25, ఏప్రిల్ 2019, గురువారం

తగువిధమున నను దయచూడవయా


తగువిధమున నను దయచూడవయా
పగవాడను కాను భగవంతుడా

ఎఱుగను నిగమము లెఱుగను నియమము
లెఱుగను ధర్మము లేతీరో
యెఱుగను బ్రతుకున నించుక సుఖమును
కఱకఱి బెట్టెడు కాల మెపుడు నను

జగములన్నిటిని తగ సృష్టించిన
జగదీశ్వరుడవు సర్వులకు
తగిన సుఖములను దయచేయుదువే
తగనా నాకును దయచేయ వది

ఇనకుల పతివై యీశ్వర యుడుతను
కనికరించితివి కాదా నా
మనవిని వినుటకు మాత్రము బెట్టా
నిను మరువని వాడనుగా రామా

16, ఏప్రిల్ 2019, మంగళవారం

జీవు డున్నతిని చెందే దెట్లా


జీవు డున్నతిని చెందే దెట్లా
దేవుడు వీడని తెలిసే దెట్లా

వచ్చిన పిదపనె పట్టిన వన్నీ
యిచ్చట వదలి యెటుపోవలెనో
ముచ్చట లన్నీ మూడునాళు లని
మెచ్చని జీవుడె మేలు కాంచును

ఎన్నిజన్మముల నెత్తిన గాని
తిన్నగ నీశ్వరు తెలియగ రాదే
పన్నుగ నీశుని భావించనిదే
చెన్నుగ మోక్షము చెందగ రాదే

చెవిలో శివుడే చెప్పిన నామము
భువిని జనించియు పొలుపుగ పాడి
ఎవడు దేవుడని యెఱుగును రాముని
చివరకు వాడే చెందును మోక్షము

15, ఏప్రిల్ 2019, సోమవారం

రాముడు మనసున రాజ్యము చేయక


రాముడు మనసున రాజ్యము చేయక
యేమి లాభము జన్మమెత్తి వీడు

కామాతురు డనగ కాసిన్ని దినములు
భూమిపై తిరిగిన నేమగును
కామన లుడుగని కతన మరల పుట్టి
భూమిని భ్రమియించి పోవును కాని

ఎవరెవరో గురువు లవసర దైవములు
ఇవలకు నవలకు నేమిత్తురు
భవమోహ ముడుగక భువిని మరల పుట్టి
ఎవరెవరినో కొలిచి యేగును కాని

తెలివిడి కలిగించు దేవుడు రాముడు
కలుషము లణగించి కాపాడు
తెలిసి శ్రీరాముని కొలిచిన నిక పుట్ట
వలసిన పనిలేని వాడగు కాని

ఏమను కొంటినో యెఱుగుదురా


ఏమను కొంటినో యెఱుగుదురా మీరు
నామనసున కప్పుడు రాముడే తోచె

పొగడదగిన వానినే పొగడుద మనుకొంటి
పొగడదగిన వాడు రామభూపాలు డొక్కడే
యగపడెను ముమ్మాటికి నందు నా తప్పేమి
పొగడకుండ నెటులుందు జగదీశ్వరుని

పురుషోత్తము డగు వాని పూజింత మనుకొంటి
పురుషోత్తము డనగ రామభూపాలు డొక్కడే
అరయ దెల్లముగ దోచె నందు నా తప్పేమి
హరి యనుచు శ్రీరాము నంద రెఱుగరే

అప్రమేయు నెన్ని యాత్మ నర్పింతు ననుకొంటి
అప్రమేయుడై తోచె నారాము డొక్కడే
అప్రమేయు డండ్రు హరి నందు నా తప్పేమి
సుప్రసిధ్ధవిషయ మిది సుజనులారా

14, ఏప్రిల్ 2019, ఆదివారం

వేయినామముల వాడ వేయిమాట లేల


వేయినామముల వాడ వేయిమాట లేల
వేయిజన్మములకును విడువను నిన్ను

గడచిన బహుజన్మములుగ నడచుచుండి నీ వెంబడి
కుడిచిన జ్ఞానామృతము కొల్లజేతునా
నడుమవచ్ఛి పోవునట్టి నరులు నవ్విపోదురని
జడుడనై మన నెయ్యము విడచువాడనా

ఏడుగడ ధర్మమని యెన్నిమార్లు బోధించిన
వీడు వినకున్నాడని విసిగికొనవుగా
రాడా ఒక నాటికి వీడు నా దారికని
గూడుకట్టుకొన్నావు నా గుండెలలోన

చెప్పిచెప్పి పనికాక శ్రీరామనామము నిచ్చి
చప్పున రక్షించినట్టి సర్వేశ్వరుడా
ఎప్పటికిని విడువను నీవిచ్చినట్టి నామమును
విప్పితి నిదె గ్రంథిత్రయము వీక్షింతు నిన్ను

శ్రీరాముని గొప్పదనము చెప్ప నేనెంత


శ్రీరాముని గొప్పదనము చెప్ప నేనెంత
ఆ రాముడే జగతి కాధారమై యుండు

శ్రీరాముడే నాకు చేయందించెను
శ్రీరాముడే నా చింతలు తీర్చెను
శ్రీరాముడే నన్ను చేరదీసుకొనెను
శ్రీరాముడే నా చిత్తమున నిలచెను

శ్రీరాముడే నాకు చెలిమికాడాయెను
శ్రీరాముడే నాకు జీవనం బిచ్చెను
శ్రీరాముడే గాక వేరు చుట్టము లేడు
శ్రీరాముడే గాక వే రుదైవము లేడు

శ్రీరాముడే సకల జీవులకు గురువు
శ్రీరాముడే సదా సేవ్యు డందరకును
శ్రీరాముడే కదా శ్రీమహావిష్ణువు
శ్రీరామునే కొలువ సిధ్ధించును ముక్తి

13, ఏప్రిల్ 2019, శనివారం

ఒకరి జేరగ నేల నొకమాట పడనేల


ఒకరి జేరగ నేల నొకమాట పడనేల
నొకసారి చిత్తమా యోచించవే

అన్నిట తోడైనవాడు అభయ మిచ్చు వాడు
వెన్పంటి యున్నవాడు విష్ణుదేవుడు
నిన్ను కాచుచుండగ నీకేల నితరుల
నెన్ని చేరవలసెనో యిన్ని నాళ్ళకు

