29, ఆగస్టు 2011, సోమవారం

వెదుకులాట

ఈ స్నేహం ఇప్పటిది కాదు
ఈ యెడబాటూ ఇప్పటిది కాదు
యెన్ని యుగాలైనది నిన్ను చూచి
నన్ను నువ్వు మరిచావని తలచేదా

ఇద్దరం ఒకటే నని యన్నావు
అసలిద్దరం లేనే లేమన్నావు
నన్ను నువ్వెలా వదిలేసి వెళ్ళిపోయావు
నిన్ను వెదుక్కుంటూ బయలుదేరాను

యెన్నివేషాలు వేసుకుని
యెన్ని లోకాలు తిరగానో
యెక్కడా నాకు నీ జాడ కానరాలేదు
మక్కువ తగ్గిందేమో నీకు నామీద

నిన్ను వెదుక్కుంటూ తిరిగి
నేను దారి తప్పినట్లున్నాను
యెక్కడ బయలుదేరిందీ గుర్తేలేదు
యెక్కడకు చేరేదీ తెలియటం లేదు

నన్ను వెక్కిరిస్తున్నాయే
యెన్నో నా భగ్న దేహరధాలు
ఈ పాతపడుతున్న దేహవాహనానికీ
ఓపిక నశించేలోగా ఒక్కసారి కనిపించు

నా స్సస్వరూపమే నీ వైనా
ఆ స్వరూపమేదో మరిచానే
కావాలని దాగి నువ్వు గడబిడ చేస్తుంటే
ఈ వెదుకులాట యెప్పటికి ముగుస్తుంది చెప్పు

28, ఆగస్టు 2011, ఆదివారం

ఆనందలోకం

అక్కడ ఆనందం తప్ప మరేదీ ఉండదని విన్నాను
అయితే అక్కడికే నేనూ వచ్చేద్దామనుకుంటున్నాను
అక్కడినుంచే ఊడిపడ్డట్లు మాట్లాడిన పెద్దలెవరూ
అక్కడికెలా చేరుకోవాలో సరిగా చెప్పలేకపోతున్నారు
అక్కడి విశేషాల్ని ఊరించేలా వర్ణించే గ్రంధాలేవీ
అక్కడికేలా చేరుకోవాలో సరిగా చెప్పలేకపోతున్నాయి
ఎక్కడుంటావయ్యా మహానుభావా నువ్వసలు
అక్కడికి నేను రావాలంటే అది కుదిరే పనేనా

అక్కడక్కడా చదివినదీ అనేకులు చెప్పినదీ చూస్తే
అక్కడినుంచే వచ్చానటగా నేను - అది నిజమేనా
ఒకవేళ నిజమే ఐతే నీదీ నాదీ అయిన లోకం నుండి
అకటా నాది కూడా కాని లోకాని కెందుకొచ్చాను
ఎక్కడో పొరబాటు జరిగిపోయినట్లంది నా వల్ల
చక్కని ఆనందలోకం నుండి జఱ్ఱున జారిపడ్డాను
తిరిగి వచ్చే దారిదో తెలిపి నువ్వే అనుగ్రహిస్తే
పరిగెత్తుకొస్తాను సుమా పరమానంద లోకానికి

నేను నమ్మను కానీ కొందరు నువ్వే విసిరేశావంటున్నారు
నేనూ నువ్వూ ఒకటేనని మరికొందరు సెలవిస్తున్నారు
ఆ లెక్కన నీ - నా లోకం నాకెందుకు అందక పోవాలి
నువ్వూ నేనూ ఒకటైతే నేనెందుకు మరి వేరై ఉండాలి
మాయదారి చిక్కుముడులన్నీ మటుమాయం చేసే కిటుకేదో
నీ అనుగ్రహం లేకుండా అది నాకవగాహన అవుతుందా
స్వస్వరూపావ బోధనానందానుభూతి చక్కగా కలిగించు
విశ్వాత్మకా అటుపైన నేను నీ చేయి వదిలిపెట్టితే ఒట్టు

27, ఆగస్టు 2011, శనివారం

నా బొమ్మ

యుగాలుగా నా బొమ్మ చెక్కుతూనే ఉన్నావు
కానీ యేనాడూ తిన్నగా కుదిరినట్లు లేదు
అయినా కుదిరీ కుదరని నా బొమ్మల్ని
అనేక చోట్లకు రవాణా చేసిచూసావు
అనేక పేర్లతో చెలామణీ చేసి చూశావు
ఒక్కదానికీ ఒకింత బుధ్ధెపుడూరాలేదు
ఒక్కదానికీ ఒకింత పేరెపుడూ రాలేదు
నా బొమ్మ చెక్కడం నువ్వు మానింది లేదు

