జ్యోతిష మొక శాస్త్రమా యను ప్రశ్న వేయు వారి సంఖ్య యమితముగా నున్నది. శాస్త్రము కాదను ధ్వని యాప్రశ్న యందే తోచునట్టి విధముగా నా ప్రశ్నను వేయుదురు. ఇది సర్వత్ర కనిపించుచున్న విషయము.
జ్యోతిష మొక సైన్సా లేక శాస్త్రమా యని ప్రశ్నించు వారి నింతవరకు చూడలేదు. ఎందువలన ననగ సైన్సు అను నాంగ్లపదమునకు సమానార్ధప్రతిబోధకముగా నుండు పదముగా శాస్త్రమను పదము ప్రసిధ్ధముగా నున్నది. నిజమున కీప్రశ్న "జ్యోతిష్యం సైన్సా లేక మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా?" యని వినిపించబడినది. కాబట్టి మొత్తముగ నీ ప్రశ్నను త్రోసివేయుటకు ముందుగా దీనిని కొంచెము పరిశీలనముగ జూడవలసి యున్నది. జ్యోతిష్యము మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా యను ప్రశ్న యిందు గమనార్హము కావున దానికి సమాధానము చెప్పుటకు యత్నించుట యుచితముగ నుండవచ్చును.
ఉచితముగ నుండవచ్చు నన్నంత మాత్రమున సమాధానము చెప్పవలయునా యనగ నది విచార్యమైన సంగతి.
ప్రశ్నించు వారి యొక్క చిత్తశుధ్ధిని నమ్మగలిగిన యెడల చెప్పవచ్చును. కేవలము కికురించుటకునై ప్రశ్నవేయువా రుందురు.
ప్రశ్నించు వారి యొక్క యర్హతను బట్టి సమాధానము చెప్పవలసి యుండును. ప్రశ్న వేసిన ప్రతి వానికికి సమాధానము దొరుకదు. అట్లేల ననగ పృఛ్ఛకునకు సమాధానమును గ్రహించు శక్తి యుండవలయును కావున. ఆధునిక భౌతికశాస్త్రము మిక్కిలి ద్రవ్యరాశికల ఖగోళవస్తువు యొక్క సామీప్యమున కాంతిస్థల కాలముల యందు మార్పు కలుగునని చెప్పుచున్నది. అట్లేల జరుగునని సామాన్యులు ప్రశ్నించవచ్చును కాని సమాధానము వారికి బోధపడునట్లు చెప్పుట దుస్సాధ్యము కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాసా యని బ్రహ్మసూత్రముల యందు మొదటి సూత్రము. ఇచ్చట అథః అనగా తగిన అధికార సిధ్ధి కలిగిన పిమ్మట నని కదా యర్ధము. అంతియే కాని వేదాంతము నేర్పుదురా, వ్యాసుని బ్రహ్మసూత్రములతో మొదలు పెట్టుదమా యన్నచో నది దుస్సధ్యమే కదా. ఇట్లు గ్రహించవలసి యున్నది.
ప్రశ్నించు వారి యొక్క ఆశయమును బట్టి సమాధాన ముండును. కొందర కుపరిస్పర్శగ సమాధానము చెప్పిన చాలును. ఏదేని విషయ మున్నదా యన్న కుతూహలమే కాని విషయమును సాకల్యముగ నేర్చుటకు నాశించని వారికి విపులముగ చెప్ప బూనినచో వారు విరక్తులు కావచ్చును లేదా భయపడి యొక నమస్కారము చేసి తప్పుకొనవచ్చును. మరియు కొందరు బుధ్ధిమంతులు సమాధానము చెప్పుచున్న వాడు తమను భ్రమింప జేయుట కేదోదో చెప్పుచున్నాడని యాక్షేపించవచ్చును.
ప్రశ్నించు వారి యందు ప్రత్యేకముగ నొక విధమైన బుధ్ధి కలవారుందురు. వారు తమకు సమాధానము చక్కగా బోధపడని పక్షమున, బోధపడినంత వరకే సత్యమనియును మిగిలిన దంతయును వ్యర్ధమైన విషయపూరణ మనియు భావింతురు. ఇది వారి చిత్తశుధ్ధికి సంబంధించిన సంగతి కాక వారి జీవలక్షణమునకు సంబంధించిన సంగతి యని గుర్తుపెట్టుకొన వలెను.
ఇట్టి వివేచన మంతయును చేయుట యెందుల కనగా జ్యోతిష్యము మతపరముగ గ్రహఫలితములు మార్చగల శాస్త్రమా యన్న ప్రశ్నకు సమాధానము చెప్పుటయా, చెప్పినచో నెట్లు చెప్పవలయును మరియు నెంతవరకు చెప్పవలయు నన్నది ముందుగా యోచించుటకు.
బుధ్దిః కర్మానుసారిణీ యని యొక నానుడి యున్నది. కావున సమాధానము చెప్పుటకు నిర్ణయించు కొంటిని. కాని బుధ్ధిమంతు లూహించుకొన గలగిన కారణముల వలన దానిని క్లుప్తముగనే చెప్పదలచితిని.
