులగు వారికి

హరి రాముడని యవగత మగునా

హరినామము రుచికర మగునా

ఒక అనామకుడి వ్యాఖ్యావిన్యాసం.

కొన్ని గంటల క్రిందట ఈబ్లాగుకు కొన్ని వ్యాఖ్యలను ఎవరో అనామకుల వారు పంపారు వేరు వేరు టపాల క్రింద.

అవి ప్రచురణార్హం అనిపించక ప్రచురించక చెత్తబుట్టలో వేసాను.

ఐతే మన తెలుగు బ్లాగులోకంలో అనామకుల ధోరణి ఎలా ఉందో ఉంటుందో అందరికీ తెలిసిందే ఐనా మరొకసారి పాఠకులదృష్టికి తీసుకొని వద్దామని అనిపించి ఇక్కడ విడిగా ఒక టపాగా ఉంచుతున్నాను.


  1. మీరు బ్రహ్మాండమైన కవులు అనుకుంటున్నారా?? మీరు రాసేవి అద్భుతాలు అనేసుకుంటున్నరా?? పిచ్చి వాగుడు కట్టిపెట్టి నెత్తి కెక్కిన కళ్ళు కిందకు దించి చూడు. నువ్వు మామూలు మనిషివే..చిన్న పాటి కవివి కూడా కావు.
  2. దేవుని నిర్ణయం ప్రకారం కీర్తనలు పుడుతున్నాయి అని తెగ చెప్పుకోకు. ఎవరు ఏమి చేసినా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తాత గారు. కవిత, కథ రాసిన కూడా దైవ నిర్ణయం తోనే వారికి విషయం స్ఫురిస్తుంది. నువ్వు రాసేది దైవ నిర్ణయం, దేవుని కృప, పక్కవాడు రాసేది పేడ, పెంట. నువ్వు లోకాన్ని ఉద్దరించేవడవు. వేరొకరు పనికిమాలిన వారు. నీకు మాత్రమే తెలుసు దైవ నీతి, సాహిత్యం, పక్కవారికి ఏమీ తెలియదు. ఉత్త ఉబలటపడేవారు మాత్రమే. నీ కథలలో పస ఉందా? కీర్తనల అవి?? సంభాషణలు లాగ ఉన్నాయి, ఎగిరిపడింది చాలు, దిగు, నీ స్థాయి చిన్నది..రామదాసు అనుకోకు. నన్నయ్య తిక్కన సాహిత్యం అనుకోకు.
  3. కథలు అస్సలు బాగాలేవు. కీర్తనలు లో పస లేదు. ఫోన్ సంభాషణలు లాగ ఉన్నాయి. నువు రాసిన కవితలు నీకు మాత్రమే.. ఒక్కనీకు మాత్రమే..కేవలం నికే నచ్చి. నువ్వు తెగ ఫీలయి నీ దిక్కుమాలిన సాహిత్యం తో జనాలని వేదించడమే కాక, ప్రజల సాహిత్యం పై ఆరోపణలు కూడా చేస్తున్నావు. నీ అర్హత ఏమిటి? నువ్వు పీకింది ఏమిటి? ఎందులో గొప్ప నువ్వు అసలు. అక్షరం లో నైతే కావు. వయసులో ముసలోడివి అంతే..బుద్ధిలో చిన్న వాడవు
  4. నువ్వు ఎప్పుడు కవివి అవుతావు ఏడుపుగొట్టు తాత..అందరూ కవులు అయ్యారు అని విమర్శ ఏడుపు ఎందుకు? ప్రయత్నించు నువ్వు కూడా అవుతవేమో..మళ్ళా జన్మలో అవుదువులే..ఇప్పటి నీ రాతలకు సరస్వతి దేవి తలుపులు ముసేసుకుంది. ఇది నిజం తాత
  5. కవులు మయం అయ్యారా? నువ్వెప్పుడూ మయం అవుతావు.
  6. నువ్వు కవుల జాబితాలో ఉంటవనుకోకు. పోటు గాడి వి అనుకోకు. చేతకాని వాడివి


నాబ్లాగుకు అనామకుల తాకిడి తక్కువ. నిజానికి నాబ్లాగుకు వచ్చే వ్యాఖ్యలే తక్కువ.

ఇటువంటి వ్యాఖ్యలు రావటం అరుదు. 

పై  వ్యాఖ్యలలో పాటించబడిన సభ్యతాప్రమాణాలు ఎలా ఉనదీ పాఠకులు సులువుగానే గ్రహించగలరని అనుకుంటున్నాను. వాటిలోని భాషాదోషాలను గురించి ప్రస్తావించనవసరం లేదనుకుంటాను.


