11, మే 2023, గురువారం

నేనాడియాడి యలసితి

మధ్యాక్కఱ.
ఈయాట నీకు బాగున్న దేకాని యెంచగ నాకు
హాయిగా నేమియు లేదు నేనాడియాడి యలసితి
ఓ యయ్య నాగోల నీవు చెవిబెట్ట కున్నావి దేమి
న్యాయమో శ్రీరామచంద్ర చెప్పరా యని మొత్తు కొందు

ఓ రామచంద్రప్రభూ!
ఈ యాట ఏదో నీకు చాలా బాగున్నట్లుగా ఉంది.
నీకైతే బాగుందే కాని నాకు మాత్రం ఏమీ బాగా అనిపించటం లేదు.
ఒకప్పుడు అలా అనిపించిందేమో.
అదీ నువ్వు చెప్తే.
కాని రానురానూ నాకు ఈఆటను ఆడీ ఆడీ అలసట వచ్చేసింది.
ఇంక చాలయ్యా బాబూ ఆపుదాం అని నేను ఎంత మొత్తుకున్నా వినవు కదా!
నామాట కొంచెం చెవిని బెట్టవయ్యా అని ఎంతని చెప్పేది?
ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.