చేయి నందించువాడు చింత తీర్చువాడు
హాయిగొల్పు తీరువా డాదిదేవుడు
నీ యోగక్షేమముల నిత్యమారయగను
పోయి నీకేల పరుల  పొంద నిప్పుడు

శ్రీరాముడను వాడు చెంత నున్న వాడు
తీరుగ మోక్షమిచ్చు దేవదేవుడు
కోరిన కోర్కులెల్ల కురియు నేమిటికి
ధారుణి సామాన్యుల తలప నిప్పుడు

పది కాదురా నీకు వందకంఠము లున్న


పది కాదురా నీకు వందకంఠము లున్న
వదలనురా ఓరి రావణ యనె రాముడు

ధర్మమే వచ్చి నీ తలలన్ని తరగునని
కర్మపాశబధ్ధుడవై కననైతివి
నిర్మలులగు సాధ్వుల నిర్దోషుల ఋషుల
దుర్మార్గముగ చెనకి దోషివైతివి నీవు

నీ పాడు  తలలను నిశ్చయంబుగ నేడు
కాపాడు వాడెవడు కఠినాత్ముడ
పాపాత్ముడా నీదు పదితలల పదిమార్లు
తాపమే తీరగ తరిగిపోసెద నిదే

గాసిపెట్టితివి నన్నుఖలుడ కాలము తీరె
చేసితి వపకారము శిక్షతప్పునె
వేసితి బ్రహ్మాస్త్రమిది విడువ దుసురులూడ్వక
రోసము నినుజంపక రూపరు విధమేదీ

శరణం శ్రీరామ శరణం శరణం


శరణం శ్రీరామ శరణం శరణం
కరుణాభరణా శరణం

శరణం శ్రీరామ సద్గుణధామ
శరణం శ్రీరామ జానకి రామ
శరణం శ్రీరామ జగదభిరామ
శరణం శ్రీరామ శ్యామలాంగ

శరణం శ్రీరామ శరధిబంధన
శరణం శ్రీరామ సత్యవిక్రమ
శరణం శ్రీరామ శత్రుతాపన
శరణం శ్రీరామ శక్రసన్నుత

శరణం శ్రీరామ జ్ఞానవార్నిథి
శరణం శ్రీరామ సంతాపహర
శరణం శ్రీరామ సర్వార్ధప్రద
శరణం శ్రీరామ సర్వమంగళ

అందరు తనవారె హరిభక్తునకు


అందరు తనవారె హరిభక్తునకు
సందేహము లేదు సర్వేశు నాన

రాముడు చాటిన ప్రేమభావనము
భూమిని నిండుట బుధ్ధినెఱిగిన
తామసరహితుడు రాముని భక్తున
కీ మహి యంతయు నేకకుటుంబము

యందరి వాడైన నిందిరాపతియె
ముందు వెనుకల నందర నేలగ
సందియ మేలా సకల జీవులును
బందుగులై యిల నుందురు కాదె

ప్రతిలేదుగా హరి వైభవంబునకు
మితిలేదుగా వాని యతులిత కృపకు
నతని నెఱింగిన హరిభక్తుండును
చ్యుతిలేని పదము జొచ్చునచ్చట

12, ఏప్రిల్ 2019, శుక్రవారం

చింతితసుఖసౌభాగ్యకర శ్రీరామజయం


చింతితసుఖసౌభాగ్యకర శ్రీరామజయం శ్రీరామజయం
చింతాశోకవినాశకర శ్రీరామజయం శ్రీరామజయం

సురగణవందిత చిన్మయరూప వరదాయక శ్రీరామజయం
నరపతియజ్ఞఫలోదయ రూప నారాయణ శ్రీరామజయం
వరమునియజ్ఞప్రవర్తక రూప వరవిక్రమ శ్రీరామజయం
నిరుపమహరకోదండఖండన సురుచిరభుజ శ్రీరామజయం

ఖరదూషణముఖసర్వసురారిగర్వాంతక శ్రీరామజయం
శరనిథిగర్వవిమర్దనమహదాశ్చర్యవిక్రమ శ్రీరామజయం
పరదారాపహరణలోలుప రావణదండన శ్రీరామజయం
వరసాకేతపురాధినాథ సర్వార్థప్రద శ్రీరామజయం

ధరణీతనయానిత్యార్చితపద ధర్మాకృతి శ్రీరామజయం
పరమమునీంద్రసమర్చితతత్త్వ పరమాత్మ శ్రీరామజయం
పరమమనోహరపావన నామ భక్తసేవ్య శ్రీరామజయం
కరుణావరుణాలయ జగదీశ యఖండకీర్తి శ్రీరామజయం

చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి


చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి
కాల మిటుల గడపి నిన్ను కలిసెద గాక

కోరుదునా యెన్నడైన కొఱగాని కోరికల
చేరుదునా నిన్ను దిట్టు చెనటుల తోడ
మీఱుదునా నీయాన మిన్ను మీద బడినను
కారుణ్యాలయ రామ కలలోన నైనను

పేరుబడ్డ మనుజులైన పెద్దదేవత లైన
వే రెవరిని నైన గాని వేడ నాకేమి పని
ఆరయ నీ వలన నే నన్నియును బడయుచు
శ్రీరామ నే నన్యుల చింతింప నేమిటికి

శ్రీరమారమణ నీవు శ్రీరామచంద్రుడవై
ధారుణి నీ భక్తజనుల దయతో పాలింపగ
భూరిగ నీ దయకు నోచి  పుడమి నీ వాడనై
యీరీతిగ నున్న చాలు నింకేమి వలయును

11, ఏప్రిల్ 2019, గురువారం

కడుగడు వింతాయె కమలేక్షణ


కడుగడు వింతాయె కమలేక్షణ నీ
కొడుకుల పను లిట్లు కూడని వాయె

ముది మదిదప్పి యొక ముద్దుల కొడుకు
మది నిన్నెంచనట్టి మనిషికి భోగము
వదలక నిను గొల్చు వారికి కష్టము
నుదుటను లిఖియించు నిది యేమయ్య

మదమున మరి యొకడు మానక భక్తుల
హృదయములను బట్టి యేర్చుచు నుండు
మదనుని చెయ్వులు మాన్పవు నీవైన
నిది యేమి వింతయో యేమందు మయ్య

ముదమున కొడుకులని మురియుదువే కాక
వదలబో రయ్య నీ భక్తులు వారిని
విదులు నీ రామమంత్ర మది మదినిలిపి
మదనుని బ్రహ్మను నదలించేరు

