7, ఏప్రిల్ 2019, ఆదివారం

జగనన్న సి.యమ్. ఐతే లాభాలేమిటీ?


ఈరోజున ఆంధ్ర ప్రదేశ్ కి 2019 లో బాబు మరలా సి.ఎం ఐతే కలిగే లాభాలేంటి? అనే ఒక టపా చూసాను పతంగిసాంబ నేటిబారతం బ్లాగులో . అది చదివి కేవలం సరదాగా నేను అలాంటి టపా ఒకటి వ్రాస్తున్నాను.


 1. లోటస్ పాండ్లు. ఇవి ఇబ్బడిముబ్బడిగా నిర్మించబడతాయి. ముందు అన్ని ప్రముఖ నగరాల్లోనూ, మెల్లగా ప్రజల కోరికను కాదనకుండా ఊరూరా లోటస్ పాండ్లు నిర్మిస్తారు. అవి అటు పార్టీ కార్యాలయాలుగా నూ ఉపయోగిస్తాయి, ఇటు ముఖ్యమంత్రి గారికి రకరకాల (పాద)యాత్రల్లో విడుదుల్లాగానూ ఉపయోగిస్తాయి. అంతకంటే ముఖ్యంగా ఆంధ్రా అందాలను అవి ఎంతో గొప్పగా ఇనుమడింప జేస్తాయి. పర్యాటకం అభివృధ్ధి అవుతుంది. లోటస్ పాండ్ సందర్శకుల వలన వచ్చే రాబడిలో 10% రాష్ట్రఖజానాకు విరాళంగా ఇస్తారు.  జగన్ గారు ప్రజానాయకుడిగా ప్రజలతరపున మిగతా సొమ్మును వినమ్రంగా స్వీకరిస్తారు.
 2. సామంతరాష్ట్రంగా ప్రత్యేకహోదా.  అందరూ ప్రత్యేకహోదా కావాలీ కావాలీ అంటూ తెగ గడబిడ చేస్తున్నారు. కాని ఇప్పటికే మన అంద్రాకు ఒక ప్రత్యేకహోదా ఉందన్న సంగతిని మాత్రం తెలుసుకోలేక పోతున్నారు. ఇది రాష్ట్రవిభజన నాటికే ఏర్పాటయ్యింది కాని గుడ్డి ఆంధ్రాజనం తెలుసుకోలేక పోయారు. ఒకే గవర్నర్ అంటే మరేమిటీ, గవర్నర్ సాయంతో తెలంగాణాయే ఆంధ్రాను పాలిస్తుందని కేంద్రం ఏనాడో నిర్ణయించింది. తెలుసుకొని తరించండి బడుధ్ధాయిలూ! అందుచేత ప్రత్యేకహోదా అంటే, ఇంతవరకూ భారతదేశంలో సామంతరాష్ట్రాలు లేవు. ఇకపై ఆంధ్రా అనేది తెలంగాణాకు సామంతరాష్ట్రంగా ఉంటుంది అనే ప్రత్యేక హోదా అన్నమాట.
 3. పారదర్శకమైన పాలన. స్వంతంగా ఆంధ్రాప్రభుత్వం అంటూ తీసుకోవలసిన నిర్ణయాలు పెద్దగా ఏమీ ఉండవు.అన్ని నిర్ణయాలూ డిల్లీ అనుమతితో హైదరాబాదులో కేసీఆర్ గారి ఫార్మ్‍హౌస్ నుండే వస్తాయి.ప్రజల సౌకర్యార్థం పెద్దదొరలు ఈ వినయవిధేయ ఆంద్రారాములకు చెప్పే తలంటుతూ ఉంటారు లెండి. ఎందుకంటే వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు ఆనిర్ణయాలు నచ్చినా నచ్చక పోయినా. ఒక అవకాశం ఇచ్చి చూడటం అంటే ఏమిటో బాగా తెలిసివస్తుంది. ఇంక జనం చేతిలో ఏ అవకాశమూ ఉండదు నోరెత్తటానికి అని
 4. పోలవరానికి ఫుల్ స్టాప్. బాబుగారి అవినీతి సామ్రాజ్యం కూల్చివేయాలంటే తప్పదు మరి. అయినా ఆంధ్రాకు మాత్రం లాభం కలిగే ప్రాజెక్టుల వలన ఇతరరాష్ట్రాలకు ఇబ్బంది ఐతే ఎలా చూస్తూ ఊరకుంటారు ప్రభువులు?
 5. బందరుపోర్టు పరాధీనం. మీ కెందుకండీ ఆ పోర్టు ఆంధ్రులూ?  తెలంగాణం వారికీ ఒక పోర్టు ఉండవద్దా? వాళ్ళకు సముద్రం లేకుండా అన్యాయం చేసిన మిమ్మల్ని ఏం చేస్తే పాపం ఉందీ? అందుకే ఒక్క బందరేమిటి అన్ని పోర్టులూ తెలంగాణా భాగస్వామ్యంతో నడుస్తాయి. బందరులా అన్నీ 100 శాతమూ తీసుకోరట లెండి. ఎంతన్నా చాలా మంచివాళ్ళు కదా మన తెలంగాణా ప్రభువులు
