13, ఆగస్టు 2013, మంగళవారం

శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడే!






ఆంధ్రజాతి యావత్తు శ్రీకృష్ణదేవరాయని పేరు వినగానే అవనత శిరస్కమై, ఒళ్ళు పులకరించే స్థితిని పొందుతుంది.  సంస్కృతీ, సాహితీ, సమరాంగణ - సార్వభౌముడాయన.  (యావద్దక్షిణదేశం, తూర్పున ఓఢ్రదేశం, పడమటితీరాన గోవా కొంకణదేశం‌ కలుపుకుని ఏకఛ్ఛత్రాధిపత్యం నెరపిన చక్రవర్తిగా ఆంధ్ర, కర్ణాటక, తమిళ, ఓఢ్ర, కొంకణ దేశాధిపతుల్ని జయించిన జోదుగా) ఓటమి అన్నదే ఎరుగని విజేతగా ప్రపంచ చక్రవర్తులలో ఏకైక వ్యక్తిగా నిలిచినాడు.  అన్ని ప్రాంతాల భాషల్లో శాసనాలు, అన్ని ప్రాంతాల జనాలతో సైన్యసమీకరణలు, అన్ని ప్రాంతాల దేవాలయాలలో దానాలు, అన్ని ప్రాంతాల వ్యాపారులతో మంతనాలు, వ్యాపారాలు నెరపిన రేడు.  తాను స్వయంగా వైణికుడు,  మహాకవి, సంగీత సాహిత్య నృత్యాది విద్యలను పోషించినవాడు.  వ్యాయామకర్కశ స్థిరబంధుడు. సుశిక్షితుడైన ఆశ్వికుడు.  స్వయంగా దండు నడిపిన దండనాయకుడు.   అనేక తులాపురుషదానములు, అనేక గోపుర నిర్మాణములు, స్వర్ణలేపనాదులు, తటాకాది నిర్మాణములు చేసిన (సుమారు 500 దాన శాసనాలతో) మహాదాత.  తెలుగువాడిగా, తెలుగు భాషాభిమానిగా, తెలుగు సాహిత్యపోషకునిగా చరిత్రలో సుస్థిరస్థానము సంపాదించిన వాడు కృష్ణరాయడు.  విదేశీ చరిత్రకారులు, రాయబారులు, వణిక్ప్రముఖులు వేనోళ్ళ పొగడి చరిత్రలు చరిత్రలుగా రాసిన సువ్యక్తిత్వశోభితుడు.  ఆ మహనుభావుడు తెలుగువారి పుణ్యఫలంగా తెలుగువాడై పుట్టినాడు.  తెలుగురేడై వెలిగినాడు.  తెలుగుతేజమై మెరసినాడు.

శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు కాదేమోనన్న శంకతో తెలుగువారు, ప్రాంతీయ దురభిమానంతో మావాడేనన్న కన్నడంవారు చరిత్ర వక్రీకరణలో తమవంతు పాత్ర పోషించినారు.  తెలుగువారిలో మరికొందరు ఉదారులు ఈయనను తుళువ వంశము వాడు గనుక తుళు దేశీయుణ్ణి చేసినారు.  శ్రీకృష్ణదేవరాయలు జన్మతః కన్నడిగుడే యని ఎం. ఎన్. రామచంద్రమూర్తిగారు, తెలుగువాడు కాదన్న వేదం వేంకటరాయ శాస్త్రిగారు మొ॥ వారు। రాయలు ఎందుకు తెలుగువాడు కాదో ఉపపత్తులు చూపలేదు.  సూర్యనాథ్ కామత్, జి.ఎన్. దీక్షిత్ వంటి కన్నడిగులు ప్రాంతీయాభిమానంతో తమవాడన్నారు.  తమిళ కన్నడ భాషీయునిగా పుట్టి ఉంటే, ఆయా భాషలవారు రాయలను తమ జాతీయ నాయకునిగా జగదేక కీర్తనీయునిగా ప్రతిష్టించేవారు.

రాయలు పదహారణాల తెలుగువాడు.  తెలుగురేడు.  అతని తెలుగు మాతృభాషీయతకు తెలుగు జాతీయతకు అనేక సాక్ష్యాలున్నాయి.

రాయల తండ్రి తుళువ నరస నాయకుడు.  తాత ఈశ్వర నాయకుడు.  నాయనమ్మ బుక్కాంబ.  ముత్తాత తిమ్మయ్య నాయకుడు తెలుగువారే.  తిమ్మయ్య శబ్దము తిరుమలయ్యకు వికృతి.  వేంకటేశ్వర నామము.  ఈ తిమ్మయ్య విజయనగర రాజ్య సైన్యాద్యక్షునిగా దక్షిణ దేశ విజయ యాత్రలో అక్కడకు వెళ్ళి, రాజాజ్ఞతో తుళు ప్రాంతమునకు సామంత ప్రభువైనాడు. 'తుళువ రాజ్యము సంతత వీర భోజ్యమై..' ఆ తుళువ రాజ్యమున విఖ్యాతి వహించిరి.  'వారల కగ్రగణ్యుడు.. తిమ్మ ధాత్రీరమణుడు.. ప్రకటిత బాహువీర్యుడై' అని వరాహపురాణం చెప్తోంది.  ఈ గ్రంధం రాయలవారి తండ్రి తుళువ నరసనాయకునికి అంకితంగా నంది మల్లయ ఘంట సింగయలు రాసింది.  పేరులో తెలుగుదనము వీర భోజ్యంగా తుళుదేశం ఏలిన ముత్తతగారి వైనం తెలుస్తోంది.  ఈయన తెలుగువాడే.  తుళు దక్షిణ కన్నడ దేశం.  మంగుళూరు, ఉడుపి, పుత్తూరు ప్రాంతాలను తుళుదేశంగా చెబుతారు.

