26, ఏప్రిల్ 2016, మంగళవారం

యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ గురించి.

నేను మా మావయ్యగారు ప్రసాద్ గారికి లేఖ ద్వారా పంపిన ప్రశ్న.

మావయ్యా,

శంకరయ్యగారి సందేహం చూడు-

http://kandishankaraiah.blogspot.in/2016/04/2014.html?showComment=1461583716252#c408472515155664534

యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
ఈ సమస్యలో ప్రథమాక్షరం య అన్నది పద్యము గద్యము కావ్యము వంటి మాటల్లో ఉన్న య కారం కావచ్చునా అన్నది ప్రశ్న.
కాకూడదని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు కావచ్చును. నేనేమీ పండితుణ్ణి కాదు కదా.
కానీ, గుండువారు అలాంటి పూరణలు చేసాక శంకరయ్యగారికే శంక కలిగింది!
నివృత్తి చేయవలసింది.
భవదీయుడు,
శ్యామలరావు.







నా లేఖకు మా మావయ్యగారు శ్రీప్రసాద్ గారి సమాధానం చూడండి.

prasad atreya

10:39 PM (12 hours ago)


to me

చిరంజీవి శ్యామలరావునకు,
అలా పూరించుట సరి యైనదే.

సంధి గతము గా పూరించుట, ఒక అక్షరము కలిపి వేరే అర్థము తెచ్చుట,
ఇచ్చిన సమస్యను ఉత్ప్రేక్ష, ఉపమాన, రూపక, అర్థాంతరన్యాసములుగా చేయుట,
ఇచ్చిన సమస్యలో పదముల విఱిచి క్రమాలంకారము చేయుట,
ఇచ్చిన సమస్యను పద్య మధ్యమము నకు తెచ్చి అర్థము కల్పించుట
ఒప్పిదములే.
1) 'వంగము మీకు నెన్నడును సంతసమే కద బంటు లైననున్
ఇది ఇప్పుడు ఉదాహరణకు నేను సృష్టించిన సమస్య.
ఇందులో యతిభ్రంశము కూడ అయినది.
'పరిష్వంగము మీకు' అని సంధిగతముగా పూరించవచ్చు.

2) కుంజర యూధంబు---అర్థాంతరన్యాస పూరణ.

