1, ఆగస్టు 2013, గురువారం

ఈ‌ రోజున మనస్సు ఏమీ బాగోలేదు.

ఈ రోజున మనస్సు చాలా అశాంతికి గురై ఉంది.  చివరికి భాగవతం‌ చదువుకుందామన్నా ఈ‌ అశాంతితో దృష్టి నిలవటం లేదు.

ఘోరాతిఘోరంగా ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా నామాలు విభజిస్తూ సాగిన లలితాసహస్రనామపారాయణం ఒక కారణం.  ఈ‌ మధ్య ఇలా లలితాసహస్రం పారాయణం చేయటం ఒక ఫేషన్ అయిపోయింది. ఈ మహత్తర కార్యక్రమం చేసేందుకు కొన్ని సమాజాలూ‌ బయలుదేరాయి.  వాళ్ళేం‌ చదువుతున్నారో, దానిని ఎలా సరిగా ఉఛ్ఛరించాలో వాళ్ళకు ఎంతమాత్రం అవగాహన ఉండదు. చాలా చోట్ల అక్షరాలను తప్పుగా ఉఛ్ఛరిస్తారు.  వాళ్ళు, సాధారణంగా అనుష్టుప్పులు చదివే ధోరణిలో‌, దంపుళ్ళపాటలాగా లలితానామసహస్రం చదువుకుంటూ‌ పోతారు. ఏ నామం ఎక్కడ మొదలవుతోందీ‌ ఎక్కడ సరిగా ముగుస్తుందీ‌ అన్నది జాగ్రత్తగా గమనించరు. నిజానికి అలా గమనించుకోవాలన్న స్పృహ వాళ్ళకు ఉండనే ఉండదు. ఒకవేళ ఎవరికైనా కొంచెం ఉన్నా, తెలియదు. లలితా సహస్రంలో కొన్నినామాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. అందులో కొన్ని పాదం అంతా నిండి కూడా ఉంటాయి. అవి వీళ్ళు చిత్తం వచ్చినట్లు ముక్కలు ముక్కలు చేస్తుంటే వినలేక ప్రాణం గిలగిల్లాడుతుంది.

లలితా సహస్రంలో ఒక నామం 
    లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా
ఈ‌ నామాన్ని పట్టుకుని రెండు ముక్కలు చేసి
   లక్ష్యరోమా లతాధారా  తాసమున్నేయ మధ్యమా
అని పలికితే వినవలసిరావటం ఎంత దౌర్భాగ్యం!

ఇలాగే పాదం అంతా నడిచేవి ఇంకా చాలా నామాలున్నాయి లలితా సహస్రంలో.
    నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా
    చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
    కురువిందమణీశ్రేణీకంత్కోటీరమండితా
    అష్టమీచంద్రవిభ్రాజదళీకస్థలశోభితా
    మృగచంద్రకళంకాభమృగనాభవిశేషికా
    వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా
    వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
    నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
    తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
    కందంబమంజరీకప్తకర్ణపూరమనోహరా
    తాటంకయుగళీభూతతపనోడుపమండలా
    పద్మరాగశిలాదర్శిపరిభావికపోలభూః
    నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనఛ్ఛదా
    శుధ్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్వలా
    కర్పూరవీటికామోదసమాకర్షదిగంతరా
    నిజసల్లాపమాధుర్యవినిర్భిత్సితకఛ్చపీ
    మందస్మితప్రభాపూరమజ్జాత్కామేశమానసా
    అనాకలితసదృశ్యచుబుకశ్రీవిరాజితా
    కామేశబధ్ధమాంగల్యసూత్రశోభితకంధరా

ఇత్యాది.  ఈ‌ నామాలన్నింటినీ ఈ పారాయణసమాజం మనుషులు చిత్తం వచ్చినట్లు విరిచిపోగులు పెడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. 

అలాంటప్పుడు, అక్కడ ఉండటం దుర్భరం అనుకుంటే బయటకు పోవచ్చును కదా? అలా కూడా చేయటానికి వీల్లేకుండా పెద్ద వానొకటి బయట.

ఇదివరలో ఇలాంటి అనుభవమే అదే స్థలంలో కలిగింది.  అప్పుడు వచ్చిన పారాయణసమాజం‌లో నాయకురాలొకావిడ నామాలకు అర్థం కూడా సెలవిచ్చారు.  ఆ దారుణం మాటల్లో కూడా వివరించలేను!

