ఆధ్యాత్మిక వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మిక వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2023, సోమవారం

వసుధైక కుటుంబకమ్ vs వసుధైక కుటుంబం

ఈరోజున విన్నకోట నరసింహారావు గారు స్మరణ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినంతవరకు సమాధానం వ్రాస్తున్నాను.

అన్నట్లు నరసింహారావు గారు ఆప్రశ్నను నాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించారు. 
మంచి ప్రశ్న వేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు.

మహోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఉంది సమాధానం,
అందులోని ఈ మంత్రాన్ని చిత్తగించండి.

అయం బంధు రయం నేతి గణనా లఘుచేతసామ్ । 
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్ ॥ ౭౧॥

ఈ మంత్రం మహోపనిషత్తులో ఆరవ అధ్యాయంలోని 71వ శ్లోకంగా ఉంది. ఉపనిషత్తు కాబట్టి మంత్రం అనాలి ఛందస్సు ప్రకారం ఇది అనుష్టుప్పు. ఒక శ్లోకం.

ఇక్కడ వసుధైవ కుటుంబకమ్ అన్నపాఠం ఉంది. వసుధైక కుటుంబకమ్ అన్న పాఠం కూడా ప్రచారంలో  ఉంది. ఈపాఠం కూడా ఛందస్సుకు చక్కగా సరిపోతున్నది. అర్ధంలోనూ కించిత్తు బేధం కూడా లేదు. కాబట్టి ఏపాఠం ఐనా ఆమోదయోగ్యమే.

ఈ మంత్రం చెబుతున్న విషయం చాలా ఉదాత్తంగా ఉంది. చిత్తగించండి. వీడు నావాడు నాబంధువు - వాడు పరాయివాడు వంటి భావన అల్పబుధ్ధి కలవారు చేసేది. ఉదారమైన మనస్సు కల సజ్జనులకు ప్రపంచం అంతా ఒకే కుటుంబం. ఇదీ ఈమంత్రం చెప్పే మాట.

ఐతే ఎలా వచ్చిందో ప్రచారంలోనికి వసుధైక కుటుంబం ప్రయోగం స్పష్టంగా తెలియదు. కాని అది పొరపాటు వాడుక. ఆ ప్రయోగం అనుష్టుప్పును భంగపరుస్తున్నది. ఆమోదయోగ్యం కాదు. ఉపనిషత్పాఠం స్పష్టంగానే ఉంది.

ఈ మహోపనిషత్తును చదువదలచుకొన్న వారికి ఇది ఇంటర్నెట్లో సులభంగానే లభిస్తున్నది.  దిగుమతి చేసుకోదలచుకున్న వారు https://sanskritdocuments.org/doc_upanishhat/maha-te.pdf అన్న లింక్ ద్వారా సేకరించుకోవచ్చును. పాఠం తెలుగులిపిలోనే ఉంది. ఐతే అంతా మూలపాఠమే కాని వ్యాఖ్యానం ఏమీ అక్కడ లేదు.

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయట!

హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయట

ఈయనెవరో తులసీ పీఠాధిపతి, జగద్గురువులు రామభద్రాచార్య అట అలా అంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు పై లింక్ తెరిచి చదువుకోండి.

నాకు ఆసక్తి లేదు!

ఈయనెవరు? గోస్వామి తులసీదాసు గారి కన్నా పాండిత్యంలో అధికుడా? భక్తితత్పరతలో అధికుడా? కవిత్వశక్తిలో అధికుడా? జ్ఞానసంపదలో అధికుడా? వినయశీలంలో అధికుడా?

ఎందుకు ఈయన మాటలు వినటానికి ఆసక్తి చూపాలి మనం?

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అన్నట్లు అల్పప్రజ్ఞ కలవారు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది లోకరీతి. అందుకు చిరాకుపడటం తప్ప ఏమీ చేయలేం.

ఇటువంటి వారు ఏమన్నారూ ఎందుకన్నారూ అంటూ నాకున్న విలువైన సమయాన్ని వృథాచేసుకోలేను. నాకు సమయం దొరకేదే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చివరకు రాములవారి మీద ఒక కీర్తనను గ్రంథస్థం చేసుకోవాలన్నా సమయం దొరకటం దుర్లభంగా ఉంది. అందుచేత నవ్వుకొని ప్రక్కకు నెట్టివేయటం మించి వీళ్ళను గురించి పట్టించుకోను. మీరూ పట్టించుకోవద్దు, వీలుంటే మీరూ అసమయాన్ని భగవన్నామానికి వెచ్చించండి. అది మంచిపని.

ఒక్క విషయం చెబుతాను. తులసీదాసు రామాయణం రచిస్తూ ఉంటే వినటానికి ఎందరో వచ్చేవారట. ఒకనాడు అయన అశోకవనంలో హనుమంతుడు కొలనులో ఉన్న తెల్ల తామరలను చూసాడు అని చెప్తే ఒకాయన లేచి తెల్లతామరలు కావయ్యా అవి ఎఱ్ఱతామరలు అని లడాయి వేసుకున్నాడు. తెల్లవే - రాముడు నాచేత అసత్యం వ్రాయించడు అంటారు దాసుగారు. ఈపెద్దమనిషి నేను హనుమంతుడినయ్యా - చూసిన నాకు తెలియదా అని గర్జించాడు. చివరకు ఇద్దరూ స్మరిస్తే వాల్మీకి ప్రత్యక్షమై అవి తెల్లతామరలే హనుమా, నీవు క్రోథావేశంలో ఎఱ్ఱని కండ్లతో అంతా ఎరుపుమయంగా చూసావు అని చెప్పాడట. అదీ దాసుగారంటే.

ఇప్పుడు ఎవరెవరో వచ్చి వాల్మీకి తప్పులూ తులసీదాసు తప్పులూ వ్యాసులవారి తప్పులూ అంటూ నోటికి వచ్చింది మాట్లాడటం మొదలు పెడితే శుష్కతర్కవితర్కాలతో సమయం వారి కోసం వృథా చేసుకోవలసిన అగత్యం లేదు.

ఈరోజుల్లో జగద్గురువులమని వీధికిద్దరు కనిపిస్తున్నారు! గురువులకు లెక్కేలేదు. చివరకు బ్లాగుప్రపంచంలో కూడా జ్ఞానాహంకారులు కనిపిస్తున్నారు అదృష్టవంతులైన శిష్యులను ఆహ్వానిస్తూ.

దయచేసి భక్తమహాశయులు ఎవ్వరూ ఇల్లాంటి చిలిపి గొడవలను పట్టించుకోవద్దని మనవి.

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఆంధ్రయోగీంద్రులు అవధూత వ్యాసమూర్తి సిధ్ధాంతి గారి జోస్యం కరోనా గురించేనా?

 
శ్రీ బి. రామరాజు గారు తమ కుమార్తె రుక్మిణి సహాయంతో ఆంధ్రయోగులు అనేకమందిని గురించి సమగ్రమైన పరిశోధన చేసి"ఆంధ్రయోగులు" అన్న ఆరు సంపుటాల ఉద్గ్రంథాన్ని రచించారు. అది చాలా ప్రసిధ్ధి చెందింది.

అంధ్రయోగులు గ్రంథంలోని మూడవ సంపుటంలో శ్రీ అవధూత వ్యాసమూర్తి సిధ్ధాంతి గారి గురించిన వ్యాసం ఉంది. అది ఆసంపుటిలో‌24వ వ్యాసంగా ఉంది. 183వ పేజీ నుండి 189వ పేజీ వరకూ ఆ వ్యాసం విస్తరించి కనిపిస్తున్నది. ఈ సంపుటం 2004లో ప్రచురించబడింది.

వ్యాసమూర్తి గారి గురించిన ఆ వ్యాసంలోని ఒక సంగతి శ్యామలీయం పాఠకులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ చిరు వ్యాసం వ్రాస్తున్నాను.

వ్యాసమూర్తి గారి 1888 - 1998 మధ్యకాలంలో జీవించిన ఆంధ్రయోగీంద్రులు.

సంపుటిలోని 187వ పేజీలో ఉన్న వాక్యం "క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అని. ప్రస్తుతం ప్రపంచ జనభా 790కోట్లు అంటే అందులో మూడవవంతు 264కోట్లు! చాలా చాలా భయంకరమైన పెద్దసంఖ్య!

విశ్వహిందు మాసపత్రిక భావిభారతభాగ్యోదయం శీర్షికతో జూలై-ఆగష్టు 1999 సంచికలో రావు గారి వ్యాసం అని కుండలీకరణాల్లో పేర్కొన్నారు.  రావు గారు ఎవరన్న దానికి సమాధానం వ్యాసంలో 186 వపేజీలోనూ, చివర ఆధారాలలోనూ వివరం ఇచ్చారు - వారు వ్యాసమూర్తి గారి అనుగు శిష్యుడైన వెదురుమూడి వాసి చింతలూరి వేంకట రామమోహన రావు గారు. 

ఈ పైన నేను పేర్కొన్న వాక్యం ఉన్న సందర్భంలో వ్యాసమూర్తి గారి కాలజ్ఞానం రావు గారి ప్రసక్తితో మొదలై ఒక దాక్షిణాత్య స్త్రీ సహాయంతో వాజపేయీ గారి ప్రభుత్వం ఏర్పడటమూ అది 11 నెలలకే ఆ దాక్షిణాత్య స్త్రీ సహాయనిరాకరణతో కూలిపోవటమూ తిరిగి అధికారం చేపట్టి 15 సంవత్సరాలు పరిపాలించటమూ అన్న విషయాలను ప్రస్తావించి తరువాత క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అన్న ఆశ్చర్యకరమైన వాక్యం వస్తుంది.

ఇక్కడ ఆలోచనీయమైన అంశం ఏమిటంటే వ్యాసమూర్తి గారు చెప్పిన జోస్యం ఈకరోనా విలయం గురించేనా అన్నది. ఒక వేళ ఈ మహావిలయంలో కరోనా అన్నది మొదటి అధ్యాయం కాదుకదా అన్న శంక కూడా కలుగుతోంది.

ఐతే క్రమంగా ప్రపంచజనభా తగ్గటం 2000 నాటినుండీ మొదలు కావచ్చును కదా అన్న విషయం కూడా మనం ఆలోచించాలి. ఇలా జరగటానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవిధంగా ఏమీ జనవిలయం ఉండకపోవచ్చును అనుకోవచ్చును.


11, ఫిబ్రవరి 2021, గురువారం

మంత్రాలకు లెక్కలూ‌డొక్కలూ‌ అంటే ఏమిటి?

ఈ మధ్యన లెక్కలు డొక్కలు నెందుకు అన్న కీర్తన వెలువరించాను. దాని గురించిన ప్రశ్న ఒకటి విన్నకోట నరసింహారావు గారు అడిగారు, రామకోటి గురించా అని.  క్లుప్తంగా వివరిద్దాం అంటే అది కాస్తా పెరిగి ఒక వ్యాసం ఐపోయింది.

మంత్రానుష్ఠానవిధానం అని ఒకటి ఉంటుందండి. వీలైతే ఎప్పుడన్నా దాన్ని స్పృశిస్తాను. ముఖ్యంగా మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలసార్లు ఆ మంత్రాన్ని జపం చేయటం అన్న లె ఒకటి ప్రముఖంగా పునశ్చరణ అన్న పేరుతో చాలా అవసరంగా భావించబడుతూ ఉంటుంది.

ఈ లెక్కను సరిగా నిర్వహించేందుకు గాను సాధకులు వ్రేళ్ళకణుపులనూ, జపమాలలోని పూసలను లెక్కిస్తూ ఉంటారు. మళ్ళా ఇందులో ఎలా లెక్కిస్తే (బతటకు ఉఛ్ఛరించటం, పెదవులు మాత్రం మౌనంగా కదపటం, మనస్సులోనే జపించటం వగైరా) అది సరైన విధానమూ అన్న చర్చ కూడా ఉంది. మరలా ఈ పురశ్చరణలో భాగంగా తర్పణము,హోమము, మార్జనము, బ్రాహ్మణభోజనమూ అన్న ఉపాంగాలుంటాయి. మరలా జపం చేసేందుకు శుచి, అహార్యము, స్థానము, ఆసనము, మౌనము వగైరా ఉపాంగాలుంటాయి. కొన్ని కొన్ని మంత్రాలకు జపాత్పూర్వం సంస్కారం అన్న క్రియాకలాపం ఉంటుంది. ఇవన్నీ నిర్వహించేందుకు విధివిధానాలూ లెక్కలూ ఉన్నాయి. వాటిలో‌ మళ్ళా ప్రత్యామ్నాయాల లెక్కలూ ఉన్నాయి.  ఈ వ్యవహారం అంతా ఉపదేశం పొందిన మంత్రానికి అనుష్ఠానం చేయటానికి అవసరం అని సంప్రదాయం.

ఇది కాక మీరన్నట్లు మనబోటి సామాన్యులకు రామకోటి వంటివి వ్రాయటం అన్న సులభోపాయం‌ ఉందనే ఉంది. మంత్రంలోని అక్షరాల సంఖ్యతో నిమిత్తం లేకుండా మంత్రాన్ని స్మరిస్తూ కోటిసార్లు దాన్ని లిఖించటం అన్నది దాని విధి. సంప్రదాయికం కేవలం రామకోటి మాత్రమే. ఆధునిక ప్రయోగంగా ఏ యిష్టదైవం నామం ఐనా కోటిలేఖనం చేయటం అన్నది ఈమధ్య పుట్టుకొని వచ్చింది.

ఇదంతా ఎందుకూ‌ అంటే మనస్సుకు మంత్రం మీద గురి కుదిరేందుకు గాను భక్తితో నిష్ఠగా చేయటం అన్నది విధానంగా ఏర్పరచినట్లు తోస్తున్నది.  పూర్వం స్వయంగా కొందరు ఉపాసకులు ఈమత్రం ఎన్నిలక్షలు చేయాలీ రోజుకు ఎన్ని వేలూ ఆలా ఎన్నేళ్ళూ అంటూ లెక్కలు వేయటం చూసాను. వారి దృష్టి అంతా అసలు మంత్రం మీద కన్నా లెక్కలు సరిగా నిర్వహించటం మీదే ఉండే ప్రమాదం ఎంతైనా లేదా?

శ్రీమధ్భాగవతంలో ద్వితీయసస్కంధంలో ఒకానొక ఖట్వాంగుడనే రాజుగారి కథ వస్తుంది. ఇంద్రుడు కోరితే, ఆయన దేవతల పక్షాన రాక్షసులతో పోరాడాడు. దేవాసురసంగ్రామం ముగిసి దేవతలు గెలిచారు. అప్పుడు ఇంద్రదేవుడు ఆనందంగా రాజుగారూ, మీరు వరం కోరుకోవాలీ అన్నారు. ఆయనేమో అన్నాడూ దేవరాజా, నాకెంత ఆయుర్దాయం మిగిలి ఉందో చెప్పండి చాలు అన్నాడు. దేవతలు ఆశ్చర్యపోయీరు. సరే లెక్కచూసి అయ్యో రాజుగారూ మీకు ఇంకొక్క ముహూర్తం మాత్రమే ఆయువు మిగిలి ఉందీ అన్నారు. ముహూర్తం అంటే రెండు ఘడియలు (అంటే 2x24=48ని.) వెంటనే భూలోకానికి వచ్చి సర్వం తక్షణం త్యజించి, ఈ స్వల్పకాలం లోనే ఆ ఖట్వాంగ చక్రవర్తి గోవింద నామస్మరణ త్రికరణశుథ్థిగా చేసాడు. ఆ నామ ప్రభావంతో ఆయన మోక్షం సంపాదించుకున్నాడు.

అందుచేత త్రికరణశుధ్ధిగా భగవంతుడి యందు మనస్సు నిలపటం ముఖ్యం కాని లెక్కలూ డొక్కలూ ఏమాత్రమూ ముఖ్యం కావని వ్రాసాను కీర్తనలో.

సకల వేదశాస్త్రాలూ వాటి అద్యయనాదులూ కేవలం‌ మనశ్శుధ్ధిని సంతరించుకొనేందుకు మాత్రమే అని పెద్దల నుడి.  ముల్లును ముల్లుతో‌ తొలగించి రెండు ముళ్ళూ విసిరి వేయాలీ అన్నట్లుగా ధ్యేయం ఐన మనశ్శుధ్ధిని సాధించి చిత్తం భగవదధీనం చేయటం మీద దృష్టి ఉండాలి కాని ఈ ఉపకరణాల యొక్కా లెక్కల యొక్కా గడబిడల్లో చిక్కుకోకూడదు.

ఈరోజు ఎంత సేపు రామనామం చేసానూ? మొన్న గడియారం సహాయంతో‌ లెక్కిస్తే, నిముషానికి ఎన్నిసార్లు అని లెక్కకు వచ్చిందీ. ఇలా ఐతే‌ నెలకు ఎంత? ఏడాదికి ఎంత? ఇలాంటి లెక్కల్లో పడి రాముడి మీద కాక లెక్కమీదనే దృష్టి ఆగిపోతే నామజపం వృధా అవుతున్నది. ఈ సంగతిని విశదం చేయటమే ఈ‌కీర్తన ఉద్దేశం.

31, జనవరి 2021, ఆదివారం

విగ్రహారాథన గురించి ....

ప్రపంచంలో అనేకరకాల మనుష్యు లుంటారు. అందుచేత ఏవిషయంలో ఐనా అందరి అభిప్రాయాలూ ఒకే విధంగా ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప వేరువేరుగా ఉంటే అందులో విశేషం ఏమీ లేదు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఎంతో‌కాలంగా కలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తలూ వారి ఇద్దరు బిడ్దలూ అనుకుందా వారు, ఆ నలుగురి అభిప్రాయాల్లోనూ ఎన్నో విషయాల్లో విబేధాలుంటాయా ఉండవా? భర్తకు నలుపురంగు దుస్తులంటే ఇష్టం ఐతే ఇల్లాలికి తెలుపురంగు హుందాగా ఉంటుందీ అదే‌ మంచిరంగూ అని అభిప్రాయం. కూతురికి పింక్ రంగు ప్రాణం ఐతే కొడుక్కి ఆ రంగంటే అసహ్యం కావచ్చును. అమ్మకు ఏదో‌ బాబామీద భక్తి ఐతే గృహమేథిగారికి వేంకటేశ్వర స్వామితప్ప మరొక దైవం నచ్చడు. కొడుక్కి గణపతి మీద గురి ఐతే కూతురికి శ్రీకృష్ణభక్తి మెండు.అమ్మ కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటే వాడేమో‌ మంచి చిత్రకారుణ్ణి కావాలని కృషిచేస్తూ ఉంటాడు. ఇలా సవాలక్ష భిన్నాభిప్రాయాలుంటాయి. కాని అందరూ కలిసే ఉంటారు. సంతోషంగా ఒక కప్పుకింద కలిసి నివసిస్తూనే ఉంటారు.  ఒక రకంగా ఆలోచిస్తే దేశం అంతా కూడా ఒక కుటుంబం లాంటిదే. ఐతే అది చాలా పెద్ద కుటుంబం. మరి ఈ‌పెద్దకుటుంబంలో ప్రతి చిన్నాపెద్దా విషయం మీదా అందరూ ఎందుకు కలహించుకొని ద్వేషవిషాగ్నికణాలు మిన్నంటేలా ఎగదోస్తున్నారో‌ నాకు బోధపడటం లేదు. ఒక ముఖ్య కారణం రాజకీయభూతం అనుకుంటే మరొకటి మతవిద్వేషభూతం అనుకుంటున్నాను.

రాజకీయమైన అభిప్రాయబేధాలు పీకలుకోసుకొనే స్థాయిలో ఉండటానికి కారణం రాజకీయం అనేది సమాజశ్రేయస్సుకు తోడ్పడే సాధనంగా కాక స్వార్ధపరశక్తులకు అవకాశరంగంగా మారటమే.

ప్రపంచంలో అందరూ తీవ్రంగా విబేధించి కొట్టుకొని చచ్చే మరొక విషయం ఏదన్నా ఉందంటే అది ఒక్క మతం మాత్రమే. నిజానికి మతం అంటే అభిప్రాయం అనే అర్ధం. కాని రూఢంగా అథ్యాత్మికభావనగా లేదా అథ్యాత్మికజీవనవిధానంగా అది స్థిరపడిపోయింది.

ఈ వ్యాసం ఈరెండు సమస్యలను గురించీ‌ చర్చించటం కోసం ఉద్దేశించినది కాదు. మతదురభిమానం అనేది వెఱ్ఱితలలు వేసి మనుషులు కొట్టుకొని చచ్చేందుకు దారితీస్తున్న నేటి పరిస్థితుల్లో ఈనాటి విగ్రహవిద్వంస కార్యక్రమం పుణ్యమా అని రంగప్రవేశం చేసి ముందుకు వచ్చి నిలబడ్డ విగ్రహారాథన అన్న అంశం గురించి నా అభిప్రాయం వ్రాయటానికి మాత్రమే ఉద్దేశించిన వ్యాసం ఇది.

ఈసాయంత్రం మా మామయ్య గారు శ్రీప్రసాద్ ఆత్రేయ కవి గారు ఫోన్ చేసి ఈవిషయం ఎత్తారు. నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఆయన ఫోన్ చేసారు. కాని చిక్కేమిటంటే నా అభిప్రాయం ఒక్క వాక్యం ఐనా మాట్లాడానో‌ లేదో ఆయన అడ్డు తగిలి ప్రశ్నలు వేయటం‌ మొదలుపెట్టారు. ఎన్ని సార్లు ఎలా ప్రయత్నించినా నేను ఒకటి రెండు వాక్యాలైనా పూర్తిగా చెప్పే వీలు కుదరలేదు. ఇంతలో ఫోన్ కాల్ కాస్తా భగవంతుడు కట్ చేసిపారేసాడు.

