19, అక్టోబర్ 2012, శుక్రవారం

ఎడద కోవెల నీకు విడిదిగా నిచ్చితి

ఎడద కోవెల నీకు విడిదిగా నిచ్చితి యీ
గుడిలోన పదిలముగ కూరుచుండవయ్యా

ఇంత పెద్ద సృష్టి చేసి యెంత యలసి నావో
సుంత విశ్రమించ వయ్య సుకుమారుడా
చెంత నిలచి నాదు భక్తి చెలియ నిన్ను కొలువ
సంతసమున సేదదీర సాగి రావయ్య

అందరి వంటి వాడ ననుకొన వలదయ్యా
ఎందును లోపము లేక ఎలమిని సేవించు
అందమైన నాదు భక్తి యతివ ప్రేమ మీర
కొందలమందక వచ్చి కొలువుండుము రామ

చీకాకులే లేని యేకాంత మందిరము
నీ కోసము వెలయించి నిలపితి నిదిగో
నా కోమల భక్తికన్య నీ కన్య మెరుగనిది
చేకొన రావయ్య రామ లోకైక సేవ్యుడా


18, అక్టోబర్ 2012, గురువారం

ఇంతదాక నాతో నీ యెన్ని సుద్దు లాడితివి

ఇంతదాక నాతో నీవె యెన్ని సుద్దు లాడితివి
యంతలోనె నే మాయెర యలిగి కూరుచుంటివి

నీవు పలుకు సరసములకు నేను నవ్వ మరచితినో
నీవు తెలుపు జయగాధల నేను పరవశించి విననో
నీవు పలుకులాడు చుండ నేను పలుకదొడగి నానో
నీవు కులుకులుడిగి యిటుల నేల యలుగ వలసె రామ

అంతరములు మరచి నేను అధికంబులు పలికి నానో
వింతవింత చేష్టలతో విసువుబుట్ట జేసినానో
అంతుపొంతు లేక పలికి యలుపు కలుగ జేసినానో
యింత యలుక నీకు కలుగ నేమి తప్పుజేసితి రామ

పెక్కుడు తప్పులను నేను వీఱిడితనమొప్ప జేసి
మ్రొక్కినంత నవ్వుట నీకు మొదటినుండి పరిపాటియె
నిక్కువముగ నేను నీవు నొక్క టన్నది నిజమైతే
చక్కగాను కోపముడిగి సాదరముగ పలుక వయ్య

 

17, అక్టోబర్ 2012, బుధవారం

నే నుంటిని నీ నిజభక్తునిగ

నే నుంటిని నీ నిజభక్తునిగ
కానుంటిని నిను కలిసి యొక్కటిగ

పూనిక మరల మరల ప్రకృతిని
    పుట్టించెదవు పురుషోత్తమ నను
మానక మరల మన సంగతిని
    మననము చేయుచు మనెదను నేను
నేనిట నీవట నుంటిమి గాని
    నే నెఱుగుదు మన మిర్వుర మొక్కటని
దీనిని లోకం బెఱుగ కున్నను
  నేనును నీవును నెఱుగుట చాలును

సరి సరి కర్మానుభవంబులకే
    జరిగెడు నవియా జననంబులివి
మరి యటులగుచో నా తొలిజన్మము
     ధరపై దేనికి కలిగిన దందువు
జరిగిన దేదో జరిగిన దైనను
    పొరి నా తొలిరూ‌పుగ నిన్నెఱిగితి
యెఱిగిన పిమ్మట నెక్కడి దుఃఖము
  పరమానందోన్మత్తుడ నైతిని

వెనుకటి జన్మలు నే నెఱుగనయా
    వెనుబలమవు నీ‌వని యెఱిగితిని
మును రానున్నది నే నెఱుగనయా
    మునుకొని నిన్నే పూజించితిని
ఘనుడా భవమును గడచితి నేనని
  మనసున గట్టిగ నమ్ముతి నయ్యా
అనఘా మన మొకటని నే నెఱిగితి
    వినుము విచారము వీడితి రామా


12, అక్టోబర్ 2012, శుక్రవారం

నే నెవడ నయా నీ‌ తప్పు లెన్నగ

నే నెవడ నయా నీ‌ తప్పు లెన్నగ
కానీ నన్నిటు చేయుట కాదా నీ తప్పు

పొరబాటున పుడమికి పోవ నొప్పి కొంటినిబో
అరమరికలు లేక నీ‌ వన్నియు బోధించ వలదె
ధరను చేరి చేరగనే తగులుకొనే అహమికను
మరి నీవు చెప్పలేదు మాట వరస కైన రామ

బలహీన మైన మనసు పాదు కొలిపి దాని కేమొ
బలమైన యింద్రియముల బలగ మిచ్చినావు కదా
బలిమి మీఱ యొడయుని బంధించదె బలగమును
తెలిసి తెలిసి చేసితివని తెలియ నైతి నయ్య రామ

పూని యెడము చేసితివని నేను నిన్ననును కాని
యేనాడును లేని గొప్ప యెడబాటే కలిగినది
పోనీ నీ వైన తెలిసి పోవలదని చెప్పవుగా
మానక దెప్పెదవు నిన్ను మరచి తిరిగి నానొ రామ

ఎన్నెన్నో తనువులెత్తి యెన్ని పాట్లు పడితి నయ్య
తిన్నగ నా తొంటి తీరు తెలిసి వచ్చె నేటికి
అన్నన్నా దోస మెవరి దైన నేమి యిన్నాళ్ళకు
మున్నెట్లో యటులె మనము ముదమున కలిసితిమి రామకూడని దుర్గుణములు కొన్ని వీడి రూపు దాల్చెనని

కూడని దుర్గుణములు కొన్ని కూడుకొని గూడు కట్టి
వీడి రూపు దాల్చెనని విస్తుబోవు చుంటివా


వీడి నిన్ను యిలకు వచ్చి పోడిమి చెడి పాడయితినిరా

వీడెను తొలి నిర్గుణతత్వము నేడు వట్టి దేహిని దేవా

నీడ నైన వదిలించుకొన నేర్వవచ్చు నేమో గానీ

పాడు ప్రకృతి కౌగిలి నుండి బయటపడుట వట్టిది దేవా

తొల్లిటి విభవమును తలచి దురపిల్లుట తరచాయెనయా

మెల్లగ నీ దెస నడచుటకు మిగుల ప్రయత్నింతును దేవా

మిక్కిలిజన్మముల నెట్టి మిసిమి చెడిన జీవుడ నైతి
చక్కబడుట నీ కృప లేక సాధ్యపడుట వట్టిది దేవా

అస్వతంత్రుడ చేరదీసి యాదరించు భారము నీదే
స్వస్వరూపజ్ఞానమిచ్చి సరగున కాపాడుము దేవా

11, అక్టోబర్ 2012, గురువారం

నా పని సులువు నీ పని సులువు

తాపత్రయమిది తప్పించితివా
నీ పాద సేవకు నియమించితివా
నా పని సులువు నీ పని సులువు 
యే పాటి పని నన్నేలుట నీకు

అన్ని లోకముల కేలిక వీవు
చిన్ని కోరికల జీవిని నేను
మన్నించి నా మనవి వింటివా
నిన్నిక దేనికి నే‌ పీడింతును

చావు పుట్టువుల సమరాంగణమున
లావు దక్కి నే లబలబ లాడుచు
కావు మంటిని కాని యూరక
నీ విశ్రాంతిని నేనడ్డుదునా

ఇరువుర మొకటని యెంత చెప్పితివి
ధరపై విడచి తప్పుకుంటివి
మరల స్వస్వరూపమహితజ్ఞానమును
కరుణించవయా పరమపురుషుడా


15, సెప్టెంబర్ 2012, శనివారం

దోసమెంచక చాల దుడుకుతనము చూపి

దోసమెంచక చాల దుడుకుతనము చూపి
మోసగించి బంధించి మురియు శరీరమా

ఇలను చూడ వచ్చినే నిచట చిక్కుపడితిని
కలిగిన యీ‌ భవము నుండి తొలగ లే నైతిని
పలుచ నైన యీ సుఖానుభవము నా కెందుకు
వలచి యీ ఆత్మ నేల పట్టి బంధించితివి

ఈ నీ కపటేంద్రియంబు లేపాటి రజ్జువులు
పోనీ నీ మమతల వల పొంక మేపాటిది
నే నా శాశ్వతుడను నీవు మట్టి బొమ్మవు
నా నిజతత్వమును తెలియ నట్టి యజ్ఞానివి

నీకు నాకు లడాయి నీ వలననె మొదలాయె
నాకు నీ‌ బడాయి నాటి నుండి యెఱుకాయె
నీ కట్టడి చెల్లదని నీ వెఱుగుట మంచిది
నాకు నా రామునకు నేకత్వము నెఱుగుము


ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది

ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
ఏ మూలన దాగావని యెంచి నేను వెదికేది

భూమి మీద నీ‌ యునికిని పొడగాంచ లేనైతిని
సామాన్యుడ నాకాశము జల్లెడ పట్టగ లేను
ఏమో ఆ పాతాళలోక మెంత దిగువ నున్నదో
స్వామీ నా వలన గాదు వచ్చి నిన్ను వెదుకగా

వింటిని బ్రహ్మాండమే పిండాండ మన్న మాటొకటి
వెంటనే నాలోన నిన్ను వెదుక నుత్సహించితిని
తుంటరి దీ ప్రకృతి మార్గము తోచ నీయ కున్నదిరా
కంటంగించుకొని చిక్కులు కలిగించు చున్నదిరా

మన మిర్వుర మొకటని మాట యిచ్చి దాగెదవా
అనుపమ కరుణాలవాల యది నీకు వేడుకైన
మనుజుడ పరిమిత సత్వుడ మన్నించి ఇక నీవే
ఘనమైన స్వస్వరూపజ్ఞాన మీయవే రామ

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

దివి వా భువి వా. ......

దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి 


భావం:

ఓ ముకుందా!

జన్మ మంటూ యెత్తాను కాబట్టి మరణ మనేది కూడా నిశ్చయంగానే వస్తుంది.

ఆ పిమ్మట నా‌ నివాసం యెక్కడ?
భూమి మీద నయితే కాదు గదా? 
ఆ వచ్చేది నరకమో స్వర్గమో చెప్పటం‌ కష్టం.
నరకాన్ని యెవరూ‌ కోరుకోరు సరే.
స్వర్గమే దక్కినా చివరకు మళ్ళా భూలోకానికి రాక తప్పదు గదా?

పురాకృత పుణ్యపాపాలకు అనుగుణంగా భూలోకంలో‌ జన్మం అని చెబుతారు.
అలాగే కన్నుమూసే టప్పుడు ఏది మనస్సులో నిలుస్తుందో దాని కనుగుణంగా తిరిగి మరొక జన్మ వస్తుందని చెబుతారు.

పూర్వం‌ జడభరతుడు లేడిని తలచుకొంటూ మరణించాడు. ఆ మునివర్యుడు, తన అనంతరం పాపం ఆ లేడిపిల్ల గతి యేమి అని దానిగురించే మనస్సులో  చింతన చేస్తూ ప్రాణం వదిలాడు.  అందుకే లేడిగా‌ జన్మించవలసివచ్చింది!