 6. జలవివదాల పరిష్కారం. చక్రవర్తులకు సామంతరాజులతో తగువులు వస్తే ఎవరు గెలుస్తారు? ఇప్పటి దాకా ఏదో గింజుకుంటున్నారు కాని. ఇకపై అన్ని జలవివాదాలూ పరిష్కారం అవుతాయి. నీళ్ళనీ పైనున్న రాష్ట్రంగా తెలంగాణాకే హక్కుభుక్తం అవుతాయి. ప్రభువులదయాధర్మసంప్రాప్తమైన నీళ్ళచుక్కలతో పండించుకొని తింటారో లేదో మీయిష్టం.
 7. కరెంటు వివాదాలు పరిష్కారం. ఇవీ నీళ్ళవివాదాల్లాగే పరిష్కారం అవుతాయి. ఇంక ఆంద్రాలో హాయిగా రోజుకు 24 గంటల చొప్పున మాత్రం పవర్ కట్ అమలు అవుతుంది.
 8. పరిశ్రమలకోసం దేశాలు తిరిగే శ్రమ ఉండదు. నీళ్ళు కరెంటూ కూడా లేని రాష్ట్రానికి పరిశ్రమలా? అవన్నీ మే< చూసుకుంటాం కదా అంటారు ప్రభువులు. ఇచ్చిందేదో తిని చచ్చినట్లు పడుండక హాయిగా పరిశ్రమలూ అభివృధ్ధీ అంటూ హైరాన పడే శ్రమ మీకెందుకు ఆంధ్రులూ?
 9. ప్రాంతీయపార్టీలు అంతరిస్తాయి. మరి జగన్ పార్టీ కూడానా అనకండి తెలివి తక్కువగా. ఆయన పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. జగన్ పార్టీకి హైదరాబాదులోనో మరెక్కడో కూడా ఒకటో రెండో సీట్లు ఇప్పించటం జరుగుతుంది.  తెలుగుదేశం లాంటి కుహనా జాతీయపార్టీలు అంతరింపజేయ బడతాయి. అదెలా అన్నారంటే మీకంటే మూర్థులు ఇంకెవరూ ఉండరు. తెలంగాణాలో కాంగ్ర్రెసే అంతరిస్తోంది చూడటం లేదా? ఇంక ప్రభువుల పార్టీ ఒకటీ, వారి సామంతుల పార్టీ ఒకటీ మాత్రం ఆంద్రాలో మిగుల్తాయి. ఈ సామంతుల పార్టీ ఎన్నాళ్ళుంటుందీ అని అడగరనే అనుకుంటాను.
 10.  అమరావతి. దీన్ని ప్రభువిధేయమేతావులు భ్రమరావతి అంటున్నారు. ఇంక భ్రమలు అక్కర్లేదు. పరిపాలన అంతా హైదరాబాదు కేంద్రంగానే అని స్థిరపడ్డాక, ఆంధ్రారాజధానికి పేరుకో ఎకరం పొలంలో ఓ రెండు బిల్డింగులు చాలవూ? ఇప్పటికే సేకరించిన భూములూ పుట్రలూ అంటారా? ఎంతమాట, వాటిని ప్రభువులూ సామంతులూ వృధాగా పోనివ్వరు లెండి. ఎలా సద్వినియోగం చేయాలో వారికి చక్కగా తెలుసును, మీరేం దిగులు పడకండి.
 11. సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగా అంద్రాకు అంటూ ఏమీ అవసరం ఉండదు. తెలంగాణావారికే ఆంధ్రాసంక్షేమం అప్పగిస్తుంది కేంద్రం.
 12. ఉపాధి కార్యక్రమాలు. వాటి కోసం ఎందుకు దండగమారి ఖర్చులు ఆంధ్రాలో? ఆంధ్రాయువకులకు ఉపాధికావాలంటే తెలంగాణా వారు కూలిపనికి పిలవటానికి సిధ్ధంగానే ఉంటారు. బీహారీ యువకులు రావటం లేదా హైదరాబాదుకు, ఆంద్రావాళ్ళూ రావచ్చును. పెత్తనం చేయటానికి రాకూడదు కాని కూలి చేయటానికి రావచ్చును. ఆంధ్రాలోనే ఉపాధి కావాలీ అంటే ఎలా? మీదసలే బీద రాష్ట్రం. పైగా సామంత రాష్ట్రం.

