శరణు జొచ్చితిని నిన్నే హరేరామ హరేరామ
మరి భయములు బాపరా హరేరామ హరేరామ
జీవుడా శ్రీరాముల చెంత చేరి నావు
నీవింక సుఖముగా నివసించవయ్య
వెలుగు నుండి వచ్చితివి వింతజగతి లోనికి
తెలిసి ఈమాయవిడచి తిరిగిపోతివి
కలనైనా యిచట మరల కాలుపెట్టబోకయ్యా
తెలిసితెలిసి మాయలోన దిగబడబోకయ్యా
ఎన్నే మార్లు వచ్చితివో ఏమేమి చూచితివో
అన్ని అనుభవములు మాయ లన్నది తెలిసి
వెన్నుని పాదాల చెంత వేడుకగా నుండవయా
తిన్నగా నుండవయ్యా తిరిగి రాకయ్యా
మాయామయజగము పైన మాసెను నీ భ్రమలు
హేయమైన తనువులపై నింకె మోహము
హాయిగ నీ వుండవయా హరిపాదములాశ్రయించి
మాయ వంక తొంగిచూచి మరల రాకయ్యా
చెల్లించి మ్రొక్కు ముందు శ్రీహరికి నీవు
వల్లింతువు కోరికలను వరుసపెట్టి
ఇల్లొకటి కావలె నను మిచ్చును స్వామి
ఇల్లాలే కావలె నను మిచ్చును స్వామి
పిల్లలును కావలె నను మిచ్చును స్వామి
కొల్లలుగా సిరులడుగ కొసరును స్వామి
పదవులే కావలె నన వల్లె యను స్వామి
మొదవులే యడుగ సరే పొమ్మను స్వామి
ముదమార నాయు వడుగ పుణుకును స్వామి
అది యిది యేమడిగిన నందించు స్వామి
నీవద్దకు వచ్చెద నని నీవడిగిన స్వామి
నావద్ద కెందుకు నీవు రావద్దనడే
నీవడిగిన పిదప కదా ఆవరమిచ్చేది
నీవడుగని దది యొకటే నిక్కము గాను
చేతులెత్తి మ్రొక్కేము సీతారాముడా సం
ప్రీతుడవై మమ్మేలుము సీతారాముడా
రాతి నొక్క నాతి జేసి సీతారాముడా వి
ఖ్యాతుడవై నావు నీవు సీతారాముడా ఒక
కోతినే బ్రహ్మగ జేసి సీతారాముడా వర
దాత యున్న నీవైతివి సీతారాముడా
ఆతురులై చేరు వారి సీతారాముడా నీ
చేతులతో గ్రుచ్చి యెత్తి సీతారాముడా సుఖ
దాత వగుచు బ్రోచు నట్టి సీతారాముడా మ
మ్మే తీరున కాచెదవో సీతారాముడా
పాతకముల బాపు నట్టి సీతారాముడా మా
జాతకముల మార్చు నట్టి సీతారాముడా ఇక
భూతలమున పుట్ట కుండ సీతారాముడా మో
క్షాతురులము రక్షించుము సీతారాముడా
హరిప్రసాదముగ మన కమరినదీ యెండ
హరిప్రసాదముగ మన కమరినదీ నీడ
హరిప్రసాదముగ మన కమరినదీ ప్రాణము
హరిప్రసాదముగ మన కమరినదీ జన్మము
హరిప్రసాదముగ మన కమరినదీ లోకము
హరిప్రసాదమే కాని దవని నేమున్నది
హరిప్రసాదముగ మన కమరినదీ దేహము
హరిప్రసాదముగ మన కమరినదీ రూపము
హరిప్రసాదముగ మన కమరినదీ గేహము
హరిప్రసాదమే కాని దవని నేమున్నది
హరిప్రసాదముగ మన కమరినదీ అన్నము
హరిప్రసాదముగ మన కమరినదీ అర్ధము
హరిప్రసాదముగ మన కమరినదీ బుధ్ధియు