తుళు దేశాన్ని  పరిపాలించిన జెర్సప్ప నుండి ఈ వంశం హంపీరాయ సింహాసనంతో (విజయనగర ప్రతిష్టాపన కాలం నుండి) వైరం సాధించుతూ వచ్చింది.  కృష్ణరాయని తండ్రి తుళువ నరసనాయకుని కాలం దాకా ఇవి నడిచాయి.  క్రీ.శ.1390, 1417, 1425, 1554ల్లో నాలుగుసార్లు ఈ‌ యుధ్ధాలు జరిగాయి.  బహుశః ఈ‌యుధ్ధాల్లో ఏదో ఒక యుధ్ధంలో విజేతగా హంపీ ప్రభువులు కోలార్ ప్రాంతాన్ని ఏలడానికి తమ నాయంకరుల్లో ఒకడైన తిమ్మయ్య నాయకుణ్ణి సామంతునిగా నియమించి ఉంటారు.  తిమ్మయ్య తరువాత ఇతని కొడుకు ఈశ్వరనాయకుడు అక్కడ ఇమడలేక చంద్రగిరి వచ్చేసాడు.  బహుశః స్థానిక వ్యతిరేక రాజకీయాలు కారణం కావచ్చు.  ఈశ్వరనాయకుడు సాళువ గుండ నరసింహ భూపాలుని సైన్యాధిపతిగా కన్నడాంధ్ర ప్రాంతాలు అనేక దుర్గాలు జయించి రాయ చౌహల్ల మల్ల , ధరణీవరాహ, మోహనమురారి, బర్బరబాహు వంటి బిరుదులు పొందినాడు.  ఉదయగిరి, హుత్తారి, గండికోట, పెనుగొండ, బెంగళూరు, గొడుగుచింత, బాగూరు, సర్నకొండ, శ్రీరంగపట్నం అతడు గెల్చిన కొన్ని గిరిదుర్గాలు.  అంతేకాదు నెల్లురు (తమిళనాడు)ను కూడా జయించడమే కాక అక్కడి జ్వరేశ్వరాలయంలో (శివాలయంలోని శివునికి జ్వరము నుండి ప్రజలను కాపాడునని విశ్వాసం) కళ్యాణమంటపం నిర్మించాడు.  ఈ మంటపం రాయల కంచి మంటపానికి కవలల పోలికగా ఉంటుంది.  వినిర్జిత నిర్జరేశ్వరాలయుడని కృష్ణరాయలు తన తాతను ఆముక్తమాల్యదలో (అవ. 27) పేర్కొన్నాడు. 

తిమ్మరాయలు తుళు దేశస్థుడని వరాహపురాణం చెప్తోందని నేలటూరి వేంకటరమణయ్య రాసారు.  కాని ఆ గ్రంధంలో అలా ఎక్కడా లేదు.  'మిన్నుల మోచి తుళువ రాజ్యము సంతత వీరభోజ్యమై' అని రాసి ఉంది.  'వీరభోజ్యమై' అంటే గెలుచుకున్నదని అర్థం.  కాని మాతృభూమి అని మాత్రం కాదు.  తుళువ అన్నది శ్రేష్టమని ఆనాటి వ్యవహార పదంగా రాయవాచకంలో పేర్కొనబడింది.  దుర్మార్గుడనే అర్థంలో కాదు.

తిమ్మయ్య చంద్రగిరి ప్రాంతీయుడు.  దూపాటిసీమ నేలిన సాయపనేని వారింటి ఆడపడుచు దేవకీదేవితో (క్రీ.శ.1435-40 ప్రాంతంలో) వివాహం అయింది.  ఈవిడ అకాలమరణం వల్ల (క్రీ.శ.1430-50ల మధ్య తుళు దేశం ఏలిన) ఈతడు వెనుకకు తిరిగివచ్చి, చంద్రగిరి సమీపాన దేవకీపురం గ్రామాన్ని తన భార్యపేర నిర్మించాడు.  తిమ్మయగుంట, తిమ్మనాయని పాళెం పేరుగల గ్రామాలు ఇతనివి కావచ్చని విజ్ఞులు పేర్కొన్నారు.  ఈశ్వరనాయకుడు తన తల్లి పేరుతో రాయవేలూరు సమీపాన మరొక దేవకీపురం నిర్మించాడు.

ఒక తరం (ముత్తాత హయాం) గడిచాక తుళుదేశంలో పాళెగాడుగా ఉన్న తిమ్మరాజు కుమారుడు ఈశ్వరనాయకుడు, కుమారుడు నరసనాయకుని తోడ్కొని చంద్రగిరికి సాళువ నరసింగ రాయల కొలువుకు వచ్చినాడు.  నరసింగరాయలు వీరి ప్రతిష్ట తెలిసినవాడు గనుక తండ్రి కొడుకు లిద్దరిని తన చంద్రగిరి దుర్గానికి ఆహ్వానించినాడు మారీచీ పరిణయ కావ్యాధారాన్ని బట్టి రాయల ముత్తాత ఇంటి పేరు సాళువ వారే.  ఈ ఉభయ వంశములకు మధ్య బాంధవ్యం ఉంది.  తుళు దేశ నాయకత్వముతో సాళువ తిమ్మరాజు తుళువ తిమ్మరాజై తుళువ ఈశ్వరరాజుగా చంద్రగిరిలో చలామణి అయినాడు.  ఈతని కుమారుడు, కృష్ణదేవరాయని తండ్రి నరసరాజు, చంద్రగిరి ప్రభువు నరసరాజు ఉభయులు సాళువవారే కనుక సౌకర్యార్థం రాజు సాళువ నరసరాజుగా, సైన్యాధిపతి తుళువ నరసరాజుగా  (నరసనాయకునిగా) వ్యవహారంలోకి వచ్చారు.  ఈ‌ ఇద్దరు నరసింగలతో పోర్చుగీసువారికి వ్యవహారంలో ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు వారే చేసుకొన్నారు.  సాళువ నరసింహరాయలను చంద్రగిరి నరసింగ అని పోర్చుగీసువారు పిలిచే వారని హేరాను రాసాడు (వాల్యూం 1, పేజీ 311).  అలాగే రాయల తండ్రి (అక్కడి నుండి వచ్చాడని)  తుళూవ నరసింగ అయ్యే అవకాశం ఉంది.  ఇద్దరు నరసింగలు ప్రధాన పదవుల్లో ఉన్నవారు కదా.

కృష్ణరాయని తండ్రి చంద్రగిరిలో నివాసము చేసి రాజు సాళువ నరసింగ భూపాలునికి (అన్నమయ్యను చెరలో బంధించిన రాజు) సైన్యాధిపతిగా, ఆత్మీయ సఖుడిగా మెలిగి విశ్వాసపాత్రుడైనాడు.  రాజు ఆజ్ఞతో హంపీకల్లోలములు అణిచేందుకు హంపీ‌ వెళ్ళి,  అపై తన కుటుంబమును అక్కడికే పిలిపించుకున్నాడు. యవ్వన ప్రాదుర్భావములో చంద్రగిరి చేరి, ముగ్గురు భార్యలను, నలుగురు కుమారులను ఇక్కడే ప్రోది చేసినాడు.  కృష్ణదేవరాయని బాల్యము, విద్య చంద్రగిరిలోనే గడిచింది.  రాయనికి తిరుపతి వేంకటేశ్వరస్వామి పట్ల గల భక్తికి చంద్రగిరి బాల్యము కారణము కావచ్చు.