ఇలా జనగన్న వచ్చేసాక, అన్ని చిక్కులూ తీరిపోయి ఆంధ్రావాళ్ళు హాయిగా బానిస బ్రతుకులు బ్రతికేయవచ్చును.

కాదని బాబును ఎన్నుకున్నారో మరో ఐదేళ్ళపాటు ఎవరిమీదో ఒకరిమీద పోరాడుతూనే ఉండాలి మరి. అంత ఓపిక ఉందా మీకు? ఆలోచించుకోండి.

46 కామెంట్‌లు:

 1. మీరు ఇటువంటి విపరీత వ్యాసాలు వ్రాయడం బాధాకరం. మీరు చెప్పిన బూచి విషయాలేవీ జరగవు. పెద్దగా మార్పులేమీ ఉండవు. ఐదేళ్లకోకసారి అధికారం మార్పు మంచిదే. ఇంత ఏకపక్షంగా కక్షపూరితంగా వ్రాయడం పచ్చ మీడియా పైశాచికాన్ని తలపిస్తుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బుచికి గారూ,
   టపా ఆరంభంలోనే ఒక ముక్క చెప్పాను. "కేవలం సరదాగా నేను అలాంటి టపా ఒకటి వ్రాస్తున్నాను" అని.

   మీరేమో "మీరు చెప్పిన బూచి విషయాలేవీ జరగవు" అన్నారు. బాగుంది. కొన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదండీ. జరుగవు జరుగవు అనుకొన్నవి ఎన్నో ఎన్నెన్నో జరిగాయి కదా. ఉదాహరణకు, ఏకపక్షంగా రాష్ట్రవిభజన జరుగుతుందని అనుకున్నామా?
   జరుగలేదా.

   మీరు "ఐదేళ్లకోకసారి అధికారం మార్పు మంచిదే." అంటున్నారు కాని మార్పు మంచికోసం ఐనప్పుడే మంచిది. అభివృధ్ధికి ఆటకం అయ్యేది మంచిమార్పు కాదు కదా! అలాంటి మార్పుని కోరుకోలేము.

   ఏమన్నారూ "ఇంత ఏకపక్షంగా కక్షపూరితంగా వ్రాయడం పచ్చమీడియా పైశాచికాన్ని తలపిస్తుంది."? మీకున్న రాజకీయాభిమానాల వలన అలా కనిపించిందేమో కాని నాకు ఎవరిమీదా కక్ష లేదు.

   తొలగించండి
  2. తెలుగుదేశం కూడా అవినీతి పార్టీ అయితే జనసేన పార్టీకి ఓటు వెయ్యాలి కాని, వైకాపా కి ఎందుకు వెయ్యాలి?

   తొలగించండి
  3. బోనగిరి గారూ, మంచి ప్రశ్న. కాని జనంలో ఇంకా జనసేన అంత ఆదరణ పొందిందని అనుకోను. ఏమో కొందరు అలా అలోచించటం కూడా చాలా సంభావ్యమే.

   తొలగించండి
 2. ఘనశత్రువై నిల్చె కాంగిరేసు ,
  విభజన తోడుగా విద్రోహ మొహరించి
  తదుపరి బీజేపి తాను నిలిచె ,
  పాలనా రతుడని బాబు నెంపిక చేయ
  సొంత మనుజుల చేత చింతదీర్చె ,
  రాజధానీ లేదు ప్రజల బాగూ లేదు
  నాయకుల్ దోపిడీ చేయ బట్టి ,

  మొదటి శత్రువు కాంగ్రెసు , మది దలంప
  రెండు బీజేపి , మూడు సారించి చూడ
  తెలుగు దేశము శత్రువుల్ , తెలియ నొకటి
  మించి యింకోటి , మన పుట్టి ముంచినారు .

  అతి సమర్థుడనుచు మితిమీరి వోట్లేసి
  ముఖ్యమంత్రి జేయ ముదురు గనక
  రాజధాని యనుచు రంగులు చూపించె
  బైర్లు క్రమ్మె తెలుగు ప్రజకు కళ్ళు .

  ఘనమైన వ్యాసమియ్యది ,
  ఘనులు గదా ! పండితులుగ ఘనత వహించే
  జన సమ్మాన్యులు గద ! తమ
  కనయము సన్నుతులు , శ్యామలయ్యా ! విహితా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు రాజారావు గారూ,

   నేను జనసమ్మాన్యుడనే ఐతే రోజుకు పదిపాతికమంది కన్నా ఈ బ్లాగు ఎవరూ చదవటం లేదు! ఏదో కొద్దిమంది ఆదరిస్తున్నారు కాబట్టి బుధసమ్మాన్యుడనేమో అనుకుంటున్నాను.

   ఇకపోతే ఘనత ఏముందండీ నాదగ్గర. ఏమీ లేదు. ముఖ్యంగా నేను పండితుడను కానే కానని మరొకసారి మనవి చేసుకుంటున్నాను.

   ఇది ఊరికే సరదా కోసం వ్రాసిన వ్యాసం. అంతే. ఐనా పరిస్థితులు విభజననాటి నుండీ ఏమీ అనుకూలంగా లేవు. ముందుముందు మరింత దిగజారనూ వచ్చును అని మాత్రం అనుకోవచ్చును. ఆ దిగజారటం అంటూ జరిగితే ఎలా నిజంగా బైర్లు కమ్మవచ్చునో అని ఈవ్యాసంలో కొంత ఊహాగానం చేసిన మాట వాస్తవం.

   తొలగించండి
 3. ' విభజించి ఆంధ్రకు విద్రోహ మొనరించి '

  అనే మొదటి లైను కట్టయింది .

  రిప్లయితొలగించండి
 4. ఒక పక్క నిరంతర రామసంకీర్తన చేస్తూనే మరోపక్క కలువకొలనులో/కలువకుంట్లలో కమల రాజకీయాల బుర్ర రామకీర్తన పాడించారు సర్, శ్యామలీయంగారు.
  ---- YVR's అం'తరంగం'

  రిప్లయితొలగించండి
 5. మరీ బడ్డాయి కాకపొతే అన్నీ కెసిఆర్ ఒక్కడే తరలించుకుపోతే మిగిలిన వారు ఊరుకోవాలా. ఒకరా ఇద్దరా, కెసిఆర్ మోడీ ప్రశాంత్ కిషోర్ వగైరాలు కాకుండా ఇంకా వేలాది మంది ద్రోహులు ఉన్నారు, అందరికీ "సమన్యాయం" జరగాలి.

