31, మే 2023, బుధవారం

సంప్రీతిగ నీవాడనైతి సీతారామ

సీతారామ సీతారామ సీతారామ సం
ప్రీతిగ నీవాడనైతి సీతారామ

సీతారామ నీనామము చెన్నొందు నోటీతో
నేతీరున కీర్తింతు నితరుల నేను

సీతారామ నినుజూచు ప్రీతిగల కన్నుల
నేతీరున జూచెదనో యితరుల నేను

సీతారామ నీసేవల చెన్నొందు కరముల
నేతీరున సేవింతు నితరుల నేను

సీతారామ నీముందు నిలువగోరు చరణముల
నేతీరున నితరుల కడ నిలిచెద నేను

సీతారామ నీదగుచు చెన్నొందు తనువుతో
నేతీరున మ్రొక్కుదు నితరుల కేను

సీతారామ నీపాదసీమ నుండు మనసుతో
నేతీరున తలంచెద నితరుల నేను

ఎన్నాళ్ళకు హరి ఎన్నాళ్ళకు

ఎన్నాళ్ళకు హరి ఎన్నాళ్ళకు నను పన్నుగ సంరక్షించితివి

ఎన్నాళ్ళకు నీనామమంత్రము నినకులతిలకా యిచ్చితివి
ఎన్నాళ్ళకు నాపూర్వపుణ్యముల నీశ్వర యిటు పండించితివి
ఎన్నాళ్ళకు యీసంసారార్ణవ మీదు నౌక నెక్కించితివి
ఎన్నాళ్ళు బహుకృపాపరుడని యింత ఋజువు చూపించితివి

ఎన్నాళ్ళకు కామాదిశత్రువుల నింటి నుండి వెడలించితివి
ఎన్నాళ్ళకు సంసారమోహమున నున్న నన్ను కరుణించితివి
ఎన్నాళ్ళకు నీదయయే బహుఘనమన్న స్పృహను కలిగించితివి
ఎన్నాళ్ళకు భవబంధవిమోక్షణ మన్ఞది దయతో చేసితివి 

ఎన్నాళ్ళకు శ్రీరామచంద్ర తగు యెఱుకను నాలో నించితివి
ఎన్నాళ్ళకు నీభక్తిసుధారస మింపుగ నను గ్రోలించితివి
ఎన్నాళ్ళకు నీభక్తిఫరులతో నించుక స్నేహము నిచ్చితివి
ఎన్నాళ్ళకు నీ సంకీర్తనసుఖ మెడతెగకుండగ నిచ్చితివి


పూనితి నిదె దీక్ష పురుషోత్తమ

పూనితి  నిదె దీక్ష పురుషోత్తమ యిక
మానక నినుగూర్చి మరిమరి పాడుదు

మూడుప్రొద్దుల గూడ మురియుచు నినుగూర్చి
పాడుటకును దీక్ష వహియించితిని
వేడుక తోడ నీవు వినిన చాలును నాకు
పాడినందుకు నాకు ఫలమది యగును

లోకము మెచ్చు మాను నాకెందు కామాట
నీకు నచ్చిన చాలు నిశ్చయముగను
ఏకోరికలును లే వినకులేశ్వర నాకు
నీకునై పాడుటే నాకభిమతము

నారాయణా నేను నరుల ప్రస్తుతించను
వారితో పనిలేదు వారిజనయన
భూరికృపాళో నిను పొగడుదు నెల్లప్పుడు
చేరి పొగడ నీయర శ్రీరాముడా

30, మే 2023, మంగళవారం

మీరేమీ చేసెదరయ్య మీరాముని కొఱకు

మీరేమీ చేసెదరయ్య మీరాముని కొఱకు వా
క్శూరులేనా భక్తులారా మీరు

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
మీరేమీ యడుగకున్నను మీకిచ్చును సిరులు
ఆరాము డీయని దేమియు నగుపడదే మాకు ముద
మారంగ రాముని కీయగ నాలోచించుటకు

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
దారి చూపించెను మీకు ధర్మ మిది యనుచు
దారిని తప్పని శీలము దప్ప మేమేమి యిక
కూరిమితోడను హరికి  ధారపోసేము

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
మీరడిగినారని ప్రేమగ మీకిచ్చును ముక్తి
ఆరాము డిచ్చెడు మోక్ష మఖిలోన్నతపదము మేము
నారాయణున కేమిత్తుము నమస్కారములే

29, మే 2023, సోమవారం

నీవు జగద్గురుడవు

కం. నరులకు ధర్మపథంబును
పరమార్ధపథంబు గఱపు వాడు గురుడనన్
మరి నీవు జగద్గురుడవు
పరమాత్మా రామచంద్ర భవపాశహరా

ఓ రామచంద్రప్రభో.

లోకంలో కొందరు సత్పురుషులు కనిపిస్తూ ఉంటారు.
వారిలో కొందరు ఇతరులకు ధర్మపథాన్నీ పరమార్థపథాన్నీ బోధించి నేర్పుతూ ఉంటారు. అటువంటి వారు మహాత్ములు. నరులకు వారు గురువులు. 

అటువంటి మహాత్ములలో నువ్వు పరమోత్తముడవు. నీవే పురుషోత్తముడవు. 

నీవు జగత్తుకే గురుదేవుడవు.

నీబోధను ఆనుసరించిన నరుల భవపాశములు తెగిపోతున్నాయి. ఆఘనత నీదే.

రామనామమే పలికేరు

జగమే నిజమని నమ్మేరో భగవంతుని మది మరచేరో 
తగని గర్వమును పొందేరో తామసులై చెడతిరిగేరో

కుములుచు నరకము చేరేరు సమవర్తిని గని వణికేరు 
సమస్తశిక్షలు పొందేరు విముక్తి యెపుడని వగచేరు

బహుబాధల నట పొందేరు బహుకాలమునే గడిపేరు
మహి కాపిమ్మట వచ్చేరు మరియే యుపాధి పొందేరో

పలు పర్యాయము లిటులే వచ్చుచు పోవుచు నుండేరు
అలసట చెందుచు తిరిగేరు ఐనను మారక యుండేరు

క్రమముగ సంగతి నెఱిగేరు రాముని వంకకు తిరిగేరు
భ్రమలన్నియు విడనాడేరు రామనామమే పలికేరు


పొరబడవద్దు నరులారా


నరులారా పరమాత్ముడు శ్రీహరి
మరి యాహరియే మన రామయ్య

హరినామమంబున కధికము కలదా
హరిసంకీర్తన కధికము కలదా
హరి సంసేవన కధికము కలదా
పొరబడవద్దు నరులారా

హరి పదసన్నిధి కధికము కలదా
హరి యిచ్చెడు సిరి కధికము కలదా
హరి కృపకన్నను నధికము కలదా
పొరబడవద్దు నరులారా 

హరి చిరునగవున కధికము కలదా
హరి భక్తున కొక డధికుడు కలడా
హరియే యానందాంబుధి కాడా
పొరబడవద్దు నరులారా 

రఘువర నిన్నే నమ్మితి నమ్మితి

రఘువర నిన్నే నమ్మితి నమ్మితి రామచంద్ర కరుణించవయా
అఘములు నీదయ వలన నశించును హరి ఆదయ నాఫై చూపవయా

గతజన్మంబుల చేసిన పాపము కరుణజూపి మన్నించవయా
గతజన్మంబుల చేసినపుణ్యము ఘనముచేసి లెక్కించవయా
ఆతులితకరుణామూర్తివి నీవని యందురు నను కరుణించవయా
ధృతిమంతుడనై నిను కీర్తింతును దేవా నను కరుణించవయా

గడచిన దినముల చేసినతప్పుల కరుణజూపి మన్నించవయా
నడమంత్రపుసిరులను నే కోరను నారాయణ దయజూడవయా
విడచితి సంసారముపై మోహము వేగమె నను దయజూడవయా
విడువను నీపదపంకజముల నిక వెన్నుడ నను దయజూడవయా

శక్తికొలది నిను సేవించెద నోహరి చక్కగ నను కరుణించవయా
రక్తిగొలుపు నీనామము విడువను రామా నను కరుణించవయా
భక్తుడ నిన్నే నమ్మినవాడను పరమాత్మా కరుణించవయా
ముక్తిప్రదాతవు మోక్షమడిగితిని మోదముతో కరుణించవయా 


పతితపావనుని పావననామము

పతితపావనుని పావననామము పాడెడు బ్రతుకే ధన్యము
సతతము శ్రీహరి సేవలనుండే చక్కని బ్రతుకే ధన్యము

రామనామమున రంజిలుచుండెడు రసనయె మిక్కిలి ధన్యము
రామనామ గుణకీర్తనములు విను శ్రవణములే కడు ధన్యము 
రాముని మురియుచు చూడగలుగు నేత్రంబులె మిక్కిలి ధన్యము
రాముని కొఱకై ప్రాణము పెట్టెడు నామనసే కడు ధన్యము
 
రాముడిచ్చినది చాలని పలికే‌ బ్రతుకే కడుగడు ధన్యము
రామున కన్యము నెఱుగని జీవుడు భూమిని మిక్కిలి ధన్యుడు 
భూమిని తిరిగెడు జీవుల యందున రాముని భక్తులె ధన్యులు
రాముడు పాలించిన ప్రదేశము భూమిని మిక్కిలి ధన్యము

రాముని కొఱకై వెలసిన కవనమె భూమిని మిక్కిలి ధన్యము
రాముని చరితము చాటెడు వారే భూమిని మిక్కిలి ధన్యులు
రాముని చేరగ కోరెడు వారే భూమిని మిక్కిలి ధన్యులు
రామరామ రఘురామ యనవయా ప్రేమగ ధన్యుడ వౌదువు

28, మే 2023, ఆదివారం

పరమయోగులై యుండవలె

పరమయోగులై యుండవలె  భవబంధములను విడువవలె
హరికటాక్షమే బడయవలె అపవర్గమునే పొందవలె

వాదశీలమును విడువవలె బహుశాంతముగా నుండవలె
వేదవేద్యుని కొలువవలె విభునినామమే తలచవలె

సిరిపై మోహము విడువవలె శ్రీహరినె మది నెంచవలె
హరిహరు లొకటని తెలియవలె ఆచిన్మూర్తిని తలచవలె

రాముడు హరి యని యెఱుగవలె రామనామమే పలుకవలె
రాముని సత్యము నెఱుగవలె రాముని నిత్యము తలచవలె

తారకబ్రహ్మము నెఱుగవలె తనలోతాను రమించవలె
ధీరత నుర్విని నిలువవలె కారణజగమును విడువవలె 

పరివారమును కూడ ప్రస్తుతించేరా

పురుషోత్త,ముని మీరు పొగడుచున్నారా తన
పరివారమును కూడ ప్రస్తుతించేరా

హరిపాదము లొత్తుచుండు సిరిని గమనింతురా
పరమసాధ్వి నిత్యానపాయిని తల్లి
హరిని కీర్తించు వేళ మరువకుండగ మీరు
తరచు ప్రస్తుతింతురా పరమభక్తితో

హరికి పానుపై అడిగో యాదిశేషు డున్నాడు
హరికి పాదరక్షలైన నతడే యగును
నిరతము వేనోళ్ళతో‌ హరిని పొగడు నాతని
మరువకుండ నుతింతురా మహితభక్తితో
 
హరి యింత వాడనుచు హరి యంత వాడనుచు
హరిని గొప్పగ పొగడునట్టి వేళలను
మరి యంత శ్రీహరికి మురియుచును గరుడుడు
తురగమయ్యే నతని పొరి పొగడేరా


27, మే 2023, శనివారం

యుగములుగా వెదకుచుండ

కం. యుగములుగా నీకొఱకై
వగచుచు నే వెదకుచుండ పరమేశ్వర నీ
వగపడవే యిది యొప్పునె
జగదీశ్వర రామచంద్ర జానకిరమణా

ఓ రామచంద్రప్రభో.

