14, ఏప్రిల్ 2019, ఆదివారం

వేయినామముల వాడ వేయిమాట లేల


వేయినామముల వాడ వేయిమాట లేల
వేయిజన్మములకును విడువను నిన్ను

గడచిన బహుజన్మములుగ నడచుచుండి నీ వెంబడి
కుడిచిన జ్ఞానామృతము కొల్లజేతునా
నడుమవచ్ఛి పోవునట్టి నరులు నవ్విపోదురని
జడుడనై మన నెయ్యము విడచువాడనా

ఏడుగడ ధర్మమని యెన్నిమార్లు బోధించిన
వీడు వినకున్నాడని విసిగికొనవుగా
రాడా ఒక నాటికి వీడు నా దారికని
గూడుకట్టుకొన్నావు నా గుండెలలోన

చెప్పిచెప్పి పనికాక శ్రీరామనామము నిచ్చి
చప్పున రక్షించినట్టి సర్వేశ్వరుడా
ఎప్పటికిని విడువను నీవిచ్చినట్టి నామమును
విప్పితి నిదె గ్రంథిత్రయము వీక్షింతు నిన్ను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.