హరిప్రసాదమే కాని దవని నేమున్నది
హరిప్రసాదముగ మన కమరినదీ ధర్మము
హరిప్రసాదముగ మన కమరినదీ ఙ్ఞానము
హరిప్రసాదముగ మన కమరినదీ భక్తియు
హరిప్రసాదమే కాని దవని నేమున్నది
హరిప్రసాదముగ మన కమరినదీ ఆయువు
హరిప్రసాదముగ మన కమరినదీ సర్వము
హరిప్రసాదముగ మన కమరినదీ యెఱుకయు
హరిప్రసాదమే కాని దవని నేమున్నది
హరిప్రసాదముగ మన కమరినదీ నామము
హరేరామ యనుట జీవి కానంద మైనది
హరిప్రసాదముగ మన కమరునుగా ముక్తియు
హరేరామ యనకపోవు టవివేకమై యున్నది
అన్నము వాని దయే యనుచు కూర్చున్నచో
అన్నమే పెట్టనని యనునా భగవంతుడు
హరి యిచ్చిన యిచ్చును హరి మానిన మానునని
సిరిసంపదల పైన చిత్తము పోనీయవో
హరి యిచ్చిన తనువున కవసర మైనట్టివి
హరి తానిచ్చు గాని మరి వీలు కాదనునా
అతడు నడిపినట్లుగా అనిశము నడిచెద ననుచు
బ్రతుకు బండినే వాని వశముచేసితి వేని
అతిశయమగు ప్రీతిని హరి నడుపును కాని
సుతరాము నడుపనని అతడు పొమ్మనునా
హరిమయ మగు జగమున హరిప్రీతిగా నుందు
హరికార్యములు నాచే హరియే చేయించు నన
హరి నీవే కర్త వనుచు నదిలించునా యేమి
సరిసరి నీపాట్లు నాకు సంబధము లేదనునా
నారాయణ నీనామము నాలుకపైన
తారాడెడు నరుడు కదా ధన్యుజీవి
వానికడకు పాడు కలి వచ్చుటలేదు
వానిజోలి కాయముడు వచ్చుటలేదు
వానిజోలి కా మరుడు వచ్చుటలేదు
వానిదరికి పాపములే వచ్చుటలేదు
వానికి విద్యలపిచ్చి వచ్చుటలేదు
వానికే సిరులపిచ్చి వచ్చుటలేదు
వానికే కీర్తిపిచ్చి వచ్చుటలేదు
వానికే దుర్గుణములు వచ్చుటలేదు
వానికే యాశలును వచ్చుటలేదు
వానికే మోహములును వచ్చుటలేదు
వానికే కష్టమును వచ్చుటలేదు
వాని కింక పుట్టువులు వచ్చుటలేదు
వందారు భక్తజనమందారుడు రాముడు
నందనందనుడై వచ్చినాడిదే చూడుడు
నాడు మునులు మోహపడిన వేడుకగు రూపు
నేడును ధరియించ మునులు నేడు గోపికలై
కూడియాడ ముచ్చటలు కొల్లలై యుండ
చూడ చక్కని కృష్ణుడై సొంపుమీర
నాడు రావణాదులను నాశనము చేసి
నేడు కంసాది ఖలుల పోడిమి నణగించ
వేడుకతో నిలమీదకు విచ్చేసినాడు
చూడ చక్కని కృష్ణుడై సొంపుమీర
నాడు సీతమ్మ యనగ నడయాడిన సిరి
వేడుకతో అష్టరూపవిలాసమే మెరయ
నేడు రుక్మిణమ్మయై నిలువ తనచెంత
చూడ చక్కని కృష్ణుడై సొంపుమీర
శ్రీరామా యనవయ్యా జీవుడా ఇక
వేరు మాట లన్ని కట్టిపెట్టవయ్యా
చింతలపా లగుట యేల శ్రీరామనామమునే
చింతించిన చాలు కదా జీవుడా యది
యంతులేని సుఖము కదా జీవుడా ని
శ్చింతగా నుండవచ్చు జీవుడా