ఎన్నో యుగాలుగా నీకోసం ఎంతో వెదకుతున్నానే. కనరాకున్నావే యని యెంతో దుఃఖపడుతున్నానా? ఐనా నీకు కరుణలేదే. 

ఎంతని వెదకినా కనరావే!

ఇదేమన్నా బాగుందా?

ఓజగదీశ్వరా జానకీరమణా నీవే చెప్పు. 

నీయండ చాలును కోదండరామా

నీయండ చాలును కోదండరామా మాయను గెలిచెద కోదండరామా
ఆయపవర్గము కోదండరామా న్యాయముగ నిమ్ము కోదండరామా

నీమముగ నేను కోదండరామా నీనామస్మరణము కోదండరామా
యేమరక చేయుదు కోదండరామా యీమాటకును దప్ప కోదండరామా
సామవాక్యంబుల కోదండరామా చక్కబడక యున్న కోదండరామా
కామాదిరిపులను కోదండరామా కట్టికొట్టెద నింక కోదండరామా

ఎంతవారికైన కోదండరామా చింతలు దప్పవు కోదండరామా
చింతలేని వారు కోదండరామా శ్రీరామభక్తులె కోదండరామా
అంతకుని భటులు కోదండరామా యెంతబెదిరించిన కోదండరామా
సుంతైన బెదరక కోదండరామా జోరుగ నిను బిల్తు కోదండరామా

కలిమాయ గిలిమాయ కోదండరామా ఖాతరుసేయ కోదండరామా
యిలమీద తిరుగుచు కోదండరామా యెల్లవేళల నిన్నె కోదండరామా
తిలకించ నందరు కోదండరామా తీరుగ పొగడెద కోదంద రామా
నలుదెసల నీకీర్తి కోదండరామా నయమొప్ప చాటెద కోదండరామా

 

రాముని సంగతి తెలియని వాడా

రాముని సంగతి తెలియని వాడా రావణుడా రేపేమగునో
తామసవాక్యము లాడుటుడుగుమని ధరణిజ దర్భను తిట్టినది

రాముని రూపమె మోహనరూపము రావణ నీవది యెఱుగవుగా
రాముని విక్రమమే విక్రమమని రావణ బొత్తిగ యెఱుగవుగా
రాముని సత్యమె త్రిజగత్పూజ్యము రావణ నీకది తెలియదుగా
రాముని చరితమె పావనచరితము రావణ నీవది తలచవుగా

రాముని ధర్మమె పరమధర్మమని రావణ మదిలో నెఱుగవుగా
రాముని బాణము తిరుగులేనిదని రావణ యెన్నడు నెంచవుగా
రాముని క్రోధము ప్రళయానలమని రావణ తెలియగ నేరవుగా
రాముని శ్రీహరి యవతారమని రావణ తెలియగ నేరవుగా

రాముని యెదిరించిన చత్తువది రావణ తప్పదు నమ్మవయా
రాముని శక్తికి యెల్లలు లేవని రావణ చక్కగ తెలియవయా
రాముని శాంతుని జేయువిధానము రావణ యోచన చేయవయా
రాముని దయచే బ్రతుకవచ్చునని రావణ యికపై తలచవయా 

రామ రామ జయ గోవిందా

రామ రామ జయ గోవిందా హరి రమ్యగుణార్ణవ గోవిందా
భూమిసుతాపతి గోవిందా హరి కామితవరదా గోవిందా

రమారమణ జయ గోవిందా హరి రాజీవానన గోవిందా
కుమతివిదారణ గోవిందా హరి గోకులనందన గోవిందా
సుమధురభాషణ గోవిందా హరి సుందరవిగ్రహ గోవిందా
సమానాధికవర్జిత నీవే శరణము శరణము గోవిందా

అనాధరక్షక గోవిందా హరి అమితదయాపర గోవిందా
వనమాలాధర గోవిందా హరి వసుదేవాత్మజ గోవిందా
మునిజనమోహన గోవిందా హరి ముక్తిప్రదాయక గోవిందా
జననాధోత్తమ రామా నీవే  శరణము శరణము గోవిందా

దశరథనందన గోవిందా హరి దాసపోషకా గోవిందా
దశముఖమర్దన గోవిందా హరి ధర్మవివర్ధన గోవిందా
యశోవిశాలా గోవిందా హరి యజ్ఞవివర్ధన గోవిందా
నిశాచరాంతక నిరుపమవిక్రమ నీవే శరణము గోవిందా


25, మే 2023, గురువారం

రామదేవుడా శ్రీరామదేవుడా

రామదేవుడా శ్రీరామదేవుడా ని

న్నేమరక కొలిచెదము రామదేవుడా


భూమిజనుల నేలు నట్టి రామదేవుడా మాకు

కామితముల నిచ్చు నట్టి రామదేవుడా

స్వామి వంటె నీవేలే రామదేవుడా నిన్ను

ప్రేమతోడ కొలిచెదమో రామదేవుడా


రక్షించితి వింద్రాదుల రామదేవుడా నీకు

లక్షణముగ మ్రొక్కేమో రామదేవుడా 

రక్షకు లింకెవ్వరయ్య రామదేవుడా మమ్ము

రక్షించెడు తండ్రి వీవె రామదేవుడా


రయమున మమ్మేలు నట్టి రామదేవుడా దయా

మయుడవైన మాతండ్రీ మంచిదేవుడా

జయశీలుడ వైన రామచంద్రదేవుడా భవ

భయమును వెడలించు నట్టి భగవంతుడా


భాగ్యమనగ వేరొక టున్నే

కం. ఎవరున్నను లేకున్నను

రవికులపతి నీవు కలవు రామా తోడై

భువనేశ్వర నావాడవు

వివరింపగ భాగ్యమనగ వేరొక టున్నే


ఓ రామచంద్రప్రభో.

ఎవరికి ఎవరు తోడు  లోకంలో.

బంధుమిత్రులు పరివారమూ తోడు అనుకుంటారు కాని అందరూ వారివారి యిహలోకయాత్రలో భాగంగా విధివిలాసంగా కొంతకొంతగా తోడుగా ఉన్నట్లు కనిపించేవారే. నిలకడగా ఎవరూ తోడు కారు. కాలేరు.

నమ్ముకున్న దేవీదేవతలు కూడా సృష్టివిలాసంలో భాగమే. మనిషి శతాయుప్రమాణజీవి యైతే దేవతానీకం కల్పాయుప్రమాణం కలవారు.

అహమాదిర్హి దేవానామ్ అన్న నీవే అందరు జీవులకూ నమ్మదగిన తోడు.

ఈభువనాలు అన్నింటికీ అధిపతివి ఐన నీతోడే కదా గొప్పదీ నిజమైనదీ యైన తోడు.

అటువంటి నీవు రవికులపతివైన రాముడవు నాకు తోడుగా ఉన్నావు.

పరామర్శించి చూస్తే యింతకన్నా మహద్భాగ్యం మరొకటి ఉంటుందా?


కనులార నిన్ను చూడగ

కం. కనులార నిన్ను చూడగ
మనసాయెను రామచంద్ర మరి నీకన్నన్
నను జూడ మనసు రాదే
నిను తిట్టగ మనసు రాదు నిజముగ నాకున్

ఓ రామచంద్రప్రభో.

నాకేమో నిన్ను కనులారా చూడాలని మనసై ఉందీ.

నీకేమో నన్ను చూడాలనే మనసులో లేదే.

ఐనా నిన్ను తిట్టటానికి నాకు నిజంగా మనసు రావటం లేదు. 

24, మే 2023, బుధవారం

పరీక్షణ మెంతని జేయుదో

ఉ. భూమిని పుట్టువుల్ మొగముమొత్తుచు నుండెను తొంటి రీతి నీ
ధామము నందు నుందు నన దానికి నౌనని బల్కకుందువే
యేమిది రామచంద్ర భవదీయపదాంబుజయుగ్మ దర్శనం
బేమని యీయకుందువు పరీక్షణ మెంతని జేయుదో ననున్

ఓ రామచంద్రప్రభూ!

ఈ భూలోకంలోఉపాధులు ధరించి వేషాలువేయటం కోసం పుట్టీ పుట్టీ‌ విసుగుతో మొగముమొత్తుతోం దయ్యా అంటే వినవేం! అయ్యా పూర్వం లాగా నీతో కలిసి నీవైకుంఠపురంలోనే ఉంటానంటే సరే అలాగే అని పలుకవు కదా. ఇదేమి పరీక్షయ్యా బాబూ. నీ పాదపద్మాలను చూదామన్నా కనీసం దర్శనం ఇవ్వకుండా ఏడిపిస్తున్నావే! ఇదే మన్నా బాగుందా చెప్పు?

హరికాంత

హరికాంత.
హరి రామాకృతి నారావణునిం 
పరిమార్చన్ నరభావంబు గొనన్ 
సిరి నీకై వెస సీతాసతిగా 
యరుదెంచెం గద యబ్జాక్ష భళీ


ఓదేవా శ్రీహరీ నీవు రావణుణ్ణి సంహరించటానికి సంకల్పించావు. దానికి గాను నీవు నరభావాన్ని స్వీకరించావు. రాముడివై జన్మించావు.

నీకార్యక్రమంలో పాలుపంచుకోవఠటానికై నీయర్ధాంగి లక్ష్మీ దేవి కూడా వెంటనే సంకల్పించింది. తాను సీతాసతిగా అవతరించింది. నీచేత రావణవధ చేయించింది. 