  జగన్ అడ్డగోలు వ్యవహారాల నిమిత్తం ప్రశాంత్ కిషోర్ పడ్డ "కష్టానికి కూలి" రావాలి కనుక విశాఖ ఉక్కు, రేవు & దక్షిణ జలసేన కార్యాలయాలను పాట్నాకు తరలిస్తారు.
  ఇందుకు అవసరమయితే "రాజకీయ బెదిరింపుల స్వామీజీ" కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది.

  అమీత్ షా కొడుక్కి గుళ్ళు తిరగడం ఇబ్బందిగా ఉంటుంది కనుక తిరుమలను కర్ణావతికి (పాత పేరు అహ్మదాబాదు మార్చేసాము లెండి) షిఫ్ట్ చేసేస్తారు. అసలే స్వామి వారి నగలు అమ్మిన 65 ఏళ్ల వృద్ధ దీక్షితులు నిప్పు గారిపై గుర్రు మీదున్నాడు ఆయనకే పూజాబాధ్యతలు అప్పగిస్తే మంచిది.

  ఇంకా కావాలంటే కృష్ణ & గోదావరి డెల్టాలను కూడా గుజరాతుకు మళ్లిస్తారు. మోడీ కులస్తులు ఇసుక దందాలు చేసుకుంటూ, మధ్యమధ్యలో అడ్డుబడ్డ మహిళా అధికారులను తన్నడానికి అనువుగా ఉంటుంది.

  పాపం రాంగోపాల్ వర్మ తక్కువ తిన్నాడా? ఆయనకు భోజపురీ సినిమాలు చేసుకోవడానికి బుల్బుల్ బాలయ్య బాబును అప్పగిస్తారు.

  ఇంకా ఎందరో కుట్రదారులకు ఎంతెంతో ఇస్తారు, స్థలాభావం చేత అవన్నీ ఇక్కడ రాయనందుకు మన్నించండి. గరుడ శివాజీ, చంద్రజ్యోతి వేమూరి లాంటి అసమదీయులు రాబోయే రెండు మూడు రోజులలో వీటిని వివరిస్తారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రండి రండి జై గారూ,

   ఇంకా మీరు రాలేదేమిటా అనుకుంటున్నాను!

   ఐనా తెలియక అడుగుతానూ, ఆంధ్రారాజకీయాల్లో మీ కెందుకండీ అంత అనవసరమైన ఆసక్తీ? ఎక్కడ ఆంధ్రాలో కాస్త మంచి ప్రభుత్వం వచ్చేస్తుందో, ఎక్కడ ఆంధ్రా అభివృధ్ధి చెందేస్తుందో అన్న ఆందోళనతో మీరు తెగ ఇబ్బంది పడుతున్నట్లున్నారే!

   తెలంగాణా వెలిగిపోవాలీ అని కోరుకోండి - ఏమీ తప్పులేదు. ఆంధ్రా అభివృధ్ధి చెందితే ఆ కాంతిలో తెలంగాణా ఎక్కడ వెలాతెలా పోతుందో అన్న అందోళన అసమంజసం. అటువంటి ఆందోళన మీకు లేకపోతే ఆంధ్రా రాజకీయాలపై ఈ అనవసరమైన విచిత్రాసక్తీ, మీకు నచ్చని నాయకుల్నీ, ప్రాంతాల్నీ పిచ్చిపిచ్చి పేరడి పేర్లతో ఎద్దేవా చేస్తూ మాట్లాడటం చేయరు. వేరెవరో ఇలా చేయలేదా అనకండి ఎవరు ఏప్రాంతాన్ని/ ఎవర్ని ఇలా చేసినా తప్పు తప్పేను.

   మీ దృష్టి అంతా తెలంగాణా అభివృధ్ధి మీదా, అక్కడి రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువల పరిరక్షణ మీదా కేంద్రీకరించండి. ఆంధ్రా విషయంలో ఐనదానికీ కానిదానికీ కలుగజేసుకొని అక్కసు చూపకండీ దయజేసి.

   మీకు అనేక విషయాల గురించి చక్కని పరిజ్ఞానం ఉంది. అది తెలంగాణా ప్రాంతాభివృధ్దికి ఎలా తోడ్పడుతుందీ అని మీరు తప్పక కృషిచేయండి. ఆంధ్రులంతా మట్టిబుఱ్ఱలు కాదు. వారిలోనూ వారి ప్రాంతం అభివృధ్దికి కృషిచేయగల సమర్థులు ఉంటారు, ఉన్నారు. అందుచేత మీరు కలుగజేసుకోకుండా నిశ్చింతగా ఉండండి.

   తొలగించండి
  2. నేను మీతో ఏకీభవించనంత మాత్రాన నాకు ఉద్దేశ్యం అంటకట్టడం మీ విజ్ఞ్యత. పరులు మీకు ఉద్దేశ్యాలు ఆపాదించినప్పుడు నేను మీ రక్షణకే దిగానన్న విషయం మీరు మర్చినా నాకు గుర్తుంది.