3) కోడిని తినె--పకోడిని తినె --అక్షరము కలుపుట

4) 'గంగా సుతు డాడె పెండ్లి కన్యా మణులన్!'
ఇది కూడ  ఇప్పుడు నేను సృష్టించిన సమస్య;--- ఉదాహరణ కోసము.
. --ఇది క్రమలంకారములో సులభ సిద్ధము.
కాని, 'కలుగంగా--' అని కూడ చేయ వచ్చు.
5) మంచిని వీడి నెయ్యమున మానవు లౌచు వసింపరే భువిన్.
ఇది కూడ, ఇప్పుడు నేను సృష్టించిన సమస్య.'మంచిని వీడి' దగ్గర comma పెట్టేస్తే సమస్య తేలిపోతుంది.
'మోసము చేయకుండగా  మంచిని వీడి,' అని. 
అట్లు కాక, మానవుడిగా ఉండుము' అని పూరించ వచ్చు.  
6) ప్రాలేయాంశువు బోలె మధ్య దివసార్కద్యోతమానాంగియై.
ఇది నేను ఒక సారి training కోసము ఇచ్చిన సమస్య.
చాల కష్టము పూరించుట.  'చంద్రుని వలె నుండి, సూర్యుని వలె ప్రకాశించెను.'
దీనిలో 'ప్రాలేయంశువు'  నకు అర్థము 'చంద్రుడు' అని కాక, 'కర్పూరము' అని
తీసికోంటే, తేలిక.
ఆ విద్యార్థులు, సత్యభామ నరకాసురునితో యుద్ధము లో వర్ణన తీసికొని
పూరించారు. (చాటువు మాత్రమే, సభలో కాదు.)   
నా పూరణ. 
శా:  బాలాదిత్య సహస్ర తుల్య విలసత్ వర్ష్మంబునన్ బూని స
      చ్ఛీలాత్యంత తపః ప్రభావ జనితాక్షీణోగ్ర కీళావళీ
      లీలాడంబర వహ్ని తేజముల నాళీకాక్షి మండెన్ వెసన్
       ప్రాలేయాంశువు బోలె మధ్య దివసార్కద్యోత మానాంగియై.   
ఇందులో 'ప్రాలేయాంశువు' అంటే 'కర్పూరము'.
వేదవతి తనకు తాను ఆహుతి అగుట.
సూర్యుని  యెవరూ రగిలింపరు, తనకు తాను తేజము పొందుతాడు.
వేదవతి కూడ బాలభానుని వలె నున్నది.
క్రమముగా మధ్యాహ్ణ సూర్యుని వలె మండినది.
రావణునకు చేతిలోని కుంతలములు తప్ప, పట్టుకొనుటకు
ఏమీ మిగుల లేదు. ఆమె కర్పూరము వలె మండి పోయినది.
ఇది నా 'పద్మావతీ కల్యాణము' లో పద్యము.
7) 'జిత మండూక ప దాకు లాప గలవే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.'
ఇది  ఒక అవధానికి ప్రసంగవశముగా ఇచ్చి పూరించ మన్నాను.
ఆయన చాలసేపు ఆలోచించి, 'చాల కష్టము గా ఉంది గురువుగారు' అన్నారు.
ఇది నా పూరణ.
మ.   క్షితిపై వాహిను లెల్ల పంకములతో చెల్వాఱినన్ జూచుచో
         అతి దాక్షిణ్యంబున దేవతలు వర్షాంతంపు కాలంబునన్
         ద్యుతితో రాల్చెడు నిండుబో యన అగస్త్యోద్య ద్రుచుల్ వెల్గె, గ
         ర్జిత మండూక పదాకు లాపగల వే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.
గర్జిత + మండూక + పద + ఆకుల + ఆపగల+ వే + సిద్ధింపగన్ + స్వచ్ఛతల్.
ఆకుల = కలచివేయబడిన 
ఆపగల = నదులలో

అగస్త్య తార, ఎలా ఉన్నదంటే,  దేవతలు, మండూకములచే
బురద బురదైన నదులను వర్షాంత కాలమున
తేర్చుటకు రాల్చు, ఇండుబు కాయా అన్నట్లు ఉంది.
ఇందులో కొంత ఎఱ్ఱనామాత్యుని ప్రయోగము వాడాను.
(అతి గాంభీర్య విభూతి..  అనే పద్యము ఆధారము )
ఇక్కడ, నీవు 'యము'-- ని, -- 'కావ్యము, పద్యము, etc'  గా ఉదహరించి నట్లుగా,
'జిత' ను 'గర్జిత' అని చేసా.
ఆశీస్సులతో,
మావయ్య


ఇటువంటి సమస్యాపూరణకు పూర్వకవి చేసినది ఒక ఉదాహరణ చూపుతాను.

సమస్య. మతిలేని నరుండు మిగుల మన్ననన నొందున్

దీనికి మోచర్ల వెంకన్న అన్న కవి రాజసభలో చేసిన పూరణ ఇలా ఉంది.

కం. హితమాచరించు వారికి
హిత మొనరించుచును   సుజన హితుఁ డగుచును దు
ష్కృత మెప్పుడుఁ జేయను స
మ్మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్


ఇక్కడ సమ్మతి అనేదానిలో విరుపు ఉండంటారా? కావచ్చును. ఇంకా శోధించాలి ఉదాహరణలకు.

పైన ప్రసాద్ గారు చేసిన పూరణ కొంచెం క్లిష్టంగా ఉంది కదా. నా కోరిక మేరకు మనకోసం ఆయన ఇచ్చిన వివరణ ఇదిగో