కృష్ణరాయల కుటుంబం కన్నడం వారేనన్న తొలి చారిత్రకులు ప్రొ.యం. రామారావుగారు.  "Later the Family migrated to kishkindha and from there to Chandragiri in andhra desha .. married andhra women and became domiciled in andhra" అని తెలిగింటి ఆడవారిని పెళ్ళి చేసుకొని తెలుగువారై పోయారన్నారు.  ఆంధ్రరాణులను పెళ్ళాడి అని గుర్తించడం ఇక్కడ విశేషం.

కృష్ణరాయని తల్లి నాగలాంబ తెలుగింటి ఆడపడుచు.  కడప జిల్లా గండికోట ప్రభువైన పెమ్మసాని వారింటి కూతురు.  పెమ్మసాని పెద్ద ఓబళయ్య నాయకుని (చెన్నమ నాయకుడని కూడా ఈతని పేరు)కి చెల్లెలు.  ప్రౌఢదేవరాయల (రెండవ ప్రౌఢదేవరాయలు క్రీ.శ. 1423-46) సామంతుడు పెమ్మసాని తిమ్మనాయుడు.  నాగలంబ తండ్రి చెన్నమనాయకుని అన్న.  అతని కుమారుడు నాగలాంబ మేనల్లుడు రామలింగ నాయకుడు రాయలవారి సర్వసైన్యాద్యక్షుడు.  తన మేనబావను రాయలు ఉంచినాడు.  రాయలతల్లి తెలుగు వనిత అనేందుకు ఇది మరో సాక్ష్యం.  అచ్యుతరాయల తల్లి కూడా వీరి వంటిదే.  నరసనాయకుడు గండికోట విజయముతో ఈ పెళ్ళిళ్ళు చేసికొని ఉంటాడు.  నాగలాంబది చిత్తూరుజిల్లా పిచ్చాటూరు సమీపంలో అరిగండాపురమని, ఆ ఊరు రాయలు తరువాత నాగలాపురం అని మర్చాడని మరో అభిప్రాఅయం.  తాడిపత్రిలోని వేంకట రమణుని అసంపూర్ణాలయం సంపూర్ణంగా  నిర్మించిందని (కైఫీయత్తు ప్రకారం) ఈవిడ్ ఈ‌ ప్రాంతం దేమో‌ నని భావించారు.   చిత్తూరు జిల్లాకు చెందినదని మరొక అభిప్రాయం ఉన్నా - నాగమాంబ పేరిట నాగలాపురాలు అధికంగా ఉండి, ఇక్కడ ఈవిడ ఆభిజాత్యము కొంత అస్పష్టంగా ఉంది.   తెలుగు వనిత కావటం మాత్రం తథ్యం.  కృష్ణరాయని తండ్రి నరస నాయకుడు సాళువ నరసింగ భూపాలుని సైన్యాధిపతిగా తమిళ, కన్నడ దేశ దండయాత్రలు చేసాడు.  కొంతకాలం‌ శ్రీరంగపట్నం (మైసూరు దగ్గర) ఏలినాడు.  ఈ విషయం వరాహపురాణం చెప్పుతోంది.

రాయలు తన కూతుళ్ళిద్దరినీ తెలుగిళ్ల కిచ్చినాడు.  కందనవోలు (కర్నూలు) ప్రాంత రాజులైన అరివీటి వేంకటాద్రి రాజు అన్నలు రామరాజు తిరుమలాంబను, తిరుమలరాజు వెంగమాంబను పెళ్ళాడినారు.  వీరి తండ్రి రాయల వియ్యంకుడు.  అర్వీటి శ్రీరంగరాజు తుళువ నరస నాయకుని కాలానికే విజయనగర ప్రభువుల కాశ్రితుడై, రాయల కాప్తుడైనాడు.  నంద్యాల, వెలుగోటి, అవుకు, అర్వీటి, కూరసాని వంశీకులు లేదా పాలకులు రాయల పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.  ఈ‌ అంశం కృష్ణరాయ విజయం చెపుతుంది.

కృష్ణరాయని తండ్రి తుళువ నరస నాయకుడు తెలుగు రేడే అనటానికి మరిన్ని సాక్ష్యాలు చూపవచ్చు.  అతని భార్యలే కాక, ఆయన పోషించిన కవులూ తెలుగు కవులే.  ఈతనికి అంకితమైన ఆంధ్రవరాహపురాణం, నంది మల్లయ్య, ఘంట సింగయ్య కవుల రచన.  ఈ కవు లిద్దరూ తెలుగులో తొలి జంట కవులు.  వీరు కర్నూలు ప్రాంతీయులు.  వీరిలో సింగయ గురువు అఘోర శివాచార్యులు కదపలోని పుష్పగిరికి చెందిన వాడు.  వీరు తమ వరాహపురాణంలో, తమ తెలుగురేని వంశ వివరాలు వివరించారు.  ఈ కృతి అంకితం పుచ్చుకున్నప్పుదు నరస నాయకుడు శ్రీరంగపట్టణం దుర్గాధిపతి.  అతని సైన్యాధిపతి చిక్కరాయలు తిరుమలదేవి తండ్రి, కృష్ణరాయల మామ.  ఘంట సింగయ్య (మలయమారుత కవి బిరుదాంకితుడు)కి నంది తిమ్మన్న మేనల్లుడు.  ఈ విషయం నంది తిమ్మన్న తన పారిజాతాపహరణం (5-108)లో  పేర్కొన్నాడు.  నంది తిమ్మన్న అక్కడి నుండే, తిరుమల దేవిని రాయలు వివాహ మాడినాక, మహారాణితో పాటు విజయనగరం వచ్చి, రాయల కాప్తుడైనాడు.  రాణికి బాల్యం నుండే ఆప్తుడైన కుటుంబ బ్రాహ్మణుడు.   తిరుమలదేవి వెంబడి గయకు కూడా వెళ్ళిన (రాయలు నమ్మకంగా పంపిన) వాడు.  అక్కడ శాసనము వేయించిన వాడు తిమ్మన.  పైన పేర్కొన్న వారంతా తెలుగువారే. 

