29, మే 2023, సోమవారం

పతితపావనుని పావననామము

పతితపావనుని పావననామము పాడెడు బ్రతుకే ధన్యము
సతతము శ్రీహరి సేవలనుండే చక్కని బ్రతుకే ధన్యము

రామనామమున రంజిలుచుండెడు రసనయె మిక్కిలి ధన్యము
రామనామ గుణకీర్తనములు విను శ్రవణములే కడు ధన్యము 
రాముని మురియుచు చూడగలుగు నేత్రంబులె మిక్కిలి ధన్యము
రాముని కొఱకై ప్రాణము పెట్టెడు నామనసే కడు ధన్యము
 
రాముడిచ్చినది చాలని పలికే‌ బ్రతుకే కడుగడు ధన్యము
రామున కన్యము నెఱుగని జీవుడు భూమిని మిక్కిలి ధన్యుడు 
భూమిని తిరిగెడు జీవుల యందున రాముని భక్తులె ధన్యులు
రాముడు పాలించిన ప్రదేశము భూమిని మిక్కిలి ధన్యము

రాముని కొఱకై వెలసిన కవనమె భూమిని మిక్కిలి ధన్యము
రాముని చరితము చాటెడు వారే భూమిని మిక్కిలి ధన్యులు
రాముని చేరగ కోరెడు వారే భూమిని మిక్కిలి ధన్యులు
రామరామ రఘురామ యనవయా ప్రేమగ ధన్యుడ వౌదువు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.