9, అక్టోబర్ 2021, శనివారం

దేవదేవ రఘురామా

 

దేవదేవ రఘురామా నిన్నే త్రికరణశుధ్ధిగ నమ్మితిని

నీవే శరణము సీతారామా నీవే శరణము శ్రీరామా


అనిశము దేవగణములకు ప్రీతిగ నభయం బొసగెడు శ్రీరామా

వినయాన్వితులకు విభవము గూర్చెడు వీరవరణ్యా శ్రీరామా

జననాథోత్తమ ఘనతాపహరా  యినకులతిలకా శ్రీరామా

మునిగణసన్నుత సురగణసన్నుత మోక్షప్రదాయక శ్రీరామా


నిరుపమసుగుణసుశోభనశీలా నీరజనయనా శ్రీరామా

పరమదయాకర పరమశుభంకర పరమాత్మా హరి శ్రీరామా

సురవిరోధిగణశోషణభీషణ పరమపరాక్రమ శ్రీరామా

పరమేశ్వరచతురాస్యపురందరప్రస్తుతవిక్రమ శ్రీరామా


ఆదిదేవ సకలాగమసన్నుత అంబుజనాభా శ్రీరామా

నీదగు దివ్వప్రభావము నెన్నగ నేనసమర్ధుడ శ్రీరామా

పాదదాసుడను భక్తుడ నను పరిపాలించవయా శ్రీరామా

కాదనకుండగ మోక్షమునిచ్చి కరుణజూపుమా శ్రీరామా