30, సెప్టెంబర్ 2021, గురువారం

దేవదేవ భానుకోటిదివ్యప్రకాశ

దేవదేవ భానుకోటిదివ్యప్రకాశ
రావణాదిదైత్యనాశ రమ్యగుణవిలాస

మాధవ సురగణతోష మాయాధృతనరవేష
సాధులోకసంపోష సతతసత్యసంభాష

మధురమధుర మృదుభాష మదనకోటిసంకాశ
మధుసూదన జగదీశ మామవ హృదయేశ

భోగిరాజేంద్రనుత యోగిరాజేంద్రనుత
వాగధీశవినుత మామవ త్రైలోక్యనుత
 
భృత్యజనపరిపోషక  సత్యవాక్యపాలక
నిత్యభక్తపరిపాలక సర్వలోకపాలక
 
రవివంశవిభూషణ భవబంధవిమోచన
రవిసుధాకరలోచన రామ నారాయణ

రారా రక్షించరా రామచంద్రుడా

రారా రక్షించరా రామచంద్రుడా మన
సారా శరణంటిరా శ్రీరఘువరా

ఓ నారాయణుడా ఆనందరాముడా
శ్రీనాథుడా ఓ సీతాపతీ
దానవమర్దనుడా దశరథరాముడా
జ్ఞానప్రకాశుడా జానకీపతీ

వారిజలోచనుడా వారాశిబంధనుడా
భూరిప్రతాపుడా భూసుతాపతీ
కారుణ్యనిలయుడా కామితార్ధవరదుడా
దారిద్ర్యశమనుడా ధరణిజాపతీ

విశ్వసంధాయకుడా విశ్వసంరక్షకుడా
విశ్వసమ్మోహనకర విమలమూర్తీ
విశ్వసంపూజ్యుడా విశ్వసంపోషకుడా
విశ్వాంతరాత్ముడా విశ్వమూర్తీ













29, సెప్టెంబర్ 2021, బుధవారం

శ్రీరఘునందను శ్రితజనపోషకు చేరవె ఓ మనసా

శ్రీరఘునందను శ్రితజనపోషకు చేరవె ఓ మనసా
కారుణ్యాలయు దయనే నీవు కోరవె ఓ మనసా
 
మానవజన్మము నెత్తినందులకు మరి సహజముగా మనసా
మానక కామక్రోధాదులకు లోనగుదువుగా మనసా
దానివలన హరి యం దనురక్తికి తప్పుచుందువో మనసా
పూనికతో రిపుషట్కము నిక నిర్మూలించవలె మనసా
 
కల్లగురువులే కలికాలంబున నెల్లదిక్కులను మనసా 
కల్లదైవములె కొలుచువారలె గడపగడపకును మనసా
కల్లనిజంబుల తెలిపెడు విబుధులు కానరారుగా మనసా
నల్లనయ్యనే సర్వవిధంబుల నమ్మికొలువవే మనసా

నారాయణుని వేయినామముల నమ్మకముగ నో మనసా
శ్రీరామాయను నామము శ్రేష్టము శివుని సాక్షిగా మనసా
తారకనామము విడువక చేయట తప్పనిసరియే మనసా
ఘోరభవాంబుధి దాట నుపాయము వేరే లేదే మనసా

ధారాధరశ్యామ శ్రీరామ రఘురామ

ధారాధరశ్యామ శ్రీరామ రఘురామ 
కారుణ్యధామ నను కటాక్షించరా
 
నీకు తెలియదా హరి నేలను నరజాతికి
శోకమే‌ హెచ్చన్నది సుస్పష్టముగ
శోకాపనయనంబు నీకు సహజగుణమని
నాకెఱుకే నన్నేలు నారాయణా

మరల పుట్టువులేని మంచివర మీయరా
పరమాత్మ యదిచాలు పతితపావనా
హరి నీవు గాక నన్నాదుకొను వారెవరు
కరుణించరా రామ కమలేక్షణా
 
యేడేడు జన్మలుగ వేడుచునే యున్నాను
పాడిగా దాలసింప పరమాత్ముడా
యేడుగడవు నీవు గాకెవ్వరున్నారు నాకు
నేదు రేపనక రార నీరజాక్షుడా
 

నరజన్మము వృథపుచ్చక హరిని నీవు కొలువరా

నరజన్మము వృథపుచ్చక హరిని నీవు కొలువరా
హరిని కొలిచి హరిదయచే హరిసన్నిధి చేరరా
 
హరిని గూర్చి తెలియ నట్టి నరజన్మము వృథా వృథా
హరిని లోన తలచ నట్టి నరజన్మము వృథా వృథా
హరికి పూజ చేయ నట్టి  నరజన్మము వృథా వృథా
హరికి సమర్పితము కాని నరజన్మము వృథా వృథా
 
హరిలీలలు చదువ నట్టి నరజన్మము వృథా వృథా
హరితీర్ధము లరుగ నట్టి నరజన్మము వృథా వృథా
హరిభక్తుల కొలువ నట్టి నరజన్మము వృథా వృథా
హరినామము చేయ నట్టి నరజన్మము వృథా వృథా
 
తదచు హరేరామ యనని నరజన్మము వృథా వృథా
తరచుగ హరిసేవ లేని నరజన్మము వృథా వృథా
తరచుగ హరిజపము లేని నరజన్మము వృథా వృథా
హరిని కాక పరుల కొలుచు నరజన్మము వృథా వృథా
 

రామ సార్వభౌమ సుత్రామ నీవు కాక

రామ సార్వభౌమ సుత్రామనుత నీవు కాక
నామీద జాలిజూపు నాథుడెవ్వడు

సదాచార పరుడగాను సత్యవర్తనుడ గాను
మదాంధులతోడ దిరిగి మందబుధ్ధినై
సదా దుడుకు పనులజేయు శఠుడనైతి
నిదానించి రామచంద్ర నీవేయిక రక్షించుము

