31, జనవరి 2021, ఆదివారం

విగ్రహారాథన గురించి ....

ప్రపంచంలో అనేకరకాల మనుష్యు లుంటారు. అందుచేత ఏవిషయంలో ఐనా అందరి అభిప్రాయాలూ ఒకే విధంగా ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప వేరువేరుగా ఉంటే అందులో విశేషం ఏమీ లేదు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఎంతో‌కాలంగా కలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తలూ వారి ఇద్దరు బిడ్దలూ అనుకుందా వారు, ఆ నలుగురి అభిప్రాయాల్లోనూ ఎన్నో విషయాల్లో విబేధాలుంటాయా ఉండవా? భర్తకు నలుపురంగు దుస్తులంటే ఇష్టం ఐతే ఇల్లాలికి తెలుపురంగు హుందాగా ఉంటుందీ అదే‌ మంచిరంగూ అని అభిప్రాయం. కూతురికి పింక్ రంగు ప్రాణం ఐతే కొడుక్కి ఆ రంగంటే అసహ్యం కావచ్చును. అమ్మకు ఏదో‌ బాబామీద భక్తి ఐతే గృహమేథిగారికి వేంకటేశ్వర స్వామితప్ప మరొక దైవం నచ్చడు. కొడుక్కి గణపతి మీద గురి ఐతే కూతురికి శ్రీకృష్ణభక్తి మెండు.అమ్మ కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటే వాడేమో‌ మంచి చిత్రకారుణ్ణి కావాలని కృషిచేస్తూ ఉంటాడు. ఇలా సవాలక్ష భిన్నాభిప్రాయాలుంటాయి. కాని అందరూ కలిసే ఉంటారు. సంతోషంగా ఒక కప్పుకింద కలిసి నివసిస్తూనే ఉంటారు.  ఒక రకంగా ఆలోచిస్తే దేశం అంతా కూడా ఒక కుటుంబం లాంటిదే. ఐతే అది చాలా పెద్ద కుటుంబం. మరి ఈ‌పెద్దకుటుంబంలో ప్రతి చిన్నాపెద్దా విషయం మీదా అందరూ ఎందుకు కలహించుకొని ద్వేషవిషాగ్నికణాలు మిన్నంటేలా ఎగదోస్తున్నారో‌ నాకు బోధపడటం లేదు. ఒక ముఖ్య కారణం రాజకీయభూతం అనుకుంటే మరొకటి మతవిద్వేషభూతం అనుకుంటున్నాను.

రాజకీయమైన అభిప్రాయబేధాలు పీకలుకోసుకొనే స్థాయిలో ఉండటానికి కారణం రాజకీయం అనేది సమాజశ్రేయస్సుకు తోడ్పడే సాధనంగా కాక స్వార్ధపరశక్తులకు అవకాశరంగంగా మారటమే.

ప్రపంచంలో అందరూ తీవ్రంగా విబేధించి కొట్టుకొని చచ్చే మరొక విషయం ఏదన్నా ఉందంటే అది ఒక్క మతం మాత్రమే. నిజానికి మతం అంటే అభిప్రాయం అనే అర్ధం. కాని రూఢంగా అథ్యాత్మికభావనగా లేదా అథ్యాత్మికజీవనవిధానంగా అది స్థిరపడిపోయింది.

ఈ వ్యాసం ఈరెండు సమస్యలను గురించీ‌ చర్చించటం కోసం ఉద్దేశించినది కాదు. మతదురభిమానం అనేది వెఱ్ఱితలలు వేసి మనుషులు కొట్టుకొని చచ్చేందుకు దారితీస్తున్న నేటి పరిస్థితుల్లో ఈనాటి విగ్రహవిద్వంస కార్యక్రమం పుణ్యమా అని రంగప్రవేశం చేసి ముందుకు వచ్చి నిలబడ్డ విగ్రహారాథన అన్న అంశం గురించి నా అభిప్రాయం వ్రాయటానికి మాత్రమే ఉద్దేశించిన వ్యాసం ఇది.

ఈసాయంత్రం మా మామయ్య గారు శ్రీప్రసాద్ ఆత్రేయ కవి గారు ఫోన్ చేసి ఈవిషయం ఎత్తారు. నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఆయన ఫోన్ చేసారు. కాని చిక్కేమిటంటే నా అభిప్రాయం ఒక్క వాక్యం ఐనా మాట్లాడానో‌ లేదో ఆయన అడ్డు తగిలి ప్రశ్నలు వేయటం‌ మొదలుపెట్టారు. ఎన్ని సార్లు ఎలా ప్రయత్నించినా నేను ఒకటి రెండు వాక్యాలైనా పూర్తిగా చెప్పే వీలు కుదరలేదు. ఇంతలో ఫోన్ కాల్ కాస్తా భగవంతుడు కట్ చేసిపారేసాడు.