ఇదెంతో భలేగా ఉంది. ఎందుకంటే రావణుడి బలహీనతనే పావుగా వాడుకొని మీరు మంచి లీలావినోదం చేసారు కదా.

(హరికాంతవృత్త లక్షణచర్చ.  ఈ హరికాంత ఒక అందమైన వృత్తం. ఈ వృత్తానికి స-భ-త-వ అనేది గణక్రమం. పాదానికి పదకొండు అక్షరాలు. వృత్తం కాబట్టి ప్రాస నియమం తప్పదు. 7వ స్థానంపైన యతిమైత్రి చేయాలి. పాదం ఉత్తరార్ధం త-వ అని గణక్రమం ఉన్నా నిజానికి అది గగ-స అన్నట్లుగా అనిపిస్తుంది. అలా చూస్తే పాదంలో నాలుగు చతుర్మాత్రా గణాలు వస్తున్నాయి. అందుచేత ఈవృత్తానికి చతురస్రగతిలో కనిపిస్తూ ఉంటుంది నడక. యతిస్థానం వద్ద వృత్తపాదం మాత్రాపరంగా సమద్విఖండితం అవుతుంది 8+8 మాత్రలుగా.) 

22, మే 2023, సోమవారం

సర్వలోకప్రియుండవు సర్వవ్యాపివి నీవు

సర్వలోకప్రియుండవు సర్వవ్యాపివి నీవు
సర్వసంపూజ్య రామసార్వభూమ

సర్వలోకపోషకుడవు సర్వదాప్రసన్నుండవు
సర్వశక్తిమంతుండవు సర్వభక్తవినుతుండవు
సర్వేశ్వరేశ్వరుడవు సర్వలోకరక్షకుడవు
సర్వార్ధప్రదుండవును స్వామి నీవు

సర్వదృగ్వ్యాసుండవు సర్వతోనేత్రుండవు
సర్వాసునిలయుండవు సర్వయోగలక్షితుడవు
సర్వప్రహరణాయుధుడవు సర్వవిధ్భానుండవు
సర్వతోముఖుండవును స్వామి నీవు

సర్వదావిజయుండవు సర్వయజ్ఞఫలదుండవు
సర్వదేవప్రధానుడవు సర్వదేవమయుండవు
సర్వదుఃఖమోచనుడవు సర్వగుణోపేతుండవు
సర్వపావనుండవును స్వామి నీవు

సద్గతి కారణమగు కార్యము

కం. శ్రీరామచంద్ర శుభములు
కూరిమితో నిచ్చు నిన్ను కొలుచుట కన్నన్
వేరొక టున్నదె సద్గతి
కారణమగు కార్యమొకటి క్ష్మావలయమునన్

చక్కదనం

చక్కని పదగుంఫనముల
చక్కని భావముల మిగుల చక్కని శైలిన్
నిక్కెడు కందము సుజనులు
మిక్కిలి మెచ్చెదరు కాని మెచ్చ రితరముల్

చక్కని సంకీర్తనముల
చక్కని కుసుమముల మిగుల చక్కని భక్తిన్
చక్కగ చేసిన పూజను
మిక్కిలి  రామయ్య మెచ్చు మెచ్చ డితరముల్ 


మీకు మాతో‌పనియేమి దూతలారా

దూతలారా యముని దూతలారా మీకు 
మాతో‌పనియేమి దూతలారా 

శ్రీరామనామము చేయని జిహ్వను శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ జిహ్వను శ్రీరామనామము విడువ దిది
 
శ్రీరామసేవను చేయని కరముల శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ కరముల శ్రీరామసేవను విడువ వివి
 
శ్రీరామునకు మ్రొక్కనొల్లని తనువుల శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ తనువును శ్రీరామునకు గాని మ్రొక్క దిది
 
శ్రీరామదర్శనరక్తిలేని కనుల శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ కన్నుల శ్రీరామునే చూడ గోరు నివి
 
శ్రీరామచింతన విడచిన యాత్మల శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ యాత్మను శ్రీరామతత్త్వమే తలచు నిది
 
శ్రీరాముని మోక్ష మడుగని జీవుల శిక్షించు కాలుని దూతలారా
మీరు శిక్షించలేరీ జీవుని శ్రీరాముడు మోక్షమిచ్చినాడు
 

ఇది మేమిజీవిత మిట్లేల చేసితివి

ఇది మేమిజీవిత  మిట్లేల చేసితి వీశ్వర నాకీ శిక్షేమి
ఇది యెన్నినాళ్ళిట్లు కొనసాగవలె నింక నీశ్వర దీనికి యంతేది

రామనామము నందు రక్తిలేని పత్ని నేమని యిచ్చితి వయ్యా రామా
రామనామము నందు రక్తిలేని బలగ మేమని యిచ్చితి వయ్య రామా
రామా యంటే నవ్వు జనులమధ్య బ్రతుకు నేమని యిచ్చితి వయ్యా రామా
రామకీర్తన పాడు శక్తిలేని కంఠ మేమని యిచ్చితి వయ్యా రామా

ఏజన్మలో నెట్టి పాపమ్ము జేసితి నీజన్మలో నిట్లు పండినది
ఏజన్మలో నెవరి నెంతేడిపించితి నీజన్మలో నింత దుఃఖమాయె
ఏజన్మలో నెంతగర్వించి తిరిగితి నీజన్మలో నిట్టి దీనతకు
ఏజన్మలో  నెవరి నేడ్పించి నవ్వితి నీజన్మలో నవ్వు మాయమాయె

ననుగన్న నాతండ్రి నాదైవమా రామ వినవయ్య నామనవి నికనైనను
వనజాతాసనవాసవాదివినుత రామ బ్రహ్మాండనాయక పురుషోత్తమ
ఘననీలనీరదసుశ్యామ రామ వినతాసుతాతురగ వినవయ్య
వినవయ్య నామనవి విశ్వపోషక రామ విడిపించు మీచెఱను వేగముగ


21, మే 2023, ఆదివారం

పూలమాలలు దాల్చి బాలరాముడు

పూలమాలలు దాల్చి బాలరాముడు తులసి
పూలమాల లడిగెను ముద్దుముద్దుగ

అందమైన మల్లెలతో నతిశయించు మాలలు
అందమైన మొల్లలతో నల్లినట్టి మాలలు
అందమైన విరజాజుల నమరించిన మాలలు
అందాల బాలుని మెడ నందగించగా

పన్నుగ సుమనోజ్ఞమైన వకుళపుష్పమాలలు
ఎన్నెన్నో రంగులపూ లేర్పరచిన మాలలు
చిన్నిచిన్ని మాలలు చిట్టిచిట్టి మాలలు
అన్నియు మన బాలుని మెడ నందగించగా

మందిరమున హరిమెడలో నమరినట్టి మాలలు
మందిరమున శివునిపైన నమరినట్టి మాలలు
వందనముల నందుకొన్న పావనశుభమాలలు
అందాలబాలుని మెడ నందగించగా


20, మే 2023, శనివారం

కనులారా కనులారా కనవలె హరిరూపమే

కనులారా కనులారా కనవలె హరిరూపమే
ఘనత యదే కదా నరుల కన్నుల కనగ

హరి మంగళమూర్తినే యరయరే కనులార
నరుల ముఖము లెన్ని చూచినా ఫలమేమి

మునులు చూచి మురియు రామమూర్తినే కనులార
తనివితీర కాంచకుండ తక్కొరు కననేల

మున్నహల్య తపముచేసి గన్న శుభదమూర్తిని
కన్నదే సఫలత యని కనుగొనరే కనులారా

మున్ను శబరి వేచివేచి గన్న పుణ్యమూర్తిని
కన్నదే మీయునికికి ఘనఫలము కనులారా

కన్నంతనె పాపరాశి కాలుగదా కనులారా
యన్నన్నా తదితరముల నరయగ నేల

కన్నంతనె మోక్షమే కలుగు కదా కనులారా
కన్నులున్నందు కదే కదా ఫలమగు కనులారా


అదుపులేని నోరా అందమైన నోరా

అదుపులేని నోరా అందమైన నోరా
వదలవే నీతప్పుడు పనులనింక

పొగడరాని వారి నురక పొగడెడు నోరా యింక
పొగడవే శ్రీహరిని పురుషోత్తముని

వేడరాని వారి వేడు వెంగలి నోరా యింక
వేడవే రాముడై వెలసిన హరిని

రుచులకొఱకు శుచినిమరచి రొప్పెడు నోరా యింక
రుచి యన హరినామము రుచి యునుకోవే

బహుమంత్రము లుఛ్ఛరించి బడలిన నోరా యింక
అహర్నిశలు రామమంత్ర మనుష్ఠించవే


విందులు చేసే నందరి కనులకు

విందులు చేసే నందరి కనులకు సుందరరాముడు మధుర
మందహాసమృదుచంద్రికలతో మసలే రాముడు

ముద్దులుపెట్టే ముగ్గురుతల్లుల ముందర రాముడు చాలా
విద్దెము చూపే నింటికి మిక్కిలి వెలుగౌ రాముడు
పెద్దలకాళ్ళకు మ్రొక్కుట నేర్చెను ముద్దులరాముడు చాలా
ఒద్దిక కలిగిన మంచిబాలుడై యుండెడి రాముడు

అన్నదమ్ములా నలుగురు నొకటై నాడుచు నుండగను చాలా
కన్నులపండువ కాగా నరపతి కలియుచు నాడును
అన్నులమిన్నలు రాణులందరకు నానందము గాను రాముడు
క్రొన్నెలరాతి తలముల నాడును వెన్నెలబాలుండై

కైకమ్మకు తన భరతుని కంటెను గాఢము రామునిపై ప్రేమ
లోకోత్తరుడు మారాము డది మీకే మెఱుకనును
అకలి యంటే‌ రాముడు కైక మ్మల్లల్లాడేను రాముడు కైకా
నాకొడుకా నీకొడుకా యనుచును నవ్వును కౌసల్య
 

హరినామ మొకటి చాలు నంతే నయ్యా

హరినామ మొకటి చాలు నంతే నయ్యా
మరి యితరము లెందు కవి మరచిపొండయ్యా

హరినామధనము చాలు నంతేనయ్యా
మరి వెంటరాని ధనము మనకేలయ్యా

హరినామభజన చాలు నంతేనయ్యా
మరి నరులను కొలుచు కర్మ మనకేలయ్యా

హరినామ మొకటె మధుర మంతేనయ్యా
మరి వేరే మిఠాయిలు మనకేలయ్యా

హరినామ మొకటె సుఖద మంతేనయ్యా
మరి యితరసుఖము లెల్ల మనకేలయ్యా

హరినామము మరువరా దంతేనయ్యా
మరి యన్యము తలచుపని మనకేలయ్యా

హరేరామ యంటే చాలు నంతే నయ్యా
మరి వేరే మంత్రములు మనకేలయ్యా

19, మే 2023, శుక్రవారం

కలియుగమున మోసగాళ్ళు ఘనులయ్యేరు

కలియుగమున మోసగాళ్ళు ఘనులయ్యేరు
పలువిధముల సామాన్యులు బలియయ్యేరు

అబధ్ధాలు చెప్పెడు జను  లధికమయ్యేరు
ప్రబుధ్ధులు పితరులనే పట్టికొట్టేరు
అబలలపై యకృత్యంబు లాచరించేరు
ప్రబలి దుండగములు సకల ప్రజలేడ్చేరు