25, జనవరి 2024, గురువారం

ఇలపై నరుడు


ఎంత భాగ్యమును పొందు నిలపై నరుడు తా

నెంత పెట్టిపుట్టినా డంత భాగ్య ముండు


ఎంత ధర్మమును నెఱపు నిలపై నరుడు తా

నెంత సంస్కారపరు డంత గొప్ప గాను


ఎంత సౌఖ్యమును పొందు నిలపై నరుడు తా

నెంత పుణ్యమును భోగించవలయు నంత


ఎంత శోకమును పొందు నిలపై నరుడు తా

నెంత పాపమును భోగించవలయు నంత


ఎంత కాల ముండునో యిలపై నరుడు తా

నెంత కర్మమును భోగించవలయు నంత


ఎంత నామజపము చేయు నిలపై నరుడు తా

నెంత మున్ను చేసెనో యంతకంత గాను


ఎపుడు కర్మవిముఖుడగు నిలపై నరుడు తా

నెపుడు రామ రామ యను నపుడు విముఖు డగును


ఎపుడు రామ రామ యను నిలపై నరుడు రాము

డెపుడు కటాక్షించునో యపుడు పలుక నేర్చు




అడుగనయా ధనములను


అడుగనయా ధనములను అవి యేమి లాభము

బడయుటచే ధనములను పరమపదము కలదా


అడుగనయా పదవులను అవి యేమి లాభము

బడయుటచే పదవులను పరమపదము కలదా


అడుగనయా మొదవులను అవి యేమి లాభము

బడయుటచే మొదవులను పరమపదము కలదా


అడుగనయా చదువులను అవి యేమి లాభము

బడయుటచే చదువులను పరమపదము కలదా


అడుగనయా గృహములను అవి యేమి లాభము

బడయుటచే గృహములను పరమపదము కలదా


అడుగనయా పొలములను అవి యేమి లాభము

బడయుటచే పొలములను పరమపదము కలదా


అడుగనయా భోగములు అవి యేమి లాభము

బడయుటచే భోగములు పరమపదము కలదా


అడుగనయా బలగమును అది యేమి లాభము

బడయుటచే బలగమును పరమపదము కలదా


అడుగనయా విజయమును అది యేమి లాభము

బడయుటచే విజయమును పరమపదము కలదా


అడుగనయా సుఖములను అవి యేమి లాభము

బడయుటచే సుఖములను పరమపదము కలదా


అడుగనయా గౌరవము అది యేమి లాభము

బడయుటచే గౌరవము పరమపదము కలదా


అడుగనయా ప్రభుత్వము అది యేమి లాభము

బడయుటచే ప్రభుత్వము పరమపదము కలదా


అడుగనయా సత్కీర్తిని అది యేమి లాభము

బడయుటచే సత్కీర్తిని పరమపదము కలదా


అడుగనయా ఆయువును అది యేమి లాభము

బడయుటచే ఆయువును పరమపదము కలదా


అడుగుదురా నీనామము నది యొకటే లాభము

బడయుటచే నీనామము పరమపదము కలదు


అడుగడుగున నీనామము నుడువుటే లాభము

కడబట్టును భవదుఃఖము కలుగు పరమపదము


అందువలన హరేరామ యనుటనే యడుగుదును

వందనము రామచంద్ర వలదు వలదు మరేమియు



ఎంత సుఖము


ఎంత సుఖ మెంత సుఖ మెంత సుఖము భలే

వింత సంసా‌ర మిందెంత సుఖము


చింతలతో కునారిల్లు జీవితమై యుండగ

చింతా కంతైన లేదు జీవికి సుఖము


సంతతమును సొమ్ములకై సతమతమగు జీవున

కెంత మాత్రమును లే దెంచగ సుఖము


అంతులేని యాశలతో అశాంతితో నుండగ

చెంతచేర బోదండి జీవికి సుఖము


సంసతసముగ రామనామ జపము చేయు జీవికి అంతులేని దైయుండు నరయగ సుఖము


వదలక నన్నేలు వాడవు

వదలక నన్నేలు వాడవు నీవని

ముదమున నీపాదముల నుందును రామ


పదుగురు నిను గూర్చి పలుమార్లు పొగడగ

నది విని నీపైన నాసక్తి కలిగి నా

హృదయమున సద్భక్తి యుదయించినది రామ

వదలక రక్షించవయ్య నన్నిక దేవ


పదుగురు నీనామభజన చేయుచు నుండ

నది విని నతిశయమై రక్తి నాలోన