ప్రాణం‌ వదిలేటప్పుడు నిన్ను చింతిస్తూ వదిలితే పునరావృత్తిరహితమైన మోక్షపదమే లభిస్తుంది. ఇంక జన్మం అనేది లేకపోతే యెంత బాగు.

అయితే అలా ప్రాణప్రయాణసమయంలో నిన్ను ఒక్కసారి స్మరిస్తే చాలులే అనుకుంటే అది జరిగే పని యేనా?

దాని కెంత పెట్టి పుట్టాలి. పరమపాపి అయిన అజామీళుడు యే కారణం చేతనయితే నేమి నీ స్మరణ చేసి తరించాడు.

నేను పాపినో‌ పుణ్యాత్ముడనో నాకేమి యెరుక?

అందుచేత ఓ ముకుందా, నేను యీ‌ శరీరం వదిలే సమయంలో కూడా, నా మనస్సులో నీ‌ చరణారవిందాలే నిలచేటట్లుగా‌ దయచేసి అనుగ్రహించు.

అంతకంటే నాకు వేరే యేమి కావాలి. అది చాలు.

స్వేఛ్ఛానువాదం:

    నాకు దివియొండె భువియొండె నరకమొండె
    యునికి గానిమ్ము నరకారి యుసురు పోవు 

    సమయ మందున భవదీయ చరణ పద్మ
    యుగళి చింతించు నదృష్ట మున్న చాలు    9, సెప్టెంబర్ 2012, ఆదివారం

నాస్ధా ధర్మే న వసునిచయే ...

నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రాప్త్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు 

 

భావం:

ఓ ముకుందా ఈ ధర్మమనేది ఉందే అది పరిపరి విధాలుగా దుర్గ్రాహ్యంగా ఉంటుంది.  అనేక విధి నిషేధాలతో‌కూడి అల్పబుధ్ధినైన నాకు చిక్కేది కానే కాదు .అందు చేత దానినిగూర్చిన చింతలు చర్చలపైన నాకు యేమీ‌ ఆసక్తి లేదు.

సరి సరి, యీ‌ ధనమేది ఉందే అది బహు చమత్కారమైనది.  అనంత విధాలుగా ఉండి యెంత సంపాదించినా సరే సంపాదించనిదే‌ అధికం అనిపించే‌ యెండమావి. దాని వెనుక పరిగెట్టాలనే కోరిక నా కేమీ‌ బలంగా లేదు.


ఇక పోతే ఈ విషయ సుఖాలంటావా అవి మరీ చిత్రమైనవి. ఆ కోరికలు తీరేవి కానే కావు. యెం‌త అనుబవించినా తృప్తి అనేది యీ నశ్వరమైన శరీరాలకు కలగనే‌ కలగదు కదా. వాటి మీద నాకేమీ వ్యామోహం లేదయ్యా లేదు.


నేను కావాలనుకున్నా వద్దనుకున్నా విధి అనేది వరసగా శరీరాలను ప్రసాదిస్తూనే ఉంటుంది.  ప్రతి జన్మలోనూ యేవేవో‌ధర్మాలకు బధ్ధుడను కాక తప్పటమూ లేదు. ఎంతో కొంత పొట్టకోస ఆర్జించటం కోసం‌ తిర్గటమూ తప్పటం లేదు. ఈ శరీరం యొక్క కోరికలను తీర్చటానికి ప్రయత్నించకా తప్పటం లేదు.  చాలా చింతించ వలసిన విషయం. ఈ‌ కర్మల ఫలితంగా‌ నాకు జన్మపరంపర యేర్పడుతోంది.  ఈ విషయంలో‌ నేను చేయ గలిగింది యేమీ‌లేదనిపిస్తోంది.

పోనీలే జన్మలు వస్తే రానీ - విచారించను. విచారించి ప్రయోజనం లేదు కదా.

కాని అదృష్టవశాన నాకు నీవు సంస్కారాన్ని ప్రసాదించావు. అందుచేత నేను కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థించేది ఒక్కటే.  జన్మజన్మలోనూ ఆ సంస్కారం అలాగే ఉండనీ. జన్మజన్మలలోనూ‌ నా మనస్సులో నీ‌ పాదపద్మాలపట్ల నా‌ భక్తి పరమ నిశ్చలంగా ఉండనీ ప్రభూ‌.  ఓ‌ ముకుందా‌ అది చాలు నాకు.


 స్వేఛ్ఛానువాదం

    ఒల్లను ధర్మముల్ ధనము లొల్లను కామసుఖంబు లొల్ల నా
    తొల్లిటి చేతలం బొరసి తోసుక వచ్చెడి కర్మఫలంబు లే
    నొల్లక యుండినన్ కలుగ నున్నవి కల్గిన గల్గనిమ్ము నా
   
యుల్లము త్వత్పదాంబురుహయుగ్మము నిశ్చల భక్తి గొల్వనీ8, సెప్టెంబర్ 2012, శనివారం

తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి

తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి
అప్పటికిని నాకెంతో చనువిచ్చి బ్రోచితివి

అందు చేత నా వాడ వని నమ్ముకొంటి నీ
యందు నమ్మకముంచి యవనిపై నుంటి నా
బందుగుల యందు నిన్నె పరమాప్తు డంటి నిం
కెందుకురా అంటిముట్ట కుందువురా యంటి

మింటి మీది చందురుని మించిన చల్లని వాడ
జంట బాసి యుందు విది జంకించును నన్ను
వెంటనే యలుక మాని వెనుకటి తీరుగ నా
కంటి కింపుగ తోచవయ్య కరువు తీర్చవయ్య

హృదయమందు స్థిరవాసము నేర్పరచితి నీకు
సదయ యింకేల జాగు సరగునను దయచేసి
ముదము మీర తొల్లిటి వలె పదిలంబు గాను
వదలక నా చెలిమి నుండ వయ్య నా రాముడా


తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా

తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా నన్ను
తప్పించుకు తిరిగే విది దారుణమయ్యా

ఏడేడు లోకాల నీవు దాగ గలవు నే
చూడరా లేను వాటి జాడ లే నెఱుగ
వాడుక తప్పించి దాగ వచ్చునా నీకు
వేడుక మీఱగ నీవే విచ్చేయ వయ్య

నిజమే నా‌ బోటి వారు నీకు కోట్ల మంది
నిజము చెప్పు చుంటి నాకు నీవే సర్వస్వము
ఋజువు లేల నీవు నా హృన్మందిరమున
విజయము చేసితి వింక వేరు మాట కలదె

నీవు నే నొకటి యని భావించ మంటివే
యా విధముగు నెయ్యమునే హాయిగా మరచి
నీ వెటనో దాగియున్న నేనేమి చేయుదును
రావయ్యా నా స్వామీ రామా నా కొఱకు


7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నాహం వందే ...నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం


 

భావం:
ఓ ముకుందా!
నిజమే. నీ చరణారవిందాలకు నేను నమస్కారం చేస్తూనే‌ఉంటాను.

ఏదో యీ‌ మానవజన్మ యెత్తాక నరకం రాక తప్పుతుందా శరీరం వదిలాక? అది తెలుసు. ఆ రాబోయేది యే కుంభీపాక నరకమో యేమో అని భయపడుతున్నానా?

దాని నుండి తప్పిస్తావు కదా దయ చూపించి అని నీ కాళ్ళకు మ్రొక్కుతున్నానా?

లేదు సుమా!

సరేలే, ఎత్తాం నరజన్మ  సద్వినినియోగం చేసుకుందాం.  శృంగారరసాధినాధుడివి నీ కాళ్ళకు మ్రొక్కితే అందమైన అమ్మాయిల్ని అనుగ్రహిస్తావేమో ననే ఆశతో దణ్ణాలు పెడుతున్నానా?

లేదు సుమా!


తండ్రీ! నీ‌చరణారవిందా లున్నాయే, అవి అద్వంద హేతువులు.  వాటిని ఆశ్రయించిన వాడికి  సకల ద్వంద్వాలనూ నాశనం చేస్తాయవి. అసలు నీవు-తాను అనే ద్వంద్వం కూడా నాశనం అయిపోతుంది కదా. ఇక అటువంటి భక్తుడికి మిగిలేది కైవల్యమే.  తానే నీలో ఐక్యం అయిపోతాడు కదా.  అంత గొప్పవి నీపాదాలు. అంత గొప్పది నీపాదసేవన మాహాత్మ్యం.


అయినా నా బోటి వాడికి అంత గొప్ప భక్తీ, ఆ కైవల్యం చటుక్కున వచ్చేనా!  యేమో.

కాని, జన్మజన్మలకీ ఆ నీ దివ్యపాదాల యెడ నా హృదయంలో‌ వెలుగులీనుతూ ప్రకాశించనీ. నీ యందు నా భక్తిని అవి శాశ్వతంగా నెలకొనేటట్లు చేయనీ. 

అందుకే నేను నీ దివ్యశ్రీ చరణాలను ఆశ్రయించుకున్నాను స్వామీ.

నీ యందు నా భక్తిని అవి పెంపొందింప జేసి నన్ను మోక్షార్హుడిని చేస్తాయి అన్న ఆశ మాత్రమే ప్రభూ.


స్వేఛ్ఛానువాదం:

ఉ.శ్రీపతి నీదు పాదముల సేవన చేసిన నెల్ల ద్వంద్వముల్
రూపరు వానినే గొనుట రోయగ నారక భీతి చేతనో
రూపసు లైన కన్యల మరుల్గొని గోరియొ కాదు యే
లోపము లేని భక్తి యెదలోపల నిండగ జన్మజన్మలన్.

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచేముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేఽస్తు భవత్ప్రసాదాత్   
భావం:

ఓ ముకుందా!

శిరస్సు వంచి ప్రణామం చేసి నేను నిన్ను యాచించేది  ముఖ్యంగా ఒకటే!
నాకు యిలా జన్మ లెత్తటం యెలాగూ తప్పేలా లేదు. పోనీలే!

రాబోయే ప్రతిజన్మలోనూ కూడా నీ‌ పాదారవిందాలను యెట్టి పరిస్థితుల్లోనూ నేను మరచి పోకుండా ఉంటే అదే నాకు చాలు.

నాకు దయ చేసి అటువంటి చక్కని వరం అనుగ్రహించు.
ఆ వరం చాలు నాకు. ఇంకేమీ అవుసరం లేదు.


స్వేఛ్ఛానువాదం::


తే.గీ. శిరసు వంచి విన్నపమును చేయు చుంటి
జన్మజన్మంబు లందు నీ చరణములను
మరువ కుండగ సేవించు వర మొకండు
కరుణతో‌ నిమ్ము తండ్రి నా కదియె చాలు.


( ఈ‌ పద్యం చివరి పాదంలో అఖండయతి వచ్చింది.  లాక్షణికుల్లో అఖండయతి పట్ల భిన్నాభిప్రాయా లున్నాయి. చాలా మంది దీన్ని ఒప్పుకోరు. ఒప్పుకున్న వాళ్ళల్లోనూ ఉద్దండులున్నారు - ఉదాహరణకు ఆంధ్రవాల్మీకి బిరుదాంకితులు శ్రీ వావిలకొలను సుబ్బారావుగారు!.  అయితే ఇక్కడ అఖండయతి రావటం కేవలం యాదృఛ్ఛికం.)