చేసిన పుణ్యంబు లేదు చేయని పాపంబు లేదు
మోసములకు మేరలేదు మోహాంధుడనై
నాసరి లేరనుచు తిరిగి నాశనమైతి
దాసుడను రామచంద్ర దయామయా రక్షించుము

భక్తులతో కలసితిరిగి భక్తినటన జేయుచు నే
భక్తులనే భ్రమపెట్టిన పాపినైతిని
భక్తినటన చేసిచేసి భక్తుడనే నైతినిరా
భక్తవరద రామచంద్రప్రభో వేగ రక్షించుము










28, సెప్టెంబర్ 2021, మంగళవారం

హరిభక్తు డగుటే యొక యద్భుతమయ్యా

హరిభక్తు డగుటే యొక యద్భుతమయ్యా తుదకు
నరులందరు నగుదు రయ్య హరిభక్తులు

హరియనెడు మాట వినక జరుగును బహుజన్మములు
హరిని సంశయించుచునే జరుగును బహుజన్మములు
హరిని నమ్మినమ్మకయే జరుగును బహుజన్మములు
హరిని నమ్మికొలుచుచునే జరుగును బహుజన్మములు

హరిని విరోధించుచునే జరుగును బహుజన్మములు
హరిని యన్వేషించుచునే జరుగును బహుజన్మములు
హరి కొంత చింతించుచు జరుగును బహుజన్మములు
హరికి పూజచేయుచునే జరుగును బహుజన్మములు

హరేరామ హరేకృష్ణ యనక చాల జన్మలెత్తి
హరిని తెలిసి హరేరామ హరేకృష్ణ యనుచును
హరిమయమని జగమునెఱిగి హరికి భక్తుడగుచును
హరిపదమును చేరు తుదకు నరుడు ముక్తు డగుచును




పరమపురుష నిన్నుగూర్చి ప్రార్ధించకున్నచో

పరమపురుష నిన్నుగూర్చి ప్రార్ధించకున్నచో
నరజన్మము వృథయేకద నారాయణా

హరిభక్తుల సాంగత్యము నాశించని వానికి
హరికీర్తన పాడ పెదవు లాడకుండు వానికి
హరితీర్ధముల నెప్పుడు నడుగిడని వానికి
నరజన్మము వృథయేకద నారాయణా

తిరుగుచును ధనములకై హరినెన్నని వానికి
తరుణులతో కూడిమాడి హరిని మరచు వానికి
పరముమరచి యిహమునకై ప్రాకులాడు వానికి
నరజన్మము వృథయేకద నారాయణా

పరాత్పర నిన్నులోన భావించి మిక్కిలిగ
పరవశించి తరచుగాను భక్తితో నోరార
హరేరామ హరేకృష్ణ యననొల్లని వానికి
నరజన్మము వృథయేకద నారాయణా





27, సెప్టెంబర్ 2021, సోమవారం

గోవింద గోవింద గోవిందా రామగోవింద మాంపాహి గోవిందా

గోవింద గోవింద గోవిందా రామగోవింద మాంపాహి గోవిందా
 
కొఱగాని జన్మలెత్తి గోవిందా నిన్ను మరచి తిరిగితి నయ్య గోవిందా 
మరచి తిరిగితి నయ్య గోవిందా నేను పరమపాపి నైతి గోవిందా
పరమపాపి నైతి గోవిందా నేను పడరాని పాట్లుపడితి గోవిందా 
పడరాని పాట్లుపడితి గోవిందా తుదకు భావించితిని నిన్ను గోవిందా

భావించితిని నిన్ను గోవిందానేను నీవాడ నైతి నయ్య గోవిందా 
నీవాడ నైతి నయ్య గోవిందా నీకు సేవకుడ నైతి నయ్య గోవిందా
సేవకుడ నైతి నయ్య గోవిందా నిన్ను సేవించుకొన నిమ్ము గోవిందా 
సేవించుకొన నిమ్ము గోవిందా కరుణ భావించవయ్య నాపై గోవిందా

భావించవయ్య కరుణ గోవిందా రామభద్రా నీవాడ నయ్య గోవిందా
నీవాడ రామభద్ర గోవిందా లోకపావన తారకనామ గోవిందా
పావన తారకనామ గోవిందా నన్ను వేవేగ రక్షించవె గోవిందా
వేవేగ రక్షించవె గోవిందా సర్వవిధముల నీవాడను గోవిందా
 

పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక

పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక
వట్టి ధనము లడుగు వాడను కాను
 
పడరాని పాట్లు పడి బడసిన నరజన్మ
చెడు కలి బారిని పడకుండ చక్కగ
నడుపు దైవమ వీవు నాతండ్రీ నే
నడుగరాని వడిగి నిన్నాయాస పెట్టను

కోరి నిను హృదయాన కుదురుగ నిలుపుకొని
ఆరాధించెడు నా కన్యవస్తువు లేల
నా రామచంద్రస్వామి నాతండ్రీ నిను
కోరరానివి కోరి కోపింపజేయను

పరమాత్మ నీవు నావాడవైనది చాలు
నిరతము నీపాద నీరేజముల సేవ
కరుణించ వేడుదును కొరగాని చిల్లర
వరము లిమ్మని నిన్ను బాధింపజూడను
 

25, సెప్టెంబర్ 2021, శనివారం

వరముల నిచ్చే హరియుండ పరులను వేడే పనియేమి

వరముల నిచ్చే హరియుండ పరులను వేడే పనియేమి
తిరమై శ్రీహరి కొలువుండ ధరపై మాకు తిరుగేమి