10, ఏప్రిల్ 2019, బుధవారం

పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే


పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే
చావైనా బ్రతుకైనా సంరక్షకు డతడే

సంతసమా సౌఖ్యమా చక్కగ వాడిచ్చినవే
అంతులేని ధుఃఖమా అదియును వాడిచ్చినదే
వింతయైన సృష్టి నెల్ల వెలయించిన వాడతడే
చెంతనే యుండి కంటికి చిక్కని వాడతడే

మేలైనా చేటైనా మేదిని నత డిచ్చినదే
కాలోచిత మైన దెల్ల కలిగించెడు వాడతడే
లోలోపల దాగియుండి లొల్లిపెట్టు వాడతడే
ఏ లోకపు జీవికైన నీశ్వరు డతడే

మొన్న రాముడనగ పుంసాంమోహను డైనది వాడే
నిన్న కృష్ణుడగుచు మన్ను తిని నవ్విన వాడతడే
అన్ని రూపములను తోచి యలరారు ఘను డతడే
ఎన్నగ జీవులకు ముక్తి నిచ్చువా డతడే

రమణీమణులార మీరు రాముని కథను


రమణీమణులార మీరు రాముని కథను
కమనీయముగ నేడు గానము చేయరే

హరినిచేరి సురలేమి యడిగిరో యన్నది
హరి సురల కేరీతి నభయ మిచ్చె నన్నది
హరి కొరకై దేవాంశలు ధరజేరిన రీతిని
పరమాత్ముడు రాముడై ప్రభవించిన రీతిని

రాముడు మునియాగమును రక్షించిన సంగతిని
ఆమునితో మిథిలాపురి కరిగినట్టి సంగతిని
కామారి ధనువు శ్రీరామునిచే విరుగుటను
రామచంద్రుడు సీతారమణిని పెండ్లాడుటను

లోకకళ్యాణకరుని లోకోత్తరచరితము
నాకర్ణించిన చాలు నఘములన్ని విరుగవే
ఓ కాంతామణులార యుల్లసించి పాడరే
శ్రీకాంతుని కథను మా చిత్తము లలరంగను

9, ఏప్రిల్ 2019, మంగళవారం

మనసంత నీకే యిచ్చాను


మనసంత నీకే యిచ్చాను మనసులోని మాట చెబుతాను
కనికరించి నువ్వు వింటే చాలు కావలసిన దింకేమీ లేదు

ఎన్నెన్నొ వేషాలు వేస్తూ భూమిని ఎన్నో మారులు చుట్టాను
ఎన్నడు నాకే వేషంతోనూ సున్నంటె సున్నయె సౌఖ్యము
అన్నన్నా నేనింత మాత్రానికే యిన్ని వేషాలూ వేయాలా
తిన్నగ నేను కదలక తొల్లిటి స్థితిలో నుంటే పోయేదే

నీవేదో నన్నుపంపావనుకొని నేనీ భూమికి వచ్చాను
నీవు పంపక నేను కదలక లేవుగ నాకీ కష్టాలు
ఈ వింతనాటక మాడిం దెవరో నీవే నాకు చెప్పాలి
నీవు పిలిస్తే మళ్ళీ నేను నీదగ్గరకే వస్తాను

తెలిసీ తెలియక చేసిన తప్పును తెలిసిన నీవే దిద్దాలి
ఇలపై శ్రీరాముడవై వెలసి యెందరినో రక్షించావే
తలవంచి నీకు దండం పెడితే దయతో దరిజేర్చు కున్నావే
కలనైన నిన్నుమరువని నన్ను కాపాడగ రాకున్నావే


నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును


నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును
వేయేల నాయునికి నీయిఛ్చయే కదా

నీమముగ నిన్ను పొగడ నిశ్ఛయించుకొని నేను
భూమిపైన నిలచితినా రామచంద్రుడ
నీమహాద్భుతలీల నిలుపు నన్నిచట గాక
యేమేమో పాడించునే కాక యేమందును

మరికొన్నినాళ్ళు నేనుమానక నీ రీతినే
పరమాద్భుతమైన నీ ప్రభావంబును
మరలమరల పాడుచు పరవశింతునా రామ
కరుణించి పాడించగద వయ్య నన్నెపుడు

మున్ను పాడినవారు మురిసి మోక్షార్హులై
నిన్ను పొందిరి కాన నీవు నన్నిపుడు
నిన్ను గూర్చి పాడగ నియమించుచున్నావు
సన్నుతాంగ రాఘవ జరుగనీ నీయాజ్ఞ
శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని


శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
మీరు భజించరు నోరార

శ్రీరఘురాముడు  సీతారాముడు
కోరినవరములు  కురియడా
తారకనామపు చేరిక నోటికి
ఔరా చేదా కారమా

హరుడే నిత్యము నారాధించెడు
హరినామము చేదైనదా
నరులకు శ్రీహరిస్మరణము కంటెను
తరణోపాయము ధరనేదీ

పామరులారా ప్రకృతివశులై
ఈ మేదిని నిటు లెన్నాళ్ళు
రామ రామ శ్రీరామా యంటే
ఆ మోక్షము మీ కందదా

8, ఏప్రిల్ 2019, సోమవారం

కేసీఆర్ గారు సమయానికి తగుమాట లాడెనే.....


సమయానికి తగుమాటలు కేసీఆర్ గారు వల్లించారు.

ఈ మాటలను నేను జైగారు అక్కసుగానో ముధ్ధుముధ్దుగానో పచ్చమీడియా అనే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో మాత్రమే చదవలేదు.

సాక్షాత్తూ నమస్తే తెలంగాణాలోనూ చూసాను.

ఆంధ్రజ్యోతిలో ఐతే కేసీఆర్ దొరగారి గళంలోనే ఆ ఉవాచను ఆకర్ణించాను.

నమస్తే తెలంగాణా ఆన్-లైన్ ఎడిషన్ పత్రికలోని వార్త పాఠం ఇలా ఉంది.

వికారాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందని వికారాబాద్ టీఆర్‌ఎస్ సభలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో మాకేం గొడవ లేదు. తెలంగాణ, టీఆర్‌ఎస్ పార్టీ తన మేలుతో పాటు ఇతరుల మేలు కూడా కోరుతది. చంద్రబాబు లాగా చీకటి పనులు చేయం. నీ లాగా పొద్దున్నే లేచి మందికి గోతులు తీయం. తెలంగాణకు కుట్రలు చేయడం రాదు. లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 సీట్లు.. ఎంఐఎం 1 సీటు గెలవబోతున్నది. ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.