మరలా ఆయన ఈ ప్రసక్తి తీసుకొని వస్తే కూడా సీన్ రిపీట్ అవటం‌ తప్ప చర్చ ముందుకు జరిగేది ఏమీ‌ కనిపించటం లేదు. అందుకని అయన కోసం ఈవ్యాసం వ్రాయటం జరుతుతోంది. సరే ఎలాగూ వ్రాస్తున్నాను కదా, అది అందరూ చదవటం మంచిదేగా అని నేరుగా బ్లాగులోనే వ్రాస్తున్నాను, ఆయనకు ఒక జాబు క్రింద వ్రాయకుండా.

ఇదీ ఈవ్యాసం నేపథ్యం. ఇంక నేరుగా విషయం లోనికి వెళ్తాను.

చిన్నప్పుడు బళ్ళో పంతులు గారు 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే వాళ్ళం. ఇప్పుడూ బళ్ళలో అలాగే నేర్పుతున్నారో‌ లేదో‌ తెలియదు. అంకెలూ‌ అక్షరాలూ నేర్చుకుంటున్న పిల్లవాళ్ళు అలా వేళ్ళ మీద లెక్కవేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది కాని పదో తరగతి పిల్లవాడు కూడా అలాగే 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేయటం‌ మొదలుపెడితే ఎలా ఉంటుంది చూసే వాళ్ళకు?

లెక్కల్లో అది ఎలాగైతే పిల్లవాడి వయస్సునూ‌ అనుభవాన్ని బట్టి మనం ఒక స్థాయిని సహజం అనుకుంటామో అలాగే అనేకానేక రంగాల్లో కూడా విషయం గ్రహించటం, అభ్యాసం వంటివి క్రమపరిణామంగానే ఉంటాయి.

చంటిపిల్లవాడికి 5 + 3 ఎంత అంటే ఎదురుగా ప్రత్యక్షంగా వేళ్ళ రూపంలోనో కాగితం మీద ఒకట్ల రూపంలోనో‌ ఒక ప్రతీకాత్మకమైన లక్షవస్తువులు కనిపిస్తుంటే వాడికి లెక్కపెట్టటం సుళువుగా ఉంటుంది. ఒక స్థాయికి వచ్చాక ఆలాంటి అవసరం ఉండదు.

ఆరాథనావిధానం కూడా అలాంటి ప్రతీకలతో కూడి ఉంటుంది ప్రాథమికస్థాయిలో.నిజానికి ప్రతీకలు మారుతాయి కాని తగినంత ఉన్నతమైన స్థాయిని చేరుకొనే వరకూ ఏదో విధమైన ప్రతీకల అవసరం లేనిదే‌ లక్ష్యం పైన గురి కుదరటం సాధారణ సాధకులకు చాలా చాలా కష్టం.

లక్ష్యం పైన చిత్తానికి విశుధ్ధిగా గురి కుదరటానికి చేసే సాధనలో భావనాభాగానికే‌ మనం సాధారణీకరించి శ్రధ్ధ అనీ భక్తి అని పేర్లు పెడుతున్నాం. లక్ష్యం ఒక శాస్త్రం ఐతే ఆ పేరు శ్రధ్ధ. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ఆ పేరు భక్తి.

లక్ష్యం ఒక శాస్త్రం ఐతే అక్కడ ప్రతీకలు శాస్త్రగ్రంథాలు. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ప్రతీకలు భగవన్మూర్తులు.

శాస్త్రం‌ బాగా ఒంటబట్టిన వానికి శాస్త్రగ్రంథాలతో పని లేదు. వారు గ్రంథాలను తృణికరించరు. వాటిని గౌరవంగానే చూస్తారు. శిష్యులకు అవి బోధిస్తారు కూడా. కాని వారికి స్వయంగా అవి అవసరం కావింక. ఎందుకంటే శాస్త్రవిషయంలో వారికి అధికారం సిధ్ధించింది కాబట్టి.

శుద్దరూపంలో భగవత్తత్త్వానికి బ్రహ్మము అని సంకేతం. వివిధ దేవతామూర్తి స్వరూపస్వభావాలు అన్నీ ఆ బ్రహ్మము యొక్క ప్రతీకలే. ఏ‌ ప్రతీకను ఆధారం చేసుకొని చిత్తశుధ్దిగా ఉపాసన చేసినా వారికి అంతిమంగా కలిగేది ఒకటే విధమైన తత్త్వజ్ఞానం.  ప్రతీకలను ఆధారం చేసుకొని ఉపాసన చేయటం సగుణోపాసన అని చెప్తారు. ఆ స్థాయిని ధాటి తత్త్వజ్ఞానం పరిపూర్ణంగా సిధ్ధించిన పిదప వారు చేసే ఉపాసన నిర్గుణోపాసన. కేవలం విశుధ్ధబ్రహ్మోపాసన.

ఏకంగా పరబ్రహ్మతత్త్వాన్ని ఉపాసన చేయవచ్చును కదా మధ్యలో రాముడూ శివుడు అంటూ ప్రతీకలను ఉపాసించటం ద్వారా సమయం ఎందుకు వృధాచేయటం అని బుధ్ధిమంతులు ప్రశ్నిస్తూ ఉంటారు. అది సాధ్యమా అన్నది అలోచించాలి ముందు.

అక్షరాలూ అంకెలూ అన్నీ బాగా వచ్చిన తరువాత కుర్రవాడికి ఏకంగా డిగ్రీ గణితం చెప్పవచ్చును కదా, ఎందుకండీ ఏళ్ళతరబడీ చిల్లరమల్లర గణితవిషయాలు చెప్తూ విలువైన కాలం వృధాచేస్తున్నారూ అని అడిగితే ఏమి జవాబు చెప్తారు?

తగిన పరిణతి రాకుండా ఏకంగా డిగ్రీ గణితం ఎలా గండీ వాడికి అర్ధం అవుతుందీ అంటున్నారా? చిత్తం. అంతేనండి. అలాగే తగిన పరిణతి రాకుండానే నిర్గుణబ్రహ్మోపాసన అన్నది అసాధ్యం అండి.

ఎల్లాగైతే పిల్లలు ఎదిగే క్రమంలో వేళ్ళమీద లెక్కలు వేయటం సహజంగానే మాని వేస్తారో అలాగే ఉపాసనాక్రమంలో పరిణతి వచ్చిన తరువాత సాధకులు ప్రతికల మీద ఆధారపడవలసిన అవసరం దాటి ముందుకు వెళ్తారు.

మీరు మీ‌వేళ్ళ మీద లెక్కలు కట్టటం లేదు. పెద్దవారైపోయారు కదండీ‌ పాపం. కాని మీ బుల్లి అబ్భాయో అమ్మాయో మీరు కాని 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే చెప్తుంటే ఎంతో ముచ్చట పడుతూ చూస్తారు కదా? కొంపదీసి చీచీ అలా వేళ్ళ మీద లెక్కెట్ట కూడదు దరిద్రం అని తిట్టరు కదా?

అలాగే నిర్గుణోపాసన స్థితికి వచ్చిన సాధకులు కూడా ఇంకా సగుణోపాసనలో ఉన్న వారిని చూసి వెక్కిరించరు. అందరూ ఒకే‌ పరిణతి కలిగి ఉండరు కదా అని వాళ్ళకు తెలుసు. అందుకే వారికి ఆ సగుణోపాసనలో తగినవిధంగా ప్రోత్సహిస్తారు. భయం లేదు, వాళ్ళు కూడా క్రమంగా పరిణతి సాధిస్తారు.

మీ‌ చిట్టితండ్రి లెక్కల పుస్తకంలో ఎన్నో ఇల్లా ఒకట్లు వేసి చేసిన కూడికలూ వగైరాలున్నాయి కదా. ఎవరన్నా దౌర్జన్యంగా ఆపుస్తకాన్ని లాగికొని చించివేస్తేనో, లేదా దొంగిలించితేనో వాడికి బోలెడు దుఃఖం వస్తుంది కదా. చెప్పండి వస్తుందా రాదా? ఆ పుస్తకం మీకు విలువైనది కాకపోవచ్చును. మీ చిట్టితండ్రికి ఎంతో విలువైన పుస్తకం కాదా? అది కాస్తా ఇలా ఐనది అని వాడికి దుఃఖం వస్తే, అలా దుఃఖం తెప్పించిన వాడి మీద మీకు కోపం వస్తుందా రాదా?  బోడి పుస్తకం, పోతే పోయిందిలే, నిజానికి లెక్కలు అలా ఎవరూ చేయరు అంటూ మీ‌పిల్లవాడి మీద చిందులు వేయరు కదా.

యూనివర్శిటీలో ఖగోళశాస్త్రం చదివుకొనే‌ యువకుడికి వాళ్ళ తాతగారి కాలం నాటి జ్యోతిషగ్రంధం వట్టి చెత్తగా తోచవచ్చును. ముందుముందు కాలంలో ఆ యువకుడి కొడుకు డాక్టరు చదువువెలిగిస్తూ తండ్రిగారి కలెక్షన్‌లో ఉన్న ఆస్ట్రనామిలల్ ఆల్మనాక్ వగైరా ఖగోళ శాస్త్రం పుస్తకాలను చెత్తచెదారం అనుకోవచ్చును. ఈ అనుకోవటాలు మనమన వికారాలే‌ కాని ఆ పుస్తకాల లక్షణాలు కావు. అందుచేత మన బుధ్ధుల్లో కొంచెం సంయమనం చాలా అవసరం.

ఈవిధమైన సంయమనం లోపించటం అంత మంచి సంస్కారం కాదు. భగవద్గీత గొప్ప పుస్తకం ఐనట్లే‌ బైబుల్ కూడా అని అనుకోవాలి. అండ్ వైస్ వెర్సా. కృష్ణుణ్ణి గౌరవించుతాను, జీసస్ అంటే నాకు కిట్టదు అనకూడదు. అండ్ వైస్ వెర్సా.

సనాతనధర్మంలో ఓం కారాదులు శబ్దప్రతీకలైలట్లే, రామకృష్ణాది స్వరూపాలు విగ్రహప్రతీకలు. క్రైస్తవంలో శిలువ ఒక ప్రతీక, మేరీమాత కూడా ఒక ప్రతీకాత్మక వ్యక్తియే. రాముడు అని ఒక ప్రతీకను ఒకడు ఉపాసనాసాధనంగా గౌరవించుకోవటాన్ని ఆక్షేపించే క్రైస్తవుల్లో అందరూ శిలువను మెడలో వేసుకుంటున్నారు కదా? రెండూ ప్రతీకలే. రెండూ - బండగా చెప్పాలంటే - విగ్రహారాథనలే. అందరూ కొంచెం ఆలోచించి చూడండి.

ఇస్లాం‌ కూడా విగ్రహారాథనకు తీవ్రంగా వ్యతిరేకం అంటారు. మంచిది. ప్రవక్త మదీనాకు ప్రవాసం వెళ్ళటం అనే థీమ్‌ను సూచించే కాలెండర్ బొమ్మలు కనిపిస్తున్నాయా లేదా? వారు చంద్రవంకనూ‌ ఆకుపచ్చరంగునూ తమ సాధనలో ప్రతీకలుగా గ్రహించారాలేదా?

ప్రతీక అంటే అది శబ్దం‌ కావచ్చును. ఒక రూపం కావచ్చును. ఒక వర్ణం కావచ్చును. ఒక స్థలం కావచ్చును. ఒక కాలనియమాది వ్యవహారం కావచ్చును. అన్నీ ప్రతీకలే.

అన్ని ప్రతీకలు వారి వారి సంప్రదాయికమైన సాధనావిధానాలను శ్రధ్ధలో ఉంచటానికి ఏర్పడినవే‌. అన్నీ వాటి వాటి ప్రయోజనాల దృష్ట్యా గొప్పవే.

సాధనలో పరిణతినిబట్టి ప్రతీకలు ఎదురుగా ఉంటేనే‌ సాధకుడు నిలువగలుగుతున్నాడా శ్రధ్ధలో లేదా అన్నది నిర్ణయం అవుతుంది. ప్రతీకల అవసరం దాటి ముందుకు వెళ్ళిన వాడు వాటిని చిన్నబుచ్చడు. మేడ ఎక్కటానికి మెట్లు అవసరం. అంతవరకూ మాత్రమే వాటి ప్రయోజనం. ఐన మేడెక్కిన తరువాత మెట్లు దండగ అని బుఱ్ఱ ఉన్నవాడెవడూ అనడు కదా.

ఒక చిత్రమైన ప్రశ్న విన్నాను. రామతీర్ధంలోనో‌ మరెక్కడో రామవిగ్రహం ధ్వంసంచేస్తే తప్పేముందీ? వచ్చిన నష్టం ఏముందీ అని.

ఒక చిన్నపిల్లల బడిని ఎవరో ధ్వంసం చేసారనుకుందాం. అక్కడ నేర్పే వేళ్ళ మీద లెక్కలూ వగైరా అంతా ట్రాష్ కదా, ఆ స్కూల్ పడగొట్టేస్తే తప్పేమిటీ‌ అంటారా మీరు? అనర్లెండి. మీకు చదువు విలువ తెలుసు. ఆవేళ్ళ మీద లెక్కలు అలాగే చిన్నపిల్లకి చెప్తారు అనీ తెలుసు. అందులో తప్పేమీ లేదని తెలుసు. కాని మీకు గుళ్ళు దేవుడి ప్రతిమలూ దేవుడికి పూజలూ అంతా ట్రాష్ అనే ఆధునిక భావాలు మాత్రం పుష్కలంగా ఉండి ఈ ప్రశ్న వేసారంతే. అయ్యా చిన్నపిల్లలకు వాళ్ళకు తగిన బడులు ఎలా అవసరమో పవిత్రమో సాధకులకు కూడా వారికి తగిన సాధనాస్థలాలూ ప్రతీకలూ అంతే అవసరమూ‌ పవిత్రమూ కూడా అని సవినయంగా మనవి చేస్తున్నాను.
 

ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.

15, ఆగస్టు 2020, శనివారం

విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము (Download)

 విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము మనకు అంతర్జాలంలో లభిస్తోంది. ఇక్కడ డౌన్‌లోడ్ సూచికలు ఇస్తున్నాను.


  1. బాల కాండము
  2. అయోధ్యా కాండము 
  3. అరణ్య కాండము
  4. కిష్కింధ కాండము
  5. సుందర కాండము
  6. యుధ్ధ కాండము

ఈ‌పై పుస్తకాల్లో అరణ్య కాండము సుందర కాండము తి.తి.దే వారి సైట్‌లోనూ మిగిలిన నాలుగు కాండములూ అర్కీవ్ సైట్‌లోనూ‌ లభిస్తున్నాయి.

అసక్తి కలవారు తప్పక దిగుమతి చేసుకోండి. అంతర్జాలంలో ఈనాడు లభిస్తున్నా అవి రేపోమాపో అక్కడ ఉండకపోవచ్చును. కాబట్టి బధ్ధకిస్తే మనకే ఇబ్బంది మరి.

14, జులై 2020, మంగళవారం

అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామస్తోత్రం చదవాలా?


అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామ స్తోత్రాలు చదవాలా అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. దానికి సమాధానంగా నాకు తెలిసినంతవరకూ వ్రాస్తున్నాను.

లలితా సహస్రనామ స్తోత్రమూ విష్ణుసహస్రనామం స్తోత్రమూ‌ వంటివి రెండు విధాలుగా చూడవచ్చును.

మొదటిది అవి స్తోత్రాలు. కాబట్టి సర్వజనపఠనీయాలు, పారాయణీయాలు. స్తోత్రపారాయణంలో అంగన్యాస కరన్యాసాలు అవసరం‌ లేదు.

రెండవది, అవి మాలా మంత్రాలు. కొంత అక్షరపరిమితిని మించి ఉండే‌ మంత్రాలకు మాలా అని సంజ్ఞ. ఉపనయన సంస్కారం పొందిన వారు, గురూపదేశం‌ తీసుకొని ఆయా మంత్రాలను అనుష్ఠానం‌ చేయవచ్చును. అలా అనుష్టానం చేసేవారు మాత్రమే అంగన్యాస కరన్యాసాలతో‌ సహా చేయాలి.

ఉపనయన సంస్కారం బ్రహ్మక్షత్రియవైశ్యవర్ణాలకు విధించబడింది సంప్రదాయంలో. అందుచేత ఆయా వర్ణాలవారు మాత్రం మంత్రోపదేశంగా మాలామంత్రాలను కాని ఇతరమంత్రాలను కాని, ఏమంత్రమైనా సరే‌, గురూపదేశంగా పొందినప్పుడు దానికి ఉద్దిష్టమైన అంగన్యాసకరన్యాసాలతో‌ సహా చేయవలసి ఉంటుంది. గురూపదేశం‌ లేని మంత్రాలను వారు కూడా కేవలం స్తోత్రాలవలెనే‌ (అంగన్యాస కరన్యాసాలు విడచి) పారాయణం చేయవలసి ఉంటుంది.

గురూపదేశంతో‌ మంత్ర దీక్షాస్వీకారం‌ చేసాక మంత్రానుష్టానాన్ని మహాశ్రధ్ధతో నిత్యమూ మిక్కిలి మడీదడీ వంటి నియమాలు పాటిస్తూ, మంత్రాధిష్టాన దేవతకు సాంగోపాంగ పూజాదికాలూ‌ నైవేద్యసమర్పణమూ అత్యంత భక్తిపూర్వకంగా సమర్పిస్తూ చేయవలసి ఉంటుంది. మంత్రం‌ నోటిలో‌ ఉన్నట్లే‌ మంత్రాధిష్ఠాన దైవతం‌ ప్రత్యక్షంగా ఎదుటనే ఉన్నట్లు భావించాలి కాని తదన్యంగా వ్యవహరించరాదు. మంత్రలోపం, శ్రధ్ధాలోపం, భక్తిలోపం వంటివి అనుష్ఠానాన్ని నిష్పలం చేయటమే‌ కాదు లోపతీవ్రతను బట్టి ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తాయి కాబట్టి మిక్కిలి అప్రమత్తులై సేవించాలి.

ఇక్కడ మంత్రలోపం అంటే ఒక సంగతి తప్పకుండా చెప్పుకోవాలి. సహస్రనామస్తోత్రాలు చదివే వారు కేవలం అనుష్టుప్పుల నడకను అనుసరించి చదవటమో లేదా రాగతాళాలను పెట్టి పాడాలను చూడటమో చేస్తూ ఆ స్తోత్రాల్లో ఉండే నామాలను సరిగా పోల్చుకొని సుష్ఠువుగా ఉఛ్ఛరించటం లేదు. ఇది చాలా తప్పు. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి మంత్రలోపం కారణంగా తప్పుడు నామాలను చదువుతూ‌ ఉంటారు. నామ విభజన సరిగా తెలుసుకోవటం మొట్టమొదటి కర్తవ్యం. ఎవరూ యూ-ట్యూబ్‌లో ఉన్న స్త్రోత్రాలను విని అవి సరిగ్గా ఉన్నాయని భ్రమపడనవసరం లేదు. సాధారణంగా అవి తప్పులతోనే ఉంటున్నాయి.

ఒకరకంగా మంత్రాధికారం లేని వర్ణోపర్ణాల వారే అదృష్టవంతులు. వారికి స్తోత్రపారాయణం చాలు. మిక్కిలి శ్రధ్ధాళువైన వ్యక్తి మంత్రాన్ని మిక్కిలి భక్తితో అంగన్యాసకరన్యాసాదులూ పూజాపునస్కారాలతో సేవిస్తే ఎటువంటి మంచి ఫలితాన్ని పొందటం‌ జరుగుతుందో, మంత్రాధికారం లేని వారు కేవలం భక్తితో‌ స్తోత్రాన్ని పారాయణం చేసి అంతటి ఫలమూ‌ పొందుతారు. ఇందులో ఎంతమాత్రమూ‌ సందేహం అక్కర లేదు.

ఇలా అవకాశం ఉన్నది కదా అని మంత్రాధికారం సంపాదించుకొన్నవారు ఎవరైనా కాని దానిని విడచి కేవలం‌ స్తోత్రంగా పారాయణం చేస్తామంటే‌ అది బధ్ధకమూ‌ అవినయమూ‌గా లెక్కకు వస్తుంది కాని మంచి ఫలితం‌ రానేరాదు.

మంత్రాధికారానికి అవకాశం ఉన్న వర్ణం వారైనా మంత్రాధికారం ఉపదేశం‌గా పొందని మాలామంత్రాలను పారాయణంగా అంగన్యాస కరన్యాసాలు లేకుండా చేయటానికి అభ్యంతరం‌ ఉండదు.

కొన్ని మినహాయింపులు ఎప్పుడూ‌ ఉంటాయి. స్త్రీలు ఎప్పుడూ మాలా మంత్రాలను పారాయణంగానే చేయవచ్చును. ఉపనయన రాహిత్యం కారణంగా వారికి ఉపదేశం ఉండదు కాబట్టి. కొన్ని కొన్ని మంత్రాలను స్త్రీలు ఉపదేశంగా పొందవచ్చును. కాని ఆ ఉపదేశం జపధ్యానాదులకు మాత్రమే కాని అంగన్యాసకరన్యాసాదులతో పూజావిధులకు అవకాశం ఇవ్వదు.

అనారోగ్యవంతులూ, కడువృధ్ధులూ, ప్రయాణకాలంలో అననుకూలతల మధ్యన చిక్కుబడిన వారూ, అశక్తత కారణంగా ఉపదేశం‌ ఉన్నప్పటికీ‌ పారాయణం చేస్తే సరిపోతుంది.