గ్రహఫలిత మనగ నిచ్చట ప్రశ్నించు వాని యుద్దేశమున గ్రహములు జ్యోతిషము ప్రాకారముగా నిచ్చునని చెప్పబడు ఫలితములు. జ్యోతిషము జాతకునకు వాని జాతకచక్రము ననుసరించి ఇష్టకాలమున జరుగుచున్న దశాంతర్దశల ప్రకారమును మరియు వర్తమానగోచారము ప్రకారమును రాగల మంచిచెడుల సూచనలను తెలుపును. ప్రశ్న యని యొక జ్యోతిషవిభాగమున్నది. దానికి కేవలము వచ్చి ప్రశ్న యడిగిన కాలము ననుసరించి ఫలములను లెక్కించు సామర్ధ్యమున్నది. ఏవిధానమున నైనను మంచిచెడుల సూచనలు సమముగనే లభించును.
జ్యోతిషము అట్టి ఫలములను సూచించుటయే కాక మార్చు విధానమును చెప్పునా యన్నది గొప్ప ప్రశ్నయే.
మనుష్యుల జీవితములు వారి వారి కర్మలను అనుసరించి జరుగుచుండును. ఒక జన్మమనగ పొందవలసిన కర్మానుభవమును పొందుటకు ఒక శరీరమును గ్రహించి ప్రవర్తించుటయే. కాని ఎవ్వడైనను దానినుండి స్వతంత్రించి మంచి దారిలోనికి మరలవచ్చును లేదా మరింత చెడు దారికి మరలవచ్చును. ఈవిషయమును కూడ జ్యోతిషము సూచించగలదు కాని సామాన్యజ్యోతిష్యులకు దురవగాహము.
కర్మమున కెదురుతిరిగి భగవద్భక్తిపరు డనుము సత్కర్మాచరణపరు డనుము మరియొకటనుము, గురూపదేశము వలన కాని మిక్కిలి తీవ్రమైన సంవేదనాకారకమైన సంఘటనము వలనకాని కొత్త దారిని పోవు వానికి సామాన్యముగా వాని జాతకము సూచించు గ్రహఫలములకు భిన్నమైన ఫలములు కనిపించును. అనగా సామాన్యజ్యోతిష్యులకు నిట్టి మార్పును గ్రహించరామి వలన గ్రహఫలములను వారి భక్తి లేదా సత్కర్మ మార్చుచున్నట్లు తోచును.
అట్లే మిక్కిలి చెడు మార్గమును కూడ నొక జీవుడు త్రొక్క వచ్చును. కాని గడుసువారు తమ అపమార్గవర్తనమును కొంత గుప్తముగ నుంచుదురు కద. అప్పుడు జాతకమున మంచి ఫలములు కనిపించినను వాస్తవమునకు చెడ్డఫలితములు అనుభవమునకు వచ్చి సామాన్యులను విస్మయపరచును.
ఇది యిట్లుండగ సామాన్యమున జ్యోతిష్యులు ప్రజలకు గ్రహగతుల వలని చెడుఫలితములు సూచితమైన సందర్భములలో శాంతిప్రక్రియాదులను గాని తత్తద్గ్రహప్రీతికరమైన కార్యములను కాని సూచించుట లోకములో కనుపించు చున్నది. ఇట్లైనను మనుష్యులు కొంతకొంతగ తమతమ మనస్సులనుండి దుర్భావనాదులను తొలగించుకొని యుదాత్తమైన కార్యముల యందు ప్రవర్తించు వారై తత్తత్పుణ్యఫలముల వలన వచ్చు నట్టి మంచి ఫలమును పొందుట జరుగునని యాశంక దీనికి కారణము. అంతకు మించి మరేదియును లేదనియే చెప్పవచ్చును.
ఇంకను మరికొంత వ్రాయదగినది కలదు కాని ఇంతవరకు చాలును.
ఆర్యా
రిప్లయితొలగించండిజ్యోతిషము ఒక శాస్త్రమా కాదా అను ప్రశ్న వేయువారి గురించి మాట్లాడటం ముదావహము. బ్లాగులోకంలో ఆస్థాన జ్యోతిశ్యులు అదేపనిగా పిల్చే పిచ్చి ప్రజలు - ఎప్పటికప్పుడు తమకు సంతోషం కలగడం కోసం ఇటువంటి ప్రశ్నలు వేయుదురనీ, వాటికి సమాధానము చెప్పనక్కరలేదనీ, జరగబోయే విషయాలకంటే, చనిపోయిన వారి జాతకాలు చూసి జరిగినవి చెప్పుట మంచిదనీ అనేకానేక సార్లు చెప్పి చెప్పి విసుగెత్తిపోయినారు. అయిననూ ఆస్థాన పండితులు కొంచెము దూరాలోచనతో కొంతమంది సినిమా తారలు పోయినపుడూ, మరికొంతమంది రాజకీయనాయకులు పోయినపుడూ నోరెత్తకపోవడం కద్దు. దీనికి సులభంగా సమాధానం ఇవ్వవచ్చును అని నా మట్టిబుర్రకి తోచుచున్నది. ఇటువంటివారి జాతకములు - బతికి ఉన్ననూ, చనిపోయినవారివైననూ - వేసినచో అభిమాన సంఘాలు బుర్ర పగులగొట్టవచ్చును. అది అట్లుండనిండు.