చంద్రబాబు లాగా మేం అల్పులం కాదు. చంద్రబాబులాగా మాది నీచబుద్ధి కాదు. మాకు ఉదార స్వభావం ఉంది. మీకు పోలవరం కట్టడం రాలేదు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా మాత్రమే అడుగుతున్నాం. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అందరూ బతకాలన్నదే మా సిద్ధాంతం. దేశాన్ని విడదీసి ఏం సాధిస్తారని కేసీఆర్ వివరించారు.

ఎన్ని చల్లని మాటలు.

కాని ఇవన్నీ నమ్మదగ్గ మాటలే అంటారా?

ఒకప్పుడు ఇదే కేసీఆర్ మహాశయులు

తెలంగాణా ఇస్తే తె.రా.స.ను మీ పార్టీలో విలీనం చేస్తానని కాంగ్రెసు వారిని ఊరించారు. ఎంత బాగా మాట నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా

అలాగే తెలంగాణా వస్తే తొలి సారిగా తెలంగాణా రాష్ట్రముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేస్తానని పదేపదే చెప్పారు. ఆ మాటనూ ఎంత బాగా నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి తీరుతాననీ లేకపోతే ఓట్లు అడగటానికి తెరాస రాదనీ కూడా ఢక్కా బజాంయించి చెప్పారు. ఆ మాటనూ ఎంత బాగా నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా.

ఇక ప్రస్తుతానికి వద్దాం.

ఆంద్రప్రదేశ్‍కు గనక ప్రత్యేకహోదా ఇచ్చే పక్షంలో తెలంగాణాకూ ఆ హోదా ఇవ్వాలని ఒకప్పుడు అన్నారు కదా, ఇప్పుడు అంత తీవ్రతను మానుకొని ఆంద్రప్రదేశ్‍కు ప్రత్యేకహోదా ఇవ్వాలనీ దానికోసం కృషి చేస్తామనీ అంటున్నారు. నమ్ముదామా?

కొత్తగా తాము,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అదేమిటీ తెలంగాణా ప్రభుత్వం వారు పోలవరానికి మోకాలు అడ్డుపెట్టటం ఇప్పుడేదో ఎవరో అపోహ పడినట్లుగా అంటున్నారేమిటీ? నిజంగా అడ్డుపడ్డారు కదా? మాటవరసకు ఒక లింక్ చూపుతున్నాను.  Telangana govt objects to Polavaram irrigation project in Andhra Pradesh అన్నది.  పాతపత్రికలు తిరగవేస్తే తెలంగాణా వారు పోలవరం పైన కారాలూ మిరియాలూ నూరుతూ ప్రవర్తించిన తీరు అంతా తెల్లంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో సభలో అబ్బే ఎప్పుడూ సహకరించామే కాని అడ్డుపడలేదూ అంటే వినే వాళ్ళను అమాయకులను చేయటమా ఉద్దేశం? ఇప్పుడు "పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది" అంటే నమ్మటం ఎలా గండీ?

ఈ మాట చూడండి "చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో మాకేం గొడవ లేదు". అహా! ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా ద్రోహులే అన్న ఉవాచలు దొరవారినుండో వారి పార్టీ పెద్దలనుండో కాక అంధ్రుల కలల్లోంచి వచ్చాయాండీ? ఏపీ ప్రజలతో ఏ పేచీ లేదూ వాళ్ళు మంచాళ్ళూ అని ఈరోజున కితాబు ఇస్తున్నారే, మరి ఆంద్రాలో పుట్టిన పాపానికి కదా, ఆ మంచాళ్ళల్లో కొందరు మహనీయుల విగ్రహాలు టాంక్ బండ్ మీద ఉంటే పూనకంతో విరగ్గొట్టారే! అదంతా ఆంద్రావాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సన్మానించటమేనా?  లేదా వాళ్ళంతా చంద్రబాబును సపోర్టు చేసారన్న అభియోగం కారణంగా ముక్కలు చేయబడ్డారా మరి? ఈరోజున అవసరార్థం "ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు" అనటం మంచివాళ్ళు  వైసీపీకి ఓటువేస్తారు పాపం అని బుజ్జగించటం కాదూ? నిజంగా మంచివాళ్ళైన ఆంద్రావాళ్ళని ఉద్యమం పేరుతో దుర్భాషలాడిన కేసీఆర్ గారు ఈరోజున మంచివాళ్ళు మీరు అనగానే ఆయన మనస్ఫూర్తిగా అన్నారనుకొని అంద్రాజనం పొంగిపోయి ఆయన చెప్పిన వాళ్ళకు ఓటేయాలా చచ్చినట్లు. వేస్తే చచ్చినట్లే అని నా ఉద్దేశం.

ఈ సూక్తి చూడండి "అందరూ బతకాలన్నదే మా సిద్ధాంతం". ఎంత మంచి మాట! ఉద్యమం పేరుతో అవసరం ఐతే ఆంధ్రావాళ్ళు  అందరూ చచ్చి ఐనా తెలంగాణా ఇవ్వాలి అని ఈయన పార్టీవాళ్ళు అన్న మాటలు ఆంద్రాజనం మర్చిపోవాలన్నమాట. ఈ మాట కేసీఆర్ గారు అన్నారో స్వయంగా అనిపించారో కాని ఆమాట అప్పట్లో అన్నారు, ఆంద్రావాళ్ళు పడ్డారు.

ఇంకో ముక్క "చంద్రబాబు లాగా చీకటి పనులు చేయం". భేషైన మాట. అప్పట్లో ఆయన చేసిన చారిత్రాత్మికమైనది అని పొగడబడ్డ నిరాహార దీక్షా కార్యక్రమం అంతా ఒక డ్రామా అని గుసగుసలు వచ్చాయి. ఎంతవరకూ నిజమో తెలియదు కాని, అతిప్రమాదకరంగా ఉందాయన పరిస్థితి అని వార్త వచ్చి ఆవెంటనే తెలంగాణా ప్రకటన వచ్చి ఆ తక్షణం ఆయన కొత్తపెళ్ళికొడుకు లాగా టీవీఛానెళ్ళలో దర్శనం ఇవ్వటం అన్నీ బాగానే గుర్తున్నాయి జనానికి. దాన్ని బట్టిచూస్తే ఆయన  చేసిన నిరాహార దీక్ష ఒక పగటివేషమూ ఆయన ఒక చీకటిపనిగా ద్రవాహారాలు స్వీకరించారు అన్నది అసలు సంగతీ అనిపిస్తుంది. అసలు తెలంగాణా తీర్మానం పార్లమెంటులో ఆమోదించినదే ఒక చీకటి పనిగా. అదికూడా అందరికీ గుర్తుంది. ఇప్పుడు చీకటిపనులు చేయం అని సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా నమ్మేదండీ?