మరలా ఆయన ఈ ప్రసక్తి తీసుకొని వస్తే కూడా సీన్ రిపీట్ అవటం‌ తప్ప చర్చ ముందుకు జరిగేది ఏమీ‌ కనిపించటం లేదు. అందుకని అయన కోసం ఈవ్యాసం వ్రాయటం జరుతుతోంది. సరే ఎలాగూ వ్రాస్తున్నాను కదా, అది అందరూ చదవటం మంచిదేగా అని నేరుగా బ్లాగులోనే వ్రాస్తున్నాను, ఆయనకు ఒక జాబు క్రింద వ్రాయకుండా.

ఇదీ ఈవ్యాసం నేపథ్యం. ఇంక నేరుగా విషయం లోనికి వెళ్తాను.

చిన్నప్పుడు బళ్ళో పంతులు గారు 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే వాళ్ళం. ఇప్పుడూ బళ్ళలో అలాగే నేర్పుతున్నారో‌ లేదో‌ తెలియదు. అంకెలూ‌ అక్షరాలూ నేర్చుకుంటున్న పిల్లవాళ్ళు అలా వేళ్ళ మీద లెక్కవేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది కాని పదో తరగతి పిల్లవాడు కూడా అలాగే 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేయటం‌ మొదలుపెడితే ఎలా ఉంటుంది చూసే వాళ్ళకు?

లెక్కల్లో అది ఎలాగైతే పిల్లవాడి వయస్సునూ‌ అనుభవాన్ని బట్టి మనం ఒక స్థాయిని సహజం అనుకుంటామో అలాగే అనేకానేక రంగాల్లో కూడా విషయం గ్రహించటం, అభ్యాసం వంటివి క్రమపరిణామంగానే ఉంటాయి.

చంటిపిల్లవాడికి 5 + 3 ఎంత అంటే ఎదురుగా ప్రత్యక్షంగా వేళ్ళ రూపంలోనో కాగితం మీద ఒకట్ల రూపంలోనో‌ ఒక ప్రతీకాత్మకమైన లక్షవస్తువులు కనిపిస్తుంటే వాడికి లెక్కపెట్టటం సుళువుగా ఉంటుంది. ఒక స్థాయికి వచ్చాక ఆలాంటి అవసరం ఉండదు.

ఆరాథనావిధానం కూడా అలాంటి ప్రతీకలతో కూడి ఉంటుంది ప్రాథమికస్థాయిలో.నిజానికి ప్రతీకలు మారుతాయి కాని తగినంత ఉన్నతమైన స్థాయిని చేరుకొనే వరకూ ఏదో విధమైన ప్రతీకల అవసరం లేనిదే‌ లక్ష్యం పైన గురి కుదరటం సాధారణ సాధకులకు చాలా చాలా కష్టం.

లక్ష్యం పైన చిత్తానికి విశుధ్ధిగా గురి కుదరటానికి చేసే సాధనలో భావనాభాగానికే‌ మనం సాధారణీకరించి శ్రధ్ధ అనీ భక్తి అని పేర్లు పెడుతున్నాం. లక్ష్యం ఒక శాస్త్రం ఐతే ఆ పేరు శ్రధ్ధ. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ఆ పేరు భక్తి.

లక్ష్యం ఒక శాస్త్రం ఐతే అక్కడ ప్రతీకలు శాస్త్రగ్రంథాలు. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ప్రతీకలు భగవన్మూర్తులు.

శాస్త్రం‌ బాగా ఒంటబట్టిన వానికి శాస్త్రగ్రంథాలతో పని లేదు. వారు గ్రంథాలను తృణికరించరు. వాటిని గౌరవంగానే చూస్తారు. శిష్యులకు అవి బోధిస్తారు కూడా. కాని వారికి స్వయంగా అవి అవసరం కావింక. ఎందుకంటే శాస్త్రవిషయంలో వారికి అధికారం సిధ్ధించింది కాబట్టి.

శుద్దరూపంలో భగవత్తత్త్వానికి బ్రహ్మము అని సంకేతం. వివిధ దేవతామూర్తి స్వరూపస్వభావాలు అన్నీ ఆ బ్రహ్మము యొక్క ప్రతీకలే. ఏ‌ ప్రతీకను ఆధారం చేసుకొని చిత్తశుధ్దిగా ఉపాసన చేసినా వారికి అంతిమంగా కలిగేది ఒకటే విధమైన తత్త్వజ్ఞానం.  ప్రతీకలను ఆధారం చేసుకొని ఉపాసన చేయటం సగుణోపాసన అని చెప్తారు. ఆ స్థాయిని ధాటి తత్త్వజ్ఞానం పరిపూర్ణంగా సిధ్ధించిన పిదప వారు చేసే ఉపాసన నిర్గుణోపాసన. కేవలం విశుధ్ధబ్రహ్మోపాసన.