5, సెప్టెంబర్ 2012, బుధవారం

ఇట్టి నీ మహిమల నెంచ నెవరి వశము

ఇట్టి నీ మహిమల నెంచ నెవరి వశము నన్ను చే  
పట్టి బ్రోచుబుధ్ది నీకు పుట్టె నదియే చాలునులే

చెట్టు మీది పుల్లని కాయను చేయగలవు నీవు తీయగ
ఇట్టె నీవు దొంగను గూడ ఋషిని చేయగలవు హాయిగ

పట్టి సకల భువనములను పొట్టలోన దాచగలవు
ఇట్టె రవిని డాచి చుక్కలు పట్ట పగలే చూపగలవు

జట్టు కట్టి నాతో నీవు చుట్టరికము నెఱుపగలవు
ఇట్టె నన్ను జడుని దయతో పట్టి జ్ఞాన మీయగలవు


3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఒక క్షణము నేను శాశ్వతుడను

ఒక క్షణము నేను శాశ్వతుడను 
     మరు క్షణము మృతకల్పుడను

ఒక క్షణము మహానందమయుడ 
     మరు క్షణము శోకవిహ్వలుడను

ఒక క్షణము సర్వభోగయుతుడ 
     మరు క్షణము రిక్తహస్తుడను

ఒక క్షణము నేను జ్ఞానధనుడ 
     మరు క్షణము మోహవశుడను

ఒక క్షణము బుధ్ధిమంతుడను
     మరు క్షణము బుధ్ధిహీనుడను 

ఒక క్షణము నేను యోగీంద్రుడ
     మరు క్షణము ప్రకృతి వశుడను

ఒక క్షణము నేను విశ్వమయుడ
     మరు క్షణము ధూళి రేణువును

ఒక క్షణము పరమ శాంతుడను
     మరు క్షణము క్షోభ్యచిత్తుడను

ఒక క్షణము స్వస్వరూపయుతుడ
    మరు క్షణము పరమ పాపరుడను

ఒక క్షణము నేను నీ‌ భక్తుడ
     మరు క్షణము నిన్ను మరతును

ఒక క్షణము నేను నిను చేరుదు
     మరు క్షణము వేరు పడుదును

ఒక క్షణము గూడ నిను వీడక
     ప్రతిక్షణము గడపు వరమిమ్ము

21, ఆగస్టు 2012, మంగళవారం

హృదయపుండరీకవాస యీశ వందనము

హృదయపుండరీకవాస యీశ వందనము
మృదులహృదయ సదయ పరమేశ వందనము

లోకము లుత్పాదించు నీ కిదే‌ వందనము
లోకముల పోషించెడు నీ కిదే వందనము
లోకముల నిండియున్న నీ కిదే వందనము
లోకయాత్రావినోదరూపశిల్పి వందనము

నిరుపమకరుణాలవాల నీ కిదే వందనము
నరసురకీటాదిభూత నాధ నీకు వందనము
స్మరాదికవైరినాశ స్వామి నీకు వందనము
పరమయోగిసేవ్యమానపాద నీకు వందనము

అన్నోదకము లిచ్చి నన్నరయు స్వామి వందనము
అన్ని వేళలను బ్రోచు నట్టి స్వామి వందనము
అన్ని దిక్కులను నిండి యున్న స్వామి వందనము
పన్నుగ నన్నేలు రామ స్వామి నీకు వందనము


పంచమ మందున చేరి గురుడ నన్ను ముంచితి వయ్యా

పంచమ మందున చేరి గురుడ నన్ను
ముంచితి వయ్యా గురుడ ముంచితివి
మంచి వాడవని యెంచితినే నన్ను
వంచన  చేసి గురుడ ముంచితివి

అకటా కారకగ్రహసంయుక్తం బగు భావము చెడు ననుచు
ప్రకటించిన యా జ్యోతిశ్శాస్త్రపు వచనంబులు నిజమనగా
నొక ప్రారబ్ధఫలానుభవంబున కుదయించిన విధి తోచి
చకితుని జేసెడు నయ్యా నన్ను సద్గతి గలదే నాకు

అంటకాగి యటు లుండుట యేల యసురుల గురువును నీవు
తుంటరి కావ్యుని దుర్బోధలవే తొలిచె నేమొ నీ మనసు
ఇంటిని నిలిపెడు నలుసును దయతో నీయక పోతివి జీవా
బంటువు నీవిటు సేయట యిది భగవంతుని యానతి యేమో

అంతియె గాక మరియొక కారణ మగుపడ దయ్యా నాకు
ఇంతటితో నా కిక భవసాగర మీదుట యన్నది ముగిసి
చింత లన్ని పరమాత్ముని కృపచే చివర కిదే కడతేరి
సంతసమున నా రాముని చేరుట సత్యం బనియే తోచు


ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నావు

ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నా విదే
కొన్ని కొన్ని సుగుణములును కూర్చినావు రామ

అంతు లేని భవములలో అడుగడుగున తోడు వై
ఇంత దాక నీ వడచిన వెన్న నెన్ని చెడుగులో
ఎంతని పొగడుదు నీ దయ నెటు లైన చెడుగెల్ల
అంతరింప జేయవయ్య ఆదరించ వయ్య

కామక్రోధమదాదులన కాయము పై ప్రేమయన
ఏమాత్రము శాంతించవె యెన్ని జన్మ లెత్తినను
కామగపు మనసు బట్ట కాదు నాకు ముమ్మాటికి
స్వామి నీవే పట్టి యింక చక్క జేయ వయ్య

నిన్ను మరువ నట్టి గుణము నెనరున నీ విచ్చినా
వన్ని యెడల నిన్ను జూచు నట్టి గుణము నిచ్చినా
యెన్నగ మన మొక్క టన్న యెరుక గూడ నీయవే
మన్నించవె మాటుకొన్న మాయ నణచి బ్రోవవె


ఎవడను నేను నీ వాడను, ఎవడను నేను నీ నీడను!

ఎవడను నేను నీ వాడను
ఎవడను నేను నీ నీడను

నీ వెటు తిరిగిన నే నటు తిరుగుదు
నే వెటు లాడిన నే నటు లాడుదు
ఏ వేళల నిను నే వీడనుగా
నీ వే నన్నిటుగా నిలిపితివి

ఈ నా యునికికి యెన్ని హంగులను
ఆనందంబుల నమరించితివవో
కాని యన్నియును ఘనుడా నీకే
నే నర్పించుచు నిలచి యాడెదను

ఇరువుర మొకటే యెల్ల వేళలను
ధర నీ దేహము దాల్చి యాడునది
యరయగ నీవే యని యెరుగుదును
తిరముగ నిన్నే తెలిసి పాడుదును

16, ఆగస్టు 2012, గురువారం

జయతు జయతు దేవో....


జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః

భావం:
 దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! 
వృష్ణివంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! 
మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! 
భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!

స్వేఛ్ఛానువాదం:
    జయము దేవకీనందన జయము జయము
    జయము యదుకులగృహదీప జయము జయము
    జయము ఘనమేఘశ్యామాంగ జయము జయము
    జయము భూభారనాశక జయ ముకుంద

వివరాలు: యాదవులలో వృష్ణి, అంధక,భోజవంశాలని మూడు శాఖలు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీవసుదేవులని అందరకూ తెలిసినదే.  యాదవులలో దేవకి భోజవంశంవాడైన ఉగ్రసేన మహారాజు కుమార్తె.  వసుదేవుడు వృష్ణివంశం వాడు.
నలుగురు నవ్వితే నవ్వనీ రామయ్య

నలుగురు నవ్వితే నవ్వనీ రామయ్య
కలిగెడు లోటేమి కలదు నాకు నీకు

వివిధవస్త్రాంగరాగవిభూషణాదికములకు
ఉవిదలు భూములకును ఉదరపోషణమునకు
పవలురేలు గడపుట  పనికిరాదు పరమునకు
భువినుండుట మూన్నాళ్ళ మురిపెమన్నందుకు

ఎడదనే నెలకొన్న యీశ్వరు జాడెరుగక
వడివడిగ మున్నూరు గుడులు చుట్టి తిరిగిన
కడకు వృధాశ్రమ తప్ప కలుగునది లేదనిన
విడువక లో నరసి సత్యవిషయ మెఱుగుడీ యనిన

నీవు నేను వేరనునది నిన్న మొన్నటి మాట
నీవే నే ననునదియే నిశ్చయమని  యెఱిగితి
వ్యావహారికలోకభావన కిది నచ్చక
నా వలన దోసమెంచి ననుగని నిందించిన

15, ఆగస్టు 2012, బుధవారం

హొయలు మీర ఎగురవే ఓ ధర్మపతాకమా జయ జయ జయ భరత జాతి కీర్తిపతాకమా


హొయలు మీర ఎగురవే ఓ ధర్మపతాకమా
జయ జయ జయ భరత జాతి కీర్తిపతాకమా

నీ వెగిరెడు చోట నిఖిల సౌఖ్యము లౌను 
నీ వరశుభ దృష్టి నిఖిల భాగ్యము  లీను
నీ వలన ఘనతలు నిరుపమానము లగుట 
భావించి నీ‌ కీర్తి పాడెదము మేము

వన్నెల కులుకుల వసుధ నీ కెదురేది
వెన్నెల చలువలు విసరునే నీ ఠీవి
కన్నుల వెలుగువై గగన వీధిని నిలచి
అన్ని వేళల శుభము లలరార యెగురవే

పరమేశ్వరుని దివ్య పాలనా విభవమ్ము
భరతమాతకు సకల వరము లీయగను
భరతసంతతి కీర్తి పదిదిక్కులను చాట
చిరకాలము నిలచి గరువాన యెగురవే

13, ఆగస్టు 2012, సోమవారం

నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు

నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు
వేదనలు మాయమై విరియు సంతోషాలు

కనులు కలిపి పలుకరించు జనులు కానరాని చోట
మనసు తెలిసి మనసు కలుపు మనిషి తోడు లేని చోట
దినదినమును నీడ దక్క యనుచరులే లేని చోట
కనికరించి నీవు నాకు కలెగెదవా అది చాలును

ఇచట నావి తక్క యితరు లెవరి పాద ముద్రలెఱుగ
ఇచట నేను తక్క యితరు లెవరి కంఠస్వరము నెఱుగ
ఇచట నేను ఒంటరినై యేకతంబ గ్రుమ్మరుదును
ఇచటికి నీ వొక్కనాటి కేగుదెంచుటయె చాలును

ఓ మహాను భావ అలసి యుంటి నన్న మాట తలచి
నా మొరాల కించి యింక నాకు ప్రసన్నుడవు కమ్ము
ఈ మేదిని నెల్ల నొంటి నెంత తిరిగి ని న్నఱయుదు
సామాన్యుడ నీ‌ వాడను రామ మరువ కది చాలును

10, ఆగస్టు 2012, శుక్రవారం

కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు

కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు
చాలు చాలిది జన్మజన్మల వేల మార్లే కంటిని రామ

తాళుకొమ్మని తరచుగా సద్గ్రంధములలో చదివి చదువక
మేలు కీడుల నొక్కటిగా చూడాలని లో తలచి తలచక
పాలు నీళుల సమముగా సంభావించుటను తెలిసి తెలియక
నేల నుండిన నాలుగు నాళ్ళు నీదు సత్యము నెఱిగి యెఱుగక

గురువు చెప్పిన సద్వాక్యములు కొన్ని మనసున‌ నిలచి నిలువక
పొరలుచు నీ భవపంకంబున సద్బుధ్ధి తనకు కలిగి కలుగక
తరచు విషయలోలు డగుచు ధర్మ మెదలో దలచి దలచక
పరమసత్యమగు విషయము నీవనెడు భావన కలిగి కలుగక

తానే నీవని నీవే తానని లోన చక్కగ నెఱుగుదాక
మానక యిటునటు తిరుగును కాని రానేరా డది తెలిసిన పిదప
ఈ మాత్రపు స్పహ యీశ్వర నీవే యీయక తనకు కలుగుట కల్ల
ఏమి చెప్పుదు కాలవాహినికి నిటునటు నీవే యెంచి చూడగ


శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి...

శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాధేతి నాగశయనేతి జగన్నివాసే
త్యాలాపినం ప్రతిపదం కురుమే ముకుంద

భావం:
ఓ శ్రీ కృష్ణా!  శ్రీ వల్లభా!  వరదా!  దయాపరా!  భక్తప్రియా!  భవబంధాలను త్రెంచి వైచే విద్యలోమహాకోవిదుడా!  నాథా!  నాగశయనా! జగన్నివాసా! ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపిస్తూ ఉండేటట్లుగా  నన్ను చేయి స్వామీ!

స్వేఛ్ఛానువాదం:

    సీ. శ్రీవల్లభాయని చింతించ నీయవే
        వరదాయకా యని పాడనీవె
    పరమదయాళుడ వని పొంగనీయవే
        అఖిలేశ శ్రీహరీ యనగనీవె
    భక్తప్రియాయని భావించ నీయవే
        భవవిమోచనా యని పలుకనీవె
    శేషశయన యని  చింతించ నీయవే
        నోరార ఫ్రభు యని నుడువనీవె
    తే.గీ. అని జగన్నివాస స్వామి యమిత భక్తి 
    ప్రతి దినంబును భావించు పరమదివ్య
    భాగ్య గరిమను నాకీయ వయ్య దేవ
    కొలుచుకోనిమ్ము నన్ను ముకుంద నిన్ను

9, ఆగస్టు 2012, గురువారం

ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి

ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి
యెంత తిరిగినా దీని నెఱుగ శక్యము కాదు

తగుల కుండ జీవుడు తాను తగిన దూర ముండ డేని
తగులు కొని దీని వింతల దారి తప్పి పోవు నాయె
విగతరాగబుధ్ధి యగుచో వింత లెల్ల తడిమి చూడ
తగునటన్న నీసృష్టి తాత్పర్యం బేమి గలదు

ఒక్క సారి తెలియక వచ్చి చిక్కు పడిన వారి సంఖ్య
లెక్క జెప్ప నెవ్వరి తరము చక్కగ జేసితివి సృష్టి
అక్కట యణువణువున దోచు నట్టి నీ విభూతి నెఱుగు
మిక్కిలి భక్తులకు నిచట మెలగవచ్చు నొరుల వశమె

నీవు నేను బేధము లేక నిశ్చయముగ నొకటి గాన
నీ వినోద పూర్ణ విశ్వము నెల్ల జూచి వచ్చు చుంటి
నే విహారమైనను రామ యెడదకు రుచియించునే
నీ వలన నుండుటె నాకు కావలసిన సుఖము గాన


8, ఆగస్టు 2012, బుధవారం

కొంద రున్నారు నా యందు నెయ్యము బూని

కొంద రున్నారు నా యందు నెయ్యము బూని
అందరకు నీవు నాయకుడవు రామయ్య

విహిత మవిహితమును వినిపింతురు వారు
ఇహపర హితముల హెచ్చరింతువు నీవు
మహదద్భుతమైన మన్ననతో మీరు
వహియింతురిదె నాదు భారము కృపతో

సదుపాయముల నిచ్చి చక్కగా వారు
సదుపాయముల గూర్చి చక్కగా నీవు
వదలక నభివృధ్ధిపధమున నన్ను
ముదమున నుంతురు మ్రొక్కెద మీకు

సకలకార్యములను సవరింతురు వారు
సకలము శుభముగ సమకూర్తువు నీవు
అకళంకకృప నిట్టు లాదరింపగ మీరు
సకలాత్మనా యోగ సాధన నుంటిని


తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన

తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన
తప్పాయె లోకమునకు చెప్పి నందు వలన

వారి వలన తప్పు లున్న పరిహసించ లేదు
వారి దారి లోని ముళ్ళ వంక జూపి నేను
తీరైన దారి నిన్ను తెలియు దారి యనుచు
నోరు జారి పలికి నా నోహో తప్పాయె రామ

భుక్తి కొరకు ప్రాకులాడు భూమి జనుల ముందు
శక్తి కొలది రక్తి కొఱకు చచ్చు వారి ముందు
ముక్తి మార్గ మిట్టి దనుచు మొఱ్ఱ వెట్టి నాడ
భక్తి లేని వారి ముందు పలుకుట తప్పాయె రామ

కొంచెపు వారైన చాల గొప్ప వారైనను
సంచితమగు కర్మమెల్ల సంక్షయ మగు దాక
నెంచలేరు నిన్నను మా టెఱుగ లేక నేను
కొంచెము నినుగూర్చి తెలుప గోరుట తప్పాయె రామ


7, ఆగస్టు 2012, మంగళవారం

ఇది 101వ టపా!

అవునండి.
ఇది 101వ టపా.
ఇందులో విశేషం యేమీ లేదు.
500 టపాలు, ఆ పైన వ్రాసిన వారూ వ్రాస్తున్న వారూ ఉన్నారు.

నేను బ్లాగు ప్రపంచంలో‌ అడుగు పెట్టి, ఈ‌బ్లాగు ప్రారంభించి  ఒక సంవత్సరం అయింది.
ఒక సంవత్సరంలో 100 టపాలు పెద్ద విశేషం యేమీ కాదు.
రెండేళ్ళ లోపలే 500 టపాలను మించి వ్రాసిన వారూ‌ ఉన్నారు కదా.

ఈ‌ బ్లాగు వీక్షకుల సంఖ్య ఇప్పటికి 5500 పై చిలుకు.
ఇది కూడా చెప్పుకోదగ్గ సంఖ్య యేమీ‌ కాదు .
లక్షల్లో పాఠకులున్న బోలెడు బ్లాగులున్నాయి.

ఈ‌బ్లాగు సభ్యులు 11 మంది.
నిశ్చయంగా యిది చాలా చిన్న సంఖ్య.
వందల్లో సభ్యులున్న బ్లాగులున్నాయి.

ఈ బ్లాగుకి యిప్పటిదాకా వచ్చిన వ్యాఖ్యలు 252.
ఇది కూడ చాలా చిన్న సంఖ్య.
చాలా బ్యాఖ్యలు టపాల పట్ల ఆమోదానందాలు ప్రకటించినవే.
ఒక మూడు నాలుగు వ్యాఖ్యలు మాత్రం టపానో, నన్నో యెద్దేవా చేస్తూ వచ్చాయి.
వాటిలో వాడబడిన భాష సభార్హం కాక పోవటం వలన వాటిని తొలగించ వలసి వచ్చింది.
కష్టేఫలే  బ్లాగరు శ్రీశర్మ గారికీ నాకూ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యమీద/ వ్యాఖ్యాత మీద కొన్ని ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి కూడా.

ఇది ఆధ్యాత్మకవిత్వ ప్రధానమయిన బ్లాగు.
నా తృప్తి కోసం నేను వ్రాసుకుంటున్న బ్లాగు.
ఒకరిద్దరు ఈ కవిత్వాన్ని ప్రచురించితే బాగుంటుందని సూచించారు.
కాని అది నా‌ శక్తికి మించిన పని యని నా‌అభిప్రాయం.

ఇది ఆధ్యాత్మకవిత్వ ప్రధానమయిన బ్లాగు.
కాబట్టి దీనికి విశేషంగా పాఠకులుంటారని నేను ఆశించటం లేదు.
అలాగే విశేషంగా స్పందనలు వస్తాయని యెదురు చూడటమూ లేదు.
స్పందించవలసిన వాడు స్పందిస్తున్నాడు.  అది చాలు కదా నాకు

ఈ‌బ్లాగులో నేను వాడుతున్న భాష సంప్రదాయపు వాసనతో ఉంటుందని విదితమే.
కొందరి కది సువాసన. వారికి నా వందనం
కొందరి కది అంతగా‌ నచ్చటం లేదేమో.
కాలప్రభావం కారణం కావచ్చును.
వారు నన్ను క్షమించ గోరుతాను.
వీలయినప్పుడల్లా కొంత తేలిక భాషలో కూడా టపాలు వస్తాయి తప్పకుండా.
కొన్ని టపాల్లో అలాంటి తేలికగా‌ ఉండే భాష కనిపించవచ్చు యిప్పటికే.

ఈ బ్లాగు ఇంకా యెన్నాళ్ళు కొనసాగుతుంది?
ఈ‌ ప్రశ్నకి సమాధానం నా చేతులో ఉన్న విషయం కాదు.
వ్రాయించే వాడు వ్రాయిస్తున్నన్నాళ్ళు కొనసాగుతుందని మాత్రం స్పష్టం.

టపా చాలా పెద్ద దయినట్లుందండి!
చివరగా ఒక చిన్న మాట.
ఆదరిస్తున్న అందరికీ వందనాలు.
వ్రాయిస్తున్న వాడికి వందనాలు.

భవదీయుడు,
తాడిగడప శ్యామలరావు.
హైదరాబాదు.
సెల్ 98496 26023.
syamala.tadigadapa@gmail.com

ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు లెంతో సంతసించు యీ రోజు

ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు 
లెంతో సంతసించు యీ రోజు

నీకై ప్రబంధము చెప్పి నిన్ను మెప్పించి నట్టి
శ్రీకృష్ణదేవరాయలు సింహాసన మెక్కిన రోజు

కలయ సాహితీసమరాంగణసార్వభౌముడు
తెలుగుల భాగ్య మనగ కొలువు కెక్కిన రోజు

పొలుపారగా రాయలు భువనవిజయసభను 
తెలుగుశారద మెచ్చ కొలువైన మంచి రోజు

ఈ రోజు సాహితీసమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 503 వ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా చెప్పిన పాట.