యుదయించె సద్భక్తి హృదయంబులో రామ

వదలక రక్షించవయ్య నన్నిక దేవ


పదుగురు భక్తులవలన బోధను పొంది

వదలి సంసారము పట్లమోహంబును

సదయ భక్తుడనైతి నిదె కనుము శ్రీరామ

వదలక రక్షించవయ్య నన్నిక దేవ




ఘనత యెట్టిదో


ఘనత యెట్టిదో జీవున కనగ వినుడీ మనసారా

విని రామునకు సద్భక్తులుగా మనుడీ జనులారా


శ్రీరఘురాముని నామామృతమును సేవించుటయే ఘనత

శ్రీరఘురాముని చిత్తశుద్ధితో సేవించుటయే ఘనత

శ్రీరఘురాముని నిజతత్త్వమ్మును చింతించుటయే ఘనత

శ్రీరఘురాముని భక్తజనులతో చేరియుండుటే ఘనత


శ్రీరఘురాముని కీర్తన మెపుడును చేయుచుండుటే ఘపత

శ్రీరఘురాముని నారాయణుడని యారయ గలుగుటె ఘనత

శ్రీరఘురాముని పాదాబ్జంబుల చేరియుండుటే ఘనత

శ్రీరఘురాముని కన్యదైవమును చింతింపనిదే ఘనత


శ్రీరఘురాముని ప్రాణాధికునిగ కూరిమి నెంచుటె ఘనత

శ్రీరఘురాముని తండ్రిగ నెంచుచు జీవించినదే ఘనత

శ్రీరఘురాముని కాత్మార్పణమును చేసినదేలే ఘనత

శ్రీరఘురాముని కరుణను బడసిన జీవునిదేలే ఘనత


24, జనవరి 2024, బుధవారం

రామభక్తుడే వాడు రామభక్తుడే


రామభక్తుడే వాడు రామభక్తుడే శ్రీ
రాముడు కరుణించదగిన లక్షణయుతుడే

రామ రామ రామ యనగ రామనామమును వినుచు
రామ రామ రామ యనగ రక్తి 
కలిగెనా 

రామనామ మాధుర్యము భూమి నపూర్వముగ దోచ
రామ రామ రామ యనగ రక్తి కలిగెనా 

రాముని రూపమ్ము నెంచి రాముని శాంతమ్ము నెంచి
రాముని సేవించుటకై రక్తి కలిగెనా 

రాముని సద్గుణము నెంచి రాముని సచ్చరిత మెంచి
రామునిపై 
సేవించుటకై రక్తి కలిగెనా 

రాముని సత్యమ్ము నెంచి రాముని సత్కరుణ నెంచి
రాముని చింతించుటలో రక్తి కలిగెనా 

రాముని తత్త్వమ్ము నెంచి రాముని ధర్మమ్ము నెంచి
రాముని చింతించుటలో రక్తి కలిగెనా


22, జనవరి 2024, సోమవారం

హరేరామ హరేరామ హరేరామ రామ

హరేరామ హరేరామ హరేరామ రామ 
పరాత్పర పరంధామ హరేసీతారామ 

నరాధీశ సాకేతపురాధీశ రామ 
పురవైరినుతనామ పూర్ణకామరామ  

తరణికులోత్తంసరామ దశరథరామ 
పరమహంసవినుతనామ పరంజ్యోతి రామ  

నిరామయ నిరీశ్వర నిరుపమగుణధామ 
పరంతప సురగణనుతపరాక్రమరామ  

అనాథనాథ శ్రీరామ అంబుజాక్షరామ 
మునిగణైకవినుతనామ మోక్షప్రదనామ

పసితనమే వదలనట్టి బాలరాముడు



పసితనమే వదలనట్టి బాలరాముడు చూడు

డసలుసిసలు అందగా డయోధ్యరాముడు


చాల మంచివాడండీ బాలరాముడు కైక

కేలు బట్టి నడచుచుండు బాలరాముడు

నీలమేఘశ్యాము డండి బాలరాముడు సుగుణ

శీలు డండి చిరునగవుల బాలరాముడు


చాల పెద్ద కన్నులున్న బాలరాముడు వీడు

మేలిమి బంగార మండి బాలరాముడు

మేలి ముద్దుమాటలాడు బాలరాముడు వీడు

నేల నున్న హరి యండీ బాలరాముడు 


పాలకుడగు దశరథునకు బాలరాముడు బుధ్ధి

శాలియైన పెద్దకొడుకు బాలరాముడు 

వాలాయముగా భువనము లేలువాడైన 

శ్రీలోలుడు నేడు మన బాలరాముడు

బాలుడై యున్నాడు బ్రహ్మజనకుడు


నీలమేఘశ్యాముడు లీలగా నైదేండ్ల

బాలుడై యున్నాడు బ్రహ్మజనకుడు


గుణములు తన్నంట నట్టి గొప్పవాడు దేవ

