14, జనవరి 2021, గురువారం

రామ సీతారామ

రామ సీతారామ సుగుణధామ జయరామ
శ్రీమదయోధ్యాపురీధామ సార్వబౌమ

రామ రఘువరాన్వయసోమ శుభదనామ
రామ రిపుభయంకరనామ ఘనశ్యామ
రామ లోకావనఘననామ విజయరామ
రామ ప్రియదర్శన మునికామ సీతారామ

రామ సకలదనుజగణవిరామ భండనభీమ
రామ సకలలోకవినుతనామ పూర్ణకామ
రామ సదావైకుంఠధామ పరంధామ
రామ సర్వలోకాభిరామ సీతారామ

రామ జగద్విఖ్యాతనామ సుఖదనామ
రామ స్మరవిరోధినుతనామ పుణ్యదనామ
రామ శ్రీమద్దశరథరామ సుందరరామ
రామ భవవిమోచననామ సీతారామ


12, జనవరి 2021, మంగళవారం

నిన్ను పొగడువారితో

నిన్ను పొగడువారితో నిండిపోనీ పృథివి

సన్నుతాంగ రామచంద్ర చక్కగాను


భరతభూమి రామభక్తవరులతో క్రిక్కిరిసి

పరమశాంతిపూర్ణమై వర్ధిల్లనీ

నిరతమును నీ భక్తులు నీవిజయగీతికల

పరమానురాగముతో పాడనీ కలసి


దరహాసపూర్ణవదన దాశరథీ నీ దివ్య

కరుణామృతవృష్టిచే నిరతంబును

హరిభక్తుల మానసంబు లానందడోలికల

మరిమరి యూగుచు నీ మహిమనెంచనీ


సరిసాటియె లేని వాడ సాకేతరాజేంద్ర

పరమయోగిగణపూజిత పద్మనాభ

నిరుపమానసత్యకీర్తి ధరణిజాహృద్వర్తి

సురవిరోధిగణగర్వహరణమూర్తి


11, జనవరి 2021, సోమవారం

ప్రాణం

కం. ప్రాణము కలదా మట్టికి
ప్రాణము గాలికిని నీటివాలుకు కలదా
ప్రాణము కలదా అగ్గికి
ప్రాణము గగనంబునకును వరలునె చెపుమా

కం. కదలును గాలియు నీరును
కదలును మరి యగ్ని భూమి కదలును ఖతలం
బదియును దశదిశల కదలు
కదలిక లున్నపుడు ప్రాణకలితములు కదా

కం. కలదేని ప్రాణ మొకచో
కలదు కదా ప్రాణశక్తి ఘనసంచారో
జ్వలలీలాకలితంబై
యలరుచు సర్వాంగరాజి ననవతంబున్

తే. పంచభూతంబు లందిట్లు ప్రాణశక్తి
దివ్యమైయుండ పాంచభౌతిక మనంగ
వరలు సృష్టి కణకణము ప్రాణమయము
అమృతమయమైన దీసృష్టి యార్యులార

సీ. విత్తులో ప్రాణంబు వెలయును సూక్షమై
ఆ విత్తు కాయలో నణగి యుండు
పండౌను కాయయు ప్రాణంపు కలిమిచే
పండ్లు కాయుచునుండు పాదపంబు
ప్రాణముండుట చేత పాదపంబులు క్షోణి
వర్ధిల్లుచుండును వసుధ యొక్క
ప్రాణశక్తి వలన ప్రాణశక్తియె యిట్లు
సర్వంబు చక్కగ నిర్వహించు

ఆ.వె. ధరణి యందు మరియు ధరణీధరంబుల
నుండు పర్వతముల బండ లందు
నుండు బండరాళ్ళ నులుల మలచి
కొలుచు ప్రతిమ లందు కూడ నుండు

కం. వ్యక్తముగ జంగమముల న
వ్యక్తముగను స్థావరముల వర్హిల్లెడు నీ
శక్తిం దెలియగ నోపర
వ్యక్తులు బ్రహ్మవేత్త లఱయుదు రెపుడున్

ఆ.వె. వెలిని లోన నిండి వెలుగుచు బ్రహ్మాండ
వ్యాప్తమగుచు నుండు ప్రాణశక్తి
బ్రహ్మమనుచు బుధులు వాక్రుచ్చు తత్త్వమే
బ్రహ్మ మెఱుగు వాడు బ్రాహ్మణుండుభూమి మీద పడియున్నావా

భూమి మీద పడియున్నావా విముక్తిని కోరుచు నున్నావా
రామరామ యని యన్నావా రాముని దయనే కన్నావా