ఇది చూడండి "చంద్రబాబు లాగా మేం అల్పులం కాదు"? తనకు బద్ధశత్రువే కావచ్చును. రాజకీయప్రతిస్పర్థి ఐనంత మాత్రానా అల్పుడు అంటారా? అది రాజకీయ విజ్ఞతా? ఎవరన్నా అవును అంటే వారికో నమస్కారం. రేపు కేసీఆర్ గారికి కోపం వస్తే, ఆంద్రాజనం లాగా మేం అల్పులం కాదు అని కూడా అనగలరు. ఆయన నోటికి శుధ్ధి అనేది లేనే లేదు. సరే ఆవిషయం అటుంచండి. ప్రస్తుతం చంద్రబాబు ఆంద్రాకు ముఖ్యమంత్రి. అంద్రాముఖ్య మంత్రిని అల్పుడు అని తిట్టే వాడిని ఆంద్ర్హులంతా ఎలా మెచ్చుకోవాలీ? రేపు ఎవరు ఆంధ్రా ముఖ్యమంత్రి ఐనా తనకు అనుకూలంగా లేకపోతే అల్పుడూ అనే అంటాడు కదా? ఆలోచించండి.

ఈ ముక్క చూడండి "మాకు ఉదార స్వభావం ఉంది". ఆహా, లోగడ ఎంతో ఉదారస్వభావం తోనే కదా, అంద్రావారి ఆహారవిహారాలనూ హీనంగా ఎద్దేవా చేస్తూ ఈ మహాశయులు సభారంజకంగా మాట్లాడిందీ? ఆంద్రావారు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుదన్న మాట వీరి ఉదారమైన స్వభావం కారణంగా వీరి పవిత్రవాగింద్రియ విలాసంగా వెలువండిందీ. ఆంద్రా వాళ్ళకు ఈబిర్యానీ తినటం ఖర్మమేమీ? వాళ్ళు హాయిగా పులిహోర చేసుకొని తింటారు. వెక్కిరించినంత మాత్రానా ఆంధ్రారుచులకు వచ్చిన లోపం యేమీ లేదు. ఇంకా చాలా చాలా మాటలు ఆనాటి ఉద్యమం వేడి పేరిటనే చాలా ఉదారంగా ఆంద్రావాళ్ళ మీద విసిరారు లెండి. అవన్నీ ఎలాగో మర్చిపోయి, ఇప్పుడు కేసీఆర్ గారి మంచిమాటను మెచ్చేసుకొని సంబరపడిపోవాలి, వారి ఉదారవాక్యవిన్యాసానికి. ఔరా!

పైగా "దేశాన్ని విడదీసి ఏం సాధిస్తారని కేసీఆర్ " అంటున్నారు. ఎవరు విభజన వాదులూ? పచ్చని రాష్ట్రాన్ని విడదీసింది ఈ కేసీఆర్ గారి అధికార దాహం కాదూ? కాదు లెండి తెలంగాణా వారి ఆకాంక్ష అంటారా? మంచిదే. ఇప్పుడు ఆంద్రాని విడదీయాలి ముక్కలు ముక్కలుగా అని అలోచిస్తూ ఆంధ్రామీద పెత్తనానికి తహతహ లాడుతున్న కేసీఆర్ గారిని విభజన శక్తిగా చూడాలా ఐక్యతా శక్రిగా చూడాలా?  ఆయనకు ఈమద్య ప్రథాని పదవిపై మోజుపుట్టింది. దాని వెనుక ఆలోచన అల్లా, తాను ప్రథాని ఐతే ఆంద్రాని అణగద్రొక్కవచ్చును అన్న అలోచన కాదా అని అనుమానించ తప్పదు.

ఎన్నడూ ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్నట్లు ప్రవర్తించే కెసీఆర్ గారి మాటను ఎలా నమ్మటం? ఆయన అవసరార్థం ఇప్పటికి  ఇచ్చిన ఎన్నో గొప్ప వాగ్దానాల్లాంటివే ఈనాడు జగన్ గారిని గెలిపించాలన్న తాపత్రయంలో తర్వాత చూసుకోవచ్చులే అన్న ధోరణిలో ఉదారంగా చెప్తున్న అందమైన మాటలూ వాగ్దానాలూను అని అంద్రాజనం అర్థం చేసుకోలేరా?

ఒకపక్కన "తెలంగాణకు కుట్రలు చేయడం రాదు" అంటూనే తెలంగాణా ముఖ్యమంత్రిగారు చేస్తున్న అతిపెద్ద కుట్ర ఆంద్రావాళ్ళకు మెరమెచ్చు మాటలు చెప్పి, తన చెప్పుచేతల్లో "బాంచన్ దొర కాల్మొక్త" అనే స్థాయిలో పడుండటానికి సిధ్ధంగా ఉన్న వ్యక్తిని గద్దెకెక్కించి ఆంధ్రాను నిలువునా ముంచి, ఆంద్రాజనాన్ని తెలంగాణా అభివృధ్ధికి వెలగా వెలగాలని ఆలోచించటం. కాదంటారా?