హరిస్మరణమున నాకలి తీరగ నన్నపానముల పనియేమి
హరికీర్తనమున మేను మరువగ మరి మధువులతో పనియేమి
హరిలీలలతో‌ మనసు నిండగ నాటలపాటల పనియేమి
హరియే మాకు సర్వము గాన నన్యులతో నిక పనియేమి

హరితత్త్వమునే భావించగను పరభావనలకు మనసేది
హరిరూపమునే ధ్యానించగను పరులను తలచే పనియేమి
హరిసంకల్పము లాచరించగను 
హరిసేవలతో ప్రొద్దుపుచ్చుటకు నన్యుల యనుమతి పనియేమి

హరితీర్ధమ్ముల సేవించగను పరుల మెప్పుతో పనియేమి
హరిని పరాత్పరు నమ్మిన వారికి నన్యులవలన భయమేమి
హరిపారమ్యము నెఱిగిన వారల కానందము కాకింకేమి
హరేరామ యని హరేకృష్ణ యని యాలపించగ వెఱపేమి



23, సెప్టెంబర్ 2021, గురువారం

చాలదా నీనామము సంసారమును దాట

చాలదా నీనామము సంసారమును దాట
చాలదా యదే నీ సన్నిధికి చేర్చగ

చాలునుగా దుడుకు కామజ్వరమును తొలగించగ
చాలునుగా లోభమాత్సర్యముల త్రుంచగ
చాలునుగా మదమోహసమితి నుక్కడగించ
చాలునుగా క్రోధాగ్నుల శమియింప జేయగ
 
తాపత్రయమును బట్టి తరుముటే చాలదా
పాపసర్పగారుడమై వరలు నది చాలదా
ఆ పంచమలము లింక యణగునది చాలదా
చూపు బ్రహ్మంబుపైన సొక్కునది చాలదా

చాలు గదా శ్రీరామచంద్ర నీనామమే
చాలు గదా మేలుగా సంరక్షజేయగ
చాలు గదా దుర్భరభవచక్రమును త్రుంచగా
చాలు గదా స్వస్వరూపసంస్మరణ మీయగా

18, సెప్టెంబర్ 2021, శనివారం

ఎవరు పొగడితే నేమి యెవరు తిట్టితే నేమి

ఎవరు పొగడితే నేమి యెవరు తిట్టితే నేమి
అవధరించి నీవు మెచ్చే వదిచాలు నాకు

పాడమనెడు వాడ వీవు పాడుటయే నావంతు
పాటను సృష్టింతు వీవు పాడి వినిపింతు నేను
పాట నీది భావము నీది పలుకుగొంతుకే నాది
పాటలోని పదములు నీవి పలుకు భాగ్యమే‌ నాది

తనువు నీవిచ్చిన దాయె దాని గొప్ప నీదేగా
మనసు నీచిచ్చిన దాయె మరి యదియు నీదేగా
వినుము రసన నీవిచ్చినదే వినిపించు పాట నీదే
కనుగొన నీ యుపకరణముగా నుండు భాగ్యము నాది
 
ఎన్ని జన్మంబుల నుండి యిట్లు నడచుచున్నదో
సన్నుతాంగ రామచంద్ర చాలదా యీభాగ్యమే
నిన్ను గూర్చి కలుగు పాట నిక్కమైన మంత్రమని
పన్నుగ లోనెఱిగి నేను పరవశించి పాడగా 

నీ తప్పు లేమున్నవీ శ్రీరామ

నీ తప్పు లేమున్నవీ శ్రీరామ
నా తప్పులే యున్నవి
 
నీపాదసీమలో నిలచియుండెడు నాకు
నాపాట నీముందు నగుచు పాడెడు నాకు
భూపతనమును నిటుల పొందనేలా
ఆపసోపములతో అలమటించగ నేలా

నను నేను మరచి మాయను బొందగా నేల
నిను నేను మరచి నేలను నిలువగా నేల
నను నీవు పిలచినను విన నదేమీ
నినుజేర నిపుడింత పనవుచుందు నయ్యా

తప్పాయె తప్పాయె దయజూప రావయ్య
రప్పించుకొనవయ్య రక్షించి రామయ్య
ఇప్పుడు నినుగూర్చియే‌ పాడేను
చప్పున స్వస్థితి సమకూర్చుమో‌ అయ్య

16, సెప్టెంబర్ 2021, గురువారం

నయమున నన్నేలు నారాయణా


నారాయణా హరి నారాయణా నయమున నన్నేలు నారాయణా

జయజయ రామా నారాయణా హరి జానకిరమణా నారాయణా
ప్రియమృదుభాషణ నారాయణా హరి విమలగుణాశ్రయ నారాయణా
భయశోకాపహ నారాయణా హరి భవవిదారణా నారాయణా
దయాలవాలా నారాయణా హరి దానవమర్దన నారాయణా

గోవింద మాధవ నారాయణా హరి కోదండరామా నారాయణా
భావజజనకా నారాయణా హరి ధీవర రఘువర నారాయణా
పావననామా నారాయణా హరి పట్టాభిరామా నారాయణా
రావణసంహర నారాయణా హరి బ్రహ్మాండాధిప నారాయణా

పీతాంబరధర నారాయణా హరి వీరాగ్రేస‌ర నారాయణా
భూతలనాథా నారాయణా హరి మోహనరూపా నారాయణా
పూతచరిత్రా నారాయణా హరి పుణ్యోపేతా నారాయణా
వాతాత్మజనుత నారాయణా హ‌రి వారిజలోచన నారాయణా