శేషనాగపర్యంకశయానా శ్రీహరి జయజయ యన్నావా
దోషాచరప్రాణాపహరణచణ దురితనివారణ యన్నానా

రామా ప్రావృణ్ణీలపయోధరశ్యామా జయజయ యన్నావా
నీ మనమున హరి మోహనమూర్తిని నిండారగ కనుగొన్నావా

రామరామ రఘురామ పరాత్పర రావణసంహర యన్నావా
రామచంద్రపదరాజీవంబుల ప్రేమమీఱ పూజించేవా

రామా రవివంశాంబుధిసోమా కామితవరదా యన్నావా
రాముని దయగల వానికి పొందగరానిది లేనే లేదు కదా


9, జనవరి 2021, శనివారం

నిజము రాముడు తిరిగిన తెలుగునేల

నిజము రాముడు తిరిగిన తెలుగునేల రామతీర్థం

సుజనావళి అడుగడుగున రాముని చూచు రామతీర్థం


తెలుగునేలపై గుడిలో రాముని తలచము మూర్తి యని

తిలకింతుము శ్రీరామచంద్రుడే నిలబడె నెదుట యని

తలచెదము మాపుణ్యము పండగ దరిసెనమాయె నని

పలుగాకులు బొమ్మనుచు తలచుట వారి కుసంస్కారం


తెలుగుగడ్డకు కులదైవముగ వెలసిన రామునకు

తుళువలచే నపకారము గలిగిన దోషాచరణులకు

కలుగును హాని కలుగదు రాముని ఘనకీర్తికి లోటు

కలుషబుధ్ధుల వంశంబులకే కలుగును నాశనము


రాజకీయముల పేరిట రాముని రచ్చచేయు వారు

రాజాశ్రయమున మురిసి రాముని లావుమరచు వారు

రాజభయంబున రాము నెరుగని లాగున చనువారు

ఏజన్మంబున నించుక సుఖమన నింక బడయలేరు


శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ సీతారామ


శ్రీరామ శ్రీరామ కారుణ్యధామ

శ్రీరామ శ్రీరామ జీమూతశ్యామ

శ్రీరామ శ్రీరామ సేవింతు నిన్ను

శ్రీరామ శ్రీరామ తారకనామ


శ్రీరామ శ్రీరామ శివచాపదళన

శ్రీరామ శ్రీరామ జితభృగురామ

శ్రీరామ శ్రీరామ చేయూతనీవే

శ్రీరామ శ్రీరామ చిన్మయరూప


శ్రీరామ శ్రీరామ జితదానవేంద్ర

శ్రీరామ శ్రీరామ దారిద్ర్యశమన

శ్రీరామ శ్రీరామ చేయందుకోవే

శ్రీరామ శ్రీరామ శేషాహిశయన


7, జనవరి 2021, గురువారం

అమ్మా యిపుడు

అమ్మా యిపుడు కొంచె మాగవమ్మ నీవు ముద్దు

గుమ్మా రమ్మా సోకు చేసుకొమ్మా నీవు


విల్లెత్తు వాని కొరకు వేచితి వెన్నేళ్ళో ఆ

విల్లెత్తి విరిచి నిన్ను పెళ్ళాడిన వీరుడు ని

న్నిల్లాలిని చేరగా నించుక జాగైనచో

తల్లడిలేవే పిచ్చితల్లీ బాగున్నదే


పది నెలలు వేచితివే పతిరాక కొరకు తల్లి

ఆదయుడైన తులువ రావణాసురుని తోటలోన

ముదిత నేడు పతిరాక ముహూర్తము జాగైన

మదిని తల్లడిలేవే మరియు బాగున్నదే