   "ఆంధ్రా అభివృధ్ధి చెందితే ఆ కాంతిలో తెలంగాణా ఎక్కడ వెలాతెలా పోతుందో అన్న అందోళన"

   గుజరాత్, బీహార్ వగైరా 27 రాష్ట్రాలు కూడా "వెలవెలపోతాయి", వాళ్లకు కూడా వాటా లేదా?

   "పిచ్చిపిచ్చి పేరడి పేర్లతో ఎద్దేవా"

   మీ అభిమాన నాయకుడిని విమర్శించిన వ్యక్తికి (మీ ప్రాంతం వాడే) "రాజకీయ బెదిరింపుల స్వామీజీ" పేరు పెట్టింది నేనా? దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని "మహానేత" అంటూ నోరు పారేసుకుంది నేనా మీరా?

   "ఆంధ్రా విషయంలో ఐనదానికీ కానిదానికీ కలుగజేసుకొని అక్కసు చూపకండీ దయజేసి"

   మీరు తెలంగాణా గురించి ఏవేవో ఊహాగానాలు చేసినప్పుడు నేను ఈ మాట అనలేదు సరికదా మిమ్మల్ని విమర్శించిన వారిని వారించాను.

   "ఆంధ్రులంతా మట్టిబుఱ్ఱలు కాదు. వారిలోనూ వారి ప్రాంతం అభివృధ్దికి కృషిచేయగల సమర్థులు ఉంటారు"

   ఆంధ్రులు *ఎవరూ* మట్టిబుర్రలు కారని నా అభిప్రాయం. జగన్ మీద మీకు & బాబు మీద లక్కాకుల వారికి నమ్మకం లేదు, ఇట్లా ఎవరి ఆలోచన వారిది. కేవలం వైకాపాకు (లేదా ఇంకేదో పార్టీకి) ఓటు వేసారు (లేదా వేస్తారు) అన్న
   ఒకే ఒక్క నెపంతో లక్షలాది మందికి "మట్టిబుర్రలు" బిరుదు ఇవ్వడం మీ వల్ల అవుతుందేమో కానీ నా వలన కాదు. Branding voters as fools is not only empty rhetoric but also elitism.

   తొలగించండి
  3. హరిబాబుగారు జై గారిని బూతులు తిడుతుంటే ఎన్నోసార్లు నేనూ వారించాను. అయితే ఏంటి? గొట్టిముక్కల చెపుతున్నదంతా కరెక్ట్ అని ఒప్పుకోవాలా ? గొర్రెల్లాగా వ్యక్తిపూజ చేసే తెలంగాణావారి దగ్గర నేర్చుకోవాలా ? ఆంధ్రుడికి ఒక తల ఉంది దాంట్లో మెదడు ఉంది. పని చూసుకోండి.

   తొలగించండి
  4. జై గారూ, రాజకీయాల పేరిట ప్రాంతాలకు కాని వ్యక్తులకు కాని, సంస్థలకు కాని పేరడీ పేర్లు పెట్టటం నాకు ఉచితంగా అనిపించదు. విషయం పైన మాట్లాడుకోవచ్చు - అంతవరకే. లోగడ నేనేమైనా ఇలా పేరడి పేర్లు పెట్టిన పక్షంలో క్షంతవ్యుడిని. నాకు తెలిసి అలా చేయలేదనే అనుకుంటున్నాను.

   ఇకపోతే, రాజకీయ బెదిరింపుల స్వామీజీ అన్నప్పుడు ఒక స్వామీజీ రాజకీయ బెదిరింపులకు దిగటాన్ని ప్రస్తావించటమే కాని అక్కడ పేరడీ మాట లేదు. ఆయన అలా బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సముచితం కాదనే నా అభిప్రాయం. అంతవరకే నా విమర్శ.

   నేను, "ఆంధ్రులంతా మట్టిబుఱ్ఱలు కాదు. వారిలోనూ వారి ప్రాంతం అభివృధ్దికి కృషిచేయగల సమర్థులు ఉంటారు, ఉన్నారు." అన్నది సరే, ఆమాటకు మీరు "వలం వైకాపాకు (లేదా ఇంకేదో పార్టీకి) ఓటు వేసారు (లేదా వేస్తారు) అన్న ఒకే ఒక్క నెపంతో లక్షలాది మందికి "మట్టిబుర్రలు" బిరుదు ఇవ్వడం మీ వల్ల అవుతుందేమో కానీ నా వలన కాదు." అని ఎందుకు జవాబు చెప్పారో అర్థం కావటం లేదు. నేను తెలంగాణా నుండి మేథావుల మంటు ఎవరూ కలుగజేసుకో నవసరం లేదు అని స్పష్టం చేస్తే మీరు వైకాపాను ఈ వాక్యంంలోనికి ఎలా లాగి తెస్తున్నారూ? ఎందుకని తెస్తున్నారూ? ఇది అసంగతం కదూ.

   నేనీ టాపా వ్రాసే ముందే ఇది కేవలం సరదా విశ్లేషణ అని చెప్పాను. అందుచేత సీరియస్ చర్చ అవసరం లేదు.

   తొలగించండి
 6. జై గారూ,
  రాజకీయాల గోల అలా ఉంచండి.
  చాలా కాలం ఐనది, మీరు మీ తాతగారి పుస్తకం పునర్ముద్రణ గురించి ప్రస్తావించి.
  అది పునర్ముద్రణ చేసారా? లేదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Thanks for the enquiry sir.