గణములు తనవెంట బడెడు కరుణామయుడు

రణముల తన కోడు దైత్యగణముల వాడు ఘన

ఫణిరాజు తనకు మెత్తని పరుపగు వాడు


యోగుల హృదయంబులందు నుండెడు వాడు దైత్యు

లాగడములు చేయుచుండ నడ్డెడు వాడు

భోగబుధ్ధులకు దొరుకబోవని వాడు మునుల

యాగంబుల కండయగుచు సాగెడు వాడు


రాముడై పుట్టి నాడు భూమిమీదను పరం

ధాముడు శుభలక్షణుడు దశరథసుతుడు

కామన లీడేర దేవగణములకు నేడు మా

యామానువేషుడైన ఆదివిష్ణువు



21, జనవరి 2024, ఆదివారం

యోగులు ధ్యానించు హరి యయోధ్యను నేడు


యోగులు ధ్యానించు హరి యయోధ్యను నేడు
పౌగండప్రాయుడాయె బాలరాముడై

ముగ్గురు మూర్తులుగ వెలుగు మొదటివేలుపు నేడు
ముగ్గురమ్మల కనువెలుగగు ముద్దులకొడుకై
ముగ్గురుతమ్ములను గూడి ముచ్చటగాను చాల
లగ్గగు వర్తనము వాడు రామచంద్రుడై

రాజునకు ప్రాణంబుగ విరాజిల్లుచును సకల
భూజనులుకు ప్రియతముడై పొలుపొందుచును
సౌజన్యమూర్తి సకలశుభలక్షణుడై వృధ్ధ
రాజునకు పెద్దకొడుకు రామచంద్రుడై 

దేవమానవాళి హితము భావన జేసి నేడు
భూవిభునకు జనియించిన ముద్దులకొడుకై
భూవలయము చేరి నాడు పురుషోత్తముడు రేపు
రావణుని ద్రుంచబోయెడు రామచంద్రుడై


ఎంతదాక సంసారం బెంతదాక


ఎంతదాక సంసారం బెంతదాక నాకు

వింతగొలుపు సంసారం బెంతదాక

హరి గలడని నీవెఱిగెడు నంతదాక నీవు
హరి దేవుండని యెఱిగెడు నంతదాక

హరిమీదను వలపుగలుగు నంతదాక నీకు
హరితలపులు నిత్యమగు నంతదాక

హరితత్త్వము నీవెఱిగెడు నంతదాక నీవు
హరిమార్గము నందు నడచు నంతదాక

హరినామము నోటి కబ్బునంత దాక నీకు
హరినామపు రుచి తెలియు నంతదాక

హరినామమె ముఖ్య మగు నంతదాక నీకు
హరినామము లోక మగు నంతదాక

హరియె నీకు సర్వమగు నంతదాక నీకు
హరికన్యము లేకపోవు నంతదాక

హరేరామ యని పలికెడు నంతదాక నీవు
హరేకృష్ణ యని పలికెడు నంతదాక

హరి పట్లను భక్తినిలుచు నంతదాక నీవు
హరిపాదము లాశ్రయించు నంతదాక


20, జనవరి 2024, శనివారం

కరుణించరా రాముడా

కరుణించరా రాముడా కమలాక్ష నేడే నీ
కరుణకై యుగములుగా వేచియుంటిని

కరుణించ మంటేను కరుణించవు నీవు
కరుణించక నన్ను కరుణింతు రింకెవరు
కరుణామయుడవన్నబిరుదంబు గైకొని
కరుణచూపించక కడుబిగిసియున్నావు

కరుణతో జగముల కడుదక్షడవు నీవు
పరిపాలనము జేయు పక్షంబున భక్త
పరిపాలనము జేయ భావించక నీదు
కరుణ దాచుక యున్న మరియేమి చెప్పేది

కరుణతో కరినేలి ఘనకీర్తి గాంచితివి
కరుణతో ప్రహ్లాదవరదుడ వైనావు
కరుణతో నెందరిని కాపాడి యుండియును
కరుణతో నన్నేల కదలి రాకున్నావు


హరేరామ వైకుంఠపురాధీశ్వర



హరేరామ వైకుంఠపురాధీశ్వర

పరాత్పర ధరణిజావర రాఘవ


సురసన్నుత మునిసన్నుత నరసన్నుత రాఘవ

పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం హరి


కరివరద హరివరద గిరివరద రాఘవ

కరుణామయ సుగుణాలయ పరిపాలయ మాం హరి


తాపాంతక శాపాంతక చాపాంతక రాఘవ

పాపాంతక దనుజాంతక పరిపాలయ మాం హరి


అరిభీకర జగదీశ్వర  అత్మేశ్వర రాఘవ

పరమేశ్వర మనుజేశ్వర పరిపాలయ మాం హరి