ఓ రామలక్ష్మి నీ వూరక నిట్టూర్చకే 

శ్రీరామచంద్రు లేమొ చేరవచ్చు వేళాయె

సారసాక్షి విరహాలు చాలించి రావే బం

గారు తల్లి యంగరాగాలు నగలు వేచేనే


మంగళ మనరే

మంగళ మనరే మహనీయునకు

మంగళ మనరే మన రామునకు 


మంగళ మనరే మదనశతకోటి

శృంగారమూర్తికి సీతాపతికి

మంగళ మనరే మారజనకునకు

మంగళ మనరే మగువల్లారా


మంగళ మనరే మదనారిధను

ర్భంగము చేసిన బాలవీరునకు

మంగళ మనరే మహితాత్మునకు

మంగళ మనరే మానినులారా


మంగళ మనరే మన యువరాజుకు

బంగరు తల్లికి వసుధాత్మజకు

మంగళ మనరే మాన్యచరితులకు

మంగళ మనరే  అంగనలారా


రామచంద్ర పాహిమాం

రామచంద్ర పాహిమాం రాఘవేంద్ర పాహిమాం

కోమలాంగ శ్యామలాంగ కోసలేంద్ర పాహిమాం


వీరవర పాహిమాం విబుధవినుత పాహిమాం

నీరజాక్ష పాహిమాం నిగమవినుత పాహిమాం

మారజనక పాహిమాం మంగళాంగ పాహిమాం

నారసింహ పాహిమాం నారాయణ పాహిమాం


విశ్వజనక పాహిమాం విశ్వవంద్య పాహిమాం

విశ్వవినుత పాహిమాం విశ్వార్చిత పాహిమాం

విశ్వపోష పాహిమాం విశ్వాత్మక పాహిమాం

విశ్వనాథ పాహిమాం విశ్వమూర్తి పాహిమాం


వరదాయక పాహిమాం సురనాయక పాహిమాం

నిరుపమాన పాహిమాం నిరంజన పాహిమాం

పరమేశ్వర పాహిమాం పరంజ్యోతి పాహిమాం

కరుణాకర పాహిమాం కమలనాభ పాహిమాం


4, జనవరి 2021, సోమవారం

రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా

రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా - రాజ్యాలేలేరా
తోకముడిచి హనుమంతుడు తొలగి నిలచేనా - తొలగి నిలచేనా

తెలుగువారి ఐకమత్య బలిమి వట్టిదేనా - చిలుకపలుకులేనా
తెలుగువాళ్ళ బుర్రల్లో తెలివి తక్కువేనా - తెలివిడి సున్నేనా
తెలుగువారి దైవభక్తి కలిమి డొల్లయేనా - నిలువున డొల్లేనా
తెలుగుగడ్డ మీద దేవతలకు చోటులేదా - నిలువనీడ లేదా

సోది కైన లేదు తెగువ శూన్యం మిగిలేనా - హైన్యం మిగిలేనా
వాద వివాదాలతో వేదన తొలగేనా - బాధలు తొలగేనా
కాదు కాదు కాదంటే కష్టం తగ్గేనా - నష్టం తగ్గేనా
రాదు రాదంటే ముప్పు రాకుండా పోదు - లేకుండా పోదు

తెలుగువాడి మెతకతనం తొలగవలె నేడు - తొలగవలె నేడు
తెలుగువాడు హనుమన్నై తిరిగి దెబ్బకొట్టి - తిరగబడ్డ నాడు
నిలువలేరు రాకాసులు తెలుగుప్రభల ముందు - తెలుగుగడ్డ మీద
తెలుసుకోండి నిజము రామదేవునిపై అన - దేవునిపై అన