ప్రస్తుతములో అమావాశ్యకూ పౌర్ణమికీ జాతక ఫలములు చెప్పుటా, మరి నేను ముందే చెప్పుచున్నాను జాగ్రత్త వహించండి అని చెప్పుటయూ కద్దు. కానీ ఆ తీసుకోవల్సిన జాగ్రత్తలు మాత్రము చిదంబర రహస్యము వలే కాపాడుకొందురని తోచుచున్నది. ప్రశ్నించువారి చిత్త శుధ్ధి సరే, మరి అసలు అడగకనే జాతక ఫలములు చెప్పుటయూ, అవి ఫలించినచో ఇదిగో నేను చెప్పినట్టే జరిగినది అని భుజములు ఎగురవేయుటయూ, ఫలించనిచో కుక్కిన పేనులా ఉండుటయూ ఉచితమా? అసలు ఈ ఫలితములు ఎవరు అడిగిరి? అడగనిచో వేయుటయూ అడిగినచో వెక్కిరించుచూ 'ఈ ప్రపంచమంతయూ దరిద్రము, ఇది బాగుపడునని నాకు మాత్రము నమ్మకము లేదు' అనుటయూ ఉచితమా? ఫలితములు వేసి - అదీ భాషాప్రేమతో యోగులమని చెప్పుకొనుచూ - అమాయకులని భయభ్రాంతులని చేయుట ఉచితమా? మరి దీనికి మహిషవాహనులు ఒప్పుకుందురా? ప్రపంచము మారదని నమ్మకము లేనివారు ఫలితములు చెప్పుటెందులకు? ఇదికూడా అట్లుండనిండు. ప్రపంచము పుట్టినప్పటినుండి, హిరణ్యాక్షులు ఉండనే ఉన్నారు. మొదటి హిరణ్యాక్షులు గదలూ, స్థంభములూ వారి ప్రహ్లాదులమీద వాడితే, ప్రస్తుత హిరణ్యాక్షులు లేప్ టాప్ లు వాడుచున్నారు. ప్రపంచము ఇట్లుండుట భగవదనుగ్రహము కదా? యోగులైనవారు ఇటువంటి ప్రపంచములోనుంచే బురదలో పద్మము ఉదయించినట్టూ ఉదయించగలరని తోచుచున్నది. ఈ యోగులు తాము ఉదయించిన బురదను అసహ్యించుకొనుట చూడ/వినలేదు - ప్రహ్లాదుడు తన తండ్రి ఎన్నడూ అసహ్యించుకొనిన దాఖలాలు లేవు. రమణులూ ఇట్లే ఎవరినీ అసహ్యించుకొనినట్టు ఎక్కడనూ చదవలేదు.
అసలు ప్రతి మనిషికి ఇట్లు జరుగును, జరిగితీరును, అని చెప్పినచో , అవి అట్లే జరిగినచో ఆ మనిషికి తనమీద తనకి నమ్మకము ఎట్లేర్పడును, ఏ పని చేయుటకైననూ? ముందు జరగబోవునది మనచేతిలోనే ఉన్నదనీ, మన కర్మకి మనమే కారకులమనీ గీతాచార్యులనుండి ప్రతీ సిద్ధులైన శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శివానందుల వరకూ చెప్పియున్నారే? దీనిమే ఆంగ్లమందు కూడా - యాజ్ యూ థింక్ సో యూ బికమ్ - అని వ్రాక్రుచ్చినారు పండితులు. కర్మ సిధ్ధాంతము నమ్మినచో, భగవంతుని నమ్మి చెడు కర్మని తప్పించుకొనవచ్చునని తెలిపియున్నారు ఈ మునులు. భగవంతుడు కూడా ఈ విషయము కోసమే మనుజులకు భవిష్యత్తు తెలియకూడదనీ, ప్రస్తుతంలోనే బతికి ఉండవలననీ ఈ పరిస్థితి కల్పించినాడని తోచుచున్నది.
జ్యోతిషము నిజమా అబధ్ధమా అనుసంగతి అటు ఉంచి అసలు అది వాడుకుని, కర్ణపిశాచితో అన్వయించి ప్రజలమీద తమ భావాలు వదులుట ఎంతవరకూ సమంజసము? ఇట్లు వదిలి ప్రజలను భయభ్రాంతులను చేయుచో భగవంతుడు ఊరకుండునా? మహిషవాహనులూ చిత్రగుప్తులవారూ, ఇదంతయూ చూసి వారి వారి చిట్టాలలో రాయకుందురా?
ఇంకనూ ఎంతనో ఉన్నది రాయుటకు కానీ ఇంతవరకూ రాసినది చాలును. ః-)
తొలగించండిమా గురువు గారి మీద ఇన్నేసి అభాండాలు వ్రాయడాన్ని మేము ఖండిస్తున్నాం
జిలేబి