మ.   క్షితిపై వాహిను లెల్ల పంకములతో చెల్వాఱినన్ జూచుచో

         అతి దాక్షిణ్యంబున దేవతలు వర్షాంతంపు కాలంబునన్

         ద్యుతితో రాల్చెడు నిండుబో యన అగస్త్యోద్య ద్రుచుల్ వెల్గె, గ
         ర్జిత మండూక ప దాకు లాపగల వే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.
భూమిపై, నదులన్నీ, బురదతో నిండినవై, (వర్షర్తువు చేత) చెలువు కోల్పోగా,
(నీలము గా అందముగా ఉండేవి ఎఱ్ఱ బడిపోయి) ; చూసిన దేవతలు దయతో 
వర్షర్తు వాంతమున (శరదృతువు నందు), మెఱయుచున్న ఇండుబ కాయ
(నీరు తేర్చుటకు సాధనము-GEL) రాల్చుచున్నారేమూ అన్నట్లు (అగస్త్య+ ఉద్యత్ + రుచుల్ )
అగస్త్య నక్షత్రము పొడుచునప్పుడు కాంతులు వెలిగెను.
గర్జిత = బెక బెక లాడు ,
మండూక =కప్పల
పద = కాళ్ళచే
ఆకుల = కలచి వేయబడ్డ
ఆపగల = నదులలో (ఆపగాః =నది)
వే = వెను వెంటనే

సిద్ధింపగన్

స్వచ్ఛతల్.
అగస్యోదయము అయ్యే రోజు, వేళ, పంచాగములలో కూడ ప్రత్యేకముగా
ఇవ్వబడును. ఆనాటి నుండి, నదులు తెలి నీటి తో ప్రవహిస్తాయి.
అందుచే, నేను 'అగస్త్య నక్షత్రమును' ఇండుబ కాయ తో పోల్చాను!
చాలా అందముగా వ్రాసా! దీన్నే 'ఆత్మ స్తుతి' అంటారు!
నీకు వీలు ఉంటే, కంది శంకరయ్య గారికి కూడా వినిపించు ఈ పద్యాన్ని.
ఆయన అభిప్రాయము తెలియపర్చు.
దీనిలో, ఎఱ్ఱన పద్యాన్ని కొంత అనుసరించా!
అతి గాంభీర్య విభూతి నేక చుళికా హంకార నిశ్శేష శో
షిత పాథోధి పయస్కుడైన ముని తోచెన్ పుణ్య తేజో మయా
కృతి, నయ్యామ్య దిగంత వీథి, ప్రకట క్రీడా కళాగర్వ గ
ర్జిత మండూక కళంకి తాంబు శుచితా సిద్ధ ప్రదాచార్యుడై.


శంకరయ్యగారు తమ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను.

20, ఏప్రిల్ 2016, బుధవారం

మాయ నన్ను కప్పెనా మంచిదే కదా








     మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
మాయ నన్ను విడచెనా మంచిదే కదా

    


మాయావరణంబు గలిగి మసలుచు నేనుండగా
మాయదారి మనుషులు నా మార్గమెఱుగ జాలరుగా
హాయిగా నిన్ను నే ధ్యానించుకొందునురా
ఓ యీశ్వర యంతకన్న నున్నదా సదుపాయము
మాయ


నీకు నాకు మధ్య మాయ లేకు మంచిదె రామ
ఏకమై యుండెద మది యెంతమంచిదో రామ
నీకిది సమ్మతమే నని నే నెఱుంగుదును రామ
నాకిది యానందమని నీకు మున్నె తెలియును రామ
మాయ


ఎవడ వీవు యేది మాయ  యేది మంచి యేది చెడుగో
యెవడ నేను యెవ్వ రొరులు హెచ్చు తగ్గు లెటుల గలుగే
నివల నవల నున్నవాడ వెంచ నన్నియును నీవ
భవుడ వభవుడవు నీవ పరమసత్యమవు నీవ
మాయ





19, ఏప్రిల్ 2016, మంగళవారం

ఈశ్వరుడంటే హితకరుడు








     ఈశ్వరుడంటే హితకరుడు ఈశ్వరుడంటే శుభకరుడు
ఈశ్వరుడంటే హృదయస్థితుడౌ శాశ్వతపదసంపత్కరుడు

   


ఈశ్వరాఙ్ఞయే లేకుండినచో నిచ్చట నీవే లేవుకదా
ఈశ్వరాఙ్ఞయే కాకుండినచో నేది సుఖేఛ్చ, లేదు కదా
ఈశ్వరునందు నీదు చిత్తమే యెల్లవేళల నిలచినచో
ఈశ్వరుడే నీవాడని తెలియుట కేమి యడ్డము లేదు కదా
ఈశ్వరు డంటే