15, సెప్టెంబర్ 2021, బుధవారం

హాయిగ శ్రీహరి నామముచేయుట యందే దృష్టిని నిలుపవయా

హాయిగ శ్రీహరి నామముచేయుట యందే దృష్టిని నిలుపవయా
మాయనుగెలిచే మార్గ మదొకటే మానక నామము చేయవయా

ఘనసాగరమగు సంసారంబును కష్టపడుచు నీదేవయ్యా
మనుజులు దాటగరానిని దీనిని మరినీ వెటు దాటెదవయ్యా
మును పిటులే పదివేలజన్మములు మునుగుచు తేలుచు నీదితివే
కనుగొన నెక్కడి వాడవక్కడే గడబిడ పడుచు నుంటివిగా
 
మాయాకల్పితసంసారాంబుధి మానవుడీదుట దుష్కరమే
ఏయుపాయమున దాటెద నోయని యెందుకు చింతించేవయ్యా
మాయయె మటుమాయమైన నిక మాయాసంసారము లేదే
మాయాగజమును హరినామాంకుశ మర్దనతో మరలించవయా

హరేరామ యని హరేకృష్ణ యని యన్నివేళలను పలుకవయా
పరాత్పరుడు శ్రీ హరికరుణించును పధ్ధతి యిదియే తెలియవయా
హరినామముచే మాయతొలగి నీకాత్మానందము కలుగునయా
నిరతము శ్రీహరినామము పలికే నరునకు మోక్షము తథ్యమయా

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

హరిభక్తులము హరిబంటులము

హరిభక్తులము హరిబంటులము హరియానతిపై తి‌రిగెదము
హరిగానమునే చేసెదము శ్రీహరిలీలలనే‌ పాడెదము

హరిభక్తులతో తిరిగెదము శ్రీహరిక్షేత్రములే తిరిగెదము
హరినామములే పలికెదము శ్రీహరికీర్తనలే పాడెదము
హరిరూపమునే తలచెదము శ్రీహరితత్త్వమునే తలచెదము
హరిచరితమునే యెంచెదము శ్రీహరినే శరణము కోరెదము

హరినే యెప్పుడు నమ్మెదము శ్రీహరినే యెప్పుడు కొలిచెదము
హరికై యెప్పుడు పాడెదము హరికై యెప్పుడు నాడెదము
హరినే తప్పక వేడెదము శ్రీహరినే యొప్పుగ కూడెదము
హరినే యెల్లెడ జూచెదము  శ్రీహరినే శరణము కోరెదము

హరేరామ యని పాడెదము  హరేకృష్ణ యని పాడెదము
హరిగొప్పలనే పాడెదము హరిలీలలనే పాడెదము
హరితో‌కలసి యుండెదము హరిచెంగటనే నిలచెదము
హరికన్యము లేదనియెదము శ్రీహరినే‌ శరణము కోరెదము

11, సెప్టెంబర్ 2021, శనివారం

హరినామములే‌ పలికెదను - అరిషడ్వర్గము నణచెదను

హరినామములే‌ పలికెదను - అరిషడ్వర్గము నణచెదను
హరేరామ యని హరేకృష్ణ యని ఆనందముతో పాడెదను

హరిహరి యంటే కామవికారము లంతరించునని వింటిని
హరిహరి యంటే క్రోధము నాలో సురిగిపోవునని వింటిని
తరచగు కామక్రోధంబులనిక విడచి సుఖముగా నుందును 
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును
 
హరిహరి యంటే లోభమునాలో నణగిపోవునని వింటిని
హరిహరి యంటే మోహమునాలో నదృశ్యమౌనని వింటిని
విరచెద లోభము విరచెద మోహము వేడుకతో నేనుందును
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును

హరిహరి యంటే మదమంతయును విరిగిపోవునని వింటిని
హరిహరి యంటే మత్సరమిక నన్నంటనేరదని వింటిని
సరగున మదమత్సరముల నణచెద నానందముగా నుందును
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును 
 

హరిస్మరణమె బ్రహ్మానందం హరిస్మరణమె పరమానందం

హరిస్మరణమె బ్రహ్మానందం హరిస్మరణమె పరమానందం
హరేరామ యనువానిది కాక ఆనందము మరియెవ్వ
రిది

హరిస్మరణంబున పవలు గడచును హరిస్మరణంబున రాత్రి గడచును
హరిస్మరణంబున దినము గడచును హరిస్మరణమె సుఖము

హరిస్మరణంబున నిన్న గడచెను హరిస్మరణంబున నేడు గడచును
హరిస్మరణంబున రేపు గడచును హరిస్మరణమె సుఖము

హరిస్మరణంబున బాల్యము గడచె హరిస్మరణంబున ప్రాయము గడచె
హరిస్మరణంబున ముదిమియు గడచు హరిస్మరణమె సుఖము

హరిస్మరణంబున ఘడియలు గడచు హరిస్మరణంబున దినములు గడచు
హరిస్మరణంబున యుగములు గడచు హరిస్మరణమె సుఖము

హరిస్మరణంబున గతభవ మఱిగె హరిస్మరణంబున నీభవ మఱుగు
హరిస్మరణంబున భవములు గడచు హరిస్మరణమె సుఖము

హరిస్మరణంబున ఆకలి లేదు హరిస్మరణంబున నిదురయు లేదు
హరిస్మరణంబున భయమును లేదు హరిస్మరణమె సుఖము

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

స్వర్గము నేనడిగితినా అపవర్గమునే యడిగితినా

స్వర్గము నేనడిగితినా అప
వర్గమునే యడిగితినా
 
నీకు తెలియు నది చాలు - ఈ
లోక మెఱుగ పనిలేదు
శ్రీకర యభయము నీయరా
నాకు ప్రసన్నుడవగుము