తెలుగునేల

తెలుగునేల శ్రీరాముడు తిరుగాడిన నేల

తెలుగుజాతి శ్రీరాముని కొలుచుకొనే జాతి


ఇచట వారికి శ్రీరాము డిష్టదైవ మెపుడును

ఇచటి వారికి రామనామ మిష్టమంత్ర మెపుడును

ఇచటి వారి రామభక్తి యింతింతనరాదుగా

ఇచటి వారి కాంజనేయు డింటిపెద్దదిక్కు 


అట్టి దివ్యభూమి యిప్పు డసురుల పాలాయె

అట్టి రామమూర్తి కిప్పు డవమానమాయ

అట్టి రామపత్ని కిప్పు డవమానమాయె

పట్టుబట్టి రాకాసులు పాడుపనులు చేయ


పెదవివిప్పి పలుకరేమి పృథివినేలు ఘనులు

మెదలరేమి నాయకులు నిదుర నటియింతురు

కదలరేమి తెలుగువారు కడుగూర్చు రామునకై

బెదరి దైవద్రోహులకు బేలలైనారుగా


3, జనవరి 2021, ఆదివారం

రాముడంటే

రాముడంటే గౌరవమా రాకాసులకా

భూమిసుతను రాకాసులు పూజించేరా


రాముడికి కొత్తకాదు రాకాసుల దుండగాలు

ప్రేమతో బోధిస్తే వింటారా రాకాసుల మూకలు

రాముడి బాణాలకు రాకాసులు కొత్తకాదు

భూమికీ కొత్తకాదు ముష్కరుల నెత్తుళ్ళు


మాయలేడి వేషముతో మారీచుడు వంచించెను

మాయచే రామశిరము మలచినాడు రావణుడు

మాయాసీతను చంపి మాయచేసె వాడి కొడుకు

మాయలన్ని వమ్మాయెను మరి వారికి చావాయెను


మొన్నమొన్న శ్రీరాముని బొమ్మ నొకడు విరచెను

నిన్ననే దుష్టుడొకడు నిక్కి సీత బొమ్మ విరచె

చిన్నచిన్న తప్పులనుచు శిక్షించక విడువడుగా 

అన్నన్నా రాకాసుల నణిచివేయు రఘువీరుడు


రాముడి మీద ఆన

రాముడి మీద ఆన రాకాసులారా

మీమీ దుండగాలు మీకే చేటు 


సుబ్బయ్య బొమ్మకే దెబ్బవేసినారా

ఇబ్బందులపాలై ఏమయ్యేరో

సుబ్బయ్య మనవడిని చూడండి నామాట

దబ్బర కానేకాదు దండన తప్పదిక


తెలుగుజాతికి మొదలు తెలియ నాగజాతి

తెలుసుకోండి తెలిసీతెలియక దాని తో

కలహించి నెగ్గలేరు కాటికేపోయేరు

తలకుజాతి కాదు మీ తలకు తెచ్చుజాతి


పాము తోకను త్రొక్కి పారిపోలేరురా

ఏమూలదాగినా యిక మిము విడిచేనా

మీమీ కుతంత్రాలు మిమ్మే కొట్టేరా

ఏమాయదేవుడూ ఇప్పు డడ్డురాడు


ఏ రోజున ఏ గుడికో

ఏ రోజున ఏ గుడికో ఏ దైవమూర్తికో

ఈ రక్కసిమూక తాకి డేమి కర్మమో


వారిపనే యిదియని వీరు గోలచేయుదురు

వీరే చేయించిరనుచు వారు చెప్పుకొందురు

వీరి వారి యనుచరుల వీరంగా లటు లుండ

ఊరకనే వినోదించుచున్నదా దొరతనము


గుడులున్నది మనకొరకా గోవిందుని కొరకా

గుడుల మీద పైసలేరుకొనే దొరల కొరకా

గుడుల బాగు పట్టని బడుధ్ధాయిల్లారా

గుడులు మన తలిదండ్రులు కొలువుతీరిన యిళ్ళు


ముక్కలాయె తెలుగుగెడ్డ మూర్ఖులైరి పాలకులు

చక్కని అవకాశమిదే చిక్కినది విమతులకు

ఎక్కడుంటి వయ్య రామ ఎక్కుపెట్టవేమయ్య

నిక్కువముగ కోదండము నీచుల నణగించగ


పాహి పాహి జగన్మోహన

పాహి పాహి జగన్మోహన రామ

పాహి పాహి పరబ్రహ్మస్వరూప


పరమయోగిగణభావితచరణ

పరమభక్తగణభావితకరుణ

సురగణవందితసుందరచరణ

గరళకంఠహృద్గగనవిహరణ


వధార్హదానవవంశవిశోషణ

విధాతృసన్నుతవిజయవిహరణ

బుధవరగణసంపూజితసద్గుణ

మధురమధురశుభవాక్యప్రసరణ


కాలాతీతవిఖ్యాత పరాత్పర

పాలితత్రిభువనజాల సురేశ్వర

కాలమేఘఘననీలకళేబర

పాలయమాం హరి పరమదయాకర


1, జనవరి 2021, శుక్రవారం

కొత్త సంవత్సరం - కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరం వచ్చేసింది.

ఎందరో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

కొందరైతే ఆ నిర్ణయాలను ప్రకటిస్తారు.

కొంచెం మంది మాత్రమే వాటిని అమలు చేస్తారు.

నా నిర్ణయం వినండి. ఎన్నో లేవు లెండి ఒకటే. దానిని నిలబెట్టుకుంటే చాలు. 

"నేటి నుండి మాలిక వ్యాఖ్యల పేజీని చూడను"

ఇదే నండి కొత్త సంవత్సరం నిర్ణయం.

కారణం ఏమిటీ అంటారా?

మాలిక వ్యాఖ్యల పేజీలో కనిపిస్తున్న భాషను చూస్తున్నారు కదా? అదే కారణం. 

మళ్ళీ వచ్చే జనవరి 1న ఆపేజీని చూడటం గురించి ఆలోచిస్తాను.

మాలిక గురించి నిర్ణయం కొన్నాళ్ళ క్రితం తీసుకున్నదే. వారికి కూడా తెలియజేసినదే. నేటి నుండి అమలులో పెడుతున్నాను.