శ్రధ్ధగా మాలామంత్రాలను పారాయణం చేసే వారు కూడా అత్యవసరంగా పారాయణం చేయదలిస్తే మంత్రాధిదేవత ఎప్పుడూ 'సోహ మేకేన శ్లోకేన స్తుత ఏవ నసంశయః' అని ఒక్క శ్లోకం పారాయణం చేసి భక్తిగా నమస్కరించినా చాలు అంటుందని గుర్తించాలి. ఐతే‌ ఇది విధిలేని పరిస్థితుల్లో‌ మాత్రమే‌ పాటించవలసిన పధ్ధతి అని గుర్తించాలి.

22, జూన్ 2020, సోమవారం

జ్యోతిష్యం గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా?


జ్యోతిష మొక శాస్త్రమా యను ప్రశ్న వేయు వారి సంఖ్య యమితముగా నున్నది. శాస్త్రము కాదను ధ్వని యాప్రశ్న యందే తోచునట్టి విధముగా నా ప్రశ్నను వేయుదురు. ఇది సర్వత్ర కనిపించుచున్న విషయము.

జ్యోతిష మొక సైన్సా లేక శాస్త్రమా యని ప్రశ్నించు వారి నింతవరకు చూడలేదు. ఎందువలన ననగ సైన్సు అను నాంగ్లపదమునకు సమానార్ధప్రతిబోధకముగా నుండు పదముగా శాస్త్రమను పదము ప్రసిధ్ధముగా నున్నది. నిజమున కీప్రశ్న "జ్యోతిష్యం సైన్సా లేక మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా?" యని వినిపించబడినది. కాబట్టి మొత్తముగ నీ‌ ప్రశ్నను త్రోసివేయుటకు ముందుగా దీనిని కొంచెము పరిశీలనముగ జూడవలసి యున్నది. జ్యోతిష్యము మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా యను ప్రశ్న యిందు గమనార్హము కావున దానికి సమాధానము చెప్పుటకు యత్నించుట యుచితముగ నుండవచ్చును.

ఉచితముగ నుండవచ్చు నన్నంత మాత్రమున సమాధానము చెప్పవలయునా యనగ నది విచార్యమైన సంగతి.

ప్రశ్నించు వారి యొక్క చిత్తశుధ్ధిని నమ్మగలిగిన యెడల చెప్పవచ్చును. కేవలము కికురించుటకునై ప్రశ్నవేయువా రుందురు.

ప్రశ్నించు వారి యొక్క యర్హతను బట్టి సమాధానము చెప్పవలసి యుండును. ప్రశ్న వేసిన ప్రతి వానికికి సమాధానము దొరుకదు. అట్లేల ననగ పృఛ్ఛకునకు సమాధానమును గ్రహించు శక్తి యుండవలయును కావున. ఆధునిక భౌతికశాస్త్రము మిక్కిలి ద్రవ్యరాశికల ఖగోళవస్తువు యొక్క సామీప్యమున కాంతిస్థల కాలముల యందు మార్పు కలుగునని చెప్పుచున్నది. అట్లేల జరుగునని సామాన్యులు ప్రశ్నించవచ్చును కాని సమాధానము వారికి బోధపడునట్లు చెప్పుట దుస్సాధ్యము కదా. అథాతో‌ బ్రహ్మ జిజ్ఞాసా యని బ్రహ్మసూత్రముల యందు మొదటి సూత్రము. ఇచ్చట అథః అనగా తగిన అధికార సిధ్ధి కలిగిన పిమ్మట నని కదా యర్ధము. అంతియే కాని వేదాంతము నేర్పుదురా, వ్యాసుని బ్రహ్మసూత్రములతో‌ మొదలు పెట్టుదమా యన్నచో నది దుస్సధ్యమే‌ కదా. ఇట్లు గ్రహించవలసి యున్నది.

ప్రశ్నించు వారి యొక్క ఆశయమును బట్టి సమాధాన ముండును. కొందర కుపరిస్పర్శగ సమాధానము చెప్పిన చాలును. ఏదేని విషయ మున్నదా యన్న కుతూ‌హలమే‌ కాని విషయమును సాకల్యముగ నేర్చుటకు నాశించని వారికి విపులముగ చెప్ప బూనినచో వారు విరక్తులు కావచ్చును లేదా భయపడి యొక నమస్కారము చేసి తప్పుకొనవచ్చును. మరియు కొందరు బుధ్ధిమంతులు సమాధానము చెప్పుచున్న వాడు తమను భ్రమింప జేయుట కేదోదో చెప్పుచున్నాడని యాక్షేపించవచ్చును.

ప్రశ్నించు వారి యందు ప్రత్యేకముగ నొక విధమైన బుధ్ధి కలవారుందురు. వారు తమకు సమాధానము చక్కగా బోధపడని పక్షమున, బోధపడినంత వరకే సత్యమనియును మిగిలిన దంతయును వ్యర్ధమైన విషయపూరణ మనియు భావింతురు. ఇది వారి చిత్తశుధ్ధికి సంబంధించిన సంగతి కాక వారి జీవలక్షణమునకు సంబంధించిన సంగతి యని గుర్తుపెట్టుకొన వలెను.

ఇట్టి వివేచన మంతయును చేయుట యెందుల కనగా జ్యోతిష్యము మతపరముగ గ్రహఫలితములు  మార్చగల శాస్త్రమా యన్న ప్రశ్నకు సమాధానము చెప్పుటయా, చెప్పినచో‌ నెట్లు చెప్పవలయును మరియు నెంతవరకు చెప్పవలయు నన్నది ముందుగా యోచించుటకు.

బుధ్దిః కర్మానుసారిణీ యని యొక నానుడి యున్నది. కావున సమాధానము చెప్పుటకు నిర్ణయించు కొంటిని. కాని బుధ్ధిమంతు లూహించుకొన గలగిన కారణముల వలన దానిని క్లుప్తముగనే చెప్పదలచితిని.

గ్రహఫలిత మనగ నిచ్చట ప్రశ్నించు వాని యుద్దేశమున గ్రహములు జ్యోతిషము ప్రాకారముగా నిచ్చునని చెప్పబడు ఫలితములు. జ్యోతిషము జాతకునకు వాని జాతకచక్రము ననుసరించి ఇష్టకాలమున జరుగుచున్న దశాంతర్దశల ప్రకారమును మరియు వర్తమానగోచారము ప్రకారమును రాగల మంచిచెడుల సూచనలను తెలుపును. ప్రశ్న యని యొక జ్యోతిషవిభాగమున్నది. దానికి కేవలము వచ్చి ప్రశ్న యడిగిన కాలము ననుసరించి ఫలములను లెక్కించు సామర్ధ్యమున్నది. ఏవిధానమున నైనను మంచిచెడుల సూచనలు సమముగనే‌ లభించును.

జ్యోతిషము అట్టి ఫలములను సూచించుటయే‌ కాక మార్చు విధానమును చెప్పునా యన్నది గొప్ప ప్రశ్నయే.

మనుష్యుల జీవితములు వారి వారి కర్మలను అనుసరించి జరుగుచుండును. ఒక జన్మమనగ పొందవలసిన కర్మానుభవమును పొందుటకు ఒక శరీరమును గ్రహించి ప్రవర్తించుటయే. కాని ఎవ్వడైనను దానినుండి స్వతంత్రించి మంచి దారిలోనికి మరలవచ్చును లేదా మరింత చెడు దారికి మరలవచ్చును. ఈవిషయమును కూడ జ్యోతిషము సూచించగలదు కాని సామాన్యజ్యోతిష్యులకు దురవగాహము.

కర్మమున కెదురుతిరిగి భగవద్భక్తిపరు డనుము సత్కర్మాచరణపరు డనుము మరియొకటనుము, గురూపదేశము వలన కాని మిక్కిలి తీవ్రమైన సంవేదనాకారకమైన సంఘటనము వలనకాని కొత్త దారిని పోవు వానికి సామాన్యముగా వాని జాతకము సూచించు గ్రహఫలములకు భిన్నమైన ఫలములు కనిపించును. అనగా సామాన్యజ్యోతిష్యులకు నిట్టి మార్పును గ్రహించరామి వలన గ్రహఫలములను వారి భక్తి లేదా సత్కర్మ మార్చుచున్నట్లు తోచును.

అట్లే మిక్కిలి చెడు మార్గమును కూడ నొక జీవుడు త్రొక్క వచ్చును. కాని గడుసువారు తమ అపమార్గవర్తనమును కొంత గుప్తముగ నుంచుదురు కద. అప్పుడు జాతకమున మంచి ఫలములు కనిపించినను వాస్తవమునకు చెడ్డఫలితములు అనుభవమునకు వచ్చి సామాన్యులను విస్మయపరచును. 


ఇది యిట్లుండగ సామాన్యమున జ్యోతిష్యులు ప్రజలకు గ్రహగతుల వలని చెడుఫలితములు సూచితమైన సందర్భములలో శాంతిప్రక్రియాదులను గాని తత్తద్గ్రహప్రీతికరమైన కార్యములను కాని సూచించుట లోకములో కనుపించు చున్నది. ఇట్లైనను మనుష్యులు కొంతకొంతగ తమతమ మనస్సులనుండి దుర్భావనాదులను తొలగించుకొని యుదాత్తమైన కార్యముల యందు ప్రవర్తించు వారై తత్తత్పుణ్యఫలముల వలన వచ్చు నట్టి మంచి ఫలమును పొందుట జరుగునని యాశంక దీనికి కారణము. అంతకు మించి మరేదియును లేదనియే చెప్పవచ్చును.

ఇంకను మరికొంత వ్రాయదగినది కలదు కాని ఇంతవరకు చాలును.

2, మే 2020, శనివారం

రామనింద మహాపాపం!


ఈ మధ్య కాలంలో దూరదర్శన్ ఛానెల్ హఠాత్తుగా బాగా ఆదరణలోనికి వచ్చింది. దానికి కారణం దూరదర్శన్ వారు తమ వద్ద నున్న బహుళజనాదరణ పొందిన ఆ రామాయణం ధారావాహికను పునఃప్రసారం చేస్తూ ఉండటమే.

ఇలా పునః ప్రసారం చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉందట. రాముడి తమ్ముళ్ళు ఎందరు అన్న చిన్న ప్రశ్నకు మన భారతీయుల్లో నుండే ఒకటి నుండి వంద వరకూ అన్ని సంఖ్యలూ జవాబులుగా వచ్చాయట. అందుచేత అక్షరాలా జనోధ్ధరణకార్యక్రమంగా మరలా రామాయణం పునఃప్రసారం మొదలైనదట.

అనుమానప్పక్షులు ఉంటారు. వారి కోసం కొంచెం వ్రాయాలి మరి. తెలుగువారిలో తక్కువే కావచ్చును పౌరాణికవాంగ్మయంలో ఓనమాలు తెలియని వారు. ఔత్తరాహుల్లో మాత్రం ఎక్కుఏ అని దశాబ్దుల క్రిందటనే విన్నాను.

నా మిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర రాజు అని ఒకతను హైదరాబాదు వదలి ఉత్తరాదికి వెళ్ళాడు ఉద్యోగం మారి. కొన్నాళ్ళ తరువాత హైదరాబాదుకు అతను వచ్చినప్పుడు కలుసుకున్న సందర్భంలో పిచ్చాపాటీలో ఈ విషయం చెప్పాడు. అతని వాక్యం "వాళ్ళలో ఎక్కువమందికి భీముడూ భీష్ముడూ అనే ఇద్దరున్నారని తెలియదు" అన్నది చదివితే ఆక్కడి జనం సంగతి అర్ధం అవుతుంది కదా.

ఐతే రానురానూ మన తెలుగు వారిలోనూ అటువంటి మహానుభావులు ఎక్కువ అవుతున్నారేమో అనిపిస్తున్నది.

దానికి తోడు అసక్తి లేకపోవటం, తిరస్కారభావం (ఆట్టే ఏమీ తెలియకుండానే!) కలిగి ఉండటం అనే గొప్ప లక్షణాల కారణంగా వీరి సంఖ్య పెరుగుతున్నదని నా విచారం.

నిన్న మే 1 న సాహితీ నందనం బ్లాగులో వచ్చిన ఈవ్యాఖ్యను పరికించండి.

సీతని పోగొట్టుకున్న టైంలో అన్న భార్యపైన, రాజ్యంపైన కన్నేసిన సుగ్రీవుడు లడ్డూలాగా దొరికాడు. అప్పటికి రాముడు 'జీరో'. అందుకే వాలిని చెట్టు చాటునుంచి చంపాడు. వానరసేనని సపాదించాక ఆబలంతో రావణుడితో ముఖాముఖీ యుద్దం చేశాడు. అక్కడ తేడావొస్తుందెలారా బాబూ అనుకునే టైంలో... మళ్ళీ లడ్డూ లాగా విభీషణుడు రేడీ.

అడవుల్లో, కొండల్లో యుధ్ధం చెయ్యడంలో నేర్పరితనంలేని అయొధ్య సైన్యాన్ని వాడుకోకుండా తనసైడు ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించాడు.

ఇప్పుడు చదువరులకు నా బాధ అర్దం ఐనదని భావిస్తున్నాను.

చదువరులు నా బాధ మరొకటి కూడా అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను.

తెలుగుబ్లాగు ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారు.  బ్లాగులు వ్రాసేవారు, అవి చదివే వారు. నిజానికి చదివే వారిలో ముప్పాతిక మువ్వీసం మంది బ్లాగులు వ్రాసే వారే.

వ్రాసే వారిలో కాలక్షేపం కోసం వ్రాసే వారి నుండి నిష్ఠగా ఆథ్యాత్మికవిషయాలు మాత్రమే వ్రాసే వారి దాకా అనేక రకాల వారున్నారు.

చదివే వారిలో దాదాపుగా అందరూ కాలక్షేపం కోసం చదివే వారే.

ఎందరో ఎన్నో  విషయాలపైన అమూల్యాభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు నిత్యమూ. రాజకీయవిషయాలపైన ఐతే నిముషాల వ్యవధిలోనే స్పందనలు పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి.

కాని ఇంత దారుణంగా రామనింద జరుగుతున్న సందర్భంలో ఒక్కరికి కూడా ఒక్కముక్క మాట్లాడటానికి మనసు రాలేదా?

ఈ దౌర్భాగ్యపు వ్యాఖ్య వ్రాసిన పెద్దమనిషి కనీసం పిల్లల బొమ్మల రామాయంణం పుస్తకం లాంటి దైనా చదివిన వాడు కాదని ఒక్కరికీ తోచలేదా?

అవాకులూ చవాకులూ మాట్లాడరాదని ఇంత గడ్డిపెట్టటానికి ఒక్కరికీ ధైర్యం లేదా?

సాహితీ నందనం బ్లాగరొకాయన మహా దొడ్డవారు. ఆయన బ్లాగులో ఎవరేమి వ్రాసినా కిమ్మనక ఆమోదించి ప్రచురించి తరిస్తారు. చూసి ఆమోదించి మరీ ప్రచురించటం ఉచితం అని ఆయనకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు.

దైవనింద అంత కమ్మగా ఉన్నదా ప్రజలారా? లేదా అలా నింద చేయరాదు అని చెప్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి, రాముడికి దెబ్బతగిలితేనేం ఆయన ఏమీ అనుకోడు ఏమీ చేయడులే అని ఉదాసీనంగా ఉన్నారా?

ఒక్క మాట తెలుసుకోండి అయ్యలారా అమ్మలారా,

ఉ. సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్


మనకెందుకొచ్చిన గొడవలే అని చూస్తూ ఊరకున్న పుణ్యాత్ములూ పాపభారం మోయవలసిందే అని చదువరులను గ్రహించ కోరుతాను.

17, మార్చి 2020, మంగళవారం

ఏమి చేతుర లింగ ఏమి చేతుర -- తత్త్వ గీతం.


ఏమి  చేతుర లింగ ఏమి చేతుర
ఏమి  చేతుర లింగ ఏమి చేతుర

గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

ఈ పాటను బాలమురళి అద్భుతంగా గానం చేసారు. ఆయన గొంతులో యీ తత్త్వాలన్నీ గొప్పగా ఉంటాయి వినటానికి.

తత్త్వాలలో కొట్టవచ్చేటట్లు ఉండే ఒక గుణం ఏమిటంటే వాటిలో భాషాశుధ్ధికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

చేతు కోతు ఇత్యాదులు తప్పు ప్రయోగాలు. వ్యాకరణం ఒప్పదు మరి.

కాని ఈపాటలో చేతురా అన్న ప్రయోగం ఉంది. ఇంకా అనేక తత్త్వాల్లోనూ ఇలాంటి వ్యాకరణ విరుధ్దమైన ప్రయోగాలు బహుళంగా కనిపిస్తాయి.

దీనికి పెద్ద కష్టపడి కారణం వెదుక నక్కర లేదు. ఈ తత్త్వాలను పాడే వారు ఎక్కువగా దేశద్రిమ్మరులైన సాధువులు. వాళ్ళలో ఎక్కువ మంది వేరే వాళ్ళు పాడుతుండగా విని నేర్చుకొని పాడిన వారే, పాడేవారే.

ఏ తత్త్వగీతం మూలప్రతి ఐనా ఎవరో ఒక కవి శుధ్ధంగా వ్రాసి ఉండవచ్చును. ఆ కవి కూడా ఒక దేశద్రిమ్మరి గోసాయి కావటానికి బోలెడు సావకాశం ఉంది.

అతడి నుండి ముఖతః విని నేర్చుకున్న వారు, వారి శక్తి మేరకు పాడటం వారి ద్వారా ఆ తత్త్వగీతం వ్యాప్తి చెందటం అన్నది సాధారణమైన విషయం.

ఐతే ఈపాడే వాళ్ళలో అనేకమంది గోసాయిలకు పెద్దగా చదువూ సంధ్యా ఉండదు. అందుచేత కొన్ని పదాలను వారు తప్పుగా ఉఛ్ఛరించటం తరచు జరుగుతూ ఉంటుంది. ఆతప్పులు అలాగే ప్రచారం కావటం కూడా అంతే సహజంగా జరుగతూ వస్తుంది కూడా.

ఐతే ఈ తత్త్వాలు ఎంతో ప్రచారంలోని వచ్చినవే మనం నేడు వింటున్నాం. ఇంకా కొన్ని అంత తేలిగ్గా బోధపడకో అంతగా మనస్సుకు హత్తుకోక పోవటం వలననో జనానికి అంది ఉండవు. అందాయీ అంటే వాటిల్లో ఉన్న శ్రవణసుభగత ముఖ్య కారణం.

ఈ ఏమి చేతుర లింగా అన్న తత్త్వ గీతం బాలమురళి గొప్పగా గానం చేసారు.




భగవంతుడికి మనం పూజ చేస్తాం. కాని అసలు పూజ అంటే ఏమిటో ప్రజల్లో అనేక మందికి సరైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఎక్కువ మంది చేసే పూజావ్యవహారం అంతా వట్టి మొక్కుబడి వ్యవహారం కాబట్టి.

అసలు భగవంతుడి గురించిన సరైన అవగాహన - అంటే భగవంతుడికీ భక్తుడికీ మధ్యన ఉండే బంధం గురించిన సరైన అవగాహన సర్వే సర్వత్రా తప్పుగా అర్ధం చేసుకోబడుతున్నది. ఇది చాలా విచారించవలసిన విషయం.

భక్తి అనేది పరమప్రేమరూపా అంటారు నారదమహర్షి, ఆయన కన్నా గొప్ప భక్తిపరులను ఎవరిని మనం ఎరుగుదుం చెప్పండి. ఆయన మాట ప్రమాణం. ఆప్త వాక్యం కదా.

భగవంతుడిని అత్యంతం ఆత్మీయుడు అని భావించి అంతా ఇంతా అనరానంత ప్రేమతో మెలగటమే భక్తి.

మరి పూజ అంటే?

భగవంతుడిని పిలిచి సత్కరించి ప్రవర్తించటం అన్నమాట.

మీకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి మీ యింటికి వచ్చాడని అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారు?

ఎలా అతిథి సత్కారం చేస్తారు?

ఎలా మీ మంచి చెడ్డలు చెప్పుకుంటారు?

ఎలా మెలగుతారు?

ఆ వ్యక్తి వీడ్కోలు తీసుకుంటుంటే ఎలా సాదరంగా సాగనంపుతారు?

ఇదంతా మీకు సులువుగానే అవగాహన అవుతున్నది కదా.

అదే విధంగా, మీకు అత్యంత ఆత్మీయుడైన భగవంతుడిని మీరు ఆహ్వానించారు మీ యింటికి. ఆయన వచ్చాడు. మీరు సాదరంగా స్వాగతం పలికి ఎంతో ప్రేమతో గౌరవంతో మెలగుతూ ఆయన్ను సంతోష పెట్టటమే పూజ అంటే.

సంప్రదాయం ప్రకారం పూజలో పదహారు ఉపచారాలను చేయాలి. ఏదో రూలుందని చేయటం కాదండీ, ప్రేమతో శ్రధ్ధగా చేయాలి. మనం పరాకు పడకుండా ఉండటానికే ఈ పట్టికను గుర్తుపెట్టుకోవాలి.

1. ఆవాహనం, 2. ఆసనం, 3. పాద్యం, 4. అర్ఘ్యం, 5. ఆచమనీయం, 6. అభిషేకం, 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం, 10. పుష్పం, 11. ధూపం, 12. దీపం, 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. ప్రదక్షిణం, 16. నమస్కారం.

ఇవీ ఆ ఉపచారాలు.

వీటి గురించి కొంచె క్లుప్తంగా చెప్పుకుందాం.

ఆవాహనం అంటే ఆహ్వానం పలకటం.  కాలింగ్ బెల్ మోగగానే పనమ్మాయి వచ్చి తలుపుతీసి సరే రండి అనటమూ ఇంటి యజమాని స్వయంగా గుమ్మంలో ఎదురుచూస్తూ ఉండి ఇంత పెద్ద ముఖం చేసుకొని ఆనందంగా రండి రండి అని సంభ్రమంగా ఎదురొచ్చి లోపలికి తీసుకొని వెళ్ళటమూ రెండూ ఒకటి కావు కదా. పూజలో ఆవాహనం అంటే భక్తి శ్రధ్ధలతో సంతోషంతో భగవంతుడిని ఆహ్వానించటం అన్నమాట.

