14, ఆగస్టు 2013, బుధవారం

పాహి రామప్రభో - 188

పూజావిధానంలో గంధం సమర్పించుకోవటం అన్న ఉపచారం తరువాత మరి రెండు అదనపు ఉపచారాలు 1.అక్షతలు, 2. ఆభరణములు సమర్పించటం‌కూడా తరచు కనిపిస్తోంది.

అక్షతలు
తే. అక్షతంబన బరగు  బ్రహ్మంబు వీవె
అక్షతము లౌచు నిన్ని జన్మంబు లందు
అహము మమతయు నా కబ్బు నవియె ప్రీతి
అక్షతల జేసి పూజింతు నయ్య రామ

తాత్పర్యం.  ఓ‌ శ్రీరామచంద్రా, సృష్టిలో ప్రతీదీ‌ క్షతమే - అంటే - ఏదో ఒక విధంగా కాలం చేత కొట్టబడిందే.  ఆలా కొట్టబడని అక్షతమైన తత్వము సాక్షాత్తూ బ్రహ్మము వైన నీవే.  ఐతే నా వద్ద రెండు అక్షతలు ఉన్నాయి.   ఒకటి అహంకారం, మరొకటి మమకారం - ఈ‌ రెండూ‌ జీవుడనైన నన్ను జన్మజన్మల్లోనూ వదలకుండా వెంట బడుతున్నాయి.  ఈ‌ రెండింటినీ‌ మాత్రం‌ కాలం ఏమీ‌ బాధిస్తున్నట్లు తోచదు.  ఈ రెండు అక్షతలనూ సంతోషంగా నీకు పూజార్థం సమర్పించుకుంటున్నాను.  వీటిని నీవే చక్కగా వినియోగించు.  (నా అహంకార మమకారాలను సరియైన దారిలో నడపమని రాములవారిని వేడుకుంటున్నానని అర్థం)

(ఆగష్టు 2013)