ఈ కష్టములిక చాలు భూ
లోకము చుట్టుట చాలు
శోకమోహములు లేని నీ
లోకము చేరిన చాలు

నీకరుణకు మితిలేదులే
నాకది యెఱుకే రామ 
నాకోరిక తీరేను లే
నాకిక భవమే లేదు

రామా నీదయ రానీరా

రామా నీదయ రానీ‌రా యిం
కేమియు వలదుర యిదిచాలు

ఒప్పుల కేమియు కుప్పను కానుర
తప్పులు చేసితి తరచుగను
తప్పులు కాల్చగ నిప్పుల వలెను
తిప్పలు పెక్కాయె దేవా నిజము

నిను వీడి పుడమికి నేను వచ్చుట తప్పు
వెనుదిరుగ నది పెదతప్పు
వెనుకకు రమ్మని పిలిచెడు నీమాట
వినక నే చెడితి నేమని చెప్పుదును

భవబంధమ్ముల పాలై యెంతో
వివశుడ నైతిర వేడుదురా
రవికులపతి నీ రక్షణ గోరుదు
చివరిపుట్టువిది చేయవయా


9, సెప్టెంబర్ 2021, గురువారం

సంతోషవర్ధనము చింతితార్ధఫలదము

సంతోషవర్ధనము చింతితార్ధఫలదము
చింతాశోకనాశకము శ్రీరామదర్శనము

శ్రీరాముని దర్శనమున చింతతీరె తాపసికి
కారడవుల నతని యాగకార్యము సంపన్నమాయె

శ్రీరాముని దర్శనమున చింతతీరె రాజర్షికి
భూరిధనువు నెక్కిడగల వీరుడు లభియించెను

శ్రీరాముని దర్శనమున చింతవదలె భరతునకు
శ్రీరఘువరు పాదుకలను శిరసునగొని పొంగెను

శ్రీరాముని దర్శనమున చింతతీరి జటాయువు
చేరె మోక్షపదమునకు సీతాపతి యాజ్ఞబడసి

శ్రీరాముని దర్శనమున చింతతీరె కబంధునకు
ఘోరరూపమణగి హరిని కొనియాడి చనెను

శ్రీరాముని దర్శనమున చింతతీరె శబరికిని
కూరిమి నాతిథ్యమిచ్చి చెందెను కైవల్యమును

శ్రీరాముని దర్శనమున చింతతీరె సామీరికి
పేరుపెట్టి పిలిచి స్వామి విలుచుకొనె తనవానిగ

శ్రీరాముని దర్శనమున చింతగడచె సుగ్రీవుడు
భూరిభుజుని మైత్రిచే పొందె కపిరాజ్యమును

శ్రీరాముని దర్శనమున చింతబాసె విభీషణుడు
కారుణ్యమూర్తి వలన కలిగె లంకారాజ్యమును

శ్రీరాముని దర్శనమున చింతతీరె పౌరులకు
కూరిమితో ప్రభువేలును కువలయమని పొంగిరి

శ్రీరాముని దర్శనమును చేయువారు పుణ్యాత్ములు
వారి చింతలెల్ల దీరు వారి కబ్బు భాగ్యగరిమ

శ్రీరాముని దర్శనమును చిత్త మందునిలుపుకొను
వారికన్న ఘనులుండరు వారికబ్బు కైవల్యము


రామ రామ యట్టిబ్రతుకు మేము కోరము కోరము

రామ రామ యట్టిబ్రతుకు మేము కోరము కోరము
 
ఏమి చేసిన నేమిలాభము రామకార్యము చేయక
ఏమి చదివిన నేమిలాభము రామచరితము చదువక
ఏమి పాడిన నేమిలాభము రామకీర్తిని పాడక
ఏమి యాడిన నేమిలాభము రామునకునై యాడక
 
ఏమి యెఱిగిన నేమిలాభము రామతత్త్వము నెఱుగక
 ఏమి నేర్చిన నేమిలాభము రామసేవన నేర్వక
ఏమి చూచిన నేమిలాభము రామమూర్తిని చూడక
ఏమి యబ్బిన నేమిలాభము రామదాస్యం బబ్బక
 
ఏమి పూజల నేమిలాభము రాముని పూజించక
ఏమి జపమున నేమిలాభము రామజపమును చేయక
ఏమి తపమున నేమిలాభము రామునకునై చేయక
ఏమి బ్రతుకిం కేమిలాభము రామభక్తికి నోచక

హరి హరి హరి యనవే

హరి హరి హరి యనవే
మరువక ఓమనసా

ఊరకనే నిత్యము నీ వూరెల్ల తిరుగచు
ధారాళముగ పలుకు దబ్బరల ఫలమేమే
నారకవాసంబును నానాబాధలు గాక
నారాయణ నామమే నోరారా పలుకవే

వెంటరాని ధనములకు వెఱ్ఱిమోహంబుతో
తుంటరివై చేసినట్టి దుడుకులకు ఫలమేమే
మంటలలో యముడు నిను మాడ్చుటయే  గాక
కుంటిసాకులు చాలు గోవిందా యనవే

నారాయణ భక్తులకు నరకభయ ముండదే
తారకనామము జేసి తరియించరాదటే
శ్రీరామ యనువాడు చెందునే మోక్షమే
మారుమాటలాడక శ్రీరామా యనవే

8, సెప్టెంబర్ 2021, బుధవారం

నిన్నే నమ్ముకొంటిమి నీరజాక్షా

నిన్నే నమ్ముకొంటిమి నీరజాక్షా ఆ
పన్నశరణ్యా కాపాడవయ్యా

అరుగురు శత్రువులు మాయందరి లోన
చేరి బాధించుచున్నారు చూడవే
వారిని గెలువగ మావశము గాదయ
శ్రీరామచంద్ర రక్షించవలయును