చిన్నచిన్న గారడీలు చేయనేర్చేరు
తిన్నగా కొత్తకొత్త దేవుళ్ళయ్యేరు
మిన్నుముట్ట ప్రచారము మెరిసిపొయ్యేరు
అన్నన్నా నమ్మిన జన మాగమయ్యేరు

శ్రీరాముని నిందించుచు చెలరేగేరు
ఆరావణు నగ్గించుచు నరచుచుండేరు
శ్రీరాముని భక్తజనులు చెదరకుండేరు
కారులరచు వారు నరకగాము లయ్యేరు
 

రామ రామ యంటే మోక్షప్రాప్తి ఖాయము

రామ రామ యంటే మోక్షప్రాప్తి ఖాయము హరే
రామ రామ యంటే మరల రాదు జన్మము

నరులసేవ చేయుటలో నలుగుచుండ నేటికి
నరుడు రామసేవకుడై నడచిన చాలు
పరులసేవ వలననైన బడలిక మటుమాయమౌ
మరల నొరుల సేవించెడు మాటేలేదు 

నరుడు చిత్తశుద్ధితోడ నామదీక్షను గొని
హరేరామ హరేకృష్ణ యనినచాలును
పురాకృతం బంతయును బూదియై పోవును
మరియు నింక జన్మమన్మ మాటేలేదు

నరుడు వేరు మంత్రములను నమ్ముకొనగ నేటికి
హరినామము భవతారకమై యుండగను
నిరుపమానరామమంత్రనిష్ఠ కలిగితే చాలు
మరల నింక పుట్టువన్న మాటేలేదు


18, మే 2023, గురువారం

విందుకు రమ్మని పిలచిన

విందుకు రమ్మని పిలచిన మెగమోట
మెందుకురా రఘునందన నేడు

కులతిలక మాయింట గొప్పవిందని నిన్ను
పిలచెనా కైకమ్మ ప్రియముగ నేడు
వలచి సహపంక్తికి పిలచెనా లక్ష్మన్న
తెలుపరా చిక్కేమి దేవదేవ

తెలుగింటి వంటలే తినితిని చీకాకు
కలిగిన దనవుగా కరుణాలవాల
కులుకుచు షడ్రుచులకొలువైన వంటలు
కలికి సీతమ్మతో గైకొనవయ్యా

మాటికి విందుకు మాయింటి కని మొగ
మోటమి పడుదువో భూమిజానాథ
ఏటికి నీకు మొగమాటము బిడ్డలా
రాటముతో బిలువ రారాద రామా


అప్పుడైన నిప్పుడైన నందరకు దిక్కెవ్వరు

తప్పకుండ ఆ రాముడు దశరథాత్మజుడు తప్ప
అప్పుడైన నిప్పుడైన నందరకు దిక్కెవ్వరు

స్వజనులను కడు ప్రేమగ చల్లగా రక్షించువాడు
విజనులైన స్వజనులట్లె ఋజువుగ మన్నించువాడు
కుజనులైన శరణంటే గొప్పగ కాపాడువాడు
సుజనులందరకు చాల శుభముల సమకూర్చువాడు
 
శరణాగత రక్షకుడని చాల పేరు బడినవాడు
సురవైరు పీచమణచి సురలను కాపాడువాడు
నరజాతికి నీతిపధము సరసముగా నేర్పువాడు
కరుణతోడ లోకములను పరిపాలన చేయువాడు

తనపేరే దుర్భరభవతారకమై యొప్పువాడు
తనకీర్తికి యుగములైన తరగని శోభలవాడు
తనవంటి వాడొక్కడు ధరణిలోన లేనివాడు
తన కలరూపము హరియని మునుల కెఱుకైనవాడు

16, మే 2023, మంగళవారం

నిన్నే నమ్మితి నమ్మితి

కం. నిన్నే నమ్మితి నమ్మితి
మన్నింపుము నిన్ను తప్ప మరి యితరుల నే
నెన్నడు కొలువను కొలువను
పన్నుగ  నీకరుణ జూపవలె నో రామా

ఓ రామచంద్రప్రభూ.

నిన్నే నమ్ముకున్నాను. ఆమాట మళ్ళీమళ్ళీ అంటున్నాను.

నిన్ను తప్పించి ఇతరు లెవ్వరినీ సేవించేదే లేదు. ఈమాట కూడా ధృఢంగా మరలా అంటున్నాను.

నన్ను తప్పకుండా మన్నించు.

చక్కగా నాపైన నీవు కరుణను చూపించు.

రక్తినిగొలిపే రాముని నామం

చౌపాయి.
శక్తిని యుక్తి నొసంగెడు నామం
ముక్తివదాన్యత బొలిచెడు నామం
భక్తులు పాడే  భగవన్నామం
రక్తినిగొలిపే రాముని నామం

రామనామం సామన్యమైనది కాదు. 

ఇది భగవంతుడి నామం.

ఉపాసించేవారికి జీవయాత్రను సాగించటానికి అవసరమైన శక్తియుక్తులను ఇస్తుంది రామనామం.

ముముక్షువులకు అదే మోక్షాన్ని ఇస్తుంది.

అందుచేత భక్తులందరూ దీనిని పలువిధాలుగా నిత్యం గానం చేస్తూ ఉంటారు.

బుధ్ధిమంతులకు ఈరామనామం కన్నా రక్తినిగొలిపేది మరొకటి ఉండదు.

(చౌపాయి ఛందస్సు వివరణ. 
దీనిలో భ,స,గగ,నల గణాలు మాత్తమే వాడాలి. నాలుగు పాదాల్లోను పాదానికి నాలుగుగణాలు. ప్రాస నియమం ఉంది. అంత్యప్రాస నియమమూ ఉంది. మూడవగణం మొదట యతిమైత్రి పాటించాలి. జాతి పద్యం కాబట్టి ప్రాసయతి వాడకూడదు) 


నే నడిగిన దెల్ల రామ నిను చేరుటయే

కం. నే నేసిరులను కోరితి
నే నేపదవులను కోరి నిను వేడితిరా
నే నేశక్తుల కోరితి
నే నడిగిన దెల్ల రామ నిను చేరుటయే

ఓ రామచంద్రప్రభూ!
 
నేనేమి సంపదలను నిన్నడిగాను?
నేనేమి పదవులను ఇప్పించమని నిన్ను వేకున్నాను?
పోనీ ఏమన్నా దివ్యశక్తులను ఇమ్మని అడిగానా ని?
లేదే!
ఏమీ అడగట‌ం లేదే!
నే నడిగే దల్లా నిన్ను చేరుకొనే అదృష్టమే కదా.
అది ఇవ్వచ్చును కదా.

మరియేల కలిగె నీరెండు కన్నులు

మధ్యాక్కఱ.
పరమసుందరరూప నిన్ను పొడగాంచ ప్రభవించె గాక
మరియేల కలిగె నీరెండు కన్నులు మహనీయ మూర్తి
సరిసరి వీని బెట్టుకొని శ్రీరామచంద్ర పామరుల
నరయుచు తృప్తిచెందెదనె చెప్పవయా పరమాత్మ
 
 
ఓ రామచంద్రప్రభూ. 

నువ్వు పరమసుందరుడివి.

నిన్ను చూడటం కోసమే ఈశరీరంలో రెండు కళ్ళు పుట్టాయి.
కాకపోతే ఇవెందుకున్నట్లు?
 
ఇలా ఒక గొప్పప్రయోజనం కోసం ప్రభవించిన నేత్రద్వయాన్ని పెట్టుకొని నిన్ను చూస్తానే‌ కాని సరిసరి పామరులను చూస్తూ తృప్తిపడతానా ఏమిటి?

పరమాత్మా, నువ్వే చెప్పు!

తనువున స్వస్థత లేక

మధ్యాక్కఱ.
తనువున స్వస్థత లేక మనసిది తల్లడమందు
మనసున కించుక శాంతి లేనిది మనుగడ యెట్లు
మనుగడ రామనామమును మానిన మనుగడ యౌనె
కనుక నోరాఘవ నన్ను స్వస్థుని గావింపవయ్య
 
ఓ రామచంద్రప్రభూ.
 
శరీరం స్వస్థత తప్పి ఉన్నవేళ మనసు చాలా చీకాకు పడి యుంటుంది. మరి మనస్సుకు కొంచెం కూడా శాంతి లేకపోతే ఎలాగయ్యా బ్రతకటం? 
 
ఏదో శరీరం నిలవటానికి ఇంత తిని నడుగర్రలా ఉన్నంత మాత్రాన ఏమి లాభమయ్యా? 
 
రామనామం చేయటం కుదరని మనుగడ కూడా ఒక మనుగడ యేనా చెప్పు?
 
అందుచేత దయచేసి నాకు స్వస్థత చేకూర్చి రక్షించు!
 
 

15, మే 2023, సోమవారం

నామము చేయని బ్రతుకేలా

రామహరే యని కృష్ణహరే యని నామము చేయని బ్రతుకేలా
నామము చేయని బ్రతుకేలా యీనరజన్మము నెత్తగనేలా

స్వామినామమును పలుకగ నొల్లని చచ్చురసన యుండగనేలా
స్వామిపదాబ్జము లంటగ నొల్లని చాలపొడవు హస్తములేలా
స్వామిసేవలకు పరుగులు పెట్టని చరణయుగళ ముండగనేలా
కామితవరదుడు హరి సేవలకే‌ కలసిరాని యీ తనువేలా
 
హరిసంకీర్తనమున మైమరువక యన్యులతో భాషణమేలా
హరిచరితంబుల శ్రధ్ధగ జదువక యన్యంబుల చదువగనేలా
హరిభక్తులతో చేరి రహించక యన్యులసంగతి గొననేలా
నరజన్మము నీకిచ్చిన హరినే‌ మరచినచో యీ తనువేలా14, మే 2023, ఆదివారం

శ్రీరఘురామ పాహి యని వేడుచు చేరిన

మధ్యాక్కఱ.
శ్రీరఘురామ పాహి యని వేడుచు చేరిన నెట్టి
వారును రామచంద్రు దయ పొంది యవశ్యము ధన్యు
లైరహియింతురు కాని యెన్నడున్ కారు దీనులని
ధారుణి నెల్లవారు గ్రహియించుట తప్పక మేలు

భూమిమీద నున్న అందరూ తప్పక తమ మేలు కోరి గ్రహించవలసిన సత్యం ఒకటుంది.
శ్రీరఘురామా పాహి పాహి అని ఎవరైనా వేడుతూ రాముణ్ణి చేరుకున్నారా వాళ్ళు తప్పకుండా ధన్యులే.
రాముడు శరణన్నవారిని వారు ఎలాంటి వారైనా తిరస్కరించినదే లేదు. ఉండదు కూడా.
అందుచేత రాముణ్ణి పాహీ అన్నానండీ ఆయన శరణం ఇవ్వలేదు అని దీనులై ఎవరూ పలికే అవకాశమే‌ లేదు.
ఈ విషయం గ్రహించితే, గ్రహించి రాముణ్ణి పాహి అని శరణు వేడితే మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుంది.


