15, మే 2023, సోమవారం

నామము చేయని బ్రతుకేలా

రామహరే యని కృష్ణహరే యని నామము చేయని బ్రతుకేలా
నామము చేయని బ్రతుకేలా యీనరజన్మము నెత్తగనేలా

స్వామినామమును పలుకగ నొల్లని చచ్చురసన యుండగనేలా
స్వామిపదాబ్జము లంటగ నొల్లని చాలపొడవు హస్తములేలా
స్వామిసేవలకు పరుగులు పెట్టని చరణయుగళ ముండగనేలా
కామితవరదుడు హరి సేవలకే‌ కలసిరాని యీ తనువేలా
 
హరిసంకీర్తనమున మైమరువక యన్యులతో భాషణమేలా
హరిచరితంబుల శ్రధ్ధగ జదువక యన్యంబుల చదువగనేలా
హరిభక్తులతో చేరి రహించక యన్యులసంగతి గొననేలా
నరజన్మము నీకిచ్చిన హరినే‌ మరచినచో యీ తనువేలా