28, అక్టోబర్ 2021, గురువారం

శీతకన్ను వేయ కయ్య సీతాపతీ

శీతకన్ను వేయ కయ్య సీతాపతీ  ప్ర
ఖ్యాతికల దయాశాలి సీతాపతీ
 
కోతిబుధ్ధి నాదనుచు సీతాపతీ‌ నన్ను
కాతరించి తిట్టవద్దు సీతాపతీ
కోతులతో పొందు నీకు సీతాపతీ చాల
ప్రీతికదా మన్నించుము సీతాపతీ
 
పాతకుడని నిందించకు సీతాపతీ నేను
కాతరుడను నీవాడను సీతాపతీ 
చేతులెత్తి మ్రొక్కుదునో‌ సీతాపతీ నీకు
రీతి కాదు కాఠిన్యము సీతాపతీ
 
నాతండ్రివి నీవుకదా సీతాపతీ సర్వ
భూతకోటి నాథుడవే సీతాపతీ
ప్రీతితోడ సేవింతును సీతాపతీ సం
ప్రీతుడవై నన్నేలుము సీతాపతీ