మూడుతాపంబులతో పొగులుచుంటిమి
నేడు నీవే గనుమా వేడిమి రామ
పోడిమి యెక్కడిది తాపములకోర్వగా
ఱేడా యవి చల్లార్చు వాడవనుచును

శరణు శరణు త్రైలోక్యసార్వభౌమ
శరణు శరణు రాఘవ జానకి రామ
శరణు శరణు సద్భక్తజనసంపోష
శరణు శరణు శ్రీరామ సర్వరక్షక

6, సెప్టెంబర్ 2021, సోమవారం

అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము

అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము
సందియము లేదు నీవు జగదేకసుందరుడవు

పుత్తడిని వెన్నెలతోడ పుటము వేసి నిన్ను చేసె
నత్తగారు భూదేవియని యనిపించును నాకు
నెత్తావులన్నియు గూడ నేర్పుమీర రంగరించి
మత్తకాశిని నిన్ను మాయత్తగారు చేసిరేమో

బావగారి మేని నీలివర్ణ మప్పు గొనిన శశివో
జైవాతృకుని చలువ భావించు హరివో
నీవనుచు నిర్ణయింప నేరరయ్య భూమిజనులు
నీవా శ్రీహరివే నని నేను నిర్ణయించితిని

సీతా వెన్నెలవే నీవు శీతాంశుడను నేనే
నీ తలపు బాగున్నది నేనొక మాటందును
సీతారాములంటే లక్ష్మీనారాయణు లందును
మాతండ్రి యట్లే పలికె మనపెండ్లి చేయునాడు


రామా నిన్నే నమ్మి

రామా నిన్నే నమ్మి రక్షించ మంటిని
స్వామీ సర్వాత్మనా శరణము జొచ్చితి

నానాయోనుల బుట్టి నానాబాధల నొంది
యినాటికి స్వామి నేను నరుడ నైతి
దీని పిమ్మట పొందగానైన జన్మల
నేను నరుడనొ చీమనో నక్కనో పులినో

రామా నిన్నుదలచ రాబోవు భవమున
నేమైన తెలివడి యెసగునో తెలియదే
స్వామీ నీస్పృహలేని జన్మ మెందులకయ్య
నామొర లాలించి నన్ను రక్షించరా

శక్తికొలది నామజపము చేయుట కన్న
యుక్తి నెఱుగను నాదు భక్తిని గమనించి
ముక్తినొసగ వయ్య పుట్టువు లికవద్దు
భక్తవరద రామ భవబంధమోచన



4, సెప్టెంబర్ 2021, శనివారం

అతను డని యొక డున్నా డంబుజాక్షా అతడు నీ కొడుకే నట యంబుజాక్షా

అతను డని యొక డున్నా డంబుజాక్షా
అతడు నీ కొడుకే నట యంబుజాక్షా

అతడు చాల చతురు డట యంబుజాక్షా
అతని బారి బడితిమా యంబుజాక్షా
అతలాకుతలము బతు కంబుజాక్షా
అత డంతటి వాడు సుమా యంబుజాక్షా

హరుని మీది కతడు బోయి యంబుజాక్షా
యతని కంటిమంటచే నంబుజాక్షా
నతనుడాయె కక్షగట్టి యంబుజాక్షా
అతివ మోహినికి గట్టె నంబుజాక్షా

హరుడు నీదు రామనామ మంబుజాక్షా
యరిది జపము చేయదొడగి యంబుజాక్షా
స్మరుని గెలిచె నంబుజాక్ష నరులందరకు
హరుడే యాదర్శమాయె నంబుజాక్షా


మునిమానసమోహనుని కనులజూడరే

మునిమానసమోహనుని కనులజూడరే
మనసిజమోహనుని నేడు కనులజూడరే

కనులాజూడరే కమలాయతాక్షుని
జననాథుని మన జనకజాపతిని
దనుజసంహారిని మునిమఖరక్షకుని
వినయసంపన్నుని వీరరాఘవుని
 
కనులజూడరే ఘననీలదేహుని
వినుతసుశీలుని వేదవేద్యుని
వినతాసుతవాహుని కెనయైన వానిని
తనివారజూడరే ధర్మరక్షకుని

హరిని జూడరే సురుచిరాకారుని
వరభక్తరక్షకుని పరంధాముని
పరమయోగీంద్రహృపద్మంబు లందుడు
పరమపురుషుని వీని పరమాత్ముని 






 

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

నోరార శ్రీరామ యనరా

నోరార శ్రీరామ యనరా
నీరాత మారేను కనరా

శ్రీరామ యనగానే చిక్కులన్నీ పోవు
శ్రీరామ యనగానే చింతలన్నీ తీరు
శ్రీరామనామము చేయగనే నీ
తీరే మారిపోవు దివ్యముగ చూడు

శ్రీరామ యనగానే క్షీణించు పాపాలు
శ్రీరామ యనగానే చేకూరు పుణ్యము
శ్రీరామనామము చేయగనే సం
సారతాపత్రయము శాంతించును చూడు
 
శ్రీరామ యనగానే చిత్తశాంతి కలుగు
శ్రీరామ యనగానే చెడును భవబంధాలు
శ్రీరామనామము చేయగనే నీ
కోరిన మోక్షము కొంగుబంగరు చూడు


2, సెప్టెంబర్ 2021, గురువారం

నీవే రక్షించవలయును శ్రీరామచంద్ర

నీవే రక్షించవలయును శ్రీరామచంద్ర
భావించ నీవే నావాడవగుట నిక

లోకుల నమ్మి వారు లోభమోహముల చేత 
నాకు ద్రోహముచేయ నాకారణంబున
శోకావేశముల బొంది చొక్కుచున్నది చాలు
నీకు శరణమంటి‌ర నీరేజనయన