6, ఆగస్టు 2012, సోమవారం

ఎఱుక గల్గిన వార లెవ్వరు గాని

ఎఱుక గల్గిన వార లెవ్వరు గాని
సరకు సేయరు లోకసరణిని రామ

పాపచింతన యందు పడద్రోయగా జూచు
తాపత్రయము లందు తగులుకొనరు వారు
లోపముల నెంచెడు లోకుల యెడ వారు
కోపగించక శాంత గుణమున నుందురు

ప్రారబ్ధఫల మనగ బాధ గలిగిన వేళ
నోరెత్తి విధినేమి నిందించరు వారు 
సారెకు నీ దివ్యస్మరణానందమున
మీరిన ధృతి శాంతమూర్తులై యుందురు

చక్కగ నిను దయాశాలిగ నెరుగుచు
మిక్కిలి పొగడుచు మేదిని చక్రము
చక్కని నీ దివ్య సామ్రాజ్యమను స్పృహ
నెక్కుడు తుష్టులై యెసగుచు నుందురు


దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా

దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా
నరుడు ప్రకృతి మాయ నణచి నడచుటున్నదా

మరలమరల పుట్టుచుండి మరల మరల చచ్చుచుండి
మరలమరల దినము దినము దురితములకు జొచ్చుచుండి
కరకు లోక మునను జనులు కాలమిటుల గడపుచుండి
జరుగు టెన్నడో మాయ యెరుగు టెన్నడో నిన్ను 

తలకు కర్మఫలిత మనుచు తగులుకొనుట కేది మొదలు
తెలిసి తెలిసి వల దనుచునె తుళువబుధ్ది నుండ నేల 
కలుగ నేల లోక మందు కాని పనులు చేయ నేల
తొలగు టెన్నడో మాయ కలుగు టెన్నడో నీవు 

మంచి మాట లెన్ని విన్న మనిషి మార కుండు నేమొ
సంచితాదిక కర్మత్రికము క్షణములో దహించు నట్టి
అంచితమగు నీదు కరుణ యంటి మాయ యడగు గాదె
కొంచెము దయజూడు రామ కూటజగతి నుండరాదు

4, ఆగస్టు 2012, శనివారం

పని గట్టు కొని పోయి పదిమంది లోన

పని గట్టు కొని పోయి పదిమంది లోన
నిను గూర్చి పలుమాట లన నేల రామ

కనుల ముందర నీవు గావించి నట్టి
ఘనమైన సృష్టిని గాంచుచు దీని
వెనుక నెవ్వడు లేడు విశ్వ మంతయును
తనకు తానుగ గల్గె నను వారి కడకు

జీవుడు దేహాన చేరి యున్నాడని
జీవబ్రహ్మైక్యత సిధ్ధాంత మనుచు
వా విడచి పలుకుచో పకపక నవ్వి
వే విధంబుల దిట్టు వెఱ్ఱుల కడకు

పరమాత్ముడవు నిన్ను భావించ లేని
నరుల మధ్యకు బోయి పరమాప్త యేల
ఉరక పలుచన జేయ నుంకింతు నిన్ను
సరిసరి నా భక్తి చాలదా నీకు

3, ఆగస్టు 2012, శుక్రవారం

నీ కేమయ్యా నిర్భయుడవు మరి మా కొలదుల గతి మాటేమీ

నీ కేమయ్యా నిర్భయుడవు మరి
మా కొలదుల గతి మాటేమీ 

ఈషణ్మాత్రము లేదుకదా నీ
కీషణ త్రయముల జంఝాటం
వేషభాషల వెంపరలాటలు
భేషజములతో పేచీ లేక

త్రిగుణములవి రేగవుగా నీ
యగణిత నిర్గుణ స్థితిలోన
పొగల సెగల రాగద్వేషాలు
తగులు మోహముల తహతహ లేక 

పురుషార్థంబుల పొందవుగా నీ
కరయ బంధమోక్షములు గలవా
పొరి భవబంధము ప్రోద్రోలనుగా
తిరముగ స్వస్థితి తెలియగ లేక

2, ఆగస్టు 2012, గురువారం

ఇంత కన్న లోకాన యెన్న డైన గాని

ఇంత కన్న లోకాన యెన్న డైన గాని
వింత మాట పుట్టేనా వేయి మాట లేల

మంచి చెడు లంటకుండ మసిలెద వట నీవు
మంచిమంచి పనులుసేయ మంచినేర్పరి వట
అంచితముగ నేను నీకు మంచిచాయ నంచు
మంచిదారి నడువశక్యమా నీకందువు రామ

గుణము లంటకుండ నీవు కులుకుచుండెద వట
రణములాడి దుర్గుణులను రాల్చుచుండెద వట
గణుతింప నీయందు నేకలిగితి నందువు దు
ర్గుణపాశలతలు నేను కోయలే నందువు రామ

ఒంటిగాడవై హాయిగనుండ నీవు నేర్చెద వట
తంటాలను తీర్చి మంచిదారి చూపుచుందు వట
వెంటబడి నిన్నింక నే విడువబోను నేనంటే
అంటకాగి నేనుండుట అక్కజం బందువు రామ

26, జులై 2012, గురువారం

విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను

విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవరున్నారు

చన్న భవములను గావించినవి చిన్నతప్పులో పాపములో
యెన్నగ నేవో పున్నెములో నా కన్నను నీకే యెఱుకగదా 
అన్నియు గలసి తేపతేపకు నన్ను త్రిప్పురా యిల చుట్టూ
మన్నించర నే నలసితిరా బ్రతిమాలుదు రామా బ్రోవరా

సత్వము లేదే సర్వతీర్థములు శ్రధ్ధ మీర సేవించుటకు
తత్వసార విచారము చేయగ చదువును చాలదురా నా దీ
నత్వము నెఱిగిన కరుణామయుడవు నాకేమో నీదయయే
సత్వము తత్వము కావున నన్ను చప్పున రామా బ్రోవరా

తెలిసిన దొకటే నిన్నే నమ్ముట తెలిసీ తెలియని మనసునకు
తెలియని దొకటే మంచి దారిని తీరుగ నడిచే సద్విద్య
తలచుకొంటివా తక్షణమే నా తాపము లన్నీ తీరునయా
కలిసెద నీలో కల్మషముడిగి గ్రక్కున రామా బ్రోవరా


25, జులై 2012, బుధవారం

పరమపదసోపానపఠము పరచి నామండీ

పరమపదసోపానపఠము  పరచి నామండీ
పరమపురుషుని  చేరుకొనగ వచ్చి యాడండీ

రక్తి గొలిపు ఆట మీరు రండి ఆడండీ
శక్తియుక్తి పరుల కాట చాల సులువండీ
భక్తివైరాగ్యాలు చేతి పాచికలు  సుండీ
ముక్తి  దొరకు దాక ఆట ముందుకే నండీ

అరెరే యీ సర్పములకె అదరి పోకండి
కరచిన ఒక పాము జావ కారి పోకండీ
వెరువకుండ మీరు ముందుకు తరలి  రారండీ
పరమపురుషు చేరు దాక పట్టు బట్టండీ

ముచ్చటైన  ఆట కొరకు ముందు కురకండీ
నిచ్చెనలు మీ రాక కివే నిలచి యున్నాయి
వచ్చి ఆడి  పైకి  పైకి పరుగు తీయండీ
అచ్చమైన పరమపదము నంది మురియండీ

పాము లరిషడ్వర్గములను భావ ముంచండీ
నోము ఫలము లందివచ్చు నిచ్చెనలండీ
భూమి సోపానపఠము బుధ్ధి నెరుగండీ
స్వామి కడకు చేరు దాక సాగిపోరండీ

పరమపురుషుడు రాముడని మరువబోకండీ
హరిని చేరు దాక ఆట నాడవలె నండీ
పరమసులభమైన ఆట వచ్చి ఆడండీ
పరబ్రహ్మపదము చేర త్వరపడాలండీఈ రోజు (7/25/2012) కంది శంకరయ్యగారి బ్లాగు శంకారాభరణం లో పరమపదసోపాన పఠం బొమ్మ యిచ్చి పద్యాలు వ్రాయమని అడిగారు.  నా తోచిన పద్యాలు  వ్రాసాను ఆ బ్లాగులో.   వాటిని శ్యామలీయం బ్లాగులో కూడా ఉంచితే బాగుంటుందని అనిపించింది. కాని తీరా టపా మొదలు పెడుతుండగా పాటగా వచ్చింది. అందు చేత ముందు పాట వ్రాసి క్రింది ఉదయం వ్రాసిన పద్యాలు కూడా ఉంచుతున్నాను.

కం. అరిషడ్వర్గము పాములు
నరుదగు నధ్యాత్మసాధనలు నిచ్చెనలున్
మరి వైరాగ్యము భక్తియు
సరిపడు పావులును నాట జరిగెడు నుర్విన్

కం. నా పావులు మంచివయా
నాపైనను నాకు కలదు నమ్మకము హరీ
నీపై నాన పరమపద
సోపానపఠంబు మీద చూపెద ప్రజ్ఞన్

కం. ఈ నిచ్చెనలును పాములు
నే నెక్కుట దిగుట క్రొత్త యే పరమాత్మా
నా నిశ్ఛయమే పై బరి
లో నుండిన నిన్ను చేర్చు లోలాక్ష హరీ!

కం. నే నిను చేరుటయును మరి
నీ నిశ్చయమనుచు లోన నెరుగుదు గానన్
మానక పాముల నణచుచు
చేనందుచు నిచ్చెనలను చేరెదను హరీ!

కం. ఈ నిచ్చెనలును పాముల
తో నీ పటమెల్ల మాయ తొలగి నశించున్
గాన మహాత్మా చేరక
మానెదనే నిన్ను బుధ్ధిమంతుడ నగుచున్

24, జులై 2012, మంగళవారం

ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం

ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం ఇది
యే నాటికి కడతేరే నయ్యా యెన్నడు నీ దరి చేరుదు నయ్యా

ఎన్నడు జ్ఞప్తికి రానివి యెన్నెన్నో జన్మలు గడచినవి ఇం
కెన్ని జన్మ లీ‌ దీర్ఘప్రయాణం యీశ్వర యెట్లా చేయా లయ్యా

ఏ దారిని పడి వచ్చితినో ఏ దారిన పడి పోవుచుంటినో
ఈ దారుణమగు దీర్ఘప్రయాణం యీశ్వర యిది నా కెందుకయా

ఎంతో దయగల వాడవు నీవని యీశ్వర నేను యెరుగుదును
అంతు లేని యీ దీర్ఘప్రయాణం పంతగించక నిలుపవయా 

ఏ నాడును నిను వేరు భాగ్యములు నేను వేడినది లేదయ్యా
ఈ నా‌ చేసిన దీర్ఘప్రయాణం ఇక నిను కలిసి ముగింతునయా

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను
దిగలాగుచున్నదీ ప్రకృతి

దేహబంధము వీడి దివ్యత్వమున నుండ
నూహ చేసెడివేళ సుడికించుచున్నది
ఐహికవాంఛల నిదే  యెగదోయుచున్నది
స్నేహ హస్తము జాచి చేదుకో రామ

ఈ నశ్వరములపై పోని నా బుధ్ధికి
లేని యాశల నెల్ల తాను  గ్రుచ్చేను
దాని దుందుడుకును పూని నీ వైనను
మానిపించుము నన్ను మన్నించి రామ

నీవు నే నొకటనే నిశ్చయంబున నుండ
కావు నా వాడవని గద్దించు చున్నది
ఏవిధి తొలగింతువో యిట్టి చీకాకును
కావ నీ వే దిక్కు కరుణించు రామ


23, జులై 2012, సోమవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 5

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.