ఇంకొక ముఖ్యవిషయం. నిజంగా జగన్ గారు బ్రహ్మాండంగా - ఎంత బ్రహ్మాండంగా అంటే చంద్ర్రబాబుగారికి (ఇంక అయన గారి పార్టీమాట చెప్పాలా?) అసలు డిపాజిట్ అన్నదే రాకుండాపోయేంత బ్రహ్మాండంగా - జగన్ గారు విజయాట్టహాసంతో గెలిచే పక్షంలో, ఇప్పుడు ఆఖరుకు ప్రచారం ఇంకో  రోజులో ముగియ బోతున్నది అనగా ఆ జగన్ గారిని అరచేత్తో పైకెత్తుతూ ఈ అద్భుతమైన సుహృద్భావ ప్రకటనను మన కేసీఆర్ మహాశయులు చేయవలసిన అవసరం ఏముంటుంది? గమ్మున ఉండవచ్చును కదా. సమయం వచ్చినప్పుడు ఆ హోదాకు మద్దతు ఇచ్చేదీ మానేదీ చూసుకొవచ్చుననీ? మరి యెందుకు తొందర పడ్డట్టూ? అంటే అయనకు స్పష్టంగా అవగాహనకు వచ్చి ఉండాలి, తమ ప్రియతమ కొత్త (తాత్కాలిక) మిత్రుడు జగన్ గారు ఓడిపోబోతున్నాడనీ? అందుకే యధాప్రకారం తనదగ్గర ఏవో సర్వేల తాలూకు స్పష్తమైన రిపోర్టుల ప్రకారం జగన్ గెలిచేస్తున్నాడన్న బుకాయింపుతో సహా ఈ ప్రత్యేకహోదా గురించిన చిలకపలుకులు వల్లించారు!

ఇంకా కేసీఆర్ గారు మంచివారూ, ఆంద్రాని స్వయంగా పూనుకొని అభివృధ్ధి చేయ బోతున్నారు అని ఎవరన్నా నమ్ముతుంటే వారికో దండం.

7, ఏప్రిల్ 2019, ఆదివారం

జగనన్న సి.యమ్. ఐతే లాభాలేమిటీ?


ఈరోజున ఆంధ్ర ప్రదేశ్ కి 2019 లో బాబు మరలా సి.ఎం ఐతే కలిగే లాభాలేంటి? అనే ఒక టపా చూసాను పతంగిసాంబ నేటిబారతం బ్లాగులో . అది చదివి కేవలం సరదాగా నేను అలాంటి టపా ఒకటి వ్రాస్తున్నాను.


 1. లోటస్ పాండ్లు. ఇవి ఇబ్బడిముబ్బడిగా నిర్మించబడతాయి. ముందు అన్ని ప్రముఖ నగరాల్లోనూ, మెల్లగా ప్రజల కోరికను కాదనకుండా ఊరూరా లోటస్ పాండ్లు నిర్మిస్తారు. అవి అటు పార్టీ కార్యాలయాలుగా నూ ఉపయోగిస్తాయి, ఇటు ముఖ్యమంత్రి గారికి రకరకాల (పాద)యాత్రల్లో విడుదుల్లాగానూ ఉపయోగిస్తాయి. అంతకంటే ముఖ్యంగా ఆంధ్రా అందాలను అవి ఎంతో గొప్పగా ఇనుమడింప జేస్తాయి. పర్యాటకం అభివృధ్ధి అవుతుంది. లోటస్ పాండ్ సందర్శకుల వలన వచ్చే రాబడిలో 10% రాష్ట్రఖజానాకు విరాళంగా ఇస్తారు.  జగన్ గారు ప్రజానాయకుడిగా ప్రజలతరపున మిగతా సొమ్మును వినమ్రంగా స్వీకరిస్తారు.
 2. సామంతరాష్ట్రంగా ప్రత్యేకహోదా.  అందరూ ప్రత్యేకహోదా కావాలీ కావాలీ అంటూ తెగ గడబిడ చేస్తున్నారు. కాని ఇప్పటికే మన అంద్రాకు ఒక ప్రత్యేకహోదా ఉందన్న సంగతిని మాత్రం తెలుసుకోలేక పోతున్నారు. ఇది రాష్ట్రవిభజన నాటికే ఏర్పాటయ్యింది కాని గుడ్డి ఆంధ్రాజనం తెలుసుకోలేక పోయారు. ఒకే గవర్నర్ అంటే మరేమిటీ, గవర్నర్ సాయంతో తెలంగాణాయే ఆంధ్రాను పాలిస్తుందని కేంద్రం ఏనాడో నిర్ణయించింది. తెలుసుకొని తరించండి బడుధ్ధాయిలూ! అందుచేత ప్రత్యేకహోదా అంటే, ఇంతవరకూ భారతదేశంలో సామంతరాష్ట్రాలు లేవు. ఇకపై ఆంధ్రా అనేది తెలంగాణాకు సామంతరాష్ట్రంగా ఉంటుంది అనే ప్రత్యేక హోదా అన్నమాట.
 3. పారదర్శకమైన పాలన. స్వంతంగా ఆంధ్రాప్రభుత్వం అంటూ తీసుకోవలసిన నిర్ణయాలు పెద్దగా ఏమీ ఉండవు.అన్ని నిర్ణయాలూ డిల్లీ అనుమతితో హైదరాబాదులో కేసీఆర్ గారి ఫార్మ్‍హౌస్ నుండే వస్తాయి.ప్రజల సౌకర్యార్థం పెద్దదొరలు ఈ వినయవిధేయ ఆంద్రారాములకు చెప్పే తలంటుతూ ఉంటారు లెండి. ఎందుకంటే వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు ఆనిర్ణయాలు నచ్చినా నచ్చక పోయినా. ఒక అవకాశం ఇచ్చి చూడటం అంటే ఏమిటో బాగా తెలిసివస్తుంది. ఇంక జనం చేతిలో ఏ అవకాశమూ ఉండదు నోరెత్తటానికి అని
 4. పోలవరానికి ఫుల్ స్టాప్. బాబుగారి అవినీతి సామ్రాజ్యం కూల్చివేయాలంటే తప్పదు మరి. అయినా ఆంధ్రాకు మాత్రం లాభం కలిగే ప్రాజెక్టుల వలన ఇతరరాష్ట్రాలకు ఇబ్బంది ఐతే ఎలా చూస్తూ ఊరకుంటారు ప్రభువులు?
 5. బందరుపోర్టు పరాధీనం. మీ కెందుకండీ ఆ పోర్టు ఆంధ్రులూ?  తెలంగాణం వారికీ ఒక పోర్టు ఉండవద్దా? వాళ్ళకు సముద్రం లేకుండా అన్యాయం చేసిన మిమ్మల్ని ఏం చేస్తే పాపం ఉందీ? అందుకే ఒక్క బందరేమిటి అన్ని పోర్టులూ తెలంగాణా భాగస్వామ్యంతో నడుస్తాయి. బందరులా అన్నీ 100 శాతమూ తీసుకోరట లెండి. ఎంతన్నా చాలా మంచివాళ్ళు కదా మన తెలంగాణా ప్రభువులు
 6. జలవివదాల పరిష్కారం. చక్రవర్తులకు సామంతరాజులతో తగువులు వస్తే ఎవరు గెలుస్తారు? ఇప్పటి దాకా ఏదో గింజుకుంటున్నారు కాని. ఇకపై అన్ని జలవివాదాలూ పరిష్కారం అవుతాయి. నీళ్ళనీ పైనున్న రాష్ట్రంగా తెలంగాణాకే హక్కుభుక్తం అవుతాయి. ప్రభువులదయాధర్మసంప్రాప్తమైన నీళ్ళచుక్కలతో పండించుకొని తింటారో లేదో మీయిష్టం.
 7. కరెంటు వివాదాలు పరిష్కారం. ఇవీ నీళ్ళవివాదాల్లాగే పరిష్కారం అవుతాయి. ఇంక ఆంద్రాలో హాయిగా రోజుకు 24 గంటల చొప్పున మాత్రం పవర్ కట్ అమలు అవుతుంది.
 8. పరిశ్రమలకోసం దేశాలు తిరిగే శ్రమ ఉండదు. నీళ్ళు కరెంటూ కూడా లేని రాష్ట్రానికి పరిశ్రమలా? అవన్నీ మే< చూసుకుంటాం కదా అంటారు ప్రభువులు. ఇచ్చిందేదో తిని చచ్చినట్లు పడుండక హాయిగా పరిశ్రమలూ అభివృధ్ధీ అంటూ హైరాన పడే శ్రమ మీకెందుకు ఆంధ్రులూ?
 9. ప్రాంతీయపార్టీలు అంతరిస్తాయి. మరి జగన్ పార్టీ కూడానా అనకండి తెలివి తక్కువగా. ఆయన పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. జగన్ పార్టీకి హైదరాబాదులోనో మరెక్కడో కూడా ఒకటో రెండో సీట్లు ఇప్పించటం జరుగుతుంది.  తెలుగుదేశం లాంటి కుహనా జాతీయపార్టీలు అంతరింపజేయ బడతాయి. అదెలా అన్నారంటే మీకంటే మూర్థులు ఇంకెవరూ ఉండరు. తెలంగాణాలో కాంగ్ర్రెసే అంతరిస్తోంది చూడటం లేదా? ఇంక ప్రభువుల పార్టీ ఒకటీ, వారి సామంతుల పార్టీ ఒకటీ మాత్రం ఆంద్రాలో మిగుల్తాయి. ఈ సామంతుల పార్టీ ఎన్నాళ్ళుంటుందీ అని అడగరనే అనుకుంటాను.
 10.  అమరావతి. దీన్ని ప్రభువిధేయమేతావులు భ్రమరావతి అంటున్నారు. ఇంక భ్రమలు అక్కర్లేదు. పరిపాలన అంతా హైదరాబాదు కేంద్రంగానే అని స్థిరపడ్డాక, ఆంధ్రారాజధానికి పేరుకో ఎకరం పొలంలో ఓ రెండు బిల్డింగులు చాలవూ? ఇప్పటికే సేకరించిన భూములూ పుట్రలూ అంటారా? ఎంతమాట, వాటిని ప్రభువులూ సామంతులూ వృధాగా పోనివ్వరు లెండి. ఎలా సద్వినియోగం చేయాలో వారికి చక్కగా తెలుసును, మీరేం దిగులు పడకండి.
 11. సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగా అంద్రాకు అంటూ ఏమీ అవసరం ఉండదు. తెలంగాణావారికే ఆంధ్రాసంక్షేమం అప్పగిస్తుంది కేంద్రం.
 12. ఉపాధి కార్యక్రమాలు. వాటి కోసం ఎందుకు దండగమారి ఖర్చులు ఆంధ్రాలో? ఆంధ్రాయువకులకు ఉపాధికావాలంటే తెలంగాణా వారు కూలిపనికి పిలవటానికి సిధ్ధంగానే ఉంటారు. బీహారీ యువకులు రావటం లేదా హైదరాబాదుకు, ఆంద్రావాళ్ళూ రావచ్చును. పెత్తనం చేయటానికి రాకూడదు కాని కూలి చేయటానికి రావచ్చును. ఆంధ్రాలోనే ఉపాధి కావాలీ అంటే ఎలా? మీదసలే బీద రాష్ట్రం. పైగా సామంత రాష్ట్రం.