   అప్పట్లో అనుకున్నా కానీ కొన్ని కారణాల వలన కుదరలేదండీ. "తాతాజీ పుస్తకముద్రణ ప్రాజెక్ట్" ప్రస్తుతం on-hold పెట్టి నాకంటే చిన్నవారికి delegate చేద్దామని ప్రయత్నిస్తున్నాను.

   తొలగించండి
  2. తాతాజీ పుస్తకముద్రణ ప్రాజెక్ట్ అంటున్నారు! ఒకటి కంటే ఎక్కువ పుస్తకా లన్నమాట. చాలా సంతోషం. మీరు నాకు ఇచ్చిన పుస్తకం ఋతువర్ణనకు సంబంధించినది. ఆయన ఇంకా చాలా పుస్తకాలు వ్రాసి ఉంటే సంతోషం. ఆ పుస్తకాలు త్వరలో పునర్ముద్రణతో వెలుగుచూస్తాయని ఆశిస్తునాను.

   తొలగించండి
 7. మీ టపాను "వాట్సా్‌పలో వైరల్‌ అవుతున్న అజ్ఞాతవ్యక్తి పోస్టింగ్‌" అంటూ పచ్చ మీడియా తన గోబెల్స్ ప్రచారానికి వాడుకుంటుంది.

  https://www.andhrajyothy.com/artical?SID=762614

  అంతా చంద్రమయం, చంద్రమాయం, చంద్రమయసభ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాసింది అసమదీయులయితే "రచయిత సుప్రసిద్ధ తెలుగు బ్లాగరు, వీరు వందలాది మేటి కవితలు రాసి విశేష ఆదరణ పొంది ఉన్నారు" అని పరిచయం చేసేవారేమో కానీ మీకు ఆ "అదృష్టం" లేదు.

   తొలగించండి

  2. :) అంతా రాధ మాయ :)   జిలేబి

   తొలగించండి
  3. శ్యామలీయం గారూ,
   మీ బ్లాగు ఎవరూ చదవడం లేదు అన్నారుగా ! మీ రాముడు చదువుతున్నాడు చూసారా ? మీతో చెప్పకుండా పట్టుకెళ్ళి వైరల్ చేసేసాడు చూసారా ? అంతా రామమయం !

   తొలగించండి
  4. శ్యామలీయం గారూ, మీరు పత్రిక ని సమాధానం అడగొచ్చు. మీ అనుమతి లేకుండా మీ కంటెంట్ ని కాపీ చెయ్యడం నేరం.

   తొలగించండి
  5. జై గారూ, "పత్రిక ని సమాధానం అడగొచ్చు" అన్నారు. వారు తమకు Whatsapp లో లభించింది అంటారు కదా? అలా తమ తప్పులేదనలేరా? అసలు ఈ AndrhaJyothi వాళ్ళ Contact details తెలియవు నాకు.

   తొలగించండి
  6. @సూర్య:

   "మీ అనుమతి లేకుండా మీ కంటెంట్ ని కాపీ చెయ్యడం నేరం"

   నేరం (crime, క్రిమినల్ తప్పు) కాదండీ టోర్ట్ (tort, సివిల్ తప్పు). Copyright violation is a private civil matter.

   @శ్యామలీయం:


   వాళ్ళ కాంటాక్ట్ ఐడీ సైటులోనే ఉంటుందండీ.

   https://www.andhrajyothy.com/andhrajyothy-contactpage.html

   అఫ్కోర్స్ మనలాంటి "చిన్న వ్యక్తులు" రాసినా అంత పెద్ద మీడియా సంస్థ సంజాయిషీ కాదు సరికదా కనీసం acknowledgment ఇస్తుందని కూడా అనుకోను.

   తొలగించండి
 8. ఇవాళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (మీడియా వారి భాషలో "ఓట్ల పండగ").
  ఆ రాష్ట్రం యొక్క లాంగ్ టర్మ్ ప్రయోజనాల దృష్ట్యా ..... ఆల్ ది బెస్ట్ చంద్రబాబు గారు 🚴 👍.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈనాడు రాష్ట్రం యొక్క దీర్థకాలికప్రయోజనాలను గురించి కొందరు ఆలోచిస్తున్నారు.
   ఈనాడు తమతమ దీర్థకాలికప్రయోజనాలను గురించి కొందరు ఆలోచిస్తున్నారు.
   ప్రయోజకులే గద్దెకెక్కుతారో నిష్ప్రయోజకులే వికటాట్టహాసం చేస్తారో కాలమే చెప్పాలి.