ఈశ్వరసంకల్పముగా కలిగిన దీజన్మంబని తలచినచో
ఈశ్వరకార్యము నెఱవేర్చుటకే యిలనుంటినని తలచినచో
ఈశ్వరబుధ్ధుల సత్సంగమునే యెల్లవేళల వలచినచో
ఈశ్వరుడే నీవాడైయుండుట కేమి యడ్డము లేదుకదా
ఈశ్వరు డంటే


ఈశ్వరుడిచ్చిన కాల మంతయును నీశ్వరభావన నుండినచో
ఈశ్వర సాంగత్యమునే కోరుచు నెల్లవేళల నిలచినచో
ఈశ్వరమయ మీ జగమున నెల్లడ నీశ్వరునే కనగలిగినచో
ఈశ్వరుడును నీ వొకటి యగుట కింకేమి యడ్డము లేదు కదా
ఈశ్వరు డంటే












నీవార లెవరన్న నేనేమి చెప్పుదు










    నీవార లెవరన్న నేనేమి చెప్పుదును
నీవాడ ననుటకు నిన్ను వారెఱుగరే

   


కాపాడు తండ్రివై కలవు నీ వొకడవని
యీ పేరు కలవాడ వీ యూర నుందువని
రూపురేఖలు నీవి రూపింప నిటులని
యే పగిది నితరులకు నేర్పడ జెప్పుదు
నీవార


నినుగూర్చి తెలియక నిష్ఠురంబుల నాడు
మనుజులే యధికమౌ మహిలోన నినుగూర్చి
వినుతించి చెప్పుచో వినువార లెందరు
పనిమాలి చెప్పినా ఫలితముండదుగ
నీ‌వార


నీవార లెవరైన నావారలే నాకు
భావించి నను గుర్తుపట్టగల రయ్య
ఏ విధంబుగ నితరు లెంచిన నాకేమి
నావాడ  వో రామ నా కదియె చాలు
నీ‌వార








16, ఏప్రిల్ 2016, శనివారం

ఊరూ పేరూ తెలియని వాడా










క్ష్ ఊరూ పేరూ తెలియని వాడా ఓ హృదయేశ్వరుడా
తీరూ తెన్నూ రూపురేఖలూ తెలియని స్నేహితుడా


  
నీ చెయిదంబులు చిత్రములనుచు నిత్యము విందునయా
ఆ చిత్రములనె నిత్యము తలచుచు నానందింతునయా
ఈ చరాచరసృష్టిని చేసిన యీశ్వరుడా ఘనుడా
ఓ చెలికాడా నాకు దక్కితివి యూర నిందరుండ
ఊరూ పేరూ   


వచ్చెడి పోయెడివారు చేయు బహుభంగుల సందడితో
నిచ్చట నాశాజీవుల గడబిడ లచ్చెరువులు గొలుపన్
ముచ్చట గొల్పెడు నరలోకంబున ముదమున నన్నుంచి
నెచ్చెలి యీ నాటకము జూచెదవు నిచ్చలు నాతోడన్
ఊరూ పేరూ


తామరాకుపై నీటిబొట్టువలె తత్త్వఙ్ఞు డనగు నే
నేమియు నెఱుగని వారలు బలికెడి యెగ్గుల నెన్నుదునా
ఓ మహాత్ముడా యీశ్వరుడా నీ వొకడవు తోడుండన్
భూమిని నింగిని పాతాళంబున పొంగుచు నేనుందున్
ఊరూ పేరూ









పరమపదసోపానపటము









    పరమపదసోపానపటన పరుగులిడువాడా
    మరలమరల ముందువెనుకల తిరిగెడు నరుడా

    పరమసుందరమైన పటమున నిలచినావయ్యా
    పరమపదము చేరుదాక సాగిపోవయ్యా
    పరమపదము చేరుదాక సాగిపోవయ్యా