అసనం అంటే కూర్చోండి అని మంచి కుర్చీ చూపించటం. మనం చూడండి ముఖ్యమైన అతిథులు వస్తున్నారని తెలిస్తే ఎంత హడావుడి చేస్తాం? ఇల్లంతా సర్దేసి, వారొస్తే కూర్చోవటానికి మంచి మంచి ఆసనాలు సిధ్ధం చేస్తాం కదా. సోఫా కవర్లు మొన్నమొన్ననే మార్చినవే ఐనా సరే బీరువాలోనుండి కొత్తవో ఇస్త్రీవో తీసి అలంకరించి మరీ ఎదురుచూస్తాం. ఆ మర్యాదకీ వారు లోపలికి వచ్చాక ఏదో కుర్చీలో నుండి తువ్వాలో మరొకటో తీసి కూర్చోండి అనటానికి అబ్బో ఎంతో తేడా లేదా? ఆసన మర్యాద అంటే తెలిసింది కదా. మన ఇంటికి భగవంతుడు వచ్చాడు. ప్రేమతో ముందే సిధ్దం చేసిన ఉచితాసనం అర్పించటమే ఆ మర్యాద మరి.

పాద్యం అనేది ఒకటుంది. ఈ కాలంలో ఐతే మాయమై పోయింది కాని పూర్వం ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్ళుకడుక్కుందుకు నీళ్ళివ్వటం మర్యాద. ఐతే అతి ముఖ్యమైన అతిథి వస్తే? ఆ అతిథి కాళ్ళు కడుక్కుని వచ్చాక కుర్చీ చూపటం కాదు - ముందే మంచి కుర్చీలో కూర్చో బెట్టి స్వయంగా కాళ్ళు కడిగి గౌరవం చేయటం బాగుంటుంది కదా. అది కదా ఆత్మీయ మర్యాద,  మరి భగవంతుడే వచ్చాడే, అంత కంటే అత్యంత ఆత్మీయుడైన అతిథి ఎవరుంటారు చెప్పండి. అందుకని మనం స్వయంగా ఆయన్ను ఆసీనులను చేసి కాళ్ళు కడిగి గౌరవించటం పాద్యం అర్పించటం.

ఆచమనీయం అంటే బయటనుండి వచ్చిన అతిథికి కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వటం వంటిది. చూడండి ఎవరన్నా వస్తే మంచితీర్ఘం ఇవ్వటం ముందుగా చేస్తాం కాని కారప్పూసా మిఠాయి ఉండా పెట్టిన ప్లేటు ముందుగా తేము కదా. అదలా ఉంచి బయట నుండి వచ్చిన వ్యక్తికి ఎంత లేదన్నా కాస్త దుమ్మ ధూళీ ఆ దిష్టీ ఈదిష్టీ తగిలి కాస్త శౌచం లోపం అవుతుంది. వచ్చిన వారు కాస్త పురాణాచమనం ఐనా చేసి తిరిగి శుచి కావటం సంప్రదాయం. భగవంతుడికి నిత్యశుధ్ధి ఐనా సరే కాస్త మనం గొంతు తడుపుకుందుకు మంచినీళ్ళివ్వాలా వద్దా చెప్పండి?

ఆ వచ్చిన పెద్దమనిషికి హాయిగా స్నానం చేసి రండి భోజనం సిధ్ధంగా ఉందని చెబుతాము కదా అదే అభిషేకం. ఆ భోజనమే నివేదనం. ఇలా ఉపచారాలన్నీ కూడా భగవంతుడనే విశిష్టమైన అతిథికి మనం చేసే మర్యాదలు.

ఎంతో ప్రేమతో ఆ మర్యాదలు నెరవేర్చటమే పూజ అన్నమాట.

ఈ రోజుల్లో చూస్తున్నాం.  ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం అంటారు. మనం వెళ్తాం. ఏదో మన భక్తి మనది. దేవుడి పూజ చూదాం అని వీలు కుదుర్చుకొని మరీ వెళ్తాం.

తీరా వెళ్ళాక చూడండి. ఆ పూజలో కూర్చున్న వారు వచ్చిన వారిని స్వాగతిస్తూ కనిపిస్తారు. సాధారణంగా ఐతే అది మంచి పధ్ధతే. కాని అక్కడ వాళ్ళు దేవుణ్ణి పిలిచి పూజ చేస్తున్నారు కదా. శ్రధ్ధ ఎక్కడ ఉండాలి? పూజ మొక్కుబడిగా నడుస్తూ ఉంటుంది. పూజచేస్తున్న వాళ్ళు వెనక్కి తిరుగుతూ ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడల్లా, వాళ్ళని పలకరిస్తూ.

మధ్యలో ఆ బ్రహ్మ గారు కలగ జేసుకొని అయ్యా ఆ పూవులు రెండు తీసుకొని దేవుడి దగ్గర ఉంచండి వంటిది ఏదో అనటం. వీళ్ళు అది కాస్తా మమ అనిపించి మళ్ళీ వెనక్కి తిరగటం.

ఇదా పరమ ప్రేమతో భగవంతుడిని పిలిచి మర్యాదలు చేయటం?

ఈ దిక్కుమాలిన పూజకు మురిసి దేవుడు వీళ్ళ అడ్దమైన కోరికలూ తీర్చాలా?

ఏమన్నా న్యాయంగా ఉందా?

శాఖా చంక్రమణం కాదు. కావాలనే ఈవిషయాలను ప్రస్తావించాను. ఈతత్త్వంలో పరమప్రేమతో భగవంతుడికి పూజ చేయాలని తాపత్రయ పడే భక్తుడి సందేహాలను ప్రస్తావిస్తున్నారు.

భగవద్గీతలో ఒక చోట భగవానుడి మాట

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః

అని. అంటే భగవంతుడికి కూడా మన పైన అపారమైన ప్రేమ కదా. ఆయన అందుచేత మనని ఇది పెట్టవోయ అది ఏదోయ్ అని నిలదీయడు. పాపం మనం ఏది పెట్టగలిగితే అది పెడితే చాలు సంతోషంగా స్వీకరిస్తాడు.

అలా మనం అర్పించ గలిగినది ఒక పండు కావచ్చు ఒక పువ్వు కావచ్చు. చివరకు ఒక గ్లాసు మంచినీళ్ళిచ్చి నా పరిస్థితి ఇంతేనయ్యా అన్నా సరే ఆయన అబ్బెబ్బె ఇది చాలు నాకు నిజానికి తినే వచ్చాను ఆకలిగా లేదు అనేస్తాడు. అది మనకు తెలిసో తెలియకో మనం చాలా హడావుడి పడిపోతాం.

వచ్చిన వాడు పెద్దవాడు. సాక్షాత్తూ భగవంతు డాయిరి. ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం అంటే బాగుండదు కదా. ఇలా అనుకొని అప్పోసొప్పో చేసి ఐనా సరే ఖర్చుకు వెనుకాడకుండా బ్రహ్మాండంగా నైవేద్యాలు సిధ్ధంచేస్తాం. ఒక్కొక్కసారి తెలివిగా, పూజకు సరిపడా కొద్దిగా నైవేదం సిధ్ధంచేస్తాం. మనకోసం సాదాసీదాగా ఏదో వండేసుకొని, ఆ భోజనంలో పిసరంత ప్రసాదం కూడా పెట్టుకొని తింటాం.

నిజానికి అలా చేయటం తప్పు.

మీయింటికి వచ్చిన ఆత్మీయుడికి మాత్రం నవకాయపిండివంటలతో ముందుగా భోజనం పెట్టి ఆపైన మనం ఆ పెద్దమనిషి చూడకుండా పచ్చడి మెతుకులతో భోజనం కానిస్తే, అది తెలిసి ఆయన ఎంత బాధపడతాడు? అయ్యో నా వల్ల ఎంత ఇబ్బందీ వీళ్ళకి అని ఎంతగా ఇదవుతాడు? ఆలోచించండి. అందునా మీరు ఎవరో పెద్దమనిషికి ఐతే ఆ వ్యక్తికి తెలియకుండా చడీ చప్పుడూ కాకుండా పచ్చడి మెతుకులూ మజ్జిగాతో సరిపెట్టుకో వచ్చును కానీ భగవంతుడి కళ్ళెలా కప్పుతారండీ? ఆయనకు తెలియనిది అంటూ ఉంటుందా?

భగవంతుడు అందుకే మరొక మాట కూడా అన్నాడు గీతల్లో

    యత్క రోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
    యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ - మదర్పణం

దీని అర్ధంలో విశేషం ఏమిటంటే నాయనా, నువ్వు ఏది చేసినా నాపేరు చెప్పుకొని చేయి. ఏది తింటున్నావో అదే నాకు అర్పించు అని.

అందుచేత మనం మజ్జిగ పోసుకొని భగవంతుడికి పెరుగు స్పెషల్ అనకూడదు. ముందటి శ్లోకంలో ఆయన చెప్పాడు కదా, నీవు ఏది పెట్టగలవో దానినే నేను సంతోషంగా ఆరగిస్తాను అని.

ఇంతవరకూ మనం పూజ అంటే ఏమిటో అది ఎలా ఎంత ప్రేమగా చేయాలో చెప్పుకున్నాం.

అలా చేసేందుకు ఎంతో ఇబ్బంది వస్తోందట ఒక భక్తుడికి.

అందుకని శివుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.

ఏమయ్యా శివుడా నీకు నా శక్తి మేరకు పూజ చేదాం అనుకుంటున్నాను.  కాని చూడవయ్యా ఎన్ని చిక్కులో, ఏమి చేయమంటావో నువ్వే చెప్పు?

    గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
    గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా

నీకోసం అతిపవిత్రం కదా అని గంగోదకం తెద్దామని వెళ్ళాను. తీరా చెంబు నీళ్ళలో ముంచగానే  అందులో ఉన్న ప్రతి చేపా కప్పా కూడ నన్ను చూసి నవ్వాయి. ఏమయ్యా ఈనీళ్ళన్నీ మా ఎంగిలే కదా అన్నాయి.  ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

    అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
    అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా

అక్షయావులూ అని ఉన్నాయి. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు కావలసినన్ని పాలిచ్చే ఆవులు అన్నమాట.  వాటి పాలు తెచ్చి నీకు సమర్పిద్దాం అనుకున్నాను. కాని ఆ ఆవుల దగ్గర తారాడే ప్రతిదూడా నన్ను చూసి నవ్వింది. అయ్యో ఆ పాలన్నీ మేము ఎంగిలి చేసిన పొదగుల కారణంగా అవీ ఎంగిలి ఐపోయాయి కదయ్యా అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

    తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
    కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా

పోనీ నీకోసం కాసిని పూవులు తీసుకొని వద్దాం అని బయలు దేరాను.  తుమ్మి చెట్టు కనిపించింది. బాగుంది పచ్చగా ఈపూలు బాగున్నాయి కోసుకొని వద్ధాం అనుకున్నాను. కాని ఆ పూవుల చుట్టూ బోలెడు తుమ్మెదలు తిరుగుతున్నాయి. అవేమో నన్ను చూసి ఈపూలన్నీ మేం ఎంగిలి చెసేసాం కదా ఎలా పనికొస్తాయీ నీకు అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

చూస్తుంటే ఈ సృష్టిలో ఏదో ఒకరకంగా ఎంగిలి పడని దినుసే కనిపించటం లేదే! ఏదో ఒకటి అతి పవిత్రంగా తెచ్చి నీకు అర్పిద్దాం అనుకుంటే అది సాధ్యపడేది కాదని అనిపిస్తోంది.

ఆఁ. ఇప్పుడు తెలిసిందయ్యా, ఈ సృష్టిలో నేను దేనినీ సాధించి తెచ్చి నీకు అర్పించటం జరిగే పని కాదు.

మరి ఇంక నీకు అర్పించటానికి నా దగ్గర ఏమీ లేకపోయిందే! ఈ విధంగా అలోచిస్తే పరస్పరాశ్రయమైన ప్రాకృతిక వస్తువులతో నిన్ను పూజించటం అసాధ్యం అని తేలుతున్నది.

ఇంక మిగిలిందీ, అచ్చంగా నాదీ అనదగ్గదీ ఒక్కటే.

అదే నా మనస్సు.

దానినే నీకు అర్పిస్తాను.

(ఇలా మనస్సును అర్పిస్తానూ అన్నది పాటలో చెప్పకపోయినా మనం అవగతం చేసుకోవాలి స్వయంగా.  భగవంతుడు మనం ఏది మనకు ఇంతే నా శక్తి స్వామీ అని ఇస్తే అదే స్వీకరిస్తాడు కదా.)

17, నవంబర్ 2019, ఆదివారం

చాణూరాంధ్రనిషూదనః కాదు చాణూరాంధకసూదనః

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలోని 825వ నామం చాణూరాంధ్రనిషూదనః అని ప్రసిధ్ధంగా ఉంది. శ్రీశంకరులు ఈనామానికి వ్యాఖ్యానంగా విగ్రహవాక్యం చెబుతూ చాణూరనామానాం అంధ్రం నిషూదే చాణూరాంధ్రనిషూదనః ఇతి అని చెప్పారు. నాకైతే ఇది అంతగా యుక్తం కాదనిపిస్తోంది. నా వాదనను మనవి చేస్తాను.

అంధ్రశబ్దంతోనే గోరఖ్‍పూర్‍ వారి భారత వ్యాఖ్యానంలోనూ కనిపిస్తోందని రేమెళ్ళ అవధానులు గారు చెప్పారు. ఈ అంధ్ర అనేది రాక్షసుల్లో ఒక తెగ అట. ఇది కొంచెం అప్రసిధ్ధవ్యవహారం. ఈ ప్రకారం అంధ్రతెగకు చెందిన ఒకానొక ఆంధ్రుని శ్రీకృష్ణుడు సంహరించటాన్ని ఈనామం ఉటంకిస్తున్నట్లు భావించాలి. ఈ అంధ్ర తెగ రాక్షసుల గురించి ప్రస్తావన దాదాపు ఇతరత్రా మృగ్యంగా ఉన్నది. కాబట్టి ఈవిధమైన ఆంధ్రుని ఒక రాక్షసుని కృష్ణుడు సంహరించటం గురించి ఈనామం అయ్యుండదు.

పైగా చాణూరుడు అనే వాడు అంధ్రతెగ రాక్షసుడు ఐతే కృష్ణుడు ఇద్దరు చాణూరులను సంహరించాడన్న మాట. ఒకడు మల్లుడు రెండవవాడు రాక్షసుడు. ఇలా చెప్పుకోనవసరం లేదూ, కంసుడి దగ్గర రాక్షసులకు కొదవేముందీ అది భాగవత ప్రసిధ్ధ వ్యవహారమే కదా అనవచ్చును. అప్పుడు చాణూరమల్లుడు కాస్తా చాణూరాసురుడు ఐపోతాడు. మహాభాగవతంలో అలాగ లేదే! శకటాసుర గార్ధభాసురాదులను బోలెడు మందిని స్పష్టంగా చెప్పి, సాక్షాత్తూ కంసుడి సమక్షంలో అతడి ప్రోద్బలంపై కృష్ణుణ్ణి చంపబోయిన వాణ్ణి చాణూరాసురుడు అని కాక చాణూరమల్లుడు అని భాగవతం ఎందుకు అంటుందీ?

కాబట్టి ఉన్నదొక్కడే చాణూరుడు కాని వాడు రాక్షసుడు అయ్యుండడు.  అందువలన అంధ్రతెగ రాక్షసుడు అని చెప్పటం అంత యుక్తి యుక్తంగా లేదు.

కాబట్టి చాణూరాంధ్ర అన్న చోట చాణూరుడనే ఆంద్రుడనీ అతడు మల్లుడనీ అర్ధం తీయక తప్పటం లేదు.

ఆంధ్రుడు కాక చాణూరుడు అంధకుడు అనటం అసలు పాఠం ఏమో అని అలోచిద్దాం.

యాదవుల్లో మూడు ప్రధాన శాఖలున్నాయి. అవి వష్ణి, బోజ, అంధక శాఖలు.

శ్రీకృష్ణుడు వృష్ణివంశం వాడు. ఈ మాట జగత్ప్రసిధ్దమే. కులశేఖరాళ్వారులు తమ ముకుందమాలాస్తోత్రంలో

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః

అంటారు రెండవ శ్లోకంలో.

శ్రీకృష్ణుని మేనమామ ఐన కంసుడు భోజవంశం వాడు. పోతన్న గారి ఈ క్రింది వచనం చూడండి.

అని యిట్లాకాశవాణి పలికిన, నులికిపడి, భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై, యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి,

ఇది కంసుడు ఆకాశవాణి హెచ్చరిక విని దేవకీదేవిని చంపబోవటాన్ని ఉద్దేశించి చెప్పిన వచనం.

సరే అప్పటికి దేవకీదేవిని కంసుడు ఎందువల్లనైతే నేమి చంపకుండా వదలినా అటుపిమ్మట నారదప్రబోధితుడై ఆమెకు జన్మించిన శిశువులను సంహరిస్తూ పోతాడు కాని హరి పన్నాగం ప్రకారం బలరామకష్ణుల జననాలను గ్రహించలేకపోతాడు. ఆనక గ్రహించి వారిని మట్టుపెట్టటానికి ఎన్ని దురోపాయాలు ప్రయోగించినా కుదరక స్వయంగా తన సమక్షంలోనే వారిని వధించటానికి ధనుర్యాగం అనే మిషమీద వారిని రేపల్లె నుండి మధురకు రప్పించుకొంటాడు.

అక్కడ వారికి కంససమక్షంలో చాణూరముష్టికులనే కొండలవంటి మల్లులతో యుధ్ధం చేయవలసి వస్తుంది. ఈ 825వ నామం ఆ సందర్భంలో కృష్ణుడు చాణూరుణ్ణి చంపటాన్ని పురస్కరించుకొని చాణూరమర్దనుడిగా కీర్తించటానికి ఉద్దేశించినది.

ఈ చాణూరాంధ్రనిషూదనః అన్న నామంలో చాణూరుడు  అన్నప్పుడు ఒక్కడు. ఆంధ్ర పదం జాతి వాచకం. కాబట్టి సామాన్యార్ధం శ్రీకృష్ణుడు చాణూరుడు అనే ఆంధ్రుడిని సంహరించాడు అని వస్తుంది. ఇలా చాణూరుడు అనే వాడు ఒక ఆంధ్రానుండి వచ్చి కంససభలో ఉన్న ప్రముఖ మల్లుడని తెలుస్తున్నది.

కాని అప్పటికి శ్రీకృష్ణుడికి ఆంద్రులతో వైరం అంటూ ఏమీ లేదు. కాబట్టి చాణూరుడు అనే ఆంధ్రమల్లుడు అని చెప్పవలసిన అవసరం కాని చెప్పటం వలన నామావళిలో కొత్తగా తెలియవచ్చే విశేషం కాని ఏమీ లేదు.

పోనీ, చాణూరుడు అనేవాడినీ, ఆంధ్రులనూ సంహరించిన వాడు విష్ణువు అని అందామా అంటే అలాకూడా పొసగదు. ఇప్పుడే అనుకున్నట్లు కృష్ణుడికి ఆంధ్రులతో కనీసం అప్పటికి వైరమే లేదే. అదీ కాక, చాణూరుడు అని ఏకవచనంలో ఒక మాటనూ, ఆంధ్రులు అని బహువచనంగా ఒక జాతిని ఉద్దేశించి ఒకే నామంగా చెప్పటం సమజసం కాదు కూడా.

ఇక్కడ ఆంధ్రశబ్దం బదులు ఈ నామంలో అంధక శబ్దం ఉండి ఉండవచ్చును అనుకుంటే అప్పుడు నామం చాణూరాంధకసూదనః అని చెప్పవలసి ఉంటుంది. శ్లోకంలో ఛందోభంగం ఏ మాత్రం కాదు.

అంధకులు కూడా వృష్ణి భోజులవలె యాదవుల్లో ఒక శాఖ వారు. అది యాదవరాజ్యం. దాదాపు అందరూ యాదవులే అక్కడ. అందుచేత చాణూరుడు అంధకుడు ఎందుకు కాకూడదు? తప్పక కావచ్చును.

ఇలా ఆలోచిస్తే చాణూరాంధకసూదనః అన్న రూపమే ఈనామానికి అసలు స్వరూపం అయ్యుంటుందని భావించవచ్చును. అది మరింత సమజసం ప్రస్తుతం ఉన్న చాణూరాంద్రనిషూదనః అన్న రూపం కనా.

కంసుడి సభలో చాలామందే పెద్ద యోధులున్నారు. వారిలో కంసుడి ఎంపిక చాణూరముష్ణికులు. వారు కొండలంత మల్లులు కావటమే కాదు. మరొక విశేషం కూడా ఉంది.

మల్లుల్లోవృష్ణి వంశం వాళ్ళను ఎంపిక చేసి వదిలిన పక్షంలో వాళ్ళు తమశాఖ వాళ్ళూ చిన్నపిల్లలూ అన్న సానుభూతితో బలరామకృష్ణులతో సరిగా పోరాడక పోవచ్చును. అది కసంసుడికి సమ్మతం కాదు కదా.

పోనీ తమ శాఖకు చెందిన మల్లుల్ని ఎంపిక చేద్ద్దామా అన్నా అందులోనూ నమ్మకం ఉంచటం కష్టం. వాళ్ళల్లో ఎవడికైనా సరే తాను తండ్రిని దింపి సింహాసనం ఎక్కటం ఇష్టం లేకపోవచ్చును.

అందుకని వృష్ణి భోజశాఖల మల్లులను ప్రక్కన బెట్టి అంధకశాఖవారిని ఎంపిక చేసాడు కంసుడు.