లలితా పారాయణం అయ్యేది మరొకటయ్యేది, సరిగా పారాయణం చేసే విధానాన్ని పెద్దల దగ్గర కొన్నాళ్ళు కూర్చుని వారి సహాయంతో అభ్యాసం చేసి మరీ పదిమందిలో పారాయణం నిర్వహించటం చేయాలి.  అలా నిష్ణాతులైతే మరొక పది మందికి నేర్పించవచ్చును కూడా.  కాని ఈ పెద్దమనుషులు అలాంటి పనులేం చెయ్యరు.  చేత్తో పుస్తకం పుచ్చుకుని సరాసరి జనం మీద పడటమే.

అమ్మవారి నామసహస్రం చేయాలని బయలు దేరి సరిగా శ్రధ్ధగా చేయకపోతే ఎలా?

మనస్సును మరింత అస్థిమితానికి గురిచేసిన తరువాతి కార్యక్రమం. వేదపారాయణం.  మీరు సరిగ్గానే చదివారు.  వేదపారాయణమే.  శన్నో మిత్రతో మొదలు పెట్టి పురుషసూక్తం వగైరా చదివారు.  ఎవరూ వేదం నేర్చుకున్న వాళ్ళూ కాదు ఏమీ‌ కాదు. ఇవన్నీ‌ ఈ రోజుల్లో పూజల పుస్తకాల్లో అచ్చువేస్తున్నారు కదా అవి ముందు పెట్టుకుని చిత్తం వచ్చినట్లు ఎవరి ధోరణిలో వారు గడబిడగా చదివేయటమే అన్నమాట.  ఇలా చేయకూడదు వగైరా వాదనలు వాళ్ళముందు పని చెయ్యవు. అందుకని ఊరుకో వలసిందే. వినలేక పోతే పోవాలి బయటకు.  కాని బయట పెద్ద వాన కదా?

నా మనస్సు బాగో‌క పోవటానికి ఇంకొక కారణం, ఆ పారాయణ కార్యక్రమం, వేదపఠనం అనే మహత్తరకార్యక్రమాల తరువాత జరిగిన గొప్ప భజనతంతు.  

ఈ రోజుల్లో బోలెడంతమంది గురువులు.  అందులో కొందరు జగత్పసిధ్ధులు. వాళ్ళకు చెప్పనలవి కానంత ఫాలోయింగు. ఈ గురువులు దేవుళ్ళుకూడా. పెద్ద పెద్ద సంస్థలే నడుస్తూ ఉంటాయి యీ గురువుల పేరిట జగత్కల్యాణార్థమై.అందరికీ ఒక్క విషయం తెలిసే ఉంటుంది. నాబోటి మీబోటి వాడు చేయగింది వీలయితే నలుగురితో‌ పాటు నారాయణా అని జైగురుదేవా అనటం. కాకపోతే నోర్మూసుకుని కూర్చోవటం అంతే.  వాదనలూ‌ ప్రతివాదనలూ దండగమారి కార్యక్రమాలు.

ఎవరు వ్రాస్తారో తెలియదు.  తలాతోకా లేని భజనకీర్తనలు ఈ గురువులూ నయాదేవుళ్ళ కోసం చేసే భజనల్లో పాడటానికి. 

పత్రికలవాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా అన్ని పేజీల నిండా వార్తలు ఎలా రాస్తారా అని చిన్నప్పుడు తెగ హాశ్చర్యపోయేవాడిని.  తరువాత తెలిసింది వార్తలు పదునుగా కావలసిన మసాలాలతో కావలసిన పరిమాణంలో వండటం అనే విద్యకూడా ఉంటుందని. అవసరమైన చోట సోది చేర్చి వార్తను నింపుతారు.

భజన కీర్తన రాయాలంటె ఒక పల్లవీ, కుదిరితే ఒక అనుపల్లవీ, కనీసం రెండో మూడో చరణాలూ కూర్చాలి. వాటిలో విషయం లేకపోతే‌ పాట ఎలా తయారవుతుందీ.  అలా కూర్పు చేయటానికి ఈ‌ భజన కీర్తనల్లో కాలమ్‌ ఫిల్లర్స్ లాగా అనూచానంగా వస్తున్న బోలెడు సాంప్రదాయకమైన సామాగ్రి ఉంది.  అదంతా వాడుకోవచ్చు.