కృష్ణరాయల అన్న, అతనికి ముందుగా సింహాసనం వీర నరసింహ రాయలు తెలుగు రేడు.  బాల భారతం (వచనం), సౌభరి చరిత్రము (జక్కుల కథ), ద్విపద నారసింహ పురాణము రాసిన ప్రోలుగంటి చెన్నకవిని, వీర నరసింహ రాయలు ఆదరించినాడు.  వీరంతా తెలుగు కవుల కాశ్రయులే కదా!  హంపీ‌ నేలిన నాలుగు రాజ వంశములు తెలుగు ప్రభువులవే.

బళ్ళారి తెలుగు మండలము.  విద్యారణ్యుడు ఓరుగంటి రాజ్యపౌరుడు.  హరిహర బుక్కరాయ సోదరులు కాకతీయ దండనాథులు (కోశాగార ప్రతీహారౌ వీర రుద్రమహీపతే).  అళియ రామరాయల కాశ్రితుడైన ఇబ్రహీం‌ కులీ‌ కుతుబ్‌షా తెలుగు కవిత్వమునకు ఆదర మిచ్చి నాడన్నచో నాటి హంపీ రాజ్యరమ అచ్చమైన తెలుగురాజ్యముగా విలసిల్లినదే.  రాయ సింహాసనముపై రాయలకు ముందు పదముగ్గురు రాజులు (సంగములు ఎనిమిది మంది + సాళువలు ముగ్గురు + తుళువలు ఇద్దరు, వెరసి పదముగ్గురు) తెలుగు వారే.  విజయనగర (విద్యానగర) స్థాపన, (క్రీ.శ.1336)కు 173 ఏండ్ల సుదీర్ఘ పాలన తరువాత క్రీ.శ. 1509లో రాయలు పట్టం కట్టుకొన్న రాజు.  ఇది కన్నడ రాజ్యం ఎలా అవుతుందీ?

రాయల దేవేరి తిరుమలదేవి తెలుగింటి ఆడపడుచే.  రాయల మామ తన తండ్రి తరువాత విద్యానగర సింహాసన విధేయుడై శ్రీరంగపట్నం‌ ఏలినా, ఇక్కడ నుండి తుళువ నరస నాయకునితో వెళ్ళిన వాడే.  తనతో గల సఖ్యత కారణంగా, అతని కూతురిని తన రెండో కొడుకు రాయలకు నరస నాయకుడు పెళ్ళి చేసినాడు.  అంతే కాదు, అచ్యుత రాయలకు (తన మూడవకుమారుడు),  సకలం వారింటి ఆడపడుచునే కోడలిగా చేసుకున్నాడు.  ఇవన్నీ‌ తెలుగు కుటుంబాలే.

రాయసింహాసనము రాయలకు ముందు కన్నడ రాజ్యరమగా పేర్కొన బడుట ప్రాంతనామము గానే.  కేవల రాజ్య నామమే.  'తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి' అన్న శ్రీనాధుని మాటల్లో రాజ్యం పేరే కాని కన్నడ భాషార్థం లేదు.  అంతే కాదు, శ్రీనాధుడు కాశీ ఖండంలో ప్రౌఢ దేవరాయలను 'కర్నాటక్షితినాధ మౌక్తిక' అని పేర్కొనటంలో దేశవాచకమే ఉంది.   Krishnadevaraya of Vijayanagara and his Times  అనే గ్రంథంలో  డా. సూర్యనాథ్ యు. కామత్ గారు Krishnadevaraya calls himself also as Kannada Raya, poet Allasani Peddana  addresseed him as Kannnada Rajya Rama Ramana and this supports the view of his Kannada origin అని రాసారు.  సూర్యనాథ్ కామత్, జి.ఎస్. దీక్షిత్ వంటివారు చేసిన ఈ వాదనలలో కన్నడరాయ శబ్దాన్ని కృష్ణరాయల విశేషణంగా చూపి, రాయలు కన్నడం వాడని చెప్పే వీరి యత్నాలు ఈ‌ కారణంగానే తిరస్కరించవచ్చు.  కన్నడ దేశం, కన్నడ రాజ్యరమ వంటివి ఈ‌ పధ్ధతిలో వచ్చిన పదాలన్నీ దేశవాచకాలే‌ కాని భాషా వాచకాలు కావు.  పంచ భాషా ప్రదేశాలు హంపీ‌ సింహాసనం క్రింద, తెలుగు, తమిళ, కన్నడ, కొంకణ, తుళు భాషీయుల ప్రాంతాలు, కన్నడ రాజ్యరమ స్వంతాలు.  రాయసింహాసనాధీశు లందరికీ ఈ‌ పేరు వ్యవహారంలో ఉన్నదే.  ఒక్క కృష్ణరాయని కన్నడిగుని చేయటానికి పనికి వచ్చే ఆధారం మాత్రం ఇది కాజాలదు.  పశ్చిమ సముద్రాధీశ్వర, కర్నాటక రాజ్యధౌరేయ, కన్నడ రాజ్యరమారమణ ఇత్యాది సంబోధనలలోని కన్నడ శబ్దం, ఆయన రాజ్యపు హద్దులు లేదా రజ్యం నామాన్ని సూచిస్తుందే తప్ప ఆయన మాతృభాషను కాదు.   అల్లసాని చాటువు లోని 'కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర' అనటంలో అది దేశవాచకమే కదా!

'శ్రీకృష్ణరాయ దినచరి' అనే సమకాలీన కన్నడ గ్రంథంలో రాయలు కన్నడం వాడన్న ఆధారాలు ఏమన్నా రాయబడ్డాయా అంటే అదీ‌ లేదు.  (సూర్యనాథ్ కామత్‌గారిని ఫోన్‌లో సంప్రతించగా నాతో ఈ విషయం చెప్పారు.)

రాయలది తెలుగు కుటుంబమే అనడానికి మరో సాక్ష్యం, రాయల తాత ఈశ్వర నాయకుడు తన తల్లి పేరిట దేవకీ‌పురం రాయవెల్లూరు (తమిళ నాడు)  దగ్గర కట్టించి వేయించిన తెలుగు శాసనం.  ఇది మరో ప్రబలాధారం.

తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

అన్న ఆముక్తమాల్యద లోని పద్యంలో మొదటి రెండు పాదాలూ శ్రీకాకుళాంధ్ర విష్ణువే అన్నా, రాయలనోట, రాయల కలంలో నుండి వెళ్ళినవే.  అంతే కాదు, తమిళ, కన్నడ, ఆంధ్ర, ఓఢ్ర, కొంకణి, తుళు భాషా ప్రజల కధిపతులైన (ఎల్ల)నృపులున్న సభలో, 'దేశభాషలందు తెలుగే లెస్స' అని బాసాడటం రాయల తెలుగుదనాన్ని పట్టిస్తోంది.  ఇతర భాషీయులకు కన్నెర్ర కాకుండా, దేవునితో ఆజ్ఞాపింప జేసుకున్న వ్యూహం ఇది.  పైగా అందరి ముందూ 'బాసాడి నావని' జ్ఞాపకం చేసినాడు దేవుడు.ఈ సమర్ధన రాయల తెలుగు భాషాభిమానానికి , రాజనీతి చతురతకూ అద్దం పడుతుంది.  కృష్ణరాయలు మొత్తం ఏడు గ్రంథాలు రాసినాడు.  మదాలసచరిత్ర, సత్యావధూప్రీణనమ్‌, సకలకథా సార సంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి మొ॥కావ్యాలు సంస్కృతంలో రాసినాడు.  మరే భాషలోనూ‌ రచన చేయ లేదు తెలుగులో తప్ప.  కృష్ణరాయని జాంబవతీ పరిణయం అనే మరో సంస్కృతరచన దొరుకుతుంది.  తెలుగులో ఏకైక రచన ఆముక్తమాల్యద.  రాయల రచనలు ఇతర భాషల్లో లేవు.

రాయలు ఆంధ్రభోజుడు.  ఆయన కన్నడభోజుడో, తమిళభోజుడో కాదు.  తెలుగుకవితకు చలువ పందిళ్ళు కప్పినాడు.  భువనవిజయమున పట్టము కట్టినాడు.  గండపెండేరము తొడిగినాడు.  తెలుగు కవిని, పల్లకీలో -- తాను బోయీగా -- మోసినాడు.  అష్టదిగ్గజము లనెడి కవికూటమి తెలుగులో తప్ప, మరే భాషలోనూ లేదు.  అష్టదిగ్గజములలో ఆంధ్రేతర కవిదిగ్గజములు లేరు.  అష్టదిగ్గజము లన్న మాట, ఆంధ్రేతర సాహితీవేత్తలు ఎరుగరు.

భువనవిజయ సభాభవన మని చెప్పబడే విద్వత్కవితా గోష్టీమందిరము లోని కవుల ప్రశంసలు, అంతఃకలహములు, విజయములు, సమస్యాపూర‌ణములు, పరకవి ఖండనములు, మొత్తం 80 పైగా చాటువులు లభిస్తున్నాయి.  ఇవన్నీ తెలుగులోవే.  గోష్టులు తెలుగులోనే జరిగేవి అనటానికి ఇదొక సాక్ష్యం.  చాటువులు ఇతర దేశీయ భాషలలో లేవు.  రాయల విద్వద్గోష్టి కన్నడంలో జరిగినట్లు ఒక్క సాక్ష్యమూ లేదు.

యుధ్ధాలు చేస్తున్నప్పుడు యుధ్ధపటాలంలో కృష్ణరాయలు వెంట తీసుకొని పోయినాడు.  యుధ్ధభూమిలో సాహిత్యగోష్టులతో పాటు క్లిష్టస్థితిలో సలహాలు తీసుకోవటం కోసం కావచ్చు.  "హితులు భిషగ్గహజ్ఞ బుధబృంద కవీంద్ర పురోహితుల్" అని రాయలు అముక్తమాల్యదలో రాజనీతిలో చెప్పినాడు.  తెలుగు కవులతో‌ క్లిష్టసమయాలలో సంభాషించే‌రాయని మాతృభాష తెలుగు కాక మరొకటిగా ఉండదు. 

సమకాలీనుల రాతలను బట్టిరాయల దేవేరుల ఇండ్లలో తిరుమలదేవి ఇంట తప్ప మిగతా అంతఃపురమంతా తెలుగే మాట్లాడబడేదని, రాయల ఆస్థానంలో కూడా తెలుగే మాట్లాడబడేదనీ తెలుస్తోంది.  రాయలు శ్రీరంగపట్టణ పాలకుడైన తన తండ్రి కాప్తుడైన, తన మామ ఐన సైన్యాధిపతి కుమార వీరయ్యను శ్రీరంగపట్టణాధిపతిగా క్రీ.శ. 1512లో ప్రతిష్టించినాడు.  ఆయన కూతురు తిరుమలదేవిని అప్పటికే వివాహమాడినాడు.  ఈమె కన్నదపు రాచకాంత కాదు.  వీరయ్య రాయల తండ్రికి ఆప్తుడు.  తెలుగునేల నుండి అతడితో వలస వెళ్ళిన వాడే.  ఈవిడ వలన కృష్ణరాయనికి కలిగిన కుమార్తె మోహనాంగి తెలుగు కవయిత్రిగా ప్రసిధ్ధురాలు.  మోహనాంగి మాతృభాషలోనే (పితృభాష కూడా) 'మారీచీ పరిణయం' రాసింది.  ఈవిడకు తిరుమలాంబ అని పేరు పెట్టబడ్డా, రాయడు ఒకే పేరుతో భార్యనూ కూతురిని పిలవతం బాగుండదని, ఆమెను మోహనాంగి అని పిలిచేవాడు.  ఈమెను అళియ రామమరాయల కిచ్చి పెళ్ళి చేసినాడు.  రాయల తెలుగు తనము, తెలుగు కవితాభిమానముతో ఈమె తెలుగు కవయిత్రి కాగల్గినది.  ఈమె సమస్యాపూరణంలో‌ దిట్ట.  రాయలే ఈమె కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు.  ఇవన్నీ మోహనాంగి తన గ్రంథంలో చెప్పింది.  కన్నడ వాతావరణంలో పుట్టిన మోహనాంగి తెలుగు కావ్యం రాసిందంటే, తండ్రి తెలుగువాడు, పెరిగిన వాతావరణం తెలుగు అనే కదా.