వివరణము: అహంకారం అనేది సమిష్టి అంతఃకరణం యొక్క బేధము.  ఈ అంహంకారానికి మూలమయిన మహత్తత్త్వాన్ని బుధ్ధి అని కుడా వ్యవహరిస్తారు. బ్రహ్మాండ పిండాండాలకు అబేధము. అంటే విశ్వం అనేది మానవ శరీరంలొ ఆరోపణం చేసి చూసినప్పుడు మహత్తత్తమే బుధ్ధి. ఈ బుధ్ధినుండే 'నేను' అనేది ఒక అభిజ్ఞ యేర్పడుతుంది. అదే అహంకారము. ఇలా పిండాండంలో నిరూపణము.  బ్రహ్మాండ పరంగా, పరమాత్మయొక్క వ్యక్తస్వరూపమైనది మహత్తత్త్వం అయితే దానికి అవ్వలిముఖం అవ్యక్తపురుషుడు అంటే మూలప్రకృతిగా భాసిస్తున్న పరమాత్మ. నాణానికి ఇవ్వలిముఖంలాగా ఉండేది నామ రూపాత్మకమైన ప్రకృతి. ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి అని పూర్వవాక్యంలో చదువుకున్నది మూలప్రకృతి అని గ్రహించండి.

సాంఖ్యకారికలలోని క్రింది శ్లోకాన్ని చూడండి

మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతియః సప్త
షోడశకస్తు వికారో న ప్రకృతిర్నవికృతిః పురుషః

మహత్తత్త్వమూ, అహంకారమూ, పంచతన్మాత్రలూ కలిపి మొత్తం యీ ఏడూ ప్రకృతి, వికృతీ కూడా. ఇవి పంచమహాభూతాలకు (వ్యుత్పత్తి)కారణాలు కావటం చేత ప్రకృతి అనీ, మూలప్రకృతికి (పరిణామ)కార్యాలు కావటం వలని వికృతి అనీ తెలుస్తున్నది.   (అవ్యక్త)పురుషుడు అంటే పరమాత్మ. అతడు దేనికీ చెందిన వాదు కాడు. దేనికీ కారణమూ కాడు కార్యమూ కాడు.

ఈ మూలప్రకృతి మరియు ప్రపంచకారణమయిన జడప్రకృతులలో మహత్తత్త్వంనుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడనుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.


తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో


తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
మిన్నుముట్ట వాదించు చున్నాడు రామ

చిలుకపలుకుల వలె చింతన పొంతన
తలపోయక శాస్త్రములలోని విషయాలు
పలుమారు వల్లించి  ఫలమేమి పొందేను
తిలకించి చూడడే దివ్యతత్వము నిజము

ఈశ్వరు డెవడంటె యేమేమొ చెబుతాడు 
ఈశ్వారాంకితముగా నేపనియు చేయడు
ఈశ్వరా  నీవె నా కింక దిక్కని యంటాడు
ఈశ్వరు నెరుగడే హృద్దేశమున నిజము

విడిచి పెట్టడు గాని విషయభోగములను
అడుగుచున్నాడు సిగ్గు విడచి మోక్షంబును
కడు దుర్లభ ఫలము కాంక్షించు చున్నాడు
జడుడు వాడెవ్వడో కాడు  వీడే నిజము

22, జులై 2012, ఆదివారం

సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన

సుఖమయ మీ సంసారము నీ చూపు సోకిన
దుఃఖముల పుట్ట యిదే దొరుకక నీ కరుణ

నేరుపు మీరగ విద్యలు నేర్వక రాణించు వారు
తీరుగ విద్యలు నేరిచి తిప్పలు పడు వారు
ధారుణిపై గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

నిరక్షరకుక్షు లయ్యును నీపై గురి కల వారు
గురుబోధను బడసి కూడ గురి నిలువని వారు
ధరణిపైన గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

అనుపమాన లోకనాథ యనవద్య పామరుడను
నిను నమ్మియుంటి గాని నేనే మెఱుగుదును
మనసున నీ నామమునే మానక స్మరించువాడను
కనుక నీ చల్లని చూపులు కరుణించుము రామ


మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 4

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము:ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు. 

వివరణము: ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా ప్రభువు అని అర్థం. శ్రీమన్నారాయణుడేయీశ్వర శబ్దవాచ్యుడు.ఈ ద్వితీయ స్కంధములోనివే అయిన రెండు పద్యాలను చిత్తగించండి.

మ. వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయ వలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరు డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్యమంచున్ సుతా

కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కీ‌ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా.

బ్రహ్మగారు నారదమహర్షితో  "కుమారా,  ఈ మాయ అనేది ఉంది చూసావూ, ఇది ఈశ్వరుని దృష్టిని ఆకర్షించటానికి యెంతో సిగ్గుపడి బెరుకు తనంతో‌ ఉంటుంది. ఆట్టే ప్రజ్ఞ లేని వాళ్ళు మందమతులై నన్నే అన్ని లోకాలకూ అధిపతిని అనుకొని మొక్కుతూ‌ ఉంటారు. ఆహా, ఇదంతా ఆ శ్రీహరి మాయాప్రాభావం కదా అని నవ్వుకుంటూ ఉంటాను. వాళ్ళ మొక్కులు అంగీకరించను సుమా. ఆశ్రీహరియే ఈశుడు. తుదీ మొదలూ‌ లేని వాడు.  నీవో నేనో ఆ మాయో మరేదైనా ప్రాణిగానీఈశ్వరత్వం అంటూ ఉండటం అసంభవం." అని అంటున్నారు.

ఈ‌ పద్యాలు ఎందుకు ఉదహరించానంటే ఈశ్వర, ఈశ శబ్దాలసమత్వాన్నీ, ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడే అన్న భాగవత రహస్యాన్నీ‌ వివరించటానికే.

ఇప్పుడు మనకు ఈశ్వరాధిష్టితమైన ప్రకృతి అన్న వ్యవహారానికి శ్రీహరి అధీనం లోని ప్రకృతికి అన్న అర్థం సిధ్ధిస్తున్నది కదా. గత వాక్యానికి వివరణం చెప్పుకుంటూ మనం ఒక గీతా‌శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. అది

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ 'నా యొక్క ప్రకృతి'లో అనటం‌ కూడా గమనించాం కదా!

మనకు ప్రకృతికి స్వామి యైన వాడు  శ్రీమన్నారాయణుడు అని స్పష్టం అవుతున్నది.

ఎవరికైనా సందేహం ఉండ వచ్చును, ఇదేమిటీ ఈయన శ్రీకృష్ణునీ, శ్రీమన్నారాయణునీ ఒక్కరే అని వ్యవహరిస్తున్నారూ అని. అవునండి, ఒకరే, శ్రీకృష్ణుడు 'లక్ష్మీపతి రభూత్స్వయం' అని ప్రమాణం.  ఆయన విష్ణువు యొక్క విభూత్యవతారంగానీ,  ఆవేశావతారంగాని, అంశావతారంగానీ కాక స్వయంగా విష్ణువు. దీనికి భాగవతమే ప్రమాణం. అందుకే మనం శ్రీకృష్ణప్రోక్తమైనగీతోపనిషత్తు నుండి ప్రమాణాలు స్వీకరిస్తున్నాము.

ఈశ్వరుడు అనాది అయినట్లే ఆయన అధీనంలో ఉన్న ప్రకృతి కూడా అనాదియే! అది ఆయన విభూతులలో ఒకటే.  ఈ‌ ప్రకృతి అంశం వలన మహత్తత్తం యేర్పదుతోంది.  ఇదీ ప్రస్తుతం మనం వివరణ చెప్పుకుంటున్న వాక్యానికి విశదీకరణ.

ఇదంతా బాగానే ఉంది కాని, ఇంతకూ ఈ‌ మహత్తత్త్వం అంటె యేమిటీ అని ప్రశ్న.

పరమాత్మయొక్క విభూతులలో ముఖ్యమైనది ప్రకృతి. ఈ‌ ప్రకృతి అనేది సమస్తమైన నామరూపాత్మకమైన వ్యవహారాలకూ‌మూలం.అందుకే దానికి వేదాంత పరిభాషలో ప్రధానం అనిపేరు. ఈ ప్రకృతిద్వారా అభివ్యక్తమైన పరమాత్మ స్వరూపానికే మహత్తత్త్వం అనిపేరు. అందుకే శుధ్ధపరబ్రహ్మాన్ని ప్రకృతిలయం చేయకుండా తెలుసుకోవటం సాధ్యం కాదు.

బృహదారణ్యకోపనిషత్తులోని యీ క్రింది గార్గీ యాజ్ఞ్యవల్క్యుల సంవాదలోని మాటలు చూడండి.

గార్గి: యాజ్ఞ్యవల్యా, ద్యులోకానికి పైనా, భూలోకానికి క్రిందా కూడా వ్యాపించి, యీ రెండులోకాల మధ్యనూ వ్యాపించి యున్నట్టిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు లాంటి వ్యవహారాలు కలిగినిది దేనిలో పడుగు -పేక లాగా‌కూర్చబడి యుంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశంలో
గార్గి: ఈ‌ఆకాశాము ఓతప్రోతమై దేనిలో ఉంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశం అక్షరమునందు ఆధారపడి యుందని బ్రహ్మవేత్తల నిశ్చయం.
గార్గి:  అక్షరం అంటే ఏమిటి?
యాజ్ఞ్యవల్క్యుడు: ఏదైనా వస్తువును తెలుసుకోవాలంటే విశేషణాలూ నామరూపాలూ కావాలి. అక్షరం‌ అనేదానికి యెటువంటి నామరూపాలూ విశేషణాలూ లేవు. సర్వవిశేషణశూన్యమైనది అక్షరం అని తాత్పర్యం. అంటే అక్షరం అనేది పరబ్రహ్మమే.

మనం చర్చించు కుంటున్న గద్యలో ముందు ముందు మహత్తత్వం నుండి ఆకాశం ఉత్పన్నం కావటం చెప్పబడుతుందని గమనిస్తాం.  అందుచేత మహత్తత్త్వం అంటే పరమాత్మ యొక్క వ్యక్తవిభూతి అని గ్రహిస్తే చాలు. 

20, జులై 2012, శుక్రవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 3

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. 

వివరణము: బ్రహ్మను సేవించి పొందేది ఆకల్పాంతబ్రహ్మలోకనివాసం అని తెలుసుకున్నాం కదా.  తరువాత వాక్యంలో నారాయణ భక్తునికి లభించేది యేమిటో చెప్పుతున్నారు.

శ్రీమన్నారాయణుని సేవించేవారికి బ్రహ్మను సేవించే వారికన్న ఉన్నతమైన స్థితి కలుగుతుంది నిస్సందేహంగా.  అటువంటి విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని అక్షరాలా బ్రద్దలు కొట్టుకుని ఆవలకు వెళ్ళగలుగుతారు!  ఎందుకు అలా వెళ్ళటం? బ్రహ్మాండమంటే సృష్టి.  సమస్తమూ యీ సృష్టి లోనికే వస్తుంది.   సమస్త  చరాచరాలలూ అందులోనివే.  సురగరుడోరగయక్షకిన్నరనరాది సమస్తజీవులూ సృష్టిలోని వారే.   ఇంద్రాది  దేవముఖ్యులేమి, చివరకు బ్రహ్మకూడా.  అయితే విష్ణువు సృష్టికే అధినాధుడు, దానికి ఆవలి వాడు.

సాధారణ సృష్టి చేసేవాడు బ్రహ్మ అయినా, అసలు బ్రహ్మాండాన్నే సృజించేవాడు విష్ణువు.   విష్ణువు బ్రహ్మకే తండ్రి అని తెలుసు కదా! ఈ గీతా శ్లోకం (విభూతియోగం లోనిది) చిత్తగించండి.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ స్పష్టంగా  అందరికంటే, దేవతలు మునులూ  అందరి కంటే కూడా తానే ప్రధముడనని తన పుట్టువు వీరెవరికీ తెలియదనీ చెబుతున్నారు.