ఐతే ఇదే తర్కాన్ని కొంచెం సాగదీసి, అసలు యాదవులను నమ్మలేమని ఆంద్రామల్లురను ఎంపిక చేసాడేమో అనవచ్చును. అదీ కొంతవరకూ సమంజసమే. కాని కంసుడి ఆస్థానంలో దూరప్రాంత మల్లుడికి బదులు స్థానిక మల్లుడిని ఊహించటమే ఎక్కువగా సమంజసం అనుకుంటున్నాను.

ఒకవేళ యాదవుల్లో ఏదన్నా అంతఃకలహాలూ, ఆ మూడు శాఖల్లోనూ హెచ్చుతగ్గుల కారణంగా వైరాలూ ఉన్నాయనుకుంటే, వాటిని పురస్కరించుకొని కంసుడు అందకులను బలరామకృష్ణుల పైకి ఉసికొల్పాడని అనుకోవటం సబబుగా ఉంటుంది.

అందువలన చాణూరాంధకసూదనః అన్నపాఠమే సరైనది కావచ్చునని నా భావన.

ఐతే శ్రీశంకరులు చాణూరాంధ్రనిషూదనః అన్న పాఠాన్ని ఎందుకు స్వీకరించారూ అన్నప్రశ్న వస్తుంది. అప్పటికే ఆపాఠం ప్రచారంలో ఉండటమే దానికి కారణం కావచ్చును.

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

సహజ లక్షణం!


పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥

చాలా అందమైన శ్లోకం. చాలా ప్రసిధ్ధమైనది కూడా.

చెట్లు పండ్లను కాస్తున్నాయి.
అవి స్వయంగా తినటం కోసమా?
కాదు, పరోపకారం కోసం!
ఆపళ్ళను జీవులు ఆహారంగా అనుభవిస్తున్నాయి.
ముఖ్యంగా మనుష్యులు.

నదులు తీయని నీటితో ప్రవహిస్తున్నాయి.
ఆ నీళ్ళని అవి త్రాగుతున్నాయా?
కాదు, పరోపకారం కోసం!
నీరు లేనిదే జీవులకు మనుగడే లేదు.
ముఖ్యంగా మనుష్యులకు.

ఆవుల పాలిస్తున్నాయి.
అలా పాలను ఇచ్చేది తన మనుగడ కోసమా.
కాదు పరోపకారం కోసమే.
వాటి దూడలే కాదు, మనుషులకూ అవి అవసరమే

అందుకే జీవులు వీటినుండి ఒక నీతిని గ్రహించాలి.
తమ ఉనికి అన్నది పరోపకారం కోసమే అని.

ఈకోవ లోనివే మరికొన్ని కూడా చెప్పుకోవచ్చును. మేఘాలు వాన కురిసేది పరోపకారం కోసమే. సూర్యచంద్రుల వెలుగులు పరోపకారం కోసమే వగైరా.

కాని నిజం వేరుగా ఉంది.

ఏవీ పరోపకారం కోసం ఏమీ చేయటం లేదు.
మీకు నచ్చినా నచ్చక పోయినా ఇదే నిజం.
మీరు చేదు నిజం అనుకొన వచ్చును.
మీ యిష్టం.

చెట్లు పళ్ళు కాయటం వాటి సహజలక్షణం.
నదులలో నీళ్ళు ప్రవహించటం వాటి సహజలక్షణం.
క్షీరదాలు పాలివ్వటం వాటి సహజలక్షణం.
మేఘాలు వాన కురవటం వాటి సహజలక్షణం.
సూర్యుడు ఎండకాయటం, చంద్రుడు వెన్నల కురియటమూ వారి సహజలక్షణాలే.
రాయి కఠినంగా ఉండటం దాని సహజలక్షణం
వెన్న మెత్తగా ఉండటం దాని సహజలక్షణం
విషం ప్రాణాంతకం కావటం దాని సహజలక్షణం.
అంతకంటే మరేమీ లేదు.

సృష్టిలో ఉన్న ఈ సహజలక్షణాలను జీవులు తమతమ మనుగడకు అనువుగా గ్రహించి ప్రవర్తించటం జీవుల సహజలక్షణం అని కూడా మనందరం గ్రహించాలి.

ఈ విషయంలో సృష్టి సహజత్వాలే కాని పరోపకారాలు అంటూ ఏమీ లేవు.

నాస్తికుడు ఠాఠ్ దేవుడూ లేడూ  దెయ్యమూ లేదు అని బల్లగుద్ది వాదిస్తాడు. అతడి సహజలక్షణం అది.
భక్తుడు తన యిష్టదైవాన్ని ఎంతో ప్రేమగా స్మరిస్తాడు, కీర్తిస్తాడు అది అతడి సహజలక్షణం.

అవును కాని, ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నాను అన్న అనుమానం రావచ్చును పాఠకులకు. దానికి ఒక కారణం ఉంది.

ఈ మధ్యకాలంలో నేను బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానుకున్నాను. ఆ పని ఈబ్లాగులో ప్రకటించి మరీ చేసాను. కాని తిరిగేకాలూ తిట్టే నోరూ ఊరకే ఉండలేవన్న సామెత ఉంది కదా. అలాగే అతి అరుదుగా మాత్రం కావాలనో పొరపాటునో గ్రహపాటునో వ్యాఖ్యలు ఇంకా వ్రాయటం జరుగుతున్నది. భగవంతుడు నన్ను అనుగ్రహించి ఆ దురలవాటు కూడా పోయేట్లు చేయగలడని ఆశిస్తున్నాను.

అలాంటి అలవాటైన పొరపాటు కారణంగా ఒకానొక బ్లాగులో ఒక వ్యాఖ్యను వ్రాయటం జరిగింది. ఆ వ్యాఖ్యకు ఒక మిత్రుడు నా ఉబోసకు మండి పడి చెడామడా నాకు నాలుగు వడ్డించటం కూడా జరిగింది.

ఐతే కొన్నికొన్ని మాటలకు సమాధానం నాకు నేనైనా చెప్పుకొని రికార్డు చేసుకొనవలసిన అగత్యం ఉందని భావించి ఈ నాలుగు ముక్కలూ వ్రాస్తున్నాను.

నాకు వడ్డింపుగా వచ్చిన ఒక హాట్ ఇది.

What you have achieved by Just writing a kirtan for a day?Do you think you are the only devotee, and I am not? Doing prayers in your own hermitage and craving for moksha yourself is a crime when your religious community is in danger!


నేను కీర్తనలు వ్రాయటానికి కారణం నా రామభక్తి ఐతే, నా రామభక్ర్తికి కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అది నా సహజలక్షణం. అంతే. నేను ఏదో సాధించాలని భావించి ఈరామసంకీర్తనం చేయటం లేదు. అయాచితంగా ఐనా సరే ఈ రామసంకీర్తనం వలన ఏదో సాధించాననీ అనుకోవటం లేదు.

ఇక్కడ మిత్రులు ఒక మంచి మాట అన్నారు. నామతం ప్రమాదంలో ఉంటే నేను నాస్వార్థం కోసం మోక్షాన్ని ఆశించటం నేరం అని. చక్కని ఆలోచన.

నాకు వడ్డించబడిన మరొక హాట్ గురించి కూడా ప్రస్తావించాలి.

How do you acquire knowledge? Have you got it yourself! Some teacher taught you, am I right?

ఇదే హాట్‍ను తెలుగులో మారువడ్దన చేయటం కూడా గమనించండి

మీకు రామభక్తి ఎట్లా అబ్బింది - మన ముందుతరాల వాళ్ళు ప్రిజర్వ్ చెయ్యబట్టే కదా!డైరెక్టుగా వాల్మీకి మీకు కల్లో కనబడి చెప్పాడా?

సాధారణమైన విద్యాబుధ్ధుల విషయంలో ఈమాటలు ఒప్పదగినవే. కాని నా రామభక్తి అన్నది నాకు పుట్టువుతో వచ్చినదే కాని నా తల్లిదండ్రులతో సహా ఎవరూ పనిగట్టుకొని నాకు రామపారమ్యం ప్రబోధించగా వచ్చినది కాదు.

నేను ఆరవతరగతిలో ఉండగానే ఒకానొక సందర్భంలో రామధ్యానంలో నిమగ్నుడినైన సంగతి మా తండ్రిగారు గమనించి సంతోషించటం జరిగింది. అప్పుడు మాత్రం ఆయన ఈమార్గం వదలవద్దు అని మాత్రం అదేశించారని మనవి చేయగలను.

రెండవసంఘటన నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా జరిగింది. తరగతిలో పాఠం వింటూనే మధ్యలో ధ్యానంలోనికి వెళ్ళిపోతే గొప్ప హడావుడి జరిగిందట. నేనీ లోకంలోనికి వచ్చేసరికి పాఠశాలలో కాక ఇంట్లో ఉన్నాను. డాక్టరు గారు వచ్చి పరీక్షించి ఫరవాలేదని మా అమ్మానాన్నలతో చెప్పి వెళ్ళిపోయారు. ఒక గంటసేపో కొంచెం పైమాటో నేను నాలోకం ఉండిపోయి అందరినీ గాభరాపెట్టానని తెలిసింది.

ఈ సంఘటనలు జరిగే నాటికి నాకు రామకథ సమగ్రంగా అవగాహనలో ఉందని కూడా చెప్పరాదు. వాల్మీకి గురించి పెద్దగా తెలియదు. అసలు నాకు అప్పడు ఏమి తెలుసని? ఏమీ తెలియదు.

మీరెవరన్నా ఇది జన్మాంతర సంస్కారం అనుకుంటారా? మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు.

ఎవరన్నా సరే నా మాటలు నా డాంబికప్రవృత్తికి నిదర్శనాలనుకుంటారా? మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు.

ఎవరైనా నేనేదో ప్రచారం కోసమే రామకీర్తనలు వ్రాస్తునానని అనుకుంటే మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు. నా సహజలక్షణంగా నేను రామసంకీర్తనం చేసుకుంటున్నానని అనగలను కాని మీకు ఋజువులు చూపలేను. అటువంటి అవసరం కూడా లేదు నాకు.

నాగురించి నాకు ఏమి తెలుసునని? ఏమీ తెలియదు. అంతా ఆ రాముడికే తెలుసు.

నాది గండాలమారి ప్రాణం. ఎన్నో సార్లు తృటిలో బయటపడ్డాను. అన్ని సార్లూ నన్ను రాముడి సంకల్పమే ఇంకా భూమి మీద ఉండమని ఆదేశించింది. ఈ ఉపాధిలో ఉన్నాను.

ఇంతకు ముందు ఈబ్లాగులో చూచాయగా చెప్పానేమో గుర్తులేదు. ఇప్పుడు సూటిగానే చెబుతున్నాను. నాకు నిదర్శనాలున్నాయి పై మాటలను గురించి. ఊరికే చెప్పలేదు.

ఆరేళ్ళ క్రిందట చివరిసారిగా గండం గడిచింది ఈ ఉపాధికి. అప్పుడు సీతారామలక్ష్మణులను ప్రత్యక్షంగా దర్శించటం కూడా జరిగింది. ఈ ఉపాధిని మాయ ఆవరించి ఉండటం చేత విషయం నాకు ఆకళింపు అయ్యేందుకు కొంచెం సమయం పట్టిందప్పుడు.

అఖరుగా మరొక తెలుగు హాట్ వడ్దన ప్రస్తావిస్తాను

నా ధార్మిక క్షాత్రం నేను చూపించడానికి మీ సలహాలూ సంప్రదింపులూ నాకు అవసరమా?నేను మిమ్మల్ని అడిగానా!మీ పజ్యాలు మీరు రాసుకుంటూ సంతృప్తి పడిపొండి.

అలాగే వారు నాతో మెయిల్ ద్వారా జరిపిన సంభాషణలో నిష్కర్ష చేసిన మాట

So it is your mistake made me to talk like that and never do that mistake again! I have my integrity. I have my knowledge. I have my goal. I have my commitment. Who are you to tread on it again and again?

అనవసరంగా తలదూర్చినందుకే తప్ప ఆ మిత్రుడిచ్చిన విందుభోజనం మీద నాకేమీ ఫిర్యాదులు లేవు.  ఆయన నా గురించి మొదటనే idiotic people like you are detracting people like me! అన్నది గమనార్హం. తలదూర్చటం నా idiocy కావచ్చును.

ఈ టపా ద్వారా రెండు విషయాలు స్పష్టం చేయాలనుకున్నాను. మొదటిది, నాకు సహజలక్షణంగానే రామభక్తి అబ్బినది కాని ఒకరు ప్రబోధించగా కాదన్నది. రెండవది, వ్యాఖ్యలు వ్రాయను అన్న నా మాటకు నేను కట్టుబడటం అవసరం అని గుర్తించాను అన్నది. ఉచితబోడి సలహాలు ఇవ్వటమూ పశ్చాత్తాపపడటమూ అవసరం కాదు కదా!

24, జనవరి 2019, గురువారం

ఎక్కువ సంకీర్తనలు వెలువడ్దాయి నేడు


రామభక్తులారా,

నేడు సుదినం. రామచంద్రులవారికి ఎక్కువ సంకీర్తనలను సమర్పించుకొనే భాగ్యం కలిగింది.
  1. హరినే అచ్యుతునే
  2. చాల దగ్గరి చుట్టము
  3. ఏమి విచారించి వీడు
  4. గోవిందునకు పూజ
  5. రాత యెట్టులున్నదో
  6. పొగడచెట్టు పరచినది
  7. భయపదకు భయపడకు
  8. వేడుకతో నిన్ను నేను
  9. సీతారాములను బడసి
ఇలా జరగటం అంతా రామచంద్రుడి కృపవలన జరిగినదే కాని నా కర్తృత్వప్రతాపం యేమీ లేదని సవినయంగా  అందరికీ మనవి చేస్తున్నాను.


1, జనవరి 2019, మంగళవారం

శ్రీరామసంకీర్తనంలో 500 కీర్తనల ప్రస్థానం


ఈ శ్రీరామసంకీర్తనా కార్యక్రమం ప్రస్థానం ఈక్రింది విధంగా ఉన్నది.

మొట్టమొదటి సంకీర్తన వేగ కనరావయ్య అన్నది 20, ఏప్రిల్ 2012, శుక్రవారం శుక్రవారం నాడు వెలువడింది.
100వ సంకీర్తనం బంటునై నిన్నంటి యుండే అన్నది 15, ఏప్రిల్ 2016, శుక్రవారం నాడు వెలువడింది.
200వ సంకీర్తనం దేవతలకు నైన తెలియరాదు అన్నది 31, అక్టోబర్ 2016, సోమవారం నాడు వెలువడింది.
300వ సంకీర్తనం హాయిగా శ్రీరామభజన అన్నది 23, ఫిబ్రవరి 2018, శుక్రవారం నాడు వెలువడింది.
400వ సంకీర్తనం త్రిజగన్మోహన రూపుని అన్నది 11, సెప్టెంబర్ 2018, మంగళవారం నాడు వెలువడింది.
500వ సంకీర్తనం జయజయ రామా అన్నది 1, జనవరి 2019, మంగళవారం నాడు వెలువడింది.

ప్రయాణవేగాన్ని గమనిస్తే మొదటి నూఱు సంపన్నం కావటానికి ఎక్కువ సమయం పట్టినా ఆపైన వేగంగానే కొనసాగినట్లున్నది.

శ్రీరామచంద్ర మహాప్రభువు సంకల్పం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ కార్యక్రమం ఇతోధికంగా కొనసాగే అవకాశం ఉన్నది.

10, నవంబర్ 2018, శనివారం

ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని


ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున

నిన్న ప్రచురించబడిన ఒక  బ్లాగుటపా అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి అనేది ఈ రోజు (2018 నవంబరు10)న చూసాను.

MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia  (edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991) అనే ఒక పుస్తకానికి పి. సత్యవతి గారి తెలుగు అనువాదం గురించి ఆ బ్లాగుటపా వివరిస్తున్నది.

అ టపా ఎత్తుగడలోనే ఎవరో సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి) గారి ఉవాచ ఒకటి కనిపిస్తోంది.  ''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అని ఆవిడ ఆక్షేపణ వాక్యాలతో టపా మొదలు కావటంతో రెండు విషయాలు స్ఫుటం అవుతున్నాయి. మొదటిది ఆపుస్తకం అధునాతనమైన వామపక్షాది మేధావుల మనోవికాసజనితమైన రామద్వేషం అనే చిగురుకొమ్మగా ఉన్న సనాతనభారతీయసంస్కృతీవిద్వేషవృక్షం. రెండవది సదరు మేధావులకు విద్యార్థిలోకాన్ని గురిచేసుకొని తమతమవిద్వేషభావజాలవ్యాప్తికోసం అహరహం చేస్తున్నకృషి,

బ్లాగుటపా రచనాకారుడి పుస్తకపరిచయ కథనం "భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి" అన్న వాక్యంతో ప్రారంభం అవుతున్నది.

ఈ అభిప్రాయం శుధ్ధతప్పు. (నిజానికి శుధ్ధతప్పు అనేది ఎంత ప్రాచుర్యంలో ఉన్నా అది తప్పుడు సమాసమే అన్నది వేరే విషయం.)

ఒక వ్యక్తికి ఒక జీవితమే ఉంటుంది. అందులో మనం ఎన్ని పార్శ్వ్యాలను దర్శించినా సరే.

ఉన్నది ఒకే రాముడు.

ఆ వ్యక్తి గురించి పదిమంది పదిరకాలుగా ఆలోచించి పదోపాతికో పుస్తకాలు రచించితే ఆ పుస్తకాల లెక్క ఎంతో అంతమందిగా అతడు మారిపోతాడా?

ఆ పుస్తకాలను చదివి స్ఫూర్తిపొందినవాళ్ళు మరో బుట్టెడు పుస్తకాలనూ, ఆ పుస్తకాలను మెచ్చని లేదా మెచ్చలేని వాళ్ళు మరో తట్టెడు పుస్తకాలనూ అదే వ్యక్తి గురించి విరచించి జనం మీదకు వదిలితే ఆ మూలవ్యక్తి కాస్తా అంతమంది వ్యక్తులుగా మారిపోతాడా?

ఉన్నది మొదట ఒకే ఒక వ్యక్తి కదా?

జనంలో కొందరు తమతమ బుధ్ధిజనితవాదాల రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ వ్యక్తిని వివిధంగా ఉన్నాడని వ్యాఖ్యానిస్తే అతడు అనేక మూర్తులుగా ఎలా మారిపోతాడూ అని వివేకవంతులకు తప్పక అనిపిస్తుంది.

ఇక్కడ కొందరు పాఠకులు ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చును. అనేక రామకథలున్నాయీ అనటంలో ఉద్దేశం అనేక మంది రాముళ్ళున్నారూ అని చెప్పటం కాదూ, రామకథను అనేకులు అనేక విధాలుగా గ్రంథస్థం చేసారూ అని చెప్పటం మాత్రమే కావచ్చును కదా ఆవేశపడటం అవసరమా అని.

అవును నిజమే.

అలా అనుకోవటమూ న్యాయమే అనిపిస్తుంది.

కాని అటువంటి సందర్భంలో అనేక రామకథలు ఉన్నాయి అనకుండా భారతదేశ చరిత్రలో రామకథను అనేకమంది వివిధంగా గ్రంథస్తం చేసారు అని అనవచ్చును కదా స్పష్టంగా? కావాలనే అలా అనరు లెండి. వారికి కావలసినది రామకథకు ఉన్న ప్రామాణికతను దెబ్బతీయటం కోసం రామకథకు వాల్మీకికి ఉన్న అవినాభావసంబంధాన్ని నిరసించి ప్రక్కకు తోయటం.

ఆ సుగత గారి "రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అన్న అక్షేపణలో రాముణ్ణి ఆదర్శానికి ప్రతీకగా చెప్పటం పైన -అంటే- అలా చెప్పిన వాల్మీకి రామాయణం పైన నిరసన ఎంత స్పష్టంగా ఉందో తెలియటం లేదా మనకి?

హిందూత్వవాదులు అంటూ సనాతనధర్మాన్ని ఎద్దేవా చేసే ఈ మేథావిగారి ఉవాచలో రాముణ్ణి ఈ భరతజాతి ఎంతో కాలంగా ఆదర్శపురుషుడిగా కొలవటం పైన ఉన్న ఆందోళన విస్పష్టంగా ఉన్నదా లేదా చెప్పండి.

ఇటువంటి (అంటే వాల్మీకంవంటి) రామాయణం నచ్చటం పట్ల ఈ వర్గం మేథావులకు అక్షేపణ ఉందే, మరి వారి దృష్టిలో ఎటువంటి రామాయణం జనానికి నచ్చదగినదీ అన్న ప్రశ్న వస్తున్నది కదా. దానికి సమాధానం ఏమిటీ?

నిజం చెప్పాలంటే ఈ మేథావుల దృష్టిలో రామాయణం ఎవరు ఎలాగు చెప్పినా మెచ్చదగినది కానేకాదు. వారి దృష్టిలో రాముడు ఒక అభూతకల్పన. ఉన్నాడని ఆ వాల్మీకి అతడి చరిత్రను ఒక ఆదర్శపురుషమూర్తి కథలాగా చెప్పటం హర్షణీయం కాదు.  జనం ఆ వాల్మీకి రామాయణాన్ని ఆదరించకూడదు. వాల్మీకి గొప్ప యేమీ లేదు. ఇంకా బోలెడు మంది రామకథను వ్రాసారు. వాల్మీకితో సదరు రామాయణాలన్నీ కలేసి చూడాలి కాని వాల్మీకి చెప్పాడు కదా అని రాముడు గొప్పవాడూ - అతడి జీవితం మనకి ఆదర్శం వంటి దృష్టితో వాల్మీకి ఇచ్చిన రాముడిని గొప్పవాడిని చేయకూడదు. ఇలాంటిది ఈ మేథావుల దృక్పథం. ఈ అధునాతన దృక్పథానికి ఫలంగా జాతికి వీరు అందించే మహత్తర విజ్ఞానఫలం ఏమిటంటే జాతిదృష్టిలో రాముడి పట్ల ఆరాధనాభావం నశించి దానిస్థానంలో రాముడిపై ద్వేషం పెరిగి నవచైతన్యంతో యావజ్జాతీ ధర్మభ్రష్టులు కావటం.

