14, మే 2023, ఆదివారం

యీనోటి కెట్టి యలవాటు లున్నవో

మధ్యాక్కఱ.
ఓ రామ యీనోటి కెట్టి యలవాటు లున్నవో వాటి
తీరుతెన్నుల సౌరు లెట్టివో యది తెలిసిన నీకు
వేరుగా నేమని విన్నవించుదు విసివితి దీని
కారణమున నీస్మరణము మనసున కానిత్తు నింక
 
ఓ రామచంద్రప్రభూ.
 
ఏమిటో నయ్యా ఈ నోరు ఎంత చెడ్దదో చూడు.
 
దీనికి ఎలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు తగులుకొని ఉన్నాయో నీకు బాగానే తెలుసును. ఆ అలవాట్ల తీరుతెన్నులు కూడా నీకే నాకంటే కూడా బాగా తెలుసు. 

పిచ్చిపిచ్చి రుచుల కెగబడే ఓ‌నాలుకా రామనామం కన్నా తీయనిది మరే ముందే‌ అని మనసా పదేపదే హెచ్చరించుతున్నా ఈనోరు వినదు.

అవి ఇవి అని అందరితో‌ లోకాభిరామాయణాలు ఎందుకే అవి ఇహమా పరమా అని మొత్తుకుంటున్నా సరే వినకుండా వాటిలో తలదూర్చి లొడలొడ మంటూనే ఉంటుంది.

ఇదంతా ఎంత మనస్సుచేత నిగ్రహింపజేయ చూచినా రసనేంద్రియం యొక్క లోలుపతను ఆపటం నా తరం‌ కావటం లేదు.

దీనికి బోధించీ‌ బోధించీ విసిగిపోయాను.

ఇకపై నీస్మరణం చేసే పనిని నామనస్సుకే అప్పగిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.