చిన్నచిన్న విద్య లేల శ్రీరామనామంత్ర
మున్న నీకు చాలు కదా జీవుడా అది
యెన్న శ్రేష్ఠవిద్య కదా జీవుడా రా
మన్న దయ చాలు కదా జీవుడా
చిక్కు లిచ్చు సిరులేల శ్రీరామనామధనం
బొక్క టున్న చాలు కదా జీవుడా నిను
ధిక్కరించ రెవరు కదా జీవుడా అది
యొక్కటే చాలు కదా జీవుడా
వేరు రక్ష లేల మనకు శ్రీరామనామరక్ష
పేరి రక్ష చాలు కదా జీవుడా హరి
చేరువైన చాలు కదా జీవుడా సం
సార మింక లేదు కదా జీవుడా
చిక్కనేల యమభటులకు శ్రీరామనామదండ
మొక్క టున్న చాలు కదా జీవుడా భయ
మక్కరనే లేదు కదా జీవుడా అది
మిక్కిలగు మేలు కదా జీవుడా
ఈదనేల సంసారము శ్రీరామనామనౌక
మీద నున్న చాలు కదా జీవుడా ని
న్నాదరికి చేర్చు కదా జీవుడా ఇక
వేదనలే లేవు కదా జీవుడా
చాటండి చాటండి జగన్నాథు వైభవం
చాటండి చాటండి సర్వేశుని వైభవం
మూడులోకముల యందును వేడుకైన వైభవం
నేడు మనకు కనువిందై నిలచిన ఘనవైభవం
వేడుకొనే మనకు సిరులు విందుచేయు వైభవం
వాడుకగా భక్తాళికి వరములిచ్చు వైభవం
శుభకరుడై యూరేగెడు ప్రభువు ఘనవైభవం
అభయంకరుడైన కృష్ణు నంతులేని వైభవం
సభలన్నిట కీర్తిగొన్న జనార్దనుని వైభవం
ప్రభల నభోమణిని మించు రమ్యమైన వైభవం
రావణాదుల పడగొట్టిన రామమూర్తి వైభవం
గోవర్ధన గిరినెత్తిన గొప్పదైన వైభవం
దేవాసురు లందరకును దిక్కగు ఘనవైభవం
దేవుడీ నారాయణుని దివ్యమైన వైభవం
మీరు రామభక్తులు మీకేమి భయము
మీ రితరుల పరిగణించు వారే కారు
ఘనముగా రామునిక్పప కలదు కదండి
జనుల ముందు చేయిజాచ పనిలేదండి
పనిలేని జనులు చాల వాగనీయండి
మనకేమని రామభజన మానకుండండి
మేటి రామ నామమే మేలు కదండి
నోట నింకొకని పేరు నుడువ నేలండి
సాటి భక్తుల సంగతి చాలు కదండి
బూటకాల మానవుల పొత్తు లేలండి
కాలుని భటు లందరిని కసిరి కొట్టండి
వీలు చూచుకొని యముని విసిరి కొట్టండి
నేల నింగి రాముని వని నిలిచి పలకండి
చాలు మరల పుట్టమని చాటి చెప్పండి
హరేరామ యన్నావా హరేకృష్ణ యన్నావా
మరేమనక పోయినా తరించేవులే
హరిభక్తుల జేరి హరికీర్తన జేసి
హరికీర్తన లల్లి మురిసేవులే
హరినామ జపము హరికొరకై తపము
హరికొరకే బ్రతుకై మురిసేవులే
హరిశాస్త్రము లరసి హరిపూజల మెరసి
హరికథలను జదివి మురిసేవులే
హరిలీలల దలచి హరిసన్నిధి వలచి
హరి నదియే వేడి మురిసేవులే
హరిపురమున జేరి హరిసన్నిధి జేరి
హరితోనే ముచ్చట లాడేవులే
హరిసన్నిధి విడచి ధర కికపై నడచి
మరలి రావు నీవు మాకెరు కేలే