మాటవరసకు ఒక పాత భజన కీర్తనను ఎడిట్ చేసి, అది వినాయకుడి మీద కీర్తన అనుకోండి గణనాథా అన్న మాట పీకేసి గురునాథా చేయటం, ఇంకా కొన్ని మాటలకు అదే‌ శైలిలో ప్రత్నామ్నాయంగా మాటలు వేయటం చేస్తే మన గురువుగారిమీద మంచి భజన కీర్తన సిథ్థం. 

మరీ‌ అంత తేలిక కాదను కోండి. కోంచెం ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. కాని అదేమీ‌ బ్రహ్మవిద్య కాదు కదా.

మీరంతా గమనించే ఉంటారు, ఇదేదో‌ పేరడీ‌ వ్యవహారం కదా అని. అలాంటిదే.  అయ్యప్ప, వేంకటేశ్వరస్వామితో సహా అందరు దేవుళ్ళ మీదా సినిమాపాటలు ఆధారంగా అలాంటి పేరడీ‌ భక్తి గీతాలు బోలెడు వచ్చాయి.

ఇలాంటి భక్తి గీతాలు వండేటప్పుడు పాతకాలం నాటి శ్రీరాముడూ,శ్రీకృష్ణుడూ, విష్ణుమూర్తీ, శివుడూ వగైరా దేవుళ్ళంతా ఎవరికి చేతనైన సాయం వాళ్ళు చేస్తారు. ఆ పాతదేవుళ్ళంతా తమతమ నామరూపగుణవిక్రమకీర్తిచరిత్రవిశేషాలన్నీ మన గురుదేవుడి లేదా నయాదేవుడి ఖాతాలోకి జబర్దస్తీగా జమచేసుకుందుకు అనుమతి ఇచ్చేస్తారు. ఎందుకు ఇవ్వరండీ?  ఆ పాతదేవుళ్ళంతా మన కొత్త గురుదేవుడి పాత అవతారాలే‌కదా.

ఇలాంటి దుర్భరభజన కార్యక్రమంలో కూర్చోవటం‌ నాకైతే నరకం.  కాని, బయట వాన కారణంగా చచ్చినట్లు కూర్చోవటమే జరిగింది.

ఇలా విమర్శగా అన్నందుకు కొంతమందికి నామీద కోపం కూడా రావచ్చును.  దానికి నేనేమీ చేయలేను.

చివరికి కార్యక్రమం జయప్రదంగా ముగిసి, ఇంటికి వచ్చినా అశాంతి మనస్సునుంచి తొలగించటం నావల్ల కావటం లేదు.

తెలిసి దైవాపచారం జరిగే చోట ఉన్నందుకు అశాంతి కలిగిందేమో!

కొందరు అనవచ్చును.  ఎలా చేస్తే ఏమీ భక్తి ముఖ్యం కదా, వాళ్ళకు చేతయింది చేసారు. నువ్వే అనవసరంగా ఏదో గొప్పవాడిలాగా ఫీలయిపోతూ లేనిపోని అశాంతిని సృష్టించుకున్నావూ అని.  కొంచెం తెలిసినవారైతే‌ మరికొంత మెట్టవేదాంతం కూడా జోడిస్తారు.  తిన్నడులాంటి వాళ్ళు నీలాగా శాస్త్రప్రకారం పూజలు చేసారా? దేవుడు మెచ్చలేదా?  మనస్సే ప్రధానం అని.  మంచి వాదనే.  కాని సరైనది కాదు.  తెలియక కాదు, చేతకాక కాదు - నిర్లక్ష్యం కారణంగా చేసే‌ అపచారాన్ని కువాదంతో సరిపుచ్చుకో‌వటం కుదరదు.  ఎవరిని పడితే వారిని -- ఏం? ఈ‌యన మాత్రం విష్ణువు లేదా శివుడి అవతారం ఎందుక్కాకూడదూ‌ -- అని వితండవాదం చేసి, పూజలూ‌ భజనలూ చేయటం‌ భగవదపచారమే నాదృష్టిలో.  నా మాటలు ఎవర్నైనా నొప్పించాలని కాదు. నిష్టూరంగా ఉన్నా నిజం మాట్లాడుకోవటం తప్పుకాదు కదా! ఏదో‌ నా బాధ కారణంగా నేను చెప్పుకుంటున్నాను.