శ్రీకర నిన్ము నమ్మి చెడినవారేలేరయ
ఆకరిరాజు నేమి అతివ ద్రోవది నేమి
ఆకపిరాజు నేమి ఆవిభీషణు నేమి
చేకొని బ్రోచినట్టి నీకు శరణంటిర

పాకారిప్రముఖనుత భండనపండిత
లోకైకవీర ఈలోకమునం దీవే
నాకున్న చుట్టమవు నాకున్న మిత్రుడవు
నాకున్న దైవమవు నీవే శరణంటిర


గొప్పగ నీముందర శ్రీరామ చెప్పుట కేమున్నది

గొప్పగ నీముందర శ్రీరామ చెప్పుట కేమున్నది
ఒప్పనగ నొకటున్నదా నాచరిత తప్పుల మయమైనది

ధరమీద బ్రతుకుటకు శ్రీరామ ధనములె ముఖ్యమని
ధర నందరి రీతిగా నాతండ్రి తహతహ లాడితిని
హరి నిన్ను సేవించుట శ్రీరామ మరచి దుష్టుడనైతిని
పొరపాటు చేసితిని నాతండ్రి పొగులుచు నిలచితిని

కల్లలాడుట యందున శ్రీరామ కడునేర్పు లేకున్నను
కల్లలాడక దినమును నాతండ్రి గడుపంగ లేనైతిని
కల్లలాడెడు వారికి శ్రీరామ కష్టంబులే వచ్చుగా
కొల్లలై నాచిక్కులు నాతండ్రి ఘూర్ణిల్లుచు నుంటిని
 
జపమేది తపమేదిరా శ్రీరామ సంస్కార మసలేదిరా
కుపథంబు లందుండితి నాతండ్రి కపటంపు బ్రతుకాయెను 
విపరీతచారిత్రుడ శ్రీరామ ఇపుడు నే బుధ్ధెఱిగితి 
కృపజూడవయ్య శరణు నాతండ్రి కేవలము నీవె దిక్కు


1, సెప్టెంబర్ 2021, బుధవారం

ఏమైపోయారు మేధావులు


ఈరోజున మనస్విని బ్లాగులో నపుంసక నాయాళ్లు  అన్న ఘౌషుద్దీన్ షేక్ గా కవితను చూసాక స్పందించాలని అనిపించింది. ఆయన ఆ కవితలో వర్తమాన సామాజిక పరిస్థితుల పట్ల సూటిగా తమ ఆవేదనను వెలిబుచ్చుతూ ఏమైపోయారు మేధావులు అని ప్రశ్నించారు.

మేధావులు ఏమైపోయారు అన్న అనుమానం అక్కరలేదండీ మనకు. మేధావులు సురక్షితంగానే ఉన్నారు. 

కొందరు మేధావులు తమతమ మేధస్సులకు పనిచెప్పుతూ‌ చుట్టూ ఉన్న సమాజాన్ని దాని మంచిచెడ్డలను గమనించేందుకు ఏమాత్రమూ తీరిక లేకుండా ఉంటారు. సాధారణంగా వాళ్ళు అనునిత్యమూ సిధ్దాంతాల గురించి పనిచేస్తూ ఉంటారు. సిధ్దాంతాలను విశ్లేషిస్తూ కొత్తకొత్త సిధ్ధాంతాలను తయారుచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఈ నిర్మాణకార్యక్రమంలో ముడిసరుకు అంతవరకు ఉన్న సిధ్ధాంతాలు కాగా వారి ఉత్పత్తి కొత్తకొత్త సిధ్ధాంతాలు. చిన్నచిన్న సిధ్ధాంతాల మీద వీళ్ళు అహరహం పనిచేస్తూ కొత్తసిధ్ధాంతాలను గుర్తించే పరిశ్రమలో భాగంగా వెలువరించే విశ్లేషణలూ వ్యాఖ్యానాలూ అసలు సిధ్ధాంతాల కంటే వేల రెట్టు జటిలంగానూ చిత్రంగానూ‌ ఉంటాయి తరచుగా.  ఈతరహా మేధావుల లోకంలో సిధ్ధాంతాలూ వాటిమీద వ్యాఖ్యానాలూ ఈసామాగ్రిని అందిచిన మహానుభావులూ తప్ప మరేమీ ఉండదు. సామాన్యప్రజలూ వారిలోకవ్యవహారాలూ కష్టనషష్టాలూ అన్నీ కూడ వీరి ప్రపంచంలో ఆటలో పావుల స్థాయిలో‌ ఉంటాయి. ఒక తమాషా ఏమిటంటే యవజ్జీవం ఇలా సిధ్ధాంతాల వెనుకబడి పరిశోధిస్తూ కూడా ఈమేధావుల్లో ముప్పాతికమువ్వీసం మంది కొత్తగా కనిపెట్టి చచ్చేది ఏమీ ఉండదు.

మరి కొందరు బుధ్ధిమంతులు సిధ్ధాంతాలు చదువుకుంటూ వాటిని ప్రపంచానికి ఒప్పచెప్తూ బ్రతుకుతూ ఉంటారు. వారి దృష్టిలో అదే మానవజీవితపరమార్ధం. వీరి చిలుకపలుకులు వింటూ జనం వీరిని అసలుసిసలు మేథావులు అని నిత్యం భ్రమపడుతూ ఉంటారు. కాని వీళ్ళు వట్టి చిలుకలే.