ఏదైనా కొత్తవిషయాన్ని జనం బుర్రలోనికి చక్కగా ఎక్కించాలంటే, పైగా అది తరతరాలకు నిలచిపోయే విధంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది చిన్నపిల్లల తలల్లో దట్టించటం.

ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి తాతలూ బామ్మలనుండీ ఇంకా ఇతర కుటుంబ పెద్దలనుండీ రామకథ పిల్లలకు అందటం సహజం ఐపోయింది.

శ్రీకృష్ణకర్ణామృతం అని లీలాశుకుడి ప్రసిధ్ధ గంథం ఒకటి ఉంది. అందులోని ఒక శ్లోకం చూడండి.

రామో  నామ బభూవ  హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
కృష్ణేనేతి పురాతనీం నిజకథామాకర్ణ్య మాత్రేరితాం
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:

యశోద చిన్ని కృష్ణుడికి రామకథ చెబుతున్నది.

ఆమె 'రాముడని ఒకడున్నాడు' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడి భార్య పేరు సీత' అనగానే  కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడూ అతని భార్యా కూడా పెద్దల ఆజ్ఞమేరకు పంచవటి అనే చోట ఉంటున్నారు'  అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'అక్కడ ఆ పంచవటిలో ఆ సీతను రావణు డనే వాడు ఎత్తుకొని పోయాడు' అన్నది.
ఎప్పుడైతే 'సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు' అని యశోద అన్నదో అ తక్షణం కునికిపాట్లతో ఊఁ ఊఁ అంటున్న చిన్ని కృష్ణుడు రామావతారంలోని వెళ్ళిపోయాడు.  వెంటనే కంగారుగా 'లక్ష్మణా ఏది నా విల్లేది నావిల్లేది' అని బొబ్బలు పెట్టాడు.

అలా రావణప్రసక్తి రాగానే వెంటనే రామావతారంలోనికి దుమికిన బాలకృష్ణుడు రక్షించుగాక అని కవి అంటున్నాడు. శ్రీరామకర్ణామృతం అని శంకరభగవత్పాదుల గంథం ఒకటి ఉంది. అందులోనూ ఈ శ్లోకం కనిపిస్తోంది.

ఇలా తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా రాముడి ఆదర్శవ్యక్తిత్త్వం ఈ భారత జాతికి స్ఫూర్తినిస్తున్నది.

ఈ స్ఫూర్తిని దెబ్బకొట్టాలంటే రామాయణం యొక్క గొప్పయేమీ లేదని చెప్పాలి. రాముడు హీనచరిత్రుడు అని కూడా వీలైనంతగా చెప్పాలి. అదీ పిల్లలకి చెప్పాలి.

ఇంతకంటే ఘోరం ఉంటుందా?

అసలు ఇన్ని రామాయణాలెక్కడివి? వాల్మీకి చెప్పక ముందు రామకథ ఎక్కడ? వాల్మీకి చెప్పిన రాముడు ఎవరు?
ఆ రాముడు ఒక ఆదర్శవ్యక్తి సరే.

ఆ రాముడు కల్పిత పాత్ర ఐతే ఆపాత్రను సృజించిన ఘనతను వాల్మీకినుండి ఎందుకు ఎవరు ఎలా గుంజుకుంటారు? అలా గుంజుకోవటం న్యాయం ఎలా అవుతుంది? వాల్మీకి తరువాత ఆయన సృజించిన పాత్రకు ఇతరులు ఎలా హక్కుదారులు అవుతారండీ?

ఆ రాముడు చారిత్రక వ్యక్తి ఐతే, ఆయన కథను మొట్టమొదట గ్రంథస్థం చేసి జాతికి అందించినది వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి తరువాత తండోపతండాలుగా వచ్చిన పునఃకథనాలు వాల్మీకి నుండి భిన్నంగా ఉంటే తప్పు అవుతుంది కాని వాల్మీకి చెప్పనిదేదో వాళ్ళు చెప్పినట్లు మనం ఎలా తీర్మానిస్తాం? అది కాక వాల్మీకికి కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత వచ్చిన వాళ్ళ రచనలలో వాల్మీకికిమించి ప్రామాణిక కథనం ఎలా వస్తుంది? అలా వస్తున్నది అని చెప్పటం అమానుషం కాదా?

ఇప్పుడు అనేకరామాయణాల ఆధారంతో రామకథను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం అనే వ్యవహారం నేటి చరిత్రకారులూ మేధావులూ ఎలా చేస్తారూ? వందలకొద్దీ ఉన్న పిల్లరామకథలన్నీ కలేసి వాల్మీకి రాముడికి కొత్తరూపురేఖలు దిద్దటం అనే నవీనశాస్త్రీయకర్మకలాపం చేస్తారా? అసలు రాముడే లేడని సిధ్ధాంతం చేస్తారా?

రాముడి కథ తెలియాలంటే వాల్మీకి అధారం.
ఇతరులు వేరేగా అందంగానో వికారంగానో కొత్తకొత్త కథలు చెబితే అవి రామకథలు కాలేవు. అవి ప్రామాణికాలు కాలేవు.

రాముణ్ణి భారతజాతికి దూరం చేయాలని కుహనామేధావులు పన్నుతున్న కుట్రల్ని తిప్పికొట్టండి!

12, సెప్టెంబర్ 2018, బుధవారం

'కలలో నీలిమ కని' పాటకు వివరణ


ఈ కలలో నీలిమ కని అన్న మాటను గూర్చిన సమగ్ర వ్యాసం కలలో నీలిమ కని .... వేణువు విని! మనకు వేణువు బ్లాగులో లబిస్తున్నది.  తప్పక చదవండి. అన్నట్లు ఈ పాటను వ్రాసినది ఎస్.వి. భుజంగ రాయ శర్మ గారు.

ఈ పాట వినవలసిన పాటల్లో ఒకటి. దీని ఆడియో లింక్ ఆ వ్యాసంలో కూడా లభిస్తున్నది.

ఒకటపా డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి …. అనే దానిలో ఒక వ్యాఖ్య కనిపించింది.

Chiranjeevi Y
"చిన్నప్పుడు రేడియోలో నాకు బాగా నచ్చిన పాట అది. 2 సం.. క్రితం దాన్ని వెతికి పట్టుకోని దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు దాన్లో ఒక్క ముక్కకి కూడా అర్ధం తెలియదు .

ఈ వ్యాఖ్యను చూసాకనే ఆ బ్లాగు తెరచి ఈ పాటను గమనించటమూ వినటమూ జరిగింది. ఇంంతవరకూ ఈ పాటను ఎన్నడూ విననే లేదు!

ఈపాట సాహిత్యాన్ని వేణువు బ్లాగునుండి తీసుకొని క్రింద చూపుతున్నాను. (గమనిక: పాటపాడేటప్పుడు అక్కడక్కడా పల్లవి వగైరాలు పునరావృత్తం అవుతాయి. ఇక్కడ సాహిత్యం మాత్ర్రమే వ్రాస్తున్నాను.)

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

ఇంక చిరంజీవి గారు అన్నట్లుగా ఈ పాట అర్థం కాని వారి కోసం కొంచెం వ్యాఖ్యానించటం అవసరమే.

ఈ పాటలో  చెప్పుకోవలసిన విశేషం శ్రవణసుభగత్వం. అంటే చెవికి ఇంపుగా ఉండటం. ఈ లక్షణం ఎలా వస్తున్నదీ అంటే దానికి ఒక కారణం పల్లవిలో నీలిమ, చారిమ, రక్తిమ అనే ఒకే రకంగా ముగిసే పదాలూ అలాగే చరణాల్లో మువ్వలు, నవ్వులు, సవ్వడి, వేదన వేదన  వంటి ప్రాసపదాల వలన. ఐతే అంతకన్నా ముఖ్యకారణం ఈ పాటలో విస్తృతంగా కనిపించే ముక్తపదగ్రస్తాలంకారం వలన. అంటే ఒకపదాన్ని వెంటవెంటనే వాడటం అనే చమత్కార ప్రక్రియ వలన.

కలలో ఒక నీలిమ కని అని మొదలవుతుంది పాట. నిజానికి కలలో ఒక నీలిమ కని అని ఉంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. నీలిమ అంటే నలుపురంగు. కలలో ఒక నలుపురంగు కనబడింది అంటే అంత గొప్ప మాటగా అనిపించదు గబుక్కున. నీలిమ అంటే నల్లదనం అన్నది వాస్తవమే కాని ఇక్కడ సూచించేది ఏమిటంటే ఒక నల్లటి వస్తువు అని. వస్తువేమిటయ్యా వస్తువూ? కలలో ఒక నల్లపిల్లాడు కనిపించాడూ అని అర్థం తీసుకోవాలి. ఎవడి నీలివర్ణం ఒకవిశేషమో అతడు కనిపించాడూ అని చెప్పటమే నీలిమ కని అని చెప్పటంలో ఉద్దేశం. నీలాకాశం అటే మబ్బుపట్టిన ఆకాశం - అది చూడగానే కృష్ణుడు మనస్సుకు స్ఫురించటం అనేది ప్రసిధ్ధంగా అనేకానేక పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది కదా.  ఐతే, ఈ పాటలో చెప్పిన విధం ఏమిటంటే కలలో ఒక నల్లని వాడు కనిపించాడు అని చెప్పి, మనల్ని అతడు కృష్ణుడే అని  గ్రహించమనటం జరుగుతోంది. ఏమిటయ్యా అందుకు ఋజువూ అంటే, కాస్త ఆగండి. మరికొంచెం అర్థవివేచన చేసాక పునరాలోచన చేస్తే అంతా స్పష్టం అవుతుంది కదా.

ఆ నీలిమలోకమల పత్ర చారిమ గని అని నీలిమను స్మరించటం వెంబడే చెబుతుందీ పాట. కమలపత్రం అంటే ఏమిటీ అన్నది మొదట తెలుసుకోవాలి. కమలం అంటే తామరపువ్వు, పత్రం అంటే ఆకు కాబట్టి కమలపత్రం అంటే తామరాకు అను చెప్పుకున్నామా కుదరనే కుదరదు అన్వయం. పత్రం అంటే పువురేకు కూడా. కమలపత్రం అంటే తామరపూవు రేకు.

అయోద్యాకాండలోని ఈ శ్లోకం చూడండి

స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః.
రామః కమలపత్రాక్ష: జీవన్నాశమితో గతః. (2.66.8)

అలాగే

రామః కమలపత్రాక్ష:,సర్వ సత్వమనోహరః!
రూప దాక్షిణ్య సంపన్నః,ప్రసూతే జనకాత్మజే!!

అలాగే

రామః కమలపత్రాక్ష. సర్వసత్వ మనోఠథః  అని హనుమంతుడు రాముని వర్ణిస్తాడు.

భగవద్గీతల్లో పదునొకండవ అధ్యాయంలో అర్జునుడు చెప్పిన శ్లోకం

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్

ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి కమలపత్రాక్షుడని అంటాడు.

అందుచేత కమలపత్రచారిమ అన్న మాటలో, చారిమ అన్న సౌందర్యసూచకపదానికి అధారం ఐన కమలపత్రం ఏమిటీ అంటే అది ఒక తామరపూవు రేకుతో పోల్చబడిన సౌందర్యం అని గ్రహించాలి.

మనం చూసాం కదా, ప్రసిధ్ధంగా కమలపత్రాక్ష అని విష్ణువునీ ఆయన అవతారాలైన రామ, కృష్ణులనీ సంబోధిస్తున్నారని?

అందుచేత కమలపత్రచారిమ అంటూ తామరపూరేకువంటి ఒక ఆందం కనిపించిందంటూన్నారే అది ఆ నల్లని స్వరూపంలోని కన్నుల సౌందర్యమా? మరొకటా?

మరింత పరిశీలనగా చూదాం మరి.

కమలపత్రచారిమలో కనిపించినది సౌహృద మృదు రక్తిమ అట. ఏమిటండీ ఈ సౌహృద మృదు రక్తిమ అన్నది?

సౌహృదం అంటే సుహృద్భావం అనగా స్నేహం.  మృదు శబ్దం కూడా తెలిసినదే - మెత్తనిది అని అర్థంలో. ఇక రక్తిమ అంటే ఏమిటి? ఆ మాటకు మూలం రక్త శబ్దం! రక్తం ఎఱ్ఱగా ఉంటుంది కదా. అందుచేత రక్తిమ అంటే రక్తవర్ణం - ఇంగ్లీషు వాడు బ్లడ్ రెడ్ అంటాడే ఆ రంగు అన్నమాట. ఈ సౌహృద మృదు రక్తిమ అన్న పదగుంభనంలో అన్ని మాటలకూ విడిగా అర్థాలు చూసాం కదా. ఇప్పుడు సమాహారంగా ఈ సౌహృద మృదు రక్తిమ అంటే ఏమన్న మాటా?
 మొట్ట మొదట మధ్యలో ఉన్న మృదు శబ్దం రక్తిమ పైననా సౌహృదం పైననా అన్వయించేదీ అన్నది నిర్థారించుకోవాలి.  మెత్తని ఎఱుపు అన్నది అసందర్భం కాబట్టి చచ్చినట్లు ఆ మృదుశబ్దం కాస్తా సౌహృదం పైననే ప్రయత్నించాలి. మెత్తని స్నేహం అన్నదేదో కొంచెం బాగానే ఉన్నట్లుంది. కొందరి దృష్టిలో కొంచెం కవిత్వపుపైత్యం అనిపించినా సరే. ఎంతో అభిమానంతో కూడిన స్నేహం అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు ఆపైన రక్తిమ అన్నది ఎలారుద్దేదీ చూడాలి. అభిమానమో స్నేహమో దేనికైనాను ఎలా రంగుపులిమేదీ? అది ఎంత అందమైన ఎరుపు ఐతే మాత్రమున్నూ?

కొంచెం క్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తోంది కదూ? అక్షరాలా క్లిష్టమైన సంగతేను.

ముందు మనం రక్తిమకు ఎక్కడైనా మానవదేహంలో అన్వయం దొరుకుతుందేమో చూదాం.  అందంగా ఎఱ్ఱగా ఉన్నాయీ అని సాధారణంగా మన కవులు తెగ వర్ణించేవి ఏమిటబ్బా అంటే సులభంగానే పోల్చుకోవచ్చును.
అమ్మాయిలకైతే బింబాధరి అని ఒక పర్యాయపదం కూడా ఉంది చూడండి. ఇక్కడ బింబం అంటే దొండపండు. దొండపండు ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది కదా అని అమ్మాయిల పెదవులకు దానితో పోలిక అన్నమాట. ఇంకా చిగురుటాకుల్లాగా మృదువుగా ఎఱ్ఱగా ఉంటాయి అరచేతులూ అరికాళ్ళూ అని కూడా అమ్మాయిల పరంగా మనకి వర్ణనల్లో కనబడటం మామూలే.

ఎంతలేదన్నా విష్ణుమూర్తినీ - కృష్ణస్తు భగవాన్ స్వయమ్ - అని చెప్పటం ప్రసిధ్ధం కాబట్టి కలేసి కృష్ణుడినీ కూడా అమ్మాయిలకి చెప్పినట్లే అరవిందాక్షుడనీ గట్రా వర్ణించటం మామూలే. కావాలంటే చూడండి లీలాశుకుడు ఎలా బాలకృష్ణుణ్ణి వర్ణించాడో

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయం తం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలాం ముకుందం మనసా స్మరామి

ఇన్ని అరవిందాలున్నాయే ఈ శ్లోకంలో, అసలు అరవిందం అంటే ఏమిటో తెలుసునా? తామరపువ్వు. విశేషంగా ఎఱ్ఱతామర పువ్వు అన్న అర్థం ఉంది ముఖ్యంగా.

అమ్మయ్య. పట్టు దొరికింది కదా?

ఇప్పుడు సౌహృద మృదు రక్తిమలోని రక్తిమ అన్నది ఎఱ్ఱతామరలోని ఎఱుపున్నూ, ఆఎఱుపు రంగు ఉన్నది సౌహృదం చిందే మృదువైన పెదవులున్నూ అనుకుంటే అంతా చక్కగా అహ్లాదకరంగా అన్వయం సిధ్ధిస్తున్నది. అదీ సంగతి.

ఇప్పుడు పాట పల్లవిని ఒకసారి మరలా చూదాం.

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

కలలో ఒక నల్లని స్వరూపం (అంటే నల్లనయ్య రూపం అన్నమాట) కనిపించింది. అది ఆట్టే స్పష్టంగా లేదింకా. క్రమంగా అందులో ఒక కమలపత్ర చారిమ కనిపించింది పరిశీలనగా చూస్తేను. ఆ కమలపత్రచారిమ అంటే అందమైన తామరరేకులవంటి కన్నుల సొగసు అన్నమాట. ఆ కమలపత్రచారిమలో అంటే అందమైన తామరకన్నులున్న రూపంలో అన్నట్లుగా అన్వయం చెప్పుకోవాలి - అందులో ఒక సౌహృద మృదు రక్తిమ కనిపించిందట. అంటే స్నేహపూర్వకమైన (చిరునవ్వుకల) మృదువైన అందమైన ఎఱ్ఱని పెదవులు కనిపించాయట. అంటే నల్లనయ్య స్వరూపం స్థూలంగానూ క్రమశః అందులో ఆయన అందమైన కన్నులూ పెదవులూ కనిపించాయంటున్నారు. ఇక్కడ అందచందాల ప్రసక్తి ఎందుకూ అంటే చూడండి కళ్ళు మనపట్ల ప్రసన్నంగా ఉంటేనే కదా అవి అందంగా కనిపించేదీ? అలాగే చిరునవ్వులు చిందే పెదవులే కదా అందంగా కనిపించేదీ? ఇక్కడ అంతర్లీనభావం ఏమిటంటే ఆ నల్లనయ్య మోము ఎంతో ప్రసన్నంగా ఉన్నదీ అని చెప్పటం.

ఇక్కడ మరొక రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. కమలపత్రచారిమ అన్నప్పుడు ఆ కమలపుటాలుగా కనిపించినవి పాదాలో అరచేతులో లేదా  ముఖమో అనుకోవచ్చును కదా అన్నది ఎందుకు పరిశీలించలేదూ అని ఎవరైనా అనవచ్చును.  సౌహృద అనే పదం కూడా అన్వయం కావలసి ఉన్నది కాబట్టి కేవలం కన్నులను మాత్రమే తీసుకొనటం జరిగింది కమలపత్రచారిమ కొరకు అని సమాధానం. కమలపు రేకులతో పోల్చటానికి కన్నులకున్న సౌలభ్యం ఇక్కడ మరింత బాగున్నది కాబట్టి అనీ మనం గ్రహించాలి.

ఈ స్వప్నదృశ్యానికి మనస్సు ఎలా స్పందించిందీ అంటే

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

అగరుదూపం అంటే అగరు వత్తి పొగ. అదిసన్నగా ఒక తీగలాగా గాలిలో పైకి కొంచెం మెలికలు తిరుగుతూ వెళ్ళటం అందరికీ అనుభూతం ఐన విషయమే కదా. లత అన్నా లతిక అన్నా ఒక తీగ అని అర్థం.  క అనేప్రత్యయం అల్పార్థాన్ని సూచిస్తున్నది కాబట్టి లతిక అంటే సన్నని తీగ అని తీసుకోవాలి. నిజమే కదా అగరువత్తి పొగ ఒక సన్నని తీగలాగా గాలిలో తేలుతూ పైకి ప్రాకుతూ పోతూ ఉంటుందీ.

ఇక్కడ అలాంటి తీగలాగా ఎగసిపోతున్నదట మనసు. ఎగసిపోవటం అంటే పైపైకి ఎగిరిపోవటం అన్నమాట. ఈ మనసు అలా ఎందుకయ్యిందీ అంటే అవశమవటం కారణం. అవశత్వం అంటే తనపై తనకు అదుపుతప్పిపోవటం - అనగా - మైమరచిపోవటం అన్నమాట. బాగుంది కదా?

మరి అలా మైమరచిపోవటం ఎటువంటిదీ అంటే అగరువత్తి ధూమపు పొగకు తనపై తనకు అదుపులేక ఎగిరిపోతూ ఉంటుందో అలాగన్నమాట. బాగుంది బాగుంది.

మరి ఆమనస్సును పట్టుకొని వెఱ్ఱిది అనటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది.  మరి వెఱ్ఱి అంటేనే తనపై తనకు అదుపు లేకపోవటమే కదటండీ. ఎంత పిచ్చిపట్టినట్లుగా అయ్యిందీ  అని చెప్పటం బాగున్నది కదా సార్థకంగానూ.

ఇలా అవశత్వం పొందటానికి ఆకలలో మరొక కారణం కూడా పాటలో తరువాత వచ్చే చరణాలు తెలుపుతున్నాయి.

మొదటి చరణం.

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అన్నది.

కలల్లో దృశ్యమే కాదు శ్రవణం కూడా అందరికీ అనుభవమేను. ఇక్కడ ఆ శ్రవణానందమూ అనుభవం లోనికి వచ్చిందట. కలలో మువ్వల సవ్వడి వినిపించిందట. ఆ మువ్వల సవ్వడితో పాటే సిరిసిరి నవ్వులూ వినిపించాయట. ఆ నవ్వుల వెనుక ఒక మూగవలపు కూడా ధ్వనించిందట. ఇదంతా చాలా వరకూ సులభంగా అనిపిస్తోంది అర్థంచేసుకుందుకు. కాని మూగ వలపు అని ఎందుకన్నారూ?