గుత్తిలో విస్తర్లు కుట్టి, చంద్రగిరిలో భిక్షాటన చేసి, పెనుగొండలో సత్రాల్లో పనులు చేసి కూడు సంపాదించి, తెలుగురాజుల తాంబూలపు తిత్తులు మోసి బ్రతుకు నడుపుకున్న తిమ్మరుసు తెలుగువాడే. అవన్నీ తెలుగు దుర్గాలే.


కం. అయ్య అనిపించి కొంటివి
నెయ్యంబున కృష్ణరాయ నృపపుంగవు చే
అయ్యా నీ సరి యేరీ
తియ్యని విలుకాడ వయ్య తిమ్మరుసయ్యా

అన్న చాటువు రాయలు తిమ్మరుసును అయ్య (అప్ప) అన్నాడనీ, తిమ్మరుసు రాయలను తండ్రిలా రక్షించాడనీ చెప్తోంది.  రాయలు తెలుగు ప్రాంతం లోనే బాల్యం గడిపాడని దీనితో చెప్పవచ్చు.  రాయలు వికృతినామ సంవత్సరంలో క్రీ.శ. 1470లో జన్మించాడు అని ఒక వాదం.  క్రీ.శ. 1440 ప్రాంతంలో జన్మించిన తిమ్మరుసు రాయల కంటె 30 ఏళ్ళు పెద్దవాడు.  సాళువ నరసింహరాయల ప్రధానామాత్యుడు నాందెండ్ల చిట్టిగంగనామాత్యుని వద్ద శిష్యరికం చేసాడు.  కృష్ణరాయని తండ్రికి సమకాలీకుడు, సమవయస్కుడు, ప్రధాని - ఇతని పెంపకం లోనే రాయలు రాజోచిత విద్యలు, శాస్త్రాలు, యుధ్ధశిక్షణ పొందాడు.  ఇద్దరూ తెనాలి వెళ్ళిన విజయ శాసనం ఉంది.  అప్పటికే రాయలు యువకుడు.  ఇతని కారణంగా రాయల బాల్యం చంద్రగిరిలో గదచిందని చెప్పవచ్చు.  రాయలకు తిరుమల వేంకటేశ్వరుడు ఇష్టదైవం కావటానికి ఆయన చంద్రగిరి జీవితం ఒక కారణం కావచ్చు.

చంద్రగిరిలో కృష్ణరాయని తండ్రికి సఖుడై, ఆమాత్యుడై, అత్మీయుడై, మహామంత్రి యైన తిమ్మరుసు మార్గదర్శనంలో చంద్రగిరి, హంపీ నగరములలో పెరిగిన కృష్ణరాయలు తెలుగు వాడే కదా!

రాయలు చక్రవర్తిగా తన సామంతరాజ్యాలైన తంజావూరు, చేంజి, మధుర, మైసూరు వంటి తెలుగేతర ప్రాంతాలకు తనకు ఆత్మీయులైన తెలుగు దళనాయకులను, నాయంకరులనే పంపినాడు.  నాడు ఇవన్నీ తెలుగు రాజ్యాలు, తెలుగు అధికారభాషగా గల్గిన రాజ్యాలు.  తెలుగు సామంతులు దండనాథులు, నాయంకరులు,  పాలెగాళ్ళు, కోవెల పారుపత్తేగాళ్ళు, పూజారులు, కవి పండితులు దక్షిణదేశ మంతా  విస్తరించి, నేడు భారతదేశంలో తెలుగు అత్యధికులు మాట్లాడే భాషగా, తెలుగు కుటూంబాల విస్తరణలో భాగంగా నిలిచినారు.  దీనికి కారణము కృష్నరాయని తెలుగు తేజమే.

రాయలకు ఇంటిపేరు, రాయలకు ఊరిపేరు ఉన్నాయి.   తెలుగు వారికి మాత్రమే, ఇంటిపేరు ఉంటుంది. వీటిని అల్లసాని పెద్దన్న పేర్కిన్నాడు.


రాయరావుతు గండ రాచయేనుగు వచ్చి
యారట్ల కోట గోరాడు నాడు
సంపెట నరసాల సార్వభౌముడు వచ్చి
సింహాద్రి జయశిల చేర్చు నాడు
సెలగోలు సిహంబు చేరి ధికృతి గంచు
తల్పుల కరుల ఢీ కొల్పునాడు
ఘనతర నిర్భర గండ పెండేరమిచ్చి
కూతు రాయలకిచ్చి కూర్చునాడు

ఒడ లెరుంగవొ చచ్చితొ యుర్వి లేవొ
చేరజాలక తలచెడి జీర్ణమైతొ
కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర
తెరచి నిలు కుక్క సొచ్చిన తెరగు దోప

సంపెట నరసాలు అని రాయల ఇంటి పేరుగా, సెలగోలు సింహమని కృష్ణరాయల  గ్రామం పేరుగా సూచించినాడు.  సంపెట ఇంటివారు తెలుగువారు.  సమ్మెట, సంబెట అని నామాంతరాలు.  క్రీ.శ.  1417 ప్రాంతంలో కడపజిల్లా పులివెందుల తాలూకా పేర్నిపాడు పాలించిన సమ్మెట సోమనృపాలుడు (2) కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా గుండ్లూరు (శాసనం) పాలించిన సమ్మెట లక్కయదేవని కుమారుడు సమ్మెట రాయదేవుడు (సంగమవంశీకుడు ఇతడు) ప్రౌఢదేవరాయల సామంతులే.  వెలుగోటి వంశావళిలో పేర్కొనబడిన క్రీ.శ. 1361నాటి సమ్మెట కొండ్రాజు, సాళువ నరసింహరాయల అనగా కృష్ణదేవరాయల తండ్రికి, సమకాలీకులైన సమ్మెట శివరాజు,  సమ్మెట వీరనరసింహరాజు (ఎర్రపాడు ప్రభువులు), సింగభూపాలుని కుమారుడు అనపోతానీడు గెల్చిన సంబెట భూనాధుడు (ఎవ్వరో తెలియదు) బహుశః సమ్మెట సోమనృపాలుడు (వెలుగోటి వంశావళి చెప్పింది 'సంబెట భూనాధ సప్తాంగ హరణ' అని) మొ॥ వారు రాయల వంశీకులే.  సంపెట, దుంపెట వంటి గ్రామనామాలు తెలుగునాట ప్రసిధ్ధం.   సెలగోలు = సెలగ + వోలు గా భావించవచ్చు.  వోలు అనేది ప్రోలుకు రూపాంతరం.  గ్రామం / నగరం అని అర్థం.  ఒంగోలు, నిడుదవోలు, భట్టిప్రోలు ఈ అన్ని (మూడు) రూపాంతరా లున్నాయి.   సెల = నీటి బుగ్గ.  (తెలంగాణలో జెల) సెలయేరు లోని సెల - లేదా చెలమ సెలిమ - నీటి బుగ్గ కల ఊరు.  సెలక - సెలగ - చేను, లేదా సెలగ - చణక - శనగ అన్న అర్థంలో ఈ గ్రామం ఉండి ఉంటుంది.  మహాచక్రవర్తికి ఇంటి పేరు సూచించేంత అవసరం రాదు గనక మరుగున పడ్డా అల్లసాని గజపతీంద్రుణ్ణి హీనునిగా, రాయలను ఉన్నతునిగా చిత్రించేందుకు, నాలుగు పాదాల సీసపద్యంలో రెండు పాదాలు చరిత్రకు వాడుకున్నాడు.  అంతే కాదు,  'కన్నడం‌ బెట్లు సొచ్చెదు గజపతీంద్ర' అన్నప్పుడు, ఇది నేను ఇంతకు ముందే చెప్పినట్లు, దేశవాచకంగానే గాని భాషావాచకంగా లేదని సమకాలీనాధారం రుజువు చేస్తోంది.