ఇలా జనగన్న వచ్చేసాక, అన్ని చిక్కులూ తీరిపోయి ఆంధ్రావాళ్ళు హాయిగా బానిస బ్రతుకులు బ్రతికేయవచ్చును.

కాదని బాబును ఎన్నుకున్నారో మరో ఐదేళ్ళపాటు ఎవరిమీదో ఒకరిమీద పోరాడుతూనే ఉండాలి మరి. అంత ఓపిక ఉందా మీకు? ఆలోచించుకోండి.

6, ఏప్రిల్ 2019, శనివారం

ఏమి వేడితే వా డీయ నన్నాడే


ఏమి వేడితే వా డీయ నన్నాడే
ఓ మనసా తలపవు రాముని నీవు

విడువ కవే తప్పులతో విసిగించు చున్నావా
చెడు పనులు చేయకు మని చెప్పలేదా వాడు
కడగి పదేపదే నిను కరుణించ లే ననడా
నడువవు మంచి దారిని నమ్మరాని మనసా

తరచు సంపదల నడిగి తలనొప్పి తెచ్చావా
పరమాత్ముని దయముందు పాడు సంపద లెంత
నిరుపమాన మైన సిరి హరిదయామృత మని
తిరముగా నమ్మవుగా తింగర మనసా

అడిగితే మోక్ష,మైన నతడీయ నన్నాడా
అడుగరాని వడుగ కది యడిగిచూడ రాదటే
జడతవీడి రామా యని జపము చేయరాదటే
కడుమంచి వాడు కదా కనికరించు మనసా

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

హాయి నీ స్మరణమం దమితమై యుండగ


హాయి నీ స్మరణమం దమితమై యుండగ
వేయేల నితరమెల్ల వెగటాయెను

అన్ని వేళలను స్మరణ మన్నదే వృత్తిగా
నన్ని యింద్రియ వృత్తు లడుగంటెను
అన్ని వేళలను నీయందు ధ్యాసతో కప్పు
కొన్న తనువు పైన ధ్యాస కొంచెమాయెను