అన్నట్లు సిరిసిరి నవ్వులూ అన్నారేమీ చిరుచిరు నవ్వులూ అనకుండా అన్న సందేహం వస్తుంది. సిరి అంటే శోభ అన్న అర్థం తీసుకొంటే ఎంతో శోభాయమానంగా ఉన్న నవ్వులు అని చెప్పుకోవచ్చును. నవ్వు శోభాయమానంగా ఉండటం అంటే ఆ నవ్వులే ఎంతో అందంగా ఉన్నాయని చెప్పట అన్నమాట.

మూగవలపు అంటే ఒకరి మనోభావాలని మరొకరితో ప్ర్రేయసీ ప్రియులు పంచుకోలేనిస్థితి. భాషతో వ్యక్తంచేసుకోలేని పరిస్థితి. దీనికి లోకవ్యవహారంగా ఐతే ఇతరుల వలన అడ్డంకులు. మరి ఇక్కడ? భాష చాలక అని అర్థం. ఏవిధంగానూ జీవుడు ఎంతప్రయత్నించినా భగవంతుడి పట్ల  తనప్రేమని పూర్ణంగా  భాషసహాయంతో వ్యక్తం చేయలేడు. భగవంతుడు వ్యక్తం చేయలేడు అనలేము కాము జీవుడు అందుకోలేడు కదా అని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మూగవేదన అనటం. పై చరణం కూడా వ్యాఖ్యానించుకుందాం. అప్పుడు మరింత స్పష్టత వస్తుంది.

రెండవ చరణం చూదాం.

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని


అలా శ్రవణం చేసినది ఒక వేణువు రవళి కూడా

ఆ వేణుగానంలో ధ్వనించినది ఒక మధురమైన విరహ వేదన అట.

ఆ విరయవేదన అన్నది ప్రణయతత్త్వాన్ని సూచిస్తున్నది అంటున్నారు.

అసలు విరహం అంటే ఎడబాటు. సాధారణంగా ప్రేయసీప్రియుల మధ్య కలిగిని ఎడబాటుగా చెప్పుతూ ఉంటాం. తల్లీబిడ్డలమధ్యనో అన్నాచెల్లెళ్ళ మధ్యనో కలిగిన ఎడబాటును విరహం అని చెప్పరు. అది సంప్రదాయం కాదు.

ఇక్కడ ప్రియుడు మురళీగానవినోదుడు. అంటే కృష్ణుడు.

మరి ఆ ప్రేయసి ఎవరూ అంటే జీవుడు.

భగవంతుడు ఒక్కడే పురుషుడు అని మీరా అన్నమాట ప్రసిధ్ధం. ఒకసారి ఆవిడ ఒక స్వాములవారిని చూడటానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుపడి తమ గురువుగారు స్త్రీలను చూడరూ అని సెలవిచ్చారట. అప్పుడు అన్నదట మీరాబాయి. ఓహో పరమాత్ముడొక్కడే పురుషుడు అనుకుంటున్నాను ఇప్పటిదాకా.  ఇప్పుడు మీగురువుగారు అనే మరొక పురుషుడు బయలుదేరాడా అని. స్వాములవారి శిష్యులూ ఆ స్వాముల వారూ కూడా సిగ్గుపడ్డారట అని వేరే చెప్పనవరం లేదు కదా.

పరాభక్తిని గురించి 'సాతు అస్మిన్ పరమ ప్రేమరూపా' అని నారదులవారు సూత్రీకరించారు. ప్రేయసికి ప్రియునితో ఐక్యం కావటమే పరమార్థం ఐనట్లుగా జీవులు అనే స్త్రీలు భగవంతుడు అనే పురుషుడితో కలయికకు మరమప్రేమతో తపించటమే భక్తి అని దాని అర్థం.

ఈ భగవంతుడేమో దూరంగా ఉన్నాడనుకోండి. జీవుడికి విరహవేదన. అదే భక్తి. శివానందలహరిలో ఈ భక్తి అనేదానిని గురించి శంకరభగవత్పాదులు చెప్పిన శ్లోకం చూడండి

అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః పదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే

ఈశ్లోకానికి ఇప్పుడు మనం వ్యాఖ్య చెప్పుకోవాలంటే చాలా గ్రంథం అవుతుంది కాని, ఇక్కడ అందులోని ఒక ఉపమానాన్ని మాత్రం చూద్దాం. అది 'స్వాధ్వీ నైజవిభుం' అన్నది.  పతివ్రత ఐన స్త్రీమూర్తి ఎలా తన భర్తను సర్వకాలసర్వావస్థల్లోనూ ఆశ్రయించి ఉంటుందో అలా ఉండటమే జీవుడు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉండటమే భక్తి అని అంటారు అని ఈశ్లోకం నిర్వచనం చెబుతోంది.

ఇప్పుడు పాటదగ్గరకు వద్దాం. చరణంలో ' వేణువులో విరహ మధుర వేదన విని'  అన్నారు కదా.

ఇక్కడ  న్యాయంగా చదువరికి ఒక సందేహం కలగాలి.  విరహం అనేది ప్రేయసికి ప్రియుడు పట్ల కలిగేది కదా అని. కాదండీ పొరబడకండి. విరహం అన్నది ప్రేయసికీ ప్రియుడికీ కూడా సమానావస్థయే. కాకపోతే అది రసాభాసం అవుతుంది. ఇంగ్లీషువాడంటాడే వన్ సైడ్ లవ్ అనగా ఏకపక్షప్రేమ అనీ అలాగు అన్నమాట.

మనం సాధారణంగా జీవుడు భగవంతుడికోసం తపనపడటం గురించే ఎక్కువగా చదువుతూ ఉంటాము. అలాగే ఆ ప్రభావంతో ఆలోచిస్తూ ఉంటాము.

ఈ పాటలో అమురళీ రవంలో విరహం ధ్వనిస్తోందని చెప్పటం ద్వారా భగవంతుడు కూడా విరహంతో ఉన్నాడని చెప్పటం కనిపిస్తోంది కదా. అది గొప్పగా ఉంది.

అవునండి. అయనకూడా ఈజీవుడు ఎప్పుడు తనను చేరుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంటాడట. జీవుడు తనవైపుకు ఒక అడుగు వేస్తే అయన ఆత్రంగా ఆ జీవుడివైపుకు పది అడుగులు వేస్తాడని చెబుతారు.

సర్వశక్తిమంతుడు కదా ఆయన జీవుణ్ణి కొంచెం జబర్ధస్తీగా తనవైపుకు నడిపించుకొన వచ్చును కదా అన్న మాట వస్తుంది సహజంగా. కాని అలా కాదు. ఆయన అలా చేయడు. అది ఆయన నియమం. ఆయన చేసిన సృష్టికి ఆయన పెటిన ఒక నియమం. జీవుడికి కర్మస్వాతంత్ర్యం ఉంది. అది ఆ ప్రభువు ఇచ్చినదే. అందుచేత అ జీవుడే తనవద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అదే, ఆ ఎదురుచూపే విరహం. భగవంతుడికి భక్తుడికోసం కలిగిన విరహం అన్నమాట,

పాటలో విరహ మధుర వేదన అని ఎందుకన్నారూ అంటే విరహవేదన ఎంత దుస్సహంగా అనిపిస్తుందో అది అంత మధురంగానూ ఉంటుంది అంటారు కాబట్టి.  ఎందుకంటే ఆవలి వ్యక్తి గురించిని ఆలోచనా పరంపరతో ఇతరప్రపంచాన్ని మరచి ఆ వ్యక్తి సాన్నిధ్యాన్ని మనసా అనుభవిస్తూ ఉండటం చేత. అందుకే కదా ప్రసిధ్ధమైన సినిమా పాటలో 'విరహపు చింతన మధురము కాదా' అని అంటాడు కవి.

వేణు గానం మధురంగా ఉంటుంది. అది మరింత మధురంగా ఉందట - విరహమాధుర్యాన్ని సంతరించుకోవటం వలన.

ఈ విరహ మధుర వేదనలో ఒక ప్రణయ తత్త్వ వేదం వినిపిస్తోందని పాట అంటోంది.

ఇక్కడ జీవుడికీ దేవుడికీ మధ్యన ఉన్న ఉత్తమోత్తమమైన ప్రణయం అన్నదే కదా విరహం అనే స్థాయీ భావానికి కారణం? అందుచేతనే అలా చెప్పటం జరిగింది. ఇది చాలా బాగుంది.

మరి దాన్ని వేదం అని ఎందుకన్నారూ అని సందేహం రావాలి.

విద్ అన్న ధాతువుకు తెలుసుకోవటం అన్నది అర్థం కాబట్టి వేదం అంటే జ్ఞానం అన్న అర్థం సిద్ధిస్తోంది.

ఈ భగవంతుడికీ జీవుడికీ మధ్యన ఉన్న ప్రణయభావనయే జ్ఞానం! ప్రేయసీ ప్రియులు తాము ఒకటే అనుకుంటారు. అలా అని తెలుసుకోవటమే వారి ప్రణయానికి పరమార్థం. అలా జీవుడు దేవుడితో ఒకటి కావటమే ఆ ప్రణయానికి పరమార్థం కదా. అలా తెలుసుకోవటమే అంతిమమైన జ్ఞానం. దానికి మించిన జ్ఞానం లేదు.

మరి ఆ దివ్యప్రణయాన్ని తత్త్వం అని ఎందుకంటున్నారూ అని ఆలోచించాలి.

తత్త్వం అన్న మాట తత్ + త్వం అన్న మాటల కూడిన అంటే అది నీవే అని అర్థం.  ఆ భగవత్త్వత్త్వం - జీవుడూ ఒకటే. రెండుగా మాయచేత అనిపించటమే కాని ఆ దేవుడూ జీవుడూ ఒక్కరే. అదే ఆ ప్రణయతత్త్వం.

ఇదీ ఈ పాట వెనుక ఉన్న తాత్తికమైన వివేచన.

ఏదో నా చేతనైనంతగా పాటకు వివరణ ప్రయత్నించాను. ఎంత వరకూ నప్పుతున్నదీ చదువరులే చెప్పాలి.

18, ఏప్రిల్ 2018, బుధవారం

దేవతలూ అప్సరసలూ

ఈ రోజున మిత్రులు మధుసూదన్ గారి నుండి ఒక ప్రశ్న విన్నాను. అందఱను స్వర్గ సౌఖ్య సంతృప్తులనుగాఁ జేయుచున్న దేవవేశ్యలందఱను సతులుగాఁ బరిగణింపవచ్చునా?" యని.

కొంచెం‌ బాధ కలిగినా అది అనేకమందికి ఉండే సందేహమే‌ కాబట్టి అలా వారు అనటాన్ని తప్పుబట్టలేను. ఇది లోకసహజమైన అభిప్రాయం కాబట్టి.

ఈ విషయంలో నాకు తెలిసిన నాలుగు ముక్కలు వ్రాయాలని అనిపించింది.

దేవతలు ప్రధానంగా తైజసమైన రూపం కలవారు. అంటే వారందరూ తేజోమూర్తులే ఐతే వారు శారీరకంగా కరచరణాద్యవయవాలూ మానసికమైన కామాదిక వికారాలూ లేని వారా అంటే లేని వారే కాని కార్యార్థం రూపధారణం చేస్తా రంతే.

మనం ఇంద్రుడు అంటాం. విశ్వనాథవారు శచీపురందర ఋషి అంటారు. సినిమాల్లోనూ‌ నాటకాల్లోనూ వారి అవసరాలకోసం నీచపాత్రను చేసి చూపుతారు నిరభ్యంతరంగా. అంటే కథాగమనం కోసమూ, వారు పైకెత్తవలసిన పాత్రలు పండటం కోసమూ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రుడైనా మరెవరైనా సరే దుష్టపాత్ర కావలసి వస్తుంది తరచుగా.

కాని నిజం ఏమిటి చూదాం.

ఇంద్రుడు త్రిలోకాలనూ‌ పాలించే కర్తవ్యం ఉన్నవాడు.

ముఖ్యంగా అయన మునులందరకూ‌ పరీక్షాధికారి.

మీరొక పోటీ పరీక్షకు బాగా తయారవుతారు. ప్రశ్నాపత్రం మరీ సులభంగా ఉందనుకోండి.

అయ్యయ్యో‌ అందరూ సుబ్బరంగా చాలా బాగా వ్రాసేస్తారు. నాలా బాగా తెలివైన వాడికి అది చూపించే‌ అవకాశం ఈ‌డొక్కు పరీక్ష పుణ్యమా అని తప్పిపోయింది అని అనుకుంటారు. ఇబ్బడిముబ్బడిగా అందరికీ మంచి మార్కులు పడిపోతే మనం గుంపులో గోవిందా ఐపోతామే అని ఆదుర్దా పడతారు. నిజమే‌ కదా?

సరే నండి. వీళ్ళిలా అనుకుంటారు అభ్యర్థు లంతానూ అని ఊహించుకొని ప్రశ్నపత్రాన్ని కాస్త కఠినంగా బిగించి ఇచ్చారను కోండి. ఏమవుతుంది?

హారి వీడి దుంపతెగా. ఇంత కర్కోటంగా పరీక్షాపత్రం ఉంటే ఎలాగూ? అందరినీ‌ బాగా ఏడిపించాలని ఎవడో శాడిష్టు మన కొంపముంచాడే! ఏంత బాగా తయారయ్యానూ, ఎంత కాలం నుండి తరారయ్యానూ, దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానూ, వేరే అవకాశాలు ఎన్ని వదలు కున్నానూ అంటూ రాగాలు తీస్తారు. ఇదీ నిజమే‌ కదా.

అసలు పరీక్షా పత్రం అనేదానిలో కాఠిన్యం ఎందుకూ అవసరమా?

మీరే ఒక పరీక్ష పెడుతున్నారనుకోండి. మీ‌ అఫీసులో‌ ఒక జూనియర్ సైంటిష్టో మరొకటో‌ అని.

ఉన్నదేమో ఒక్క పోష్టు. అభ్యర్థులు అక్షరాలా మూడువేలమంది అని కూడా అనుకోండి.

సరే లెక్కప్రకారం పరీక్షలో ఫష్టు పదిమందికీ ఇంటర్వ్యూ నిర్వహించి మీరో మరొక టీమో చివరకు ఒకరిని నిర్థారించాలి. అదీ ప్లాను.

ఐతే మూడువేల మందిలో దాదాపు అందరూ ఒకేలా సరైన సమాధానాలు ఆటోమాటిగ్గా గీకి పారేసేలా PV = RT అనే సూత్రాన్ని ఏమని పిలుస్తారూ. అందులో R అంటే ఏమిటీ అనొకటీ, సోడియం క్లోరైడ్ అనే రసాయనపదార్థాన్ని ఏమంటారూ దాన్ని ఎందుకు వినియోగిస్తారూ, గ్రిగ్నార్డ్ రియేజెంట్లు ఎందుకు పనుకొస్తాయీ లాంటి ప్రశ్నలు సంధించారనుకోండి. చివరికి ఏంజరుగుతుందీ. సగానికి పైబడి అభ్యర్థులంతా నూటికి నూరు తెచ్చికొని గుమ్మంలో కూర్చుంటారు? ఏ పదిమందిని పిలుస్తారు వాళ్ళలోంచి?

అందుచేత ప్రశ్నాపత్రం అవసరానికి తగినంత కఠినంగా ఉండవలసి వస్తుంది. తప్పదు. నిజానికి అవసరమైన దానికన్నా కూడా సాధారణంగా కష్టంగానే ఉంటుంది మరి.

ఏదో నూరు యజ్ఞాలు చేసేస్తే చాలు ఇంద్రుడి పదవి ఊడగొట్టి ఆ యజ్ఞకర్త కాస్తా ఇంద్రుడైపోతాడూ అందుకే ఇంద్రుడు ఎవరి యాగాలూ సాగనివ్వడూ. అలాగే మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సు వల్ల ప్రకృతి వారికి వశమై పోతుందీ‌ తన ప్రభ పదిపోతుందీ అని అందరి తపస్సులనూ ఇంద్రుడు చెడగొడుతూ ఉంటాడూ‌ అని కూడా జనం అనుకుంటారు.

నిజం‌ కాదు.

అయనకు తపస్సూ తెలుసును. దాని విలువా తెలుసును. ఆయస స్వయంగా గొప్ప ఋషి, వేదమంత్ర దృష్ట. అమ్మవారి ముఖ్యభక్తులలో ఒకడు.

ఎవరైనా తపస్సు ద్వారా ఏదన్నా ఉద్దేశాన్ని సాధించుకొనేందుకు చేస్తున్నా రనుకోండి. అది ఫలిస్తే వారికి అపూర్వమైన అవకాశంగా ప్రకృతిపై పెత్తనమే వస్తుంది అనుకోండి. ఇంకా గొప్పగొప్ప మంచీ చెడులు వారి అధీనంలోని వస్తాయనుకోండి.

అప్పుడు ఇంద్రుడు కలుగ జేసుకోవాలి.

అదికావాలీ‌ ఇదికావాలీ అని తపస్సు చేసే వాళ్ళకు ఆ తపఃఫలితంగా లభించే‌ శక్తిని భరించే సామర్థ్యం ఉండాలి ముందుగా.

అది ఉందా వాళ్ళకి అని చూసే పూచీ ఆ ఇంద్రుడు తీసుకోవాలి.

ఉదాహరణకు విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠమహర్షి పైన కక్షసాధింపు కోసమే తపస్సును ఎన్నుకున్నాడు. తపశ్శక్తితో ఆయన ముందుకు వెళ్ళి చూడూ‌ ఇప్పుడు నా తపస్సే గొప్పది అని చూపా లనుకున్నాడు. ఆయన లక్ష్యంగా నిర్దేశించుకొన్న బ్రహ్మర్షిత్వం అన్నది ఎంత గొప్ప శాంతమూర్తికి తప్ప సాధ్యం కానిదో ఆయన తొలుత అవగాహన చేసుకోలేదనే చెప్పాలి.

ఇంద్రుడు ఆయనకు పరీక్షలు పెట్టాడు. రకరకాలుగా విసిగించాడు.

ఆయనతో కాపురంచేసిన మేనక అలాంటి ఒక కథానాయకి.

ఆయన కోపాగ్నికి బలై శిలారూపం ధరించిన రంభ మరొక పాత్ర.

కాని ఈ‌పరీక్షలే విశ్వామిత్రుడిలో మొదట అసహనాన్నీ కోపాగ్నినీ‌ రగిల్చినా ఆయన చివరకు విషయం అర్థం చేసుకున్నాడు.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటమే‌ కాదు. విష్ణ్వతారమైన రామచంద్రమూర్తికి గురువు కూడా కాగలిగాడు.

ఇంద్రుడి పరీక్షల వలన మంచే‌ జరిగించి.

ఆయన స్వయంగా అందరూ నిత్యం ఆరాధించే గాయత్రీ మంత్రదఋష్ట అన్నది మనకు తెలుసు.

అయన గొప్పదనానికి ఇంద్రుడు కూడా గొప్ప కారణమే.

అనవసరంగా ఇంద్రుడి సోది ఎందుకు చెప్పాను అనవచ్చును. సరే, ఇంక అప్సరసల సంగతి చూదాం.

పురూరవుడు అని గొప్పరాజు. అయన ఊర్వశిని వలచి ఇంద్రుడి అనుమతితో‌ భార్యను చేసుకొన్నాడు.

కొన్నాళ్ళ తరువాత ఆవిడ కాస్తా గడువు తీరిపోయింది. సెలవు అని చులాగ్గా అనేసి వెళ్ళిపోతే పురూరవుడు అక్షరాలా లబలబ లాడాడు.

మళ్ళీ కాళ్ళావేళ్ళా పడి ఆమెను వెనక్కు తెచ్చుకున్నాడు.

ఒకసారి ఊర్వశి పురూరవుడితో ఒక కొండమీద విహారానికి వెళ్ళింది ఆ కొండమీద అడవుల్లో కొంత కాలం విహరించారు. అప్పుడు ఆవిడ పురూరవుడితో, రాజా ఈ‌కొండమీద సాక్షాత్తూ విష్ణుమహాదేవుడు వరాహనారసింహద్వయ రూపిగా వెలసి ఉన్నాడు సుమా- ఇది మహనీయమైన పుణ్యక్షేత్రం అన్నది. పురూరవుడికి ఎంతో అబ్బురం‌ కలిగింది. ఎక్కడ ఎక్కడ అని ఆరాట పడ్డాడు. ఆవిడ తాపీగా ఈ కొండమీదా నిశ్చయంగా ఉన్నాడు. ఎక్కడో మనం వెదుకుదాం అన్నది.

ఇద్దరూ శ్రమపడి చెట్లూ పుట్టలూ గుహలూ వగైరా బాగా గాలించి స్వామిని దర్శనం చేసుకొన్నారు.

అదే పరమపవిత్రమైన సింహాచల మహాక్షేత్రం.

ఈవిధంగా ఊర్వశీదేవి మనకు వరాహనరసింహస్వామిని పరిచంయం చేసింది. మహనీయురాలు.

అవిడ దేవత. మనలాగా పరిమితులు కల మానవశరీరి కాదు.

అవిడకు ఆకొండమీద దేవు డున్నాడని ముందే గమనిక కలిగింది.

తన దివ్యశక్తితో భవద్దర్శనం చేసుకొన్నది.

కాని పురూరవుణ్ణి తరింపజేయాలన్నది ఆమె సంకల్పం.

అందుకే తనకు సరిగా తెలియదు అని అమాయకంగా చెప్పి, ఆయనతో జాగ్రత్తగా స్వామిని భక్తితో వెదకించింది.

నిజానికి ఇది ఆమెసంకల్పమా?

దేవతల సంకల్పం.