దానికితోడు నేను వ్రాస్తున్న  శ్యామలీయం భాగవతం  బ్లాగు చూసి మరింత ఆవేదన కలిగింది. నిన్నటి టపా చదివిన వారు ఇప్పటికి అక్షరాలా  ఒక్కరు!  ఎవరికీ‌ ఈ‌ 'పాహి రామప్రభో' లాంటి పద్యాలూ, భాగవతం లాంటి చాదస్తం భక్తి గ్రంథాలూ నచ్చనపుడు ఎందుకు వ్రాయటం?  భాగవతం అయితే ఒక వెయ్యి టపాల బృహత్తరకార్యక్రమం. నేను ఒక్కడినే చదువుకుందుకు అయితే, నేను పోతనగారినే చదువుకోవచ్చును. మరలా వ్యావహారికంలో వ్రాయాలని సమయం వెచ్చించటం దేనికి.  రాములవారిమీద ప్రస్తుతం ఈ‌ బ్లాగులో మానసిక పూజా విధానం నడుస్తున్నది.  ఎవరూ చదవరు.  మంచిది.  ఈ‌ శీర్షిక త్వరలో రెండువందల పద్యాలకు చేరుతుంది.  బహుశః అక్కడితో ముగుస్తుందేమో తెలియదు.

అవసరమైతే శ్యామలీయం‌ కథకూడా త్వరలోనే ముగుస్తుంది!

18 కామెంట్‌లు:

 1. ఆకటి వేళల అలపైన వేళల...తేకువ హరినామమే దిక్కు మరి లేదు అని అన్నమయ్య చెప్పేరు కదా! అక్కడి నుంచి అయటికిపోలేని సందర్భం లో నేను శ్రీ రామ రామ రామేతి అనుకుంటూ కూచుంటా, అవేమీ వినకుండా, వినపడవు కూడా.

  రిప్లయితొలగించండి
 2. పెద్దలు మీరు
  శాంతించాలి
  భాగవతం వ్రాస్తున్నది ఎవరినో మనం బాగుచేద్దామని కాదుకదా మహాత్ములంతా అందించినది . ఎవరికి చేరాలో ,వారికి ఎప్పుడు చేరాలో అప్పుడు అది అందుతుంది. మీరు పరమాత్మ పాదపద్మాలకు సమర్పిస్తున్నారు.దానిగూర్చి అంతవరకే ఆలోచించండి
  జైశ్రీరాం

  రిప్లయితొలగించండి
 3. శ్యామలీయం గారూ ,

  నమస్తే .

  మీలాంటి ( శాస్త్రాలు - వాటి అర్ధాలు ) తెలిసినవారు , ఇలా నిరుత్సాహపడటం మాలాంటి వారికి కొంచెం ఇబ్బందిగ అంపిస్తుంది . ఎందుకంటే ఈ నాటి ప్రపంచంలో చాలామంది పామరులే కాని పండితులు లేరు . ంఇరు తెలుసుకున్నవి ( ఎవరు చదివినా / చదవకున్నా ) మీ బ్లాగులో కొనసాగించవలసిందే . చదిన వాళ్ళే చదువుతారు .

  అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పనే చెప్పాడు . ఎందరో పూజలు , పునస్కారాలు చేస్తున్నా , నన్ని చేరేది కడకు ఏ ఒక్కరో నని .

  పూసిన పూవులు అన్నీ దేవుని పూజకు చేరుకోనట్లు , కొన్ని సంసారుల తలల్లో , ఇంకొన్ని సానుల పడకల మీద పరచబడ్తాయి . పూజకు చేరేవి బహు కొద్ది మాత్రమే .

  ఆ నాడు చలం గారు చెప్పినట్లు , మీరిపుడు వ్రాస్తున్నది , ఇప్పటి వారికి కాకపోయినా , ముందు తరాల వారికి చాలా ముఖ్యమౌతుంది .

  దయ వుంచి కొనసాగించండి , ఆపకండి .

  రిప్లయితొలగించండి
 4. Ayya.. Meeru Modalupettina Ee Bruhattara Karyam Slaaghaneeyam. Naaku Vishnuvu Kathalanna, Gaathalanna Enaleni Preeti. Meeru Naa Blog lo Comment chesinappati nundi, mee blog ni follow autune unnanu.