మనకు తరచుగా మరొకరకం మనుషులు తగులుతూ ఉంటారు. వాళ్ళు మేధావుల నోట లేదా తాము మేధావులని అనుకుంటున్న చిలుకల నోట విన్న చదివిన ముక్కలు ప్రమాణవాక్యాలన్న భ్రమతో వాటి ముక్కున పెట్టుకొని వీలైన చోటల్లా వాటిని ఉటంకిస్తూ అమాయక జనం మధ్యలో తామూ‌మేధావులమే అని అనిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎత్తిపోతలవీరుల వలన వాతావరణ కాలుష్యం మినహా మరేమీ ఉండరు.

అమాయక జనం ఈ మేధావుల్నీ చిలుకలనూ ఎత్తిపోతలవీరుల్నీ విడివిడిగా గుర్తించలేక వీళ్ళంతా మేధావులూ అని నమ్మేస్తూ ఉంటారు. 

మొదట చెప్పుకున్న సిసలైన సిధ్ధాంతం గాళ్ళు మానవ ప్రపంచంలో కాక సిధ్ధాంతప్రపంచంలో మాత్రమే‌ బ్రతుకుతున్నారు కదా. వాళ్ళకు తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలియదు. 

చిలుకపలుకుల బుధ్ధిమంతులకు చుట్టు ఉన్న ప్రపంచం తెలుసును. మరి వాళ్ళముందే కదా తమ పాండిత్యప్రతాపాలు చూపుకొనేది వీళ్ళు. ఐతే వాళ్ళు తెలివితక్కువ పనులు చేస్తారా? సమయానికి తగు మాటలు మాట్లాడతారు. ఏపరిస్థితుల్లో ఏసిధ్ధాంతాలు వల్లించాలో అన్వయం చేయాలో వీరికి కొట్టినపిండి. తమ పేరు ప్రఖ్యాతులను వివాదాలద్వారా ధ్వంసం చేసుకోవాలని వీళ్ళు ఎన్నడూ అనుకోరు. వారు ఏవిషయంలో ఐనా సానుకూలంగా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా తమకు అలా మాట్లాడటం పేరుప్రఖ్యాతులు రావటమో ఇనుమడించటమే‌ జరిగే పక్షంగా ఉంటేనే అలా చేస్తారు. ఒక్కోసారి కొందరు తాత్కాలికంగా తమ విశ్లేషణలూ వగైరా ద్వారా ఇబ్బందులు ఎదురుకున్నా వాళ్ళకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలుగుతుందన్న అవగాహన ఉండే ఉంటుంది - లేకపోతే అలా మాట్లాడరు.

ఇక ఎత్తిపోతల రాయుళ్ళు ఏమి ఎక్కడ ఎత్తిపోసినా అదేదో చుట్టు ఉన్న వాళ్లలో కొంచెం ఉన్నతంగా అవగాహన ఉన్నవారిలా కనిపించటం కోసం అలా చేస్తారు కాని అప్పుడప్పుడు బోల్తాపడుతూ చీవాట్లు తింటూ‌ ఉంటారు. వీళ్ళు మనసమాజంలో మహా చురుగ్గా ఉంటారు. వీళ్ళలో మనం పత్రికల్లో వ్యాసాలు వ్రాసే ప్రముఖుల నుండి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వారి వరకు అన్ని రకాల మనుషుల్నీ చూడవచ్చును.
 
సిధ్ధాంతలోకాల్లో బ్రతికేవాళ్ళకి ఏమీ‌ పట్టదు. సరే, చిలుకపలుకుల వాళ్ళు కాని ఎత్తిపోతల వాళ్ళు కాని కోరి ఇబ్బందులు తెచ్చుకోరు కదా జనంలో ఉన్నామని చెప్పి. అవసరానికి తగ్గ తాళం వేస్తూ బ్రతుకుతూ ఉంటారు.  

నిజమే నేటి భారతంలో కేంద్రంలో ఐనా ఏదైనా రాష్ట్రంలో ఐనా సరే అసహనంతో వ్యవహరించటం చూస్తున్నాం అధికారపక్షాలను. అలాగే అవకాశవాదంలో అధికారంలో లేని పక్షాలూ తామూ ఏమీ‌ తీసిపోలేదన్నట్లే మాట్లాడుతున్నాయి. వ్యతిరేకగళం పైన పాదం మోపి వ్యవహరించే రాజకీయాలను చూస్తూ మేధావులు జాగ్రతతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు మేధస్సును ప్రదర్శించుకోవటం ముఖ్యం కాని ఆత్మహానికి సిధ్ధమై నిజాలను మాట్లాడటం కాదు కదా.

ఈ పై మూడు రకాల మేధావులూ సరైన వాళ్ళు కాదన్నట్లు అంటున్నాను కదా, ఇక పనుకొచ్చే‌ మేధావులే ఉండరా అంటే తప్పకుండా ఉంటారు. వాళ్ళు సమాజం కోసం తమకృషిని తాము చేస్తూనే ఉంటారు. కాని సమాజంలో కుహనామేధావుల్లా నోరుపెట్టుకొని బ్రతకటం వాళ్ళ విధానంగా ఉండదు. వాళ్ళు కార్యరంగంలో ఉంటారు. చేతల మనుషులే‌ కాని వాళ్ళు మాటల మనుష్యులు కారు. ఐతే సమాజానికి నిత్య జీవనంలో వినోదం తప్ప విజ్ఞానం అంత ముఖ్యంగా కనిపించదు. కాబట్టి నిజంగా ప్రయోజనకరమైన కార్యరంగంలో ఉండే మేధావులను గుడ్డి సమాజం గుర్తించలేదు. కాని అమాయకంగా కుహనామేధావులను మాత్రం ఏదో గొప్పవాళ్ళనుకొని వాళ్ళకు లేని విలువలను ఆపాదించి చెడుతూ ఉంటుంది.

అదీ సంగతి.