దేవప్రభువూ‌ పురూరవుడికి శ్రేయోభిలాషీ మిత్రుడూ ఐన ఇంద్రుడి సంకల్పం ఇది.

ఊర్వశి మంచి పాత్రపోషించింది ఈ వ్యవహారంలో.

ఇంద్రుడు ఒక పధకం ప్రకారం ఊర్వశిని పురూరవుడికి పరిచయం చేసాడు నాటకీయంగా. ఆమెను సశరీరంగా చూడటంతో పురూరవుడు ఆమెపై మరులు గొనటమూ దేవసంకల్పమే.  ఆయనద్వారా సింహాచలం దేవుణ్ణి మనకు చూపటం అన్నది దేవతల పధకం. దాని కారణంగా పురూరవుడు నిత్యస్మరణీయుడూ తరించిన వాడూ అయ్యాడు.

చివరికి ఊర్వశీ పురూరవుల కథలో ఏమి జరిగింది.

దేవసంకల్పం నెఱవేరింది,

ఊర్వశి వెనుదిరిగింది.

మళ్ళా ఆ పురూరవుడు ఆమెకోసం‌ ఈ సారి పెద్ద తపస్సు చేసాడు.

దేవతలకు నియమం. తమకోసం తపస్సు చేస్తే వాళ్ళకు యోగ్యమైన వరాలు ఇవ్వాలి. తప్పదు.

ఊర్వశీ దిగిరాక తప్పదు.

వచ్చి ఏమిచేసింది?

ఓ రాజా, శరీరధారులకు ఉండే ఈ‌కోరికలు స్వల్పప్రయోజనం కలవి మాత్రమే సుమా అని చెప్పింది. ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసింది.

పురూరవుడు జ్ఞానవంతుడై తన శరీరాన్ని కాక సంపూర్ణంగా భగవంతుని ప్రేమించి తరించాడు.

ఈ‌కథలు ఎందుకు చెప్పానో‌ పాఠకులు కొంచెం అవగాహన చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను.

దేవతల తప్పులు వెదకకండి. అది దోషం.

భగవంతుడి తప్పులు వెదకకండి. అది అపచారం.

మన శక్తియుక్తులు అతిస్వల్పమైనవి. మొన్న రాత్రి భోజనంలో ఏమి కూర తిన్నావు అంటే ఈ‌ ఉదయం ఎంతో‌మందికి సరిగా గుర్తుకు రాదు. ఎన్నో‌ జన్మల గురించీ వాటిలో మనం ప్రోగుచేసుకొన్న కర్మఫలాల గురించీ ఎవరికి తెలుస్తుంది?

దేవతలకు తెలుస్తుంది.

వారు సహాయం చేస్తారు.

మనకోసం, అవసరమైతే, మనమధ్యనే ఉండి వారు నయానో భయానో, మనకు అభ్యున్నతిని చేకూరుస్తూ ఉంటారు.

ఒక్కొక్క సారి వాళ్ళు మనని కష్టాల పాలు చేస్తున్నారని అనిపించవచ్చు. వాళ్ళు క్రూరులనీ అనిపించవచ్చును.

వారు ఉద్దేశించిన మంచిని మనం అందుకొన్న నాడు వాళ్ళు సంతోషిస్తారు.

అందుచేత దయచేసి దేవతల పట్ల కాని అప్సరసల పట్ల కాని చులకన మాటలు మాట్లాడ కూడదని అర్థం చేసుకోండి.

మాట వరసకు ఒక అప్సరస స్వర్గంలో ఒకనికి కామాది సుఖాలను అందిస్తున్నది అనుకుంటే దాని అర్థం ఆమె మానవలోకం నుండి వచ్చిన ఒకడి కోసం మానవస్త్రీలాగూ ఐపోయి మన లోకంలో ఉంటారని చెప్పబడే ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తుందని కాదు. కానే‌ కాదు. ఆ భోగాల పట్ల ఆజీవికి మిగిలి ఉన్న ఆసక్తిని తగ్గించి నయంచేసేందుకు ఆవిడ దగ్గర ఉపాయం ఉందని. తేజో‌జీవులైన వారి వద్ద ఉండే ఉపాయం ఏమిటంటే వారి తేజస్సుల ప్రభావం ఆ జీవులను ఆకర్షించి వారి నుండి మోహాదులను తొలగించటం. ఆమె అలా తొలగిస్తున్నది అని అర్థం.

లౌకిక సాహిత్యంలోనికి తెచ్చేసరికి ఈ అవగాహనలన్నీ కూడా పరమపవిత్రము లన్నవి పరమ జుగుప్సాకరంగా ప్రతిబింబించబడ్దాయి.

అది కవుల తప్పా మనతప్పా అన్నది పక్కన బెడదాం. ఆచర్చ వలన మనకు ఉపయోగం లేదు.

ఇప్పడు సరైన దృక్పథంతో అర్థం చేసుకోవటం మేలు చేస్తుంది.

చివరగా పాఠకులకు ఒక విన్నపం. నాకు తోచిన ముక్కలు నాలుగు చెప్పాను. అందరికీ‌ నచ్చకపోవచ్చును. ఏదో‌ పత్రికల వాళ్ళకు నా స్వబుధ్ధి వ్యవహారమే అని హామీ ఇచ్చినట్లుగా మీకు కూడా ఇది నాకు తెలిసిన నాలుగుముక్కలే‌ కాని ఎవర్నీ‌ మెప్పించటానికి కాని నొప్పించటానికి కాని కావని వివ్నవించటమైనది అని చెప్పుకుంటున్నాను.

16, ఏప్రిల్ 2018, సోమవారం

చందురు వర్ణుడు రాముడు


బంగారానికి సువర్ణము అని పేరు.ఇక్కడ వర్ణము అంటే ప్రకాశం. అంటే బంగారం  మంచి ప్రకాశం కలది అని అర్థం సువర్ణం అన్నమాటకు. అంతే‌కాని వర్ణం అంటే సాధారణంగా మనం రంగు అని అర్థం తీసి మంచిరంగు కలది అని చెప్పుకుంటే అన్వయం అంత అందంగా ఉండదు.

నిత్యజీవితంలో కూడా ఒక వస్తువు రంగు బాగుంది అని చెప్పేటప్పుడు ఆ రంగు తగినంత ప్రకాశమానంగా ఉందనే అర్థంలో చెబుతాం కదా. సాధారణార్థంలో వర్ణం అంటే రంగు అన్నప్పుడు దాని మంచి అని చెప్పి సు- చేర్చి చెప్పటం ఆరంగు ఆకర్షణీయంగా ఉందీ మనస్సుకు బాగాపట్టిందీ అని చెప్పటానికే‌ కదా. అందుకే ఇక్కడ వర్ణం అన్నదాని ప్రకాశం అనే భావనయే గ్రాహ్యం.

అదే కోవకు చెందిన సమాసమే చందురువర్ణుడు. ఇక్కడ రాముడు చందురువర్ణుడట. అంటె చంద్రుని వలే మంచి ప్రకాశం కలవాడు అని అర్థం. మంచి ప్రకాశం‌ కల వస్తువు మన కంటిని ఇట్టే ఆకర్షిస్తుంది. అవునా కాదా? అది ఏరంగు అన్నది ప్రశ్న కాదు. రాముడు చందురుని వలె మంచి ప్రకాశగుణం కలవాడని అనటం ఉద్దేశం ఏమిటట? చంద్రుడు ఎలాగైతే తన ప్రకాశం చేత అందరి మనస్సులకూ ఆహ్లాదం కలిగించి ఠక్కున ఆకట్టుకుంటున్నాడో రామచంద్రుడూ అదేవిధంగా చూడగానే మనస్సును ఆకట్టుకొనే మహానుభావుడు అని చెప్పటం.

నిజానికి చంద్రుణ్ణి చూసి నప్పుడే కాదు - స్మరించినంతనే మనస్స్సులకు చాలా ఆహ్లాదం కలుగుతున్నది! కాకపోతే చూడండి చందమామ మీదనే తిన్నగా అన్ని భాషల అన్ని దేశాల సాహిత్యాలలోనూ ఎంతో కవిత్వం‌ ఉంది. అది సాంప్రదాయయికమే కాదు ముఖ్యంగా జానపదమూ సర్వేసర్వత్రా బోలెడు. అది కాక  తిన్నగా చందమామ పైనే కాకపోయినా  ఏదో రకంగా చందమామను స్మరించే సాహిత్యం దానికి వేల రెట్లు ఉంటుంది కదా. కొంచెం ఆలోచించండి. తెలుగులోనే చందామామా అంటునే చందూరూడా అంటూనే చందామామయ్య అంటునే జానపదాలూ - సినిమపాటలూ కుప్పలు తెప్పలు.

అదే విధంగా రాముడి సంగతీను! ప్రపంచవ్యాప్తంగా రాముడి ఉన్న ఖ్యాతికి ఎందరో రంగనాయకమ్మలు వచ్చినా సరే ఎప్పటికీ‌ ఢోకా ఉండేట్లు లేదు. అనేకానేక దేశాల్లో రామకథ గొప్ప ప్రచారంలో ఉంది. అనేకాకానేకభాషల్లో రామకథ వివిధ సాహిత్యప్రక్రియల్లో నిలబడి ఉంది.  ఇక భారతీయుల సంగతి చెప్పనే‌అక్కర లేదు. నిజానికి నిన్నమొన్నటి దాకా రామాలయం లేని ఊళ్ళే ఉండేవి కావు. ఇప్పటి ఆధునికుల పోకడ వల్ల ఆమాట కొంచెంగా తప్పిందేమో తెలియదు. ఐనా రామకథ ఆధారంగా సినిమాలూ సినిమాపాటలూ ఎంతో ఆదరణ పొందాయి - ఇప్పటికీ పొందుతున్నాయి. ఎప్పటికీ పొందవచ్చును కూడా. అరవైల్లోని లవకుశను బాపూ గారు మరలా కొత్తగా సినిమా తీస్తే అది ఒరిజినల్ లవకుశతో పోటీ అవునా కాదా అన్న చర్చ అటుంచితే బహుళ ప్రజాదరణ పొందింది.

ఎందరో కవులు ఇంకా రామాయణాలు వ్రాస్తూనే ఉన్నారు. అలా వ్రాస్తూనే ఉంటారు. రామస్మరణ ఎంత ఎలా చేసినా తృప్తి కలగదు. ఇంకా చేయాలి రకరకాలుగా అనే కవులకు అనిపిస్తుంది. అనేకభాషల్లో ఇదే పరిస్థితి. మరాఠీలో కాబోలు నూట ఎనభై రామాయణ గ్రంథాలు ఉన్నాయట.

ఇప్పటికీ చిన్నపిల్లలకు అమ్మలూ నాన్నలూ రామాయణం కథ చెబుతూనే ఉన్నారు. ఫక్తు కమ్యూనిష్టు లేదా వీరహేతువాద కుటూంబాల సంగతి ఏమో‌ నాకు తెలియదు కాని ఇంకా అలాంటి బహుస్వల్పశాతం మినహాయిస్తే కొత్త తరాల పిల్లలకు రామనామమూ రామకథా అందుతూనే ఉన్నాయి.


శ్రీనిథి రామాయణం

ఇదంతా ఎందుకు చెప్పాను? నాకు రామభక్తి అనా - అది కాదు. రామనామానికి రాముడికీ‌ ఉన్న డిమాండు గురించి ఒకసారి పర్యావలోకనం చేయటానికి అన్నమాట.

అందుచేత అనేకమంది హృదయారవిందాలకు రామనామం చెవిసోకగానే రాముడు స్ఫురణకు రాగానే ఎంతోకొంత భావోద్వేగం కలుగుతున్నది.

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

అదే హృదయారవిందంలో ఆ చందురువర్ణుడైన రామమూర్తిని భావించగానే బ్రహ్మానందం అనుభవించటం అవుతున్నది. మన భక్తివిశేషంగా ఉంటే మనవిషయంలో అది సత్యం. కాకపోయినా తెలుగు పుట్టువుల దృష్టిలో రాముడు అనగానే ఎంతో కొంత ఆహ్లాదం కలుగుతుంది. చంద్రుణ్ణి స్మరించగానే ప్రజల మనస్సులకు ఆహ్లాదం కలుగుతున్నట్లుగానే.

యుగయుగాలుగా ఈ‌లాగునే అందరికీ మనస్సులలో ఆహ్లాదం పంచే వాడు కాబట్టే అయనను రామచంద్రుడు అన్నారు.

సామాన్య జనానికి బంగారం అంటే అహ్లాదం కలుగుతుందా అంటే దాని ధరమీద ఆధారపడిన సంగతి అదెంత సువర్ణం ఐనా సరే.

అందరికీ చంద్రుణ్ణి స్మరిస్తే ఆహ్లాదం కలుగుతుంది. అందుకు చంద్రుడికి మనం ఏమీ చెల్లించనక్కర లేదు కదా.

అలాగే జనానికి రామచంద్రుడిని స్మరించినా చంద్రుడిని స్మరించినట్లే గొప్ప ఆహ్లాద భావన కలుగుతుంది. చెప్పాను కదా. మన భక్తిస్థాయిని బట్టి అది నిజంగా బ్రహ్మానందం కావచ్చును. చంద్రుడి లాగే రాముడూ మననుండి ఏమీ ఆశించకుండానే తన నామరూపాలను స్మరించగానే గొప్పగా అనందం కలిగిస్తున్నాడు.


7, నవంబర్ 2017, మంగళవారం

జైమిని మహర్షికి దైవభక్తి లేదట!


ప్రముఖ బ్లాగు తెలుగుతూలికలో ఒక వ్యాఖ్య కనిపించింది,

మాలతిగారి ఆ  వ్యాఖ్య ఇలా ఉంది.

రమణారావుగారూ, వివియస్. శర్మగారు ఇచ్చిన సమాచారం ఇది –
వ్యాసుడు కేవలం 8 వేల శ్లోకాల జయం వ్రాసాడు. జైమిని అశ్వమేధ పర్వమే 4 వేల శ్లోకాలు. వైశంపాయనుడు జనమేజయునికి, చెప్పిన తరువాత సూతుడు నైమిశారణ్యంలో చెప్పాడు అప్పటికి లక్ష శ్లోకాలయింది. అందులో అశ్వమేధ పర్వం 3వేల శ్లోకాలే. వైశంపాయనునికి యజుర్వేదం, జైమినికి సామవేదం ఇచ్చాడు జైమిని పూర్వ మీమాంస అనే దర్శన సూత్రం గ్రంథానికి ఆద్యుడు. వ్యాసుడు భక్తి ప్రధానమైన పురాణాలు వ్రాయగా జైమినికి దైవ భక్తిలేదు. ఆయన కర్మకాండకె ప్రాధాన్యం ఇచ్చాడు . వారి భేదాభిప్రాయాలు భారత రచన పై కూడా పడినవి అంటారు. జైమినికి అర్జునుడంటే గొప్ప అభిప్రాయంలేదు. జైమిని వ్యాస భారతాలకి చాలా తేడాలున్నాయి.

ఈ వ్యాఖ్యను మాలతిగారికి పంపినది వివియస్.శర్మగారు. ఆయన అభిప్రాయం ప్రకారం జైమిని మహర్షికి దైవభక్తి లేదు!

ఋషులలో నాస్తికులు ఉండకూడదా? రామాయణంలో జాబాలి అలాంటి వాడు కాదా? స్వర్గం నరకం అనేవి పిచ్చి మాటలు - అవున్నాయో లేదో ఎవడు చూడవచ్చాడూ? సుఖం అనేది ఈ భూమిమీదనే ఈ శరీరంతోనే అన్నట్లుగా మాటలాడలేదా అని పాఠకులలో కొందరు అనుకోవచ్చును. కాని శ్రీమద్రామాయణంలోనే అదే ఘట్టం చివరన తాను రాముడి హృదయం తెలుసుకుందుకే అలా మాట్లాడానని జాబాలి చెప్పటమూ ఉంది మరి. కాబట్టి వేదఋషుల్లో నాస్తికులు ఉండరన్న విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది.

జైమిని మహర్షి కృతమైన జ్యోతిషవిధానం ఒకటి బహుళప్రాచుర్యంలో ఉన్నది. ఆయన దేవుడూ లేడు దెయ్యమూ లేదనే నాస్తికుడే ఐన పక్షంలో జ్యోతిశ్శాస్త్ర సూత్రాలు ఎందుకు విరచిస్తాడు?

జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రకారుడు. కర్మసిధ్ధాంతాన్ని వివరించినవాడు. నాస్తికుడైతే కర్మసిధ్ధాంతాన్ని ఎందుకు బోధిస్తాడు?

వేదవ్యాసులవారు వేదరాసిని నాలుగుగా విభజించిన సందర్భంలో ఆయా భాగాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఋషిని ప్రథానబోధకుడిగా నియమించారు. ఋగ్వేదాన్ని పైలుడికీ, యజుర్వేదాన్నివైశంపాయనుడికీ, సామవేదాన్ని జైమినికీ, అథర్వవేదాన్ని సుమంతునికీ ఆధ్యబోధకులను చేసారు. జైమిని దైవభక్తి లేని వాడైతే సామవేదాన్ని ఎలా వేదవ్యాసుడినుండి పొందాడు? అంతదాకా ఎందుకు, సాక్షాన్నారాయణావతారమని పేరువడ్డ వేదవ్యాసమౌని నాస్తికుడైన జైమినిని శిష్యునిగా స్వీకరించటం జరిగేదా?

పాఠకులలో కొందరకైనా ఈ శ్యామలీయం బ్లాగులో లోగడ ప్రచురితమైన వేదపాదస్తోత్రం గుర్తుకు వచ్చి ఉండే అవకాశం ఉంది. ఈ వేదపాదస్తోత్రం శివస్తుతిగా శ్రీ జైమిని మహర్షి చెప్పినదే. మరి ఆ మహర్షికి దైవభక్తి లేదన్న మాట వింతగా అనిపిస్తోంది. నాస్తికుడు శివస్తుతి చేస్తాడా?

అలాగే మూర్తిగారి వ్యాఖ్యలో గురుశిష్యులైన జైమిని వ్యాసులమధ్య భేదాభిప్రాయాలున్నాయన్న మాట ఉంది. అదికూడా సత్యం అనుకోను.  వ్యాసమహర్షి జయం వ్రాయటంలోని ఉద్దేశం వేరు. అది మొత్తం కురువంశచరిత్ర - వారి ఉత్పత్తివృధ్ధిక్షయాలు కూలంకషంగా ధర్మధృష్టితో విస్తారంగా చెప్పారు వ్యాసులు. జైమిని మహర్షి అశ్వమేథపర్వం కథను మాత్రం వివరంగా చెప్పారు - అది ఒక కావ్యదృష్టి కావచ్చును. అంతమాత్రంచేత వ్యాసజైమినుల మధ్య పొరపొచ్చాలున్నాయనటం మన  ఆధునికుల హ్రస్వధృష్టి వినా మరేమీ కాదు.

ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను.

వ్యాసభారతంలో భగవద్గీతల ప్రాముఖ్యతను గూర్చి వివరించనక్కర లేదు కదా.

భగవద్గీతలలో ఒక చోట "బలవానింద్రియగ్రామో విద్వాంసమపకర్షతి" అన్న ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో జైమినికి ఒక సందేహం కలిగిందట. ఆయన గురుదేవా, బలవానింద్రియగ్రామో విద్వాంసం నాపపకర్షతి అనికదా ఉండాలి అని అడిగాడు. అంటే బలవంతమైన ఇంద్రియాలు విద్వాంసులను కూడా ఆకర్షించి వేస్తాయి అని ఉండటం బదులు ఎంత బలవంతమైనవైనా ఇంద్రియాలు విద్వాంసులను మాత్రం ఆకర్షించలేవు అని ఉండాలి కదా అన్నది శిష్యపరమాణువు సందేహం.

అప్పుడు వ్యాసులవారు నవ్వి నాయనా నేను భగవంతుడైన కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే యథాతధంగా వ్రాసానయ్యా అని సెలవిచ్చారు. శిష్యుడికి సమాధానం దొరికినా, ఏమూలో కించిత్తు అనుమానం. ఒకవేళ గురువుగారు కొంచెం పొరబడ్డారేమో  సరిగా భగవద్వాక్యం వినలేదేమో అని!

కొంతకాలం గడిచాక, ఒకనాడు జైమిని మహర్షి ఒక అమ్మాయిని నదీతీరారణ్యంలో చూసి మోహపరవశుడై పెళ్ళాడబోయాడు. ఆ పడుచు అంది కదా, వరించిన వాడు అమ్మాయిని బుజాలమీద మోసుకొని వెళ్ళి మా కులపెద్ద అనుమతి తీసుకొని పెళ్ళిచేసుకోవాలయ్యా అని. జైమిని దానికి సిధ్ధపడి అలాగే చేసాడు.

కొంతదూరం అమ్మాయిని మోసుకొని వెళ్ళాక మీదినుండి బలవానింద్రియగ్రామో విద్వాంసం నాపపకర్షతి అంటూ కూని రాగం వినిపించటం మొదలయ్యింది.

జైమినికి విషయం అర్థమయ్యింది. గురువుగారిని బుజంమీదనుండి దించి సాష్టాంగపడ్డాడు.

ఇది వట్టి కథ.సభారంజకంగా హరికథల్లోనూ బుర్రకథల్లోనూ ఇరికించి లేదా ఈ నాటి ప్రవచనకారులైతే తమతమ వ్యాఖ్యానధోరణిలో ఇరికించి జనాన్ని ఆహ్లాదపరచటానికి మాత్రం పనికి వచ్చే తమాషా. ఒకప్రమాదం మాత్రం పొంచి ఉంది ఈ కథవలన. ఆధునికులు ఎవరైనా దీన్ని ఉదహరించి ఏమైనా చిత్రవిచిత్రవ్యాఖ్యానాలు చేయవచ్చును.