   తొలగించండి
 9. ఏ పీ లో ఎన్నికలు ప్రమాదపు అంచున జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.ఘర్షణలు జరుగుతున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునండి. ఎన్నికలు జరుగుతున్న తీరూ, యంత్రాలూ యంత్రాగమూ పనిచేస్తున్న తీరూ చూస్తుంటే ఈ ఎన్నికల ఫలితాల కోసం నెలరోజులు అగనవసరం లేదేమో. పెద్దఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని ముందునుండే అనుమానిస్తున్నాను. ఇప్పుడు దిల్లీదొరలకు ఒక అవకాశం ఉంది. ఇక్కడి పరిస్థితిని రాష్ట్రపతిపాలనకు సాకుగా తీసుకుందుకు మొగమాటపడక పోవచ్చు. ప్రజలు ఈనాడు ప్రమాదపు అంచున ఉన్నారు. రేపు ప్రమాదంలో ఉంటారేమో! దేశం అంతటా పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం ఉంటుందా అంటే నిర్థారణగా చెప్పలేము కాని అటువంటి అవకాశం హెచ్చుగానే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ అనేది ప్రస్తుత దొరతనపు చేతికర్ర ఐపోయింది కాబట్టి ఎలక్షన్ అనేది ఒక ప్రహసనం మాత్రమే. చూదాం ఏం జరుగుతుందో.

   తొలగించండి
  2. తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికలు నిరాసక్తంగా జరుగుతున్నాయి. మూడు గంటలకు 29 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. అక్కడ ఏ పీ లో జనం పోటెత్తుతున్నారు. 6 గం లు దాటాక కూడా పోలింగ్ కి అనుమతిస్తామంటున్నారు.

   తొలగించండి
  3. తెలంగాణాలో ప్రజలు లోకసభ ఎన్నికలపట్ల నిరాసక్తి కనబరచినట్లు వార్తల్లో గమనికకు వచ్చింది. కారణం తెలియదు. కాని, ఈలోకసభకు మమ్మల్ని 17మందినీ పంపండి, మన నేతను ప్రథానిని కూడా చేసే వీలుంటుందీ అని డప్పేసి చెప్పినా సరే జనం వినలేదంటే ఆశ్చర్యమే. అటు అంధ్రాలో వైకాపావారు హింసకు తెగబడుతున్నారని వార్తలు వస్తున్నాయి ఉదయం నుండీ (మన మిత్రులు కొందరు తద్విలోమంగా వాదిస్తారనుకోండి, అది వేరే సంగతి). ఐనా జనం వారి అభిప్రాయం ప్రకటించేందుకు పోటెత్తుతున్నారు.

   ఒక వ్యక్తి దగ్గర, ఓటరు కార్డు ఉన్నా, ప్రస్తుతం లిష్టులో పేరులేదో చేయగలిగింది లేదు. ఛాలెంజ్ ఓటు అన్నది లిష్టులో పేరుండి తన ఓటు వేరేవాళ్ళు దుర్వినియోగం చేసినప్పుడే వర్తిస్తుంది. పోలింగ్ గడువు ముగిసినప్పటికీ అప్పటికే ష్టేషన్ వద్ద ఉన్నవాళ్ళందరికీ ఓటు వేసేందుకు అవకాశం తప్పక ఇస్తారు - రాత్రి ఏవేళదాకా పట్టినా సరే. అందుకని గడువులోగా అక్కడికి చేరుకొని లోపల ఉండటం చాలా ముఖ్యం.

   తొలగించండి
 10. >>వైకాపావారు హింసకు తెగబడుతున్నారని వార్తలు వస్తున్నాయి

  ABN చూడడం కాస్త తగ్గిస్తే.... బెటరేమో...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సాక్షి (కర)పత్రిక చదవటం బెటర్ అని మీ ఉద్దేశం.

   తొలగించండి
  2. సాక్షిని "కరపత్రిక"అని వీళ్ళు అంటారేగాని తనకు తానుగా ఆ పత్రిక ప్రకటించుకుందా ఎప్పుడన్నా? అలా ప్రకటించుకుంటే ఆ పత్రికని ప్రభుత్వ మీడియా సమావేశాలనుంచి బహిష్కరించవచ్చు.
   ఈనాడు తెదేపా కి అనుకూలంగా రాస్తాయన్నది బహిరంగ రహస్యమే కానీ సాక్షి రాసేంత దారుణంగా అయితే రాయదు. ఒక్కోసారి ఆ పత్రిక ఏడుపులు చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ కోసం ఏడ్చే లెవెల్లో ఉంటాయి.
   ఆంధ్రజ్యోతి నేను అంతగా చూడను. కాబట్టే ఆ పత్రిక స్టైల్ నాకు తెలియదు.

   తొలగించండి
  3. టీడీపీ వైకాపా ఎవరి అనుకుల ఛానెల్ అవతలి వారి మీద హింసారోపణలు చేసాయి. ఆంగ్ల/హిందీ జాతీయ మీడియాలో ఎక్కడా "ఒక్క పార్టీ వారే హింసకు తెగబడుతున్నారని వార్తలు" ఇవ్వలేదు. శ్యామలీయం మాస్టారు ఏ ఛానెల్ చూసారో ఏమో?

   తొలగించండి
  4. జై గారూ,
   నిన్న ఎక్కువగా టీవీ9 చూసానండీ. అదీ మీ దృష్టిలో, మీ భాషలో 'పచ్చమీడియా' ఐతే కష్టమే. ఇకపై సాక్షిమాత్రమే చదవాలి , చూడాలి అన్న నిబంధనలు కూడా జగనన్న రాజ్యం వచ్చాక వస్తే అప్పుడు ఆలోచిస్తాను లెండి.