పంచభూతాల నిష్పత్తి అంచనా తప్పుతోంది
మూన్నాళ్ళ ముచ్చటై పోతోందీ బొమ్మ
త్రిగుణ వర్ణాల పాళ్ళు తప్పుతూనే ఉన్నాయి
ఊదిన సుగుణాలు వెలాతెలా పోతున్నాయి
నామకరణంలో దోషాలు నాకే తెలుస్తున్నాయి
భూమి మీద నా బొమ్మకు పేరు రావటం లేదు
నువ్వెలా చేద్దామని నిర్ణయించు కున్నావో
నవ్వుల పాలై పోతున్నది నా బొమ్మే ప్రతిసారీ

యేమీ అనుకోక పోతే ఒక్క మాట చెబుతాను
యేదోదో ఊహించుకు యెందుకిలా చెక్కుతావు
ఒక్కసారి ప్రయత్నించి యిలా చెక్కిచూడు
చక్కగా నీరూపున నన్ను చెక్కి చూడు
అన్నిరకాల పాళ్ళూ హాయిగా కుదురుతాయి
యేదైనా పేరుపెట్టి యెక్కడికైనా పంపు
నా పేరు సంగతి సరే నీకు పేరు వస్తుంది
మంచి బొమ్మను చెక్కిన మాట మిగులుతుంది

26, ఆగస్టు 2011, శుక్రవారం

నేనైన నీవు

నేను పిలువలేదు మహాప్రభో
నా ధ్యానప్రపంచంలోనికి నువ్వే వచ్చావు
నన్ను నేదు వెదుక్కుంటుంటే
ఉన్నట్లుండి నువ్వే ప్రత్యక్షమయ్యావు
అయ్యా నీ వెవరివి స్వామీ
నా లోకంలో కసలెందుకు వచ్చావు?

అనంత స్మృతిపథాల గజబిజిలో
నా ప్రపంచంలో నేనే తప్పి పోయినట్లున్నాను
లక్షల రూపులు మార్చి
లక్షణంగా నన్ను నేనే మరచి పోయాను
ఒకవేళ కొంపదీసి నువ్వే
అకళంకమైన నా స్వస్వరూపానివి కావు కదా?

నీ చిరునవ్వును చూస్తుంటే
అది నా పెదవులకూ గుర్తుకు వస్తోందే
నీ శాంతం నే గమనిస్తుంటే
అది నా మదికీ నెమరుకు వస్తోందే
నీ ఆనందం పరికిస్తుంటే
అది నా ఆత్మకు స్వంతం అవుతోందే

అయితే ఇబ్బందిలేదు
నువ్వూ నేనూ ఒకటే నన్న మాట
స్వస్వరూపావభోధకు
సవాలక్ష జన్మలెత్తవలసి వచ్చిందా
నిలిచిపో నేనైన నీవు
కలకాలం నా ధ్యానప్రపంచంలో

25, ఆగస్టు 2011, గురువారం

మంత్రం

వేనవేల మంత్రాలు వెలుగులీనుతున్నాయి
విమలబీజాక్షర వివిధవర్ణ విన్యాస సంరంభాల మధ్య
దివ్యాత్మవివిధాకృతులతో దిక్కుల నతిక్రమిస్తున్నది
చిన్మూర్తి హేలగా చిందులు తొక్కుతున్నది
వెలుగు లక్షరాల జిలుగు వలువలు దాల్చి
మంత్రస్వరూపాలుగా మహిత వాఙ్మయ మహా
లోకాభివ్యక్త ముల్లోక రక్షాదీక్షాపరాయణ
దేవీ స్వరూపాలుగా నిత్యం తేజరిల్లుతున్నాయి.

అసంఖ్యాక జనులు మంత్రాన్ని పఠిస్తున్నారు
వారిలో అనేకులు ఆ మంత్రాన్ని జపిస్తున్నారు
అందులో కొందరు ఆ మంత్రార్ధాన్ని ధ్యానిస్తున్నారు
వారిలో కొందరే ఆ మంత్రతాత్పర్యాన్ని గ్రహిస్తున్నారు
బహుకొద్ది మందికే ఆ మంత్రం ఫలిస్తున్నది
కాని ఒకరిద్దరికే ఆ మంత్రం వశమౌతున్నది
పరమపురుషుడిని తెలిసికొన్న వాడెవడో
వాడికి ఆ మంత్రం స్వస్వరూపమే అవుతున్నది.

మనస్సును అవిద్య నుండి మరలించేది మంత్రం
తమస్సునుండి ఆత్మను తప్పించేది మంత్రం
దివ్యచైతన్యరూపమై తేజరిల్లేది మంత్రం
సకలకర్మబంధాల్ని చక్కదిద్దేది మంత్రం
దేహప్రవాహాలనుండి దివ్యాత్మనుధ్ధరించేది మంత్రం
సర్వాత్మనా ప్రియమైన నా స్వస్వరూపం మంత్రం
అనంతకాలంలో అనేక దేహాల్లో తపించి తపించి
తన్మంత్రమూర్తిని నన్ను నేను తెలుసుకున్నాను
(2010-12-28)