నీ నామము నీరూపము నిత్యము ధ్యానించ
కాని దాయె నామరూపకలితప్రకృతి
నీ నిజతత్త్వ మొకటి నిక్కమై హృదినిండ
లోన నితరవిషయసమితి లుప్తమాయెను

నన్నేలు రాముడా నాదేవుడా నేను
తిన్నగా నీపైన దృష్టియుంచగను
ఉన్నవా లోకములు ఉన్నవా రేబవళ్ళు
ఉన్నది నీవొకడవే యన్నదాయెను

చక్కని విలుకాడ వందురే


చక్కని విలుకాడ వందురే సాకేతరామ
ఒక్క బాణమేయ రాదా

ఎక్కుపెట్టి విల్లు నీ వొక్క బాణమేసి నా
చిక్కులన్ని తీర్చరాదా చీకాకుపెట్టు
రక్కసుల కామాదుల రామబాణ మొక్కటే
యుక్కడగించే నిది నిక్కము రామయ్యా

నిక్కునీల్గు వాలిపై నొక్క బాణమేసి ఆ
స్రుక్కియున్న సుగ్రీవుని దిక్కైనట్లు
నిక్కు నా అహమనే యొక్క చెడ్డ కోతిపై
చక్కగ నీ బాణమేసి చక్కజేయ రాదా

అక్కటా పరశురాము డార్జించిన పున్నెముల
నొక్కబాణ మేసి నీ వూడ్చి వేసినట్లు
ఒక్కబాణ మేసి నాకున్న పాపరాశి నెల్ల
చక్కగ మండించ మంచి సమయ మిదే కాదా

3, ఏప్రిల్ 2019, బుధవారం

పొందుడీ సుఖము రామచందురుని


పొందుడీ సుఖము రామచందురుని వలన లోక
వందితుని వలన మీరందరు నిపుడు

సర్వలోకశరణ్యుని శాంతస్వరూపుని
సర్వలోకసుఖశాంతిసంపత్కరుని
సర్వదానవలోకసంహారశీలుని
సర్వవేళలను మనసార తలపోయుచు

సీరధ్వజకన్యకాసేవితశ్రీచరణుని
నారదాదినుతగుణార్ణవుని ధీరుని
కారణకారణుని లోకకళ్యాణమూర్తిని
కారుణ్యాలయుని పూర్ణకాముని కొలుచుచు

నేలకు దిగి వచ్చిన నీలమేఘశ్యాముని
కాలాత్మకుని శ్రీలోలుని హరిని
మేలైన వరములను మీకిచ్చు వానిని
చాల సంతోషపడుచు చక్కగ పొగడుచు


2, ఏప్రిల్ 2019, మంగళవారం

లోకమున నందరును నాకు మిత్రులే


లోకమున నందరును నాకు మిత్రులే
లోకమున నందరును నీకు దాసులే

ఈ మిత్రుల లోన కొంద రేవేవో పలుకుదు
రేమని యెవరన్న నా కేమిటి కయ్య
ప్రేమింతురు మానుదురు భేదితము కాదు నా
ప్రేముడి యందరిపైన వెలయు నొకే రీతిగ

నీవు లేవను వారు నిన్ను కాదను వారు
నీ విశాలసృష్టిలో నెందరు లేరు
నీ వారు తిట్టినను నీకు పట్టింపు లేదు
నీ వందరి మంచినే భావించు చుందువు

దాసపోషకుడవైన దశరథాత్మజ నేను
దాసులలో నొకడనై తనరు వాడను
నా సరివారందరు నావారు మాయందు
కోసలేంద్ర భేదములు కొంచెమైన లేవు

మన్నింపుము రామ మానవమాత్రుండను

మన్నింపుము రామ మానవమాత్రుండను
నిన్ను చక్కగ పొగడ నేర్పు నాకు కలదె

వేయితల లుండి రెండువేల నాలుక లుండి
హాయిగ పొగడనేర్చు నాదిశేషుడు
నా యొక్క నాలుకతో చేయంగల కీర్తన
నీ యనంత మహిమను వర్ణించ నేర్చునా

నిత్యాపాయినియై నీరేజసంభవ
యత్యంత శ్రధ్ధ నీ యనంతకీర్తి
నిత్యము పొగడును నే నెఱిగిన దెంత
స్తుత్యమౌ నీ తత్త్వము సొంపుగ పొగడ

పసిపాపని పాటల వంటి నా కీర్తనలు
ముసముసి నవ్వుల విందు వీవని
కొసరి చిన్నివరములు కోరిపాడింతువని
రసవంతముగ దైవరాయ పాడెదను


దేవుడు రాముడై దిగివచ్చినాడు


దేవుడు రాముడై దిగివచ్చినాడు
దేవేరిని సీతగా తెచ్చుకొన్నాడు

నరులు వానరు లనిన నాకేమి భయమని
గరువాన రావణుడు కమలాసనుని
వరము లడుగు నప్పుడు వారల విడచె
హరిమాయయే వాని పొరబడగ జేసె

రావణుని కథ నెఱిగి దేవుడే నరుడిగా
భూవలయమున తాను పుట్టినాడిదే
రావలసిన కాలము రాక మానదుగద
శ్రీవిభున కుపాయము చిక్కకుండునా

కామాంధుడై వాడు కదలివచ్చినాడు
భూమిజాతను గొంచు పోయె లంకకు
రాముడు రావణుజంపి భూపుత్రిని గూడి
భూమినేలె మహావైభోగము చెలగ


పరమాత్మునకు నీవు పట్టపురాణివి


పరమాత్మునకు నీవు పట్టపురాణివి
సిరివి నీకు మ్రొక్కెదము సీతమ్మతల్లి

ద్వారపాలకుల గతి తలక్రిందులైన వేళ
ఊరడించి వారికై మీరిరువురును
ధారుణిపై వెలసి సీతారాములై నారు
కారుణ్యము కలవారు కదా తల్లిదండ్రులు

దేవుళ్ళైనను మీకు తిప్పలెన్నో తప్పలేదు
జీవులము తప్పునా చిక్కులు మాకు
మీ వలె కష్టములను మించు నంత వారమా
కావవలె మముగూడ కరుణతో మీరు

తల్లి సిఫారసులేక తండ్రి పూనుకొనడుగా
యుల్లము రంజిల్ల నీ వుదధిశాయికి జెప్పి
యెల్లకష్టముల దీర కొల్ల వరములిప్పించి
చల్లగా చూడవమ్మ చాల మ్రొక్కేమమ్మ