రాముని వేడుకొనవలె

మధ్యాక్కఱ.
భయములు బాయ వేడుకొన రాముడు భయములు బాపు
జయముల గోరి వేడుకొన రాముడు జయముల గూర్చు
బయిసిని గోరి వేడుకొన రాముడు భాగ్యము లిచ్చు
దయగల వాడు వేడుకొన మోక్షము నైన నొసంగు 
 
 
జనులారా, శ్రీరామచంద్రప్రభువు సర్వసమర్ధుడు.

మీకు జీవితంలో భయకారణం ఏదైనా ఉండి దానిని తొలగించమని ప్రార్ధిస్తే రాముడు తప్పకుండా భయాన్ని పోగొడతాడు.
మీకు జీవితంలో జయం అనేదు దుస్సాధ్యంగా ఉండినట్లైతే రాముణ్ణి వేడుకొంటే ఆయన తప్పక విజయాలు ప్రసాదిస్తాడు.
మీరు భాగ్యం కలగానని కోరుకొంటే రాముణ్ణి మీకు అనంత భోగభాగ్యాలను అందిస్తాడు.
ఆయన ఎంతో దయగలవాడని మీకు అర్ధం అవుతున్నదా?
మీరు ఆయన్ను ఇవీ అవీ‌ ఎందుకు అడగటం? మోక్షమో రామచంద్రా అని అడగండి 
తప్పక ఆయన మీకు మోక్షసిధ్ధిని కలిగిస్తాడు.
అయన దయకు మేర లేదు.

నీదయచాలు భవము తరించెద

మధ్యాక్కఱ.
శ్రీరామ నీనామస్మరణ మానక చేయుచు నుంటి
శ్రీరామ నీభక్తజనుల ప్రీతిగ చేరుచు నుంటి
శ్రీరామ నినునమ్మి యుంటి నన్యుల సేవించనంటి
శ్రీరామ నీదయచాలు భవము తరించెద నంటి 

ఓ రామచంద్రప్రభూ.
 
నీనామస్మరణ మానకుండా నిత్యం చేస్తూ ఉన్నాను.
నీభక్తులతో సంగతి చేస్తున్నాను.
మనసా నిన్నే నమ్మి ఉన్నాను.
నిన్ను తప్ప అన్యులను సేవించ నంటున్నాను.
ఇంక నీ దయ ఉంటే చాలు భవతరణం చేయగలనని అంటున్నాను.
ఇక నీచిత్తం.


పుట్టితి నేమి చేసితిని

మధ్యాక్కఱ.
పుట్టితి నేమి చేసితిని పదుగురు పోయెడు ద్రోవ
పట్టి చరించితి పొట్టకూటికై ప్రాకులాడితిని
గట్టిగ నొక్కనాడు హరి భజనము గావింప నైతి
పట్టితి నేడె నీదు పదపంకజద్వయమును రామఓ రామచంద్రప్రభూ.
 
నేను సామాన్యులలో సామాన్యుడనయ్యా!

పుట్టాను.

ఏమి చేసాను నేను? పదిమందీ పోయే త్రోవలోనే పోయాను.

ఆపదిమందీ‌పోతున్నది తప్పుడు త్రోవ అని నాకు తెలిసే దెలాగయ్యా? అందుకే తెలియక అలా చేసాను.

అందరిలాగే పొట్టకూటి కోసమే‌ జీవితమంతా ప్రాకులాడాను.
 
నిజానికి బుధ్ధిపూర్వకంగా ఒక్క దినమైనా సరే హరిభజన కోసం వెచ్చించింది లేదు జీవితంలో.

అందరి లాగానే చివరిదశలోనే కాస్త కళ్ళు తెరిచాను.
 
ఇప్పుడు నీపాదపంకజద్వయాన్ని గట్టిగా పట్టుకున్నాను.
 
ఇంత ఆలస్యం చేసి లాభం ఏమిటీ అనకు. 
 
అనవులే. నీకు కరుణ ఎక్కువ అని నాకు తెలుసును.

నోరున్నదని పలుకాడ

మధ్యాక్కఱ.
నోరున్నదని పలుకాడ జనులకు కూరిమి తప్ప
వారు తిట్టిన భంగపడుట మనకేల భగవంతుడైన
శ్రీరామచంద్రుని పొగడి పలుకాడ శ్రీకరం బౌను
చేరదీయును స్వామి యన్నది గ్రహించి జీవించ వలయు
 

నోరున్నది కాబట్టి ఊరుకోలేక ఏదో ఒకటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం చుట్టూ‌ ఉన్నవారితో.
కాని మనమాటలు ఇతర జనులకు ఒప్పుదల కాకపోతే? వారితో మనకున్న కూరిమి చెడుతుంది!

కాకపోతే అని కాదు. నూటికి తొంభై మారులు ఇతరులకు మనలో తప్పుతోచే అవకాశం ఇచ్చే పరిస్థితి మనమాటలే కల్పిస్తూ ఉంటాయి.

అంతకంటే ఈనోటి దురదను తీర్చుకుందుకు మంచి ఉపాయం ఉంది.
 
శ్రీరామచంద్రుని పొగడండి.

అది శ్రీకరం.

చివరికి స్వామి మనని చేరదీసుకొనే సదవకాశాన్ని మనం అలా కలిగించుకోవచ్చును.

ఈవిషయం గ్రహించి జీవించాలి మనం.

యీనోటి కెట్టి యలవాటు లున్నవో

మధ్యాక్కఱ.
ఓ రామ యీనోటి కెట్టి యలవాటు లున్నవో వాటి
తీరుతెన్నుల సౌరు లెట్టివో యది తెలిసిన నీకు
వేరుగా నేమని విన్నవించుదు విసివితి దీని
కారణమున నీస్మరణము మనసున కానిత్తు నింక
 
ఓ రామచంద్రప్రభూ.
 
ఏమిటో నయ్యా ఈ నోరు ఎంత చెడ్దదో చూడు.
 
దీనికి ఎలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు తగులుకొని ఉన్నాయో నీకు బాగానే తెలుసును. ఆ అలవాట్ల తీరుతెన్నులు కూడా నీకే నాకంటే కూడా బాగా తెలుసు. 

పిచ్చిపిచ్చి రుచుల కెగబడే ఓ‌నాలుకా రామనామం కన్నా తీయనిది మరే ముందే‌ అని మనసా పదేపదే హెచ్చరించుతున్నా ఈనోరు వినదు.

అవి ఇవి అని అందరితో‌ లోకాభిరామాయణాలు ఎందుకే అవి ఇహమా పరమా అని మొత్తుకుంటున్నా సరే వినకుండా వాటిలో తలదూర్చి లొడలొడ మంటూనే ఉంటుంది.

ఇదంతా ఎంత మనస్సుచేత నిగ్రహింపజేయ చూచినా రసనేంద్రియం యొక్క లోలుపతను ఆపటం నా తరం‌ కావటం లేదు.

దీనికి బోధించీ‌ బోధించీ విసిగిపోయాను.

ఇకపై నీస్మరణం చేసే పనిని నామనస్సుకే అప్పగిస్తున్నాను.

12, మే 2023, శుక్రవారం

రామనామము రమ్యనామము

రామనామము రామనామము రమ్యనామము జనుల
పామరత్వంబనే రోగము బాపునామము

అవనిజాపతి దివ్యనామము - అమితమహిమలు గలుగు నామము
దివిజవరులే పొగడు నామము - దేవదేవుని ముఖ్యనామము
పవనసుతునకు ప్రాణనామము - పరమపావనమైన నామము
భవవినాశము చేయునామము - భవుడు మెచ్చిన రామనామము 
 
సుజను లెప్పుడుపాడు నామము - సురలనేలెడు రామనామము
విజయరాముని దివ్యనామము - వేదవేద్యుని సత్యనామము
కుజను లెఱుగని మంత్రరాజము - గొప్పపాపము లణచు నామము
అజ సుపూజిత మైన నామము - అఖిలసంపద లిచ్చు నామము


భువిని వెలసిన రామనామము - భూరిశుభముల గూర్చు నామము
భువనములనే యేలు నామము - పుణ్యప్రదమగు రామనామము
కవులు పొగడే రామనామము - ఘనతగలిగిన రామనామము
అవని దీనుల బ్రోచు నామము - అసురభయదంబైన నామము

వేయికన్నులుండియు నేరీతి కుదురు

మధ్యాక్కఱ.
భువనైకమోహను దివ్యసుందరమూర్తిని జూడ
నెవనికైనను వేయికన్నులుండియు నేరీతి కుదురు
నవడు దేహేంద్రియములకు కలుగునా యంతటి శక్తి
భువిని యోగీంద్రులే రామచంద్రుని పొడగాంచ గలరు
 
ఓహో రామచంద్రప్రభువు దివ్యసుందరమూర్తిని చూడటానికి ఒకడికి వేయు కన్నులున్నా ఉపయోగం ఉంటుందా? అదెలా కుదురుతుందీ?

ఆ భువనమోహనుణ్ణి ఎవరైనా తమ దేహేంద్రియాల సహాయంతో దర్శించగలగటం సాధ్యమేనా?

కేవలం యోగీంద్రులు మాత్రమే రామచంద్రమూర్తిని చూడగలరు.
ఎందుకంటే వారు చూసేది తోలు కళ్ళతో కాదు, పరమపావనమైన యోగదృష్టితో కాబట్టి.