    నిత్యక్రీడా ప్రకటనశీలము నిజముగ నీపటము
    నిరపమానంబైన పట నీవు నేను తిరుగుపటము
    పాపములు పలువిధములైన పాములై కనుపించు పటము
    పుణ్యములు పైకెత్తు నిచ్చెన మెట్లుగా కనిపించు పటము

    పంటపండేదాక పావులు పరుగులెత్తే చిత్రపటము
    ఆడి అలయుచు నున్న గాని ఆపనీయని చిత్రపటము
    సృష్టికే ప్రతిసృష్టివంటి యాటచూపే చిత్రపటము
    జీవుడా నీపరుగు నీదే చేరుకొమ్మను చిత్రపటము

    ఎంతమంచిది పరమపదసోపానపటమో తెలిసినా
    ఎంతసరసమైన యాటకు వేదికో యిది తెలిసెనా
    ఎంతచిన్న పిల్లలైనా ఎంత పండుముసలులైనా
    పంతగించియాడు ఆట మర్మమేమో తెలిసెనా





నిజానికి శర్మగారి టపా క్రింద ఒక వ్యాఖ్యగా మొదలు పెడితే అది ఒక పెద్ద పాట ఐపోయింది. సరేలెమ్మని దాన్నే ఒక టపాగా వేస్తున్నాను. అందుచేత ఈ‌ పాటకు ప్రేరణనిచ్చిన ఘనత శర్మగారిదే. ఇకపోతే ఈ‌పాటలో సరుకేమన్నా ఉంటే అది వ్రాయించిన ఈశ్వరుడి ఘనతయే కాని నాదేమీ లేదు.



15, ఏప్రిల్ 2016, శుక్రవారం

బంటునై నిన్నంటి యుండే భాగ్యమే



   

  

వెంటబడి వేధించు వట్టితుంటరి ననుకొనకు రామా
బంటునై నిన్నంటి యుండే భాగ్యమే కల్పించవయ్యా




ఏటి కొకసారి శ్రీరామచంద్ర యెంచి నిను తలచి
పాటలూ పద్యాలు తప్పులు పాటిసేయక యరచి పాడి
కోటికోరికల చిట్టాను చదివి గొప్పభక్తుడను
సాటి లేరిక నా కటకంచు  జబ్బచరచితినా
వెంటబడి


నిన్నమొన్నటి వాడనా నిన్నెన్నడైనా విడచియుంటిన
ఎన్నిజన్మల నుండి నినునే నెన్నికోరితి నేమి పొందితి
ఎన్నడైనను నన్యదైవము నెన్ని కొలిచుట యున్నదా
వెన్నవంటి మనసు నీదని ప్రేమతో నిను కొలుచుచుంటిని
వెంటబడి


నిన్ను కొలుచు వారిలో నన్నెన్ని చేర్చితి వదియెచాలు
పన్నుగా నన్నంతరంగ భక్తుడంటి వదియెచాలు
ఎన్ని జన్మలు కలుగనేమి ఎన్ని యిడుములు కలుగనేమి
వెన్ను గాచి నాకు నీవు విభుడవై యున్నదియె చాలు
వెంటబడి













14, ఏప్రిల్ 2016, గురువారం

ఏమి చేయమందు వీశ్వరా










       ఏమి చేయమందు వీశ్వరా న
న్నేమి చేయమందు వీశ్వరా




తెల్లవారినది మొదలు కల్లలాడు బ్రతుకాయె
నెల్లప్పుడు  నా కిచట నెవరి నే మందునయా
అల్లకల్లోలవార్థి యైనది నా చిత్తము
చల్లగా నిన్ను తలచజాలు వీలు లేదు రామ
ఏమి


ఏ వారికి హితుడనో ఎరుగరాని లోకమున
నా వారని యెవ్వరిని నమ్ముకొని యుందురా
ఈ వసుధ మీద వీర  లెఱుక గల్గి యున్నారని
నీ వారని యెవరిని నేను తెలిసికొందురా రామ
ఏమి


మస్తకము దురూహల మయమాయె విసివితిని
దుస్తులవలె తనువులను త్రోసిత్రోసి విసివితిని
పుస్తకముల పరమసత్యమును వెదకి విసివితిని
ప్రస్తుతకర్తవ్య మేమొ బాగ సెలవిమ్ము రామ
ఏమి









13, ఏప్రిల్ 2016, బుధవారం

నీ మాట విందునని నా మాట విందువా?