   తొలగించండి
  5. జాతీయ మీడియాలో ఎక్కడా ఏకపక్ష (వైకాపా మాత్రమే) హింస జరిగందని రాలేదన్నది నా వ్యాఖ్య ఉద్దేశ్యం. చంద్రబాబు వీరాభిమాని రాజదీప్ సర్దేసాయ్ కూడా ఈ మాట అనలేదు.

   నేను నిన్న టీవీ9 అంతగా చూడలేదు, చూసినంత మేరకు వారు అన్ని పార్టీలు (జనసేనతో సహా) అరాచకాలకు దిగారని అన్నట్టు గుర్తు.

   తొలగించండి
  6. ఈ రాజ్‍దీప్ సర్దేశాయ్ ఎవరో తెలియదు. సరేనండీ, అన్నిపార్టీలు అరాచకాలకు దిగాయి అని ఒప్పేసుకుంటే చర్చ ఆగుతుంది కాబట్టి అలాగే కానివ్వండి. జగనన్న రాజ్యం వచ్చి, ఇంక చర్చించేందుకు ఎవరూ మిగలని స్థితి రావాలని కోరుకుందాం సరేనా? (ఎందుకంటే రాచరికంలో, రాజూ, ప్రజలూ అనే వారిలో రాజు ఎవ్వరికీ జవాబుదారీ కాదు. ప్రజల మాటకు ఆరాజు విలువ ఇవ్వాలని లేదు. ఇంక ఎవరూ ఎవరితోనూ చర్చించే పనీ లేదు). ఆంధ్రా కాస్తా బానిసత్వంలోనికి దిగజారిపోతే కొందరు మేధావులైనా అనందంగా ఉంటారు. కానివ్వండి.

   తొలగించండి

  7. రాజ్ దీప్ సర్దేశాయ్ తెలియదా !/
   హతవిధీ !


   జిలేబి

   తొలగించండి
  8. ఒక షెర్లాక్ హోమ్స్ నవల్లో డా. వాట్సన్ "భూమి సూర్యుడి చుట్టూ తిరగటం" గురించి ప్రస్తావిస్తే ఆ విషయం తనకేమీ తెలియదంటాడు షెర్లాక్స్. అప్పుడు వాట్సన్ ఓపిగ్గా ఆ సైన్సు అంతా పాఠం చెప్తాడు. అంతా విని షెర్లాక్స్ అంటాడు గదా, "చెప్పావుగా. బాగుంది. ఇప్పుడు అదంతా మర్చిపోతాను" అని. అదేమిటీ అంటే, "నాకు అవసరం లేని, ఉపయోగించనివి నా బుఱ్ఱలో ఎందుకూ దండగ" అని అంటాడు.

   అలాగ, ఈ రాజ్‍దీప్ ఎవరో తెలియక పోతే నాకేమి ఇబ్బంది లేదు. తెలియటం అంత అవసరం అనుకోను కూడా.

   తొలగించండి
  9. Just for fun. షెర్లాక్ హోమ్స్ & డా. వాట్సన్ ఎవరో తెలియదు! మీరు ఓపిగ్గా చెప్పినా అదంతా మర్చిపోతాను.

   తొలగించండి
  10. ఐన్-స్టైన్ గారు ఫిజిక్స్ లెక్చరర్ ఉద్యోగానికై ఇంటర్వ్యూకు హాజరయ్యారట. సౌండ్ స్పీడ్ ఎంత అని ఇంటర్వ్యూలో అడిగారట. తెలియదు అని ఐన్-స్టైన్ గారి జవాబుట. అదేమిటి, ఫిజిక్స్ లెక్చరర్ ఉద్యోగానికి వచ్చావు, ఆ మాత్రం తెలియదా అని ఇంటర్వ్యూ బోర్డ్ వారి హాచ్చెర్యంట. ఏ రిఫరెన్స్ బుక్ లో చూసినా దొరికే సమాచారాన్ని నా బుర్రలో పెట్టుకోవడం ఎందుకూ దండగ ... అన్నారట ఐన్-స్టైన్ గారు 🙂.

   తొలగించండి
  11. రాజ్ దీప్ సర్దేశాయ్->అనగా రాజు దీపు కలిపి సర్దేశారని కదా అర్థం!

   తొలగించండి
  12. జాతీయ మీడియా లోకల్ పార్టీలకోసం ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తాయి?జాతీయ పార్టీలకోసం ఏకపక్షంగా వ్యవహరిస్తాయి.

   తొలగించండి
  13. @సూర్య
   //రాజ్ దీప్ సర్దేశాయ్->అనగా రాజు దీపు కలిపి సర్దేశారని కదా అర్థం!//
   భలే!! నాక్కూడా ఇంచుమించు ఇలాంటిదే తట్టింది. ఇదే -- > (మోడీకి మళ్ళీ 282 సీట్లు వచ్చేస్తే) రాజ్-దీపూ (మూటా ముల్లె) సర్దేసేయ్.

   తొలగించండి
 11. ఎపుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో అపుడు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినట్లు అని తసమదీయ చానెళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వచ్చేవరకు ప్రతి పార్టీ తమదే గెలుపు అని ప్రచారం చేసుకుంటుంది.
   2009లో ప్రజారాజ్యం ఒక అడుగు ముందుకేసి ఫలితాలకు రెండ్రోజుల ముందు దీపావళి కూడా జరుపుకుంది!! తరవాత తెల్లమొహం వేయాల్సి వచ్చింది.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.