  Nijame.. Nenu Yuktavasakudine, kaani naaku enduko chinnapatinundi alaa Ma Venkanna Saami Daya valla bhakti alavarchukunnanu. Nijanga mimmalni blog ni chooste, mee manastatvam elaatido naaku avagatam ayyindi. Appati nundi naa phone lo mee Blog RSS feeds kooda pettukuni, roju tappakunda "Paahi Rama Prabho", inka meeru koththaga raastunna "Bhaagavatham" putalu, entho baagunnayi.

  Ee rojullo ilaativi chadavadam, nijanga entho aanandadaayakam. Naa Telugu choosi, nenu telugu vaadini anukuneru, kaani naa matrubhaasha telugaite mummatiki kaadu. Nenu Andhra Pradesh Vaadine.

  "Yatho manah tato buddih" ani oorakane analedu, evari manasu vaariki ela unte alaa.. Andulo elaanti sandeham ledu. Meeru Naa Blog choosaaru, nenu evo pichchi kavitalu raastundevaadini, naa Inter lo ante 13 yrs back.

  Sir, You should not cease any of your blogs. It is a great pleasure that people like you have been doing a selfless service to god, by publishing matters regarding god. Mee manasu vikalam ayyindani raasi unte, manasoppaka ilaa comment ivvalsi vachchindi.
  "Happy Friendship Day Sir,"
  Sridhar Bukya
  Visit my blog at http://kaavyaanjali.blogspot.in/

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విపులమైన మీ‌ వ్యాఖ్యకు ఆనందం.
   ఒక్కొకసారి నిస్సహాయస్థిలో పడిపోయి ఆవేదన కలుగుతుంది.
   అంతకంటే మరేమీ‌ లేదు.
   దైవకార్యం‌ కాబట్టి ఆయనే నడిపించు కుంటాడని భావించి కొనసాగిస్తాను.
   మీ స్పందనకు చాలా ధన్యవాదాలు.

   తొలగించండి
 5. kopam vaddu sir, maa lanti vaaru ippudippude mee blogs chaduvutunnamu. please continue.

  ratna

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రత్నగారూ, కోపగించుకోవటం‌ సాధువర్తనం కాదు. దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 6. శ్యామలీయం గారు మీ ఆవేదన, అశాంతి అర్ధం అయింది. మీరెంతో శ్రమకోర్చి వ్రాస్తున్న భాగవతం గురించి, వీక్షకుల సంఖ్యా గురించి మీరు ఆవేదన వెలిబుచ్చడం సమంజసమే! అయితే ఒక విషయం చెప్పదలచాను. మున్ముందు కాలంలో .. భావి తరం వారు ఆసక్తి కల్గిన వారు .. మీ బ్లాగ్ ని ప్రామాణికంగా తీసుకుని భాగవతం ని వచనం లో చదువుకోవడానికి ఉపయుక్తం గా ఉంటుందేమో !. ఆ ఉద్దేశ్యంతో మీ బ్లాగ్ ప్రయాణం ని సాగించండని మనవి చేసుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 7. 1) ఆయ్యా! మున్ముందుగా మీకు పరాకు! ఎవరి గూర్చీ ఏమీ అనద్దు బాబూ ఈ మధ్య. ఇది తప్పు అది తప్పు అని చెప్తే ఇంక వాళ్ళు చేసే ఆహైరానా ఇంకా ఇంకా మనసుకి తీరని ఖేదం కలిగించేదిగా ఉంటుంది. ఇలా పారాయణలు చేసేవారు మీ మీద యుద్ధం ప్రకటిస్తారు! ఇంకానయం మీరు వారిని వారించే ప్రయత్నం చేయలేదు, వ్యాసులవారిచ్చిన నామాలుకావవి వాళ్ళే కనుగొన్నంత తీరు ప్రదర్శిస్తారు. వ్యాసుడిచ్చిన నామాలేమిటో ఏ ఛందస్సులో చదవాలో నియమాలేమో నామం ఎక్కడ పూర్తవుతుందో ఎక్కడ మొదలవుతుందో ఎవరిక్కావాలి ఇవ్వాళ.