       నీ మాట విందునని నా మాట విందువా
నీ మాటనే సతము నెగ్గించుకొందువా

   


తోలుతిత్తులలోన త్రోయుట మానుమని
వేలమారులు నిన్ను వేడితే వింటివా
నేల మీద నేను నిలబడి యాడితే
చాలు వేడుక నీకు సంకటము నాకు
నీ మాట


కామాదులకు చిక్కి కటకట బడనీక
ప్రేమతో బ్రోవుమని వేడితే విందువా
ఏమోమొ చెప్పేవు యేమార్చి పంపేవు
నీ మాయ నీశ్వరా నామీద జూపేవు
నీ మాట


ఇర్వుర మొక్కటా యిడుము లన్నియు నాకా
యుర్విపై నాయాట లున్నది నీ కొఱకా
సర్వేశ్వరా యింక చాలునంటే వినవు
పూర్వస్థితిని పొంద బుధ్ధాయె రామ
నీ మాట












11, ఏప్రిల్ 2016, సోమవారం

తిన్నగా వాడె పో నిన్నెఱుగు నీశ్వర






     తన్ను తా నెఱిగిన ధన్యాత్ము డెవ్వడో
తిన్నగా వాడె పో నిన్నెఱుగు రామ



ఎన్ని జన్మము లెత్తి యెంతలోకము జూచి
యున్న గాని మన్ను మిన్నుల మధ్యలో
నున్నవాడై జీవు డున్నవా డున్నట్లులె
యున్నాడయా ప్రకృతి నూయల లూగుచు
తన్ను  


ఎందుండి తా వచ్చె నెన్ని మారులు వచ్చె
నెందుల కిట నుండె నెందు బోవగ నుండె
నిందు తన్నుంచిన దెవరన్న జిజ్ఞాస
పొందిన జీవునకు పొటమరించు నెఱుక
తన్ను


క్రమముగా  ప్రకృతిని గడచు నా జీవుడు
క్రమముగా తన్నెఱుగ గలుగు నా జీవుడు
క్రమముగా నిన్నెఱుగ గలుగు నా జీవుడు
క్రమముగా నీలోన గలయు నా జీవుడు
తన్ను








4, ఏప్రిల్ 2016, సోమవారం

జీవుడు మాయలోన చివురించెనా ?









జీవుడు మాయలోన చివురించెనా సం
భావింప వీని యందే ప్రభవించెనా మాయ


ఏది సత్యమో గాని యీ మాయ జీవుని బట్టి
కామాది రజ్జువుల గట్టుచున్న దయ్య
యే మెఱుగని వీని నింతింత యనరాని
వ్యామోహముల ద్రిప్పి బడలించుమా రామ
జీవుడు

మాయలోన జీవుడాయె మాయకన్య మెఱుగ డాయె
వేయి జన్మ లెత్తె గాని విడువకుండ వెంటనంటి
కాయమనే తిత్తినిండ కమ్మియున్న గడుసుమాయ
మాయమాయే తీరు దెలిపి మన్నించుమా రామ
జీవుడు

ఆ యద్ద మట్టి ప్రకృతి యందు నీ కనాదిపురుష
మాయ ప్రతిబింబోపాధిమాత్ర మని విందుమయ్య
నీ యధీనమైన మాయ నెగడించు సృష్టిలోని
మాయదారి జీవులకు మంచి చేయుమా రామ
జీవుడు






1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఈశ్వర నీవే యిచ్చినది . . . .

   



ఈ యానందము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ యుత్సాహము నీ  కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ నిర్మోహత నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ నిస్సంగత నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ విజ్ఞానము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ వైరాగ్యము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ శమ మీదమ మివి యెక్కడివి
   ఈశ్వర నీవే యిచ్చినవి
ఈ శాంతమనఃస్థితి యెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ రామజపం బిది యెక్కడిది  
    ఈశ్వర నీవే యిచ్చినది
ఏరా గడితేరితి విక పోరా
    ఈశ్వర అంతా నీ దయరా