9, ఆగస్టు 2013, శుక్రవారం

మందు వేసి మాన్పలేని

మందు వేసి మాన్ప లేని 
    మాయదారి జబ్బండీ
అందరికీ పుట్టగానే 
    అంటుకునే‌ జబ్బండీ

జబ్బుపడ్డ వాడె మనిషని 
    జనము నమ్మే‌ జబ్బండీ
జబ్బు తగ్గితే పిచ్చివాడని 
    జనము నమ్మే‌ జబ్బండీ  ॥మందు॥

అబ్బురముగా వయసుతోటి 
    అతిశయించే జబ్బండీ
డబ్బు గాలి తగలగానే 
    ఉబ్బరించే‌ జబ్బండీ  ॥మందు ॥

కళ్ళు తెరిచిన రోజు నుండే 
    కాటు వేసే జబ్బండీ
పిల్ల నిచ్చీ పెళ్ళి చేస్తే 
    పెరిగి పోయే జబ్బండీ  ॥ మందు ॥

క్షణము లోన పోవు దానిని 
    సత్య మనుకొను జబ్బండీ
తనకు సత్య మైన దానిని 
    తాను నమ్మని జబ్బండీ ॥మందు ॥ 

భూమి మీద వైద్యు డెవడూ 
    మూల మెరుగని జబ్బండీ
రామజోగి మంత్ర మేస్తే 
    రాలి పోయే‌ జబ్బండీ ॥మందు ॥