అలాగే
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
 కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

 కల్పం అంతమైనప్పుడు సమస్త భూతములూ  నా యొక్క ప్రకృతిలో లీనమై పోతున్నాయి. తిరిగి వాటిని  మరల కల్పం ప్రారంభంలో నేను సృష్టిస్తున్నాని అని శ్రీకృష్ణపరమాత్మ ఇక్కడ చెప్తున్నారు.

ఈ ప్రమాణాలు చాలు. శ్రీవిష్ణుదేవుడే సమస్తమైన సృష్టికీ మూలాధారం అని తెలుసుకోవటానికి. ఆయన ఈ సృష్టికి ఆవలి వాడే కాని మనలాగా బ్రహ్మాదులలాగా సృష్టిలోని వాడు కాదు.

విష్ణుపదం అంటే విష్ణులోకం (వైకుంఠం) సృష్టికి వెలుపలిది. బ్రహ్మాండంలో చిక్కుకున్న వారికి అందనిది.  విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులకొట్టుకొని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు.    అంతే కాదు వారికి అలా వైకుంఠాన్ని చేరుకుందుకు  ఏ విధమైన అర్గళమూ (అడ్డంకి) ఉండదు.  విష్ణు భక్తులకు ఏ విషయంలోనూ అడ్డంకీ, మరొకరి  అనుమతీ అవసరం లేదు ఏ విషయంలోనూ.  అంతా వారి  ఇఛ్ఛప్రకారమే (యిష్టం మేరకే). అందుచేత శ్రీమన్నారాయణుని చరణకమలాలను సంపూర్ణమైన భక్తితో సేవించి శరీరత్యాగం చేసిన వారు సంతోషంగా యిష్టపూర్వకంగా, యే అడ్డంకీ లేకుండా నారాయణుని నిజధామం అయిన వైకుంఠం చేరుకుంటారు.   ఇదే పరమోన్నతమైన ప్రాప్తిస్థానం - దీనికి మించినది యేదీ లేదు.  అటువంటి పుణ్యధామం చేరుకున్న విష్ణుభక్తులు  ఇతరేతరములైన ఉపాసలచేత తక్కువ స్థాయి లోకాలకు చేరుకున్నవారికి,   అలాగే సృష్టి లోని అన్యులందరికీ తేరి చూడరాని తేజస్సును పొందుతారు.

ఇక్కడ బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకూ విష్ణుపదం చేరుకున్నవాళ్ళకూ తారతమ్యం చూడండి.   బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకు బ్రహ్మతోనే అవసానం.  ఆతరువాత మళ్ళీ సృష్టిచక్రంలోనికి రాక తప్పదు.  కాని  విష్ణుపదం చేరుకున్నవాళ్ళది మహోన్నతమైన స్థితి. శ్రీ మహావిష్ణువుకు చ్యుతి లేదు.  ఆయన అచ్యుతుడని కదా  ప్రతీతి.  అందుచేత ఆయనను చేరుకున్న వాళ్ళకూ చ్యుతి లేదు.  వారికి యీ సృష్టిలోనికి వచ్చే పనే లేదు.   అదే పరమపదం. అదే మోక్షం.  అంటే సృష్టి చక్రం నుండి విడుదల పొందటం.  అంతకు మించి యేమీ లేదు -ఉండే అవకాశమే లేదు.

ఈ వాక్యంలో బ్రహ్మాండం అన్న మాట వాడబడింది. విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులగొట్టుకొని మరీ మోక్షం సాధిస్తారని ప్రతిపాదించబడింది.  అయితే ఈ బ్రహ్మాండం అనేది యెలా ఏర్పడిందనే విషయాన్ని ముందు రాబోయే వాక్యాల్లో వివరించటం జరుగుతుంది.  అందుకే బ్రహ్మాండం అనే మాటకు పెద్దగా వ్యాఖ్యానించటం చేయ లేదు.

19, జులై 2012, గురువారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 2

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము:బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు.

వివరణము: బ్రహ్మాను తదితర దేవతలను పూజించి శరీరత్యాగం చేసిన వారు బ్రహ్మలోకం చేరుకుంటారు. వారు అక్కడ ఆ బ్రహ్మ ఉన్న న్నాళ్ళు స్థిరంగా నివాసం ఉంటారు. ఆ తరువాత వారికి ముక్తి కలుగుతుంది.

ఈ‌వాక్యం సాధకులను, కొంత వేదాంత పరిజ్ఞానం కల వాళ్ళను తప్పకుండా తికమక పెడుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు మొదలయిన పూజ్య దేవతలు ముక్తిని ఇచ్చే వారని చెప్పటం శృతిప్రమాణానికి విరుధ్దం. వారికి ఇష్టకామ్యార్థసిధ్ధిని అనుగ్రహించే సామర్ధ్యమే కాని మోక్షం అనుగ్రహించే సామర్థ్యం ఉందని చెప్పటం చెల్లదు. కాని మనం వివరణం చెప్పుకుంటున్న వాక్యం యొక్క అర్థం మరి వారికి అలా మోక్షం ఇచ్చే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పుతున్నట్లుగానే ఉంది.

అసలు పై వాక్యంలోనే కావలసినంత గందరగోళం ఉంది. బ్రహ్మాను గాని తదితర దేవతలలో యెవరిని గాని పూజించిన వారంతా బ్రహ్మలోకం చేరుకుంటారూ అని కదా పై వాక్యం చెబుతోంది? కాని అదెలా సంభవం. ఉదాహరణకు ఇంద్రుని పూజించిన వారు చేరుకోవలసిన ఇంద్రలోకం అంటే స్వర్గం కదా? ఈ గీతాశ్లోకం తిలకించండి:

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్|| 9-25 ||


దేవతలను సేవించువారు దేవలోకములను చేరుకుంటారు.  పితృదేవతలను సేవించే వారు ఆ పితృదేవతల లోకాలను చేరుకుంటారు .  భూతప్రేతపిశాచాలను పూజించే వారికి అట్టి రూపమే కలుగుతుంది . (పరమాత్మ నైన)నన్ను సేవించే భక్తులు నన్నే చేరుకుంటున్నారు.

ఇక్కడ శ్రీకృష్ణపరమాత్మ నన్ను సేవించు భక్తులు నన్నే పొందుచున్నారని చెప్పటం  అంటె వాళ్ళకి తనయందు లీనమై పోయి పునరావృత్తిరహితమైన మోక్షము సిధ్ధింస్తోందని చెప్పారని భావం. ఇతరమైన ఉపాసనలకు దొరుకుచున్న యే స్థానమైనా మోక్షం కాదు కదా.  అలాంటి అన్య దేవతోపాసకులు ఆయా దేవతల లోకాలు చేరి వారివారి యిష్టదేవతలకు గల ఆయువు పర్యంతం వారితో నివసిస్తారని అర్థం.  ఇక క్షుద్రమైన ఉపాసనలకు ఫలితం దారుణంగా ఉంటుంది. వాళ్ళూ అలాగే భూతప్రేతపిశాచాలలాగా అయిపోతారు. యద్భావం తద్భవతి అన్నమాట.

కేవలం పరబ్రహ్మోపాసన వల్లనే మోక్షం వస్తుంది కాని ఇతరత్రా ఉపాసనల వల్ల రాదు గదా.  కేనోపనిషత్తులో ఉన్న యీ మంత్రం చూడండి

సా బ్రహ్మేతి హోవాచ
బ్రహ్మణో వా ఏతత్ విజయే
మహీయధ్వమితి తతో‌ హైవ
విదాఞ్చాకార బ్రహ్మేతి

అప్పుడు హైమవతి "అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము వల్లనే మీకు విజయం కలిగింది" అని ఇంద్రునికి స్పష్టం చేసింది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మమును తెలుసుకున్నాడు.

దీనిని బట్టి ఇంద్రుడు బ్రహ్మము కాదని హైమవతి దయతో బ్రహ్మము గూర్చి చక్కగా తెలుసుకున్నాడనీ తెలిసింది కదా. దీని వలన ఇంద్రోపాసన కాక పరబ్రహ్మోపాసనమే మోక్షం యిచ్చేది అని తెలుస్తోంది.

అందుచేత మన వివరణం చెప్పుకుంటున్న వాక్యం పోతనగారు పొరబాటున వ్రాసారా అనే సందేహం వస్తుంది!

బహుశః ఈ వాక్యం "బ్రహ్మదేవ భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు" అనిఉండాలేమో?  ప్రస్తుతం‌ కనిపిస్తున్న పాఠం పూర్వమే దొర్లిన లేఖక ప్రమాదమో లేక ఇటీవలి కాలం వారి ముద్రణా ప్రమాదమో కావచ్చునని ఒక అభిప్రాయం స్థిరపదుతోంది.

ఇంతకు ముందు వాక్యంలోనే బ్రహ్మను ఉపాసించేవాళ్ళకి లబించే ప్రయోజనం తెలుసుకున్నాం.  అది మోక్షం కాదు గదా.
దీనిని బట్టి సాక్షాత్తూ బ్రహ్మ అయినా ఇంద్రాది దేవతలు అయినా ముక్తిని ఇచ్చే వాళ్ళు కాదని తెలిసింది కాదా. అలాంటప్పుడు "ముక్తు లగుదురు" అన్న ప్రయోగం కూడా పొసగట్లేదు కదా? ఏ విధంగా అన్వయించటం?

ఇక్కడ "ముక్తు లగుదురు" అన్నది ఆయా లోకాలనుండి, ఆయా దేవతల సమక్షం నుండి విడిపోతారు అని అర్థం చెప్పుకోవాలి. అలా అయితే అంతా సరిగా ఉంటుంది. బ్రహ్మాది దేవతలంతా సృష్టిలోని వారే. కాబట్టి వారికి లయం అయిపోవటం తప్పదు.  అయితే అమిత దీర్ఘాయుర్థాయాలు. అంతే. ఆశ్రయించుకొన్న దేవతే లయం అయిపోయినప్పుడు, ఆశ్రితులైన ఉపాసకులంతాకూడా లయం అయిపోతారు. పునఃసృష్టిలో ఉచ్చితమైన అధికారాలూ అవకాశాలూ గల జన్మలు పొందుతారు. అయినా బ్రహ్మాది దేవతలు అని చెప్పటం పాఠదోషమే. ఎందుకంటే, బ్రహ్మ కంటే యితర దేవత ఆయుఃప్రమాణాలు తక్కువ. పైగా ఇతర దేవతల ప్రసక్తి తెచ్చి అంతా కట్టగట్టుకుని బ్రహ్మలోకాన్నే చేరుస్తారని చెప్పరాదు కూడా.

అలా అన్వయం కుదిరినాక ఈ వాక్యం కేవలం పూర్వవాక్యానికి కొనసాగింపు అనీ‌ విరోధం యేమీ లేదనీ బోధపడుతున్నది.

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 1

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం   ఇక్కడ  చూడండి. )


మూలము: మఱియు నొక్క విశేషంబు గలదు.