మరలమరల పుట్టనేమిటికి శ్రీరామచంద్ర

మరలమరల పుట్టనేమిటికి శ్రీరామచంద్ర ధరను పాపిగ తిరుగనేమిటికి
కరకు యమునికి దొరుకనేమిటికి శ్రీరామచంద్ర మరలమరల చావనేమిటికి

తనువుపై నీమోహమేమిటికి శ్రీరామచంద్ర దానికిన్ని సోకులేమిటికి
ధనము నిజమని తలపనేమిటికి శ్రీరామచంద్ర దానికొరకై పరుగులేమిటికి

నిందలెన్నో పొందనేమిటికి శ్రీరామచంద్ర నిష్ఠురములకు క్రుంగనేమిటికి
కొందరు నను పొగడనేమిటికి శ్రీరామచంద్ర కొందరు నను తిట్టనేమిటికి

కోటిజన్మము లెత్తనేమిటికి శ్రీరామచంద్ర కూళనై నేబ్రతుకనేమిటికి
కూటివిద్యల నేర్వనేమిటికి శ్రీరామచంద్ర కూటికొరకై తిరుగనేమిటికి

కన్నుగానని గర్వమేమిటికి శ్రీరామచంద్ర విన్నదనమును పొందనేమిటికి
నిన్నుమరచి యుండనేమిటికి శ్రీరామచంద్ర యెన్ని యితరుల చెడగనేమిటికి

ప్రారభ్దము కరుగదేమిటికి శ్రీరామచంద్ర రామనామము నిలువదేమిటికి
కారుణ్యము చూపవేమిటికి శ్రీరామచంద్ర ఘనముగ నను బ్రోవవేమిటికి

కోటిజన్మము లెత్తి

మధ్యాక్కఱ.
కోటిజన్మము లెత్తి నేను గొప్పగా కూడగట్టినది
నేటికి హళ్ళికిహళ్ళి సున్నకు నిండుసున్నాయె
మాటికి పుట్టిచచ్చుటయు కర్మలు మానక చేసి
వాటిఫలంబులం గొనుట దేనికి పరమాత్మ రామ

ఓ రామచంద్రప్రభూ,
 
ఇప్పటికో కోటి జన్మలను ఎత్తి ఉంటాను.
ఇన్ని జన్మలను ఎత్తినందుకు గాను గొప్పగా కూడబెట్టినది ఏమన్నా ఉందా?
అబ్బే ఏమీ‌ లేదు.
హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా.
అంతే కదా!

మాటిమాటికీ జన్మలను ఎత్తటమూ ఎత్తినందుకు ఫలితంగా చచ్చినట్లు నానాకర్మలూ చేయటమూ తప్పదు.
ఆకర్మల ఫలితాలను అనుభవించటానికి మరొకటి మరొకటి అంటూ‌ జన్మలను ఎత్తుతూనే ఉండటం.

ఇందంతా దేనికయ్యా పరమాత్మా?

11, మే 2023, గురువారం

నేనాడియాడి యలసితి

మధ్యాక్కఱ.
ఈయాట నీకు బాగున్న దేకాని యెంచగ నాకు
హాయిగా నేమియు లేదు నేనాడియాడి యలసితి
ఓ యయ్య నాగోల నీవు చెవిబెట్ట కున్నావి దేమి
న్యాయమో శ్రీరామచంద్ర చెప్పరా యని మొత్తు కొందు

ఓ రామచంద్రప్రభూ!
ఈ యాట ఏదో నీకు చాలా బాగున్నట్లుగా ఉంది.
నీకైతే బాగుందే కాని నాకు మాత్రం ఏమీ బాగా అనిపించటం లేదు.
ఒకప్పుడు అలా అనిపించిందేమో.
అదీ నువ్వు చెప్తే.
కాని రానురానూ నాకు ఈఆటను ఆడీ ఆడీ అలసట వచ్చేసింది.
ఇంక చాలయ్యా బాబూ ఆపుదాం అని నేను ఎంత మొత్తుకున్నా వినవు కదా!
నామాట కొంచెం చెవిని బెట్టవయ్యా అని ఎంతని చెప్పేది?
ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా?

చిన్న జీవుడ నేను

మధ్యాక్కఱ
శ్రీరామచంద్రుడ వీవు మరి చిన్న జీవుడ నేను
భారమ్ము నీపైన నుంచి జీవించువాడను నేను
సారెకు నన్ను భూలోకమందున జన్మింపజేసి
మారజనక వినోదమును పొందెదు మానక నీవు
 
ఓ‌ప్రభూ. నీవేమో శ్రీరామచంద్రుడివి. 
మరి నేనో? 
ఒక చిన్న జీవుడిని.
నీవు చేసిన ఈచరాచరసృష్టిలోని ఎనుబదినాలుగులక్షల జాతుల జీవరాశుల్లో ఒకానొక చిన్నజీవిని.
ఈజీవులకు సంసార మోహాన్ని కల్పించే మన్మథుడికి నీవు జనకుడివి.
పదేపదే నన్ను భూలోకంలో రకరకాల నిమిత్తాలను కల్పించి జన్మింపజేస్తున్నావు.
ఇది నీకొక వినోదం!
ఈవినోదాన్ని నీవు మానుకోవు కదా 
నేనెంత మొత్తుకున్నా వినవు కదా!

నీముందు నిలబడి


మధ్యాక్కఱ.
నీముందు నిలబడి చెప్పుకొనవలె నిజములు కొన్ని
నీముందు నిలబడి చెప్పుకొనవలె నిందలు కొన్ని
నీముందు నిలబడి చెప్పుకొనవలె నేకోరునదియు
నీముందు నిలబడి యెపుడు చెప్పెద నిజముగ రామ

ఓ రామచంద్రప్రభో.

ఈలోకంలో బ్రతికిన నా బ్రతుకును గురించి నా గుండెలో గూడుకట్టకొన్న సంగతులను నీకు చెప్పుకోవాలి.

అదెప్పుడు జరిగేదీ నీవే చెప్పాలి.

నీముందు నిలబడి నేను నీతో చెప్పుకొనవలసిన నిజాలు కొన్నున్నాయి. అవి ఈలోకంలో మరెవరికీ చెప్పుకోలేను. చెప్ప ప్రయోజనం ఉండదు. అర్ధం చేసుకొనే ఓపికా తీరికా ఆసక్తీ ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు. అంత అనురక్తి ఎవరికీ ఉండదు నాపైన.

ఈలోకం పని నిజాలు తెలుసుకోవటం కాదు. నిందలు వేయటమే కదా. నీముందు నిలబడి అన్యాయంగా నానెత్తిన బడిన కొన్ని నిందలను గూర్చి నీకు చెప్పుకోవాలి. వాటిని ఈలోకంలోని జనంతో చెప్పుకోలేను కదా. 

ఇంత బ్రతుకు బ్రతికి ఇంక నేను కోరుకొనేది ఏమిటో కూడా చెప్పుకోవాలి నీకు.

కానీ రామచంద్రప్రభో ఎప్పుడు నీముందు నేను నిలబడి నావిన్నపాలు అందించేది?

దయచేసి చెప్పు స్వామీ. ఎన్నడా భాగ్యం కలిగేది నాకు?

పరమమనోహరమూర్తి

మధ్యాక్కఱ.
పరమమనోహరమూర్తి నేనెంత ప్రాకులాడినను
కరుణతో నీదర్శనమును చక్కగా కల్పించ కీవు
దరిజేరి నిలచి నోరార పలికెడు దారియే లేదు
మరి యెందు బోదు నీవెపుడు నన్నురమ్మందువో రామ

ఓ రామచంద్రయ్యా. పరమమనోహరమూర్తివి నువ్వు.

సంతోషంగా నీతో కబుర్లలో మునగాలని ఉంటుంది.

కానీ అందుకు దారేదయ్యా?

ముందుగా నాకు నీదర్శనభాగ్యాన్ని అనుగ్రహించాలి కదా నువ్వు.

లేకపోతే మనసమాగమం ఎలాగు చెప్పు?

నేనెంతగా ప్రాకులాడినా సరే నువ్వు దర్శనం అనుగ్రహించనిదే నేనేమీ చేయలేను కదా!

ఎక్కడికి పోను? ఎవరితో మొఱపెట్టుకోను?

నీ అనుగ్రహం తప్ప వేరే దారేదయ్యా నాకోరిక తీరటానికి?

ఎప్పుడు నన్ను నీదర్శనానికి రమ్మని పిలుస్తావో కదా! వచ్చాక మరి కదలను సుమా!

నరులతీరు నానారకాలు

మధ్యాక్కఱ.
ఒక డిల భోగలంపటుడుగా నగు నొక్కడు కాడు
ఒక డన యోగిపుంగవుడుగా నగు నొక్కడు కాడు
ఒక డగు రామభక్తునిగ నొక్క డయోగ్యత నుండు
ఒకటగునా ప్రపంచమున నీనరు లుండెడి తీరు 

రామచంద్రప్రభో. ఈ ప్రపంచంలోని మనుష్యుల తీరుతెన్నులు రకరకాలు.

ఒకడేమో భోగలంపటుడిగా ఉంటాడు. ఎంతసేపూ ఏదో సుఖపడాలనే యావ తప్ప మరేమీ వాడి జీవితానికి పట్టదు. ఎవరన్నా ఈభోగాతురతకు ఆవల కూడా జీవించ వలసిన అగత్యమూ అవకాశమూ ఉన్నాయని వాడి చెవిలో ఇల్లుకట్టుకొని పోరినా అది.వాడికి కొంచెం కూడా ఎక్కదు.

కాని ఈలోకంలో ఇలాంటి భోగాసక్తులు ఉన్నవాడి లాగానే అవి లేని వాడూ కనిపిస్తూనే ఉంటాడు.

వాళ్ళలో ఒకడు యోగిపుంగవుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు. మనకు తెలియవచ్చును. తరచుగా అస్సలు తెలియకపోవచ్చును.

భోగాసక్తి లేనివాళ్ళు అందరూ విరక్తులేనా అంటే కాకపోవచ్చును. కొందరు కేవలం భోగాసక్తి లేనట్లు కనిపించే వాళ్ళే కాని కేవలం అశక్తత వలననో సమాజం మెప్పుకోసమో అలా నటిస్తూ ఉండవచ్చును.

యోగులు అరుదే.

అలాగే ఒక్కొక్కడు రామభక్తుడుగా ఉంటాడు. మరొకడు కాడు.

తారకనామం చాలని తెలిసినా మనసారా నోరారా చేసే భాగ్యం అందరికీ రాదు. 

అవసరానికి మాత్రం గుడికి వెళ్ళే అయోగ్యులే ఎక్కువగా ఉంటారు లోకంలో. 

ఎంత చదివినా ఎంత తెలిసినా వారి జన్మాంతరసంస్కారం వారిని అయోగ్యులుగానే ఉంచుతోంది.

ఇలా నరుల తీరు నానారకాలుగా ఉంది.

