4, మే 2023, గురువారం

రామా రామా నీనామమునే

రామా రామా నీనామమునే రాగము తీయుదును ఘన
శ్యామా రామా నీరూపమునే ధ్యానము చేసెదను
 
చాలును చచ్చుట పుట్టుట యికపై జన్మము వలదని నిన్ను
చాల జన్మలుగ బ్రతిమాలాడినను సరియే ననవాయె నా
మే లీజన్మము లెత్తుట యందే మిక్కిలి యందువొకో ఓ
కాలాత్మక నీలీలల నెప్పుడు గానము చేసెదను
 
వివిధనామముల వెలిగే‌ వెన్నుడ వేడుక మీరగ నిన్ను
భవతారకమగు రామనామమున భావనచేసెదను నే
నవిరళముగ నీ గుణగానంబున నానందించెదను ఓ
రవికులతిలక త్రిభువనపాలక రక్షణ వేడెదను
 
పాలముంచినను నీటముంచినను భారము నీదే నిన్ను
చాలభక్తితో నిత్యము కొలుచుచు సతతము వేడెదనుము
క్కాలంబుల నీదయామృతమునే ఘనముగ తలచెదను ఓ
నీలమేఘఘనశ్యామ దయాళో మేలుగ వేడెదను