ఏకంగా పరబ్రహ్మతత్త్వాన్ని ఉపాసన చేయవచ్చును కదా మధ్యలో రాముడూ శివుడు అంటూ ప్రతీకలను ఉపాసించటం ద్వారా సమయం ఎందుకు వృధాచేయటం అని బుధ్ధిమంతులు ప్రశ్నిస్తూ ఉంటారు. అది సాధ్యమా అన్నది అలోచించాలి ముందు.

అక్షరాలూ అంకెలూ అన్నీ బాగా వచ్చిన తరువాత కుర్రవాడికి ఏకంగా డిగ్రీ గణితం చెప్పవచ్చును కదా, ఎందుకండీ ఏళ్ళతరబడీ చిల్లరమల్లర గణితవిషయాలు చెప్తూ విలువైన కాలం వృధాచేస్తున్నారూ అని అడిగితే ఏమి జవాబు చెప్తారు?

తగిన పరిణతి రాకుండా ఏకంగా డిగ్రీ గణితం ఎలా గండీ వాడికి అర్ధం అవుతుందీ అంటున్నారా? చిత్తం. అంతేనండి. అలాగే తగిన పరిణతి రాకుండానే నిర్గుణబ్రహ్మోపాసన అన్నది అసాధ్యం అండి.

ఎల్లాగైతే పిల్లలు ఎదిగే క్రమంలో వేళ్ళమీద లెక్కలు వేయటం సహజంగానే మాని వేస్తారో అలాగే ఉపాసనాక్రమంలో పరిణతి వచ్చిన తరువాత సాధకులు ప్రతికల మీద ఆధారపడవలసిన అవసరం దాటి ముందుకు వెళ్తారు.

మీరు మీ‌వేళ్ళ మీద లెక్కలు కట్టటం లేదు. పెద్దవారైపోయారు కదండీ‌ పాపం. కాని మీ బుల్లి అబ్భాయో అమ్మాయో మీరు కాని 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే చెప్తుంటే ఎంతో ముచ్చట పడుతూ చూస్తారు కదా? కొంపదీసి చీచీ అలా వేళ్ళ మీద లెక్కెట్ట కూడదు దరిద్రం అని తిట్టరు కదా?

అలాగే నిర్గుణోపాసన స్థితికి వచ్చిన సాధకులు కూడా ఇంకా సగుణోపాసనలో ఉన్న వారిని చూసి వెక్కిరించరు. అందరూ ఒకే‌ పరిణతి కలిగి ఉండరు కదా అని వాళ్ళకు తెలుసు. అందుకే వారికి ఆ సగుణోపాసనలో తగినవిధంగా ప్రోత్సహిస్తారు. భయం లేదు, వాళ్ళు కూడా క్రమంగా పరిణతి సాధిస్తారు.

మీ‌ చిట్టితండ్రి లెక్కల పుస్తకంలో ఎన్నో ఇల్లా ఒకట్లు వేసి చేసిన కూడికలూ వగైరాలున్నాయి కదా. ఎవరన్నా దౌర్జన్యంగా ఆపుస్తకాన్ని లాగికొని చించివేస్తేనో, లేదా దొంగిలించితేనో వాడికి బోలెడు దుఃఖం వస్తుంది కదా. చెప్పండి వస్తుందా రాదా? ఆ పుస్తకం మీకు విలువైనది కాకపోవచ్చును. మీ చిట్టితండ్రికి ఎంతో విలువైన పుస్తకం కాదా? అది కాస్తా ఇలా ఐనది అని వాడికి దుఃఖం వస్తే, అలా దుఃఖం తెప్పించిన వాడి మీద మీకు కోపం వస్తుందా రాదా?  బోడి పుస్తకం, పోతే పోయిందిలే, నిజానికి లెక్కలు అలా ఎవరూ చేయరు అంటూ మీ‌పిల్లవాడి మీద చిందులు వేయరు కదా.

యూనివర్శిటీలో ఖగోళశాస్త్రం చదివుకొనే‌ యువకుడికి వాళ్ళ తాతగారి కాలం నాటి జ్యోతిషగ్రంధం వట్టి చెత్తగా తోచవచ్చును. ముందుముందు కాలంలో ఆ యువకుడి కొడుకు డాక్టరు చదువువెలిగిస్తూ తండ్రిగారి కలెక్షన్‌లో ఉన్న ఆస్ట్రనామిలల్ ఆల్మనాక్ వగైరా ఖగోళ శాస్త్రం పుస్తకాలను చెత్తచెదారం అనుకోవచ్చును. ఈ అనుకోవటాలు మనమన వికారాలే‌ కాని ఆ పుస్తకాల లక్షణాలు కావు. అందుచేత మన బుధ్ధుల్లో కొంచెం సంయమనం చాలా అవసరం.