ఇహపరసాధకమైనది తెలియగ

ఇహపరసాధకమైనది తెలియగ నీరఘురాముని కీర్తనము
బహుజన్మంబుల ఘనపుణ్యార్జనఫల మీరాముని కీర్తనము
 
మనసారా హనుమంతుడు చేయును మానక రాముని కీర్తనము
ఘనులగు యోగీంద్రులు నిత్యంబును గావింతురు హరికీర్తనము
మనసిజవైరియు మురియుచు చేయును మానక రాముని కీర్తనము
వనజాతాసనవాసవాదులకు ప్రాణము రాముని కీర్తనము 

ధనములకొఱకై వెంపరలాడుచు ధరను తిరుగువా రెరుగరిది
కనకాంగులపై భ్రమపడువారికి కానరాని ఘనసత్యమిది
తనువులు సత్యంబనుకొనువారికి మనసుల కెక్కని మాటయిది
వినుతశీలురగు సజ్జనులెప్పుడు వినయముతో‌ సేవించునది
 
రామా యని కీర్తించినంతనే రాలిపడునురా పాపములు
రామా యని కీర్తించినంతనే‌ కామితములు నెఱవేరునురా
రామా యని కీర్తించినంతనే క్షేమము సౌఖ్యము కలుగునురా
రామా యని కీర్తించినంతనే రాముని సన్నిధి కలుగునురా

రాముడు లేడు లేడనెడు వారికి

మధ్యాక్కఱ
రాముడు లేడు లేడనెడు వారికి రాముడు లేడు 
రాముడు విశ్వనాథుడను వారికి రాముడు కలడు
రాముని నరులు నమ్మినను మానిన రాఘవున కన
నీమహి జీవులందరును బిడ్డలె యెల్లవేళలను


కొందరు మహానుభావులకు రాముడు విశ్వనాథుడు. కొందరు నాస్తికశిఖామణులకు రాముడు లేనేలేడు. మనిషికి భావనాస్వాతంత్యం ఉంది కదా. ఉండనివ్వండి. నచ్చిన వారు నమ్ముతారు. లేకపోతే లేదు. కాని చూడండి. రాఘవరాముడికి ఈభూమిని ఉన్న జీవులందరూ సంతానమే.  తనని గౌరవించే బిడ్డలనూ తనను తిరస్కరించే బిడ్డలనూ‌ కూడా తండ్రి సమానంగానే ప్రేమిస్తాడు కదా. అలాగే రామచంద్ర ప్రభువు కూడా.

ఓ మహనీయమూర్తి దయయుంచుము

ఉ.ఓ మహనీయమూర్తి దయయుంచుము రాఘవ రామచంద్ర యీ
బాముల సంఖ్య యొంతయగు వందలు వేలగు లక్షలౌననౌ
స్వామి యవన్నియుం గడచి వచ్చితి నేటికి నిన్నుచేరగా
భూమిని నాకు పుట్టువిక పుట్టనిరీతిగ జేయవే‌ ప్రభూ

రామచంద్రప్రభూ, రాఘవా ఇప్పటికి ఎన్ని జన్మలను ఎత్తిఉంటా నంటావయ్యా? ఎన్ని వందలో? ఎన్ని వేలో కావచ్చును. ఎన్నో లక్షలైనా కావచ్చును. పుట్టటమూ కర్మబంధాలలో చిక్కటమూ వాటిపుణ్యమా అని మళ్ళా పుట్టటమూను. ఇదే పనై పోయింది కదా నాకు!

ఐతే ఐనదిలే.

ఇప్పటికైనా ఒక దారిలో పడ్డాను. అన్నన్ని జన్మలను గడచి చివరకి నిన్ను చేరుకున్నాను. ఈచేరుకోవటం అనేది నాభక్తివిశేషంగా నేను అనుకొనే మాటగా మిగిలిపోతే ఎలాగు?

ఇకనైనా నాకు మళ్ళా పుట్టే అవసరమే పుట్టకుండా చెయ్యవయ్యా ప్రభూ.

8, మే 2023, సోమవారం

శ్రీహరి స్మరణమే

శ్రీహరి స్మరణమే ధనము శ్రీహరి స్మరణమే సుఖము 
శ్రీహరి స్మరణమే శుభము శ్రీహరి స్మరణమే జయము 

శ్రీహరి స్మరణమే జీవులందరకు చింతల దీర్చే సాధనము
శ్రీహరి స్మరణమే సజ్జనులందరు చేయుదు రెప్పుడు నిత్యము
శ్రీహరి స్మరణమే ముముక్షువులకు మోహప్రశమనౌషధము
శ్రీహరి స్మరణమే భవరోగమునకు సిధ్ధౌషధము పథ్యము 
 
శ్రీహరి స్మరణమే బ్రహ్మదేవుడు చేయుచుండు తానెప్పుడును 
శ్రీహరి స్మరణమే రామ రామ యని చేయుచుండు శివదేవుడు
శ్రీహరి స్మరణమే దిక్పాలకులును చేయుచుందురు నిత్యమును
శ్రీహరి స్మరణమే సకలలోకముల చెలగును రక్షాకవచముగ

శ్రీహరి స్మరణమే చేయనివారిల యూహకందదా సౌఖ్యము
శ్రీహరి స్మరణమే చేయువారలను చేరడు యముడెన్నడును
శ్రీహరి స్మరణమే చేయుట కంటెను చేయదగిన దేమున్నది
శ్రీహరి స్మరణమే చేయండి ఇక చెచ్చెర హరినే చేరండి

7, మే 2023, ఆదివారం

ధారుణి జనులకు రక్షణకవచము

ధారుణి జనులకు రక్షణకవచము దశరథరాముని నామమే
ఆరూఢిగ నా నామప్రభావం బద్భుతముగ రక్షించును

క్రూరులమాటలు మనసును మిక్కిలి కుళ్ళబొడిచిన వేళను
సారకు దుష్టుల పాపకృత్యములు దారులు మూసిన వేళను

పాతపాపములు పండిపాములై పగగొని మూగిన వేళను
ధాతవ్రాతచే ఘోరాపదయే తనతలపైబడు వేళను

పెద్దల మాటలు వినని ఫలితముగ విధమెల్లను చెడు వేళను
హద్దులు దాటిన కామక్రోధముల నాపదలెదురగు వేళను

చేసిన మంచికి చెడుఫలితము తన చేతికి వచ్చిన వేళను
బాసలు చేసినవారే నిండామోసము చేసిన వేళను

రాసులుపోసిన సంపదలు తన ప్రాణము కాయని వేళను
చేసినమంత్రోపాసన లన్నీ చిన్నబుచ్చి చెడు వేళను

తనవారని తా నెన్నిన వారే తనకు దూరమగు వేళను
తనను పిలచుచును కాలుని దూతలు తనను చేరుకొను వేళను

జయజయ జయజయ వీరాంజనేయ

జయజయ జయజయ వీరాంజనేయ జయ సురవరనుత వీరాంజనేయ

శ్రీరామదూతా వీరాంజనేయ వీరవరేణ్యా వీరాంజనేయ
వారిధిలంఘన వీరాంజనేయ వంచితసురసా వీరాంజనేయ

సింహికాంతక వీరాంజనేయ సింహనాదయుత వీరాంజనేయ
సింహాయతబల వీరాంజనేయ చిత్స్వరూప హరి వీరాంజనేయ

సుమధురభాషణ వీరాంజనేయ విమలస్వభావ వీరాంజనేయ
అమితపరాక్రమ వీరాంజనేయ అద్భుతవిగ్రహ వీరాంజనేయ

ఆహవపండిత వీరాంజనేయ హతదోషాచర వీరాంజనేయ
భీషణనినదా వీరాంజనేయ పింగళనయనా వీరాంజనేయ

లంకిణిమర్దన వీరాంజనేయ శంకితరావణ వీరాంజనేయ
లంకాభయకర వీరాంజనేయ లంకాదాహక వీరాంజనేయ

దినమణిశిష్యా వీరాంజనేయ ఘనసుధృఢవ్రత వీరాంజనేయ
వనవిధ్వంసక వీరాంజనేయ వాయుదేవసుత వీరాంజనేయ


6, మే 2023, శనివారం

ఎంత సుదిన మీదినము

ఎంత సుదిన మీదినము హరి
చింతనతో కలిగె శీఘ్రముగాను

ఇంతలో కనుదెఱచి యంతలో హరిదలచి
చింతన మొదలిడిన దెంతటి దినము
చింతలన్నియు మరచి చింతించి శ్రీహరిని
సంతోషముగ నున్న చక్కని దినము

నారాయణ స్మరణానందమొప్పార
ప్రారంభమైనట్టి బంగారు దినము
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుటతో
తీరుగ మొదలైన తీయని దినము

కొంత యత్నముతోడ కూడినను హరి
చింతన కలదేను జీవా సుదినము
సుంత యత్నములేక శోభిల్లు శ్రీహరి
చింతన నొప్పిన దెంత సుదినము 


హరేరామయని స్మరించరా

హరేరామయని స్మరించరా హరేకృష్ణయని స్మరించరా
స్మరించవలెనని గ్రహించరా స్మరించి హరిని తరించరా

హరిసంకీర్తన పరులను గూడి పరమభక్తితో పాడరా
హరినామామృత మొక్కటిచాలని యందరెఱుగగ చాటరా
పరాత్పరుని శుభనామము కన్నను తరణోపాయము లేదురా
నిరంతరము హరినామము చేయుచు పరాభక్తిని చాటరా
 
సతతము శ్రీహరి సంకీర్తనమే చాలని మనసున నెంచరా
ధృతిమంతుడవై హరిసేవలలో తిన్నగ నిలచి యుండరా
అతిశయించ సద్భక్తి నిరంతర మానందముగా నుండరా
వ్రతముగ శ్రీహరినామామృతమును ప్రతిక్షణంబును గ్రోలరా

అవినయపరులను గూడక నిత్యము హరిసేవకులను చేరరా
భవతారకమని రామనామమును వదలక పెదవుల నుంచరా
వివిధోపాయము లెందుకు మనకని వెన్నును భజనల నుండరా
అవలీలగ భవచక్రము విరచి హరిసాన్నిధ్యము చేరరా

మహరాజు కావచ్చు మన రాముడేగా

మహరాజు కావచ్చు మన రాముడేగా
మహిలోన మనబోటి మానవుడేగా

మనరాముడే గాని మరి వాడినేగా
మునులెల్ల గొప్పగ కొనియాడేది
మనబోటి మానవు డనుకోవద్దు
అనుకొన్నారో అది పెద్దతప్పు

తప్పుడు బుధ్ధుల దండించువాడు
తప్పులే చేయనీ ధర్మాత్ముడతడు
గొప్పగ సురలెల్ల కొనియాడు వాడు
తప్పు మనసాటిగ తలపోయరాదు