స్వయంగా రాయల కూతురు మోహనాంగియే, తన మారీచీపరిణయం గ్రంథంలో, రాయలు తెలుగువాడేనని కంఠోక్తిగా చెప్పింది.

చ. తెనుగునృపాలుడై, నరపతిత్వము గల్గిన వీరభద్రుని పు
త్రిని, మరి యోధుడై గజపతిత్వము గల్గు ప్రతాపరుద్ర పు
త్రిని, వరించియుం, తురక రేడగు నశ్వపతీశు పుత్రి గై
కొనక నృసింహకృష్ణు డొన గూర్చెను బంక్తిని బక్షపాతమున్

తెలుగు నృపాలుడని కృష్ణరాయని ముద్దుల కూతురు మోహనాంగే చెప్పుతుంటే, కాదూ అని వాదుకు వస్తే పిచ్చి వాడనాలి కదా!

రాయలు తన హయాంలో హంపీలో సుమారు 20 శాసనాలు తెలుగులో వేయించినాడు.   తిరుపతిలో వేయించిన సంస్కృత శాసనాలు తెలుగులిపిలోనే ఉన్నాయి.  అంతే కాదు, తాను తిరుమలదేవి, నంది తిమ్మనలతో (బీహార్ రాష్ట్రంలోని) గయకు వెళ్ళి, పితృకర్మలు నిర్వర్తించి, వేయించిన శాసనం తెలుగులోనే ఉంది.  శక.సం. 1444 ( క్రీ.శ. 1521) జూలై  2  నాడు వేయించినది  ఈ శాసనం.  నంది తిమ్మన పారిజాతాపహరణం పద్యం కూడా శాసనంలో ఉంది.  తాను తెలుగువాడే కాకుంటే, గయలో (తెలుగు, కన్నడం కాని చోట) తెలుగులో శాసనం ఎందుకు వేయిస్తాడు?  మాతృభాషపై మమకారం కాదా ఇది?

కృష్ణరాయని చరిత్రకు ఆకరాలు బోలెడు.  పరిష్కారాలు బోలెడు.  వివాదాలూ అన్నే ఉన్నాయి.  రాయవాచకము, కృష్ణరాయవిజయము, పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద, మారీచీపరిణయము, మనుచరిత్రము, తిమ్మరుసు బాలభారత వ్యాఖ్య, సంగీతసూర్యోదయము, అచ్యుత రాయాభ్యుదయము, తిమ్మణ భారతము వంటి కావ్య శాస్త్ర గ్రంథములు, వంశాను చరిత్రములు, శతాధిక శాసనాలు, అనుయాయుల, అధికారుల శాసనాలు, ముస్లిం రాజసభా లేఖనాలు, విదేశీయుల రాతలు వంటివి అనేకంగా ఉన్నవి.  విరుధ్ధాంశాలు కూడా ఉన్నాయి.  పట్టాభిషేకవత్సరం, జననమరణాలు, భార్యలసంఖ్య, పుత్రమరణం, తల్లిచరిత్ర వంటివి ఉన్న పలువురు చారిత్రకుల సమన్వయ నిర్థారణము ప్రకారము కృష్ణరాయలు క్రీ.శ. 1484లో పుట్టి, క్రీ.శ.1509లో అన్నగారి మరణానంతరం (లేదా అన్నగారు మరణశయ్యా గతుడైన తరువాత) హంపీ విరూపాక్షస్వామి కోవెలలోని వాకిలిలో కృష్ణజన్నాష్టమి నాడు (07-08-1509న) పట్టాభిషేకం చేసుకున్నాడు.  రాయలవారి పట్టాభిషేకానికి పంచశత వత్సరపు పండగ చేసుకున్నాం.  అతని తొలి అధికార శాసనం ఆగష్టు 9వ తేదీన క్రీ.శ. 1509 అనగా నేటికి 500 సంవత్సరాల క్రిందటిది లభిస్తోంది.   ఈతని ఛత్రఛ్ఛాయలో తెలుగు కవిత నందనోద్యానలతయై నవరత్న రాశి విజయనగర పురవీధుల అంగళ్ళలో సరుకై, తెలుగు పౌరుషము గోదావరీ, కృష్ణా, కావేరీ నదీ‌ మధ్య భూమిపతుల కోటగుమ్మాలపై ధ్వజమై, వితరణ దక్షిణ భారత దేశ దేవాలయ గోపురకాంతి రాశియై శోభిల్లినది.  కృష్ణరాయల వంటి ఉత్తమ చక్రవర్తి మరొకడూ లేడు - తెలుగు భాష వంటి మధురమైన భాష మరొకటీ లేదు.

- వ్యాస రచయిత  
డా॥ సంగనభట్ల నర్సయ్యగారు. (ఫోన్. 944 007 3124)
d r s n a r s a i a h @ g m a i l . c o m
విశ్రాంత ప్రాచార్యులు,
శ్రీలక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల,
ధర్మపురి, కరీంనగర్ జిల్లా.

11 కామెంట్‌లు:

  1. తిమ్మయ్య భార్య దేవకిదేవి సాయపనేనివారి ఆడపడుచు అని, రాయలవారి తల్లి పెమ్మసాని వారి ఆడపడుచు అని నిర్దారించే ఆధారాలు చూపించగలరా ?