ఈవిధమైన సంయమనం లోపించటం అంత మంచి సంస్కారం కాదు. భగవద్గీత గొప్ప పుస్తకం ఐనట్లే‌ బైబుల్ కూడా అని అనుకోవాలి. అండ్ వైస్ వెర్సా. కృష్ణుణ్ణి గౌరవించుతాను, జీసస్ అంటే నాకు కిట్టదు అనకూడదు. అండ్ వైస్ వెర్సా.

సనాతనధర్మంలో ఓం కారాదులు శబ్దప్రతీకలైలట్లే, రామకృష్ణాది స్వరూపాలు విగ్రహప్రతీకలు. క్రైస్తవంలో శిలువ ఒక ప్రతీక, మేరీమాత కూడా ఒక ప్రతీకాత్మక వ్యక్తియే. రాముడు అని ఒక ప్రతీకను ఒకడు ఉపాసనాసాధనంగా గౌరవించుకోవటాన్ని ఆక్షేపించే క్రైస్తవుల్లో అందరూ శిలువను మెడలో వేసుకుంటున్నారు కదా? రెండూ ప్రతీకలే. రెండూ - బండగా చెప్పాలంటే - విగ్రహారాథనలే. అందరూ కొంచెం ఆలోచించి చూడండి.

ఇస్లాం‌ కూడా విగ్రహారాథనకు తీవ్రంగా వ్యతిరేకం అంటారు. మంచిది. ప్రవక్త మదీనాకు ప్రవాసం వెళ్ళటం అనే థీమ్‌ను సూచించే కాలెండర్ బొమ్మలు కనిపిస్తున్నాయా లేదా? వారు చంద్రవంకనూ‌ ఆకుపచ్చరంగునూ తమ సాధనలో ప్రతీకలుగా గ్రహించారాలేదా?

ప్రతీక అంటే అది శబ్దం‌ కావచ్చును. ఒక రూపం కావచ్చును. ఒక వర్ణం కావచ్చును. ఒక స్థలం కావచ్చును. ఒక కాలనియమాది వ్యవహారం కావచ్చును. అన్నీ ప్రతీకలే.

అన్ని ప్రతీకలు వారి వారి సంప్రదాయికమైన సాధనావిధానాలను శ్రధ్ధలో ఉంచటానికి ఏర్పడినవే‌. అన్నీ వాటి వాటి ప్రయోజనాల దృష్ట్యా గొప్పవే.

సాధనలో పరిణతినిబట్టి ప్రతీకలు ఎదురుగా ఉంటేనే‌ సాధకుడు నిలువగలుగుతున్నాడా శ్రధ్ధలో లేదా అన్నది నిర్ణయం అవుతుంది. ప్రతీకల అవసరం దాటి ముందుకు వెళ్ళిన వాడు వాటిని చిన్నబుచ్చడు. మేడ ఎక్కటానికి మెట్లు అవసరం. అంతవరకూ మాత్రమే వాటి ప్రయోజనం. ఐన మేడెక్కిన తరువాత మెట్లు దండగ అని బుఱ్ఱ ఉన్నవాడెవడూ అనడు కదా.

ఒక చిత్రమైన ప్రశ్న విన్నాను. రామతీర్ధంలోనో‌ మరెక్కడో రామవిగ్రహం ధ్వంసంచేస్తే తప్పేముందీ? వచ్చిన నష్టం ఏముందీ అని.

ఒక చిన్నపిల్లల బడిని ఎవరో ధ్వంసం చేసారనుకుందాం. అక్కడ నేర్పే వేళ్ళ మీద లెక్కలూ వగైరా అంతా ట్రాష్ కదా, ఆ స్కూల్ పడగొట్టేస్తే తప్పేమిటీ‌ అంటారా మీరు? అనర్లెండి. మీకు చదువు విలువ తెలుసు. ఆవేళ్ళ మీద లెక్కలు అలాగే చిన్నపిల్లకి చెప్తారు అనీ తెలుసు. అందులో తప్పేమీ లేదని తెలుసు. కాని మీకు గుళ్ళు దేవుడి ప్రతిమలూ దేవుడికి పూజలూ అంతా ట్రాష్ అనే ఆధునిక భావాలు మాత్రం పుష్కలంగా ఉండి ఈ ప్రశ్న వేసారంతే. అయ్యా చిన్నపిల్లలకు వాళ్ళకు తగిన బడులు ఎలా అవసరమో పవిత్రమో సాధకులకు కూడా వారికి తగిన సాధనాస్థలాలూ ప్రతీకలూ అంతే అవసరమూ‌ పవిత్రమూ కూడా అని సవినయంగా మనవి చేస్తున్నాను.
 

ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.