మనబోటివాడేమి వనజాసనాది
ఘనులు రాముడు వెన్ను డనినారు కాదె
మనసార సేవించు మనుజుల కెల్ద
తనకృప ముక్తిప్రదాయక మండ్రు 


5, మే 2023, శుక్రవారం

శ్రీరామచంద్రుని పరదైవతంబని

శ్రీరామచంద్రుని పరదైవతంబని చిత్తశుధ్ధిగ నమ్మి యుండండీ మీరు
శ్రీరామభక్తులై యుండండీ సతము శ్రీరామస్మరణమే చేయండీ 
 
శ్రీరామ శ్రీరామ యనువారికే మోక్షసిధ్ధి యన్నది తెలిసి యుండండీ
శ్రీరామ నామంబు జిహ్వాగ్రమందుంచి నోరార స్మరణమే చేయండీ
ఆరూఢిగా రామచంద్రులు మీయందు నత్యాదరము చూపగలరండీ 
శ్రీరామకృపచేత సత్వరంబే ఫలము సిధ్ధించు సందేహపడకండీ

శ్రీరామనామమే చేయుచుండును సతము శివుడు మహదానంద పరిపూర్ణుడై
శ్రీరామనామమే చేయుచుందురు నిర్వికారులై యోగీంద్రు లెల్లప్పుడు 
శ్రీరామనామమే చేయుచుందురు బుధులు చిత్తంబులం దెపుడు నిస్సంగులై
శ్రీరామనామమే భవతారకంబని సేవింతు రెప్పుడును సద్భక్తులు

శ్రీరామనామంబు చేసిన మునిపత్ని చెందెను శాపావసావసానంబును 
శ్రీరామనామామృతంబు పానము చేయ చెందె బ్రహ్మపదవి సామీరి
శ్రీరామదివ్యనామము చేత భూమిపై జీవులకు నశియించు మోహమ్ములు
శ్రీరామకృప గల్గి చెలగు జీవులు వేగ చెందెదరు మోక్షమ్ము నిక్కమ్ముగ

4, మే 2023, గురువారం

రామ రామ జయ రామ రామ జయ

రామ రామ జయ సర్వశుభంకర రామ రామ జయ అసురభయంకర
రామ రామ జయ రాజ్యప్రదాయక రామ రామ జయ మోక్షప్రదాయక
రామ రామ జయ  సంకటనాశక రామ రామ జయ సజ్జనపోషక
రామ రామ జయ రమ్యగుణాకర రామ రామ జయ భవనాశంకర
రామ రామ జయ పంకజలోచన రామ రామ జయ బంధవిమోచన
రామ రామ జయ దశరథనందన రామ రామ జయ దనుజనికందన
రామ రామ జయ రవికులవర్థన రామ రామ జయ బుధ్ధి వివర్థన
రామ రామ జయ భూమిసుతావర రామ రామ జయ శస్త్రభృతాంవర
రామ రామ జయ యజ్ఞఫలోదిత రామ రామ జయ కౌసల్యాసుత
రామ రామ జయ ఖండితతాటక రామ రామ జయ యజ్ఞసుపోషక
రామ రామ జయ  పతితజనావన రామ రామ జయ  మునిసతిజీవన
రామ రామ జయ హరకార్ముకధర రామ రామ జయ వైదేహీవర
రామ రామ జయ సుగుణమహార్ణవ రామ రామ జయ  జననయనోత్సవ
రామ రామ జయ సీతాసేవిత రామ రామ జయ సుఖభోగస్థిత
రామ రామ జయ వల్కల శోభిత రామ రామ జయ ఘనవనసంస్థిత
రామ రామ జయ శరభంగార్చిత రామ రామ జయ పంచవటీస్థిత
రామ రామ జయ సురరిపుభీషణ రామ రామ జయ హతఖరదూషణ
రామ రామ జయ మాయాశోషక రామ రామ జయ సీతాన్వేషక
రామ రామ జయ జటాయుదర్శిత రామ రామ జయ శబరీపూజిత
రామ రామ జయ పవనసుతార్చిత రామ రామ జయ సుగ్రీవార్చిత
రామ రామ జయ వాలివిదారక రామ రామ జయ రాజ్యప్రదాయక
రామ రామ జయ జననిధిబంధన రామ రామ జయ రావణసంహర
రామ రామ జయ దేవగణార్చిత రామ రామ జయ త్రిభువనపాలక

చేయరే హరిభజన జీవులారా

చేయరే హరిభజన జీవులారా మీరు
చేరరే హరిపదము జీవులారా

చేరి నరుల సేవించి చింతలు వంతలు పొంది
మీరు సాధించే దొక మేలున్నదే
చేరి శ్రీహరిని గొల్చి చింతలన్నియు దీరి
మీరు స్వస్థితిని గొనుట మేలే కాదే

వెంటరాని ధనములకు వేడుకొనుచు నితరులను
తంటాలు పడు టెందుకు ధరమీదను
బంటులై హరికి మీరు భజనచేయు నెడల మీ
పంటపండి భవచక్రము బ్రద్దలు కాదే

చెడిపోవును తనువులు చెడిపోవును బంధములు
చెడిపోనిది కర్మబంధసమితి యన్నది
చెడగొట్టుడు దానిగూడ శ్రీరామనామముతో
చెడని మోక్షపదమునకు చేరుకొందురు

రామా రామా నీనామమునే

రామా రామా నీనామమునే రాగము తీయుదును ఘన
శ్యామా రామా నీరూపమునే ధ్యానము చేసెదను
 
చాలును చచ్చుట పుట్టుట యికపై జన్మము వలదని నిన్ను
చాల జన్మలుగ బ్రతిమాలాడినను సరియే ననవాయె నా
మే లీజన్మము లెత్తుట యందే మిక్కిలి యందువొకో ఓ
కాలాత్మక నీలీలల నెప్పుడు గానము చేసెదను
 
వివిధనామముల వెలిగే‌ వెన్నుడ వేడుక మీరగ నిన్ను
భవతారకమగు రామనామమున భావనచేసెదను నే
నవిరళముగ నీ గుణగానంబున నానందించెదను ఓ
రవికులతిలక త్రిభువనపాలక రక్షణ వేడెదను
 
పాలముంచినను నీటముంచినను భారము నీదే నిన్ను
చాలభక్తితో నిత్యము కొలుచుచు సతతము వేడెదనుము
క్కాలంబుల నీదయామృతమునే ఘనముగ తలచెదను ఓ
నీలమేఘఘనశ్యామ దయాళో మేలుగ వేడెదనుహరి యేల నరుడాయె నమ్మలారా

హరి యేల నరుడాయె నమ్మలారా శ్రీ
హరి యేల నరుడాయె నయ్యలారా
 
హరియే లేడని పలికే అతితెలివిగాండ్లకు
సరియైన శిక్షవేయ నరుడాయెను
హరితో వైరము నెఱపే అసురవీరుల ద్రుంచ
సరియైన యదనెఱిగి నరుడాయెను 

దారితప్పి తిరుగువారి దండించవలె గాన
నారాయణుండు నేడు నరుడాయెను
దారి తెలియలేక తిరుగు వారికొక చక్కనైన
దారిచూప శ్రీనాథుడు ధరకువచ్చెను

తామసులను శిక్షించి ధర్మాత్ముల రక్షించ
స్వామి రామనరేంద్రుడై జన్మమెత్తెను
రామనామదివ్యజపపరాయణులౌ నరులకు
నామమిషను ముక్తినీయ నరుడాయెను

వినుతశీలుడైన రామవిభుడు

వినుతశీలుడైన రామవిభు డున్నాడు వాడు
మనుజుల కష్టంబు లెల్ల మాన్పుచున్నాడు

సురలుకోర క్షోణితలము జొచ్చియున్నాడు వాడు
హరి యన్నది మునిపుంగవు లెఱిగియున్నారు

కమలాప్తుని కులమందున కొలువైనాడు వాడు
తిలకించగ సుగుణంబుల నెలవైనాడు

మునుల మేలు కోరి యిదే వనులనున్నాడు వాడు
దనుజులందరను బట్టి దంచుచున్నాడు

రావణుని గర్వమును రాల్చనున్నాడు వాడు
దేవదేవుడని మూర్ఖుడు తెలియకున్నాడు

శరణమంటే ముక్తినిచ్చి సాకుచున్నాడు వాడు
కరుణగలిగి లోకములను కాచుచున్నాడు

పరబ్ర్హహ్మస్వరూపుడై వరలుచున్నాడు వాడు
పరమయోగివరుల కెపుడు పలుకుచున్నాడు


రావయ్య దశరథరాజకుమార

రావయ్య దశరథరాజకుమార నీవు
రావలె సఫలము కావలె తపము

ముని తనను శాంతుండ ననుకొనుచున్నాడు
కనుమిదే క్రోధమ్ము కలిగింతు నని యింద్రు
డనగ కుతూహలము ననుజేర తప్పెంచి
మునిరాజు తపియింప బనిచె నను నీకొఱకు

ముని శాపమిచ్చినా డనుకొను లోకమ్ము
ముని వరమునిచ్చినా డనుకొందును నేను
కనరానిదగు యొక్క ఘనమగు స్థితినుండి
నినుగూర్చి చేయుచుంటిని గొప్పతపము

నాటగోలెను రామనామ మెక్కటి తప్ప
మాట లేదో తండ్రి నోటివెంటను నాకు
మాటవలెనే మనసు మరలదు నీనుండి
నేటి కిటు ఫలియించె నీరాకై రామ 

చింతించరేల మీరు శ్రీరాముని

చింతించరేల మీరు శ్రీరాముని అన్ని చింతలను తొలగించే శ్రీరాముని
అంతులేని సంసారబాధల నంతముజేయు అందమైన పేరుగల శ్రీరాముని 

సురలను సంతోషపెట్టు శ్రీరాముని భూసురులను సంతోషపెట్టు శ్రీరాముని
సరిలేని వీరుడైన శ్రీరాముని కరుణాపయోధియైన శ్రీరాముని
సురవిరోధినాశకుని శ్రీరాముని భాసురచిరసత్కీర్తి గల శ్రీరాముని
పరమయోగిప్రసన్నుని శ్రీరాముని సద్భక్తజనపోషకుని శ్రీరాముని

నిరుపమానసుందరుని శ్రీరాముని శ్రీకరుడు సౌజన్యమూర్తి శ్రీరాముని 
హరి పరాత్పరుడైన శ్రీరాముని పరబ్రహ్మస్వరూపుడైన శ్రీరాముని 
ధరణిజారమణుడైన శ్రీరాముని బహువరదాయకుడైన మన శ్రీరాముని
వరమునిపరివేష్ఠితుని శ్రీరాముని నిర్వాణసుఖదాయకుని శ్రీరాముని