    రిప్లయితొలగించండి
  2. తిమ్మయ్య భార్య దేవకిదేవి సాయపనేనివారి ఆడపడుచు అని, రాయలవారి తల్లి పెమ్మసాని వారి ఆడపడుచు అని నిర్దారించే ఆధారాలు చూపించగలరా ?

    రిప్లయితొలగించండి
  3. చాలా చక్కటి సమాచారాన్ని ఇచ్చారు. కాక పోతే చిన్న పొరపాట్లు మీరూ ఏమీ అనుకోక పోతే సవరించుకోగలరు.

    శ్రీకృష్ణదేవరయల తల్లిగారు నాగాంబ పెమ్మసాని వారి ఆడపడుచు అని రాశారు. అది తప్పు. మీరు చెబుతున్న పెమ్మసాని వారి ఆడపడుచు పేరు కూడా నాగమ్మే ఈమెది గండికోట ఈమెను దీపాల నాగి అని పిలుస్తారు. గండికోట చరిత్రలో ఈమె ప్రస్తావన కనిపిస్తుంది.

    రాయల వారి తల్లి గారి గ్రామం అరిగండాపురమే దానినే నేడు నాగులాపురం అని పిలుస్తున్నారు శ్రీ రాయల వారు పుట్టింది కూడా ఇక్కడే. ఇది చిత్తూరు జిల్లాలో వుంది. తన తల్లి జ్ఞాపకార్థం అక్కడే చిన్న దేవాలయం గా వున్న వేదనారాయణ స్వామి దేవాలయాన్ని 12 ఎకరాలలో పునరుద్దరించారు. ఇప్పటికీ వారి వంశీయులే అక్కడ ధర్మకర్తలుగా వుంటున్నారు. రాయల వారి తల్లి నాగులాంబ గాజుల వారి ఇంటి ఆడపడుచు. వీరు వజ్రాల వ్యాపారులు. వీరి వంశికులెవరు కూడా సైన్యాధిపతులుగా పని చేయలేదు. అందుకే వారి వివరాలు చరిత్రలో కనిపించవు.
    పెరులోని సారూప్యతను బట్టి దీపాల నాగిని రాయల తల్లి నాగాంబ అగా చాలమంది పొరపాటు పడుతున్నారు. నాగాంబ ఉన్నత వంశము నుండి వచ్చినది.

    రిప్లయితొలగించండి
  4. http://www.dailymotion.com/video/xj7eqm_miracle-at-nagalapuram-veda-narayanaswami-temple_news
    ఈ లంకె ను పరిశీలించ గలరు

    రిప్లయితొలగించండి
  5. ఈ‌వ్యాసకర్త సంగనభట్లగారు. వారికి మీ‌ అభిప్రాయం పంపగలరు.

    రిప్లయితొలగించండి
  6. తిమ్మయ్య లేక తిమ్మరాజు భార్య దేవకిదేవి సాయపనేనివారి ఆడపడుచు అనడానికి,నరసరాజు భార్య నాగాంబ పెమ్మసానివారి ఆడపడుచు అనడానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.

    నరసరాజు భార్య నాగాంబ గాజులవారి ఆడపడుచు
    అనడానికి కూడ ఎటువంటి ఆధారాలు లేవు

    అధారాలు వున్నాయి అనుకుంటె పై వ్యాస రచయిత సంగనభట్ల

    నరసయ్యగారు మరియు దూపం అభిగారు ఇక్కడ వెల్లడించాలి.

    రిప్లయితొలగించండి
  7. నాగులపురం వికిపిడియాలొ ఇచ్చిన( నాగులదేవి గురించి చెప్పినవని చెప్పబడిన ఆధారాలు)ఆధారాలు పుర్తిగా తప్పు.

    రిప్లయితొలగించండి
  8. కురివి వెంకటరావుగారు రాసిన "పోర్చుగీసుడైరీస్" అనే పుస్తకంలో "స్యూయల్" తన డైరీ లో శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగాంబ తండ్రి వజ్రాల వ్యాపారి అని రాసుకున్నట్లు రాశారు. ఇక రెండు "బావయ్య చౌదరి" రాసిన "కమ్మవారి చరిత్రలో" పెమ్మసాని రామలింగనాయుడు తండ్రి తిమ్మనాయుడును గండికోటలో వున్న పెమ్మసాని అనే భోగగత్తె పెంచి పెద్దచేసిందని రాశారు. ఇక మూడు కాకినాడ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యం లో వున్న 20 పేజీల రామలింగనాయుడు అనే పుస్తకంలో గండికోటలో వున్న పెమ్మసాని కుమార్తె నాగమ్మ అని ఆమెను దీపాల నాగి అని పిలిచే వారని రాశారు.

    ఇవేవీ తెలియకుండా చాలామంది గండికోట దీపాలనాగమ్మను శ్రీకృష్ణదేవరాయల తల్లి అని రాయడంతో మీ లాంటివారు చాలామంది పొరపడుతున్నారు. చరిత్ర నిర్మాణంలో పొరపాట్లు సహజం. వాస్తవాలు తెలిసినప్పుడు వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం వుంది.

    రిప్లయితొలగించండి
  9. వజ్రాల వ్యాపారి అంటే ఒక బలిజ కులస్తుడని మాత్రమే కాదు.ఏ కులస్తుడైన కావచ్చు.ఆనాడు అనేక కులాలకు చెందిన వారు వ్యాపారాలు చేసినారు అందుకు అనేక శాసనా ఆధారాలు ఉన్నాయి.

    అన్ని చారిత్రక ఆధారాలు నాగాంబ ధర్మపత్ని అని పేర్కొన్నాయి.ధర్మపత్ని హొదా స్వకుల వనితలకు మాత్రమే వుంటుంది.నాగాంబ ఒక క్షత్రియ వనిత.వారి వంశము ఇప్పటికి ఉన్నది.

    రిప్లయితొలగించండి
  10. page 179

    No 38.

    Nanjangud Taluk

    1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha
    2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam
    3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra
    4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu
    5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba
    6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara
    7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
    8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de
    9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya
    10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina
    11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo
    12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........



    Translation -----------

    Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............



    Note ----


    -It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............


    Annual Report of the Mysore Archaeological Department for the 1930
    University of Mysore ,
    Banglore
    1934.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.