  ఐనా ఏం చేస్తాం ఒక్కోసారి తప్పదు లెండి అటువంటి చోట్లకెళ్ళాల్సొస్తుంది మనసును కష్ట పెట్టుకోవాల్సొస్తుంది. ఎంతో కష్టం అనుభవించాల్సి ఉన్నప్పుడు భగవంతుడు తనని నమ్ముకున్నవారికి ఇలాంటి ఫలితాలనిచ్చి రక్షిస్తుంటాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వారించేంతటి ధైర్యమా!
   అంతా భగవద్వినోదంలో ఒక భాగమే అనుకున్నాక మనస్సు ప్రశాంతంగా ఉంది.

   తొలగించండి
 8. 2) ఇక మీరు పై విషయంలో పొందిన ఖేదంతోటే రెండవ విషయమైన మీరు మొదలెట్టిన భాగవతం గూర్చి, శ్రీరాములవారి మీద మీ పద్యార్చనగూర్చి వ్రాసి ఉంటారని అనుక్కుంటున్నాను. అయ్యా మీకు తెలియంది కాదు! రామదాసుగారు అందరికోసం దాశరథి శతకం వ్రాసారా లేక కీర్తనలు వ్రాసారా రాముని కోసం వ్రాసారు అవి రాములవారికి నివేదింపబడగా మనకి ప్రసాదాలుగా అందాయి. పోతన గారు భాగవతం రచించింది రాములవారికోసం కాదా! ఆయనే దాన్ని ప్రాచుర్యం చేయాలనుక్కుంటే పెట్టెలోపెట్టి చెదలు తినేవరకూ ఉండేదా! ఆ భాగవతమూ శ్రీ రామునికి నివేదన చేయబడి మనకి ప్రసాదంలా అందలేదూ! మీకెందుకు చింత! అన్ని పద్యాలు వ్రాసారు, మన రాముడున్నాడు మీ చెంత! ఈ నిర్వేదాన్ని ఖేదాన్ని తొలగించి హాయిగా మీ కవనాన్ని రామానుగ్రహంగా కొనసాగించండి.

  రిప్లయితొలగించండి
 9. మీ అశాంతికి కారణం ఉంది. నేను కూడా ఎన్నోసార్లు ఇదేరకంగా బాధపడటం జరిగింది. ఐనా ఈ రోజుల్లో భాషకి, భావానికి భవితవ్యం లేదు. అందుకే నాకనిపిస్తూoటుoది తెలుగు భాష వాడుక భాషగా ఉoడేకన్నా,వేడుక భాషగా ఉoటేనే బాగుంటుందేమోనని.

  ఇక మీ భాగవతం గురించి. మీకెoదరో నాలాంటి అజ్ఞాత చదువరులున్నారు. నేనెన్నడూ పోతనగారి భాగవతం చదవలేదు. ఏవో కొన్నిపద్యాలు చిన్నప్పుడు కంఠతా పట్టినవి మాత్రమే.పోతన గారిని చదివి కొద్దో గొప్పో అర్ధం చేసుకునే శక్తి నాకున్నా, ఈ రోజుల్లో ఉద్యోగాల ఊడిగo అయ్యిన తర్వాత పుస్తకం పట్టే ఓపికా తీరికా ఉoడట్లేదు. ఇలాంటి సమయంలో మీ బ్లాగు ఎడారిలో ఒయాసిస్సులాగా ఊరట కలిగించింది. కనీసం మీ బ్లాగు ద్వారానైనా మన(మా)పిల్లలకి ప్రతీరోజు ఒక కధ చెప్పే భాగ్యo కలుగుతోంది. దయచేసి దానిని మాకు దూరం చెయ్యద్దు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంతా నల్లనయ్యే చూసుకుంటాడు.
   లేకపోతే నిజంగా వ్రాసేది నేనా?
   బెంగపడకండి

   తొలగించండి
 10. మరొక చిన్న విజ్ఞప్తి. మీ భాగవతం బ్లాగునించి మీ కొత్త టపా ఈమెయిలు వచ్చే అవకాశం ఉoటే ఇంకా చాలామంది చదువుతారు.నా మటుకు నేనే, మీరేమీ కొత్త టపాలు రాయలేదేమోననుకున్నాను ఇన్నాళ్లూ, ఈ టపా చదివేవరకూ.

  రిప్లయితొలగించండి
 11. మఱోసారి ఇలాంటి తలంపు కూడా వద్దు సుమీ.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.