వివరణము:  ప్రస్తుత గద్య భాగం  శ్రీమధ్బాగవతం లోని ద్వితీయస్కంధంలో ఉంది.  పరీక్షిన్మహారాజుకు శుకయోగీంద్రులు భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు.  యోగసాధన చేసే విధానం గురించీ ముక్తిని గురించీ ఆయన రాజుకు వివరించిన తరువాత సృష్టిక్రమం గురించీ, విష్ణుభక్తులు ఆ సృష్టి నుండి ముక్తులై  పరమాత్మస్వరూపుడైన విష్ణువులో లీన మయ్యే విధానం గురించీ వివరిస్తున్నారు.

ఇక్కడ  'ఇంకొక విశేషం ఉంది'  అని చెప్పారు గదా? ఆ విశేషం యేమిటో చూద్దాం .  యోగాభ్యాసం చక్కగా చేసి అది ఫలించి సిధ్ధి పొందినవారు బ్రహ్మలోకం చేరుకుంటారు.  అలా బ్రహ్మలోకం చేరిన వారు లోకానుగ్రహం చేయటం కోసం శరీరధారణ చేసి భూమిమీదికి అప్పుడప్పుడు వస్తారు కాని వారికి యేవిధమైన కర్మబంధాలూ ఉండవు. కాబట్టి వారిని ప్రకృతి శరీరధారణకు నిర్బంధించలేదు.  కానీ  యీ సిధ్ధులకు తమదైన ఉనికి ఉండనే ఉంటుంది.  కాబట్టి అది కైవల్యపదం కాదు.  అయితే అటువంటి  కైవల్యం అనబడే పరమాత్మునిలో లీన మయ్యే విశేషమైన వ్యవహారం కూడా ఉంది సుమా కేవలం బ్రహ్మలోకం పొందటమే అత్యున్నతమైన స్థాయి కాదు అని శుక మహర్షుల వారు పరీక్షిత్తుతో అంటున్నారు. అదీ విషయం క్లుప్తంగా.

మూలము: పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు.

వివరణము:  పుణ్యాతిరేకం అంటే అమితమైన పుణ్యం అని అర్థం. పుణ్యతారతమ్యం అంటే ఆ అమితమైన పుణ్యంలో కూడ యెంతో కొంత తర-తమ బేధం ఉంటుంది కదా. ఈ తర, తమ అనేవి ఇంగ్లీషులో  more and most  అనే comparisons.  ఈ లోకంలో మనుష్యుల అర్హతలను బట్టి యెలాగైతే అధికారాలను అప్పగిస్తామూ బ్రహ్మలోకంలో అయినా అలాగే జరుగుతుంది.   బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు.  ఇక్కడ కొంతమందికి కల్పం అంటే యెంతకాలం అనే ప్రశ్న రావచ్చును,  కల్పం  అనేది  భారతీయ మైన  కాలమానంలో  ఒక అతిదీర్ఘ మైన సమయం. మనం  ప్రస్తుతం కలి యుగం  నడుస్తోందని చెప్పుకుంటున్నాం  కదా. కృత, త్రేత, ద్వాపర  కలి యుగాలని  యుగాలు నాలుగు. వాటి  ప్రమాణాలు చూడండి.

కృతయుగం    17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం    12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం   8,64,000 సంవత్సరాలు
కలియుగం      4,32,000 సంవత్సరాలు

నాలుగు  యుగాలనూ‌ కలిపి ఒక మహాయుగం‌ అంటారు. మెత్తం 43,20,000 సంవత్సరా లన్నమాట.  మహాయుగాన్ని  దివ్యయగం అని కూడా అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే  అది బ్రహ్మకు  ఒక పగలు. దానినే సర్గము అనీ‌ కల్పము అనీ‌ అంటారు. మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి సమయం. దానినే  ప్రళయం  అంటారు. ఇలా బ్రహ్మకు  ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు  360 గడిస్తే అది బ్రహ్మకు  ఒక సంవత్సరం. బ్రహ్మగారి ఆయుర్దాయం అటువంటి 100 సంవత్సరాలు.  ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారికి 50 యేళ్ళు  దాటాయండి, 51వ సంవత్సరంలో  శ్వేతవరాహకల్పం నడుస్తున్నది. ఇప్పుడు కల్పం‌  అనే దాని యొక్క  ప్రమాణం 432,00,00 ,000 సంవత్సరాలు అని  తెలుస్తున్నది  కదా.
 
ఇది నిస్సందేహంగా చాలా పెద్ద కాలమే.  దీన్ని బట్టి అర్థమయ్యేది యేమిటంటే,  యోగాభ్యాసం చక్కగా చేసి జితేంద్రియులైన వారు బోలెడన్ని పుణ్య కార్యాలు చేస్తారు.  వాటి సహాయంతో వారికి బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పడుతుంది.  అదీ యెంతో దీర్ఘకాలం పాటు. ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఇంకా యెంత కాలం మిగులి ఉందో అన్నాళ్ళూ వాళ్ళు బ్రహ్మగారి లోకంలో సుఖంగా ఉంటారన్నమాట.  ఆ తరువాత వారికి వారి యోగ్యతల ననుసరించి మంచిమంచి పదవులు వస్తాయి.

ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు (అక్షరపరబ్రహ్మ యోగంలో)   ఓ అర్జునా బ్రహ్మలోకంతో సహా అన్నిలోకాలూ, యేది పొందినా, అది పునర్జన్మనిచ్చేదే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం  పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేసాడు.
     ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున
    మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

కాబట్టి బ్రహ్మలోకం పొందిన మహాయోగులకూ తిరిగి కల్పావసానం కాగానే ఒక జన్మ అనేది కలుగుతుంది.  అయితే వారి పుణ్యఫలానుసారంగా మంచి అధికారయుతమైన జన్మ దొరుకుతుంది.

18, జులై 2012, బుధవారం

శ్రీమదాంధ్రమహాభాగవతాంతర్గత సృష్టిక్రమము (మూలము)

[ శ్రీమదాంధ్రమహాభాగవతము, ద్వితీయస్కంధము. బమ్మెర పోతనామాత్యకవీంద్ర ప్రణీతము.]

మఱియు నొక్క విశేషంబు గలదు.

పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు. (1)

బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు. (2)

నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. (3)

ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు. (4)

మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.(5)

అహంకారాంశంబున శబ్దతన్మాత్రం బగు.

శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు.

గగనాంశంబున స్పర్శతన్మాత్రం బగు.

స్పర్శతన్మాత్రాంశంబున సమీరణం బగు.

సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు.

రూపతన్మాత్రాంశంబు వలన తేజం బగు.

తేజోంశంబున రసతన్మాత్రం బగు.

రసతన్మాత్రాంశంబువలన జలం బగు.

జలాంశంబున గంధతన్మాత్రం బగు.

గంధత్నాంత్రాంశంబున పృధివి యగు.

వాని మేళనంబునం జతుర్దశభువనాత్మకం బైన విరాడ్రూపం బగు.

ఆ రూపంబునకుఁ గోటియోజన విశాలం బైన యండకటాహంబు ప్రధమావారణం బైన పృధివి యగు.
దీనిఁ బంచాశత్కోటివిశాలం బని కొందరు పలుకుదురు.

ఇయ్యావరణంబు మీఁద సలిలజేజస్సమీరగగనాహంకారమహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు.

అట్టి యేడింటి మీఁదఁ బ్రకృత్యావరణంబు  మహావ్యాపకం బగు.

బ్రహ్మాండంబు భేదించి వైష్ణవపదారోహణంబు సేయువాడు మెల్లన లింగదేహంబునఁ బృధివ్యాత్మకంబు నొంది 

అట్టి పృధివ్యాత్మకంబున ఘ్రాణంబున గంధంబును
జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును
తేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును
సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును
గగనత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును
అతిక్రమించిన

భూతసూక్ష్మేంద్రీయలయస్థానం బైన యహంకారావరణంబున సంప్రాప్తుండై యుండు.

మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వికాహంకారగమనంబున మహత్తత్త్వంబు సొచ్చి

గుణత్రయంబున లయించి

ప్రధానంబు నొంది

ప్రధానాత్మకత్వంబున దేహంబును

ఉపాధిపరంపరావస్థానంబునం బ్రకృతిం బాసి

ఆనందమయుండై యానందంబునం బరమాత్మరూపం బైన వాసుదేవబ్రహ్మంబునందు కలయును

అని వెండియు నిట్లనియె.

శ్రీరామ్‌గారు ఈ గద్యసంబధమైన ప్రశ్న ఒకటి వేశారు. వారడిగినది 
శ్యామలీయం గారు, భాగవతం రెండో స్కందం చదువుతున్నాను. అందు లో కొన్ని పదలైతే ఇంతక్రితం విన్నాను కాని, అర్థం స్పష్ట్టంగా తెలియలేదు. 1. ఆ పదాలు దృష్ట్ట, రసం, సత్తు అసత్తు 2. తేజస్సు నుండి రసం,రూపం,స్పర్శం, శబ్ద్దం అనే నాలుగు గుణాలతో పాటు జలం జనించింది. ఇక్కడ రసం అంటే అర్థమేమిటి? 3." మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకార అంశంతో శబ్బతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశ అంశంతో స్పర్శ తన్మాత్రం పుడుతుంది. తేజస్సు అంశం నుండి రసతన్మాత్ర పుడుతుంది, రసతన్మాత్ర అంశమ్నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశంతో పృధ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిక వలన పదునాలుగు భువనాల స్వరూపమైన విరాడృపం ఉద్బవిస్తుంది " పై వాఖ్యంలో మహత్తత్త్వం, తన్మాత్రం ,గంధ తన్మాత్ర అంటే అర్థమేమిటి? Thanks in advance SriRam on గత మెంచి యడిగేది కాదనవు గదా ప్రతిసారి వలె పోయి రమ్మనకు

చాలా మంచి ప్రశ్న. వారు నా‌జవాబు కోసం వేచి యున్నారు.  ఇది చాలా మంచి విషయం. కాబట్టి విపులంగా వ్రాయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం పైన మూలపాఠాన్ని ప్రచురించాను.  నా వ్యాఖ్యానాన్ని రాబోయే టపాల్లో వెలువరిస్తాను. నేను కవినో పండితుడనో వేదాంతినో జ్ఞానినో విస్తారంగా గ్రంధావలోకనం చేసిన వాడినో కాదు. నాకీ‌ అర్హతలేమీ లేనే లేవు. అయినా నా శక్తి కొద్దీ ప్రయత్నించా లనుకుంటున్నాను. సాహసమే. పెద్దలు మన్నించి ఆశీర్వదించాలని మనవి. తప్పులేవైనా దొర్లితే పెద్దమనసు చేసుకొని క్షమించగలరనే విశ్వాసంతో, రాబోయే టపాలలో పై గద్యకు యధాశక్తిగా వ్యాఖ్యానం వ్రాస్తాను.

గమనిక: పైని మూలపాఠం నిజానికి యే విరామ చిహ్నాలూ వాక్యావసానాలూ లేకుండా ఒకే పేరాగ్రాఫుగా ముద్రితమై పుస్తకాలలో దర్శన మిస్తుంది.  స్వతంత్రించి చదువరుల సౌలభ్యం కోసం అనేక విభాగాలుగా ఉటంకించాను.

స్వస్తి.