8, ఆగస్టు 2012, బుధవారం

తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన

తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన
తప్పాయె లోకమునకు చెప్పి నందు వలన

వారి వలన తప్పు లున్న పరిహసించ లేదు
వారి దారి లోని ముళ్ళ వంక జూపి నేను
తీరైన దారి నిన్ను తెలియు దారి యనుచు
నోరు జారి పలికి నా నోహో తప్పాయె రామ

భుక్తి కొరకు ప్రాకులాడు భూమి జనుల ముందు
శక్తి కొలది రక్తి కొఱకు చచ్చు వారి ముందు
ముక్తి మార్గ మిట్టి దనుచు మొఱ్ఱ వెట్టి నాడ
భక్తి లేని వారి ముందు పలుకుట తప్పాయె రామ

కొంచెపు వారైన చాల గొప్ప వారైనను
సంచితమగు కర్మమెల్ల సంక్షయ మగు దాక
నెంచలేరు నిన్నను మా టెఱుగ లేక నేను
కొంచెము నినుగూర్చి తెలుప గోరుట తప్పాయె రామ


2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అభ్యాసక్రమంలో అనేక సంవేదనలు కలుగుతూ ఉంటాయి.
      అన్నీ యీ దేహసంసర్గము కలిగిన జీవునివే కానక్కరలేదు.
      యెక్కడో స్పష్టంగా చెప్పలేను. ఒక చోట ఈ రోజు భాగవతాపచారం జరిగినదిగా అనిపించింది.
      చాలా అశాంతి కలిగింది. ఈ‌ పరివేదన ఆ జీవునిది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.